సహనం ప్రయోజనాలు – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహనం ప్రయోజనాలు
https://youtu.be/gxR-9kJ-B6g [45 నిముషాలు]
వక్త: షేఖ్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.

దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే,

سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
(సలామున్ అలైకుం బిమా సబర్ తుం ఫ ని’అమ ఉఖ్బద్ దార్)

“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)

సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.

అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,

إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
(ఇన్నీ జజైతుహుముల్ యౌమ బిమా సబరూ అన్నహుం హుముల్ ఫాయిజూన్)

నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్‌ సెలవిస్తాడు).” (23:111)

అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.

అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.

కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,

وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
(వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్)
సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)

అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.

సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.

అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్ సాబిరీన్)
సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.” (8:46)

సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.

అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్)
సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.” (39:10)

అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.

ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.

అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.

సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ
(వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్)
“సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)

అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.

అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?

وَبَشِّرِ الصَّابِرِينَ. الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
(వబష్షిరిస్ సాబిరీన్. అల్లజీన ఇజా అసాబత్ హుం ముసీబతున్ ఖాలూ ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఉలాయిక అలైహిం సలవాతుమ్ మిర్ రబ్బిహిం వ రహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్)

ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)

ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.

అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.

అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్. మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.

అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.

కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.

అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.

మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
(వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహీ వనహన్ నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మ’అవా)

మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)

ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.

అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.

మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا
(ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా)
ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)

మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.

ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.

అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.

కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.

సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(వలమ్మా బరజూ లిజాలూత వ జునూదిహీ ఖాలూ రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్)

వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)

ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.

నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,

وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(వస్బిర్ వమా సబ్ రుక ఇల్లా బిల్లాహ్ వలా తహ్జన్ అలైహిం వలా తకు ఫీ జైకిమ్ మిమ్మా యమ్కురూన్)

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.

అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.

కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.

ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
(వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా)
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)

వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.

అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.

ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,

మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా.
విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.

అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.

దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?

ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.

చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.

మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.

ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.

అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43525

ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం  – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
https://youtu.be/PmdImlJWjdo [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో, షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ గారు “ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ఇస్లాం కేవలం కొన్ని ఆచారాలు లేదా ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదని, అది మానవ జీవితంలోని ప్రతి అంశానికి – వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక – మార్గదర్శకత్వం వహించే ఒక సమగ్రమైన వ్యవస్థ అని వివరించారు. చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి ప్రాపంచిక తత్వవేత్తల పరిమిత దృక్పథాలతో ఇస్లాం యొక్క సంపూర్ణతను పోల్చారు. “ఇస్లాం”, “ముస్లిం”, మరియు “అల్లాహ్” అనే పదాల యొక్క లోతైన అర్థాలను వివరిస్తూ, ఇస్లాం ఐదు మూలస్తంభాల (షహాదహ్, నమాజు, ఉపవాసం, జకాత్, హజ్) పై నిర్మించబడిందని తెలిపారు. ఇస్లాం మానవ సమస్యలన్నింటికీ సృష్టికర్త నుండి వచ్చిన పరిష్కారమని, ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా యావత్ మానవాళికి మార్గదర్శి అని ఆయన నొక్కిచెప్పారు. తన వాదనకు బలం చేకూరుస్తూ, జార్జ్ బెర్నార్డ్ షా, సరోజినీ నాయుడు వంటి పలువురు ముస్లిమేతర ప్రముఖుల ఇస్లాం గురించిన ప్రశంసలను కూడా ఆయన ఉటంకించారు.

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్ (సర్వానికి ఆధారభూతుడు)” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్” యొక్క వివరణ
https://youtu.be/Y9EhNR3PhYw [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క రెండు గొప్ప నామాలైన “అల్-హయ్యు” (సజీవుడు) మరియు “అల్-ఖయ్యూమ్” (సర్వానికి ఆధారభూతుడు) యొక్క లోతైన అర్థాలను వివరిస్తారు. “అల్-హయ్యు” అంటే అల్లాహ్ శాశ్వతంగా, సంపూర్ణంగా జీవించి ఉన్నవాడని, ఆయన జీవంలో ఎలాంటి లోపం లేదని, మరియు సమస్త జీవరాశులకు ఆయనే జీవప్రదాత అని అర్థం. “అల్-ఖయ్యూమ్” అంటే అల్లాహ్ స్వీయ-ఆధారితమైనవాడని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని, అదే సమయంలో సృష్టి మొత్తాన్ని ఆయనే పోషిస్తూ, నిర్వహిస్తున్నాడని భావం. ఈ రెండు నామాలు కలిసి అల్లాహ్ యొక్క అన్ని ذاتي (దాతి) మరియు فعلي (ఫి’లీ) గుణాలను కలిగి ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు. ఈ నామాల ప్రాముఖ్యతను వివరించడానికి ఖురాన్ (సూరహ్ అల్-బఖరా, సూరహ్ ఆల్-ఇమ్రాన్, సూరహ్ తాహా) మరియు హదీసుల నుండి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కష్ట సమయాల్లో ఈ నామాలతో అల్లాహ్‌ను ప్రార్థించడం చాలా పుణ్యప్రదమని, ఆయన సహాయం మరియు క్షమాపణ పొందటానికి ఇది ఒక మార్గమని చెప్పబడింది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడటానికి ఈ నామాలను అర్థం చేసుకుని, వాటిపై ధ్యానం చేయాలని వక్త ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క శుభ నామాలలో చాలా గొప్ప నామాలలో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.

