ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో, టెక్స్ట్]

ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/watch?v=ofVrllbBImA [41నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఆద్ జాతి మరియు ప్రవక్త హూద్ అలైహిస్సలాంల చరిత్రను వివరిస్తుంది. అల్లాహ్ ఆద్ జాతి వారికి అపారమైన శారీరక శక్తిని, సంపదను మరియు విజ్ఞానాన్ని ప్రసాదించాడు, కానీ వారు గర్వంతో విగ్రహారాధనలో మునిగిపోయారు. హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానించినప్పుడు వారు ఆయన్ని అపహాస్యం చేశారు. ఫలితంగా, అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలిని శిక్షగా పంపి వారిని నాశనం చేశాడు. ఈ కథ ద్వారా గర్వం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో మరియు అల్లాహ్ పై నమ్మకం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. అలాగే షద్దాద్ రాజు నిర్మించిన ఇరం నగరం గురించిన కథనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.

ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్. అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ

ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? (69:6-8)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక, ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్.

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక జాతి గురించి తెలుసుకుందాం. వారికంటే గొప్ప శక్తిమంతులు అసలు పట్టణాలలోనే ఎవరూ సృష్టించబడలేదు అని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాంటి శక్తివంతమైన జాతి. వారు తలుచుకుంటే పెద్ద పెద్ద పర్వతాలను సైతం చిన్న రాయిలాగా తొలిచేసి నిర్మించుకుంటారు భవనాలు మాదిరిగా మార్చేస్తారు. అలాంటి జాతి. మరి అలాంటి జాతి ఎవరిని ఆరాధించింది? అలాంటి జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విధంగా రుజుమార్గం వైపు తీసుకురావడానికి ప్రవక్తను ఎవరిని పంపించాడు? ఆ ప్రవక్త ఆ జాతి వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపిస్తే మరి అంత పెద్ద శక్తివంతమైన ఆ జాతి వారు ఆ ప్రవక్త మాటలను విశ్వసించారా లేదా తిరస్కరించారా? అసలు ఆ జాతి ఎవరు? ఎక్కడ ఆ జాతి ఉనికి ఉండింది భూమండలం మీద? పర్వతాలనే చెక్కేసి భవనాలు లాగా మార్చేసిన ఆ జాతి ప్రజల భవనాల ఆనవాళ్లు ఏమైనా ఈరోజు భూమండలం మీద మిగిలి ఉన్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఈనాటి ప్రసంగంలో మనం తెలుసుకుందాం.

అరబ్బు భూమండలంలోని అరబ్బు ప్రదేశంలో దక్షిణ భాగం వైపు సౌదీ అరేబియాకి దక్షిణాన ఒక దేశం ఉంది దాని పేరు యెమన్ దేశం. ఆ యెమన్ దేశంలోని సనా మరియు హజ్రమౌత్ ఈ రెండు నగరాల మధ్యలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశాన్ని ‘అహ్ కాఫ్’ అంటారు. ఆ అహ్ కాఫ్ అనే ప్రదేశంలో ఒక జాతి వారు నివసించే వారు, ఆ అరబ్బు జాతి వారిని ఆద్ జాతి అని పిలిచేవారు మరియు ఆదె ఊలా, ఆదె ఇరమ్ అని కూడా ఆ జాతి వారిని పిలిచేవారు.

ఆ జాతి ప్రజలు ఎలాంటి వ్యక్తులంటే ధార్మిక పండితులు వారి గురించి తెలియజేసిన విషయం, వారిలోని ప్రతి ఒక్క మనిషి 12 మూరల ఎత్తు కలిగినవాడు, శారీరకంగా చాలా దృఢమైన వారు శక్తిమంతులు. వారి గురించి ధార్మిక పండితులు తెలియజేయడం పక్కన పెడితే స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఏమన్నాడంటే:

الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
(అల్లతీ లమ్ యుఖ్ లఖ్ మిస్ లుహా ఫిల్ బిలాద్)
అటువంటి శక్తి గలవారు పట్టణాలలో సృష్టించబడలేదు.” (89:8)

స్వయంగా అల్లాహ్ అలాంటి ప్రజలు అసలు పట్టణాలలోనే సృష్టించబడలేదు అంటే వారు ఎంత గొప్ప శక్తివంతులై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వారి శక్తి సామర్థ్యాల మీద వారికే గర్వం ఉండేది వారు ఏమనేవారంటే:

مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً
(మన్ అషద్దు మిన్నా ఖువ్వహ్)
బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడు ఎవడైనా ఉన్నాడా?” (41:15) అని వాళ్ళు ఛాలెంజ్ విసిరేవారు.

అలాంటి జాతి వారు, అయితే విషయం ఏమిటంటే అల్లాహ్ వారిని అంత శక్తిమంతులుగా అంత దృఢమైన శరీరం గలవారిలాగా పుట్టించినప్పటికీ సైతాన్ వలలో చిక్కుకొని నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత ఈ భూమండలం మీద ఈ ఆద్ జాతి వారు విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన ప్రారంభించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన సంప్రదాయం ప్రకారం వారిని మళ్ళీ సంస్కరించడానికి, మార్గభ్రష్టత్వానికి గురైన ఆ జాతి ప్రజలను మళ్ళీ రుజుమార్గం వైపు తీసుకురావడానికి వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన పేరే హూద్ అలైహిస్సలాం.

హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా ఎన్నుకొని దైవవాక్యాలు వారి వద్దకు పంపించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ దైవవాక్యాలు తీసుకొని ప్రజల ముందర వెళ్లారు. ప్రజల ముందర వెళ్లి ప్రజలను విగ్రహారాధన నుండి తప్పించి ఏకదైవ ఆరాధన వైపు పిలుపునిచ్చినప్పుడు, తౌహీద్ వైపు పిలుపునిచ్చినప్పుడు ఇతర జాతి ప్రజల మాదిరిగానే హూద్ అలైహిస్సలాం వారి జాతి ఆద్ జాతి ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించారు. ఏమని విమర్శించారు అసలు హూద్ అలైహిస్సలాం ఏమని పిలుపునిచ్చారు అవి కూడా మనకు ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్నాయి అది కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని ఏడవ అధ్యాయం 65వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
(వ ఇలా ఆదిన్ అఖాహుమ్ హూదాన్ కాల యా ఖౌమిఅబుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు)
మేము ‘ఆద్‌’ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. ఆయన (వారితో) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరి మీరు భయపడరా?” (7:65)

అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి ప్రజల వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపించారు. చూడండి ప్రతి ప్రవక్త జాతి ప్రజల వద్దకు వెళ్లి అందరికంటే ముందు ఏ విషయం వైపు పిలుపునిస్తున్నాడు అంటే అల్లాహ్ ఆరాధన వైపుకు రండి ఆయనే అన్ని రకాల ఆరాధనలకు ఏకైక అర్హుడు అన్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే ప్రతి ప్రవక్త ఎప్పుడైతే జాతి ప్రజలు బహుదైవారాధనకు గురయ్యారో వారిని ముందుగా ఏకదైవ ఆరాధన వైపుకి తౌహీద్ వైపుకి పిలుపునిచ్చాడు అన్న విషయం స్పష్టమవుతుంది.

హూద్ అలైహిస్సలాం తౌహీద్ వైపు ప్రజలకు పిలుపునిస్తే ఆ జాతి ప్రజలు ఏమని విమర్శించారంటే చూడండి వారేమన్నారంటే:

إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
(ఇన్నా లనరాక ఫీ సఫాహతిన్ వ ఇన్నా లనజున్నుక మినల్ కాజిబీన్)
“నీవు మాకు తెలివితక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నీవు అబద్ధాలకోరువని మా అభిప్రాయం” (7:66) అన్నారు.

నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నీకు మతి భ్రమించింది అనే రీతిలో జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల వద్దకు వెళ్లి ఏమండీ:

يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“ఓ నా జాతి ప్రజలారా! నాలో ఏమాత్రం తెలివితక్కువతనము లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫు నుంచి పంపబడిన ప్రవక్తను. నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను. నేను మీకు నమ్మకస్తుడైన హితైషిని” (7:67-68) అని చెప్పారు.

నా మతి భ్రమించింది నేను తెలివితక్కువ వాడిని అని మీరు అంటున్నారు కదా అలాంటిది ఏమీ లేదు అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ నన్ను సురక్షితంగానే ఉంచాడు నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి ప్రవక్తగా మీ ముందు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మతి భ్రమించి నేను ఈ విషయాలు మాట్లాడటం లేదు అని హూద్ అలైహిస్సలాం వారు స్పష్టం చేశారు. అంతేకాదండి హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలు చేస్తున్న చేష్టలను వివరిస్తూ అల్లాహ్ అనుగ్రహాలు వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన అనుగ్రహాల గురించి కూడా వారి ముందర వివరించారు. మనం చూసినట్లయితే ఆ జాతి ప్రజలు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద పర్వతాల వద్దకు వెళ్లి ఆ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేసేవారు. అది హూద్ అలైహిస్సలాం వారు చూసి వారితో ఏమన్నారంటే ఏమండీ:

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
(అతబ్ నూన బికుల్లి రీఇన్ ఆయతన్ తఅబసూన్. వ తత్తఖిజూన మసానిఅ లఅల్లకుమ్ తఖ్ లుదూన్)

“మీరు ఎత్తయిన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రయోజనం లేని స్మారక కట్టడాలు ఎందుకు కడుతున్నారు? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు ఈ భవనాలు నిర్మిస్తున్నారా ఏంటి?” (26:128-129)

అసలు ఈ భవనాల్లో మీరు నివసిస్తారా? మీరు నివసించరు నివసించడానికి మైదానంలో భవనాలు నిర్మించుకున్నారు ఇళ్లు నిర్మించుకున్నారు ఈ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ప్రపంచానికి మీ శక్తి సామర్థ్యాలు చూపించాలని మిమ్మల్ని పొగడాలని అయ్యో ఎంత శక్తిమంతులయ్యా పర్వతాలనే భవనాలు లాగా మార్చేశారు అని మిమ్మల్ని పొగడాలని ప్రజల వద్ద మీ శక్తి సామర్థ్యాలు మీరు ప్రదర్శించాలని కేవలం మీ అహంకారాన్ని ప్రదర్శించాలని మాత్రమే మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీ శ్రమ వృధా మీ సమయము వృధా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలతో అనగా తర్వాత అల్లాహ్ అనుగ్రహాల గురించి కూడా వివరించారు ఏమన్నారు:

أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ وَجَنَّاتٍ وَعُيُونٍ
(అమద్దకుమ్ బి అన్ ఆమిన్ వ బనీన్. వ జన్నాతిన్ వ ఉయూన్)

“చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ కోసము పశువులను మరియు సంతానాన్ని ప్రసాదించాడు. మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటల ద్వారా సెలమల ద్వారా సహాయపడ్డాడు.” (26:133-134)

నీటి కాలువలు మీకోసం ప్రవహింపజేశాడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు పశువులను ప్రసాదించాడు తోటలు మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ అనుగ్రహాలు పొందిన మీరు అల్లాహ్ ను వేడుకోవాలి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలి మీ మీద ఉన్న ఇది బాధ్యత ఈ బాధ్యతను మీరు గ్రహించండి అని హూద్ అలైహిస్సలాం వారు చాలా రకాలుగా జాతి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికిని ఆ ఆద్ జాతి వారు హూద్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
(ఇన్ హాజా ఇల్లా ఖులుఖుల్ అవ్వలీన్)
“ఇది పూర్వికుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.” (26:137)

మేము ఏమో కొత్త విషయాలు చేయట్లేదండి మా పూర్వీకులు చేస్తూ వచ్చిన విషయాలే మేము కూడా పాటిస్తూ ఉన్నాము వారి పద్ధతినే మేము కూడా అనుసరిస్తున్నాము అంతే తప్ప మేము కొత్త విషయాలు ఏమీ చేయట్లేదు ఈ విగ్రహారాధన మా పూర్వీకుల నుంచి వస్తున్న విషయమే అని చెప్పారు. మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారిని ఏమన్నారంటే:

أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا
(అజిఅతనా లినఅబుదల్లాహ వహ్ దహు వ నజర మా కాన యఅబుదు ఆబాఉనా)

“మేము అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చినవాటిని వదిలివేయమని చెప్పడానికి నువ్వు మా వద్దకు వచ్చావా?” (7:70) అన్నారు.

