విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి?
https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్.

ఆత్మీయ సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం.

విశ్వాసులతో స్నేహం అంటే, మువహ్హిదీన్‌లను అనగా ఏక దైవారాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తౌబా, ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు.

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)

ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا
(అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా)
ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)

అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.

مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وَتَرَاحُمِهِمْ وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى

(మసలుల్ ముఅమినీన ఫీ తవాద్దిహిమ్ వ తరాహుమిహిమ్ వ త’ఆతుఫిహిమ్ మసలుల్ జసద్, ఇజష్ తకా మిన్హు ఉద్వున్ తదాఆ లహూ సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా)

పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)

ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43226


అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట [వీడియో| టెక్స్ట్]

అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట
https://www.youtube.com/watch?v=FkFraSDe3uM
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో నిషిద్ధమైన రెండవ ప్రధాన విషయం గురించి వివరించబడింది. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని హరామ్ (నిషిద్ధం)గా లేదా హరామ్ చేసిన దానిని హలాల్‌గా మార్చడం ఎంత పెద్ద పాపమో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. యూదులు మరియు క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకోవడం అంటే, వారు హలాల్-హరామ్ నిర్ణయాలలో వారిని గుడ్డిగా అనుసరించడమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ఇతరులకు ఈ హక్కును ఆపాదించడం లేదా అనుసరించడం అవిశ్వాసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముస్లింలు తమ జీవితంలోని అన్ని విషయాలలో, ముఖ్యంగా వివాదాల పరిష్కారంలో, ఖురాన్ మరియు సున్నత్‌లను మాత్రమే అనుసరించాలని, మానవ నిర్మిత చట్టాలను ఆశ్రయించకూడదని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

నిషిద్ధ విషయాలలో మొదటి విషయం షిర్క్ అని, దానిలో కొన్ని రకాలు చదివాము. అయితే ఈ రోజు మూడవ పాఠంలో, నిషిద్ధ విషయాలలో రెండవది అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట. శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఒక వస్తువును హరామ్ చేశాడు, దానిని హలాల్ చేయుట. లేదా అల్లాహ్ ఒక వస్తువును హలాల్ చేశాడు, దానిని హరామ్ చేయుట.

అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట. గమనిస్తున్నారా? స్వయంగా మనిషి, ఒక మనిషి అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరామ్ చేస్తున్నాడు. లేదా అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేస్తున్నాడు. మూడో మాట దీంట్లో ఏమిటి? అల్లాహ్ తప్ప ఈ హలాల్, హరామ్ చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని నమ్మటం. ఒక వ్యక్తి స్వయంగా హలాల్‌ను హరామ్ చేయట్లేదు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే అతన్ని సహీగా, కరెక్ట్‌గా నమ్ముతున్నాడు. అలా చేయడం అతనికి తగును, అతనికి ఆ హక్కు ఉంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇక ఇలా ఈ నమ్మడం అనేది కూడా అవిశ్వాసంలో వస్తుంది. అల్లాహు త’ఆలా నిషేధించాడు. అంతేకాదు, ఇంకా శ్రద్ధ వహించండి.

సమస్యల తీర్పు కొరకు అల్లాహ్ పంపిన ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ముస్లింలలో పరస్పరం ఏదైతే గొడవలు, ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవల విషయాలలో ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం పంచాయతీ, ముస్లిం వారి యొక్క వారి జమాతుల్లో ఉన్నటువంటి ధర్మవేత్తల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారి యొక్క అధ్వర్యంలో తమ గొడవలకు మంచి పరిష్కారం ఖురాన్, హదీసుల ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ జరిగింది, వెంటనే లంచాలు ఇచ్చి తమ ఎదుటి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి కోర్టుల యొక్క మెట్లు ఎక్కుతారు. అయితే ఇలా చేయడం అంతా కూడా సమంజసం, మంచి విషయమే అని భావించడం, ఎక్కడైతే ఖురాన్, హదీస్ ప్రకారంగా తీర్పులు జరగవో అలాంటి చోట వెళ్ళడం, అలాంటి చోట వారితో తీర్పులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన విషయం! ఇంకా శ్రద్ధగా వినండి. మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట లేదా అది యోగ్యమైనదని సంతోషంగా నమ్ముట, ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలో పడవేస్తుందో ఖురాన్‌లోని ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి. మరియు ఈ ఆయతు సూరతు తౌబా, సూర నెంబర్ తొమ్మిది, ఆయతు నెంబర్ 31. శ్రద్ధగా వినండి.