మీకు తెలిసిన విషయమే, అల్-హయ్యు అల్-ఖయ్యూమ్, ఇవి రెండూ కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు.

అల్-హయ్యు అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి, ప్రతీ ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు.

అల్-హయ్యు అన్న పేరు అల్లాహ్ ది ఏదైతే ఉందో,

أَلْحَيَاةُ الْكَامِلَة
అల్-హయాతుల్ కామిలా
సంపూర్ణమైన జీవం

అందులో అల్లాహ్ యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తఆలా యొక్క గొప్ప గుణం, అల్లాహ్ సజీవుడు. స్వతహాగా, ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తఆలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు.

మన జీవితం, సృష్టి రాశుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వేలాది, లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉన్నా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమీ లేకుండా ఉన్నారు. ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది. కానీ అల్లాహు తఆలా ఆది, అంతము లేనివాడు. అల్లాహ్ మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాహ్ కే తెలుసు. అప్పటినుండి ఉన్నాడంటే, చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహ్ కు మరణం అన్నది, మరియు అలసట అన్నది, నిద్ర, కునుకు అన్నది ఏదీ కూడా లేదు. అదే విషయం సూరత్ అల్-బఖరా లోని ఆయతల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ ఇలా అంటాడు:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌ وَلَا نَوْمٌ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, అల్-హయ్యు (సజీవుడు), అల్-ఖయ్యూమ్ (సృష్టి యావత్తుకు ఆధారభూతుడు). ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.

ఇక్కడ అల్-హయ్యు యొక్క వివరణలో, “లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్” అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా.

ఏంటి ఆ దుఆ?

اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ

అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వఅలైక తవక్కల్తు, వఇలైక అనబ్తు, వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ, అంతల్ హయ్యుల్లదీ లా యమూత్, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన్.

ఓ అల్లాహ్, నీకు నేను విధేయుడనయ్యాను, నిన్నే నేను విశ్వసించాను, నీపైనే నేను భారం మోపాను, నీ వైపునకే నేను మరలాను, నీ ఆధారంగానే నేను వాదిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీ ఘనత యొక్క శరణు కోరుతున్నాను, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయకుండా కాపాడు. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రాని వానివి. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారే.

అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా గానీ, వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ
అల్లాహుల్లదీ ఖలఖకుమ్
అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. (సూరతుర్-రూమ్)

సూరతుర్-రూమ్ లో ఇంతకుముందు మనం ఆయత్ విని ఉన్నాము. అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తఆలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు.

అయితే సోదర మహాశయులారా, అల్-హయ్యు, ఇందులో అల్లాహు తఆలా యొక్క దీనిని “ఇస్మే దాత్” అని కూడా అంటారు. అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప, స్వతహాగా ఉండే అటువంటి గుణాలన్నిటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో తెలియజేశారు:

الحَيُّ الْجَامِعُ لِصِفَاتِ الذَّاتِ
అల్-హయ్యు అల్-జామిఉ లి-సిఫాతిద్-దాత్
అల్-హయ్యు (అనే పేరు) అల్లాహ్ యొక్క స్వతస్సిద్ధమైన గుణాలన్నిటినీ సమీకరించేది.

అల్లాహ్ యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్-ఇల్మ్ (జ్ఞానం), వస్-సమ్’అ (వినడం), వల్-బసర్ (చూడడం), వల్-యద్ (చెయ్యి), ఇలాంటి అల్లాహ్ యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్, సహీహ్ హదీసులలో, వాటన్నిటినీ, అవన్నీ కూడా ఈ అల్-హయ్యు అన్న పేరులో వచ్చేస్తాయి.

ఇక అల్-ఖయ్యూమ్. దీని భావం ఏమిటంటే, అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే, ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ, వాటికి బాధ్యత తీసుకుని ఉన్నాడు. అందుకొరకే, సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్-ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు “సర్వ సృష్టికి ఆధారభూతుడు” అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ పేరు గురించి చెప్పారు,

القَيُّومُ الْجَامِعُ لِصِفَاتِ الأَفْعَالِ
అల్-ఖయ్యూమ్ అల్-జామిఉ లి-సిఫాతిల్-అఫ్ఆల్
అల్-ఖయ్యూమ్ (అనే పేరు) అల్లాహ్ యొక్క కార్యాలకు సంబంధించిన గుణాలన్నిటినీ సమీకరించేది.

ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్-ఖల్ఖ్ (సృష్టించడం), అర్-రిజ్ఖ్ (ఉపాధి కలిగించడం), వల్-ఇన్ఆమ్ (అనుగ్రహాలు నొసంగడం), అల్-ఇహ్యా (బ్రతికించడం), వల్-ఇమాత (చంపడం), ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు “రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్” (అల్-ఖయ్యూమ్ అనే పేరు వైపు మరలుతాయి). ఇవన్నీ కూడా అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చేస్తాయి.

అల్-హయ్యు వల్-ఖయ్యూమ్, ఇవి రెండూ ఖురాన్ లో కూడా వచ్చి ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్ లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీహ్ హదీస్ కూడా ఉంది. అబీ హాతిమ్ లో, తిర్మిదీ లో, ఇబ్నే మాజా లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారు “సహీహుల్ జామిఅ” లో ప్రస్తావించారు (హదీస్ నం. 979).

اِسْمُ اللَّهِ الأَعْظَمُ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى
ఇస్ముల్లాహిల్ అ’జమ్ అల్లదీ ఇదా దుఇయ బిహి అజాబ్, వ ఇదా సుఇల బిహి అ’తా
అల్లాహ్ యొక్క గొప్ప పేరు, దాని ద్వారా దుఆ చేస్తే ఆయన వెంటనే స్వీకరిస్తాడు మరియు దాని ద్వారా అర్ధించడం జరిగితే ఆయన ప్రసాదిస్తాడు.

ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ లోని సూరతుల్ బఖరాలో, సూరత్ ఆల్-ఇమ్రాన్ లో మరియు సూరతు తాహా లో ఉన్నాయి. ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరహ్ బఖరాలో గనుక మనం చూస్తే ఆయత్ నంబర్ 255, ఆయతుల్ కుర్సీలో:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

సూరత్ ఆల్-ఇమ్రాన్ యొక్క ఆరంభంలోనే:

الٓمٓ (١) ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ (٢)
అలిఫ్-లామ్-మీమ్. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

ఇక సూరత్ త్వాహాలో గనుక మనం చూస్తే, ఆయత్ నంబర్ 111:

وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ
వ అనతిల్ వుజూహు లిల్-హయ్యిల్ ఖయ్యూమ్.

సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి.

ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతులలో గమనించారు కదా, సూరత్ బఖరాలోని 255, ఆల్-ఇమ్రాన్ లోని స్టార్టింగ్ ఆయత్లో, అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాహ్ ను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో, వారు ఒక్కసారి ఆలోచించాలి.

ఖురాన్ లో అల్లాహ్ ఏమంటున్నాడు?

وَتَوَكَّلْ عَلَى ٱلْحَىِّ ٱلَّذِى لَا يَمُوتُ
వ తవక్కల్ అలల్-హయ్యిల్లదీ లా యమూత్.
నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి, ఆధారపడి, అతని మీదనే భరోసా ఉంచు.

భరోసా ఉర్దూ పదం, కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇ’తిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడో, ఎన్నటికీ మరణించనివాడో. మరి ఈ రోజుల్లో మనలో ఎంతో మంది తాయెత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా?

ఏ అల్లాహ్ సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని ఆధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి, ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తమూ నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్ మనకు సృష్టికర్తగా, ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత్ నంబర్ 41 చదవండి.

إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا
ఇన్నల్లాహ యుమ్సికుస్-సమావాతి వల్-అర్ద అన్ తజూలా.
యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుండి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు.

ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నామా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా? సూరహ్ అంబియా లోని ఆయత్ చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి. కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మనం నివసించుటకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అవి గనుక తమ స్థానాల నుండి తొలగిపోతే, అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు.

ఈ ఆయత్ కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్-రూమ్ ఆయత్ నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం, మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా, బలంగా చేస్తుంది.

