క్రైస్తవుని కపట చేష్టలు

1772. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి పూర్వం క్రైస్తవుడు, ఆ తరువాత ముస్లిం అయ్యాడు. అతను బఖరా, ఆలి ఇమ్రాన్ సూరాలు నేర్చుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కార్యదర్శి అయ్యాడు. అయితే కొన్నాళ్ళకు అతను మళ్ళీ క్రైస్తవుడయిపోయి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు నేను వ్రాసిచ్చిన విషయాలు మాత్రమే తెలుసు (అంతకు మించి మరేమీ తెలియదు)” అని (నలుగురితో) చెప్పడం మొదలెట్టాడు. తరువాత కొంతకాలానికి అతను చనిపోయాడు. క్రైస్తవులు అతని శవాన్ని సమాధి చేశారు. కాని మరునాడు ఉదయం వెళ్లి చూస్తే అతని శవాన్ని భూమి బయటికి విసరి పారేసింది. అప్పుడా క్రైస్తవులు “ఇది ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),  ఆయన అనుచరులు చేసిన పనే. మా ఈ మనిషి వాళ్ళను వదలిపెట్టి వచ్చాడు గనక వారే ఇతని సమాధిని త్రవ్వి ఉంటారు” అని అనుకున్నారు. ఆ తరువాత వారు మరోచోట వీలైనంత లోతుగా గొయ్యి త్రవ్వి అందులో ఆ శవాన్నితిరిగి  పూడ్చి పెట్టారు. అయితే ఆ మరునాడు ఉదయం వెళ్లి చూస్తే (మళ్ళీ అదే దృశ్యం) భూమి అతని శవాన్ని బయటికి విసిరి పారేసింది. అప్పుడు వారికి అర్ధమయింది – ఇది మానవుల పని కాదని (ఇతరులకు గుణపాఠం కోసం ఇతనికి దేవుడు శిక్షిస్తున్నాడని). అందువల్ల వారతని శవాన్ని అలాగే పడి ఉండనిచ్చి వెళ్ళిపోయారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 25 వ అధ్యాయం – అలామాతిన్నుబువ్వతి ఫిల్ ఇస్లాం]

కపట విశ్వాసుల ప్రకరణం – కపట చేష్టలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు

1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు).

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]

పానీయాల ప్రకరణం : 35 వ అధ్యాయం – అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం

598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర పండ్లను (దానంగా ఇవ్వడానికి) తీసుకు వచ్చారు. మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకు వచ్చాడు. అప్పుడు కొందరు కపట విశ్వాసులు (కారుకూతలు కూస్తూ) “దేవునికి అతని (అంటే అబూ అఖీల్ తెచ్చిన) దానం అవసరంలేదు (ఆయన ఇలాంటి అల్పదానాన్ని ఖాతరు చేయడు), రెండవ వ్యక్తి పేరు ప్రతిష్ఠల కోసం (దానం) చేశాడు” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ ధైవవచనం అవతరించింది:
“మనస్పూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధన త్యాగాలను గురించి వారు ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవమార్గంలో దానమిస్తున్న (నిరుపేద) విశ్వాసుల్ని ఎగతాళి చేస్తున్నారు. (అలా ఏకసక్కెం, ఎగతాళి చేస్తున్న ఈ పిసినారుల సంగతి అల్లాహ్ కి బాగా తెలుసు). దేవుడే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారి కోసం దుర్భరమైన (నరక) శిక్ష కాచుకొని ఉంది.” (ఖుర్ఆన్ – తౌబా : 79 )

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 11 వ అధ్యాయం – ఖౌలిహీ అల్లజీన యల్మిజూనల్ ముత్తవ్వియీన్]

జకాత్ ప్రకరణం – 21 వ అధ్యాయం – స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బిలాల్ (రధి అల్లాహు అన్హు) ఇచ్చే అజాన్

664. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవాళ్ళు (భోజనానికి) వచ్చేందుకు, నిద్రిస్తున్న వాళ్ళు మేల్కొనేందుకు వీలుగా బిలాల్ (రధి అల్లాహు అన్హు) అజాన్ ఇస్తుంటారు. అందువల్ల ఆయన అజాన్ విని ఎవరూ సహరీ భోజనం తినడం మానివేయనవసరం లేదు. ఆయన ఇచ్చే అజాన్ విని ఉషోదయమయిందని గాని, లేక తెల్లవారిపోయిందని గాని ఏ ఒక్కరూ భావించకూడదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతూ తమ చేతివ్రేళ్ళతో సూచించారు. మొదటి వాటిని పైకి ఎత్తారు. తరువాత క్రిందికి దించారు. అంటే ఈ విధంగా (తెలుపు) వ్యాపించే వరకు అని అర్ధం.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 13 వ అధ్యాయం – అల్ అజాన్ ఖబ్లల్ ఫజ్ర్]

