అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట [వీడియో| టెక్స్ట్]

అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట
https://www.youtube.com/watch?v=FkFraSDe3uM
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో నిషిద్ధమైన రెండవ ప్రధాన విషయం గురించి వివరించబడింది. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని హరామ్ (నిషిద్ధం)గా లేదా హరామ్ చేసిన దానిని హలాల్‌గా మార్చడం ఎంత పెద్ద పాపమో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. యూదులు మరియు క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకోవడం అంటే, వారు హలాల్-హరామ్ నిర్ణయాలలో వారిని గుడ్డిగా అనుసరించడమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ఇతరులకు ఈ హక్కును ఆపాదించడం లేదా అనుసరించడం అవిశ్వాసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముస్లింలు తమ జీవితంలోని అన్ని విషయాలలో, ముఖ్యంగా వివాదాల పరిష్కారంలో, ఖురాన్ మరియు సున్నత్‌లను మాత్రమే అనుసరించాలని, మానవ నిర్మిత చట్టాలను ఆశ్రయించకూడదని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

నిషిద్ధ విషయాలలో మొదటి విషయం షిర్క్ అని, దానిలో కొన్ని రకాలు చదివాము. అయితే ఈ రోజు మూడవ పాఠంలో, నిషిద్ధ విషయాలలో రెండవది అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట. శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఒక వస్తువును హరామ్ చేశాడు, దానిని హలాల్ చేయుట. లేదా అల్లాహ్ ఒక వస్తువును హలాల్ చేశాడు, దానిని హరామ్ చేయుట.

అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట. గమనిస్తున్నారా? స్వయంగా మనిషి, ఒక మనిషి అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరామ్ చేస్తున్నాడు. లేదా అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేస్తున్నాడు. మూడో మాట దీంట్లో ఏమిటి? అల్లాహ్ తప్ప ఈ హలాల్, హరామ్ చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని నమ్మటం. ఒక వ్యక్తి స్వయంగా హలాల్‌ను హరామ్ చేయట్లేదు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే అతన్ని సహీగా, కరెక్ట్‌గా నమ్ముతున్నాడు. అలా చేయడం అతనికి తగును, అతనికి ఆ హక్కు ఉంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇక ఇలా ఈ నమ్మడం అనేది కూడా అవిశ్వాసంలో వస్తుంది. అల్లాహు త’ఆలా నిషేధించాడు. అంతేకాదు, ఇంకా శ్రద్ధ వహించండి.

సమస్యల తీర్పు కొరకు అల్లాహ్ పంపిన ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ముస్లింలలో పరస్పరం ఏదైతే గొడవలు, ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవల విషయాలలో ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం పంచాయతీ, ముస్లిం వారి యొక్క వారి జమాతుల్లో ఉన్నటువంటి ధర్మవేత్తల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారి యొక్క అధ్వర్యంలో తమ గొడవలకు మంచి పరిష్కారం ఖురాన్, హదీసుల ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ జరిగింది, వెంటనే లంచాలు ఇచ్చి తమ ఎదుటి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి కోర్టుల యొక్క మెట్లు ఎక్కుతారు. అయితే ఇలా చేయడం అంతా కూడా సమంజసం, మంచి విషయమే అని భావించడం, ఎక్కడైతే ఖురాన్, హదీస్ ప్రకారంగా తీర్పులు జరగవో అలాంటి చోట వెళ్ళడం, అలాంటి చోట వారితో తీర్పులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన విషయం! ఇంకా శ్రద్ధగా వినండి. మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట లేదా అది యోగ్యమైనదని సంతోషంగా నమ్ముట, ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలో పడవేస్తుందో ఖురాన్‌లోని ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి. మరియు ఈ ఆయతు సూరతు తౌబా, సూర నెంబర్ తొమ్మిది, ఆయతు నెంబర్ 31. శ్రద్ధగా వినండి.