తాత ముత్తాతలు చేస్తూ వచ్చిన పనులన్నీ మేము వదిలేయాలి నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవుళ్లను వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించుకోవాలి ఈ మాటలు చెప్పడానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది అన్నట్టు మరి కొంతమంది హేళన చేశారు వెక్కిరించారు. అయితే మరికొంతమంది అయితే మొండిగా ప్రవర్తిస్తూ హూద్ అలైహిస్సలాం వారితో ఏమన్నారంటే:

وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ
(వ మా నహ్ ను బి తారికి ఆలిహతినా అన్ ఖౌలిక)
“నువ్వు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టము.” (11:53)

మేము ఎన్నో రోజుల నుంచి పూజించుకుంటూ వస్తున్నామయ్యా నువ్వు చెప్పగానే మా దేవుళ్లను పూజించటం మేము వదిలేయం మేము పూజిస్తాం అంతే అని మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం తో వాదించారు. అప్పుడు వారు వాదిస్తూ ఉంటే హూద్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నారు:

أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ
(అ తుజాదిలూననీ ఫీ అస్మాయిన్ సమ్మైతుమూహా అన్తుమ్ వ ఆబాఉకుమ్ మా నజ్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్)

“మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో ఇవి కేవలం మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్లు మాత్రమే ఈ పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు.” (7:71)

ఈ విగ్రహాలు దేవుళ్ళు వీటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈ విగ్రహాలలో ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి ఆధారము ఎలాంటి వాక్యం అవతరింపజేయలేదే అలాంటప్పుడు ఏ విషయాన్ని చూసి మీరు వాటిని పూజిస్తున్నారు ఏ ఆధారాన్ని బట్టి మీరు వాటిని నమ్ముతున్నారు కేవలం పూర్వీకుల అంధానుసరణ తప్ప మరే ఆధారము మీ వద్ద లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను మాత్రం ఒక విషయం స్పష్టం చేసేస్తున్నాను అదేమిటంటే:

إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
(ఇన్నీ ఉష్ హిదుల్లాహ వష్ హదూ అన్నీ బరీఉమ్ మిమ్మా తుష్రికూన్)

“అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగిపోయాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మీరు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉండండి.” (11:54)

ఎవరినైతే మీరు పూజిస్తున్నారో దేవుళ్లు అని నమ్ముతున్నారో ఆరాధిస్తున్నారో వారితో నేను విసిగిపోయాను నేను వారి పూజను వారి పూజతో నేను దూరంగా ఉంటున్నాను నాకు ఈ విగ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయానికి నేను అల్లాహ్ కు సాక్ష్యం పెడుతున్నాను మీరు కూడా సాక్షులుగా ఉండండి అని హూద్ అలైహిస్సలాం వారు తెలియజేసేశారు. ప్రజలతో నువ్వు హూద్ అలైహిస్సలాం వారు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారితో ఇదే విధంగా సమాధానం ఇస్తున్నారు ఈ విషయాలన్నీ మనం విన్నాము.

ఇక రండి ఆ జాతి ప్రజలు ఉంటారు ఆ జాతి పెద్దలు ఉంటారు కదండీ ప్రజలు ఒకవైపు పెద్దలు ఆ జాతి పెద్దలు వారు హూద్ అలైహిస్సలాం తో ఏమనేవారు చూడండి ఆ జాతి పెద్దలు హూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా అనేవారు:

مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
(మా హాజా ఇల్లా బషరుమ్ మిస్ లుకుమ్ యాకులు మిమ్మా తాకులున మిన్హు వయష్రబు మిమ్మా తష్రబూన్. వ లఇన్ అతఅతుమ్ బషరమ్ మిస్ లకుమ్ ఇన్నకుమ్ ఇజల్ లఖాసిరూన్)
“ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు మీరు తాగేదే ఇతను త్రాగుతున్నాడు మీరు గనుక మీలాంటి ఒక మానవ మాత్రుని అనుసరించారంటే మీరు తప్పకుండా నష్టపోతారు.” (23:33-34)

జాతి ప్రజలు వచ్చి జాతి పెద్దలు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇతను కూడా మీలాంటి ఒక సాధారణ మనిషే మీలాంటి ఒక సాధారణ మనిషి వచ్చి చెప్పగానే మీరు వారి మాటలు వినేస్తే మీరు నష్టపోతారు కాబట్టి ఇతని మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని జాతి పెద్దలు వచ్చి ప్రజలతో అనేవారు. మరికొంతమంది వచ్చి ఏమనేవారు అంటే:

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
(అ యఇదుకుమ్ అన్నకుమ్ ఇజా మిత్తుమ్ వ కున్తుమ్ తురాబన్ వ ఇజామన్ అన్నకుమ్ ముఖ్రజూన్. హైహాత హైహాత లీమా తూఅదూన్)
“ఏమిటి? మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం.” (23:35-36) అని మరికొంతమంది వచ్చి చెప్పేవారు.

ఇతని వాగ్దానాలని సంభవించే విషయాలు కావు. మనిషి మరణించి మట్టిలో కలిసిపోతాడు ఎముకల్లాగా మారిపోతాడు మళ్ళీ పుట్టడమంట తర్వాత అల్లాహ్ వద్ద లెక్కింపు జరగటమంట అక్కడ స్వర్గము నరకము అని ఫలితాలు శిక్షలు ఉన్నాయి అని విశ్వసించడమంట ఇవన్నీ అసంభవం జరిగే విషయాలు కావు అని మరికొంతమంది పెద్దలు వచ్చి జాతి ప్రజలకు మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్లుగా మాట్లాడేవారు. మరికొంతమంది అయితే ఏకంగా హూద్ అలైహిస్సలాం వారితోనే వచ్చి ఏమనేవారంటే జాతి పెద్దలు కొంతమంది:

إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ
(ఇన్ నఖూలు ఇల్లా ఇఅతరాక బఅజు ఆలిహతినా బి సూ)
“మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము.” (11:54)

ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా విగ్రహాలను దేవుళ్ళు కాదు అని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అంటే దీనికి గల ముఖ్యమైన కారణము మా దేవుళ్ళలోనే ఏదో ఒక దేవుడు ఆగ్రహించి నిన్ను శిక్షించాడు అతని శిక్ష నిన్ను పట్టుకునింది కాబట్టి ఈ విధంగా నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అని మాటలు మాట్లాడారు చిత్రీకరించి మరి హూద్ అలైహిస్సలాం వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు చాలా తొందరగా స్వీకరిస్తారు నమ్మే నమ్ముతారు.

అయితే చూడండి హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. వారు బెదిరించేటట్టు ప్రజలు కూడా భయపడే పోయేటట్టు వారు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. హూద్ అలైహిస్సలాం వారు అంటున్నారు:

إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم
(ఇన్నీ తవక్కల్తు అలల్లాహి రబ్బీ వ రబ్బికుమ్)
“నేను కేవలం అల్లాహ్ నే నమ్ముకున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే.” (11:56)

వాళ్ళేమంటున్నారు మా దేవుళ్ళలో ఎవడో ఒకడు నిన్ను శిక్షించాడు కాబట్టి నీ మీద అతని శిక్ష పడింది నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మా దేవుళ్ళు అని వారు వచ్చి హూద్ అలైహిస్సలాం తో హెచ్చరిస్తుంటే సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు మీ దేవుడు ఏంటి నా దేవుడు ఏంటి అని చెప్పట్లేదు మీ దేవుడు ఏంటి నా దేవుడు గొప్పతనం చూడండి అనేటట్టుగా మాట్లాడట్లేదు ఆయన ఏమంటున్నారంటే నేను అల్లాహ్ నే నమ్ముతున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అంటే అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడట్లేదు అల్లాహ్ నాకు మీకు మనందరికీ దేవుడు అనే రీతిలోనే మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒక దాయికి ఒక ఉదాహరణగా ఒక ఆదర్శప్రాయంగా విషయం తెలుపబడింది అదేమిటంటే ఎదుటి వ్యక్తి నా దేవుడు అని మాట్లాడుతుంటే దాయి అతనితో మాట్లాడేటప్పుడు నా దేవుడు అల్లాహ్ నా దేవుడు అల్లాహ్ అన్నట్టు మాట్లాడరాదు మన దేవుడు మీకు మాకు మనందరికీ దేవుడు అల్లాహ్ ఆ అల్లాహ్ గురించి తెలుసుకోండి ఆ అల్లాహ్ వైపుకు రండి అనే మాట్లాడాలి గాని విగ్రహాలు మీ దేవుళ్ళు అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడరాదు ఇది సరైన విధానము కాదు సరైన విధానం ఏమిటంటే అల్లాహ్ మనందరి ప్రభువు ఆ ప్రభువు వైపుకు రండి అని మాత్రమే చెప్పాలి. ఇది ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే హూద్ అలైహిస్సలాం వారు మరొక విషయం వారికి తెలియజేశారు ఏమన్నారంటే:

فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ
(ఫఇన్ తవల్లౌ ఫఖద్ అబ్లగ్ తుకుమ్ మా ఉర్ సిల్ తు బిహీ ఇలైకుమ్)
“ఏమయ్యా నేనేమో మీ వద్దకు వచ్చి ఈ విషయాలు ప్రకటిస్తున్నాను ఒకవేళ మీరు మరలిపోదలిస్తే నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను నా బాధ్యత నెరవేర్చేశాను.” (11:57)

అల్లాహ్ వాక్యాలు మీ వద్దకు చేర్చటం వాటిని వివరంగా మీ ముందర తెలియజేయడం నా బాధ్యత నేను ఆ బాధ్యతను నెరవేర్చాను మీరు మరలిపోతే నా బాధ్యత తీరిపోతుంది మీరు మాత్రం అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతారన్న విషయాన్ని హూద్ అలైహిస్సలాం జాతి ప్రజలకు తెలియజేశారు. తర్వాత హూద్ అలైహిస్సలాం చాలా రోజుల వరకు అనేక సంవత్సరాలుగా ఆద్ జాతి వారు కి దైవ వాక్యాలు వినిపిస్తూ వినిపిస్తూ ముందుకు సాగిపోయారు. అయితే జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని పట్టించుకోవట్లేదు. అప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు హెచ్చరించటం ప్రారంభించారు ఏమన్నారంటే:

إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖాఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.” (26:135)

మీరు దైవ వాక్యాలను నమ్మటం లేదు మీరు దైవ వాక్యాలను అంగీకరించుట లేదు విశ్వసించుట లేదు ఒక మహా దినపు శిక్ష వచ్చి మీ మీద పడబోతుందన్న విషయము నాకు భయభ్రాంతుల్ని చేస్తుంది ఆ రోజు మీ మీద వచ్చి పడుతుందేమో ఆ శిక్ష వచ్చి మీ మీద పడుతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పారు. దానికి చూడండి గర్విష్టులు శక్తివంతులు బాగా ఎత్తుగా ఉన్నవారు బలంగా ఉన్నవారు శక్తిమంతులు మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో అనుకుంటున్నవాళ్ళు శిక్ష వచ్చి పడుతుంది అని హూద్ అలైహిస్సలాం హెచ్చరిస్తుంటే వాళ్ళు ఎలాంటి గర్వంగా హూద్ అలైహిస్సలాం కు సమాధానం ఇస్తున్నారో చూడండి వాళ్ళు అంటున్నారు:

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
(వ మా నహ్ ను బి ముఅజ్జబీన్. ఫ అత్తినా బిమా తఇదునా ఇన్ కున్త మినస్సాదిఖీన్)
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము. ఏ శిక్ష గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం.” (26:138, 7:70)

శిక్ష వచ్చి పడుతుంది అని హెచ్చరిస్తున్నావు కదా మేము శిక్షించబడము మాకంటే శక్తిమంతులు ఎవరూ ప్రపంచంలో లేరు కాబట్టి మాకు ఎలాంటి శిక్ష గురించి భయము లేదు ఒకవేళ శిక్ష వస్తుంది అదే నిజమైటట్లయితే ఆ శిక్ష తీసుకొని రా చూద్దాము అని హూద్ అలైహిస్సలాం తో ఛాలెంజ్ చేస్తున్నారు సవాలు విసురుతున్నారు ఆద్ జాతి ప్రజలు. అప్పుడు హూద్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు:

قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(కాల రబ్బిన్ సుర్నీ బిమా కజ్జబూన్)
“ఓ ప్రభూ! వీళ్లు ధిక్కార వైఖరికి ప్రతిగా, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు” (23:39) అని ప్రవక్త హూద్ అలైహిస్సలాం వారు ప్రార్థించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హూద్ అలైహిస్సలాం వారి ప్రార్థన స్వీకరించాడు స్వీకరించి త్వరలోని శిక్షించబడే రోజు రాబోతుంది నిరీక్షించండి అని తెలియజేశాడు. అదే విషయం హూద్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వచ్చి:

فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
(ఫన్ తజిరూ ఇన్నీ మఅకుమ్ మినల్ మున్ తజిరీన్)
“దైవ శిక్ష తీసుకొని రా చూద్దామని సవాలు విసిరారు కదా మీరు నిరీక్షించండి మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తున్నాను.” (7:71) అని తెలియజేశారు అంటే ప్రార్థన అయిపోయింది దైవ శిక్ష రావటం నిర్ణయించబడింది ఇక అది ఎప్పుడు వస్తాది అనే దాని కోసం మీరు ఎదురు చూడండి నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాను అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి వారికి తెలియజేశారు.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క శిక్ష ప్రారంభమైంది. ప్రారంభంలో అక్కడ వర్షాలు ఆగిపోయాయి. వర్షం ఆగిపోయిన కారణంగా అక్కడ కరువు ఏర్పడింది. ప్రజలకు ఆహారము నీళ్ళ సమస్య ఎదురైంది చాలా రోజుల వరకు వర్షాలు కురవకపోయేసరికి కరువు ఏర్పడిన కారణంగా వారు ఆకలి దప్పికలతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నల్లటి మేఘాలు వచ్చాయి ఇక్కడ గమనించండి కొంచెం బాగా మిత్రులారా నల్లటి మేఘాలు ఎప్పుడైతే వస్తూ కనిపించాయో అప్పుడు జాతి ప్రజలు ఏమన్నారంటే:

قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا
(ఖాలూ హాజా ఆరిజుమ్ ముమ్ తిరునా)
“ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బులు. ఇవి మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక” (46:24) అని వారు చెప్పుకోసాగారు. అయితే అల్లాహ్ ఏమన్నాడంటే:

بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
(బల్ హువ మస్ తఅ జల్ తుమ్ బిహీ రీహున్ ఫీహా అజాబున్ అలీమ్)
“నిజానికి అది మీరు తొందరపెట్టిన విపత్కర మేఘం, అదొక పెనుగాలి అందులో వేదాభరితమైన శిక్ష ఉంది.” (46:24)

వారేమనుకుంటున్నారు దూరం నుంచి చూసి అవి నల్లటి మబ్బులు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం కురుస్తుంది మా కరువు మొత్తం దూరమైపోతుంది అని వారు అనుకుంటున్నారు కానీ అల్లాహ్ ఏమంటున్నాడు అంటే ఆ మేఘాల వెనుక పెనుగాలి ఉంది మరియు విపత్కరమైన శిక్ష మీకోసం వస్తూ ఉంది భయంకరమైన శిక్ష అందులో దాగి ఉంది అని అంటున్నాడు. తర్వాత ఏమైందండి ఆ మేఘాలు ఎప్పుడైతే ఆ జాతి ప్రజల వద్దకు వచ్చాయో వర్షానికి బదులు తీవ్రమైన భయంకరమైన గాలి మొదలయింది. ఎన్ని రోజులు ఆ గాలి నడిచింది ఏ విధంగా అల్లాహ్ వారిని శిక్షించాడో అది కూడా ఖురాన్ లో ప్రస్తావించబడింది 69వ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
(వ అమ్మ ఆదున్ ఫ ఉహ్ లికూ బిరీహిన్ సర్ సరిన్ ఆతియతిన్. సఖ్ ఖరహా అలైహిమ్ సబ్ అ లయాలిన్ వ సమానియత అయ్యామిన్ హుసూమన్ ఫతరల్ ఖౌమ ఫీహా సర్ ఆ క అన్నహుమ్ అఅజాజు నఖ్ లిన్ ఖావియతిన్)

“ఆద్‌ జాతి వారు ప్రచండమైన పెనుగాలి ద్వారా నాశనం చేయబడ్డారు. దాన్ని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.” (69:6-7) అల్లాహు అక్బర్. ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు పూర్తి ఒక వారం వరకు ఆ పెనుగాలి వారిపైకి పంపించబడింది.

అంతే కాదు ఆ గాలితో పాటు మరొక శిక్ష ఏమిటంటే:

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً
(ఫ అఖజత్ హుముస్ సైహతు బిల్ హఖ్ ఖి ఫజఅల్ నాహుమ్ గుసాఅన్)

“ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది అంతే మేము వారిని చెత్తాచెదారం లాగా చేసేసాము.” (23:41)

ఒకవైపు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ల వరకు తీవ్రమైన ఒక గాలి వీస్తూ ఉంది దానికి తోడుగా ఒక భయంకరమైన అరుపు కూడా వారిని పట్టుకునింది ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలి వచ్చి వారి ఇళ్లలోకి దూరి ఎవరైతే మాకంటే శక్తిమంతులు ప్రపంచంలో ఎవరూ లేరు అని విర్రవీగిపోయారో సవాలు విసిరారో ప్రపంచానికి అలాంటి వారి పరిస్థితి ఏమైపోయిందంటే ఆ గాలి వారిని పైకి తీసుకెళ్లి తలకిందులుగా కిందికి పడేసేది నేలకేసి కొడితే వచ్చి నేలకు తల తగలగానే తల బద్దలైపోయేది వారు తుఫాను వచ్చిన తర్వాత మనం టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం టెంకాయ చెట్లు, తాటి చెట్లు, ఖర్జూరపు చెట్లు అవన్నీ నేలకొరిగి ఉంటాయి పంట నష్టం జరిగింది అని చూపిస్తూ ఉంటాడు కదండీ ఆ విధంగా ఎంతో ఎత్తు ఉన్న బలశాలులైన ఆ ఆద్ జాతి ప్రజలందరూ కూడా బొద్దుల వలె కింద పడిపోయి ఉన్నారు తాటి ఖర్జూరపు టెంకాయ బొద్దుల వలె అక్కడ పడి మరణించారు నాశనమయ్యారు.

అయితే పూర్తి జాతిలో ఎంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారి మాటను నమ్మి విశ్వసించారో హూద్ అలైహిస్సలాం ప్రవక్తను మరియు ఆయన మాట విశ్వసించిన ఆ జాతి ప్రజలను మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రక్షించాడు సురక్షితమైన ప్రదేశానికి వారిని తరలించాడు ఖురాన్లో 11వ అధ్యాయం 58వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا
(వ లమ్మా జాఅ అమ్రునా నజ్జైనా హూదన్ వల్లజీన ఆమనూ మఅహూ బిరహ్ మతిమ్ మిన్నా)
“మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్‌ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము.” (11:58)

అంటే ఆద్ జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాలి మరియు అరుపు ద్వారా శిక్షించాడు వారందరూ నాశనమైపోయారు చెత్తాచెదారం లాగా అయిపోయారు విశ్వసించిన వారిని ప్రవక్తను మాత్రం అల్లాహ్ రక్షించాడు. ఇది హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి యొక్క సంక్షిప్తమైన చరిత్ర.

అయితే ఈ చరిత్రతో మరొక కథ ముడిపడి ఉంది ఆ కథ అక్కడక్కడ కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అదేమిటంటే హూద్ అలైహిస్సలాం వారి జాతిని ఆద్ జాతి అంటారు కదండీ ఆ జాతి వద్ద షద్దాద్ బిన్ ఆద్ మరియు షదీద్ బిన్ ఆద్ అనే ఇద్దరు రాజులు ఆ జాతిని పరిపాలించేవారు వారిద్దరూ అన్నదమ్ములు వారి తండ్రి పేరు వచ్చి ఆద్, ఆ ఆద్ అనే రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి ఆ పూర్తి జాతిని ఆద్ జాతి వారు అని పేరు పెట్టడం జరిగింది. అయితే తండ్రి మరణించిన తర్వాత షద్దాద్ మరియు షదీద్ వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని పరిపాలించారు. అయితే కొద్ది రోజులకు వారిద్దరిలో నుంచి షదీద్ అనే ఒక తమ్ముడు మరణించాడు షదీద్ మరణించిన తర్వాత పూర్తి బాధ్యతలు షద్దాద్ చేతికి అప్పగించబడ్డాయి ఆ తర్వాత షద్దాద్ ఒక్కడే ఆ ప్రదేశం మొత్తానికి రాజయ్యాడు పూర్తి అధికారాలు అతని చేతుల్లోకి వచ్చాయి అతను ఆ ప్రదేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు.

జాతి ప్రజలు చాలా శక్తివంతులు ఎత్తు కలిగిన వారు కాబట్టి వారిని తీసుకొని తన సామ్రాజ్యాన్ని అతను చాలా దూరం వరకు విస్తరించుకుంటూ పోయాడు. అయితే ఎప్పుడైతే హూద్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల వద్దకు వెళ్లి అల్లాహ్ గురించి మరణానంతర జీవితం గురించి స్వర్గం గురించి నరకం గురించి వివరించారో ఆ రాజు వద్దకు స్వర్గం గురించి ఎవరో వినిపించారు అప్పుడు ఆ రాజు ఆ స్వర్గం గురించి స్వర్గ అనుగ్రహాల గురించి విని ఏమన్నాడంటే ఆకాశాలలో స్వర్గం ఉండటం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను అని ప్రకటించాడు. హూద్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు గర్వంతో అహంకారంతో అతను ఏమన్నాడంటే ఆకాశాల పైన ఉన్న స్వర్గం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను చూడండి అని ఆ తర్వాత ‘అదన్‘ అనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ బంగారము వెండి వజ్రాలు ఈ విధంగా అతని వద్ద ఉన్న ఖజానా మొత్తం ఖర్చు పెట్టి ఒక స్వర్గాన్ని నిర్మించే పని మొదలెట్టాడు.

ఆ రోజుల్లో ప్రజల ఆయుష్షు చాలా పెద్దది చాలా ఎక్కువ రోజులు వారు బ్రతికేవారు ఆ విధంగా 300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు. అందులో భవనాలు ఏర్పాటు చేశారు రహదారులు నిర్మించారు నీటి కాలువలు నిర్మించారు పండ్ల తోటలు నిర్మించారు సేవకుల్ని ఉంచారు అన్ని సౌకర్యాలు ఉంచారు దానితోపాటు బంగారం అందులో ఉంచారు వెండి ఉంచారు వజ్రాలు ఉంచారు ఈ విధంగా నగలు ఆభరణాలు కూడా అందులో ఉంచారు దానికి ‘ఇరం‘ అని నామకరణం చేశాడు స్వర్గానికి జన్నతుల్ ఫిర్దౌస్ జన్నాతు అద్న్ అని పేర్లు ఉంటాయి కదండీ ఆ విధంగా ఇతను నిర్మించిన స్వర్గానికి అతను ‘ఇరం’ అని నామకరణం చేశాడు.

300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు నిర్మించబడిన స్వర్గం గురించి రాజుకు తెలియజేశారు రాజు ఏం చేశాడంటే 300 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న స్వర్గము నిర్మించబడింది ఆ స్వర్గ ప్రారంభోత్సవానికి వెళ్లడానికి బంధుమిత్రులతో పాటు పయనమయ్యాడు. మార్గ మధ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక్క రోజు ప్రయాణము చేస్తే ఒక్క రోజు తర్వాత ఆ స్వర్గానికి చేరుకుంటాడు అనగా దైవ శిక్ష వచ్చి ఆద్ జాతి వారి మీద పడింది ఆ శిక్షలో ఆద్ జాతితో పాటు ఆ రాజు అతని కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరూ కూడా అక్కడికక్కడే నాశనమైపోయి మరణించారు చనిపోయారు. తను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కలల స్వర్గాన్ని అతను చేరుకోలేకపోయాడు ఇంకా ఒక్క రోజు ప్రయాణం ఉందనగానే అంతలోనే అక్కడే అతను చనిపోయాడు మరణించాడు అని చరిత్రకారులు తెలియజేశారు.

ఇక్కడితో పూర్తి కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత ఈ స్వర్గానికి సంబంధించిన మరొక విషయం చెప్పబడుతుంది అదేమిటంటే ఈ సంఘటన జరిగిన చాలా వేల సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం నలుగురు ఖలీఫాల మరణానంతరం ఎప్పుడైతే అమీరె మావియా ఖలీఫాగా చక్రవర్తిగా ముస్లింలను పరిపాలిస్తున్నారో ఆ రోజుల్లో అబ్దుల్లా బిన్ ఖిలాబా అనే ఒక వ్యక్తి ఒంటెను వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్తున్నారు ఒంటెను వెతుకుతున్నారు వెంట ఒంటె ఎక్కడికో పారిపోయింది ఆ పారిపోయిన ఒంటెను వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక చోట కాలు జారారు కింద పడ్డారు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్లి చూస్తే లోపల భవనాలు ఉన్నాయి అక్కడ వెండి వజ్రాలు బంగారం అన్నీ ఒక పెద్ద నగరాన్ని అక్కడ ఆయన చూశారు. ఆయన ఏం చేశారంటే అందులో నుంచి కొంచెం బంగారము వెండి వజ్రాలు ఇలాంటి ఆభరణాలు తీసుకొని ఏదో ఒక రకంగా కష్టపడి మళ్ళీ బయటికి వచ్చారు.

తరువాత ఆ విషయం తిన్నగా వారి ద్వారా వారి స్నేహితులకి స్నేహితుల ద్వారా బంధుమిత్రులకి బంధుమిత్రుల ద్వారా రాజు వద్దకు చేరిపోయింది. రాజు వద్దకు విషయం చేరినప్పుడు ఆ రాజు గారు అబ్దుల్లా బిన్ ఖిలాబా గారిని పిలిపించి ఏమయ్యా ఏదో సంఘటన జరిగిందంట భూమి లోపల నువ్వు ఎక్కడో కింద పడ్డావంట అక్కడ ఒక పెద్ద నగరం నీకు కనిపించింది అంట అక్కడ నువ్వు బంగారము ఇవన్నీ తీసుకువచ్చావు అంట కదా ఇది ఎక్కడ ఉందో నువ్వు మమ్మల్ని చూపించగలవా అని అడిగితే సరేనండి చూపిస్తాను పదండి అని ఆయన భటులతో పాటు బయలుదేరారు కానీ ఆ ప్రదేశాన్ని ఆయన కనుక్కోలేకపోయారు ఆ ప్రదేశానికి చేరుకోలేకపోయారు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ రెండు సంఘటనలు ఎలాంటి సంఘటనలు అంటే ఇవి ప్రామాణికమైనవి కావు అని ధార్మిక పండితులు తేల్చి చెప్పారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రస్తావన అక్కడక్కడ కొంతమంది ఈ రాజు గురించి చర్చిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు అయితే ఇది ప్రామాణికమైన విషయం కాదన్న విషయం మీ దృష్టిలో నేను ఉంచదలిచాను కాబట్టి ఈ పూర్తి కథ వినిపించి దాని వాస్తవాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది.

అయితే మిత్రులారా ఒక్క విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే ఆద్ జాతి వారు చాలా శక్తిమంతులు. ఆ శక్తి సామర్థ్యాలను అల్లాహ్ కోసం అల్లాహ్ ధర్మం కోసం వారు ఉపయోగించలేదు గానీ ప్రపంచంలో వారి ఉనికిని చాటుకోవడానికి వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చూపించడానికి గర్వపడడానికి మాత్రమే ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం ప్రదర్శించారు తత్కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తను పంపి వారిని సంస్కరించేటందుకు ప్రయత్నం చేసినా గానీ వారు ప్రవక్తను విశ్వసించలేదు అల్లాహ్ ను విశ్వసించలేదు కాబట్టి దైవ శిక్షకు గురయ్యారు. ఈ హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి వారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అహంకారం ప్రదర్శిస్తే వారు ఎంతటి శక్తి సామర్థ్యం కలిగిన వారైనా సరే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెచ్చుకోడు వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కఠినంగా శిక్షిస్తాడు.

అలాగే రెండవ విషయం ఏమిటంటే హూద్ అలైహిస్సలాం వారిని జాతి ప్రజలు బెదిరించారు మా ప్రభువులు నీకు ఏదో రోగానికి గురి చేశారు కాబట్టి నువ్వు ఈ విధంగా వ్యాధిగ్రస్తుడిలా మారిపోయి మాట్లాడుతున్నావు అని లేనిపోని విషయాలు చెప్పి ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు ఆయన అవునేమో అనుకోలేదు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి నాకు లాభ నష్టాలు ఏమి జరిగినా అల్లాహ్ తరఫునే జరుగుతాయి గానీ అల్లాహ్ తప్ప మరెవరికీ లాభాలు నష్టాలు సమకూర్చే అధికారము శక్తి లేదు అన్న విషయాన్ని ప్రపంచానికి ముఖ్యంగా ఆ జాతి ప్రజలకు తెలియజేశారు కాబట్టి మనం కూడా అదే విషయాన్ని నమ్మాలి. మనకు లాభం కలిగినా నష్టం కలిగినా అల్లాహ్ తరఫునే కలుగుతుంది కానీ అల్లాహ్ తప్ప మరెవరి వల్ల అది సాధ్యము కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు “ప్రపంచం మొత్తం కలిపి మీకు సహాయం చేయాలనుకున్నా మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత సహాయం చేయాలంటే అంతే చేయగలుగుతారు ప్రపంచం మొత్తం కలిసి మీకు నష్టం చేయాలనుకున్నా అల్లాహ్ మీకు ఎంత నష్టం చేయాలనుకుంటాడో అంతే వారు నష్టం చేయగలుగుతారు అంతే తప్ప అల్లాహ్ ఆజ్ఞకు మించి వారు ఏమీ చేయలేరు” అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి అల్లాహ్ మీద పూర్తి నమ్మకం భక్తులకు ఉండాలి అనేది మనకు ఇక్కడ తెలుపడం జరిగింది.

చివరి విషయం ఏమిటంటే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యము అల్లాహ్ పై మరియు ప్రవక్తల పై అల్లాహ్ వాక్యాలపై విశ్వాసము మరియు అనుసరణ ద్వారానే లభిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి.

నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రుజుమార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక మార్గభ్రష్టత్వానికి గురి కాకుండా సైతాన్ వలలో చిక్కుకోకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)

యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తయిన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది. వారి బలసామర్ధ్యాల వల్ల, వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కాని భౌతికంగా వారు సాధించిన ప్రగతీ వికా సాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు.

అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కాని వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు. అల్లాహ్ పాటు వారు అనేక దేవీదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది.

అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనే హూద్ (అలైహిస్సలాం). ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో, దృఢసంకల్పంతో, సహనంతో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ, “ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల లాభం ఏముంది? మీ స్వంత చేతులతో . మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. దేవుడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయనే అల్లాహ్. ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు పోషణనిస్తున్నాడు. ఆయనే మీకు జీవన్మరణాలు ఇస్తున్నాడు” అని చెప్పారు. ‘అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకూ పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు.

హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హూద్ (అలైహిస్సలాం)తో వాదనకు దిగారు. “హూద్ ! నీవు చెబుతున్న దేమిటి? ఈ దేవీదేవతలు అల్లాహ్ తో మా తరఫున సిఫారసు చేస్తాయి” అని. దబాయించారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ప్రజలారా! అందరి దేవుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయన మీ బృహద్ధ మనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీ కోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో! కాని మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి” అన్నారు.

కాని వారు హూద్ (అలైహిస్సలాం) మాటలను తిరస్కరించారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “హూద్! నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే. అలాంటప్పుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవీ బాధ్యతలను అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాడుతున్నావు” అన్నారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది. ప్రతి వస్తువులోనూ ఒక సూచన ఉంది. కాబట్టి ఆయన్ను విశ్వసించండి. ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. ఆయన కారుణ్యానికి దూరం కావద్దు. పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటిచెబుతున్నాయి. కాని వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు మీ సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు” అని హెచ్చరించారు. కాని ఆ ప్రజలు ఆయన బోధనలను పెడచెవిన పెట్టారు. హూద్ (అలైహిస్సలాం) తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో, “అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహు మాత్రమే భయపడతాను” అన్నారు.

ఒక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లమబ్బు కప్పివేయడాన్ని చూశారు. వర్షం వస్తుందని వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. హూద్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు.

భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు, ఏడు రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. కేవలం హూద్ (అస), ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారు అక్కడి నుంచి ‘హద్రమౌత్’కు వలస పోయారు. వారు అక్కడ ఒకేదేవుడు అల్లాహ్ ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 7:65-72, 11:50-60, 26:123-140)

ఇటీవల స్పేస్ షటిల్ నుంచి తీసుకున్న ఆధునిక రాడార్ ఇమేజ్ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఓమ్మాన్ ని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తయిన టవర్లను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని “ఖాళీ ప్రదేశం” (ఎంప్టీ క్వార్టర్)గా పిలువడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్యఖుర్ఆన్ తప్ప మరో మతగ్రంథం లేదా ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ

మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.

7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ

దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.

7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ

“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.

7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.

7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్‌ మిమ్మల్ని నూహ్‌ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్‌ బోధపరచాడు.

7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ

“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.

7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ

అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్‌ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”

7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ

ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.

11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

మరి మేము ఆద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”

11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ

“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”

11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ

“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”

11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

దానికి వారు, “ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.

11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ

పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్‌ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్‌ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”

11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.

11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.

11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ

ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”

11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.

11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.

11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.

26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ

ఆద్‌ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.

26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

అప్పుడు వారి సోదరుడైన హూద్‌, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?

26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.

26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ

“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.

26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ

“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?

26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!

26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?

26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.

26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ

“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.

26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ

“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).

26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”

26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ

వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.

26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ

“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.

26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”

26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.

26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]
మూలం : మర్దిజా ఆల్డ్ రిచ్ టారింటినో
అనువాదం: బా మేరాజ్
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్

[డౌన్లోడ్ పుస్తకం]
[116 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

దైవప్రవక్త సహచరులు జాబిర్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

ఒక వెన్నెల రాత్రి – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను చూశాను. ఆయన ఎరుపు రంగు దుస్తుల్లో వున్నారు.నేను ఆకాశంలోని చంద్రుణ్ణి ఒకసారి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందాన్ని మరోసారి ఇలా మార్చి మార్చి చూస్తూ ఉన్నాను.అప్పుడు నాకు ఆకాశంలోని చంద్రుడి కన్నా దైవ ప్రవక్త ముఖారవిందమే నిండు చంద్రునిలా ఎంతో అందంగా కనిపించింది.

1. శుభోదయం
2. నల్ల మచ్చ
3. జమ్ జమ్ బావి
4. వంద ఒంటెల విందు
5. వర్తక బృందం
6. క్రైస్తవ పండితుడు -బహీరా
7. యవ్వనం
8. అల్లాహ్ పిలుపు
9. ఖురైష్ తెగ
10. ప్రతి పక్షం
11. జిన్నాత్
12. రాత్రి ప్రయాణం
13. కొండ గుహ
14. మదీనా
15. మదీనా-2
16. బద్ర్ యుద్ధం
17. ఉహుద్ యద్ధం
18. కందక యుద్ధం
19. తిరిగి రాక

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు [వీడియో ]

[20] మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు
https://youtu.be/xC-ulwWQX-o [52 నిముషాలు]

తప్పకుండా వినే ప్రయత్నం చేయండి, చాల మంచి వీడియో, ప్రవక్త గారి (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర అర్ధం చేసుకోవడం మనందరి విధి.

తబూక్ పోరాటం PDF డౌన్లోడ్ చేస్కోండి: (20 పేజీలు)
https://teluguislam.net/wp-content/uploads/2022/06/ghazwa-tabook.pdf

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

గజ్వయె తబూక్ (తబూక్ పోరాటం) 

మక్కా విజయం, సత్యాసత్యాల నడుమ జరిగిన ఓ నిర్ణయాత్మకమైన యుద్ధమే అనాలి. ఆ విజయానంతరం అరబ్బుల్లో, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క దైవ దౌత్యం గురించి ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ కారణంగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దైవధర్మం అయిన ఇస్లామ్ లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరడం ఆరంభమైంది. ప్రతినిధి వర్గాల రాకకు సంబంధించిన అధ్యాయంలో మేము ఇస్తున్న వివరాల ఆధారంగా ఈ విషయాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. అలాగే, హజాతుల్ విదా సందర్భంలో హాజరైన ప్రజా సమూహాన్ని బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు – మొత్తానికి, అరేబియాలో అంతర్గతంగా ప్రబలుతున్న తిరుగుబాట్లు, అడ్డంకులన్నీ ఇప్పుడు దాదాపుగా సమసిపోయి నట్లయింది. ముస్లిములు, దైవధర్మ సంవిధానాన్ని, ఇస్లామ్ షరీఅతను ఎల్లెడలా వ్యాపింపజేయడానికి, ఇస్లామ్ ధర్మప్రచారం కోసం ఏకాగ్రతను సంతరించుకొని ముందుకు పురోగమించడానికి అవకాశం లభించినట్లయింది. 