ఉపవాస ప్రకరణం : 8 వ అధ్యాయం – ఉపవాస వ్రతం, ఉషోదయం నుండి మొదలవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 43 వ అధ్యాయం – జకాతిల్ బఖర]

జకాత్ ప్రకరణం : 8 వ అధ్యాయం – జకాత్ చెల్లించని వారు కఠినాతి కఠిన శిక్ష చవి చూడవలసి వస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 వ అధ్యాయం – ఫజ్లిమన్ ఘదా ఇలల్ మస్జిది వరాహ]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నరకం నుండి బయట పడే చివరి మనిషి

117. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు –

నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నాకక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటీ, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు)” అని అంటాడు.(అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పల్లు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 51 వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్]

విశ్వాస ప్రకరణం – 81 వ అధ్యాయం – నరకం నుండి బయట పడే చివరి మనిషి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

దైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి

1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరు నాకు విధేయుడయ్యాడో  అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నాకు అవిధేయుడయ్యాడో అతను నిజానికి అల్లాహ్ కే అవిధేయుడయిపోయాడు. అలాగే ఎవరు నేను నియమించిన నాయకునికి విధేయత చూపాడో అతను నాకు విధేయత చూపినట్లే; మరెవరు నేను నియమించిన నాయకునికి అవిధేయుడయ్యాడో అతను స్వయంగా నాకు ఆవిధేయుడయి పోయాడన్నమాట.(*)

[సహీహ్ బుఖారీ : 93 వ ప్రకరణం – అహ్కామ్, 1 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అతీవుల్లాహ వ అతీవుర్రసూల వ ఉలిల్ అమ్రి మిన్ కుమ్)]

(*) ఈ ప్రవచనంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అధికారి విధేయతను తన విధేయతతో పోల్చి అధికారుల వ్యవహారానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. దీనిక్కారణం ఖురైషీయులకు వారి దగ్గర ఉండే అరబ్బులకు నాయకత్వపు హొదా గురించి అంతగా తెలియక పోవడమే. వారు తమ తెగ నాయకులకు తప్ప మరెవరికీ తలవొగ్గరు. ఇస్లామీ యుగం ప్రారంభ రోజుల్లో ఆ అరబ్బులకు తమపై నాయకుడ్ని నియమించడం నచ్చలేదు. దాంతో కొందరు నాయకునికి విధేయత చూపడానికి నిరాకరించారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకునికి విధేయత చూపడమంటే తనకు విధేయత చూపడమేనని చెప్పి అధికారి (నాయకుని) విధేయతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ప్రజలు అధికారులకు విధేయత చూపడం నేర్చుకొని, సమాజంలో సంక్షోభం, అనైక్యతలు సృష్టించకూడదన్నదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని ఆంతర్యం (సంకలనకర్త).

పదవుల ప్రకరణం : 8 వ అధ్యాయం – ధైవాదేశాలకు విరుద్ధంగా లేనంత వరకూ పాలకుల ఆజ్ఞలను శిరసావహించడం (ప్రజల) విధి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం

69. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం,

కొండ మీద నుండి పడి ఆత్మహత్య చేసుకున్న వాడు నరకానికి పోయి, మాటిమాటికి కొండ మీద నుండి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు. విషం తిని ఆత్మహత్య చేసుకున్న వాడు నరకంలో విషంచేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడు తనను తాను హతమార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలు అనుభవిస్తూ ఉంటాడు.

[సహీహ్ బుఖారీ : 76 వ ప్రకరణం – తిబ్, 56 వ అధ్యాయం]

విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు

1743. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు.  ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన ధనికుల్ని నరకంలోకి పంపమని ముందే ఆజ్ఞాపించడం జరిగింది. నేను నరక ద్వారం దగ్గర కూడా నిలబడి చూశాను. నరకంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది స్త్రీలే ఉన్నారు.

[సహీహ్ బుఖారీ : 67 వ ప్రకరణం – నికాహ్, 87 వ అధ్యాయం – హద్దసనా ముసద్దద్]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 26 వ అధ్యాయం – స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth