సమాధులపై మస్జిద్ నిర్మించరాదు

308. హజ్రత్ అయిషా (రధి అల్లాహు అన్హ), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) ల కధనం:-

ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణసమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా  దుర్భరంగా మారిపోయింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాగుకునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్ధనా స్థలాలుగా చేసుకున్నారు. దేవుడు వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 55 వ అధ్యాయం – హద్దసనా అబూయమాన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 3 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రళయదినం నాడు దేవుని నీడ పట్టున ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తులు

610. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా  తెలిపారు:-

దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో

  1.  న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;

  2.  తన యౌవన జీవితం (వ్యర్ధ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు;

  3.  మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయి పోయినా ధ్యాసంతా మస్జిదు వైపు  ఉండేటటువంటి మనిషన్న మాట);

  4.  కేవలం ధైవప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, ధైవప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు;

  5.  అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచి నప్పుడు, తాను దైవానికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ;

  6.  కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి;

  7.  ఏకాంతంలో దైవాన్ని తలచుకొని కంటతడి పెట్టే వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 36 వ అధ్యాయం – మన్ జలస ఫిల్ మస్జిది యన్తజిరుస్సలాతి వ ఫజ్లిల్ మసాజిద్]

జకాత్ ప్రకరణం : 30 వ అధ్యాయం – గుప్తదానం – దాని ప్రాముఖ్యత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అజాన్ చెప్పడంలో మరియు సామూహిక నమాజు చేయటంలో గల పుణ్యాలు

251. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, మీరు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీ పడతారు. అదే విధంగా ఇషా, ఫజ్ర్ (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటికోసం కాళ్ళీడ్చుకుంటూ నడవ వలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వస్తారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 9 వ అధ్యాయం – అల్ ఇస్తిహామి ఫిల్ అజాన్]

నమాజు ప్రకరణం – 28 వ అధ్యాయం – పంక్తులను వంకరటింకరగా లేకుండా తిన్నగా ఉంచాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత

461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ముష్టి ఎత్తకుండా లేమిలో సహనం వహించడం

627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్ధించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కానీ వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా హరించుకుపోయింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు :

“నా దగ్గరున్న ధనసంపద (ఎంతైనా) మీ కివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను. కాని (ఒక విషయం గుర్తుంచుకోండి) దానం అడగకుండా ఉండే వాడికి దేవుడు అలాంటి పరిస్థితి రాకుండా  కాపాడుతాడు. నిరపేక్షా వైఖరిని అవలంబించే వాడికి దేవుడు అక్కరలేనంత ప్రసాదిస్తాడు. సహనం  వహించే వాడికి సహనశక్తి ప్రసాదిస్తాడు. (దైవానుగ్రహాలలో) సహనానికి మించిన మహాభాగ్యం లేదు.”

సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 50 వ అధ్యాయం – అల్ ఇస్తిఫాఫి అనిల్ మస్అల

జకాత్ ప్రకరణం : 42 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు కోసం మస్జిదుకు వెళ్ళే వారికి అడుగడుగునా పుణ్యమే

388. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 31 వ అధ్యాయం – సలాతిల్ ఫజ్రి ఫీజమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 50 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 12 వ అధ్యాయం – అఖ్దషైతాని అలా ఖాఫియాతిర్రాస్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు కోసం పరుగెత్తరాదు, నింపాదిగా నడవాలి

351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:-

మేమంతా  ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి
“ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు వచ్చారు?”
అని అడిగారు. దానికి వారు

“మేము త్వరగా జమాఅత్ (సామూహిక నమాజు)లో కలవడానికి పరిగెత్తాము”
అని విన్నవించుకున్నారు.

అప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితవు చేస్తూ
“ఇక నుండి అలా చేయకండి. నమాజు చేయడానికి వచ్చినప్పుడల్లా హుందాగా, నింపాదిగా నడచి రండి. సామూహిక నమాజులో ఎంత భాగం లభిస్తే అంతే చేయండి. మిగిలిన భాగాన్ని మీరంతగా మీరు (వ్యక్తిగతంగా) చేసి నమాజును పూర్తి చేసుకోండి”
అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 20  వ అధ్యాయం – ఖౌలిర్రజులి ఫఅతతుసస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

కపట విశ్వాసి లక్షణాలు

37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి.

  1. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు.
  2. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు.
  3. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
  4. ఎవరితోనైనా జగడం పెట్టుకుంటే దుర్భాషకు దిగుతాడు.

ఈ నాలుగు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పచ్చి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణం ఉంటే, దాన్ని విడనాడనంత వరకు అతనిలో కపట విశ్వానికి సంబంధించిన ఒక లక్షణం ఉన్నట్లే లెక్క.”

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 24 వ అధ్యాయం – అలా మతుల్ మునాఫిఖ్]

విశ్వాస ప్రకరణం : 23 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి

232. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుండి పడిపోయారు. దానివల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. మేము కూడా ఆయన వెనుక కూర్చునే నమాజు చేశాము. ఆయన నమాజు ముగించిన తరువాత

“ఇమామ్ నియామకం ఆయన్ని (ముఖ్తదీలు) అనుకరించడానికే జరుగుతుంది. అందువల్ల అతను (అల్లాహు అక్బర్ అని) తక్బీర్ పలికితే మీరు తక్బీర్ పలకండి. ఆయన రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి.ఆయన రుకూ నుండి పైకి లేస్తే మీరు లేవండి. అప్పుడు ఇమామ్ ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అంటే మీరు ‘రబ్బనా! వలకల్ హమ్ద్’ అనండి. (ఆ తరువాత) అతను సజ్దా చేస్తే మీరు సజ్దా చేయండి”

అని ప్రభోధించారు.

[సహీహ్ బుఖారీ :  10 వ ప్రకరణం – అజాన్, 128 వ అధ్యాయం – యహ్ వీ బిత్తక్బీరి హీన యస్జుద్]

నమాజుప్రకరణం  – 19 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్