అల్లాహ్ అంటున్నాడు:

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ
వ మిన్ ఆయాతిహీ అన్ తఖూమస్-సమాఉ వల్-అర్దు బి-అమ్రిహ్
మరియు ఆయన సూచనలలో ఒకటి, ఆకాశం మరియు భూమి ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి.

ఈ “తఖూమ” అన్న పదం ఏదైతే ఉందో, దీని నుండే “ఖయ్యూమ్” అన్న అల్లాహ్ యొక్క పేరు వస్తుంది. (కాఫ్, యా, మీమ్) భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతుర్-ర’అద్ ఆయత్ నంబర్ 33లో కూడా కనబడుతుంది.

أَفَمَنْ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ
అఫమన్ హువ ఖాఇమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్
ప్రతి ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షించేవాడు (అల్లాహ్).

అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నిలకొలిపి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. గమనించండి. అలాంటి అల్లాహ్ కు మనం ఎంత విధేయులుగా ఉండాలి.

ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేసి అల్లాహ్ పై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లాహ్ యొక్క దయతో మనకు ఏమీ కాదు, అల్లాహ్ మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు?

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్-హయ్యు లో అల్లాహ్ యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లాహ్ యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీసును చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనం గనుక వాస్తవంగా ఈ హదీసును అర్థం చేసుకుంటే, ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దుఆ చేస్తే, ఎలా ఈ దుఆ స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదీ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524.

كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَرَبَهُ أَمْرٌ قَالَ
కానన్-నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా కరబహు అమ్రున్ ఖాల్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దుఆ చేసేవారు.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్.

(నోట్ చేసుకోండి మీరందరూ కూడా ఈ దుఆను. గుర్తుంచుకోండి. యాద్ చేసుకోండి. చిన్నదే. నాలుగే పదాలు ఉన్నాయి)

ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్“. నీ యొక్క కరుణ ఆధారంగా, తేరే రహ్మత్ కే వాస్తే సే, నీ కరుణ యొక్క వసీలాతో “అస్తగీస్”, నీ యొక్క సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఎక్కడా ఏ సహాయం దొరకనప్పుడు, అల్లాహ్ నే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు, ఏదైనా పని జరిగే మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో ముందు అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని? ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లాహ్, నఊజుబిల్లా అస్తగఫిరుల్లా, అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు, అల్లాహు తఆలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు, ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అల్లాహ్ చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకుని దుఆ చేస్తూ ఉంటావో, అంతే అల్లాహు తఆలా నీ యొక్క పనులను చక్కబరుస్తూ ఉంటాడు.

ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా కి నేర్పిన దుఆ ఏమిటి? అల్లాహు అక్బర్, గమనించండి. మరియు ఈ దుఆను కూడా మీరు గుర్తుంచుకోండి, ఉదయం సాయంకాలం దుఆలలో చదవండి.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي وَلاَ إِلَى أَحَدٍ مِنْ خَلْقِكَ طَرْفَةَ عَيْنٍ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్, అస్లిహ్ లీ ష’అనీ కుల్లహ్, వలా తకిల్నీ ఇలా నఫ్సీ, వలా ఇలా అహదిన్ మిన్ ఖల్ఖిక తర్ఫత ఐన్.

నా సర్వ వ్యవహారాలను అల్లాహ్, నీవు చక్కబరుచు. స్వయం నా వైపునకు గానీ, ఇంకా వేరే ఎవరి వైపునకు గానీ, రెప్ప కొట్టేంత సమయంలో కూడా, అంత కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు, నా వైపునకు అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబరుచు.

అంతేకాదు సోదర మహాశయులారా, ఈ అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ రెండు పేర్లతో మనం ఏదైనా దుఆ చేస్తే కూడా అల్లాహ్ స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకోవాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు తిర్మిదీ లో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే:

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَىُّ الْقَيُّومُ وَأَتُوبُ إِلَيْهِ
అస్తగఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్-హయ్యుల్-ఖయ్యూమ్, వ అతూబు ఇలైహ్

అని చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా గానీ, ఇలాంటి దుఆ అర్థ భావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తఆలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు.

సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు, మరియు ఖురాన్ లో ఆయతు, ఖురాన్ లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మనం మన యొక్క అఖీదా బాగు చేసుకుందాము, ఇలాంటి గొప్ప అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ, దుఃఖ, కష్టం మరియు ఆరాం, స్వస్థత, అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ ను మాత్రమే మనం సజీవంగా, సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు, అలాంటి అల్లాహ్ “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్” అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల వివరణ ముగిస్తున్నాను.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాలు & లక్షణాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1