[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)
తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.
అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.
మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఓటమి తీరంలో…
మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.
దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.
అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)
తాయిఫ్ ముట్టడి
హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.
ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.
ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.
ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.
బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.
గ్రహించవలసిన పాఠాలు
విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.
ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.
తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.
శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర మరియు షహాదత్ https://youtu.be/ejJd6Qy1NWw [15 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, మూడవ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవితం మరియు ఘనత గురించి వివరించబడింది. ఆయన అల్లాహ్ పట్ల గల భయభక్తులు, ఆరాధన, మరియు దాతృత్వం గురించి ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్న కారణంగా ఆయనకు “జున్నూరైన్” (రెండు ప్రకాశాల యజమాని) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. హుదైబియా సంధి సమయంలో జరిగిన “బైఅతుర్ రిద్వాన్” (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)లో ఆయన ప్రాముఖ్యత, రూమా బావిని కొని ప్రజల కొరకు దానం చేయడం, మరియు తబూక్ యుద్ధం కోసం సైన్యాన్ని సిద్ధపరచడంలో ఆయన చేసిన అపారమైన సహాయం వంటి చారిత్రక సంఘటనలు ఉదహరించబడ్డాయి. ఆయన ఖిలాఫత్ కాలంలో ఖుర్ఆన్‌ను ఒక గ్రంథ రూపంలో సంకలనం చేయడం మరియు మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవీల విస్తరణ వంటి ఆయన చేసిన గొప్ప పనులను కూడా పేర్కొనడం జరిగింది. చివరగా, ఆయన అమరత్వం పొందిన విషాదకర సంఘటనను వివరిస్తూ, అంతర్గత కలహాలు (ఫిత్నా) యొక్క తీవ్రత గురించి హెచ్చరించి, ముస్లింలు ఐక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పబడింది.
(అల్ హందులిల్లాహ్. అల్ హందులిల్లాహి అలా నిఅమిన్ తత్రా, వ అలా అర్జాకిన్ లా నుతీకు లహూ హస్రా. వ అష్ హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్, షహాదతన్ తకూను లనా జుఖ్రా. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహుల్ మఖ్ సూసు బిల్ ఫదాయిలిల్ కుబ్రా. సల్లల్లాహు అలైహి ఇలా యౌమిల్ ఉఖ్రా. అమ్మా బ’అద్. ఫత్తఖ్వా వికావున్, వ లిబాసుహా ఖైరు లిబాస్.)
సమస్త ప్రశంసలు అల్లాహ్ కే శోభాయమానం. నిరంతరం కురుస్తున్న ఆయన అనుగ్రహాలకు, మనం లెక్కించలేనన్ని ఆయన జీవనోపాధులకు అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఈ సాక్ష్యం మా కొరకు (పరలోకంలో) ఒక నిధిగా ఉండుగాక. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త, ఆయన గొప్ప సద్గుణాలతో ప్రత్యేకించబడినవారు. ప్రళయదినం వరకు ఆయనపై (ప్రవక్తపై) అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక. ఇక ఆ తర్వాత. దైవభీతి ఒక రక్షణ కవచం, మరియు దాని వస్త్రం ఉత్తమమైన వస్త్రం.
ఈరోజు అల్లాహ్ యొక్క దయతో ఎలాంటి పుణ్యాత్ముని గురించి మనం తెలుసుకుంటామంటే, ఆయన అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేసేవారు. అల్లాహ్ యొక్క విధేయతలో చాలా ముందుగా ఉన్నవారు. రేయింబవళ్లు సజ్దాలో, ఖియాంలో ఉంటూ, పరలోకం పట్ల చాలా భయం కలిగి తన ప్రభువు యొక్క కారుణ్యాన్ని ఆశించేవాడు.
أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ (అమ్మన్ హువ ఖానితున్ ఆనా అల్లైలి సాజిదవ్ వ ఖాయిమా, యహ్ జరుల్ ఆఖిరత వ యర్ జూ రహ్ మత రబ్బిహ్) ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?)(39:9)
హాఁ! ఆయనే, చాలా సిగ్గు బిడియం గల, దైవదూతలు సైతం ఆయనతో సిగ్గుపడే అటువంటి పుణ్యాత్ముడు, ప్రవక్త యొక్క సహచరుడు హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు). ఆయన షహీద్ (అమరవీరులు). ఆయన స్వర్గవాసులలో ఒకరు. ఆయన ఈ లోకంలో భూమిపై నడుస్తుండగానే ఆయన స్వర్గవాసి అన్నటువంటి శుభవార్త ఇవ్వడం జరిగింది.
అవును, సహీహ్ బుఖారీలో వచ్చినటువంటి హదీస్, హదీస్ నెంబర్ 2778. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
مَنْ حَفَرَ رُومَةَ فَلَهُ الجَنَّةُ (మన్ హఫర రూమత ఫ లహుల్ జన్నహ్) “ఎవరైతే రూమా (బావిని) త్రవ్వుతారో, అతని కొరకు స్వర్గం ఉంది.”
وَمَنْ جَهَّزَ جَيْشَ العُسْرَةِ فَلَهُ الجَنَّةُ (వ మన్ జహ్ హజ జైషల్ ఉస్రతి ఫ లహుల్ జన్నహ్) “మరియు ఎవరైతే కష్టకాలంలో ఉన్న సైన్యాన్ని (తబూక్ యుద్ధ సైన్యాన్ని) సిద్ధపరుస్తారో, అతని కొరకు స్వర్గం ఉంది.”
తబూక్ యుద్ధ సందర్భంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఎవరైతే సైన్యాన్ని సిద్ధపరుస్తారో, సైన్యం కొరకు సహాయాలు అందిస్తారో, అలాంటి వారి కొరకు కూడా స్వర్గం అన్నటువంటి శుభవార్త ప్రవక్త ఇచ్చినప్పుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ బీరె రూమాను దాని యజమాని నుండి కొని అందరి కొరకు దానం చేశారు, వక్ఫ్ చేశారు. మరియు ఆ తబూక్ యుద్ధంలో 300 ఒంటెలు ఇంకా 10,000 దీనార్లు దానం చేశారు.
ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వివాహాలు మరియు ‘జున్నూరైన్’ బిరుదు
హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సుకుమార్తె అయినటువంటి రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొంతకాలం జీవితం గడిపిన తర్వాత, బద్ర్ యుద్ధం సందర్భంలో ఆమె చాలా అనారోగ్యానికి పాలైంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని ఆమె యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆమె అనారోగ్య సమయంలో ఆమె సేవలో ఉండడానికి వదిలారు. అంతేకాదు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ వీరులకు ఏ యుద్ధ ఫలం అయితే లభించిందో, యుద్ధ ఫలంలోని ఏ భాగం లభించిందో, అలాంటి ఒక భాగం ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారికి కూడా ప్రవక్త ఇచ్చారు. అయితే హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) అదే అనారోగ్యంలో ఆ బద్ర్ యుద్ధం సందర్భంలోనే చనిపోయింది.
ఆ తర్వాత వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సుకుమార్తె అయినటువంటి ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు త’ఆలా అన్హా)ను హజ్రత్ ఉస్మాన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ లోకంలో ప్రవక్త యొక్క కూతుర్లను ఒకరినొకరి ఇద్దరి కూతుర్లను పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావుడు వేరే మరెవ్వరూ లేరు. అందుకొరకే హజ్రత్ ఉస్మాన్ గారికి ‘జున్నూరైన్’ (రెండు ప్రకాశాల యజమాని) అన్నటువంటి బిరుదు లభించింది.
బైఅతుర్ రిద్వాన్ (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)
ఇక హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత ఆరవ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉమ్రా కొరకు బయలుదేరారు. అయితే మక్కా ఖురైషులు, అవిశ్వాసులు సహాబాలు, ప్రవక్త వారు ఉమ్రా చేయకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో వారితో సంధి కుదుర్చడానికి, మాట్లాడడానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని రాయబారిగా పంపడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వెంటనే ప్రవక్త ఆదేశం మేరకు బయలుదేరారు. ఎలాంటి తడబడాయించలేదు, ఏ రీతిలో కూడా వెనుక ఉండలేదు.
