ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 4 (చివరి భాగం) – నీ ప్రవక్త ఎవరు? – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[40:31 నిముషాలు]
నీ ప్రవక్త ఎవరు?
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 4
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 3 – ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[42:18 నిముషాలు]
ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ – హదీథ్ జిబ్రయీల్
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 3
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 2 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:55 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 2
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 1 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:50 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 1
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

[ఈ వీడియోలో చెప్పబడిన బుక్ విషయాలు మీ సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాము. వీడియో వింటూ క్రింది టెక్స్ట్ ఫాలో కండి]

త్రిసూత్రాలు

  1. నీ ప్రభువు ఎవరు? 2. నీ ధర్మం ఏది? 3. నీ ప్రవక్త ఎవరు?

కూర్పు : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి M.A.

మనవి

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈ పుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి.

పాఠకులారా…

12వ శతాబ్దము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కు తీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యేభయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది.

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తి… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”.

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ హిజ్ర శకం 1115 సంవత్సరంలో “నజ్ద్ ” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో ” ముహమ్మద్ బిన్ సఊద్ ” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విసృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవరాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి.

  1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు?
  2. నీ ధర్మం ఏది?
  3. నీ ప్రవక్త ఎవరు?

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది.

అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వార ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలు పంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను…ఆమీన్.

ధార్మిక సేవలో……….
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి, M.A.
తెలుగు అనువాదకులు మర్కజుల్ హిదాయ, బహ్రన్.


అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో…

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

పాఠకులారా…

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తు పెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి.

మొదటి విషయం :విద్యా భ్యాసన

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట.

రెండవ విషయం : ఆచరణ

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట.

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. నాలుగో విషయం : ఓర్పు, సహనం
ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట.

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు:

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప“. (అల్ అఫ్ 103: 1-3)

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు:

అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది.”

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు.

“మాట, బాటకు ముందు జ్ఞానం’ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట)

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే :

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేదు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) |

فبدأ بالعلم.

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు.

పాఠకులారా..

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి.

మొదటి సమస్య:

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గ వాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16)

రెండవ సమస్య:

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (జిన్‌ 72:18)

మూడవ సమస్య:

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీప బంధువులైన సరె. ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం:

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా,వారి కుమారులైనా,వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు. ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ షక్షం వారే సఫలీకృతులయ్యే వారు”.(అల్ ముజాదలహ్ 58:22)

పాఠకులారా..

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే “హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు.

నేను సృష్టించలేదు జిన్నాతులను, మానవులను, కాని నా ఆరాధనకు (తప్ప)”. (అజ్జారియాత్ 51:56)

య’బుదూన్” అనే పదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి.

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్” అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు.

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

మరియు మీరందరూ అల్లాహ్ ని ఆరాధించండి, మరి అతనితో ఎవరినీ సాటి కల్పించకండి”. (అన్నిసా 04:36)


బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

ప్రతి మానవుడికి ఏ 3 సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి:

  1. ప్రతి వ్యక్తి తన ప్రభువు గురించి అవగాహన పొందడం.
  2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం.
  3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) గురించి అవగాహన పొందడం.

ప్రధమ సూత్రం:

విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి”నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నాఆరాధ్యదేవుడు. ఆయన తప్ప మరోక ఆరాధ్యదేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి :

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01 :02)

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి.

మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వార కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి.

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి.
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆరెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ.

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు :

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు,అయన (అల్లాహ్) చిహ్నాల్లోనివే, మీరు సూర్యునికి, చంద్రునికి ఆరాధించకండి (సాష్టాంగం చేయకండి). మీరు ఆరాధించేవారైతే వాటిని సృష్టించిన అల్లాహ్ ను అరాధించండి (సాష్టాంగం చేయండి).” (ఫుస్సిలత్ 41:37)

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

వాస్తవానికి మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు తదనంతరం తన సింహాసనం (అర్ప్)ను అధిష్టించాడు. ఆయనే రాత్రిని పగలుపై కప్పుతున్నాడు, మళ్ళీ పగలుని రాత్రి వెంట పరుగులు తీయిస్తున్నాడు.ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మరియు నక్షత్రాలను సృష్టించాడు. అన్ని ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి. గుర్తుంచుకొండి. సృష్టించడం, ఆజ్ఞాపించడం ఆయనకే చెల్లుతుంది. శుభాలుకలవాడు అల్లాహ్ యే, ఆయనే సర్వలోకాలకు ప్రభువు”. (అల్ ఆరాఫ్ 7: 54)

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

ఓ మానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ కూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22)

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు:

పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు” (తఫ్సీర్ ఇబ్నె కసీర్)

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబి వ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి.

అరబి నామాలు (ఆరాధనల పేర్లు)

ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, దుఆ, ఖాఫ్, తవక్కుల్, ఖుషూ, ఇస్తిఆనత్, రఘ్-బత్ , ఖషియత్, ఇస్తి ఆజహ్, ఖుర్బాని, ఉమ్మీద్ వ రజా, రహ్బత్, రుజూ, జబహ్ఇ, ఇస్తిఘాసహ్, నజర్ వ మిన్నత్ మొదలైనవి.

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కే పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్ లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ (ప్రార్ధన) కొరకే ఉన్నాయి. అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి“. (అల్ జిన్న్ 72 :18)

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైన అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ని గమనించండి:

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవరైనా అల్లాహ్ తో పాటు వేరే దైవాన్ని పిలిస్తే (అప్పటికి) అతని వద్ద అలా పిలవటానికి ఎటువంటి ప్రమాణికం (సూచిక) లేదు. అలాంటి వ్యక్తి లెక్క అల్లాహ్ పై ఉన్నది. నిస్సందేహంగా అవిశ్వాసులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు”. (అల్ మొమినూన్ 23:117)

గమనిక :

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ల నుండి పేర్కొనడం జరిగింది గమనించండి

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం, వీడియో పాఠాలు] [మర్కజ్ దారుల్ బిర్ర్]

బిస్మిల్లాహ్


Usool-Thalatha & Qawaid-al-Arba
Shaykh Muhamamd bin AbdulWahhab (rahimahullah)
మూల రచయిత షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
అనువాదం: అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

[Download the Book]
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

[47 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వీడియో పాఠాలు:

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

మనవి 

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈపుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి. 

పాఠకులారా.. 

12వ శతాబ్ధము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కుతీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యే భయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది. 

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తే… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”. 

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్’ హిజ్రి శకం 1115 సంవత్సరంలో “ నజ్ద్” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో “ముహమ్మద్ బిన్ సఊద్” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్నీ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవారాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 

  • 1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు? 
  • 2. నీ ధర్మం ఏది? 
  • 3. నీ ప్రవక్త ఎవరు? 

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది. అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. 

ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వారా  ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలుపంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను… ఆమీన్. 

ధార్మిక సేవలో……… 
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి,M.A. 
తెలుగు అనువాదకులు , మర్కజుల్ హిదాయ, బహ్రేన్. 3-4-2007. 

అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తుపెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి. 

మొదటి విషయం :విద్యాభ్యాసన 

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట. 

రెండవ విషయం : ఆచరణ 

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట. 

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం 

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. 

నాలుగో విషయం : ఓర్పు, సహనం 

ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట. 

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

وَالْعَصْرِ إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ . إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 

అర్ధం: “కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప”. (అల్ అస్103:1-3) 

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు: 

لَو مَا أَنْزَلَ اللهُ حُجَّةً عَلى خَلْقِهِ الْاهْذِهِ السُّورَةِ لَكَفَتُهُم 

అర్ధం : అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు. 

మాట, బాటకు ముందు జ్ఞానం‘ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట) 

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే : 

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ

అర్ధం: “తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) 

فَبُدَأَ بِالْعِلْمِ. 

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు. 

పాఠకులారా.. 

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి. 

మొదటి సమస్య: 

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గవాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. 

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

అర్ధం : “మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16) 

రెండవ సమస్య: 

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) 

అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు: 

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

అర్ధం : “నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (అల్ జిన్న్ 72:18) 

మూడవ సమస్య: 

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీపబంధువులైన సరె. 

ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం: 

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ

అర్ధం : “అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను  ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు.ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆవనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యే వారు”. (అల్ ముజాదలహ్ 58:22) 

పాఠకులారా.. 

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే ” హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”.(అజ్జారియాత్ 51:56) 

يَعْبُدُونِ : అనేపదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి. 

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్”. అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి”.(అన్నిసా 04:36)  

బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం 

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు 

ప్రతి మానవుడికి ఏ మూడు సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి: 

  • 1. ప్రతి వ్యక్తి తనప్రభువు గురించి అవగాహన పొందడం. 
  • 2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం. 
  • 3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గురించి అవగాహన పొందడం. 

ప్రధమ సూత్రం : విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన 

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి “నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దేవుడు. ఆయన తప్పమరోక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం. 

ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి : 

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

అర్ధం : “సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01:02) 

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి. మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వారా కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి. 

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి. 
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆ రెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ. 

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు: 

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు: 

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి (ఫుస్సిలత్ 41:37) 

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు”. (అల్ ఆరాఫ్ 7: 54) 

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది: 

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَالَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

అర్ధం : ఓమానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మిమ్మల్నీ, మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు.దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూకూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22) 

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు: 

الْخَالِقُ لِهذِهِ الأشْيَاءَ هُوَ الْمُسْتَحِقُ لِلْعِبَادَةِ (تفسير ابن كثير : ۱ : ۵۷ طبع مصر) 

అర్ధం : పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు (తఫ్సీర్ ఇబ్నెకసీర్) 

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబివ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి. 

ఆరాధనల అరబి నామాలు:

ఇస్లాం, ఈమాన్ ,ఇహ్సాన్ ,దుఆ ,ఖవ్ ఫ్ ,ఉమ్మీద్ వ రజా ,తవక్కుల్ ,రఘ్బత్ ,ఖుషూ ,ఖషియత్,  రుజూ ,ఇస్తి ఆనత్ ,ఇస్తి ఆజహ్ ,ఇస్తిఘాసహ్, జబహ్ ,ఖుర్బాని ,నజర్ వ మిన్నత్ మొదలైనవి. 

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కు పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. (అల్ జిన్న్ 72:18) 

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైనా అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ను గమనించండి : 

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ – అల్లాహ్‌ తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు”.  (అల్ మొమినూన్ 23:117) 

గమనిక : 

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ నుండి పేర్కొనడం జరిగింది గమనించండి. 

దుఆ (ప్రార్ధన) : అన్ని రకాల వేడుకోలు, మొరలు

మన అవసరాలను తీర్చుటకు సృష్టికర్తయిన అల్లాహ్ నే వేడుకుంటాము. కాబట్టి అది (మొరపెట్టుకునే) ఆరాధన. ‘దుఆ’యే ఆరాధన అని చెప్పటానికి దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) హదీసులో దీని గురించి ఇలా ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

الدُّعَاءُ مُخُ الْعِبَادَةِ . (ترمذی) 

అర్ధం : “ దుఆయే ఆరాధనలోని అసలైన పౌష్టికం”. (తిర్మిజి) 

దీనికై దైవ గ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించడం జరిగింది: 

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

అర్ధం: “మీ ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు- నన్ను పిలవండి. నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. ఎవరైన అహంకారంతో నా ఆరాధనను తిరస్కరిస్తే వారు తప్పకుండా హీనులై నరకములో ప్రవేశిస్తారు”. (అల్ మొమిన్ 40:60) 

‘ఖవ్ ఫ్ : భయ భీతి 

కేవలం అల్లాహ్ పట్ల భయభీతి కలిగివుండాలి తప్ప ఇతరుల భయభీతి మనసులో వుంచకూడదు. కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. అల్లాహ్ భయభీతి (అల్లాహ్ కు భయపడటం) కూడ ఆరాధనే. పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ 03:175) 

ఉమ్మీద్ వ రజా: ఆశా & భీతి 

దాసుడు అల్లాహ్ పట్ల విశ్వాసుడై ఆయనపై ఆశలు పెట్టుకుంటాడు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

అర్ధం : “ఎవరైన తన ప్రభువుతో కలవాలని ఆశిస్తున్నప్పుడు అతను సత్కార్యాలు చెయ్యాలి, 

మరియు ఆరాధనల్లో తన ప్రభువుకు సాటి కల్పించకూడదు. (అల్ కహఫ్18:110) 

తవక్కుల్: అల్లాహ్ పై నమ్మకం 

నమ్మకం అంటే ఏదైన కార్యం జరగాలని ఆయన (అల్లాహ్) పైనే నమ్మకం, భారం మోపుతారు. 

పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి“. (అల్ మాయిదా 5:23) 

దైవ గ్రంధములో మరో చోట ఇలా తెల్పబడింది: 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు”. (అత్తలాఖ్ 65:3) 

రగ్బత్, రహ్బత్, ఖుషూ: ఆయన వైపే మరలుతూ భయపడాలి 

అంటే ఆశ, భయభీతి తోను, వినమ్రత తోనూ ఆయన వైపే మరలుతారు. ఇదీ ఆరాధనే. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు”. (అల్ అంబియా 21:90) 

ఖష్యత్ : భయ భక్తులు కలిగి వుండటం 

ఎవరైన దౌర్జన్యం చేసినప్పుడు భయపడతాం. కాని అటువంటి సందర్భాల్లో కూడ అల్లాహ్ కు మాత్రమే భయపడాలి. ఇదీ ఒక ఆరాధనే. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా ప్రస్తావించాడు: 

 فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي

మీరు వారితో భయపడకండి, నా తోనే భయపడండి”. (అల్ బఖర 2:150) 

ఇనాబత్, రుజు : మరలటం 

తప్పు జరిగిన ప్రతిసారి అల్లాహ్ వైపు మరలాలి. ఇదీ ఒక ఆరాధనే. 

దీనికై పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి”. (అజ్జుమర్ 39:54) 

ఇస్తిఆనత్ : సహాయం కొరకు అర్ధించుట 

సర్వశక్తులు కలవాడైన అల్లాహ్ నుండి సహాయం కోరాలి. ఇదికూడ ఒక ఆరాధన. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

మేము నిన్నే ఆరాధిస్తున్నాము, మరియు నీతోనే సహాయాన్ని కోరుతున్నాము”. (అల్ ఫాతిహ 01:05) 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులో కూడ ప్రత్యేకించి దీని గురించి చెప్పబడింది. 

إِذَا سُتَعَدُتَ فَاسْتَعِنُ بِاللَّهِ 

అర్ధం : “మీరు సహాయం కోరాలనుకున్నప్పుడు అల్లాహ్ సహాయాన్నే అర్ధించండి”. (తిర్మిజి, హసన్ సహీహ్) 

ఇస్తిఆజాహ్: శరణం, ఆశ్రయం కోరుట 

పరిపూర్ణంగా ఆశ్రయమిచ్చే అల్లాహ్ ఆశ్రయాన్నే కోరాలి. ఇదీ ఒక ఆరాధనే. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ اَعُوذُ بِرَبِّ النَّاسِ مَلِكِ النَّاسِ 

నేను మానవుల ప్రభువుతో, శరణు కోరుతున్నాను. మానవుల చక్రవర్తి (అల్లాహ్) తో (శరణు కోరుతున్నాను)”. (అన్నాస్ 114:1-2) 

ఇస్తిగాస: నిర్బంధత్వంలో అల్లాహ్ సహాయాన్ని అర్జించుట

 ఇదీ ఒక ఆరాధనే అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: 

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ

అర్ధం : “ఆ సందర్భాన్ని తలచుకొండి అప్పుడు మీరు మీ ప్రభువును మొరపెడుతూ వేడుకున్నారు అప్పుడు ఆయన మీ బాధను విన్నాడు (మీమొరను ఆలాకించాడు)”. (అల్  అన్ ఫాల్  08:09) 

జిబాహ్, ఖుర్బాని : సమర్పణ, బలిదానం 

ఇదికూడ అల్లాహ్ కొరకే చేయాలి. 

అల్లాహ్ పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.” (అల్ అన్ఆమ్ 06:162,163) 

దీనిగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ఇలా ప్రస్తావించారు: 

لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ 

ఎవరైన అల్లాహ్ ను తప్ప మరే ఇతర ఆరాధ్య దేవుళ్ళ (ప్రవక్త, వలి, పీర్, ముర్షద్, బాబా, సమాధిలోని వాడు) సన్నిధి కోరాలని దేనినైనా బలిస్తే, అతని పై అల్లాహ్ శాపం కలుగుతుంది”. (ముస్లిం) 

నజర్ : మొక్కుబడి 

ఇది కూడ అల్లాహ్ కోసమే చేయాలి. ఇది కూడా ఒక ఆరాధనే. దీని గురించి ఖుర్ఆన్ గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అద్దహర్ 76:7) 

رَبِّ زِدْنِي عِلْمًا 

ద్వితీయ సూత్రం: 

ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో తెలుసుకోవడం తప్పని సరి 

అల్లాహ్ ఏకత్వాన్ని సహృదయముతో అంగీకరిస్తూ తమకు తాము అల్లాహ్ కు విధేయులుగా సమర్పించుకోవాలి. ఆయన ఆదేశాలకు అణుగుణంగా విధేయతపాటిస్తూ అనుసరించాలి. ఆయనతో పాటు మరెవ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాటి కల్పించకూడదు. ఇదే సత్య ధర్మం (దీన్). 