తబూక్ పోరాటం సంభవించడానికి గల కారణం 

అయితే ఇప్పుడు, ఎలాంటి కారణం లేకుండానే ముస్లిములతో తలపడడానికి ఓ శక్తి మదీనా వైపునకు దృష్టిని పెట్టింది. దీనికి సంబంధించిన వారు అప్పుడప్పుడు ముస్లిములను కవ్విస్తూ ఉన్నారు. ఈ శక్తి రోమను సామ్రాజ్యానికి సంబంధించినది. అది ఆ కాలంలో ప్రపంచంలోకెల్లా ఓ పెద్ద సూపర్ పవర్ గా అలరారే సామ్రాజ్యం . వెనుకటి పుటల్లో ఈ కవ్వింపు, షుజ్ల్ బిన్ అమ్రూ గస్సానీ చేతిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దూత హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ అజీ (రదియల్లాహు అన్హు) హత్యగావించబడడంతో ఆరంభమైంది. హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ బస్రా గవర్నరు వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సందేశాన్ని తీసుకు వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత హజ్రత్ జైద్ బిన్ హారిసా నేతృత్వంలో ఓ సైనిక పటాలాన్ని పంపించడం, అది రోమను సామ్రాజ్యంలో ‘మూతా’లో భీకరంగా యుద్ధం చేయడం, అయితే ఈ సైనిక పటాలం ఆ తలబిరుసుతనం గల రోమనులను అణచలేకపోవడం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే. అయితే, ముస్లిముల ఈ సైన్యం అప్పటి సూపర్ పవర్ అయిన రోమనులతో ఢీకొనడం, అరేబియా పౌరులపై మంచి ప్రభావాన్నే వేసింది. | 

రోమ్ చక్రవర్తి కైజరు, ఈ ప్రభావం విషయంలో, దాని ఫలితంగా అరబ్బు తెగల్లో రోమనుల నుండి స్వాతంత్ర్యం పొందే భావన జాగృతం అయ్యే విషయంలో, ముస్లిముల ఎడల అరబ్బుల్లో ఏర్పడే సానుభూతి విష 

యంలో ఎలా ఉపేక్షించగలడు? అవి అతణ్ణి కలచివేస్తున్న ప్రమాద సూచికలే మరి. ఆ ప్రమాదం ఒక్కో అడుగు అతని సరిహద్దుల వైపునకు కదిలివస్తోంది. అరేబియాతో కలిసిన సిరియా సరిహద్దుకు ఓ సవాలుగా నిలిచింది. కాబట్టి కైజరు, ముస్లిముల ఈ మహోన్నతమైన శక్తి, అజేయమైన ఈ ప్రమాదం ముంచుకు రాకపూర్వమే, రోము సామ్రాజ్యానికి ఆనుకొని ఉన్న అరబ్బు ప్రాంతాల్లో సంక్షోభం, తిరుగుబాట్లు చెలరేగక మునుపే దాన్ని అణచివేయా లనే దృఢసంకల్పానికి వచ్చాడు.

ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే, మూతా యుద్ధం జరిగి ఇంకా ఒక్క సంవత్సరం కూడా తిరిగిరాలేదు, 

రోము చక్రవర్తి రోమను ప్రజల్ని, తన ఆధీనంలో ఉన్న అరబ్బుల్ని, అంటే ఆలెగస్సాన్ తెగ వగైరాలతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని సమీకరించి, ఓ భయంకరమైన, నిర్ణయాత్మకమైన యుద్ధం కోసం సన్నాహాలు మొదలెట్టాడు. 

రోమనులు మరియు గస్సాన్ల యుద్ధ సన్నాహాల వార్తలు 

రోమను సామ్రాజ్యం ముస్లిములపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించిందన్న వార్తలు ఎడతెగకుండా మదీనాకు చేరుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ముస్లిములు అప్రమత్తులైపోయారు. ఏ చిన్న అనుమానం వచ్చినా రోమనులు తమపైకి వచ్చిపడ్డారనే భావనకు లోనైపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ సంఘటనను కూడా ఇక్కడ ఉటంకించక తప్పదు. అదే సంవత్సరం, అంటే హిజీ శకం 9లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణులతో అలిగి ఒక నెల్లాళ్ళు ‘ఈలా“చేసి వారికి దూరంగా ఉన్నారు. సహచరులకు ఈ విషయం తెలిసిరాలేదు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి తలాక్ ఇచ్చారనే అనుకొని బాధపడిపోయారు. 

[ఈలా అంటే స్త్రీ వద్దకు వెళ్ళనని ఒట్టేసుకోవడం. ఈ ఒట్టు నాల్గు నెలలు లేదా అంతకంటే తక్కువ గడువు కోసం వేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఫరవాలేదు. ఇదే గనక నాల్గు నెలలు దాటితే షరీఅత్ న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం కలుగజేసుకుని భర్త, భార్యను భార్యగానైనా ఉంచుకోవాలి లేదా ఆమెకు తలాక్ అయినా ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. కొందరు సహాబాల అభిప్రాయం ప్రకారం, నాల్గు నెలల గడువు తీరిపోగానే ఆ స్త్రీకి తలాక్ వర్తిస్తుంది.]

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన గురించి ఇలా వివరిస్తున్నారు: 

“నాకు అన్సారీ మిత్రుడొకడుండేవాడు. నేను (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధిలో) లేనప్పుడు అతను అక్కడ జరిగిన విషయాలు వచ్చి చెప్పేవాడు. నేను కూడా అతని గైర్హాజరులో వెళ్ళి జరిగిన విషయాలు అతనికి చెబుతూ ఉండేవాణ్ణి. ఈ ఇద్దరు మిత్రులు మదీనాలోనే ఉంటూ ఉండేవారు. ఇరుగుపొరుగున ఉంటూ వంతుల వారీగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవారు – ఆ కాలంలోనే మాకు గస్సాన్ రాజు వల్ల ప్రమాదం ఏర్పడుతుందనే శంక ఉంటూ ఉండేది. అతను మా పై దాడి చేయనున్నాడని వస్తున్న వార్తల వల్ల మేము అప్రమత్తులమై ఉండేవారం. ఓ రోజు హఠాత్తుగా నా ఆ అన్సారీ మిత్రుడు నా తలుపును తెగబాదుతూ తలుపు తెరవమని అరవనారంభించాడు. అది విన్న నేను, “ఏమిటీ? గస్సానీలు వచ్చిపడ్డారా?” 

అని అడిగాను. 

“కాదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణుల నుండి వేరైపోయారు” అన్నాడు నా మిత్రుడు. [సహీహ్ బుఖారీ-2/730 ]

మరో ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నట్లు ఉంది: 

“మా పై దండెత్తడానికి ఆలెగస్సాన్ తమ గుర్రాలకు నాడాలు వేస్తున్నా రనే పుకార్లు బాగా వ్యాపించిన రోజులవి. ఓ రోజు నా మిత్రుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి ఇషా నమాజు సమయానికి తిరిగివచ్చాడు. నా ఇంటి తలుపును పెద్దగా తడుతూ, “ఆయన నిద్రపోయారా?” అని అరుస్తున్నాడు. 

నేను బెదిరిపోతూ బయటకు వచ్చేశాను.

“ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయింది” అన్నాడతను. 

“ఏమిటి? గస్సానులు వచ్చేశారా?” అని అడిగాన్నేను. 

“లేదు. అంతకంటే పెద్ద ప్రమాదమే ముంచుకువచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు తలాక్ ఇచ్చేశారు.” [సహీహ్ బుఖారీ-1/334]

ఈ పరిస్థితినిబట్టి రోమనుల వల్ల ముస్లిములలో ఏర్పడిన వ్యాకులత ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మునాఫిక్లులు (కపట ముస్లిములు) వ్యాపింపజేస్తున్న పుకార్లు వారిని మరింత చీకాకుపర్చనారం భించాయి. ఈ మునాఫిలకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రంగంలోనూ నెగ్గుకు వస్తున్నారని, ఈ భూమ్మీదనున్న ఏ శక్తికీ వెరవడం లేదని, ఏ అడ్డంకులైతే ఆయన దారికి అడ్డువస్తున్నాయో అవన్నీ ఇట్టే తొలగిపోతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ వారు తమ మనస్సుల్లో దాచుకున్నది, ఎదురు చూస్తున్నది తప్పకుండా నెరవేరే తరుణం ఎంతో దూరంగా లేదని తలచి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్ననారంభించారు. వారు తాము భావిస్తున్నట్లుగానే ఓ మస్జిదను (ఆ మస్జిద్, మస్జిదె జిరా గా ఆ తరువాత ఖ్యాతిగాంచింది) కట్టుకొని ఆ మస్జిద్ లో కుట్రలు, కుతంత్రాలకు పథకాలు వేయనారంభిం చారు. దైవం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ల ఎడల తిరస్కార భావ పునాదులపై నిర్మించ బడిన మస్జి లోనికి వచ్చి నమాజు చేయించమని కూడా ఈ మునాఫిస్టు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను కోరి ఉన్నారు. అలా కోరడానికి కారణం, ముస్లిములను మభ్య పెట్టి వారికి తాము పన్నుతున్న కుతంత్రాలు తెలియకుండా ఉండాలని, ఆ మస్జిద్ లోకి వచ్చి పోయే వారిపై ముస్లిములు నిఘా ఉంచకుండా ఉండడానికే. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందు వలన ఆ మస్జిద్ లో నమాజు చేయించే కార్యక్రమాన్ని యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు వాయిదా వేశారు. ఇలా మునాఫిక్లులు తమ లక్ష్యసాధనలో కృతకృత్యులు కాలేకపోయారు. అల్లాహ్ వారి ఈ ఎత్తుగడను యుద్ధం నుండి తిరిగివచ్చే లోపలే బట్టబయలు చేశాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం నుండి తిరిగివచ్చిన తరువాత ఆ మస్జిద్ లో నమాజు చేసే బదులు దాన్ని నేలమట్టం చేయించారు. 

రోమనులు, గస్సానుల యుద్ధ సన్నాహాలకు చెందిన ప్రత్యేక వార్తలు 

ముస్లిములు యుద్ధ వార్తలను వింటూ చీకాకులో ఉన్న కాలంలోనే మదీనాకు సిరియా దేశం నుండి నూనె సరఫరా చేసే ‘బన్తీల’ (*)  ద్వారా హఠాత్తుగా హెరిక్స్ నలభై వేల మంది సైనికులతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసి పేరుమోసిన ఓ కమాండరు నేతృత్వంలో యుద్ధానికి పంపిస్తు న్నాడని, ఆ సైన్యం జెండా క్రిందికి క్రైస్తవ తెగలైన లబ్న్ మరియు జిజాములు కూడా వచ్చి చేరాయని, ఆ సైన్యం ముందస్తు దళం ఒకటి ‘బల్కా’ వరకు వచ్చేసిందనే పిడుగులాంటి వార్త వినిపించారు. ఇలా అది ఓ పెద్ద ప్రమాద రూపంలో ముస్లిముల ముందుకు వచ్చిన ప్రత్యేక యుద్ధ సంబంధమైన 

(*) సాబిత్ బిన్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఉత్తర హిజాలో మంచి పలుకుబడిగల ధనవంతులు. పతనావస్థకు చేరి క్రమక్రమంగా మామూలు రైతులుగా, వ్యాపారులుగా మారిపోయినవారు వీరు

మరింత జటిలంగా మారిన పరిస్థితులు 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, వాటికితోడు మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. విపరీతమైన ఎండ వేడిమికి తోడు ప్రజలు కరవు వల్ల బాధపడు తున్నారు. వెళ్ళడానికి వాహనాలు కూడా తక్కువే. మదీనాలో పండే పండు పంటకొచ్చాయి. కాబట్టి ప్రజలు మదీనాను వదలక నీడపట్టున ఉండి పంటను దక్కించుకుందామనే ధోరణిలో ఉన్నారు. వెంటనే బయలుదేరడానికి సిద్ధపడడం లేదు. అదేకాకుండా దూరప్రాంతానికి వెళ్ళడం, మార్గంలో ఏర్పడే అవరోధాలు ఓ ప్రక్క పీడించనారంభించాయి వారిని. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుని ఖచ్చితమైన నిర్ణయం

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితులను, జరుగబోయే మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాత్మకమైన ఘడియలో గనక ముస్లిములు రోమనులతో యుద్ధం చేయడానికి బద్దకించి ముస్లిముల ప్రాంతాల్లోనికి చొరబడే వీలు కలిగిస్తే, వారు మదీనా పై దండెత్తి వస్తే గనకా, ఇస్లామీయ సందేశం పై చెడు ప్రభావాలు పడతాయి. ముస్లిమ్ సైన్యానికి ఇప్పటి వరకు వచ్చిన కీర్తికాస్తా మంటగలిసిపోతుంది. ‘హునైన్’ యుద్ధంలో చావుదెబ్బ తిని తుది శ్వాస వదులుతున్న అజ్ఞానం తిరిగి బ్రతికి బట్టకడుతుంది. సమయం కోసం కాచుకొని అబూ ఆమిర్ ఫాసిక్ ద్వారా రోమను చక్రవర్తితో సంబంధాలు ఏర్పర్చుకున్న మునాఫిన్లు, రోమనులతో తలపడబోతున్న ముస్లిములకు వెన్నుపోటు పొడవడానికి కాచుకొని కూర్చున్నారు. ఇలా ఇప్పటి వరకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన అనుచరగణం ఇస్లామ్ వ్యాప్తికి చేసిన కృషి అంతా బూడిదలో బోసిన పన్నీరులా వృధా అయిపోగలదు. ఎడతెగని రక్తపాత సహిత యుద్ధాలు, సైనిక చర్యల ద్వారా సంపాదించిన విజయాలు కాస్తా అపజయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది. 

