త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.

ఇరుగు పొరుగు వారి హక్కులు – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఇరుగు పొరుగు వారి హక్కులు
https://youtu.be/a1a481jkb_M [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు:

1- ఇల్లు కొనే ముందు పొరుగు వారిని చూడండి అని ఎందుకు అనబడింది ?
2- పొరుగు వారు చెడ్డ వారు కాకుండా ఉండేలా చూడమని ప్రవక్త (స) అల్లాహ్ తో చేసిన దువా ఏమిటి ?
3- కూర వండేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసి వండండి అని ప్రవక్త (స) ఆజ్ఞాపించారు కారణం ఏమిటి ?
4- నమాజులు, ఉపవాసాలు ఆచరించి దాన ధర్మాలు చేసినా ఒక మహిళ నరకానికి వెళ్ళింది కారణం తెలుసా ?
5- తమ పొరుగు వారు ఆకలితో ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని వారికి ఏమవుతుంది ?
6- పొరుగింటి మహిళతో వ్యభిచారం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
7- పొరుగింటిలో దోంగతనం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
8- అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటూ ప్రవక్త (స) మూడు సార్లు ప్రమాణం చేసి ఎవరి గురించి చెప్పారు ?
9- పొరుగు వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడా ?
10- పొరుగు వారు ఆస్తిలో హక్కుదారులుగా నిర్ణయించబడుతారేమో అని ప్రవక్త (స) కు అనుమానం ఎందుకు కలిగింది ?

ఈ ప్రసంగంలో, ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి ఇస్లామీయ బోధనలు వివరించబడ్డాయి. మంచి పొరుగువారు దొరకడం అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు సౌభాగ్యానికి నిదర్శనమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. ఇస్లాం పొరుగువారితో, వారు ఏ మతానికి చెందినవారైనా సరే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, వారికి కానుకలు ఇచ్చుకోవాలని, వండిన దానిలో వారికి కూడా భాగం ఇవ్వాలని, మరియు వారి అవసరాలకు సహాయపడాలని ఆదేశిస్తుంది. దీనికి విరుద్ధంగా, మాటల ద్వారా గానీ చేతల ద్వారా గానీ పొరుగువారికి హాని కలిగించడం, వారి ప్రాణానికి, మానానికి, ధనానికి నష్టం వాటిల్లేలా చేయడం మహా పాపమని, అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని ప్రవక్త వారు తీవ్రంగా హెచ్చరించారు. పొరుగువారి ఆకలిని తెలిసి కూడా పట్టించుకోని వాడు విశ్వాసి కాజాలడని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనమంతా నలుగురిలో ఒకరిలాగా జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మనము ఆలోచిస్తే, ప్రతి మనిషి నలుగురి మధ్య జీవించడానికి ఇష్టపడతాడు, ఏకాంతంలో ఒంటరిగా అందరికంటే పక్కగా దూరంగా నివసించడానికి ఇష్టపడడు. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరికీ ఇరుగుపొరుగు వారు ఉన్నారు, మనము కూడా వేరే వారికి ఇరుగుపొరుగు వారిగా ఉంటూ ఉన్నాము.

అయితే మిత్రులారా, పొరుగువారు మంచివారు అయ్యి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే పెద్దపెద్ద గురువులు, పండితులు, ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు అని వారితో సలహాలు అడిగినప్పుడు,

اُطْلُبِ الْجَارَ قَبْلَ الدَّارِ
(ఉత్లుబిల్ జార్ కబ్లద్దార్)
ఇంటి కంటే ముందు ఇరుగు పొరుగు వారిని వెతకండి అని సలహా ఇచ్చేవారు. అర్థం ఏమిటంటే ఇల్లు కొనే ముందు పొరుగు వారు ఎలాంటి వారో చూసుకొని, తెలుసుకొని తర్వాత కొనండి అని చెప్పేవారు. అలా ఎందుకు చెప్పేవారంటే, పొరుగు వారు మంచివారు అయితే వారు మీకు అన్ని విధాలా సహాయపడతారు, మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది, ధార్మిక విషయాలలో కూడా వారు మీకు దోహదపడతారు, సహాయపడతారు.

అయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, పొరుగువారు మంచివారు దొరికిపోవటం ఇది సౌభాగ్యానికి నిదర్శనం అని తెలియపరిచి ఉన్నారు. మనం చూచినట్లయితే, అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు.

