ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.
ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,
وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ (వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్) అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.
దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.
శుభవార్త మరియు హెచ్చరిక
అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?
శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.
ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.
అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.
ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.
رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ (రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్) మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)
అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?
لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ (లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్) ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)
ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.
ప్రవక్తలలో ప్రథముడు మరియు అంతిముడు
ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.
ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:
إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ (ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).
అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.
ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.
అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.
وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ (వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్) అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)
అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.
ప్రవక్తలందరి సందేశం
ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?
يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ (య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్) కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు
وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ (వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్) మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.
ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.
ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا (వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా) ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)
ఆ ప్రవక్త తమ జాతి వారికి:
أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ (అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్) అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)
అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.
పాఠం యొక్క సారాంశం
ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.
ఈ తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.
واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته (వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి https://teluguislam.net/2023/04/19/u3mnj/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖవారిజ్ అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి? Who is Khawarij and What are their Characteristics? https://youtu.be/xUow1N1qSrg [31:13 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఖవారిజ్‌లు అనే వర్గం ఇస్లామిక్ చరిత్రలో ఎలా ఏర్పడిందో, వారి లక్షణాలు మరియు ప్రమాదకరమైన సిద్ధాంతాల గురించి ఈ ప్రసంగంలో వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ఈ ఆలోచనా విధానానికి బీజం పడిందని, దుల్-ఖువైసిరా అనే వ్యక్తి ప్రవక్త న్యాయంపై సందేహం వ్యక్తం చేయడం ద్వారా ఇది మొదలైందని వక్త తెలిపారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన యుద్ధం సమయంలో, అల్లాహ్ గ్రంథం ప్రకారం తీర్పు చెప్పడానికి మధ్యవర్తులను పెట్టడాన్ని ఖవారిజ్‌లు వ్యతిరేకించారు. వారు స్వల్ప జ్ఞానంతో, ఖురాన్ ఆయతులను తప్పుగా అర్థం చేసుకుని, సహచరులను (సహబాలను) కాఫిర్లుగా ప్రకటించారు. ఖవారిజ్‌ల ప్రధాన లక్షణాలు: అల్పాచల జ్ఞానం, పండితుల పట్ల అగౌరవం, పాపాత్ములను కాఫిర్లుగా భావించడం, ముస్లింల రక్తాన్ని చిందించడం ధర్మబద్ధం అనుకోవడం, పాపం చేసిన వారు శాశ్వతంగా నరకంలో ఉంటారని నమ్మడం, తమ భావాలకు సరిపోని హదీసులను తిరస్కరించడం మరియు పాలకులపై తిరుగుబాటు చేయడం. ఈ లక్షణాల పట్ల ముస్లింలు జాగ్రత్తగా ఉండాలని మరియు తొందరపడి ఇతరులను ఖవారిజ్‌లుగా నిందించకూడదని వక్త హెచ్చరించారు.
ఇస్లాం మరియు ముస్లిములకు చాలా నష్టం కలిగించిన దుష్ట వర్గాల్లో ఒకటి ’ఖవారిజ్‘. వారి గురించి తెలుసుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత ఈ వీడియోలో సంక్షిప్తంగా వారి కొన్ని లక్షణాలు తెలుపబడ్డాయి. తెలుసుకోండి, వాటికి దూరంగా ఉండండి, ఇతరులకు తెలియజేయండి అల్లాహ్ మనందరికీ ప్రయోజనకరమైన ధర్మజ్ఞానం ప్రసాదించుగాక.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మాబాద్.
సోదర మహాశయులారా! ఈనాటి దర్సులో మనం ఇన్ షా అల్లాహ్ ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము. ఖవారిజ్ అంటే ఎవరు? వారి యొక్క గుణాలు ఏమిటి? మరియు ఈ రోజుల్లో ఎవరిలోనైనా మనం అలాంటి గుణాలు చూస్తే వారి పట్ల మనం ఎలా మసులుకోవాలి? వారితో మన వ్యవహారం ఎలా ఉండాలి?
సోదర మహాశయులారా! సహబాల కాలంలోనే ‘ఖవారిజ్’ అని ఒక వర్గం సహబాల సరైన మార్గం నుండి, సన్మార్గం నుండి దూరమైంది, వేరైంది. అది ఒక వర్గం రూపంలో, ఒక ఫిర్కా రూపంలో ప్రస్తుతం మనకు కనబడకపోయినా, వారిలో ఉన్నటువంటి ఎన్నో చెడు గుణాలు ఈ రోజుల్లో ఎంతో మందిలో లేదా ఎన్నో వర్గాలలో మనం చూస్తూ ఉన్నాము. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, స్వయం తమకు తాము ఎన్నో మంచి పేర్లు పెట్టుకొని కూడా కొందరు ఈ ఖవారిజ్‌ల గుణాలు అవలంబించి ఉన్నారు మరియు ఈ గుణాలు ఖవారిజ్‌ల యొక్క గుణాలు అని స్వయం వారికి తెలియదు. అందుకొరకు వారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ఖవారిజ్‌ల పుట్టుక మరియు చరిత్ర
ఖవారిజ్, వీరి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా ఉంది. వాటి యొక్క కారణాలు కూడా ఇక ముందుకు వస్తాయి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టి ఖవారిజ్‌ల యొక్క బీజం ఆనాడే కనబడింది, చిగురించింది అని కొందరు పండితులు అంటారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో వచ్చిన హదీస్, హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మాలె గనీమత్ (యుద్ధ ధనం) పంచిపెడుతున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు అబ్దుల్లాహ్ జుల్-ఖువైసిరా. వచ్చి,
اِعْدِلْ يَا رَسُولَ اللَّهِ (ఇ’దిల్ యా రసూలల్లాహ్) ఓ ప్రవక్తా! నీవు న్యాయం పాటించు అని అన్నాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
وَيْلَكَ! وَمَنْ يَعْدِلُ إِذَا لَمْ أَعْدِلْ (వైలక! వమన్ య’దిలు ఇజా లమ్ అ’దిల్) నేను ఒకవేళ న్యాయం పాటించకుంటే, ఎవరు న్యాయం పాటిస్తారు మరి?
అక్కడే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉండి:
دَعْنِي أَضْرِبْ عُنُقَهُ (ద’నీ అద్రిబ్ ఉనుకహు) “ప్రవక్తా నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇతని మెడ నరికేస్తాను” అని చెప్పారు.
ప్రవక్త విషయంలో ఒక చాలా ఘోరమైన అమర్యాద, అగౌరవం పాటించాడు కదా, అసభ్యతగా వ్యవహరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
వదిలేయ్. ఇతని వెనుక ఇతని అనుచరులు వస్తారు. వీరి అనుచరుల్లో ఎలా ఉంటారంటే – మీలో ఒక వ్యక్తి వారిని చూసి, తమ నమాజును “అయ్యో మేమేమి నమాజు చేస్తున్నాము, మాకంటే ఎక్కువ చేస్తున్నారు కదా” అని భావిస్తారు. ఉపవాసాలు కూడా వారు బాగా పాటిస్తారు. మీరు మీ ఉపవాసాలను ఏమీ లెక్కించరు, అంతగా వారు ఉపవాసాలు పాటిస్తారు.
కానీ ధర్మం వారిలో ఉండదు. ధర్మం నుండి వారు వెళ్లిపోతారు. ఎలాగైతే ధనస్సు ఉంటుంది కదా బాణం వదలడానికి, ఇలా బాణం వదిలిన తర్వాత మళ్ళీ తిరిగి ధనస్సులోకి రావాలంటే వస్తదా బాణం? రాదు. ఏ విధంగానైతే విడిపోయిన బాణం తిరిగి రాదో, వారిలో నుండి ధర్మం అనేది ఆ విధంగా వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు. అలాంటి వారు వారు.
అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య వివాదం
కానీ, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారి యొక్క ఖిలాఫత్ కాలంలో వీరు ముందుకు వచ్చారు. బహిరంగంగా, స్పష్టంగా వెలికి వచ్చారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) వారి మధ్య ఒక యుద్ధం జరిగింది. ‘సిఫ్ఫీన్‘ అని అంటారు. అయితే మన ముస్లింల మధ్యలో ఇలా జరగకూడదు, రక్తపాతాలు కాకూడదు అని ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు వారు ఖురాన్ గ్రంథాన్ని పైకెత్తారు. ఎత్తి, “ఈ గ్రంథం మన మధ్యలో తీర్పు కొరకు మనం ఏకీభవిద్దాము. ఇక యుద్ధాన్ని మనం మానుకుందాము” అన్నారు. అప్పుడు అందరూ యుద్ధాన్ని సమాప్తం చేసి, ఇక సంధి కుదుర్చుకోవడానికి, ‘సులహ్’ కొరకు ముందుకు వచ్చారు.
అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని, ముఆవియా (రదియల్లాహు అన్హు) వైపు నుండి ఒక వ్యక్తిని ముందుకు పంపడం జరిగింది. వారు అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ వెలుగులో తీర్పు చేయాలి, మనం ఈ యుద్ధాన్ని ఇక ముందుకు సాగకుండా చూసుకోవాలి. వాస్తవానికి ఇది మంచి విషయం. కానీ అక్కడ ఎంతో మంది, వారు అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నవారు, వారు అలీ (రదియల్లాహు అన్హు) కు వ్యతిరేకంగా తిరిగారు. వ్యతిరేకంగా తిరిగి అలీ (రదియల్లాహు అన్హు) ను కాఫిర్ అని చెప్పేశారు. నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్!
ఎందుకని? వారి యొక్క తప్పుడు ఆలోచన చూడండి. ఏమన్నారు? సూరె మాయిదా ఆయత్ నెంబర్ 44 చదివారు:
وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ (వమన్ లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫవూలాయిక హుముల్ కాఫిరూన్) మరియు అల్లాహ్ అవతరింపజేసిన దానిననుసరించి తీర్పు చేయనివారే అవిశ్వాసులు (కాఫిరులు). (5:44)
అల్లాహ్ అవతరించిన దాని ప్రకారం ఎవరైతే తీర్పు చేయరో వారు కాఫిర్లు. అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ నుండి తీర్పు చేద్దామని చెప్పారు, తర్వాత ఇద్దరు మనుషులను ముందుకు పంపుతున్నారు. ఆ ఇద్దరు మనుషులు ఏం తీర్పు చేస్తారు? ఇద్దరు మనుషులు తీర్పు సరిగా చేయరు, అల్లాహ్ యొక్క గ్రంథం తీర్పు చేయాలి. అందుకొరకు తీర్పు చేయడానికి ఇద్దరు మనుషులను పంపడం జరిగింది, అందుకని అటు అలీ (నౌజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) కాఫిర్ అయిపోయాడు, ఇటు ముఆవియా కూడా కాఫిర్ అయిపోయాడు అని ఈ విధంగా పుకార్లు లేపారు. అస్తగ్ఫిరుల్లాహ్!
వాస్తవానికి గమనిస్తే ఇదేంటి? చూడడానికి ఖురాన్ ఆయత్ ను తెలిపారు. కానీ ఖురాన్ ఆయత్ ను వారు స్వయంగా అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఖురాన్ తీర్పు చెబుతుంది, కానీ ఖురాన్ తీర్పు ఎలా చెబుతుంది? ఖురాన్ స్వయంగా మాట్లాడుతుందా మన మధ్యలో పెట్టిన తర్వాత? ఖురాన్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందో, ఖురాన్ ఎవరు చాలా మంచి విధంగా చదివి, దానిని అర్థం చేసుకుని, దాని యొక్క అన్ని వివరాలు తెలిసి ఉన్నారో, అలాంటి ధర్మ జ్ఞానులు ఆ ఖురాన్ కు అనుగుణంగా తీర్పు చేసే ప్రయత్నం చేస్తారు. ఖురాన్ లో స్వయంగా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి.
స్వయంగా ఈ సూరె మాయిదాలోనే ఒక సంఘటన ఉంది, సూరె నిసాలో కూడా ఉన్నది. ఉదాహరణకు సూరె నిసాలో మీరు కూడా ఎన్నోసార్లు ఈ విషయం విని ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ జరిగింది, ఇప్పుడు విడాకులకు వస్తుంది సమస్య. అప్పుడు అల్లాహ్ ఏమంటున్నాడు?
ఒకవేళ వారిరువురి (భార్యాభర్తల) మధ్య వైరం ఏర్పడుతుందని మీకు భయముంటే, ఒక మధ్యవర్తిని పురుషుని కుటుంబం నుండి, మరొక మధ్యవర్తిని స్త్రీ కుటుంబం నుండి (పరిష్కారానికి) నియమించండి. (4:35)
భర్త వైపు నుండి ఒక వ్యక్తి తీర్పు చేయడానికి, మరియు భార్య వైపు నుండి ఒక వ్యక్తి. అంటే వారు తమ ఇష్టానుసారం ఏదో రాష్ట్రంలో నడుస్తున్నట్టుగా, మన పల్లెటూర్లో నడుస్తున్నటువంటి చట్టాల మాదిరిగా చేస్తే దాని గురించి అల్లాహ్ చెప్తున్నాడా? లేదు. వారు వారిద్దరి మధ్యలో భార్యాభర్తల్లో తీర్పు చేయాలి అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా మరియు అల్లాహ్ అవతరించిన షరియత్ ను అనుసరించి. కానీ అది చేయడానికి ఎవరు? ఇద్దరు మనుషులే ముందుకు వచ్చేది.