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఫలితాలను పూర్తిగా బేరీజు వేసుకుం టూనే ఉన్నారు. అందుకని, ఓ వైపు విషమ పరిస్థితులు, మరో వైపు దారిద్ర్యం పీడిస్తున్నప్పటికీ, రోమనులను దారుల్ ఇస్లామ్ (మదీనా) వైపునకు పురోగ మించే వెసులుబాటును కల్పించే బదులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామే స్వయాన వారి ప్రాంతాల్లోనికి చొరబడి వారికి వ్యతిరేకంగా ఓ నిర్ణయాత్మకమైన యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

రోమనులతో యుద్ధానికి సన్నాహాలు 

ఈ వ్యవహారాన్ని గురించి బాగా సమీక్షించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయులు సహాబా (రదియల్లాహు అన్హుమ్)లకు, యుద్ధం గురించిన సన్నాహాలు ప్రారంభిం చమని ప్రకటించారు. అరబ్బు తెగలు, మక్కా ప్రజల్ని కూడా యుద్ధం కోసం బయలుదేరండనే సందేశం పంపించారు. ఏ గజ్వాకైనా వెళ్ళేటప్పుడు దైవప్రవక్త 

(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల దృష్టిని మరో వైపునకు మళ్ళించడం రివాజు. కాని పరిస్థితి జటిలత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “మనం రోమనులతో యుద్ధానికి వెడుతున్నాం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జిహాద్’ గురించి ప్రజల్ని ప్రేరేపించారు. దివ్యఖుర్ఆన్లోని ‘తౌబా’ సూరాలోని ఓ భాగం ఈ సందర్భంలోనే అవతరించింది. దీనికితోడు, ఆయన దానధర్మాల ప్రాశస్త్యం గురించి చెబుతూ, అల్లాహ్ మార్గంలో ప్రియమైనది, మేలైనది అయిన దాన్ని వెచ్చించమని ప్రోత్సహించారు. 

యుద్ధ సన్నాహాలకు ముస్లిముల ఉరుకులు పరుగులు 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రకటన వినగానే, రోమనులతో యుద్ధం చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. తెగలు, మిత్రపక్షాలు నలువైపుల నుండి మదీనాకు వచ్చిచేరనారంభించాయి. ఎవరి మనస్సుల్లోనైతే కపటం నాటుకుపోయిందో వారు తప్ప ప్రతి ముస్లిమ్ ఆ గజ్వాకు వెళ్ళడానికి వెనుకాడలేదు. అయితే ముస్లిములలోనే ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే ఆ గజ్వాలో చేరకుండా ఆగిపోయారు. వారు కపట ముస్లిములు కారు, నిజమైన ముస్లిములే. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిములు సైతం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుల వద్దకు వచ్చి యుద్ధంలో పాల్గొనడానికి తమకు ఏదైనా వాహనాన్ని సమకూర్చమని ప్రాధేయపడనారం భించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వద్ద ఏదీ లేదని, ఈ విషయంలో నేను నిస్సహాయుడనని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. దివ్యఖుర్ఆన్ ఈ సందర్భాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది. 

“నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే, గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు.” (9 : 92) 

ఇలాగే ముస్లిములు దైవమార్గంలో ధనాన్ని వెచ్చించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు), సిరియా దేశం వెళ్ళడానికిగాను వ్యాపార సామగ్రి మూటలు గల రెండు వందల ఒంటెలను, వాటితో సహా రెండు వందల ఓకియాల వెండి (దాదాపు ఇరవై తొమ్మిదిన్నర కిలోల వెండి) తయారు చేసి ఉన్నారు. ఆయన దీన్నంతటిని యుద్ధం కోసం దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అదనంగా ఓ వంద ఒంటెల్ని ప్రయాణ సామగ్రితో సహా సదఖా చేశారు. అది ఇచ్చిన తరువాత ఒక వెయ్యి దీనారాలు (దాదాపు అయిదున్నర కిలోల బంగారం) తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒడిలో పొసేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ దీనారాలను చేతితో ఇటు అటు కదిలిస్తూ ఈ రోజు ఉస్మాన్ ఏది చేసినా ఆయనకు నష్టాన్ని చేకూర్చదు ‘* అననారంభించారు. ( *జామిఆ తిర్మిజీ: మనాఖిబ్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్-2/2111 )

అదే కాకుండా హజ్రత్ ఉస్మాన్ మళ్ళీ మళ్ళీ సదఖా చేస్తూనే ఉన్నారు. అలా ఆయన సదఖా చేసిన ధనం గాక, ఒంటెల సంఖ్య తొమ్మిది వందలు, గుర్రాల సంఖ్య నూరు వరకు చేరిపోయింది. 

ఇటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తన రెండొందల ఓకియాలు (అంటే ఇరవైతొమ్మిదిన్నర కిలోల వెండి) తీసుకొచ్చి సమర్పించారు. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన దగ్గర ఉన్నదంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చి పడవేశారు. ఆయన భార్యాపిల్లల కోసం మిగిల్చి ఉంచింది కేవలం అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మాత్రమే. ఆయన చేసిన సదఖా ధనం మొత్తం నాల్గు వేల దీర్ఘములు. ఆయనే ఈ సదఖా తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించినవారిలో ప్రథముడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వద్ద ఉన్న సొత్తులోని సగభాగం తీసుకొని వచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా పెద్ద మొత్తంలోనే ధనాన్ని తెచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. వారే కాకుండా హజ్రత్ తలా (రదియల్లాహు అన్హు), సఅద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)లు కూడా తగినంత డబ్బును సదఖాగా ఇచ్చారు. హజ్రత్ ఆసిమ్ బిన్ అద్దీ (రదియల్లాహు అన్హు) తొంభై వస్క్ ల (అంటే పదమూడున్నర వేల కిలోలు లేదా పదమూడున్నర టన్నుల) ఖర్జూరాలు తీసుకువచ్చారు. తక్కిన సహాబాలు కూడా ఒకరి తరువాత ఒకరు తమకు తోచిన సదఖా తెచ్చి ఇచ్చారు. చివరికి శక్తి లేనివారు కూడా ఒకటో రెండో ముద్దు (ఖర్జూరాలు) సదఖాగా ఇచ్చారు. మహిళలు కూడా తమ కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్ళ పట్టీలు, చెవుల రింగులు, ఉంగరాలు వగైరాలు వారి శక్తి మేరకు తెచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. ప్రతివారూ పిసినారితనాన్ని ప్రదర్శించకుండా సదఖ ఇచ్చినవారే. కేవలం మునాఫిన్లు ఒక్కరే ఒకరిని మించి ఒకరు సదఖా చేయడం చూసి (వీరు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్న సదఖా అని) తూలనాడనారంభించారు. తమ వద్ద ఇవ్వడానికి ఏమి లేని పేద ముస్లిములెవరైనా ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకొని వస్తే వారిని చూసి ఈ మునాఫిక్లు, ఓహో ఈ ఖర్జూరాలతో కైజరు సామ్రాజ్యాన్ని జయిస్తారు కాబోలు అని హేళన చేసేవారు. (9 : 97) 

తబూక్ కు బయలుదేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)ను, మరో ఉల్లేఖనంలో చెప్పబడి నట్లుగా సబా బిన్ అరఫ్తా (రదియల్లాహు అన్హు)ను మదీనాకు గవర్నరుగా నియమించారు. . హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని తమ కుటుంబ సభ్యులకు సంరక్షకులుగా చేసి మదీనా లోనే ఉండమని చెప్పి ఆదేశించారు. కాని మునాఫిన్లు ఆయన్ను తూల నాడడం వలన ఆయన బయలుదేరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఆయన్ను మదీనాకు పంపిస్తూ, “ఏమిటీ! నీకూ నాకూ ఉన్న అనుబంధం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)తో ఉన్న అనుబంధం లాంటిది అనే విషయాన్ని గ్రహించలేదా? అయితే నా తరువాత మరో ప్రవక్త రాడు అనే విషయం తెలుసుకో” అని అన్నారు. 

ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్తర దిశ వైపునకు బయలుదేరారు. (నిసాయీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రకారం అది గురువారం) గమ్యం తబూక్. సైన్యం పెద్దది. ముప్ఫై వేల మంది యోధులతో కూడిన సైన్యం అది. అంతకు పూర్వం ముస్లిములు అంత పెద్ద సైన్యాన్ని ఎప్పుడూ సమీకరించలేదు. అందుకని, ముస్లిములు దానికోసం తమ శాయశక్తులా ధనాన్ని సమకూర్చి నప్పటికీ సైన్యానికి కావలసిన హంగుల్ని సమకూర్చలేకపోయారు. అప్పటికీ వాహనాలు, తినుబండారాలు బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పద్దెనిమిదేసి మంది సిపాయీలకు ఒక్కొక్క ఒంటె కేటాయించబడింది. వారు దాని పై వంతుల వారీగా స్వారీ చేస్తూ వెడుతున్నారు. అలాగే తినుబండారాల కొరత వల్ల అప్పుడప్పుడు చెట్ల ఆకుల్ని సైతం తినవలసి వచ్చింది. ఆ ఆకుల్ని తినడం వలన వారి పెదాలు వాచిపోయాయి. విధిలేక ఒంటెల కొరత ఉన్నప్పటికీ వాటిని జిబహ్ చేసి దాని ప్రేవుల్లో ఉన్న నీటిని త్రాగవలసి వచ్చింది. అందుకొరకే ఆ సైన్యం పేరు ‘జైషే ఉగ్రత్’ (అంటే కష్టాలు అనుభవించిన సైన్యం) అని పడిపోయింది. తబూక్ కు వెళ్ళేటప్పుడు ఈ సైన్యం ‘ హిజ్ర్ (అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం) గుండా వెళ్ళవలసి వచ్చింది. సమూద్ జాతి ‘వాదియిల్ ఖురా’లో బండరాళ్ళను తొలిచి ఇండ్లను నిర్మించుకున్న జాతి. సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడి ఓ బావి నుండి నీటిని నింపుకున్నారు. కాని బయలుదేరే టప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో, “మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి, ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వుజూ కూడా చెయ్యొద్దు. ఆ నీటితో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో, దాన్ని పశువులకు పెట్టేయండి. ఆ పిండి తినకండి. మీరు సాలెహ్ (అలైహిస్సలాం)గారి ఒంటె నీళ్ళు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి” అని ఆదేశించారు. 

‘సహీ హీన్’ గ్రంథంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం ఒకటుంది. అందులో ఆయన ఇలా సెలవిస్తున్నారు: 

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ హిజ్ర్ (లేదా సమూద్ జాతి నివాసం) గుండా వెడుతూ, ‘ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి. వారి పై పడిన ఆపద మీ పైనా పడవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో మూలిగే హృదయాలు రోదిస్తూ నడిచినట్లు నడవండి’ అన్నారు. ఆ పిదప ఆయన తన తల పై వస్త్రం కప్పుకుని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను దాటారు.” [సహీహ్ బుఖారీ- హిజ్ర్ లోయలో ప్రవేశించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే అధ్యాయం-2/637]

మార్గమధ్యంలో సైన్యానికి నీరు కరవై విలవిలలాడిపోతోంది. ఈ విషయం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు కొందరు. ప్రవక్త మహ నీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను మొర పెట్టుకోగా అల్లాహ్ మేఘాలను పంపించాడు. అవి బాగా వర్షించగా జనం తనవితీరా దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా అవసరానికి కావలసినంత నీటిని నింపుకోవడం జరిగింది. 

