మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ధర్మ సమ్మతమైన వసీలా [వీడియో]
https://youtu.be/aOiweVwQqFA [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ
(అల్ హందులిల్లాహి వహ్ దహు)
అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు)
ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:

وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
(వబ్తగూ ఇలైహిల్ వసీల)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.

అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.

అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.

ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.

ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)

మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.

ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.

ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.

మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ
(ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక)
అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)

ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.

నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్)
నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)

అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.

అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
(ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ)
“నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)

అభిమాన సోదరులారా, ఇది ఐదవది.

ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.

దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.

కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.

  • మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
  • రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
  • మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
  • నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
  • ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
  • ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.

ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/NTehdBRdCxg [28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభనామమైన “అర్-రబ్” (ప్రభువు) యొక్క లోతైన అర్థాలు మరియు భావనలు వివరించబడ్డాయి. “రబ్” అనే పదం సృష్టించడం, పోషించడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం వంటి అనేక విస్తృతమైన అర్థాలను కలిగి ఉంటుందని వక్త తెలియజేశారు. ఈ పదం ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు వాడాలంటే మరొక పదాన్ని జతచేయాలని అరబిక్ వ్యాకరణ నియమాన్ని ఉదహరించారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ (ప్రభుత్వం) రెండు రకాలుగా ఉంటుందని వివరించారు: ఒకటి సాధారణ రుబూబియత్, ఇది సృష్టిలోని అందరి కోసం (విశ్వాసులు, అవిశ్వాసులతో సహా); రెండవది ప్రత్యేక రుబూబియత్, ఇది కేవలం విశ్వాసులకు, ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, దీని ద్వారా అల్లాహ్ వారికి విశ్వాస భాగ్యం, మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాడు. ప్రవక్తలందరూ తమ ప్రార్థనలలో (దుఆ) “రబ్బనా” (ఓ మా ప్రభూ) అని అల్లాహ్ ను ఎలా వేడుకున్నారో ఖుర్ఆన్ ఆయతుల ద్వారా ఉదహరించారు. చివరగా, అల్లాహ్ ను ఏకైక రబ్ గా అంగీకరించడం తౌహీద్ యొక్క మూలమని, ఆయనతో పాటు ఇతరులను సంతానం, స్వస్థత లేదా ఇతర అవసరాల కోసం ఆరాధించడం షిర్క్ అనే ఘోరమైన పాపమని హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహిస్ సమీయిల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
వినువాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాను నుండి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వస్తోత్రాలు, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

అల్లాహ్ యొక్క శుభనామం రబ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా! రబ్ అన్న అల్లాహ్ యొక్క ఈ శుభనామం, ఉత్తమ పేరు, దీని యొక్క భావాన్ని, అర్థాన్ని గనక మనం చూస్తే, ఇందులో ఎన్నో అర్థాలు, ఎన్నో భావాలు వస్తాయి. అయితే, ఆ భావాలు తెలిపేకి ముందు అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, రబ్ మరియు సర్వసామాన్యంగా అరబీలో అర్-రబ్ అన్న ఈ పదం కేవలం విడిగా రబ్ లేదా అర్-రబ్, అల్లాహ్ కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరి గురించైనా ఈ పదం ఉపయోగించాలంటే, తప్పకుండా దానితో పాటు మరొక పదాన్ని కలపడం తప్పనిసరి. ఈ యొక్క నియమం ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఇప్పుడు ఇది మంచిగా మీకు అర్థం కావాలంటే రండి, రబ్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఈ విషయం తెలుస్తుంది.

రబ్ యొక్క అర్థంలో పుట్టించడం, పోషించడం, జీవన్మరణాలు ప్రసాదించడం మరియు నిర్వహించడం, నడిపించడం ఇవన్నీ భావాలతో పాటు, ఏదైనా విషయాన్ని చక్కబరచడం, దానిని రక్షించుకుంటూ ఉండడం, చూడడం, ఇంకా నాయకుడు, ఉన్నత హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడు, ఎవరి ఆదేశం మాత్రమే చెల్లుతుందో ప్రజలు అనుసరిస్తారో, ఎవరి పెత్తనం నడుస్తుందో ఇలాంటి భావాలన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి, ఈ భావాలన్నీ కూడా ఈ పదానికి వస్తాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ‘అల్-బదాయిఉల్ ఫవాయిద్’ లో తెలిపారు,

إِنَّ هَذَا الِاسْمَ إِذَا أُفْرِدَ تَنَاوَلَ فِي دَلَالَاتِهِ سَائِرَ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلْيَا
(ఇన్న హాజల్ ఇస్మ ఇజా ఉఫ్రిద తనావల ఫీ దిలాలాతిహి సాయిర అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉల్యా)
“నిశ్చయంగా ఈ పేరు (అర్-రబ్) ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు, దాని సూచనలలో అల్లాహ్ యొక్క ఇతర ఉత్కృష్టమైన నామాలు మరియు ఉన్నత గుణాలన్నీ చేరిపోతాయి.”