అలాగే సూరె మాయిదాలో ఒక సందర్భంలో, ఎవరైనా ఇహ్రామ్ స్థితిలో ఉండి వేటాడాడు. ఇహ్రామ్ స్థితిలో భూమిపై సంచరించేటువంటి జంతువుల యొక్క వేట ఆడడం నిషిద్ధం. కానీ ఎవరైనా అలా షికారు చేశాడు, వేటాడాడు. దానికి పరిష్కారంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో, అందులో ఇక ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఇహ్రామ్ స్థితిలో ఉండి షికారు చేశాడో, అతడు ఫిదియా – దానికి ఫైన్ గా, పరిహారంగా ఏమి చెల్లించాలి అనేది నిర్ణయం ఎవరు చేస్తారు? న్యాయవంతులైన, ధర్మ జ్ఞానం తెలిసిన మనుషులు చేస్తారు.
విషయం అర్థమవుతుంది కదా. ఇక్కడ నేనిదంతా డీటెయిల్ ఎందుకు చెప్పానంటే, ఖురాన్ ప్రకారంగానే మనం తీర్పు జరగాలి మన మధ్యలో, కానీ చేసేవారు ఎవరుంటారు? మనుషులే ఉంటారు. కానీ ఆ మనుషులు సామాన్య మనుషులు కాదు, ధర్మం గురించి ఎక్కువగా తెలిసిన వారు. కానీ ఈ విషయం వారి బుర్రలో దిగలేదు. వారేమన్నారు? “ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దామని ఇద్దరినీ మనుషులను పంపుతున్నారు, అందుగురించి మీరు కాఫిర్ అయిపోయారు” అని అన్నారు నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్వచ్ఛమైన సహబాలు, ఖులఫాయే రాషిదీన్ లోని ఒకరు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని! ఇలాంటి వారి గుణం.
ఖవారిజ్‌ల హింసాకాండ
అయితే అక్కడి నుండి ఒక పెద్ద వర్గం వేరైపోయింది. సామాన్యంగా ‘ఖురూజ్’ అన్న పదం మీకు తెలుసు, వెళ్ళిపోవడం. అయితే వీరు సహబాల జమాత్ నుండి, ముస్లింల ఒక సత్యమైన వర్గం నుండి, ముస్లింల నుండి వేరైపోయారు, బయటికి వెళ్లిపోయారు. ఈ విధంగా వారిని ‘ఖవారిజ్’ అని అనడం జరిగింది. అయితే వారందరూ వెళ్లి ఒక ప్రాంతంలో తమ అడ్డాగా చేసుకొని, అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని ‘హరూరా‘ అని అంటారు. అందుకొరకు వారి యొక్క పేరు ‘హరూరియా‘ అని కూడా పడింది.
అయితే ఆ తర్వాత అలీ (రదియల్లాహు అన్హు) ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపించారు. వారింకా మూఢనమ్మకాల్లో ఉన్నారు, వారికి సరైన జ్ఞానం ఇంకా లేదు, వారికి ఇస్లాం విషయంలో ఇంకా మంచి లోతు జ్ఞానం ప్రసాదించాలి అని ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ని పంపారు. ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వారి వద్దకు వెళ్లి చాలా సేపు వారితో ఉండి – ఆ యొక్క వివరాలు కూడా మనకు గ్రంథాల్లో ఉన్నాయి – చాలా సేపటి వరకు వారితో డిబేట్ చేశారు, వారితో వాదం చేశారు, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల చాలా మంది సరైన విషయాన్ని, సరైన విశ్వాసాన్ని, అసలు ఇక్కడ మనం పాటించవలసిన నమ్మకం, విశ్వాసం, వ్యవహారం ఏంటి అర్థం చేసుకొని, అలీ (రదియల్లాహు అన్హు) వైపుకు వచ్చారు. అయినా కొంతమంది మొండితనం పాటించే వాళ్ళు ఉంటారు కదా, “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్నట్లుగా. అలాంటి మొండితనంలో ఎంతోమంది ఉండిపోయారు.
ఆ తర్వాత వారు తమ మొండితనంలో ఉండి, మౌనంగా ఉంటే కూడా అంత నష్టం కాకపోవచ్చేమో. కానీ అంతకే వారు మౌనంగా ఉండకుండా ఏమన్నారు? “ఎవరైతే మా ఈ విశ్వాసం, మా ఈ పద్ధతిలో లేరో వారందరూ కాఫిర్లు” అస్తగ్ఫిరుల్లాహ్. ఖవారిజ్ అంటే వీరు. వారి తప్ప ఇక వేరే ఎవరినీ కూడా ముస్లింలుగా నమ్మరు. అంతేకాదు, వారు ఉన్న ఆ ప్రాంతానికి చుట్టుపక్కల దగ్గరలో నుండి ఎవరైనా ముస్లింలు పోతే, దాటుతే వారిని హత్య చేసేవారు.
చివరికి అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఖబ్బాబ్ బిన్ అరత్ ఒక గొప్ప సహాబీ, అతని యొక్క ఒక కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఖబ్బాబ్ బిన్ అరత్ – ఒక సందర్భంలో అతనితో ఉన్నటువంటి ఒక బానిసరాలు వెంట ఆయన వెళ్తున్నాడు, వారికి ఆ విషయం తెలిసింది. ఆ సందర్భంలో ఆ బానిసరాలు గర్భవతి. అయితే ఆ మూర్ఖులు, ఆ దుండగులు, ఆ దౌర్జన్యపరులు, ఖవారిజ్ – ఆ ఒక స్త్రీని కూడా స్త్రీ అని గౌరవించలేదు, అంతేకాకుండా ఆమె గర్భంతో ఉంది కదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెను చంపేశారు. అంతేకాదు ఆమె కడుపులో పొడిచి శిశువుని బయటికి తీసి కూడా.. ఇట్లాంటి దౌర్జన్యాలు చేసేవారు వారు.
ఖవారిజ్‌ల చెడు గుణాలు
అయితే సోదర మహాశయులారా, వారి యొక్క పుట్టుక అనండి, వారి యొక్క ఆరంభం అనండి, దాని గురించి కొన్ని విషయాలు నేను ఇప్పటివరకు చెప్పాను. అయితే సంక్షిప్తంగా వారి యొక్క కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం.
1. పండితులతో జ్ఞానం నేర్చుకోరు
వారిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, ధర్మ జ్ఞాన విషయంలో ఇంకా మనం ముందుకు వెళ్లాలి అన్నటువంటి తపన, ఆలోచన ఉండదు. ధర్మ పండితులతో జ్ఞానం నేర్చుకోరు. అందుకొరకే సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
يَقْرَءُونَ الْقُرْآنَ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ (యఖ్ రవూనల్ ఖురాన లా యుజావిజు హనాజిరహుమ్) వారు ఖురాన్ చదువుతారు, కానీ అది వారి ఈ గొంతుకు కిందికి దిగదు.
అంటే ఏంటి? ఖురాన్ పఠన అనేది, తిలావత్ అనేది చాలా మంచిగా చేస్తారు. కానీ చదువుతున్నది ఏమిటి? అది ధర్మ జ్ఞానుల వద్ద, మంచి పెద్ద ఉలమాల వద్ద కూర్చుండి విద్య నేర్చుకోవాలి. తఫ్సీర్ నేర్చుకోవాలి, హదీస్ నేర్చుకోవాలి, ఫిఖహ్ నేర్చుకోవాలి, అఖీదా ఈమాన్ అన్ని వివరాలు నేర్చుకోవాలి, అఖ్లాఖ్, ఆదాబ్, సులూక్ ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ దీని గురించి, పండితులతో, ధర్మవేత్తలతో ధర్మం నేర్చుకోవడంలో మరీ వెనుక ఉంటారు. ఖురాన్ చదవడానికి మహా స్వచ్ఛంగా, ఎంతో మంచిగా చదువుతున్నారు అన్నట్లుగా నటిస్తారు, కానీ ఖురాన్ అర్థభావాలను తెలుసుకోరు.
2. ధర్మవేత్తలపై ఆక్షేపణలు
వారిలో ఉన్నటువంటి రెండవ చెడు గుణం ఏమిటంటే – మొదటి గుణం తెలిసింది కదా, ధర్మ పండితులతో ధర్మ జ్ఞానం నేర్చుకోరు – కానీ రెండో చెడు గుణం ఏమిటి? ధర్మవేత్తల మీద ఆక్షేపణలు, ఏతరాజ్, క్రిటిసైజ్. “మీకు తెలియదు, మీరు మంచిగా చెప్పడం లేదు, మీరు అన్ని స్పష్టంగా చెప్పరు”. ఈ విధంగా ధర్మ పండితుల మీద వారు ఇలాంటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక గొప్ప సాక్ష్యం, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు, చదువుతున్నాడు ఖురాన్ ఆయత్, అలీ (రదియల్లాహు అన్హు), ముఆవియా (రదియల్లాహు అన్హు) వారిని కాఫిర్లు అని అంటున్నాడు. అలీ (రదియల్లాహు అన్హు) గొప్ప ధర్మవేత్త, ఖలీఫా మరియు ఆయన ధర్మవేత్త కూడా. అయితే ఈ విధంగా తమ వద్ద ఉన్న అల్ప జ్ఞానంతో ధర్మ పండితులకు ఛాలెంజ్ చేస్తారు.