ఆ సందర్భంలో ఆయనకు తెలుసు, ఇక్కడ రాయబారిగా సంధి కుదుర్చడానికి వెళ్తున్నామంటే, అక్కడ మృత్యువును కూడా స్వీకరించడం లేదా వారు ఖైదీగా చేస్తే కూడా ఏమీ చేయలేక ఉండాలి. అలాంటి పరిస్థితులను గమనించి కూడా వెళ్లారు. అయితే ఎప్పుడైతే మక్కాలో ప్రవేశించారో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు), కాబా వైపున చూశారో, ఆ సందర్భంలో ఖురైష్ యొక్క పెద్దలు, నాయకులు, “ఓ ఉస్మాన్, నీవు మాతో, నీకు మంచి సంబంధం ఉంది. కనుక మేము నీకు తవాఫ్ చేయడానికి అనుమతిస్తున్నాము. కాబా యొక్క తవాఫ్ చేయాలంటే నీవు చెయ్యి. ఎలా మేము మిమ్మల్ని అడ్డుకోము.” కానీ, అల్లాహు అక్బర్! హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ సమయంలో ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? వారి వైపున చూస్తూ, వారితో చెప్పారు: “అల్లాహ్ సాక్షిగా, ఎప్పటివరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయరో, నేను తవాఫ్ చేయను.”
ఆ తర్వాత ఖురైష్ అతన్ని బంధించారు, అంటే పట్టుకున్నారు, ఆపుకున్నారు. ఆ సందర్భంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ చేయబడ్డారు, హతమయ్యారు, హత్య చేయబడ్డారు అన్నటువంటి ఒక పుకారు లేసినది. అయితే ఇటు సహాబాలందరికీ ఈ విషయం తెలిస్తే, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ కూడా జమా చేసి, మౌత్ (మరణం) కొరకు సిద్ధం అన్నటువంటి ‘బైఅత్’ (శపధం) తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి గొప్ప బైఅత్ మరొకటి కనబడలేదు. దానినే అల్లాహు త’ఆలా స్వయంగా ‘బైఅతుర్ రిద్వాన్’ అన్నటువంటి పేరు ఇచ్చాడు. చదవండి సూరతుల్ ఫత్హ్, ఆయత్ నంబర్ 18:
لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ (లఖద్ రదియల్లాహు అనిల్ ముఅమినీన ఇజ్ యుబాయిఊనక తహ్ తష్ షజరతి ఫ అలిమ మా ఫీ కులూబిహిమ్) (ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. (48:18)
అయితే ఆ సందర్భంలో మరో చాలా గొప్ప సంఘటన, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గొప్ప ఘనత ఎంత స్పష్టమవుతుందో చూడండి. ఈ విషయం సహీహ్ బుఖారీలో వచ్చి ఉన్నది, హదీస్ నెంబర్ 3698, అలాగే ముస్నద్ బజ్జార్లో కూడా ఉంది. ఏంటి విషయం అది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరితో శపధం తీసుకుంటున్నారు. హజ్రత్ ఉస్మాన్‌కు బదులుగా ఆయన రక్తం యొక్క పరిహారం తీసుకోవడానికి మనమందరమూ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా. ఆ సమయంలో అక్కడ ఉస్మాన్ అయితే లేరు కదా! అయితే ప్రవక్త ఏం చేశారు? తమ కుడి చెయ్యిని పైకి లేపి, కుడి చేతిని తమ స్వయంగా ఎడమ చేతిపై కొడుతూ ఏం చెప్పారు? “ఈ కుడి చెయ్యి ఉస్మాన్ యొక్క చెయ్యి. ఉస్మాన్ కూడా నాతోని బైఅత్ చేస్తున్నారు” అన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచి, ఉస్మాన్ యొక్క ఘనతను ఇంత గొప్పగా చాటి చెప్పారు. ఈ సందర్భంలో ధర్మవేత్తలు ఏమంటున్నారు? అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! ప్రవక్త తమ కుడి చెయ్యిని ‘ఇది ఉస్మాన్ చెయ్యి’ అని ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆ చెయ్యి ఉస్మాన్ యొక్క చేతుల కంటే ఎంతో గొప్పదైనది.
ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖిలాఫత్ మరియు సేవలు
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక అబూబక్ర్, అబూబక్ర్ మరణించాక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖలీఫా అయ్యారు. వీరిద్దరి ఖలీఫాల తర్వాత, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) 72 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఖలీఫా అయ్యారు. 12 సంవత్సరాలు ఖిలాఫత్ నడిపించారు. వారి యొక్క ఖిలాఫత్ కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలలో, పుణ్య కార్యాలలో, ఖుర్ఆన్ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి, దాని యొక్క ఎన్నో కాపీలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు పంపడం, అంతేకాదు మస్జిద్-ఎ-హరామ్, మక్కతల్ ముకర్రమా, అలాగే మస్జిద్-ఎ-నబవీ, మదీనా ఈ రెండిటినీ కూడా చాలా విస్తీర్ణం చేశారు. అక్కడ వస్తున్న నమాజీల కొరకు, హజ్ ఉమ్రాలు చేసే వారి కొరకు, దాని యొక్క దర్శన కొరకు వచ్చే వారి కొరకు చాలా ఇరుకుగా అవుతుంది అని దానిని ఇంకా పెద్దగా పెంచారు.
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అమరత్వం
అల్లాహు అక్బర్! వాస్తవానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క సీరత్, వారి యొక్క జీవిత చరిత్రలో చాలా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, అల్లాహు త’ఆలా, ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క చివరి సమయం కూడా ఎంత గొప్పగా జరిగింది! అల్లాహు అక్బర్! జుమా రోజున ఆయన షహీద్ అయ్యారు. అసర్ నమాజ్ తర్వాత సమయం. జిల్ హిజ్జా యొక్క హుర్మత్ (గౌరవప్రదమైన) మాసం. ప్రజలందరూ అటు హజ్ చేసి, అయ్యాముత్ తష్రీఖ్ యొక్క రెండవ రోజు, అంటే 12వ జిల్ హిజ్జా రోజున, 84 సంవత్సరాల వయసు నిండినది, అప్పుడు షహీద్ అయ్యారు.
చాలా కఠినంగా హంతకులు ప్రవర్తించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ అయ్యేకి కొన్ని క్షణాల ముందు చెప్పారు: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గడిచిన రాత్రిలో స్వప్నంలో చూశాను. ప్రవక్త వారు అంటున్నారు:
اصْبِرْ، فَإِنَّكَ تُفْطِرُ عِنْدَنَا الْقَابِلَةَ (ఇస్బిర్, ఫ ఇన్నక తుఫ్ తిరు ఇందనల్ ఖాబిలహ్) ‘ఓ ఉస్మాన్, సహనం వహించు, రేపటి రోజు నీవు మాతో పాటు ఇఫ్తార్ చేస్తావు.'”
ఆ తర్వాత హజ్రత్ ఉస్మాన్ ఖుర్ఆన్ గ్రంథాన్ని తెప్పించారు, చదువుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. అది ఆయన ముందు ఉన్నది, ఆయన చేతుల్లో ఖుర్ఆన్ గ్రంథం ఉండగానే దుండగులు, హంతకులు ఆయనని హతమార్చారు.
ఈ ప్రస్తావన, మరియు నేను ప్రవక్తను స్వప్నంలో చూశాను, ప్రవక్త శుభవార్త ఇచ్చారు అన్నటువంటి మాట ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది. షేఖ్ అహ్మద్ షాకిర్ దాని యొక్క ముహక్కిఖ్, సహీహ్ అని చెప్పారు, హదీస్ నెంబర్ 526.
అంతేకాదు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖుర్ఆన్ చదువుతున్న సందర్భంలో ఆ దురదృష్టవంతులు, దుండగులు, హంతకులు, పాపాత్ములు ఇంట్లో ప్రవేశించారు. వారిలోని అత్యంత దురదృష్టుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గడ్డాన్ని పట్టుకొని తొమ్మిది సార్లు పొడిచాడు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క శరీరం నుండి చిమ్మిన రక్తం ఏదైతే చిందిందో, దాని యొక్క ఆ రక్తం ఆయన చదువుతున్నటువంటి ఖుర్ఆన్ పై కూడా పడింది. ఖుర్ఆన్లో ఏ ప్రాంతంలో పడిందో తెలుసా? సూరతుల్ బఖరాలోని ఆయత్ నెంబర్ 137:
فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ (ఫస యక్ ఫీక హుముల్లాహ్, వ హువస్ సమీఉల్ అలీమ్) వారికి వ్యతిరేకంగా నీకు అల్లాహ్ చాలు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ ఎరుగును. (2:137)
అల్లాహుమ్మర్ద అన్ అబీ బకర్ వ ఉమర వ ఉస్మాన వ అలీ వ సాయిరిస్ సహాబా. వహ్ షుర్నా ఫీ జుమ్రతిహిమ్. అల్లాహుమ్మ ఇన్నా అహ్ బబ్ నాహుమ్ వ మా రఅయ్ నాహుమ్. అల్లాహుమ్మ ర్ జుఖ్ నా సుహ్ బతహుమ్ ఫిల్ ఆఖిరతి మ’అ నబియ్యినా సల్లల్లాహు అలైహి వసల్లం.
ఓ అల్లాహ్, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ పట్ల నీవు సంతృష్టిగా ఉండు. వారిపై నీ యొక్క సంతృష్టి మరియు నీ యొక్క కరుణను కురిపించు. అలాగే తమ అందరి సహాబాలపై కూడా. ఓ అల్లాహ్, మమ్మల్ని కూడా వారితో పాటు లేపు. ఓ అల్లాహ్, మేము వారిని చూడలేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాము. కనుక ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్తతో పాటు వారి యొక్క సోహబత్, వారి యొక్క సాన్నిహిత్యం మాకు ప్రసాదించు.
ఈ సంఘటన నుండి గుణపాఠాలు
మహాశయులారా, ఈ సంఘటన ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనం అన్ని రకాల బాహ్యమైన మరియు ఆంతర్యంలో ఉన్న, కనబడినవి కనబడకపోయేవి, అన్ని రకాల ఫితనాల నుండి, సంక్షోభాల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. మరొక గొప్ప విషయం, ఈ విభేదాలను వదులుకోవాలి. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారు షహీద్ అవ్వడానికి ముఖ్య కారణం, ఏ ఫితనాలు, ఏ సంక్షోభాలు అయితే లేశాయో అవే. మరియు ఆ సందర్భంలో ఇమామ్‌కు, మరియు నాయకునికి వ్యతిరేకంగా ఎవరైతే లేశారో, అలాంటి వారే వారిని షహీద్ చేశారు. అయితే అల్లాహు త’ఆలా ఏదైతే మనం ఏకంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, విభేదాలు లేకుండా ఉండాలని, పరస్పరం ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని మాటిమాటికీ ఆదేశిస్తూ ఉంటాడో ఖుర్ఆన్ హదీసులలో, ఆ ఆదేశాలను మనం శ్రద్ధ వహించి ఆచరిస్తూ ఉండాలి. చిన్న చిన్న ప్రాపంచిక కారణాలను తీసుకొని మనం పరస్పరం ఎలాంటి చీలికల్లో పడకూడదు. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్.
వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క పరిచయం
అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.
అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ (అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్) ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)
ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.(7:54)
ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.
ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا (అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా) స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)
ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ (అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్) ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)
وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ (వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్) తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)
మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.
اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)
మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,
هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا (అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ) భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)
ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.
ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ (అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్) అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)
అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.
ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,
أَبَشَرٌ يَهْدُونَنَا (అ బషరున్ యహ్దూననా) ‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)
మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.
మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.
ఇస్లాం – సర్వ సృష్టి యొక్క ధర్మం
అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,
كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ (కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్) (ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)
సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.
స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)
ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.
అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,
يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا (యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ) “ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)
ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,
ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.
ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ (షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్) రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)
రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.
ఇస్లాం పై అపోహలు
కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.
అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.
ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.
أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ (అఫగైర దీనిల్లాహి యబ్గూన్) ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)
ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?
وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا (వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా) వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)
మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.
సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.
అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.
ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.
మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?
فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا (ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా) అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.
అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు) ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net