ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)

యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తయిన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది. వారి బలసామర్ధ్యాల వల్ల, వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కాని భౌతికంగా వారు సాధించిన ప్రగతీ వికా సాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు.

అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కాని వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు. అల్లాహ్ పాటు వారు అనేక దేవీదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది.

అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనే హూద్ (అలైహిస్సలాం). ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో, దృఢసంకల్పంతో, సహనంతో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ, “ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల లాభం ఏముంది? మీ స్వంత చేతులతో . మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. దేవుడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయనే అల్లాహ్. ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు పోషణనిస్తున్నాడు. ఆయనే మీకు జీవన్మరణాలు ఇస్తున్నాడు” అని చెప్పారు. ‘అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకూ పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు.

హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హూద్ (అలైహిస్సలాం)తో వాదనకు దిగారు. “హూద్ ! నీవు చెబుతున్న దేమిటి? ఈ దేవీదేవతలు అల్లాహ్ తో మా తరఫున సిఫారసు చేస్తాయి” అని. దబాయించారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ప్రజలారా! అందరి దేవుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయన మీ బృహద్ధ మనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీ కోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో! కాని మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి” అన్నారు.

కాని వారు హూద్ (అలైహిస్సలాం) మాటలను తిరస్కరించారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “హూద్! నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే. అలాంటప్పుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవీ బాధ్యతలను అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాడుతున్నావు” అన్నారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది. ప్రతి వస్తువులోనూ ఒక సూచన ఉంది. కాబట్టి ఆయన్ను విశ్వసించండి. ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. ఆయన కారుణ్యానికి దూరం కావద్దు. పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటిచెబుతున్నాయి. కాని వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు మీ సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు” అని హెచ్చరించారు. కాని ఆ ప్రజలు ఆయన బోధనలను పెడచెవిన పెట్టారు. హూద్ (అలైహిస్సలాం) తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో, “అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహు మాత్రమే భయపడతాను” అన్నారు.

ఒక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లమబ్బు కప్పివేయడాన్ని చూశారు. వర్షం వస్తుందని వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. హూద్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు.

భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు, ఏడు రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. కేవలం హూద్ (అస), ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారు అక్కడి నుంచి ‘హద్రమౌత్’కు వలస పోయారు. వారు అక్కడ ఒకేదేవుడు అల్లాహ్ ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 7:65-72, 11:50-60, 26:123-140)

ఇటీవల స్పేస్ షటిల్ నుంచి తీసుకున్న ఆధునిక రాడార్ ఇమేజ్ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఓమ్మాన్ ని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తయిన టవర్లను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని “ఖాళీ ప్రదేశం” (ఎంప్టీ క్వార్టర్)గా పిలువడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్యఖుర్ఆన్ తప్ప మరో మతగ్రంథం లేదా ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ

మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.

7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ

దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.

7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ

“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.

7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.

7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్‌ మిమ్మల్ని నూహ్‌ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్‌ బోధపరచాడు.

7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ

“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.

7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ

అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్‌ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”

7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ

ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.

11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

మరి మేము ఆద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”

11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ

“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”

11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ

“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”

11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

దానికి వారు, “ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.

11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ

పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్‌ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్‌ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”

11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.

11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.

11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ

ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”

11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.

11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.

11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.

26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ

ఆద్‌ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.

26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

అప్పుడు వారి సోదరుడైన హూద్‌, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?

26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.

26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ

“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.

26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ

“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?

26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!

26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?

26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.

26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ

“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.

26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ

“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).

26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”

26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ

వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.

26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ

“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.

26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”

26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.

26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.