ధర్మంలో 3 స్థానాలున్నాయి: 

  • 1. మొదటి స్థానం : ఇస్లాం 
  • 2. రెండవ స్థానం : ఈమాన్ 
  • 3. మూడవ స్థానం : ఇహ్సాన్ 

ఈ మూడింటిలోనూ ప్రతి దానికి కొన్ని మూలాలున్నాయి.

ఇస్లాం – దీనికి 5 మూలాలున్నాయి. 

  • 1. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేడని, (తౌహీద్) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్య ప్రవక్త అని సాక్షమివ్వటం. 
  • 2. నమాజు స్థాపించటం. 
  • 3. జకాత్ (ధర్మ దానం) ఇవ్వటం. 
  • 4. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం. 
  • 5. హజ్ (కాబా గృహ దర్శనం) చేయటం. 

పై పేర్కొనబడిన “ఇస్లాంకు గల 5 మూలాల” గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

1. తౌహీద్: అల్లాహ్ ఏకత్వానికి సాక్షమివ్వటం 

అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యదేవుడు. ఆయనకు సాటి ఎవరూలేరు అని నమ్మి, ఉచ్చరించడం. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు”. (ఆలి ఇమ్రాన్ 03:18) 

తౌహీద్ గురించి సాక్ష్యం అంటే అల్లాహ్ తప్ప మరెవరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు. ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ వాక్యపరంగా కలిగివున్న అర్ధం ఏమిటంటే, ‘లాఇలాహ‘ ఏ దేవుడు లేడని, “అల్లాహ్ తప్ప మరిదేనిని ఆరాధించిన, పూజించిన నిరాకరించ బడుతుందనే అర్ధం కలిగివుంది”. మరి ‘ ఇల్లల్లాహ్ ‘ కేవలం ఏకైక అల్లాహ్ కొరకే సమస్త ఆరాధనలు ఉన్నాయనే అర్ధం కల్గియుంది. ఆయన సామ్రాజ్యంలో, ఎలాగైతే ఎవరూ భాగస్వాములు లేరో, అలాగే ఆయన ఆరాధనల్లో ఆయనకు ఎవరూ సాటిలేరు. 

దీని గురించి పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): “మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను.“నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు.”మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి. (అజ్ జుఖ్ రుఫ్ 43:26-28) 

మరొక చోట ఖుర్ఆన్ గ్రంధములోఇలా ప్రస్తావించబడింది. 

قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ

(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి. (ఆలి ఇమ్రాన్ 03:64) 

దైవ సందేశరునికి సాక్ష్యం : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ ప్రవక్త అని సాక్షమివ్వాలి. అందుకు పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు”. (అత్ తౌబా 9:128) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం అంటే ఆయన ఇచ్చిన ఆదేశాలను సంపూర్ణంగా పాటించటం. ఆయన దేనినైతే తెలియచేశారో దానిని సత్యం అని అంగీకరించాలి. దేని గురించైతే నిరాకరించారో దానికి పూర్తిగా కట్టుబడి వుండాలి. అల్లాహ్ ఆరాధన కేవలం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడుగు జాడల్లోనే ఆచరించాలి. 

నమాజ్, జకాత్, తౌహీద్ మూడింటికి సంబంధించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం”. (అల్ బయ్యిన 98:05) 

పవిత్ర రమజాన్ మాసములో ఉపవాసాలు పాఠించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”. (అల్ బఖర 2:183) 

కాబా గృహాన్ని సందర్శించమని అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు: 

فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ

అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఆలి ఇమ్రాన్ 03:97) 

రెండవ స్థానం: ఈమాన్ 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

“ఈమాన్ (విశ్వాసం) కు సంబంధించి డెబ్భైకు పైగా స్థానాలున్నాయి. అందులో ఉన్నత స్థానం “లాఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్యదేవుడు లేడు) అని సాక్ష్యం పలకటం. అన్నిటి కంటే అల్ప స్థానం దారి నుండి హాని కల్గించే వస్తువు (ముళ్ళు వంటివి)ను దూరం చేయడం.సిగ్గు, వ్రీడ, శీలం కూడ విశ్వాసానికి సంబంధించిన విషయాలే”. (సహీహ్ ముస్లిం). 

ఈమాన్ కు 6 కోణాలున్నాయి 

  • 1. అల్లాహ్ ను విశ్వసించుట.
  • 2. అల్లాహ్ దూతలను విశ్వసించుట.
  • 3. అల్లాహ్ గ్రంధాలను విశ్వసించుట.
  • 4. అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించుట.
  • 5. ప్రళయ దినాన్ని విశ్వసించుట. 
  • 6. విధి వ్రాత చెడైన, మంచిదైన దానిని విశ్వసించుట. 

ఈమాన్ (విశ్వాసం)కు గల 6 కోణాలకు ఆధారాలు : 

పైన పేర్కొనబడిన ఆరింటిలో ఐదు గురించి దైవగ్రంధం పవిత్ర పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావించబడింది: 

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం” (అల్ బఖర 2:177) 

6వ కోణం విధి వ్రాత (మంచి, చెడు) గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఇలా పేర్కొనబడింది: 

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ

నిశ్చయంగా, మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) ‘విధి’ ప్రకారం సృష్టించాము”. (అల్ ఖమర్ 54:49) 

మూడవ స్థానం: ఇహ్సాన్: ఉత్తమం 

‘ఇహ్సాన్’కు సంబంధించి ఒకే ఒక మూలం ఉంది. అది మీరు అల్లాహ్ ను  అభిమానంతో, భయభక్తితో, ఆయన వైపు ఏకాగ్రతతో,మరలుతూ ప్రార్ధించాలి. మనస్పూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నట్టు ఆరాధించాలి. మనము చూడలేక పోయినా ఆయన మమ్మల్ని చూస్తునే ఉన్నాడని గ్రహించాలి. 

‘ఇహ్సాన్ ‘కు సంబంధించిన ఆధారాలు : 

‘ఇహ్సాన్’ గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు: 

إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ

నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు” (అన్ నహ్ల్ 16:128) 

وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ

సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగ పడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు”.  (ఆష్ షుఅరా 26: 217-220). 

మరో చోట ఇలా పేర్కొన్నాడు: 

وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ

(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము” (యూనుస్ 10:61)

పై మూడింటికి సున్నత్ ఆధారాలు: 

ధర్మంలో పై మూడు స్థానాలు ఉన్నాయని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రముఖ, ప్రఖ్యాత హదీసు ‘హదీసె జిబ్రయీల్ ‘ను గమనించండి: 

” عن عمر بن الخطاب رضی الله عنه قال: بينما نحن جلوس عند النبى الله اطلع علينا رجلٌ 

شديد بياض الثياب، شديد سواد الشعر، لأيرى عليه أثر السفر، ولا يعرفه منا احد. فجلس 

الى فـأسـنــدركبتيه إلى ركبتيه ووضع كـفيـه عـلـى فـخـذيــه وقال: يا محمد، أخبرني عن الإسلام، فقال: أن تشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله ، وتقيم الصلوة، وتؤتي الزكاة،وتصوم 

رمضان، وتحج البيت إن استطعت اليه سبيلاً. قال : صدقت. فعجبناله يسأله ويصدقه. قال: أخبرني عن الإيمان، قال أن تؤمن بالله وملائكته وكتبه ورسله واليوم الآخر وبالقدر خيره وشره.قال: أخبرني عن الاحسان، قال: أن تعبد الله كأنك تراه فان لم تراه فانه يراك. قال أخبرني عن الساعة،قال: ما المسؤل عنها بأعلم من السائل. قال أخبرني عن أمارتها، قال: ان تلد الامة ربتها وأن ترى الحفاة العراة العالة رعاء 

الشاء، يتطاولون في البنيان قال : فمضى فلبثنامليا . قال : يا عمر أتدرون من السائل؟ قلنا: الله ورسوله 

أعلم، قال: هذا جبريل أتاكم يعلمكم أمر دينكم .” (صحیح بخاری و صحیح مسلم 

అర్ధం : హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) కధనం: 

“ఒక సారి మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి మా సమావేశంలో వచ్చాడు. అతని వస్త్రాలు తెల్లవిగాను, తలవెంట్రుకలు దట్టంగా ఉండి మిక్కిలి నల్లవిగాను ఉన్నాయి. అతనిపై ప్రయాణపు అలసట, ఆనవాళ్ళు కనబడట్లేదు. పైగా మాలో ఎవరు అతన్ని ఎరుగరూ కూడ. అతనికి తెలిసిన వారు లేరు కూడ. అతను నేరుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళకు తన మోకాళ్ళు ఆనించి, చేతులు తొడలపై పెట్టుకుని సవినయంగా (మర్యాదస్థితిలో కూర్చున్నాడు. తరువాత ఇలా ప్రశ్నించసాగాడు: 

ఓ ముహమ్మద్..! (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్లాం గురించి వివరించండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇస్లాం అంటే అల్లాహ్ తప్ప మరేఆరాధ్య దేవుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తూ, ‘నమాజు’ స్థాపించాలి. ధర్మదానం చేయాలి(జకాత్ చెల్లించాలి). పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసాలను పాటించాలి. సిరి, సంపదలు కల్గివుంన్నప్పుడు పవిత్ర ‘ కాబా’ (అల్లాహ్ గృహాన్ని) దర్శించాలి”. ఇది విన్న ఆ వ్యక్తి అవును మీరు చెప్పింది నిజమే.. అన్నాడు. అతని జవాబుకు మేము ఆశ్చర్యపోయాము. తనే ప్రశ్నిస్తునాడు, తనే నిజమంటున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు: ‘ఈమాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “అల్లాహ్ ను , ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాత (మంచి, చెడు)ను విశ్వసించాలి. 

ఇది విన్న ఆ వ్యక్తి మళ్ళి ఇలా ప్రశ్నించాడు: ‘ఇహ్సాన్’ గురించి తెల్పండి. దానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నీవు మనస్ఫూర్తిగా అల్లాహ్ ను చూస్తున్నటు ఆరాధించు.. నీవు చూడక పోయిన ఆయన నిన్ను గమనిస్తున్నాడని గ్రహించు”. అనంతరం మళ్ళీ ప్రశ్నించాడా వ్యక్తి: మరి ప్రళయం ఎప్పుడోస్తుందో తెల్పండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ప్రళయం ఎప్పుడోస్తుందో ప్రశ్నించదగిన వానికంటే ప్రశ్నించే వాడికే బాగా తెలుసు” అని అన్నారు. ఆ వ్యక్తి మరల ప్రశ్నించాడు: అయితే దాని చిహ్నాలను చెప్పండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “బానిసరాలు తమ యజమానిని కంటారు. చెప్పులు, వస్త్రాలు లేని మెకల కాపర్లు పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంలో గర్వపడతారు”. 

హజ్రత్ ఉమర్(రజి అల్లాహు అను) ఇలా తెలిపారు: ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము కొద్దిసేపు మౌనంగా వున్నాము. అంతలోనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- ఓ ఉమర్..! (రజి అల్లాహు అన్హు) ఆ ప్రశ్నికుడేవరో తెలుసా..? అన్నారు. అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ ఆయన ‘జిబ్రయీల్’ (దైవదూత). ఆయన మీ వద్దకు ధార్మిక విద్యను నేర్పటానికి వచ్చారు” అని వివరించారు. (బుఖారి, ముస్లిం). 

మూడవ సూత్రం: దైవప్రవక్త ﷺ గురించి అవగాహన 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన తండ్రి పేరు అబ్దుల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల మహా వృక్షము ఇలా ఉంది:  ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం

‘హాషిం’ వంశం పరువు, ప్రతిష్ఠ పేరు ప్రఖ్యాతలకు నిలయం. ఇది ఖురైష్ వంశానికి చెందింది. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక తెగ. అరేబియులు (అరబ్బులు) ప్రవక్త ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) సంతానం. 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) పూర్తి జీవిత కాలం 63సంవత్సరాలు. అందులో 40సంవత్సరాలు దైవ వాణి అవతరించక ముందువి. దైవ వాణి అవతరించి దైవ సందేశహరులుగా సంవత్సరాలు జీవించారు. ఆయన పవిత్ర మక్కా నగరంలో జన్మించారు. ఆయన పై తొలి దైవ వాణిలో ఈ వాక్యాలు అవతరింపబడ్డాయి. 

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ

(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (అల్ అలఖ్ 96:1) 

(వాటి ద్వార దైవప్రవక్తగా నియమితులయ్యారు.)

రెండో సారి దైవ వాణిలో అవతరించిన వాక్యాలు (ఆయతులు): 

يَا أَيُّهَا الْمُدَّثِّرُ

قُمْ فَأَنذِرْ


ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు”. (అల్ ముద్దస్సిర్ 74:1-2) 

ఈ వాక్యాల ద్వార దైవసందేశహరులుగా నియమితులయ్యారు. ప్రజలకు షిర్క్(బహుదైవారాధన) గురించి వారించి, హెచ్చరించి, తౌహీద్ (ఏకదైవారాధన) వైపునకు పిలవటానికి, అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. 

దీని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الْمُدَّثَرُ قُمْ فَانْذِرُ. وَرَبَّكَ فَكَبْرِ ، وَثِيَابَكَ فَطَهِّرُ وَالرُّجُزَ فَاهْجُر. 

وَلَا تَمْنُنْ تَسْتَكْسِرُ. وَلِرَبِّكَ فَاصْبِر) (سورة المدثر: ۱-۷۲) 

అర్ధం : “ ఓ దుప్పటి కప్పుకొని నిద్రించేవాడా..! మేలుకో (నిలబడు), (ప్రజలను)హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటిచెప్పు. నీ వస్త్రాలను పరిశుభ్రముగా ఉంచుకో. చెడు నుండి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే అత్యాశతో ఉపకారము చేయకు. నీ ప్రభువుకై సహనం వహించు”. 

(అల్ ముద్దస్సిర్74:1-7) 

దైవ వాణిలోని పదాల వివరణ:- 

2 قُمْ فَأَنذِرْ. మీరు ప్రజలను ‘షిర్క్ (బహుదైవారాధన) గురించి హెచ్చరించి భయపెట్టండి. అల్లాహ్ ఏకత్వం వైపునకు పిలవండి. 

3. وَرَبَّكَ فَكَبْرِ అల్లాహ్ ఏకత్వం తోపాటు అతని గొప్పతనాన్ని చాటి చెప్పండి. 

4. وَثِيَابَكَ فَطَهِّرُ  తమ కర్మలను షిర్క్ (బహుదైవారాధన) తో కల్పితం చేయకుండా శుభ్రముగా ఉంచండి. 

5. وَالرُّجُزَ అంటే విగ్రహాలు. 

6 فَاهْجُر అంటే దానిని విడనాడుట. 

వివరణ: 

విషయం ఏమనగా ఇంత కాలం మీరు ఎలాగైతే దానికి దూరంగా ఉన్నారో, అలాగే దాన్ని తయారు చేసి పూజించే వారితో కూడా దూరంగా ఉండండి. వారితో తమకు ఎటువంటి సంబంధములేదని చాటి (విజ్ఞప్తి చేయండి) చెప్పండి. 

ఈ ఒక్క అంశాన్నే మాటనే కేంద్రీకరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10సంవత్సరాలు అంకితం చేశారు. ప్రజలను ‘తౌహీద్’ (ఏకత్వం) వైపునకు పిలుస్తూవున్నారు. 10సంవత్సరాల తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు గగనయాత్ర (మేరాజ్) చేయించబడింది. ఆ శుభ సందర్భములో ఆయనపై అయిదు పూటల నమాజ్ విధిగా నిర్ణయించబడింది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 3 సంవత్సరాల వరకు పవిత్ర మక్కా నగరంలో నమాజు చేస్తూవున్నారు. ఆ తర్వాత పవిత్ర మదీనా వైపు వలస చేయమని ఆజ్ఞా పించటం జరిగింది. 

హిజ్రత్:(వలసత్వం) 

వలసచేయుట. అంటే షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశము నుండి ఇస్లాం ప్రకారం ఆచరణ చేయగలిగే ప్రదేశమునకు వలసపోవుట అని అర్ధం. (బహుదైవారాధకుల ప్రదేశంలో ఏకదైవరాధన (అల్లాహ్ ఆరాధన) పట్ల కష్టాలు ఎదురై, సమస్యలు ముదిరినప్పుడు ఆ ప్రదేశం నుండి కేవలం ధార్మికత కోసమే వలస చేయాలి) ఈవిధముగా వలసచేయుట, ప్రదేశాలు మారుట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్ (జాతి) పై విధిగా పరిగణించబడింది. ఇది ప్రళయం వరకు సాగే విధి. దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది: 

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ قَالُوا فِيمَ كُنتُمْ ۖ قَالُوا كُنَّا مُسْتَضْعَفِينَ فِي الْأَرْضِ ۚ قَالُوا أَلَمْ تَكُنْ أَرْضُ اللَّهِ وَاسِعَةً فَتُهَاجِرُوا فِيهَا ۚ فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا

فَأُولَٰئِكَ عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ اللَّهُ عَفُوًّا غَفُورًا

“(ఎవరైతే) తమ ఆత్మలపై అన్యాయం చేసుకుంటు ఉండేవారో, వారి ఆత్మలను దైవదూతలు (తమ) ఆధీనంలో తీసుకున్నప్పుడు (వారిని ప్రశ్నిస్తారు) మీరు ఈ స్థితిలో వున్నారేమిటని? (దానికి వారు బదులు పలుకులో) మేము భూమి పై బలహీనులుగా వున్నాము. దైవ దూతలు అంటారు. అల్లాహ్ యొక్క భూమి విశాలముగా లేదా? మీరు అందులో వలసచేయటానికి? వీరే ఆవ్యక్తులు! వీరి నివాసమే నరకము. అది మహా చెడ్డనివాసం. కాని నిజంగా అవస్థలో పడివున్న ఆ పురుషులు, స్త్రీలు, చిన్నారులు వలస పోవుటకు ఎటువంటి దారి పొందనప్పుడు, అల్లాహ్ వారిని క్షమించే అవకాశం ఉంది.అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు. మన్నించేవాడు”. (అన్నిసా 04:97-99) 

అల్లాహ్ మరొచోట అల్లాహ్ పేర్కుంటున్నాడు: 

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ

విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి”. (అన్కబూత్ 29:56) 

ఇమాం బగ్విఁ (రహ్మతుల్లాహి అలైహి) ఈ ఆయత్ అవతరణ సందర్భము గురించి ఇలా పేర్కొన్నారు: 

ఈ ఆయతు ఎవరైతే వలసచేయకుండా మక్కా ప్రదేశములో ఉన్నారో, ఆముస్లింల గురించి అవతరింపబడింది. అల్లాహ్ వారిని ఈమాన్ (విశ్వాస లక్షణం) తో పిలిచాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా ప్రస్తావించారు: 

لاتنقطع الهجرة حتى تنقطع التوبة ولا تنقطع التوبة حتى تطلع الشمس من مغربها 

“ తౌబా’ తలుపులు మూయబడే వరకు ‘హిజ్రత్’ వలసత్వం ఆగదు. మరి ‘తౌబా’ తలుపులు మూయబడాలంటే సూర్యుడు పడమర నుండి ఉదయిం చాలి. (ప్రళయ దినమే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు). 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో స్థిరపడిన తర్వాత మిగితా ఇస్లాం ధర్మోపదేశాలు ఇవ్వబడ్డాయి. 

ఉదా : జకాత్ (ధర్మదానం), రోజా(ఉపవాసం), హజ్ (పవిత్ర మక్కా యాత్ర), అజాన్ (నమాజు కొరకు పిలుపు), జిహాద్ (ధార్మిక అంతులే కృషి) ‘అమర్ బిల్ మారూఫ్, నహి అనిల్ మున్కర్’ (మంచిని పెంచుట, చెడును త్రుంచుట) మొదలైనవి. 

పై ఆదేశాలపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం ప్రళయం వరకూ ఉంటుంది. దీనిని అల్లాహ్ యే ప్రళయం వరకు రక్షిస్తాడు. 

ఇస్లాం ధర్మం 

ప్రవక్త ﷺ శాసన సారాంశం 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపబడిన ఈ ధర్మం ఎంతో సంక్షిప్తమైనది, ఉత్తమమైనది. ప్రజలకు ఆ మంచి కార్యము అందలేదు అని చెప్పటానికి మంచిలోని ఏభాగము మిగలలేదు. మంచికార్యాలలో అమితముగా మార్గదర్శకత్వం వహించిన కార్యం ‘తౌహీద్’ (అల్లాహ్ ఏకత్వం) మరియు అల్లాహ్ మెచ్చుకునే ప్రతి మంచి కార్యంకూడ. ఈ పుణ్యకార్యాలు అల్లాహ్ ఇష్టాన్ని పొందుటకు మూలమైనవి. చెడు లో అతి ఎక్కువగా హెచ్చరించిన కార్యం ‘షిర్క్’ (అల్లాహ్ తోసాటి కల్పించడం, బహుదైవారాధన). మరి అల్లాహ్ ఇష్టపడని కార్యాలతో కూడ హెచ్చరించారు. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను అల్లాహ్ సర్వమానవాళి కొరకు దైవ సందేశహరులుగా పంపాడు. మానవులు జిన్నాతులు ఆయనకు విధేయత చూపాలని విధిగా నిర్ణయించాడు. 

పవిత్ర గ్రంధం ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. (అల్ ఆరాఫ్ 7:158) 

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ఇహ, పరలోకాలకు సంబంధించిన అన్ని విషయాల పరిష్కారాల్ని పెట్టాడు. ఎటువంటి లోపం మిగలలేదు. ఇందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా తెలుపబడింది: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అర్ధం : “ఈ రోజు నేను (అల్లాహ్) మీ ధర్మాన్ని మీకోసం పరి పూర్ణం చేశాను,మరి నా అనుగ్రహాన్ని మీపై పూర్తిచేశాను, ఇస్లాం మీ ధర్మంగా అంగీకరించాను”. (అల్ మాయిదా 05:3) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈలోకం నుండి పయనించారు (మరణించారు) అని చెప్పటానికి దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ ఆధారం: 

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

అర్ధం : “ప్రవక్తా..! మీరూ మరణించే వారే, మరియు వారు కూడ మరణించే వారే. చివరికి మీరందరు ప్రళయంలో మీ ప్రభువు ముందు తమ తమ ‘పేషీ’ (హాజరు ఇవ్వవలసి ఉన్నది) చేయవలసి యుంటుంది. (అజ్జుమర్ 39:30 – 31) 

ప్రజలందరూ మరణించిన తర్వాత తమకార్యకలాపాల ఫలితాలను పొందటానికి లేపబడతారు, దీని గురించి పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ

“ఇదే భూమి నుండి మేముమిమ్మల్ని సృష్టించాము, మరియు ఇందులోకే తీసుకు వెళ్తాము, దీని నుండే మిమ్మల్ని మరల వెలికితీస్తాము. (మరోసారి సృష్టిస్తాము)”. (తాహా 20:55) 

మరణాంతర జీవితం గురించి మరోచోట ఇలా పేర్కొన్నాడు: 

وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

అల్లాహ్ మిమ్మల్ని ప్రత్యేకించి భూమి నుండి సృష్టించాడు, మరల ఆయన అదే భూమిలోకి తీసుకువెళ్తాడు. (ప్రళయంనాడు అదే భూమి నుండి) మిమ్మల్ని ఒక్కసారిగా లేవతీస్తాడు”. (సూరె నూహ్ 71:17-18) 

మలి విడత సృష్టించిన తర్వాత అందరితో లెక్క తీసుకుంటాడు. వారి పాప పుణ్యకర్మల ప్రకారం ప్రతిఫలాన్ని అందజేస్తాడు. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు: 

وَلِلَّهِ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاؤُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ 

الَّذِينَ أَحْسَنُوا بالحسنى (سورة النجم : ٣١) 

భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతిదానికి అల్లాహ్ యే అధిపతి. (ఎందుకంటే) పాపకార్యాలు చేసిన వారికి వారి కర్మఫలాన్ని ఇచ్చేందుకునూ, మరి పుణ్యవంతులకు మంచి ఫలితాన్ని ప్రసాదించేందుకునూ”. (అన్నజ్మ్  54:31) 

ఎవరైన మరణాంతర జీవితాన్ని నిరాకరిస్తే అతను అవిశ్వాసి, అతని గురించి దైవగ్రంధము ఇలా ప్రస్తావిస్తుంది: 

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.”. (అత్తఘాబున్ 64:7) 

అల్లాహ్ ప్రవక్తలందరికి ‘స్వర్గపు’ శుభవార్త ఇచ్చేవారుగా, ‘నరకము’ నుండి హెచ్చరించేవారుగా చేసి పంపాడు: 

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ

మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి”. (అనిస్సా 4:165) 

ప్రవక్తల్లో తొలి ప్రవక్త హజ్రత్ ‘నూహ్’ (అలైహిస్సలాం) చివరి ప్రవక్త హజ్రత్ ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయనే అంతిమ ప్రవక్త. ప్రవక్త ‘నూహ్’ (అలైహిస్సలాం) కంటే ముందు ఏ ప్రవక్త లేరు. అల్లాహ్ దీని గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు: 

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ

ఓ ప్రవక్తా! మేము మీవైపు అలాగే దైవవాణి పంపాము, ఎలాగైతే నూహ్ వైపు మరియు వారి తర్వాత ప్రవక్తలవైపు పంపామో”. (అన్నిస్సా 4:163) 

‘నూహ్’ (అలైహిస్సలాం) మొదలుకొని ప్రవక్త ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ప్రతి జాతిలోను మేము సందేశహరులను పంపాము. (వారు) తమ జాతి వారికి అల్లాహ్ ఆరాధించమని, ‘తాఘత్ ‘ను పూజించవద్దని చెప్తూవచ్చేవారు.

అందుకు దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్ లో ఆధారం: 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము”. (అన్ నహ్ల్ 16:36) 

అల్లాహ్ తన దాసులందరి (జిన్నాతులు, మానవులు) పై విధిగా నిర్ణయించింది ఏమనగా వారు ‘తాఘాత్ ‘ను నిరాకరించి, తనను (అల్లాహ్) విశ్వసించి తీరాలి. 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్ ) ‘తాఘాత్’ గురించి వివరిస్తూ ఇలా పెర్కొన్నారు: 

“అల్లాహ్ తప్ప మరి దేనిని ఆరాధించినా, లేక అనుసరించినా (అనుసరించే విధానంలో అల్లాహ్ అవిధేయతను కల్గివుంటే), మరి ‘హలాల్-హరామ్’ విషయాలలో మరొకరికి విధేయత చూపినా, అతడు దైవదాసుల పరిధిని దాటిన వాడవుతాడు. అదే (సమయం) లో వాడు ‘తాఘత్’ను అనుసరించిన వాడవుతాడు. 

లెక్కకు మించిన ‘తాఘాత్’లు ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో అయిదుగురున్నారు. 

1. ఇబ్లీస్ లయీన్. 

2. ఎవరైన వ్యక్తి తన పూజ జరుగుతున్నప్పుడు దానిని మెచ్చుకునేవాడు.
3. ప్రజలకు తనను పూజించమని ఆహ్వానించే వ్యక్తి. 

4. నేను అగోచర విషయాల(జ్ఞానము కలవాడిని)ను ఎరుగుదును అనే వ్యక్తి. 

5. అల్లాహ్ అవతరింపజేసిన ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పేవాడు. 

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంధములో ఇలా సెలవిస్తున్నాడు: 

 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుట మయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు”. (అల్ బఖర 2:256) 

ఇదే ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు) కు అసలైన అర్ధము, వివరణ. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. 

رَاسُ الأمر الاسلامُ وَعَمُودُهُ الصَّلاةُ وَذِرْوَةُ سَنَامِهِ الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ” اعلم 

(طبرانی کبیر ، صححه السيوطى فى جامع صغير وحسنه المناوي في شرحه والله 

అర్ధం : “ఈ ధర్మానికి అసలు మూలం “ఇస్లాం” మరి దీనిని (పటిష్టంగా నిలబెట్టె బలమైన) స్థంభం నమాజ్. ఇందులో ఉన్నతమైన, ఉత్తమమైన స్థానం దైవ మార్గములో చేసే ధర్మ పోరాటం”. (తబ్రాని కబీర్)