అల్లాహ్ తెలుపుతున్నాడు:

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ
(ఇత్తఖజూ అహ్బారహుమ్ వ రుహ్బానహుమ్ అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్)
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితులను, తమ సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. (9:31)

వారు అంటే, యూదులు, క్రైస్తవులు. అల్లాహ్‌ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. యూదులు, క్రైస్తవులు అల్లాహ్‌ను వదిలి ఎవరిని? తమ యొక్క పండితులను, తమ యొక్క సన్యాసులను ఏం చేశారు? ప్రభువులుగా చేసుకున్నారు. أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) రబ్ ఏకవచనం, అర్బాబ్ ఇది బహువచనం. ఇక మనం చూస్తూ ఉంటాము, చర్చిలో ఉండేటువంటి పాస్టర్లు, వారినైతే ప్రభువుగా నమ్మరు కదా? లేక వారి యొక్క పెద్ద పండితులను సామాన్య క్రైస్తవులు ప్రభువుగా నమ్మరు కదా అని ఈ రోజుల్లో కూడా ఎంతో మంది అనుకుంటారు, కదా? రండి, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకింలోని హదీస్ ద్వారా దీని యొక్క వివరణ వినండి.

ఈ ఆయతు, సూరత్ తౌబా ఆయతు నెంబర్ 31, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు విని, “ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా?” సామాన్య యూదులు మరియు క్రైస్తవులు వారి యొక్క పండితులను, వారి యొక్క సన్యాసులను, పాస్టర్లను పూజించరు కదా? ఆరాధించరు కదా? మరి ప్రభువుగా చేసుకున్నారని ఆయతులో చెప్పబడింది? అతని యొక్క ప్రశ్న విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “అవును, నువ్వు అంటున్నావు ఆరాధించేవారు కాదు. అవును, ఆరాధించేవారు కాదు. కానీ అల్లాహ్ హరామ్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్‌గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హరామ్ చేస్తే వారు దానిని హరామ్‌గానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు. అందుకని వారు తమ సన్యాసులను, పండితులను ప్రభువులుగా చేసుకున్నారు” అన్నటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహీహ్ హదీస్. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు కూడా గాయతుల్ మరాంలో సహీహ్ అని తెలిపారు. అయితే అర్థమైంది కదా సోదర మహాశయులారా?

అంతేకాదు. మరొక ఆయత్ సూరత్ తౌబాలోనే ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. అంతకంటే ముందు, అల్లాహ్ నిషేధించిన వాటిని నిషిద్ధంగా నమ్మని వారు, నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మని వారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు. కానీ ఈ పని ఒక ముస్లింగా తమకు తాము అనుకునే వాళ్ళు, తమ పేర్లు ముస్లింలుగా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మరి వారి గతి ఏమవుతుంది? అల్లాహు అక్బర్. చూడండి, సూరత్ తౌబా ఆయత్ నెంబర్ 29.

وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ
(వ లా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వ లా యదీనూన దీనల్ హఖ్)
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు, మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. (9:29)

యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, వీరందరూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ పని చేశాడంటే చాలా, చాలా నష్టంలో పడిపోతాడు. ఎలాంటి నష్టం? అల్లాహ్ పై చాలా పెద్ద అభాండం మోపినట్లు. చూడండి, సూర యూనుస్‌లోని ఆయతు నెంబర్ 59, అల్లాహు త’ఆలా తెలుపుతున్నాడు.

قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఏమిటి? మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరామ్‌గానూ, మరి కొన్నింటిని హలాల్‌గానూ నిర్ధారించుకున్నారు.” వారినిలా అడుగు: “ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేక మీరు అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?” (10:59)

ఈ ఆయతు ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహు త’ఆలా ప్రజల్లో ఎవరికీ కూడా ఏదైనా వస్తువును హలాల్ చేసే, ఏదైనా వస్తువును హరామ్ చేసే అటువంటి హక్కు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ఇవ్వలేదు. ఇది కేవలం అల్లాహ్ యొక్క హక్కు మాత్రమే. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మొదటి పాఠంలో, మొదటి క్లాస్‌లో విన్నాము మనం. మీలో ఎవరికైనా గుర్తు లేకుంటే ఒకసారి ఆ పాఠాన్ని తర్వాత మీరు చూడండి, వినండి. అయితే అల్లాహ్ అయితే ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఈ హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అతడు దౌర్జన్యపరుడు అవుతున్నాడు, అంతేకాదు అల్లాహ్ పై అబద్ధాలు మోపేవాడు అవుతున్నాడు.

అర్థమైంది కదా? ఎంత ఘోరమైన పాపం? అందుకొరకే ఈ రోజుల్లో కూడా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వస్తువులను ఇది హలాల్ అని, ఇది హరామ్ అని లేదా వారి యొక్క పెద్దలు, గురువులు, “అరే హమారే బాబా బోలే జీ,” “మా పీర్ సాబ్ చెప్పారు,” “మేము ఫలానా ముర్షిదులను నమ్ముతున్నాము, ఆయన చెప్పినట్లే మేము వింటాము” ఇక వారు హరామ్ చేసిందే హరామ్, వారు హలాల్ అని చెప్పిందే హలాల్. ఈ విధంగా మనం అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్తున్నామంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుందా? మనమే మంచిగా ఆలోచించాలి.

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]


ముస్లింలు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ (పెట్టుబడి) చేయవచ్చా? అనుమతి ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ముస్లింలు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ (పెట్టుబడి) చేయవచ్చా? అనుమతి ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి?
https://youtu.be/U5R1ga7xuAI [5 నిముషాలు]
Can Muslims invest in share market?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ముస్లింలు స్టాక్ మార్కెట్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చా అనే ప్రశ్నకు ఈ ప్రసంగంలో సమాధానం ఇవ్వబడింది. కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారం ఇస్లాంలో నిషేధించబడిన (హరామ్) వస్తువులతో (మద్యం వంటివి) ఉండకూడదని మరియు దాని ఆర్థిక లావాదేవీలలో వడ్డీ (రిబా) వంటి హరామ్ అంశాలు ఉండకూడదని స్పష్టం చేయబడింది. టెక్నాలజీ కంపెనీల వంటివి హలాల్ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, అవి వడ్డీ ఆధారిత బ్యాంకు రుణాలపై ఆధారపడితే, ఆ షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడా అనుమతించబడదని వివరించబడింది. అంతేకాక, చాలా షేర్ ట్రేడింగ్‌లు వాస్తవ సరుకులు లేదా ఆస్తులు లేకుండా, కేవలం డబ్బుతో డబ్బు వ్యాపారంలా (ఊహాజనితంగా) జరుగుతాయని, ఇది కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించారు. అందువల్ల, ఏదైనా షేర్‌లో పెట్టుబడి పెట్టే ముందు దాని వ్యాపార సరళి, ఆర్థిక మూలాల గురించి క్షుణ్ణంగా పరిశోధించి, ధర్మ పండితులను సంప్రదించి, అది పూర్తిగా హలాల్ అని నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలని నొక్కి చెప్పబడింది.


بارك الله فيك شيخ
[బారకల్లాహు ఫీక్ షేక్]
షేక్, అల్లాహ్ మీకు శుభాలు ప్రసాదించుగాక.

దీనికి సంక్షిప్తంగా, చాలా చిన్నగా సమాధానం కూడా ఇవ్వొచ్చు, చాలా దీర్ఘంగా కూడా సమాధానం ఉంటుంది. ముందు చిన్న సమాధానం వింటాము, అర్థమయ్యేది ఉంటే అల్హందులిల్లాహ్. అదేమిటంటే, ఈ రోజుల్లో షేర్ మార్కెట్ అని చాలా మంది షేర్స్ కొనడం, అమ్మడం అనేది స్వయం తాముగానీ లేదా వేరే ఎవరిదైనా, వేరే ఎవరి ద్వారానైనా గానీ చేస్తారో, అందులో ఇస్లాం నిషేధించిన మత్తు, ఖమర్ మరియు ఇంకా వేరే ఇట్లాంటి డైరెక్ట్ వేటినైతే ఇస్లాం నిషేధించిందో, అలాంటి విషయాల, వస్తువుల వ్యాపారం అనేది ఉండకూడదు.

అలాగే, ఇండైరెక్ట్‌గా ఏవైతే హరామ్ ఉన్నాయో, ఉదాహరణకు టెక్నాలజీ అనేది చెప్పారు, హలాల్ కానీ అందులో ఇంట్రెస్ట్, వడ్డీ, మిత్తి, బ్యాజ్, రిబా ఏదైతే ఉందో, దాని కారణంగా అది హరామ్ అవుతుంది. సంక్షిప్తంగా, ఇస్లాంకు వ్యతిరేకమైన డైరెక్ట్ బిజినెస్ గానీ లేదా హలాల్ బిజినెస్‌గా కనబడుతున్న దానిలో ఇస్లాంకు వ్యతిరేకమైన ఏదైనా హరామ్ అందులో ఉంది అంటే, అలాంటి వాటిలో మనం షేర్స్ కొనకూడదు, అలాంటి వాటిలో మనం పాలుపంచుకోకూడదు, పొత్తు కలవకూడదు.

అంతేకాకుండా, కొంతమంది ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ మరియు ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో జరిగే ఎన్నో షేర్స్ నిరాధారంగా ఉంటాయి. అంటే ఏమిటి? వాస్తవానికి వెనక అక్కడ ఏ సరుకు లేదు, సామాను లేదు. కొనే, అమ్మే అటువంటి సామానులు లేవు. కేవలం పైసాకు పైసా అటువంటి బిజినెస్ నడుస్తుంది. ఒకవేళ ఇట్లాంటిది ఏది ఉన్నా కూడా సరియైనది కాదు. అందుకొరకు, ఇక్కడ దీనికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన సమాధానం కంటే, సంక్షిప్త సమాధానమే మేలు. ఏంటి? ఎగ్జాంపుల్, నీవు ఒక షేర్ కొనాలనుకుంటున్నావు. ఎవరైనా వచ్చి నీకు ఏదైనా ఒక షేర్‌లో ఇన్వెస్ట్ చేయమని చెబుతూ ఉంటే, ఆ సందర్భంలో నీపై చాలా గొప్ప బాధ్యత ఉంది. వెంటనే అతని ఒక్కని మాట విని ఏ రకంగా కూడా మోసపోకుండా, వారి యొక్క పద్ధతి ఏమిటి? ఏ ఎందులో వారి యొక్క షేర్స్ ఉన్నాయి? ఆ యొక్క సామానులు, సరుకులు ఏమిటి? అవి ఏ ఆధారంగా, ఏ బేస్ మీద ఆ బిజినెస్ నడుస్తుంది? ఇస్లామిక్ నాన్-ఇంట్రెస్ట్ మరియు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ లోని ద్వారా నడుస్తుందా? లేక ఇట్లాంటి ఏమైనా హరామ్ విషయాలు ఉన్నాయా? వివరంగా తెలుసుకోవాలి. కేవలం వారి ద్వారా తెలుసుకొని తృప్తి పడకూడదు. ఆ వివరాలను ధర్మ పండితులతో, దగ్గరలో ఉన్న వారితో తెలుసుకోవాలి. మొత్తం వివరించాలి వారికి. ఆ తర్వాత అది హలాల్ లేక హరామ్ అనేది. ఎందుకంటే, ఈ దగ్గరిలో కొన్ని కాలాల్లో, 10, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి మనం ఎన్నో ఇట్లాంటివి చూశాము. క్వాంటం అని, ఇంకా వేరే చైన్ బిజినెస్ సిస్టంలో లాంటి వాటిలో పాలు పంచుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, ఇంకా వేరే కొన్ని గోల్డ్ స్కీములలో, గోట్ స్కీములలో, లేదా ఇంకా వేరే కొన్ని ఆస్ట్రేలియాకు పంపుతున్నటువంటి ఆ ప్రత్యేక పూలు అని, ఎన్నో రకాలుగా ఎందరో వచ్చి బిజినెస్‌లు ఉన్నాయి, మీరు ఇందులో షేర్ తీసుకోండి అన్నట్లుగా చెప్పి, అవి హలాల్ అని కొన్ని చోట్ల నుండి తప్పుడు ఫత్వాలు తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేశారు. అందుకొరకు, ఒక నలుగురిని ఇలాంటి విషయాలలో వేరువేరు ధర్మ పండితులను కలుసుకొని మనం ఇందులో ముందడుగు వేయాలి. సంక్షిప్తంగా, ఎక్కడ ఇస్లాంకు వ్యతిరేకమైన ఏదైనా విషయం ఉంది అంటే, అలాంటి షేర్స్ మనం కొనకూడదు.

جزاكم الله خيرا شيخ
[జజాకుముల్లాహు ఖైరన్ షేక్]
షేక్, అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.