సజ్జహ్ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త ﷺ ను గౌరవించండి | తఖ్వియతుల్ ఈమాన్

ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్జహ్ చేసింది. (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్జహ్ చేస్తున్నాయి. మీకు సజ్జహ్ చేయడంలో వాటికంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)

మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటి వారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారి కంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల(దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.

ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు : నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్జహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అనుకున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాల్లో ప్రజలను రాజుకు సజ్జహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సబ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్జహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు.(హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్: 2140)

దీని ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు చెప్పదలసిన విషయం ఏమిటంటే – ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను. అలాంటప్పుడు నేను సజ్జహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్జహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్జహ్ చేయకూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్జహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి దేవుడు కాలేడు. దాసునిగానే ఉంటాడు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం లోని 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.

ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?

చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:

أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.

ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.

అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.

ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.

కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?

ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

సజ్దా చేసే సరైన విధానం

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,

سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు

అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

సజ్దా చేసే సరైన విధానం

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

సజ్దాలో చేసుకొనే ప్రవక్త దుఆలు

1.సుబ్ హాన రబ్బియల్ అఅలా. (ముస్లిం 772).

سُبْحَانَ رَبِّيَ الأعلَى

(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).

ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్. (ముస్లిం 487).

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ

(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్. (అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. (ముస్లిం 483).

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ

(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు).

6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ

(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ

(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) ఈ హదీసు ఆధారంగా:

దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి“. (ముస్లిం 482).

పుస్తకం నుండి: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా