సజ్జహ్ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త ﷺ ను గౌరవించండి | తఖ్వియతుల్ ఈమాన్

ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్జహ్ చేసింది. (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్జహ్ చేస్తున్నాయి. మీకు సజ్జహ్ చేయడంలో వాటికంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)

మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటి వారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారి కంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల(దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.

ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు : నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్జహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అనుకున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాల్లో ప్రజలను రాజుకు సజ్జహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సబ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్జహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు.(హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్: 2140)

దీని ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు చెప్పదలసిన విషయం ఏమిటంటే – ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను. అలాంటప్పుడు నేను సజ్జహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్జహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్జహ్ చేయకూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్జహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి దేవుడు కాలేడు. దాసునిగానే ఉంటాడు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం లోని 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/