దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?
తమ పోషకుని (రబ్) తెలుసుకోవటం, తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం, తన ప్రవక్తయగు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.
లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.
ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.
త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.
అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.
సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.
مَنْ رَبُّكَ؟ (మన్ రబ్బుక?) “నీ ప్రభువు ఎవరు?”
مَا دِينُكَ؟ (మా దీనుక్?) “నీ ధర్మం ఏది?”
مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟ (మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?) “మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”
విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.
అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.
సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.
ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్) ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)
గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.
రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.
అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.
وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి. (41:37)
అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.
ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. (7:54)
నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.
సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)
ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.
మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?
الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)
ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.
అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.
ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.
రెండవ సూత్రం: నీ ధర్మం ఏది?
ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.
అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.
స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.
ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.
సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.
ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.
ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.
ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.
ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
మూడవ సూత్రం: నీ ప్రవక్త ఎవరు?
మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.
ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.
ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.
దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.
ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا (అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా) ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)
అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.
إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ (ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్) నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)
నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:
مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ (మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా) దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)
ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.
సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.
అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.
وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, కలిమ-ఎ-షహాదత్ (సాక్ష్య వచనం) యొక్క రెండవ భాగమైన “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” (ముహమ్మద్ (స) అల్లాహ్ యొక్క ప్రవక్త) యొక్క లోతైన అర్థం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. ఈ వాక్యాన్ని విశ్వసించడంలో నాలుగు ముఖ్యమైన షరతులు ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు: 1) ప్రవక్త (స) ఇచ్చిన ఆదేశాలను పాటించడం, 2) ఆయన చెప్పిన విషయాలను సత్యమని నమ్మడం, 3) ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం, మరియు 4) ఆయన చూపిన పద్ధతిలో మాత్రమే అల్లాహ్‌ను ఆరాధించడం. ఇంకా, ఈ విశ్వాసానికి రెండు మూల స్తంభాలు ఉన్నాయని వివరించారు: ఆయన అల్లాహ్ యొక్క ‘అబ్ద్’ (దాసుడు) మరియు ‘రసూల్’ (ప్రవక్త). ఆయన ఒక మానవుడు, దాసుడు అని నమ్మడం ద్వారా ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడకుండా, దైవత్వపు లక్షణాలను అంటగట్టకుండా ఉంటాము. అలాగే, ఆయన ప్రవక్త అని నమ్మడం ద్వారా ఆయన సందేశాన్ని తిరస్కరించకుండా, ఆయన స్థానాన్ని తగ్గించకుండా ఉంటాము. ఈ రెండు అంశాలను సమతుల్యం చేసుకోవడం సరైన ఇస్లామీయ విశ్వాసానికి కీలకం.
أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)
సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు“ అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.
రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్‌లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.
ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్‌లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్‌లో వెళ్లి వాటిని పొందవచ్చు.
ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).
ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్‌లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్‌లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్‌లోని తషహ్హుద్‌లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్‌లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.
హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.
అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.
మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్‌ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.
రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.
ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.
మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.
నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.
ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్‌లో, హదీస్‌లో ఎన్నో దలీల్‌లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్‌ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.
అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్‌లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.
మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్‌కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్‌గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్‌కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.
అబ్ద్. దీని గురించి ఖురాన్‌లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్‌లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.
ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.
ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్‌లో కూడా, సూరతుల్ ఆరాఫ్‌లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.
ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్‌లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.
ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్‌తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్‌తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్‌తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్‌నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.
మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్‌లను, వేరే కొందరు పీర్‌లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.
విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్‌ను ఆరాధించారో అలా అల్లాహ్‌ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్‌లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్‌కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.