3. కబీరా గునాహ్(ఘోరమైన పెద్ద పాపాలు) కారణంగా కాఫిర్లుగా ప్రకటించడం
వారిలో ఉన్నటువంటి మూడవ చెడు గుణం ఏమిటంటే, పాపాల లో రెండు రకాలు ఉన్నాయి: చిన్న పాపాలు మరియు ఘోరమైన పెద్ద పాపాలు. సామాన్యంగా వాటిని మనం ‘కబీరా గునాహ్’ అని ఉర్దూలో, లేకుంటే ‘కబాయిర్’ అని ఉర్దూ, అరబ్బీ రెండు భాషల్లో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే కబాయిర్, వాస్తవానికి ఇవి చాలా ఘోరమైన పాపాలు. కానీ సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, అయిమ్మా, ముహద్దిసీన్ వీరందరి ఏకాభిప్రాయం ఏమిటంటే – ఎవరైనా కబీరా గునాహ్ చేసినంత మాత్రాన అతడు కాఫిర్ అయిపోడు. కబీరా గునాహ్ కు ఎవరైనా పాల్పడితే వారిని మనం కాఫిర్ అని అనరాదు. కానీ ఈ ఖవారిజ్ ఏమంటారు? “కబీరా గునాహ్ చేసిన వాడు కాఫిర్” అని అనేస్తారు. అర్థమవుతుంది కదా? ఎన్ని గుణాలు తెలుసుకున్నాము ఇప్పటివరకు? మూడు.
4. ముస్లింల హత్య హలాల్ అని భావించడం
నాలుగవ విషయం, నాలుగవ చెడు గుణం వారిలో ఉన్నది – వారి బాటలో, వారి ఆలోచన ప్రకారం ఎవరైతే లేరో, వారి యొక్క ధనం దోచుకోవడం, వారి యొక్క ప్రాణానికి ఏ విలువ లేకుండా హత్య చేయడం వారి వద్ద హలాల్. వారి తప్ప ఇతరుల ధర్మం, ఇతరుల ప్రాణం, ధనం, మానం వీటికి ఏ మాత్రం విలువ వారి వద్ద లేదు.
అందుగురించే సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
يَقْتُلُونَ أَهْلَ الْإِسْلَامِ وَيَدَعُونَ أَهْلَ الْأَوْثَانِ (యఖ్ తులూన అహ్లల్ ఇస్లాం వ యదవూన అహ్లల్ ఔథాన్)
ముస్లింలను చంపుతారు. కానీ విశ్వాసం, అవిశ్వాసుల మధ్యలో, సత్యం అసత్యం, ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో యుద్ధాలు జరిగే సందర్భంలో అక్కడ వారు పోరు. కానీ ముస్లింలను చంపడానికి అయితే ముందుగా ఉంటారు.
నాలుగవది ఏమిటి? ముస్లింల హత్య చేయడం వారి వద్ద హలాల్.
5. కబీరా గుణాలు చేసినవారు శాశ్వతంగా నరకంలో ఉంటారు
ఐదవ విషయం, ఐదవ చెడు గుణం వారిది – ఎవరైతే కబీరా గునాహ్ కు పాల్పడ్డారో, వారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అని అంటారు. మరియు సహబాలు, తాబెయీన్, తబె-తాబెయీన్, ముస్లింలందరి ఏకాభిప్రాయం ఏమిటి? ఎవరైనా కబీరా గునాహ్ కు పాల్పడ్డారంటే అల్లాహ్ క్షమించనూవచ్చు, లేదా అల్లాహ్ క్షమించకుంటే ఆ పాపంకు తగ్గట్టు నరకంలో శిక్ష ఇచ్చిన తర్వాత అతని వద్ద ఏ తౌహీద్ అయితే ఉందో దాని కారణంగా అల్లాహ్ మళ్లీ అతన్ని స్వర్గంలో పంపిస్తాడు. దీని గురించి సహీహ్ బుఖారీ ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇంతకుముందు మనం విశ్వాసపున సూత్రాల్లో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క ఘనతలో ఆ హదీస్ కూడా చదివాము. కానీ వీరేమంటారు? “ఎవరైనా కబీరా గునాహ్ చేశారంటే అతడు శాశ్వతంగా నరకంలో, ఇక స్వర్గంలో పోయే అవకాశమే లేదు” అని అంటారు. ఇది చాలా తప్పు మాట.
ఇక్కడ ఒక విషయం గమనించండి. వారు ఖురాన్ లోని ఒక ఆయత్ కూడా తెలుపుతారు. ఉదాహరణకు అల్లాహ్ తాలా సూరె నిసా ఆయత్ నెంబర్ 93 లో – ఎవరైతే కావాలని, తెలిసి ఒక విశ్వాసుని హత్య చేస్తాడో, అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ తాలా ఐదు రకాల శిక్షలు తెలిపాడు. వాటిలో ఒకటి ఏమిటి? నరకంలో ఉంటాడు అని. కానీ దీని యొక్క తఫ్సీర్ స్వయంగా వేరే ఖురాన్ ఆయత్ ల ద్వారా మరియు వేరే హదీసుల ద్వారా పండితులు ఏం చెప్పారు? దాన్ని ఖవారిజ్ ఏమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? స్వయం వారి దగ్గర ధర్మ జ్ఞానం అనేది సంపూర్ణంగా లేదు. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నారు? ఐదు చెడు గుణాలు.
6. హదీసులను తిరస్కరించడం
ఇక రండి, ఆరవది. ఆరవ విషయం ఏమిటి? వారు హదీసులను తిరస్కరిస్తారు. ఎందుకు తిరస్కరిస్తారు? ఖురాన్ కు వ్యతిరేకంగా ఉంది అని. గమనించండి, ముందే అల్ప జ్ఞానం ఉంది, కానీ అక్కడ తన యొక్క కొరత, తన యొక్క దోషం, తన యొక్క లోపం స్వయం అర్థం చేసుకోకుండా ఎంత చెడ్డ పనికి దిగుతున్నాడో చూడండి. ఖురాన్ కు ఈ హదీస్ వ్యతిరేకంగా ఉంది అని హదీస్ ను తిరస్కరిస్తాడు. కానీ వాస్తవ విషయం ఏంటో తెలుసా? చాలా శ్రద్ధగా మీరు విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఏ ఖురాన్ ఆయత్ మరో ఆయత్ కు, లేదా ఏ ఖురాన్ ఆయత్ సహీహ్ హదీస్ కు వ్యతిరేకంగా కాజాలదు. నేను కాదు చెప్పింది ఈ మాట, పెద్ద పెద్ద ముహద్దిసీన్లు చెప్పారు. ఇమామ్ ఇబ్న్ హిబ్బాన్ (రహిమహుల్లాహ్) ఒక సందర్భంలో చెప్పారు: “తీసుకురండి మీలో ఎవరి వద్దనైనా ఏదైనా ఖురాన్ ఆయత్ మరియు హదీస్ వ్యతిరేకంగా కనబడుతుంది, తీసుకురండి నేను దానికి పరిష్కారం చూపిస్తాను” అని అనేవారు.
అంటే ఏమిటి? నా వద్ద ఉన్న తక్కువ జ్ఞానం, లేదా నాకు జ్ఞానం లేనందువల్ల ఈ ఆయత్ ఈ హదీస్ కు వ్యతిరేకంగా అని నేను చూస్తున్న కావచ్చు. కానీ నేనేం చేయాలి అప్పుడు? పెద్ద పండితుల వద్దకు వెళ్లి దాని యొక్క వివరణ తెలుసుకోవాలి. కానీ అలా తెలుసుకోకుండా వీరేం చేస్తారు? హదీసులను రద్దు చేస్తారు, హదీసులను తిరస్కరిస్తారు.
వాస్తవ విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు చూడడానికి ఏదైనా ఆయత్ మరో ఆయత్ కు వ్యతిరేకంగా, లేదా ఆయత్ హదీస్ కు వ్యతిరేకంగా, లేదా హదీస్ హదీస్ కు వ్యతిరేకంగా ఇలా కనబడినప్పుడు మనం ధర్మవేత్తలతో సంప్రదించి దాని యొక్క వివరణ కోరాలి, తెలుసుకోవాలి.
7. పాలకులపై తిరుగుబాటు
వారి ఏడవ చెడు గుణం ఏమిటంటే, వారు ముస్లిం నాయకుడు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా మాట చెప్పాడు, ఏదైనా పని చేశాడు అంటే, అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, అతని యొక్క విధేయత నుండి దూరమై, అతనికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడానికి దిగుతారు. మరి ఇస్లాం మనల్ని ఈ విషయం నుండి ఆపుతున్నది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: ఎవరైతే నాయకులు ఉన్నారో, వారి పరిపాలన విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఎక్కడైనా ఏదైనా వారితో తప్పు జరిగింది అంటే, మీరు వారి పట్ల విధేయత పాటించే బాధ్యత ఏదైతే ఉందో, దాని నుండి మీరు వెనుతిరగకండి. ఉర్దూలో అంటారు ‘అలమె బగావత్ బులంద్ కర్నా’. వారికి విరుద్ధంగా పోరాటం చేయరాదు. ఎందుకు? దీనివల్ల కల్లోలం ఏర్పడుతుంది, అల్లర్లు ఏర్పడతాయి, ఒక మహా ఫసాద్ అయిపోతుంది, ముస్లింల రక్తపాతాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకొరకు ఎవరైనా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే, ఎవరు వారి వద్దకు చేరుకొని వారిని నచ్చజెప్పగలుగుతారో, నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వెంటనే “ఇతడు ఇలా చేశాడు” అని బహిరంగంగా దానికి ప్రచారం చేసి, అతనికి వ్యతిరేకంగా ఏదైనా యుద్ధం చేయడానికి, కత్తి తీయడానికి ప్రయత్నం చేయడం, ఇది ఇస్లాం నేర్పలేదు. కానీ ఖవారిజ్ వారి యొక్క ఏడవ చెడు గుణం – ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా, ముస్లిం పరిపాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతారు.
ముగింపు
సోదర మహాశయులారా! చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ టైం ఎక్కువైపోతుంది గనుక మనం ఈ కొన్ని విషయాల మీద, అంటే వారి గుణాలు ఏవైతే తెలుసుకున్నామో, ఆ తర్వాత ఇక ముఖ్యమైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అవేమిటి?
ప్రస్తుతం మనం ఈ చెడ్డ ఏడు గుణాలు తెలుసుకున్నాము. ఎవరిలో మనం ఈ ఏడు గుణాలు, లేదా ఏడిట్లో ఏదైనా ఒకటి చూసామంటే వారిని మనం తొందరగా “ఇతడు ఖారిజీ, ఇతడు ఖవారిజ్ లో ఒకడు” అని పలకాలా? లేదు. ఇక్కడ విషయం గమనించాలి. అల్లాహ్ మనకు నేర్పిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపిన, సహబాలు పాటించినటువంటి ఒక గొప్ప పద్ధతి – సలఫ్ మార్గం అనేది సర్వ మానవాళికి శ్రేయస్కరమైన మార్గం. ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే, ఖవారిజ్‌లకు ప్రత్యేకమైన ఈ గుణాలు అని మనం తెలుసుకున్నాము, కానీ ఈ గుణాలలో ఏదైనా ఒకటి ఎవరిలో ఉంది అంటే వెంటనే “నువ్వు ఖారిజీ అయిపోయావు” అని అతని మీద ఫత్వా ఇవ్వడం ఇది సరికాదు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి.
ముందు మనం పాటించవలసిన విషయం ఏంటి? ఎవరిలోనైనా ఈ ఏడిట్లో ఏదైనా ఒక గుణం చూసామంటే, అలాంటి చెడ్డ గుణం మనలో పాకకూడదు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత, అతన్ని మనం నచ్చజెప్పే అటువంటి ఏదైనా శక్తి, ధర్మ జ్ఞానం, దానికి సంబంధించినటువంటి వివేకం మనలో ఉందా? అది మనం చూసుకోవాలి. ఉంటే అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. లేదా అంటే, ఎవరు నచ్చజెప్పగలుగుతారో, ఎవరు అతనికి బోధ చేయగలుగుతారో వారి వద్దకు మనం వెళ్లి వారికి ఈ విషయం తెలియజేయాలి. కానీ అతని మాటలు వినడంలో, అతని యొక్క స్నేహితంలో మనం పడి ఏదైనా అలాంటి పొరపాటుకు మనం గురి అయ్యే ప్రయత్నం, గురి అయ్యే అటువంటి తప్పులో మనం ఎన్నడూ పడకూడదు. ఎందుకంటే కొందరు “లేదు నేను అతనికి జవాబు ఇస్తాను, నేను అతనికి గుణపాఠం నేర్పుతాను” ఇటువంటి తొందరపాటులో పడి, “అరే అతడు ఖారిజీలో అటువంటి గుణం ఉంది అని అనుకున్నాను కానీ అతడు ఖురాన్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా, హదీస్ నుండే ఆధారం ఇస్తున్నాడు కదా” ఇటువంటి భావనలో పడి, నిన్ను కూడా అతడే లాక్కొని, అతని వైపు లాక్కొని నిన్ను ఎక్కడ ప్రమాదంలో పడవేస్తాడో, అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజుల్లో ఖవారిజ్ అన్న పేరుతో ఒక వర్గం స్పష్టంగా ఎక్కడా కూడా లేదు, కానీ ఈ గుణాలు ఏవైతే తెలుపబడ్డాయో ఎన్నో వర్గాలలో, ఎందరిలో ఉన్నాయి. అందుకొరకే చివరలో నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఇట్లాంటి చెడ్డ గుణాల నుండి దూరం ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇస్లాంను ఖురాన్ హదీసుల ద్వారా సహబాలు అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకొని ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net