ఇక తబూక్ దాపుకు చేరుతారనగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యాన్ని ఉద్దేశించి, “ఇన్షా అల్లాహ్, మీరు రేపటికల్లా తబూక్ యొక్క నీటి చెలమను చేరుకో గలరు. అయితే చార్జ్ సమయానికి ముందు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి 

అక్కడికి వెళ్ళినవాడు ఏ ఒక్కడు కూడా నేను చేరనంత వరకు ఆ నీటిని ముట్టుకోవద్దు సుమా!” అని హెచ్చరించారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “మేము అక్కడికి చేరేలోపలే ఇద్దరు వ్యక్తులు ఆ చెలమ దగ్గరికి వెళ్ళడం గమనించాం. ఊట బావి(చెలమ) నుండి కొద్దికొద్దిగా నీరు ఊరుతోంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిద్దరిని ఉద్దేశించి, ‘మీరు ఈ నీటిని ముట్టుకున్నారా?’ అని అడగగా, ‘అవును’ అని బదులిచ్చారు వారు. ఆ ఇద్దరికి దైవాదేశం మేరకు ఏం చేప్పాలో చెప్పి, ఆ చెలమ నుండి తన ఒక అర చేతిని దొప్పగా చేసి వచ్చిన నీటిని బయటకు తీయనారంభించారు. అలా తీయగా వచ్చిన కొద్దిపాటి నీటితో తన ముఖాన్ని, చేతుల్ని కడిగి తిరిగి ఆ నీటిని ఆ చెలమలో పోసేశారు. ఆ తరువాత ఆ చెలమలో పుష్కలంగా నీరు ఊరనారంభించింది. సహాబా (రదియల్లాహు అన్హుమ్) తనవితీరా ఆ నీటిని త్రాగారు. ఆ తరువాత నన్నుద్దేశించి, ‘ఓ ముఆజ్! నీవే గనక బ్రతికి ఉంటే ఈ ప్రదేశాన్ని తోటలతో సస్యశ్యామలంగా అలరారుతున్నట్లు చూస్తావు’ అని చెప్పారు.” [ ముస్లిమ్- ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం-2/246]

మార్గం మధ్యలోనో లేదా తబూక్ కు చేరిన తరువాతనో- ఉల్లేఖనాల్లో కొంత భేదం ఉంది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఈ రాత్రి మి మీదికి పెద్ద ఇసుక తుఫాను ఒకటి వచ్చిపడబోతోంది. అందుకని ఏ ఒక్కడూ లేచి నిలబడకూడదు. ఒంటెగలవాడు దాన్ని త్రాటితో గట్టిగా కట్టేయాలి” అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లుగానే ఆ రాత్రి తీవ్రమైన గాలి దుమారం చెలరేగింది. వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడగా ఆ గాలి దుమారం అతణ్ణి ఎగిరేసుకుపోయి రెండు కొండల నడుమ విసరేసింది. ” [ముస్లిమ్-ముఆజ్ బిన్ జబల్  ఉల్లేఖనం -2/246]

తబూక్ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జొహ్రీ మరియు అశ్ నమాజులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేసేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు నమాజుల్ని జమా తస్లిమ్ గాను, జమా తాఖీ గానూ చేసేవారు. (‘జమా తస్లీమ్’ అంటే జొహ్రీ మరియు అస్త్ నమాజులు జొహ్ర నమాజు వేళ అయినప్పుడు, మగ్రిబ్, ఇషా నమాజులు మగ్రిబ్ వేళ అయినప్పుడు చేయడం. ఇక ‘ జమా తాకీర్’ అంటే, జొన్గా, అత్ నమాజులు అన్ నమాజు వేళలో, మగ్రిబ్, ఇషా నమాజులు ఇషా నమాజు వేళలో చేయడం) 

తబూక్ కు చేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం తబూకకు చేరి గుడారాలను వేసుకొని, రోమనులతో తలబడడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానుద్దేశించి, విశాలమైన భావాలు స్ఫురించేటట్లుగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇహపరలోకాల సాఫల్యం గురించి ప్రోత్సహించారు. అల్లాహ్ శిక్ష ఎలాంటిదో చూపుతూ భయ పెట్టారు. యుద్ధానంతరం లభించబోయే వరాలు, బహుమానాలకు సంబంధించిన శుభవార్తనిచ్చారు. ఇలా సైన్యం యొక్క ధైర్యసాహసాలు పెరిగినట్లయింది. వారిలో ఇప్పటి వరకు, తినుబండా రాలు, ఇతర వస్తువుల లేమి గురించి బాధపడుతున్న లోపాలన్నీ తొలగి పోయాయి. మరో ప్రక్క రోమను సామ్రాజ్యానికి మద్దతుగా వచ్చిన తెగలు, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక గురించి విని భయభీతులైపోయాయి. ముందుకొచ్చి ముస్లిమ్ సేనను ఢీకొనడానికి ధైర్యం చాలక, దేశంలోని వివిధ పట్టణాల వైపునకు పారిపోనారంభించాయి. వారి ఈ వైఖరి ప్రభావం, అరేబియా ద్వీపం లోనే కాకుండా, బయటి వారి పైనా పడింది. ముస్లిముల ఘనకీర్తికి మరింత బలం చేకూరినట్లయింది. ముస్లిములకు, యుద్ధం ద్వారా సాధించ లేని రాజకీయ ప్రయోజనాలు ఒనగూడాయి. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇక్కడ సమీక్షిద్దాం. 

‘అయిలా’ పాలకుడు ‘యక్నా బిన్ రౌబా’ వెంటనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై జిజియా కట్టడానికి ఒప్పుకున్నాడు. సంధి ఒప్పందం చేసు కున్నాడు. ‘జర్ బా’ మరియు ‘అజ్ రూహ్’ పౌరులు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి జిజియా కట్టడానికి సిద్ధపడ్డారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఓ పత్రాన్ని రాయించి ఇచ్చారు. వారు దాన్ని సురక్షితంగా తమ వద్ద ఉంచు కోవడం జరిగింది. అలాగే ‘అయిలా’ లకునికి కూడా ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) పత్రాన్ని రాసి ఇచ్చారు. అది ఈ క్రింది విధంగా ఉంది.

“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరఫున, యహినా బిన్ రౌబా మరియు అయిలా ప్రజలకు రాసి ఇచ్చిన శాంతి ఒప్పంద పత్రం. భూతలంపైనా, సముద్రం మీదనూ వారి పడవలు మరియు బిడారాల బాధ్యత అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)దే. అలాగే ఈ బాధ్యత ‘యహినా’కు మిత్రులైన సిరియా వారి కోసం కూడాను. అయితే, వారి ఏ వ్యక్తి అయినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అతని ధనం అతని ప్రాణాన్ని రక్షించలేదు. అతని సొత్తును తీసుకున్నవాడికి అది ధర్మసమ్మతమే అవుతుంది. వారు ఏ ఒయాసిస్సుకు వెళ్ళడాన్నిగాని, భూమి మరియు సముద్ర మార్గం పై నడవడాన్నిగాని అడ్డుకోవడం జరుగదు.”

ఇదే కాకుండా మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కు నాల్గు వందల ఇరవై ఉ’రోహకుల పటాలాన్నిచ్చి దూమతుల్ జందల్ పాలకుడు ‘ఉకైదిర్’ వద్దకు పంపించారు. వెళ్ళేటప్పుడు ఆయనతో, “నీవు వెళ్ళేటప్పటికి అతడు జింక వేటలో ఉండగా జూస్తావు” అని కూడా చెప్పారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కోట అగుపడేటంత దూరం వెళ్ళి ఆగిపోయారు. అనుకోకుండా ఓ జింక ఎక్కడి నుండో వచ్చి కోట ద్వారాన్ని కొమ్ములతో చెలుగుతోంది. ఉకైదర్ దాన్ని వేటాడడానికి బయటకు వచ్చాడు. వెన్నెల రాత్రి కావడం వలన, హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు), ఆయనగారి అనుచరులు అతణ్ణి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి క్షమించి, రెండు వేల ఒంటెలు, ఎనిమిది వందల బానిసలు, నాల్గు వందల కవచాలు, నాల్గు వందల బరిశెలు ఇచ్చే షరతు పై ఒప్పందం కుదుర్చుకుని వదలివేశారు. అతను ఇక నుండి జిజియా కూడా కడతా నని ఒప్పుకున్నాడు. ఇలా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యహినాకు తోడు దూమా, తబూక్, అయిలా మరియు తైమాలతో షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్లయింది. 

ఈ పరిస్థితులను గమనించి, ఇప్పటి వరకు రోమనుల చెప్పుచేతల్లో ఉన్న తెగలు, ఇక తమ పాత సంరక్షకులను నమ్ముకొని ఉండే కాలం చెల్లిపోయిందని తలచి ముస్లిములకు సహకరించనారంభించారు. ఈ విధంగా ముస్లిము సామ్రాజ్య సరిహద్దులు విస్తరించి నేరుగా రోమను సామ్రాజ్యంతో కలిసిపోయాయి. రోమనుల తొత్తులు చాలా మట్టుకు అంతమైపోయారు. 

మదీనాకు తిరుగు ప్రయాణం 

ఇస్లామీయ సేన ఎలాంటి యుద్ధం చేయకుండానే విజయకేతనం ఎగురవేస్తూ మదీనాకు తిరిగి వచ్చింది. అల్లాహ్, యుద్ధం విషయంలో మోమిన్ (విశ్వాసుల)కు అండగా నిలిచాడు. అయితే మార్గమధ్యంలో ఓ లోయ వద్ద పన్నెండుగురు మునాఫిక్ కు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఆయన అప్పుడు ఆ లోయగుండా వెళుతున్నారు. హజ్రత్ అమ్మార్(రదియల్లాహు అన్హు) ఒంటె ముకుత్రాడు పట్టుకొని ముందు నడుస్తున్నారు. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఒంటె వెనకాల నడుస్తూ దాన్ని తోలుతున్నారు. మిగిలిన సహాబాలందరూ దూరంగా, ఆ లోయ పల్లపు ప్రదేశం గుండా వస్తున్నారు. అందుకని మునాఫిలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చే దుష్టావకాశం లభించిందనిపించింది. వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపునకు రానారంభించారు. ఇటు ప్రవక్తగారి సహచరులిద్దరు మామూలుగా నడుస్తూనే ఉన్నారు. వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు కాళ్ళ సవ్వడి వినబడింది. వీరంతా ముఖాలపై ముసుగులు కట్టుకొని దాడికి సిద్ధపడడం చూసి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) హుజైఫా (రదియల్లాహు అన్హు)ను వారిని అడ్డగించడానికి పంపారు. ఆయన వారి వాహనాల ముఖాలపై తన బౌలుతో కొట్టనారంభించారు. అల్లాహ్, ఆయన వేసిన దెబ్బలకు భయపడి పోయేటట్లుగా చేయడం వలన వారు పారిపోయి తమ వారి వద్దకు చేరారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేర్లు చెబుతూ వారెందుకు వచ్చారో తెలియజేశారు. అందుకనే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కు, ప్రవక్త ‘నమ్మిన బంటు’గా పేరుబడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించే దివ్య ఖుర్ఆన్లో, “వారు చేయదలిచిన పనిని చేయలేకపోయారు” అనే వాక్యం అవతరించింది. 

ప్రయాణం పూర్తిచేసి మదీనా దాపుకు రాగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీనా గురుతులు కానరాగా ఆయన, “అదిగో ‘తాబా’, అది ఉహద్ కొండ, మనల్ని ప్రేమించేది మనం దాన్ని ప్రేమిస్తున్న కొండ అదిగో” అని సంబరపడుతూ అన్నారు. ఇటు మదీనాలో ఆయన రాక గురించిన వార్త అందగానే స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో ఘనంగా ఆ సైన్యానికి స్వాగతం పలకుతూ ఈ పద్యపాదాలను చదవనారంభించారు° (దాని భావం ఇలా ఉంది): 

“సనీయతుల్ విదా దిగ్మండలం నుండి పొడిచిన పున్నమి చంద్రు డడిగో, మమ్మల్ని పిలిచేవాడు పిలుస్తున్నంత వరకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి.” 

[ఇది ఇబ్నె ఖయ్యిమ్ గారి సూక్తి. దీనిపై చర్చ ఇది వరకే వచ్చింది]

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ కు రజబ్ నెలలో బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి రమజాన్ నెల నడుస్తోంది. ఈ ప్రయాణం మొత్తం యాభై రోజుల ప్రయాణం. ఇరవై రోజులు తబూక్ లో గడిపినవి, ముప్ఫై రోజులు అక్కడికి వెళ్ళిరావడానికి జరిగిన ప్రయాణ రోజులు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవితకాలంలో స్వయంగా పాల్గొన్న గజ్వాల్లో ఈ గజ్వా చిట్టచివరి గజ్వా (పోరాటం). 

ముకల్లిఫీన్ (యుద్ధంలో పాల్గొనకుండా వెనుక ఉండిపోయినవారు) 

ఈ పోరాటం, దాని ప్రత్యేక పరిస్థితులననుసరించి, అల్లాహ్ తరఫున ఓ గట్టి పరీక్ష కూడాను. ఈ పోరాటం ద్వారా, విశ్వాసులెవరో, విశ్వాసులు కానివారెవరో తేలిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి వారిని ఏరి చూయించడం అల్లాహ్  సంప్రదాయం. దివ్యఖుర్ఆన్ ఈ విషయాన్ని ఇలా సెలవిస్తోంది: 

“మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏ మాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను, అపవిత్రుల నుంచి తప్పకుండా వేరుచేస్తాడు.” (3:179) 

కాబట్టి ఈ పోరాటంలో విశ్వాసులు, సత్యవంతులందరూ పాల్గొన్నవారే. ఆ యుద్ధంలో పాల్గొనకపోవడమంటే, అది నిఫా కు (కాపట్యానికి) గుర్తు. ఎవరైనా యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో ఆ విషయాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకునేవారు సహాబా (రదియల్లాహు అన్హుమ్). ఆయన దానికి జవాబుగా, “వదిలేయండి! అతని మనస్సులో శ్రేయం పొందాలనే కోరికే ఉంటే, అల్లాహ్ త్వరలోనే అతణ్ణి నా వద్దకు పంపించేస్తాడు. అలా కాకపోతే అతని నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించినట్లే” అని అంటూ ఉండే వారు. ఎలాగైతేనేమి,యుద్ధసామగ్రి, వాహనాలులేక యుద్ధంలో పాల్గొనలేక పోయిన వారు కొందరైతే, మునాఫిక్ కు మరికొందరు. ఈ మునాఫిస్టు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించామని దొంగ నటన చేసినవారు. ప్రస్తుతం వారే దొంగసాకులు చెప్పి ఈ గజ్వాలో పాల్గొనకుండా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతిని పొంది వెనుక ఉండిపోయినవారు. మరికొందరైతే ఎలాంటి అనుమతి లేకుండానే ఇండ్లలో కూర్చుండిపోయారు. అయితే పోరాటంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ముగ్గురు మాత్రం నిజమైన ముస్లిములు, గట్టి విశ్వాసం గలవారే. వారు ఎలాంటి కారణం లేకుండానే యుద్ధంలో పాల్గొనలేదు. వారిని అల్లాహ్ పరీక్షకు గురిచేసిన తరువాత వారి పశ్చాత్తాపాన్ని మన్నించడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

తిరుగు ప్రయాణం చేసి మదీనాకు చేరిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పటిలాగే మస్జిదె నబవీ కి వెళ్ళారు. అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు. ప్రజలు చుట్టుముట్టగా అక్కడనే కూర్చుండిపోయారు. ఇటు మునాఫిక్లులు – వారు ఎనభై మందికంటే ఎక్కువే.”(*) ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదో సాకులు చెప్పనారంభించారు. అల్లాహ్  పై ప్రమాణాలు చేస్తూ తాము రాలేకపోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పైకి చెప్పే దాన్ని స్వీకరించి వారితో బైక్ కూడా చేస్తూ వారి మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. వారి మనస్సులోని విషయాన్ని దైవానికే వదలివేశారు

(*) వాకిదీ కథనం ప్రకారం, ఈ సంఖ్య అన్సారులలోని మునాఫిక్ లది. వారే కాకుండా బనీ గిఫ్ఫార్ వగైరా బద్దూ తెగల వారి సంఖ్య ఎనభై ఇద్దరు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై, అతని సహచరులు వారికి అదనం. వారు కూడా చాలా మందే ఉన్నారు. (చూడండి, ఫహుల్ బారి-8/119) 

ఇక మిగిలిన వారు ముగ్గురు మోమిన్లు, సత్యసంధులు – అంటే హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), మురారా బిన్ రబీ (రదియల్లాహు అన్హు), హిలాల్ బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు)లు- వారు నిజాన్నే అనుసరిస్తూ, “మేము ఎలాంటి కారణం లేకుండానే పోరాటంలో పాల్గొనలేదు” అని ఉన్న విషయం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సంభాషణ చేయవద్దని సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను ఆదేశించారు. కాబట్టి ఈ ముగ్గురికి వ్యతిరేకంగా తీవ్రమైన బాయికాట్ (సామాజిక వెలి) ప్రారంభం అయింది. ప్రజలంతా ఒక్కసారే మారిపోయారు. జీవితం భయంకరంగా మారిపోయింది. ఇంత పెద్ద వైశాల్యం గల భూమి ఒక్కసారే ఇరుకైనట్లనిపించింది వారికి, అదేకాదు ప్రాణాలు కూడా పోయేటంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అలా నలభై రోజులు గడిచిన తరువాత భార్యల వద్దకుపోవడం కూడా మానుకొమ్మనే ఆదేశం వెలువడింది. బాయికాట్ కు సంబంధించిన యాభై రోజులు పూర్తి అయిన తరువాత అల్లాహ్ వారి తౌబా స్వీకరించబడినట్లు శుభవార్త అందించాడు. దివ్యఖుర్ఆన్ లోని ఈ శుభవార్త వాక్యాలు ఇలా ఉన్నాయి. 

“ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా, భూమి వారికి ఇరుకై పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించే వాడూను.” (9 : 118) 

ఈ తీర్పు వెలువడగానే ముస్లిములందరూ సాధారణంగానూ, ఆ ముగ్గురు సహాబాలు (6) ప్రత్యేకంగాను సంబరపడిపోయారు. ప్రజలు పరుగున వచ్చి వారికి ఈ శుభవార్తను అందించనారంభించారు. వారి ముఖాలు ఆనందాతిశయంతో విప్పారిపోయాయి. ప్రజలు వారికి కానుకలు అర్పించనారంభించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వారికి ఎంతో విలువైన రోజు. 

అలాగే మరెవరైతే చేతకాక వివశులై ఆ సంగ్రామంలో పాల్గొనలేక పోయారో వారిని గురించి అల్లాహ్ ఈ క్రింది ఆయత్ లను అవతరింపజేశాడు. 

“వృద్ధులు, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనడానికి దారి భత్యాలు లేని వారూ ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విశ్వాసపాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.” (9 : 91,92) 

మదీనాకు దాపుగా వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విషయంలోనే, “మదీనాలో కొందరున్నారు. వారు మీరు ఏయే ప్రదేశాల నుండి ప్రయాణం చేశారో, ఏ లోయల్ని దాటారో అప్పుడు మీ వెంటే ఉన్నారు, వారిని కొన్ని అనివార్య కారణాలు మీ వెంట రాకుండా చేశాయి” అని అనగా, “ఓ దైవప్రవక్తా! వారు మదీనాలో ఉంటూనే మన వెంట ఉన్నారా?” అని అడిగారు అనుచరులు. “అవును, మదీనాలో ఉండి కూడా వారు మీ వెంటే ఉన్నారు” అని సమాధానమిచ్చారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). 

ఈ పోరాట ప్రభావం 

ఈ సంగ్రామం అరేబియా ద్వీపంపై, ముస్లిముల ప్రభావం విస్తరింప జేయడానికి, బలం చేకూర్చడానికి ఎంతో దోహదపడింది. ఇక అరేబియా ద్వీపంలో ఇస్లామ్ శక్తి తప్ప మరే శక్తి జీవించి ఉండజాలదు అనే విషయం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అదను కోసం ఎదురుచూస్తున్న మునాఫిక్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. వీరు రోమను సామ్రాజ్యంపై పెట్టుకున్న 

ఆశలు ఈ సంగ్రామంతో అడుగంటిపోయాయి. అందుకని వారి ధైర్యం కాస్తా సన్నగిల్లి, యదార్థం ముందు మోకరిల్లడం తప్ప మరే మార్గం వారికి లభించలేదు. 

ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇక ముస్లిములు, మునాఫిక్స్ ఎడల మృదువైఖరిని అవలంబించే అవసరమే లేకుండాపోయింది. అల్లాహ్ వారి ఎడల కఠిన వైఖరిని అవలంబించమని ఆదేశం ఇస్తూ, చివరకు వారు ఇచ్చే దానధర్మాలను కూడా స్వీకరించడంగాని, వారి జనాజా నమాజు చేయడం గాని, వారి మన్నింపు కోసం ప్రార్థించడంగాని చేయవద్దని ఆదేశించడం జరిగింది. అలాగే వారి సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని, మస్జిద్ పేరు మిద వారేదైతే కుట్రల గూడు కట్టుకున్నారో దాన్ని పడవేయమని ఆదేశిం చాడు. వాటి గురించి అవతరింపజేసిన ఆయలు వారిని పూర్తిగా బట్టబయలు చేసివేశాయి. ఇక వారిని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు లేకుండా పోయింది. అంటే, ఈ ఖుర్ఆన్ ఆదేశాలు, మదీనా ప్రజలు తెలుసుకునేటట్లు వారి బండారం బయట పెట్టాయన్నమాట.” *

* ఈ గజ్వా (సంగ్రామం) గురించిన వివరాలు ఈ క్రింది ఆధారాల నుండి గ్రహించ బడ్డాయి. ఇబ్నె హషామ్-2/515 – 517, జాదుల్ ముఆద్-3/2 – 13; సహీ బుఖారి -2/633 – 637, 1/252, 414 వగైరా; సహీహ్ ముస్లిమ్ షరా నూవీ-2/246; ఫత్ హుల్ బారి-8/110 – 126, ముక్తసరుస్సీరత్- షేక్ అబ్దుల్లాహ్, పుట. 291 – 407) 

ఈ సంగ్రామానికి సంబంధించి అవతరించిన ఖుర్ఆన్ ఆదేశాలు 

ఈ గజ్వాకు సంబంధించి తౌబా సూరా (కౌ అధ్యాయం)లో అనేక ఆయలు అవతరించాయి. కొన్ని గజ్వాకు బయలుదేరక పూర్వం అవతరిస్తే, మరికొన్ని బయలుదేరి వెళ్ళిన తరువాత ప్రయాణ సందర్భంగాను, మరికొన్ని మదీనాకు తిరిగి వచ్చిన తరువాతనూ అవతరించాయి. ఈ ఆయత్ లలో చిత్తశుద్ధిగల విశ్వాసుల ఔన్నత్యం ఎలాంటిదో చెప్పడం జరిగింది. అదే కాకుండా, ఈ ఆయత్ లలో, గజ్వాలో పాల్గొన్నవారు, గజ్వాలో పాల్గొనలేక పోయిన విశ్వాసులు, సత్యసంధుల తౌబా (పశ్చాత్తాపం) స్వీకరించబడిన విషయమూ వగైరాలు ఉన్నాయి.

ఆ సంవత్సరపు కొన్ని ప్రముఖ సంఘటనలు 

ఆ సంవత్సరం (అంటే హిజీ శకం 9)లో చారిత్రాత్మకమైన సంఘట నలు అనేకం చోటు చేసుకున్నాయి. 

1. తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత, ఉవైమిర్ అజ్ఞానీ మరియు ఆయన భార్య నడుమ ‘లిఆన్’ (రంకు విషయమై ఏర్పడిన జగడం) జరిగింది. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తాను వ్యభిచరించినట్లు చెప్పిన స్త్రీకి ‘రజ్మ్’ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) వేయబడింది. ఆ స్త్రీ పురుడు పోసుకొని, పిల్లవాడు పాలు త్రాగడం మానినప్పుడు గాని ఆమెను రజ్జ్ చేయడం జరగలేదు. 

3. అబిసీనియా చక్రవర్తి ‘అస్మహా నజాషీ’ మరణించగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ‘గాయిబానా’ (పరోక్ష) నమాజె జనాజా చేశారు. 

4. ఆ సంవత్సరమే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుత్రిక ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) చనిపోయారు. ఆమె మరణం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శోకసముద్రంలో ముంచివేసింది. తన అల్లుడు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒకవేళ నాకు మూడవ కుమార్తె ఉండి ఉంటే ఆమె వివాహం కూడా నీతో చేసేవాన్నే” అన్నారు. 

5. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత మునాఫిక్స్ సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని మన్నింపు కోసం దుఆ చేశారు. హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఆయన్ను వారిస్తున్నప్పటికీ అతని నమాజె జనాజా చేశారు. ఆ తరువాత దివ్యఖుర్ఆన్లో, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను బలపరుస్తూ, మునాఫిక్స్ నమాజె జనాజా చేయకూడదనే ఆదేశం అవతరించింది. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.


اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.

ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.

మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.

ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.

ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.

ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.

అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.

ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.

అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.

కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.

ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!

ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.

సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.

సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.

అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.

సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.

ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741

సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

షవ్వాల్ మాసంలో జరిగిన సీరత్ (చారిత్రిక) సంఘటనలు – అరబీ ఖుత్బా తెలుగు అనువాదం [వీడియో]

షవ్వాల్ మాసంలో జరిగిన సీరత్ (చారిత్రిక) సంఘటనలు – అరబీ ఖుత్బా తెలుగు అనువాదం [వీడియో]
వక్త: షేక్ రాషిద్ అల్ బిదా (హఫిజహుల్లాహ్) | ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [35 నిముషాలు]
https://youtu.be/8O-gyQXN6oE

సీరతే సహాబియ్యాత్ – ఉమ్ముల్ ఫజ్ల్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర (ఇబ్నె అబ్బాస్ తల్లి గారు) [వీడియో]

బిస్మిల్లాహ్
ఉమ్ముల్ ఫజ్ల్ (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర (ఇబ్నె అబ్బాస్ తల్లి గారు) – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[35 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం ఇక్కడ వినండి :
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర
: https://youtu.be/DftBKf6r4MA

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) [వీడియో]

బిస్మిల్లాహ్
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) త్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సీరతే సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM