హస్తాన్ని పరిశీలించి లేదా తారాబలాన్ని చూసి అగోచర  జ్ఞానం ఉందని చెప్పటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అగోచరం అంటే .. :

భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే  జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.

అగోచర జ్ఞానాన్ని అల్లాహ్‌ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ

“అల్లాహ్  తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్‌ నమ్ల్‌ 27: 65)

అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ

“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్‌ జిన్న్‌ : 26, 27)

అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్‌ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్‌ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”

ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్‌ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)

అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.

కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.

ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్‌ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్  యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)

తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – ఇమామ్ అస్-సాదీ| ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

2వ అధ్యాయం
తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl


అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

చెట్లు, రాళ్ళతో శుభం (తబర్రుక్‌ ) కోరుట ముష్రిక్కుల పని – ఏకత్వపు బాటకు సత్యమైన మాట

9 వ అధ్యాయం
చెట్లు , రాళ్ళతో శుభం (తబర్రుక్‌ ) కోరుట

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ

అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?” (సూరా నజ్మ్ 53:19,20).

అబూ వాఖిద్‌ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము  ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం  స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్‌) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్‌”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.

అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్‌ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.

(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.

ముఖ్యాంశాలు 

1. సూరె నజ్మ్ లోని ఆయత్‌ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).

2. సహాబాలు (సహచరులు) “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండని ప్రవక్తను కోరింది, అచ్చట “తబర్రుక్‌’ (శుభం) పొందాలనే ఉద్దేశంతోనే. వాటిని దేవతలుగా చేసుకుందామనికాదు.

3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు  తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.

4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని  ప్రేమిస్తాడని వారనుకున్నారు.

5. ఇది షిర్క్‌కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).

6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.

7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని  స్పష్టం చేసారు.

8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్‌, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.

9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.

10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).

11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్‌ చిన్నదీ  (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.

12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్‌గా  భావించేవారు అని తెలుస్తుంది.

13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్‌” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.

14. (షిర్క్‌ మరియు బిద్‌ అత్‌ )కు చేర్పించే  సాధనాలన్నిటినీ  రద్దు చేయాలని తెలిసింది.

15. జాహిలియ్యత్‌ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.

16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.

17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.

18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.

19. ఖుర్‌ఆన్‌లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.

20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్‌ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్‌ చేయరాదు).

21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.

22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్‌ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్‌ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్‌ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్‌ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్‌ కోరుట కూడా తప్పు.

కాబతుల్లా లోని హజర్  అస్వద్‌ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్‌ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.


ఇతరములు:

విశ్వాస మూల సూత్రాలు: నాల్గవ పాఠం – షిర్క్, దాని రకాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[16 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:

షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.

అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!

అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.

షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.

మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.

పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:

[وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ] {الأنعام:88}

{ఒకవేళ వారు షిర్క్ చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేది}. (సూరె అన్ఆమ్ 6: 88).

వారితో షిర్క్ ముమ్మాటికీ జరగలేదు, వారిని ప్రస్తావించి మనల్ని హెచ్చరించడం జరిగింది.

పెద్ద షిర్క్ ను అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేయనిది క్షమించడు. ఖుర్ఆన్ సాక్ష్యం చూడండి:

[إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا] {النساء:48}

{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).

పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللهِ] {البقرة:165}

{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).

రెండవది: చిన్న షిర్క్: ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكُ الْأَصْغَرُ) قَالُوا: يَا رَسُولَ الله وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: (الرِّيَاءُ).

“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని. (ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).

«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»

ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).

తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).

అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:

[قُلْ لَا يَعْلَمُ مَنْ فِي السَّمَاوَاتِ وَالأَرْضِ الغَيْبَ إِلَّا اللهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ] {النمل:65}

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).

అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

తాను విశ్వసించే మత ధర్మాన్ని పరిహసించిన మనిషి ధర్మభ్రష్ఠుడైపోతాడు. ఆ ధర్మం నుండి పూర్తిగా బహిష్కృతుడవుతాడు. విశ్వప్రభువు ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

వారితో అను: “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా? మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (అత్‌ తౌబా – 65, 66)

అల్లాహ్‌తో, ఆయన ప్రవక్తతో, ఆయన సూక్తులతో పరిహాసమాడటం అవిశ్వాసానికి (కుఫ్ర్కు) తార్కాణమని ఈ ఆయతుల ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి ఎవరు ఈ విషయాలలో ఏ ఒక్కదానినయినా పరిహసిస్తాడో అతను అన్నింటినీ పరిహసించిన వాడిగానే పరిగణించబడతాడు. అలనాడు (మదీనాలో) కపటుల విషయంలో జరిగింది కూడా ఇదే. వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను, ప్రవక్త సహచరులను ఎగతాళి చేశారు. అందుచేత పై ఆయతులు అవతరించాయి.

ధార్మిక చిహ్నాలలో ఏ ఒక్కదానినయినా పరిహసించేవాడు ధార్మిక చిహ్నాలన్నింటినీ తప్పనిసరిగా కించపరుస్తాడు. అలాగే అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) చిన్నచూపు చూసేవాడు, నిజ దైవాన్ని వదలి మృతులను వేడుకోవటాన్ని గౌరవ దృష్టితో చూస్తారు. వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలిచినపుడు, షిర్క్‌ నుండి వారించినపుడు ఎగతాళి చేస్తారు. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا

వారు నిన్ను చూచినప్పుడల్లా, నీతో వేళాకోళానికి దిగుతారు. “అల్లాహ్ ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా?! మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవుళ్ల నుండి తప్పించేవాడే” అని ఎద్దేవా చేస్తారు. (అల్‌ ఫుర్ఖాన్‌ : 41, 42)

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారిని షిర్క్‌ నుండి వారించినపుడు, వారు ఆయన్ని పరిహసించారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. దైవప్రవక్తలు తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించినప్పుడల్లా ముష్రిక్కులు వారిలో తప్పులెన్నే ప్రయత్నం చేశారు. ప్రవక్తలను అవివేకుల క్రింద జమకట్టారు. వారిని మార్గవిహీనులన్నారు. పిచ్చోళ్ళన్నారు. ఎందుకంటే వారి హృదయాలలో షిర్క్‌ (బహుదైవారాధన) పట్ల భక్తి భావం ఉండేది. అలాగే ముష్రిక్కులను పోలిన పనులు చేసే వారిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఏక దైవారాధన వైపు పిలిచే వారిని చూసినపుడు వారు ఓర్చుకోలేరు. వారి గురించి చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో కూడా షిర్క్‌ పట్ల (ప్రేమ గూడు కట్టుకుంది. ఈ నేపథ్యంలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ

“అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు.” (అల్‌ బఖర : 165)

కాబట్టి అల్లాహ్‌ పట్ల భక్తి కలగవలసిన విధంగా సృష్టిలో వేరే ఇతరుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు ఖచ్చితంగా ముష్రిక్కే. ఇంకా – కేవలం అల్లాహ్‌ కొరకు ప్రేమించటంలో – అల్లాహ్‌ ప్రేమతో పాటు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటంలో గల వ్యత్యాసాన్ని చూడటం అవసరం. (అల్లాహ్‌ కొరకు ప్రేమించటం వాంఛనీయం. అల్లాహ్‌ పట్ల గల ప్రేమ మాదిరిగా ఇతరులను ప్రేమించటం అవాంఛనీయం). సమాధులను విగ్రహంగా మార్చుకున్న వారిని చూడండి – వారు దేవుని ఏకత్వాన్ని (తౌహీద్‌ని) పరిహసిస్తారు. దైవారాధనను గేలి చేస్తారు. అల్లాహ్‌ను వదలి తాము సిఫారసుదారులుగా ఆశ్రయించిన వారి పట్ల మాత్రం భక్తీ ప్రపత్తులు కలిగి ఉంటారు. వారిలోని ఒక వ్యక్తి అల్లాహ్‌ పేరు మీద అబద్ధ ప్రమాణం చేస్తాడు గాని తాను నమ్మినడుచుకునే ముర్షిద్‌ పేరు మీద మాత్రం అబద్ధ ప్రమాణం చేయడానికి ఎంతకీ సాహసించడు. ప్రజాబాహుళ్యంలో మీరు అనేకమందిని చూస్తుంటారు. వారి దృష్టిలో తమ ముర్షిద్‌కు విన్నపాలు చేసుకోవటం – అతని సమాధి వద్ద చేసినా, సమాధికి దూర స్థలంలో చేసినా – మస్జిద్ లో తెల్లవారుజామున అల్లాహ్‌కు విజ్ఞప్తి చేసుకోవటం కన్నా ఎక్కువ లాభదాయకమయింది అని భావిస్తారు. తమ ముర్షిద్‌ బాటను వదలి ఏకదైవారాధనా మార్గాన్ని అవలంబించిన వారిని వారు వేళాకోళం చేస్తారు. అలాంటి వారిలో చాలామంది మస్జిదులకు రారు గాని దర్గాలకు మాత్రం వెళతారు. దర్గాలను దేదీప్యమానంగా ముస్తాబుచేస్తారు. ఇదంతా ఏమిటి? అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన సూక్తులను పరిహసించి షిర్క్ కు స్వాగతం పలకటం కాదా!? (మజ్మూఅ అల్‌ ఫతావా : 15/48, 49)

నేటి సమాధి పూజారుల్లో ఈ ధోరణి అత్యధికంగా ఉంది.

ఎగతాళి రెండు రకాలుగా ఉంటుంది

1. బాహాటంగా ఎగతాళి చేయటం : అంటే ఇంతకు ముందు ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో చెప్పబడినట్లుగా అడ్డూ ఆపూ లేకుండా సత్యాన్ని సత్య ప్రేమికుల్ని ఎగతాళి చేయటం. ఉదాహరణకు : మీ మతధర్మం ఐదవ మతం అని కొందరంటే, మీది బూటకపు మతం అని మరికొందరంటారు. అలాగే మంచిని పెంపొందించే వారిని, చెడుల నుండి ఆపేవారిని చూసి, “అబ్బో! బయలుదేరారు పేద్ద ధర్మోద్దారకులు” అంటూ వెటకారంగా ప్రేలుతారు. అంతకన్నా దారుణమైన వాక్యాలు – వ్రాయటానికి కూడా వీలులేని మాటలు చెప్పటం జరుగుతుంది.

(2) ద్వంద్వార్థాలతో ఎగతాళి చేయటం : ఈ ఎగతాళి కూడా తీరంలేని సముద్రం వంటిది. కన్నుగీటి సైగలు చేయటం, నాలుక వెళ్ళబెట్టడం, మూతి ముడుపులతో వెకిలి సైగలు చేయటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు, హదీసులు పఠిస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు చేతులతో సైగలు చేయటం మొదలగునవి. (మజ్మూఅతు త్తౌహీద్‌ – నజ్‌దియ : పేజీ : 409)

మరి కొంతమంది చెప్పే కొన్ని మాటలు కూడా ఈ ‘పరిహాస పరిధిలోకే వస్తాయి. ఉదాహరణకు : “ఇస్లాం 21వ శతాబ్దికి సరిపోదు. ఇది మధ్య యుగాలకు తగినది.” “ఇస్లాం ఛాందసుల మతం”, “శిక్షల విషయంలో ఇస్లాం మరీ అమానుషంగా వ్యవహరిస్తుంది”, “విడాకులను, బహుభార్యత్వాన్ని అనుమతించి ఇస్లాం మహిళా హక్కులను హరించింది”, “ఇస్లాం శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వటం కన్నా స్వయం కల్పిత చట్టాల కనుగుణంగా తీర్పు ఇవ్వటం మిన్న” లాంటి మాటలను కొందరు పలుకుతుంటారు. అలాగే ఏకేశ్వరోపాసనా సందేశం ఇచ్చేవారిని గురించి మాట్లాడుతూ, “వారు తీవ్రవాదులు. వారు ముస్లింలోని సంఘీభావాన్ని చిందరవందర చేస్తున్నారు” అంటారు. లేదంటే “వారు వహాబీలు” అంటారు. ఈ విధంగా వారు తమ మాటల తూటాలతో ఏక దైవారాధకులను, సత్యధర్మ ప్రేమికులను అనుదినం ఆటపట్టిస్తూ ఉంటారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నతులలో ఏదైనా ఒక సున్నత్‌ను ఖచ్చితంగా అనుసరించే వారిని పట్టుకుని ఎగతాళి చేయటం కూడా ఈ కోవకు చెందినదే.

ఉదాహరణకు – “గడ్డం పెంచినంత మాత్రాన ధర్మావలంబనలో పెరుగుదల రాదు” అని అనటం. అలాంటివే మరెన్నో తుచ్చమయిన పలుకులతో మనసులను గాయపరచటం.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

నక్షత్రాల ప్రభావ విశ్వాసం

బిస్మిల్లాహ్

మానవ జీవితంలో, విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్‌.

జైద్‌ బిన్‌ ఖాలిద్‌ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ఇలా తెలిపాడని విశదీకరించారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. ‘అల్లాహ్‌ దయవలన మాకు వర్షం కురిసింది’ అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).

అదే విధంగా పత్రిక, మ్యాగజైన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్‌ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్‌ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్‌ పని కోసం ఆధారంగా మారిపోతుంది.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

తౌహీద్ (ఏక దైవారాధన) అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

[ 40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇతరములు:

దాసుల మీద అల్లాహ్ హక్కు, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కు

బిస్మిల్లాహ్

18. హజ్రత్ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రది అల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఆయన ఒంటె మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను. నాకు, ఆయనకు మధ్య అంబారీ కర్ర మాత్రమే అడ్డుగా ఉంది. హఠాత్తుగా ఆయన “ఓ ముఆజ్‌!’ అని పిలిచారు. నేను వెంటనే “(చెప్పండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను. కొంచెం దూరం నడిచిన తరువాత ఆయన మళ్ళీ “ఓ ముఆజ్‌!” అని పిలిచారు. “(సెలవియ్యండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అన్నాను. ఆ తరువాత మరి కొంచెం దూరం పోయాక మూడవసారి మళ్ళీ “ముఆజ్‌!” అని పిలిచారు. “(ఆజ్ఞాపించండి) దైవప్రవక్తా! నేను మీ సేవ కోసం సిద్ధంగా ఉన్నాను” అన్నాను నేను.

అప్పుడాయన “దాసుల మీద అల్లాహ్ హక్కు ఏముందో నీకు తెలుసా?” అని అడిగారు. అందుకు నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకే బాగా తెలుసు” అన్నాను. “దాసుల మీదున్న అల్లాహ్ హక్కు ఏమిటంటే, వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, మరెవరినీ ఆరాధించకూడదు. దైవత్వంలో ఆయనకు మరెవరినీ సాటి కల్పించకూడదు” అన్నారు ఆయన. ఇలా చెప్పి కాస్సేపు మౌనంగా నడిచారు.

ఆ తరువాత “ఓ ముఆజ్‌ బిన్‌ జబల్‌!” అని పిలిచారు. నేను (వెంటనే సెలవియ్యండి) “దైవప్రవక్తా! మీ సేవ కోసం సిద్దంగా ఉన్నాను” అని అన్నాను. “దాసులు అల్లాహ్ హక్కు నెరవేర్చిన తరువాత, అల్లాహ్ పై దాసులకు ఉండే హక్కేమిటో నీకు తెలుసా?” అని అడిగారు ఆయన. నేను “అల్లాహ్ కు , దైవప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు” అన్నాను. “అప్పుడు అల్లాహ్ (తన) దాసులను శిక్షించకపోవడమే ఆయనపై వారికున్న హక్కు” అని తెలిపారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్‌ బుఖారీ; 77వ ప్రకరణం – లిబాస్‌, 101వ అధ్యాయం – ఇర్ధాఫిర్రజుల ఖల్ ఫిర్రజుల్‌]
[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2, విశ్వాస ప్రకరణం]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు [వీడియో & టెక్స్ట్]

https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .

వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:

  • అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
  • అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
  • అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
  • హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
  • శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం 
  • ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా 
  • ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
  • దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
  • తవక్కుల్  (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి 
  • కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం  
  • మొక్కుబడులు

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.

అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.

ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.

అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?

మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?

అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.

ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?

إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.

అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,

الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,

سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.

అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.

అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.

ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.

ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.

ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?

అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.

మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.

అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.

అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.

ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]