అల్లాహ్ తెలుపుతున్నాడు:

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ
(ఇత్తఖజూ అహ్బారహుమ్ వ రుహ్బానహుమ్ అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్)
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితులను, తమ సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. (9:31)

వారు అంటే, యూదులు, క్రైస్తవులు. అల్లాహ్‌ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. యూదులు, క్రైస్తవులు అల్లాహ్‌ను వదిలి ఎవరిని? తమ యొక్క పండితులను, తమ యొక్క సన్యాసులను ఏం చేశారు? ప్రభువులుగా చేసుకున్నారు. أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) రబ్ ఏకవచనం, అర్బాబ్ ఇది బహువచనం. ఇక మనం చూస్తూ ఉంటాము, చర్చిలో ఉండేటువంటి పాస్టర్లు, వారినైతే ప్రభువుగా నమ్మరు కదా? లేక వారి యొక్క పెద్ద పండితులను సామాన్య క్రైస్తవులు ప్రభువుగా నమ్మరు కదా అని ఈ రోజుల్లో కూడా ఎంతో మంది అనుకుంటారు, కదా? రండి, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకింలోని హదీస్ ద్వారా దీని యొక్క వివరణ వినండి.

ఈ ఆయతు, సూరత్ తౌబా ఆయతు నెంబర్ 31, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు విని, “ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా?” సామాన్య యూదులు మరియు క్రైస్తవులు వారి యొక్క పండితులను, వారి యొక్క సన్యాసులను, పాస్టర్లను పూజించరు కదా? ఆరాధించరు కదా? మరి ప్రభువుగా చేసుకున్నారని ఆయతులో చెప్పబడింది? అతని యొక్క ప్రశ్న విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “అవును, నువ్వు అంటున్నావు ఆరాధించేవారు కాదు. అవును, ఆరాధించేవారు కాదు. కానీ అల్లాహ్ హరామ్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్‌గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హరామ్ చేస్తే వారు దానిని హరామ్‌గానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు. అందుకని వారు తమ సన్యాసులను, పండితులను ప్రభువులుగా చేసుకున్నారు” అన్నటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహీహ్ హదీస్. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు కూడా గాయతుల్ మరాంలో సహీహ్ అని తెలిపారు. అయితే అర్థమైంది కదా సోదర మహాశయులారా?

అంతేకాదు. మరొక ఆయత్ సూరత్ తౌబాలోనే ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. అంతకంటే ముందు, అల్లాహ్ నిషేధించిన వాటిని నిషిద్ధంగా నమ్మని వారు, నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మని వారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు. కానీ ఈ పని ఒక ముస్లింగా తమకు తాము అనుకునే వాళ్ళు, తమ పేర్లు ముస్లింలుగా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మరి వారి గతి ఏమవుతుంది? అల్లాహు అక్బర్. చూడండి, సూరత్ తౌబా ఆయత్ నెంబర్ 29.

وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ
(వ లా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వ లా యదీనూన దీనల్ హఖ్)
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు, మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. (9:29)

యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, వీరందరూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ పని చేశాడంటే చాలా, చాలా నష్టంలో పడిపోతాడు. ఎలాంటి నష్టం? అల్లాహ్ పై చాలా పెద్ద అభాండం మోపినట్లు. చూడండి, సూర యూనుస్‌లోని ఆయతు నెంబర్ 59, అల్లాహు త’ఆలా తెలుపుతున్నాడు.

قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఏమిటి? మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరామ్‌గానూ, మరి కొన్నింటిని హలాల్‌గానూ నిర్ధారించుకున్నారు.” వారినిలా అడుగు: “ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేక మీరు అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” (10:59)

ఈ ఆయతు ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహు త’ఆలా ప్రజల్లో ఎవరికీ కూడా ఏదైనా వస్తువును హలాల్ చేసే, ఏదైనా వస్తువును హరామ్ చేసే అటువంటి హక్కు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ఇవ్వలేదు. ఇది కేవలం అల్లాహ్ యొక్క హక్కు మాత్రమే. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మొదటి పాఠంలో, మొదటి క్లాస్‌లో విన్నాము మనం. మీలో ఎవరికైనా గుర్తు లేకుంటే ఒకసారి ఆ పాఠాన్ని తర్వాత మీరు చూడండి, వినండి. అయితే అల్లాహ్ అయితే ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఈ హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అతడు దౌర్జన్యపరుడు అవుతున్నాడు, అంతేకాదు అల్లాహ్ పై అబద్ధాలు మోపేవాడు అవుతున్నాడు.

అర్థమైంది కదా? ఎంత ఘోరమైన పాపం? అందుకొరకే ఈ రోజుల్లో కూడా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వస్తువులను ఇది హలాల్ అని, ఇది హరామ్ అని లేదా వారి యొక్క పెద్దలు, గురువులు, “అరే హమారే బాబా బోలే జీ,” “మా పీర్ సాబ్ చెప్పారు,” “మేము ఫలానా ముర్షిదులను నమ్ముతున్నాము, ఆయన చెప్పినట్లే మేము వింటాము” ఇక వారు హరామ్ చేసిందే హరామ్, వారు హలాల్ అని చెప్పిందే హలాల్. ఈ విధంగా మనం అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్తున్నామంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుందా? మనమే మంచిగా ఆలోచించాలి.

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]