مِنْ سَعَادَةِ الْمَرْءِ الْجَارُ الصَّالِحُ
(మిన్ సఆదతిల్ మర్ఇ అల్ జారుస్ సాలిహు)
ఒక వ్యక్తి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమేమిటంటే, అతనికి మంచి పొరుగువారు దొరకడం.

అంటే మనిషి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమైన విషయం ఏమిటంటే, అతనికి మంచి పొరుగు వారు దొరికిపోతారు. అల్లాహు అక్బర్! మంచి పొరుగు వారు దొరకటం, అతని అదృష్టానికి నిదర్శనం, అతను అదృష్టవంతుడు అలాంటి మంచి వారు దొరికిపోతే అని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.

అయితే దీనికి విరుద్ధమైన విషయాన్ని మనం చూచినట్లయితే, ఒకవేళ పొరుగువారు మంచివారు కాదు అంటే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారు తలనొప్పిగా మారిపోతారు. పొరుగువారు మంచివారు కాకపోయినప్పుడు వారు మనకోసము తలనొప్పిగా మారిపోతారు. చాలా సందర్భాలలో చూసిన విషయం ఏమిటంటే, పొరుగు వారి పోరు తట్టుకోలేక ప్రజలు ఇల్లు వదిలేస్తారు లేదంటే అమ్మేస్తారు కూడా.

ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెడ్డ పొరుగు వారు ఉండకూడదు అని అల్లాహ్ శరణు కోరుకుంటూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించేవారు అని సహీ అత్తర్గీబ్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ జారిస్సూయి ఫీ దారిల్ ముకామా)
ఓ అల్లాహ్! నేను నివాసముండే ప్రదేశంలో చెడ్డ పొరుగు వాని కీడు నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను.

నేను నివాసం ఉండే ప్రదేశంలో చెడ్డ వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను, చెడ్డ పొరుగు వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉండేవారు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, చెడ్డవారు పొరుగువారుగా ఉండకూడదు. పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని ప్రవక్త వారు సైతము అల్లాహ్ తో శరణు కోరుకుంటున్నారంటే, చెడ్డ పొరుగు వారి వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో మనము గ్రహించవచ్చు.

అయితే మిత్రులారా, మనం ఎలాగైతే మన పొరుగువారు మంచివారు ఉండాలని కోరుకుంటామో, మన పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని కోరుకుంటామో, స్వయంగా మనము కూడా పొరుగు వారి కోసము మంచి వాళ్ళులాగా మారిపోవాలి.

రండి ఇన్షా అల్లాహ్, పొరుగువారి పట్ల, వారి శ్రేయము మరియు వారి మంచి పట్ల ఇస్లాం ఎలాంటి బోధనలు చేసి ఉందో ఇన్షా అల్లాహ్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఇస్లాం మనకు ఆదేశిస్తూ ఉంది. పొరుగువారు, వారు ఎవరైనా సరే, మన సమీప బంధువులైనా సరే, దూరపు బంధువులైనా సరే, అపరిచితులైనా సరే, ఇతర మతస్తులైనా సరే, అందరితో మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పదేపదే తెలియజేస్తూ ఉండేవారు.

مَا زَالَ جِبْرِيلُ يُوصِينِي بِالْجَارِ حَتَّى ظَنَنْتُ أَنَّهُ سَيُوَرِّثُهُ
(మాజాల జిబ్రీలు యూసీనీ బిల్ జార్ హత్తా జనన్తు అన్నహు సయువర్రిసుహు)
జిబ్రీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చి పదేపదే పొరుగువారి గురించి ఎంతగా బోధించారంటే, బహుశా భవిష్యత్తులో పొరుగువారికి ఆస్తిలో వారసులుగా నిర్ణయించేస్తారేమో అన్న ఆలోచన నాకు కలిగింది.

జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత నా వద్దకు వచ్చి పదేపదే, ఎక్కువగా పొరుగు వారి గురించి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బోధిస్తూ ఉండేవారు. ఆయన ఎంతగా నన్ను బోధించారంటే, భవిష్యత్తులో బహుశా పొరుగు వారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న ఆలోచన నాకు కలిగింది అని ప్రవక్త వారు తెలియజేశారు. అంటే, పొరుగువారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న భావన వచ్చేటట్లుగా బోధించారు అంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అల్లాహ్ మరియు ప్రవక్త వారు మనకు బోధిస్తున్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి.

అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పడానికి మరొక ఉదాహరణ చూడండి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకరోజు ఇంట్లో ఒక పొట్టేలు కోయించారు. సేవకుడు పొట్టేలు కోస్తూ ఉన్నాడు, మాంసము భాగాలు చేస్తూ ఉన్నాడు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు సేవకునితో ఏమంటున్నారంటే, మా పొరుగులో ఉంటున్న యూదునికి కూడా ఈ మాంసంలో నుంచి ఒక భాగము చేరవేయించండి. ఒకసారి చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చారు, ఏమయ్యా నేను చెప్పిన మాట మరవకు, తప్పనిసరిగా పొరుగువారిలో ఉన్న మా ఆ యూద సోదరునికి ఈ మాంసంలోని భాగము చేరవేర్చు అని మళ్లీ చెప్పి వెళ్లారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత వచ్చారు, మళ్లీ చెప్తున్నారు. అలా పదేపదే వచ్చి చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏమన్నారంటే అయ్యా, ఆయన ముస్లిం కాదు కదా, యూదుడు, వేరే మతస్తుడు కదా, మరి ఆయన గురించి మీరు ఇంతగా తాకీదు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశారు. అల్లాహు అక్బర్.

ఆ మాట అడగగానే వెంటనే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, అయ్యా నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఈ ఉల్లేఖనము విని ఉన్నాను. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పదేపదే పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తూ వెళ్లారు. ఎంతగా ఆదేశించారంటే ప్రవక్త వారికి అనుమానం కలిగింది, భవిష్యత్తులో జిబ్రీల్ అలైహిస్సలాం ఏమైనా పొరుగు వారికి తమ ఆస్తిలో వాటాదారులుగా, భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనని నాకు అనుమానం కలిగిందని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ ప్రకారంగా పొరుగువారితో మనము ఎంతగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్న విషయం అక్కడ బోధపడింది, నేను స్వయంగా ప్రవక్త వారి నోట ఆ మాట విని ఉన్నాను కాబట్టి ఒక పొరుగు వానిగా నేను మన పొరుగులో ఉంటున్న యూద సోదరునితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది నాకు ఇస్లాం ఆదేశిస్తున్న విషయము కాబట్టి, తప్పనిసరిగా మీరు ఆ మాంసంలోని భాగము వారికి చేరవేయండి అని తెలియపరిచారు. అల్లాహు అక్బర్.

పొరుగువారు ఎవరైనా సరే వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పటానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. అలాగే పొరుగువారితో మనము ముఖ్యంగా సత్ప్రవర్తనతో పాటు వారి పట్ల ప్రేమ పెంచుకోవడానికి వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి అని ఇస్లాం బోధించింది. చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వెళ్లి ప్రశ్నిస్తూ ఉన్నారు.

يَا رَسُولَ اللَّهِ، إِنَّ لِي جَارَيْنِ، فَإِلَى أَيِّهِمَا أُهْدِي؟
(యా రసూలల్లాహ్, ఇన్నలీ జారైని ఫ ఇలా అయ్యిహిమా అహదీ)
ఓ దైవ ప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు, నేను వారిలో ఎవరికి కానుక ఇవ్వాలి?

ఓ దైవ ప్రవక్తా, పొరుగు వారితో కానుకలు ఇచ్చుకుంటూ ఉండాలి, వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, ప్రేమ అభిమానాలు పెరగటానికి, కానుకలు ఇచ్చుకోవాలి అని చెప్పారు కదా, అయితే నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి ముందుగా నేను ఈ కానుక అందజేయాలి అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ తెలియజేస్తూ ఉన్నారు.

قَالَ: “إِلَى أَقْرَبِهِمَا مِنْكِ بَابًا”
(కాల: ఇలా అక్ రబి హిమా మిన్కి బాబన్)
ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “నీ ఇంటి గుమ్మానికి వారిలో ఎవరి ఇల్లు దగ్గరగా ఉందో (వారికి ఇవ్వు)”.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. ప్రవక్త వారంటున్నారు, మీ గుమ్మానికి ఏ పొరుగువారి ఇల్లు దగ్గరగా ఉందో ముందు వారికి కానుక చేరవేయండి, ఆ తర్వాత ఇతరులకు కూడా చేరవేయండి అని దాని అర్థం. చూశారా? కాబట్టి పొరుగువారితో ప్రేమ అభిమానాలు పెంచుకోవటము కోసము, వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండండి అని ఇస్లాం మనకు బోధించింది మిత్రులారా.

అలాగే, మనం మన ఇంటిలో అప్పుడప్పుడు మంచి మంచి వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇస్లాం ఏమంటుందంటే, మీరు మీ ఇంటిలో మంచి వంటలు చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేయండి, ఆ వంటలో పొరుగువారి భాగాన్ని విస్మరించకండి అని చెబుతుంది. చూడండి అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తూ ఉన్నారు. ఏమని ఆదేశిస్తున్నారో చూడండి. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

يَا أَبَا ذَرٍّ، إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جِيرَانَكَ
(యా అబాజర్, ఇజా తబఖ్త మరకతన్ ఫ అక్సిర్ మాఅహా వ తఆహద్ జీరానక్)
ఓ అబూజర్! నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు, అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి మరియు నీ పొరుగువారిని పట్టించుకో (వారికి కూడా పంపు).

అల్లాహు అక్బర్. అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తున్నారు, ఓ అబూజర్, నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి. ఏ ఉద్దేశంతో ఎక్కువ వెయ్యమంటున్నారు? మీ పొరుగువారికి ఆ కూరలోని కొద్ది భాగము చేరవేర్చట కొరకు అందులో కొద్దిగా నీరు ఎక్కువ వెయ్యి అంటున్నారు. అల్లాహు అక్బర్.

చూశారా? దీన్నిబట్టి ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, మన ఇంట్లో ఏదైనా మంచి వంటకము మనము చేస్తున్నాము అంటే, అందులో మన పొరుగువారికి కూడా చేరవార్చవలసి ఉంది అన్న ఆలోచనతో మనము వంట చేయాలి, ఆ వంట వండిన తర్వాత అందులో కొద్ది భాగము పొరుగువారికి చేరవేయాలి అని చెప్పారు.

అంతేకాదండి. చాలా గట్టిగా తాకీదు చేయబడి ఉంది పొరుగు వారి గురించి. ఈ హదీస్ వింటే ఇన్షా అల్లాహ్ ఆ విషయం అర్థమవుతుంది. చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి ప్రవక్త వారు తెలియజేస్తున్నారు.

مَا آمَنَ بِي مَنْ بَاتَ شَبْعَانًا وَجَارُهُ جَائِعٌ إِلَى جَنْبِهِ وَهُوَ يَعْلَمُ بِهِ
(మా ఆమన బీ మన్ బాత షబ్ఆన వ జారుహు జాయిఉన్ ఇలా జంబిహి వహువ యఅలము బిహి)
తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడని తెలిసి కూడా, తాను మాత్రం కడుపు నిండా తిని నిద్రించే వ్యక్తి నన్ను విశ్వసించిన వాడు కాడు.

సహీ అల్ జామిఅ గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రామాణికమైన ఉల్లేఖనం అండి. ప్రవక్త వారు ఏమంటున్నారు, ఆ వ్యక్తి నా మీద విశ్వాసం తీసుకొని రాలేదు. ఎవరి గురించి అంటున్నారు చూడండి. ఎవరైతే తాను మాత్రం కడుపునిండా భుజించాడు కానీ అతని పొరుగువాడు ఆకలితో పడుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలిసి కూడా, అతని ఆకలి దూరం చేయకుండా, అతనికి అన్నం పెట్టకుండా, తాను మాత్రం కడుపునిండా తిని పడుకున్నాడు అంటే, ఆ వ్యక్తి విశ్వాసి కాడు, అతడు నా మీద విశ్వాసమే తీసుకొని రాలేదు అని ప్రవక్త వారు అన్నారు. అల్లాహు అక్బర్.

పొరుగువారు ఆకలితో ఉన్నారు, వారింట పొయ్యి వెలగనే లేదు అన్న విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మనము వారికి అన్నము చేర్చి, ఆహారము చేర్చి, వారి ఆకలి తీర్చకుండా మనం మాత్రమే కడుపునిండా భుజించి వారిని పట్టించుకోకుండా వదిలేసి అలాగే పడుకుంటే, మనం విశ్వాసులమే కాము, ప్రవక్త వారి మీద మనం విశ్వాసం తీసుకునే రాలేదు అని అంత గట్టిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేశారంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారి పట్ల మనము ఎంత శ్రద్ధ తీసుకోవాలి మనము ఇక్కడ తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, పొరుగువారు ముస్లింలు అయి ఉంటే, వారు ఆకలితో పడుకొని ఉంటే వారి పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెప్పట్లేదు. పొరుగువారు ఎవరైనా సరే, బంధువులైనా సరే, మతస్తులైనా సరే, ఇతరులైనా సరే వారు ఆకలితో ఉన్నారని తెలిస్తే, పరాయి మతస్తులైనా సరే ఆకలితో ఉన్నారు మన పొరుగువారని తెలిస్తే, వెంటనే మనము మన వద్ద ఉన్న ఆహారంలో నుంచి కొద్ది భాగము వారికి చేర్చాలి, వారి ఆకలి తీర్చాలి, పొరుగువారిగా మా మీద ఆ హక్కు ఉంది. అలా చేయకపోతే మనము ఆ హక్కును విస్మరించినట్లు అవుతాము, ప్రవక్త వారు చెప్పినట్లుగా మనం విశ్వాసులమే కాము. కాబట్టి మిత్రులారా పొరుగువారి పట్ల మనము శ్రద్ధ తీసుకోవలసి ఉంది అన్న విషయము ఇక్కడ మనకు బోధపడుతుంది.

అలాగే, పొరుగువారి కోసము వారి సహాయము కోసము మనము ఎల్లప్పుడూ మన ద్వారాలు తెరిచి ఉంచాలి. అంటే అర్థం ఏమిటి? పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీళ్లు కావాలని వస్తారు, ఎప్పుడైనా నూనె కావాలని వస్తారు, ఎప్పుడైనా ఉప్పు కావాలని వస్తారు, ఇంకొక్కటి ఏదైనా కావాలి ఇంకొకటి ఏదైనా కావాలి అని వస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వచ్చేస్తున్నారు ఏమిటి అని విసుక్కోకూడదు. అల్లాహు అక్బర్. విసుక్కోకూడదు, సంతోషంగా వారు వచ్చి అడిగితే మన ఇంటిలో ఉన్న ఆ పదార్థము వారికి సంతోషంగా అందజేయాలి. ఒక పొరుగువారిగా మనము ఆ విషయాన్ని సంతోషంగా భావించాలి గానీ విసుక్కోకూడదు అని ఇస్లాం మనకు బోధిస్తుంది.

చూడండి, పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి గురించి, ఆయన పొరుగు వారి కోసము దీనార్ దిర్హమ్ లు బాగా ఖర్చు పెట్టేసేవారు, వారికి ఇచ్చేస్తూ ఉండేవారు. చూసిన వారిలో కొందరు ఆయనతో ప్రశ్నించారు, ఏమయ్యా మీరు పొరుగువారి కోసము ఆ లెక్క లేకుండా హద్దు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఏమిటి? ఏంటిది అని అడిగేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మనం మన పొరుగువారితో సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. వారితో మాకు సంబంధం ముఖ్యమైనది, దీనార్ దిర్హం మాకు ముఖ్యమైనది కాదు అని చెప్పారు. అల్లాహు అక్బర్.

అయితే మిత్రులారా, నేడు ఈ రోజుల్లో మనం నివసిస్తున్నాము కదా, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనము గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా బాధాకరమైన విషయం చెబుతున్నాను, అల్లాహ్ మన్నించు గాక. మనం ఎలా జీవిస్తున్నాము, మన స్వభావం ఎలా ఉంది అంటే, మనకు దీనార్ దిర్హం ముఖ్యమైపోయాయి పొరుగు వారికంటే, మన సోదరులకంటే కూడా. మాకు దీనార్ దొరికితే చాలు, దిర్హం దొరికితే చాలు, పొరుగు వారు మనకు దూరమైపోయినా పర్వాలేదు, పొరుగు వారితో కావాలంటే మనము తెగతెంపులు చేసుకుంటాము గానీ దీనార్ దిర్హం ని మాత్రం వదులుకోము అన్నట్టుగా జీవించేస్తున్నాం. కానీ ప్రవక్త వారి శిష్యులు, పొరుగువారితో మనకు సంబంధాలు కావాలి, దీనార్ దిర్హం పోయినా పర్వాలేదు అని వారు ఆ విధంగా కోరుకునేవారు, అదే వారికి మాకీ తేడా.

అయితే మిత్రులారా, పరివర్తన రావలసిన అవసరం ఉంది. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

كَمْ مِنْ جَارٍ مُتَعَلِّقٍ بِجَارِهِ يَوْمَ الْقِيَامَةِ
(కమ్ మిన్ జారిన్ ముతఅల్లికిన్ బిజారిహి యౌమల్ ఖియామ)
ప్రళయ దినం రోజు చాలా మంది పొరుగువారు తమ పొరుగువారి గురించి అల్లాహ్ వద్ద ఫిర్యాదు చేస్తారు.

ప్రళయ దినం రోజు పొరుగువారిలో చాలామంది తమ పొరుగు వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద ప్రశ్నిస్తారు, అల్లాహ్ తో అడుగుతారు. ఏమని? షికాయత్ చేస్తారు.

يَا رَبِّ هَذَا أَغْلَقَ بَابَهُ دُونِي فَمَنَعَ مَعْرُوفَهُ
(యా రబ్, హాజా అగ్లక బాబహు దూనీ ఫ మనఅ మారూఫహు)
ఓ నా ప్రభూ! ఇతను (నా పొరుగువాడు) నా కోసం తన ఇంటి తలుపు మూసుకున్నాడు మరియు తన సహాయాన్ని నిరాకరించాడు.

ఇతను నా పొరుగువాడు, ప్రపంచంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల కోసం వెళ్తూ ఉంటే, అతను నాకు ఇవ్వకుండా తమ వాకిలి మూసుకునేవాడు ఓ అల్లాహ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందర పొరుగువారి గురించి షికాయత్ చేస్తారు పొరుగువారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. అల్ అదబుల్ ముఫ్రద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనం ఇది. కాబట్టి మిత్రులారా పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము వస్తూ ఉంటే మనం సంతోషంగా వారికి అందజేయాలి, పుణ్యకార్యంలాగా భావించాలి. మన హక్కు అని అర్థం చేసుకోవాలి గానీ వారు వస్తూ ఉంటే అడుగుతూ ఉంటే విసుక్కోకూడదు, ఇది ఇస్లాం మనకు బోధిస్తుంది మిత్రులారా.

అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారికి కానుకలు ఇవ్వాలి, వారి కోసము మన ఇంటిలో వండిన వంటలు కొన్ని చేరవేయాలి. అలాగే చిన్న చిన్న విషయాల కోసం వారు వస్తుంటే విసుక్కోకూడదు. అలాగే మన తరఫు నుంచి, మన మాటల నుండి, మన చేష్టల నుండి పొరుగువారికి హాని కలగకుండా కష్టము, నష్టము వాటిల్లకుండా మనము జాగ్రత్త పడాలి.

చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు.

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلَا يُؤْذِ جَارَهُ
(మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యు’జీ జారహు)
ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ప్రళయ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు.

బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే పరలోకం పట్ల విశ్వసిస్తున్నారో, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు. పొరుగువారికి హాని కలిగించరాదు. అల్లాహ్ మీద మనకు విశ్వాసం ఉంది, పరలోకం పట్ల మనకు విశ్వాసము ఉంది అంటే, పొరుగు వారికి హాని కలిగించరాదు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు మూడుసార్లు ఈ విధంగా తెలియజేశారు.

وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ
(వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్)
అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు.

ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఎవరు? ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటున్నారు కదా ఆ వ్యక్తి ఎవరు ఓ దైవ ప్రవక్తా అంటే ప్రవక్త వారు అన్నారు.

مَنْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ
(మల్లా య’మను జారుహు బవాయిఖహు)
ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో (అతను విశ్వాసి కాడు).

ఎవరి కీడు నుండి అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, అలాంటి వ్యక్తి విశ్వాసి కాజాలడు అన్నారు. అంటే మన కీడు నుండి మన పొరుగువారు సురక్షితంగా లేరు, మనవల్ల మన పొరుగు వారికి నష్టం వాటిల్లుతుంది అంటే, బాధ కలుగుతూ ఉంది అంటే, మనము విశ్వాసులమే కాము అని ఆ ఉల్లేఖనం యొక్క అర్థం మిత్రులారా. అలాగే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.

لا يَدْخُلُ الْجَنَّةَ مَنْ لا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ
(లా యద్ఖులుల్ జన్నత మల్లా య’మను జారుహు బవాయిఖహు)
ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు.

ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగు వారు సురక్షితంగా లేరో. అంటే, పొరుగు వారికి ఇబ్బంది పెడుతున్న వ్యక్తి, పొరుగు వారికి నష్టం కలిగిస్తున్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని సూటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసేసి ఉన్నారు.

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇద్దరు మహిళల గురించి ప్రశ్నించడం జరిగింది. మొదటి మహిళ ఎవరంటే, ఓ దైవ ప్రవక్తా ఒక మహిళ ఉన్నారు. ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లు, విధి ఇబాదత్ లు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎక్కువగా నఫిల్ ఇబాదత్ లు ఏమీ చేయట్లేదు. కాకపోతే, వారి మాటల నుండి, వారి చేష్టల నుండి పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్, గమనించాల్సిన విషయం. ఎక్కువగా నఫిల్ ఆరాధనలు ఏమీ చేయట్లేదు ఆవిడ. ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటూ ఉన్నారు, ఫర్జ్ ఇబాదత్ లతో పాటు పొరుగువారికి నష్టం వాటిల్లకుండా బాధ కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి మహిళ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

هِيَ مِنْ أَهْلِ الْجَنَّةِ
(హియ మిన్ అహ్లిల్ జన్నా)
ఆవిడ స్వర్గవాసులలో ఒకరు.

ఆవిడ స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పారు. ఇక మరొక మహిళ గురించి ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, మరొక మహిళ ఉన్నారు, ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లతో పాటు, విధి ఆరాధనలతో పాటు, నఫిల్ ఇబాదత్ లు, తహజ్జుద్ నమాజులు కూడా బాగా ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే ఆవిడ తమ మాటల నుండి పొరుగువారికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆవిడ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا خَيْرَ فِيهَا، هِيَ مِنْ أَهْلِ النَّارِ
(లా ఖైర ఫీహా, హియ మిన్ అహ్లిన్నార్)
ఆవిడలో ఎలాంటి మంచితనము లేదు, ఆవిడ నరకవాసులలో ఒకరు.

అల్లాహు అక్బర్. దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటండి? దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనం మన వరకు నమాజులు ఆచరించుకుంటూ ఉన్నాము, ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటున్నాము అంటే మనము స్వర్గానికి చేరిపోము. మనం పొరుగువారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడినప్పుడే మనము స్వర్గానికి చేరుకుంటాము. అంటే ఆరాధనలలో మనం ఎలాగైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, వ్యవహారాలలో కూడా పొరుగు వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వ్యవహారాలలో కూడా మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే స్వర్గానికి చేరుకుంటాము అని ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యింది మిత్రులారా.

అలాగే పొరుగువారి ప్రాణానికి, పొరుగువారి మానానికి, పొరుగువారి ధనానికి మన నుండి ఎలాంటి హాని వాటిల్లకూడదు. ఇది కూడా ఇస్లాం మనకు చాలా గట్టిగా తాకీదు చేస్తుంది. మనవల్ల మన పొరుగువారి ప్రాణం పోతుంది అన్న భయం వారికి కలుగుతుందంటే మనలో విశ్వాసం లేదు. మనవల్ల మన పొరుగు వారి మానానికి భంగం వాటిల్లే ప్రమాదము ఉంది అంటే మనం విశ్వాసులము కాదు. మనం మన పొరుగు వారి ధనం దోచుకునే వాళ్ళము అంటే మనం విశ్వాసులము కాము.

చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, పెద్ద నేరము ఏది, పెద్ద పాపము ఏది అల్లాహ్ వద్ద అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ
(అన్ తజ్అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలకక్)
నిన్ను పుట్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను నువ్వు ఆరాధించటం ఇది అల్లాహ్ వద్ద పెద్ద నేరము, పెద్ద పాపము అని అన్నారు.

ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్దది ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

أَنْ تَقْتُلَ وَلَدَكَ مَخَافَةَ أَنْ يَطْعَمَ مَعَكَ
(అన్ తక్తుల వలదక మఖాఫత అన్ యత్అమ మఅక్)
ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ యే అయినప్పటికినీ, నీవు బిడ్డలు పుడితే వారు నీతోపాటు కూర్చొని తింటారు అన్న భయంతో నీవు వారిని హతమార్చటం, అంటే భ్రూణహత్యలు చేయటము ఇది పెద్ద నేరము అల్లాహ్ వద్ద అని చెప్పారు.

ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్ద నేరము ఏది అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ
(అన్ తుజానియ హలీలత జారిక)
నీ పొరుగువారి భార్యతో నీవు వ్యభిచారము చేయటం అల్లాహ్ వద్ద పెద్ద నేరం అన్నారు.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి ఇది. కాబట్టి పొరుగువారి మానానికి భంగం వాటిల్లింది మా వల్ల అంటే మేము పెద్ద నేరానికి పాల్పడ్డాము అన్న విషయము. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు వ్యభిచారం గురించి ఏమంటారు, దొంగతనం గురించి ఏమంటారు?

مَا تَقُولُونَ فِي الزِّنَا؟ مَا تَقُولُونَ فِي السَّرِقَةِ؟
(మా తఖూలూన ఫిజ్జినా? మా తఖూలూన ఫిస్సర్కా?)
వ్యభిచారం గురించి మీరేమంటారు? దొంగతనం గురించి మీరేమంటారు?

వ్యభిచారం గురించి మీరేమంటారు, దొంగతనం గురించి మీరేమంటారు అంటే, సహాబాలు, శిష్యులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్తా, వ్యభిచారం చేయడము ఇది హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త ఇద్దరూ దానిని నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు. దొంగతనం చేయటం హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేయడం హరాం, నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. అంటే వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం దీని గురించి మీరేమంటారు అంటే అది హరాము, నిషేధము, అల్లాహ్ మరియు ప్రవక్త నిషేధం చేశారు అని సహాబాలు సమాధానం ఇచ్చినప్పుడు, ప్రవక్త వారు ఏమంటున్నారో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لأَنْ يَزْنِيَ الرَّجُلُ بِعَشْرِ نِسْوَةٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَزْنِيَ بِامْرَأَةِ جَارِهِ
(లఅన్ యజ్నియర్ రజులు బి అషరి నిస్వతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యజ్నియ బిమ్ రఅతి జారిహి)
ఒక వ్యక్తి వేరే పది మంది మహిళలతో వ్యభిచారం చేయటం కంటే, తన పొరుగువారి భార్యతో వ్యభిచారం చేయటం పెద్ద పాపం.

మరియు

وَلأَنْ يَسْرِقَ الرَّجُلُ مِنْ عَشَرَةِ أَبْيَاتٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَسْرِقَ مِنْ بَيْتِ جَارِهِ
(వ లఅన్ యస్రికర్ రజులు మిన్ అషరతి అబ్యాతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యస్రిక మిన్ బైతి జారిహి)
ఒక వ్యక్తి వేరే పది ఇళ్లలో దొంగతనం చేయటం కంటే, తన పొరుగువారి ఇంట్లో దొంగతనం చేయటం పెద్ద పాపం.

అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. వేరేచోట పది ఇళ్లల్లో దోచుకోవటం కంటే పొరుగు వారి ఇంటిలో దొంగతనం చేయటం పెద్ద నేరం అవుతుంది. వేరేచోట పది మంది మహిళల వద్ద వ్యభిచారం చేయటం కంటే కూడా, పొరుగువారి ఇంటిలో ఉన్న మహిళతో వ్యభిచారం చేయటం పెద్ద నేరం అయిపోతుంది అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన నుండి మన పొరుగువారి ప్రాణానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి ధనానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి మానానికి కూడా భంగము వాటిల్లకూడదు. అలా జాగ్రత్త పడాలి అని ఇస్లాం మనకు బోధిస్తుంది. అలాగే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పొరుగువారు ఇతర మతస్తులైనా సరే, వారి మానానికి గానీ, వారి ప్రాణానికి గానీ, వారి ధనానికి గానీ మన తరఫు నుంచి ఎలాంటి ధోకా ఉండకూడదు. అప్పుడే మనము నిజమైన విశ్వాసులమవుతాము అని మనము గుర్తించాలి, తెలియజేసుకోవాలి మిత్రులారా.

ఇప్పటివరకు పొరుగువారితో మనము ఏ విధంగా జీవించుకోవాలి, పొరుగువారి పట్ల ఏ విధంగా మనము శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అన్న విషయాలు బోధపడ్డాయి. నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


క్రింది లింకులు దర్శించి ఇరుగు పొరుగు వారి హక్కుల గురుంచి మరింత జ్ఞానం సంపాదించండి: