త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1) – మరణానంతర జీవితం : పార్ట్ 42 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1)
[మరణానంతర జీవితం – పార్ట్ 42]
https://www.youtube.com/watch?v=lATws_WFGpM [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయదినాన కర్మల త్రాసు (మీజాన్) గురించి మరియు దానిని తేలికగా చేసే కార్యాల గురించి వివరించబడింది. పుణ్యాల బరువును పెంచుకోవాలనే ఆకాంక్షతో పాటు, పాపాల వల్ల త్రాసు తేలిక అవుతుందనే భయం కూడా విశ్వాసికి ఉండాలి. పాపాలు రెండు రకాలు: పెద్ద పాపాలు (గునాహె కబీరా) మరియు చిన్న పాపాలు (గునాహె సగీరా). పెద్ద పాపాలు క్షమించబడాలంటే స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం, అయితే చిన్న పాపాలు సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ప్రసంగం ముగింపులో, కొన్ని ఘోరమైన పాపాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మరియు అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, వ’అలా ఆలిహీ వ’సహ్బిహీ వ’మన్ వాలా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము. త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష, కోరిక, తపన, ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి, త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే, పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది. అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడక ముందే పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. మాటిమాటికీ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి.

ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ, చింత, ఆవేదనకు గురి కాకండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా? కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం, ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము. ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము. ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం, ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము. అయితే సామాన్, సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది, పోతూ ఉన్నది, మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా? లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా? జాగ్రత్త పడుతూ ఉంటాము కదా? ఏదైనా సామాన్ చెడిపోయి, అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని, దుకాన్లో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి, ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా? లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది, దందా చాలా మంచిగా నడుస్తూ ఉన్నది, కానీ మన యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. తీసుకుంటామా లేదా?

అలాగే విశ్వాసం ఒక మూలధనం అయితే, సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ ని, లాభాన్ని, మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈ పాపాలు అనేటివి లాస్ కు గురి చేసేవి. అయితే వాటి నుండి జాగ్రత్త పడి ఉండడం, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం, ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి, పశ్చాత్తాప రూపంలో గాని, వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా గానీ మరింత పెద్ద లాస్ కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం.

ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా ఇలా తెలిపారు. “నీవు పరలోకాన అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు. ఇహలోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి.”

ప్రళయదినాన త్రాసు నెలకోల్పడం జరుగుతుంది. దానికి రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్లెంలో పుణ్యాలు, మరొక పళ్లెంలో పాపాలు. ఒక పళ్లెంలో సత్కార్యాలు, మరో పళ్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేది ఉంటే, ఆ పళ్లెం బరువుగా కిందికి జారిపోతుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది?

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.

ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు. మరెవరి పుణ్యాల త్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది. ఏంటి హావియా? నారున్ హామియా. అది చాలా రగులుతున్నటువంటి అగ్ని. అందులో పడవలసి వస్తుంది.

అయితే పాపాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. పెద్ద పాపాలు, చిన్న పాపాలు. గునాహె కబీరా, గునాహె సగీరా. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాలు చాలా ఘోరమైనవి. మరికొన్ని చిన్న పాపాలు అని అనబడతాయి. ఘోర పాపాల జాబితా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే సర్వ సత్కార్యాల్ని భస్మం చేసేస్తాయి, చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు. ఇక పుణ్యమే లేనప్పుడు, పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది? అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది.

అయితే గమనించండి, మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి. కానీ చిన్న పాపాలు అంటే, అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి. ఎలాంటి భయం లేకుండా మెదలకండి. చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక సామెత ద్వారా చెప్పాలా? ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడు అవుతాయి. ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది? వర్షం ఎలా కురుస్తుంది? కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం, సైలాబ్, పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది. పర్వతం దేన్ని అంటారు? ఒక్క రాయినా? కొన్ని రాళ్ల సముదాయాన్ని. మహాశయులారా, చిన్న పాపాల్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు, వాటి నష్టాలతో పాటు, ఆ ఘోర పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ పాపాలు పుణ్యాలను నశింపజేసి, త్రాసు బరువును తగ్గిస్తాయి, అవి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా, పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. చిన్న పాపాలు, వీటి గురించి అల్లాహు త’ఆలా మనకు ఒక వాగ్దానం చేశాడు, శుభవార్త ఇచ్చాడు. అదేమిటంటే చిన్న పాపాల్ని మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు. మరి ఈ క్షమించడం, ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లాహ్ తరఫున, అంటే ఏ పుణ్యానికి బదులుగా కాకుండా స్వయంగా అల్లాహ్ యే క్షమించడం, అట్లనే. మరొక రకం, మనం కొన్ని విధులు నిర్వహిస్తాము, కొన్ని పుణ్యాలు చేస్తాము, ఉదాహరణకు ఉదూ చేయడం, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, హజ్ చేయడం, ఇంకా. అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహు త’ఆలా శుభవార్త ఇచ్చాడు.

కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు షరతులు, రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? మొదటి నిబంధన, చిన్న పాపాలు మన్నించబడాలంటే, మొదటి నిబంధన, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి. ఘోర పాపాలు చేస్తూ ఉన్నాము, చిన్న పాపాలు కూడా మన్నించబడవు. రెండవ నిబంధన, ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు. దీనికి ఒక చిన్న సామెత ఇవ్వాలా? ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. చేసి, మీరు చూసిన వెంటనే, “సారీ, క్షమించండి” అతను “సారీ” అని నోటితో చెప్పక ముందు అతని యొక్క, “అరె, సారీ చెప్తున్నట్లు ఉంది”. “లేదండి, పర్వాలేదు, పర్వాలేదు, అట్లేం లేదు” అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము.

చేసింది అతను చిన్న తప్పే కావచ్చు, కానీ మీరు అతని వెంట చూస్తేనే, “ఏంటి?” తిరిగేసి, గుడ్లు తెరిచి, అయితే ఏంది? ఈ విధంగా ఎదురుమాట, అంటే చేసింది చిన్నదైనప్పటికీ, “అయ్యో, తప్పు జరిగింది కదా” అన్న భావన లేకుండా విర్రవీగడం, గర్వం చూపడం ఇది మన మానవులకే నచ్చదు. విషయం అర్థమైంది అనుకుంటాను.

ఈ విధంగా మహాశయులారా, మన చిన్న పాపాలు మన్నించబడాలంటే, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాల్ని “అరె, చిన్నవియే కదా” అన్నటువంటి భావనలో ఉండకూడదు. చదవండి ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్:

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ
[అల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్ లమమ్, ఇన్న రబ్బక వాసివుల్ మగ్ ఫిరహ్]

ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు.” (53:32)

ఎవరైతే చిన్న చిన్న తప్పులు, పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి పట్ల నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఏమర్థమైంది? పెద్ద పాపాల నుండి, మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది సూర నజ్మ్ లోని ఆయత్, ఆయత్ నంబర్ 32.

అయితే సూర నిసా, ఆయత్ నంబర్ 31 లో ఇలా తెలియబరిచాడు:

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
[ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్హు నుకఫ్ఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్ వనుద్ ఖిల్కుమ్ ముద్ ఖలన్ కరీమా]

“మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో (స్వర్గాలలో) ప్రవేశింపజేస్తాము”. (4:31)

ఈ రెండు ఆయతులకు తోడుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును కూడా వినండి. మ’జమ్ కబీర్, తబరానీలో ఈ హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామి’ లో ప్రస్తావించారు, 2687.

إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ
[ఇయ్యాకుమ్ వ ముహఖ్ఖరాతిజ్ జునూబ్]

فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَمَثَلِ قَوْمٍ نَزَلُوا بَطْنَ وَادٍ
[ఫ ఇన్నమా మసలు ముహఖ్ఖరాతిజ్ జునూబి క మసలి ఖౌమిన్ నజలూ బత్న వాదిన్]

మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా, చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది. కొందరు ఒక ప్రాంతంలో దిగారు, వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు. కొంతమందిని పంపారు, ఒక వ్యక్తి ఒక పుల్ల, మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె, ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు, కొన్ని చిన్న చిన్న కట్టెలు, కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది? మంచి మంట, మంచి వంటకాలు చేసుకున్నారు. ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు త’ఆలా పట్టడం, వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి. అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు. మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తెలిపారు, ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు, సత్కార్యాల్లో ఉంటాడు, ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం, మన్నింపు వైఖరి అవలంబించడం ఏదీ పాటించడు. అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటాడు, చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి. మరొక వ్యక్తి, అతని నుండి పాపం జరుగుతుంది, కానీ అతడు భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉంటాడు, చివరికి అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహు త’ఆలా అతన్ని మన్నించి, అతనికి మోక్షం కలిగిస్తాడు. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు త’అన్హు గారి యొక్క ఈ కొటేషన్ ని హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహమతుల్లాహ్ అలైహ్ ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6492 యొక్క వ్యాఖ్యానంలో.

ఇప్పుడు మహాశయులారా, ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఘోర పాపాన్ని దేన్ని అంటారు? ఈ విషయం అర్థమైంది అంటే మిగితవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది. ఖుర్ఆన్ మరియు హదీస్ లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో, పెద్ద పాపం అని తెలపడం జరిగిందో, అవి ఘోర పాపాలు. మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో, ఉదాహరణకు, దొంగ యొక్క చేతులు కట్ చేయడం, వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు, ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవో ఆ పాపాలు, మరియు ఏ పాపాల గురించి అయితే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో, మరియు ఏ పాపాలు చేసే వారి గురించి అయితే శాపనార్థాలు పెట్టడం జరిగినదో, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. అలాగే ఏ పాపాలు చేసే వారిని ఫాసిఖ్, అపరాధి, అని అనడం జరిగిందో ఆ పాపాలు కూడా ఘోర పాపాల్లో లెక్కించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఏమిటి? అలాంటి హదీసులను, అలాంటి ఆయతులను మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఉదాహరణకు ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ
[ఇన్న అ’జమజ్ జునూబి ఇందల్లాహ్]
అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి,

رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً
[రజులున్ తజవ్వజమ్ ర అతన్]
ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెండ్లాడాడు,

فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا طَلَّقَهَا
[ఫలమ్మా ఖదా హాజతహూ మిన్హా తల్లఖహా]
అతను ఆమెతో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు,

وَذَهَبَ بِمَهْرِهَا
[వ జహబ బి మహ్రిహా]
ఆమె యొక్క మహర్ ను కూడా తినేశాడు, మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్, లేదా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదు. ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడింది.

وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا فَذَهَبَ بِأُجْرَتِهِ
[వ రజులున్ ఇస్త’మల రజులన్ ఫ జహబ బి ఉజ్రతిహి]
ఒక మనిషి మరో మనిషికి, మనిషిని ఒక మజ్దూరీగా తీసుకున్నాడు, మరి అతనికి ఇచ్చే మజూరీ ఏదైతే ఉందో, బత్తెం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు, తినేశాడు.

మూడో వ్యక్తి,

وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا
[వ ఆఖరు యఖ్తులు దాబ్బతన్ అబసన్]
ఎవరైతే ఏదైనా పశువును, ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు. షికారీ చేయడం పేరుతో, లేదా కొందరికి అలవాటు ఉంటుంది, కుక్కలను, పిల్లులను పరిగెత్తించి, వెనక రాళ్లతో కొట్టి ఇంకా వేరే విధంగా.

అయితే మహాశయులారా, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహాశయులారా, పాపాల విషయాల్లో ఖుర్ఆన్ లో గాని, హదీస్ లో గాని మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాటిని అంటారు,

مُحْبِطَاتُ الْأَعْمَالِ
[ముహ్బితాతుల్ అ’మాల్]
సత్కార్యాలను నశింపజేసే పాపాలు అని.

వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి, దేని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో, దేని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో, ఆ పాపాలను తెలుసుకొని, వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల పాపాల నుండి, ఘోర పాపాల నుండి, చిన్న పాపాల నుండి మరియు مُحْبِطَاتُ الْأَعْمَالِ [ముహ్బితాతుల్ అ’మాల్] సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43771

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

పెద్ద పాపాలను గుర్తించడం ఎలా? How to identify the Major Sins?

పెద్ద పాపాలను గుర్తించడం ఎలా? How to identify the Major Sins?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/GvxwOoF68I0 [5 నిముషాలు]

పాపాలు (Sins): https://teluguislam.net/sins/