సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి [వీడియో & టెక్స్ట్]

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి
బులూగుల్ మరాం | హదీస్ 1237
https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;

“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)

అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు

ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.

వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
(వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ
(ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్)
మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.

وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ
(వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్)
మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.

فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ
(ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్)
మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.

సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.

ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.

ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

رَحِمَ اللَّهُ عَبْدًا
(రహిమల్లాహు అబ్దన్)
అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.

ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!

نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ
(నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు)
ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.

فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ
(ఫ హమిదల్లాహ వ షకరహ్)
ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!

وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు)
మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.

فَجَدَّ وَاجْتَهَدَ
(ఫ జద్ద వజ్తహద్)
ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.

అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:

خَصْلَتَانِ
(ఖస్లతాని)
రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని

شَاكِرًا صَابِرًا
(షాకిరన్ సాబిరా)
కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ

వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?

مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ
(మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్)
ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.

وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ
(వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్)
మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు)
కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,

وَآسَفَ عَلَى مَا فَاتَهُ
(వ ఆసఫ అలా మా ఫాతహు)
అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.

فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا
(ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా)
ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.

అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.

అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.

ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.

తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.

ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.

ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.

ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.

కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19057

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1