ఈ మాటను షేఖ్ అబ్దుర్రజాక్ అల్-బదర్ హఫిజహుల్లాహ్ ప్రస్తావించి, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట ఇలా చెప్పారు:

إِنَّ الرَّبَّ هُوَ الْقَادِرُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ الْحَيُّ الْقَيُّومُ الْعَلِيمُ السَّمِيعُ الْبَصِيرُ الْمُحْسِنُ الْمُنْعِمُ الْجَوَادُ، الْمُعْطِي الْمَانِعُ الضَّارُّ النَّافِعُ الْمُقَدِّمُ الْمُؤَخِّرُ
(ఇన్నర్-రబ్బ హువల్ ఖాదిరుల్ ఖాలిఖుల్ బారివుల్ ముసవ్విరుల్ హయ్యుల్ ఖయ్యుముల్ అలీముస్ సమీయుల్ బసీరుల్ ముహ్సినుల్ మున్ఇముల్ జవాద్, అల్ ముఅతీ అల్ మానిఉ అద్దార్రు అన్నాఫిఉ అల్ ముఖద్దిము అల్ ముఅఖ్ఖిర్)

రబ్ అన్న యొక్క ఈ పదం అల్లాహ్ గురించి ఉపయోగించినప్పుడు, అల్లాహ్ యొక్క ఇంకా వేరే ఎన్నో పేర్లలో ఉన్నటువంటి భావం ఇందులో వచ్చేస్తుంది. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ కంటే కూడా చాలా ముందు ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్, తఫ్సీర్ యొక్క పుస్తకాలలో ప్రామాణికమైన పరంపరలతో పేర్కొనబడిన మొట్టమొదటి తఫ్సీర్ అని దీనికి పేరు వచ్చింది, తఫ్సీరె తబరీ, అందులో ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:

الرَّبُّ فِي كَلَامِ الْعَرَبِ مُتَصَرِّفٌ عَلَى مَعَانٍ، فَالسَّيِّدُ الْمُطَاعُ فِيهِمْ يُدْعَى رَبًّا
(అర్-రబ్బు ఫీ కలామిల్ అరబ్ ముతసర్రిఫున్ అలా మఆన్, ఫస్-సయ్యిదుల్ ముతాఉ ఫీహిమ్ యుద్ఆ రబ్బన్)
“అరబ్బుల భాషలో ‘రబ్’ అనే పదం అనేక అర్థాలలో వస్తుంది. వారిలో విధేయత చూపబడే నాయకుడిని ‘రబ్’ అని పిలుస్తారు.”

అరబీ భాషలో, అరబ్బుల మాటల్లో అర్-రబ్ అన్న పదం ఏ నాయకుడినైతే అనుసరించడం జరుగుతుందో, అలాంటి వాటిని మరియు ఏ మనిషి అయితే అన్ని విషయాలను, వ్యవహారాలను చక్కబరిచి వాటిని సరిదిద్ది, వాటి బాగోగులు చూసుకుంటాడో, అలాంటి వాడిని మరియు ఏదైనా విషయానికి అధికారి అయిన అలాంటి వారికి కూడా అర్-రబ్ అన్న పదం ఉపయోగపడుతుంది.

ఈ విధంగా, ఇంటి యొక్క యజమాని అని మనం అంటాము తెలుగులో. దీని గురించి అరబీలో రబ్బుద్-దార్. కేవలం రబ్ కాదు. దార్ అంటే ఇల్లు. ఇంటి యొక్క యజమాని – రబ్బుద్-దార్. ఈ పని యొక్క బాధ్యుడురబ్బుల్-అమల్. ఇప్పటికీ కువైట్ మరియు మరికొన్ని దేశాలలో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, సౌదీలో ‘కఫీల్‘ అని ఏదైతే అనడం జరుగుతుందో, అలా కువైట్‌లో ‘రబ్బుల్ అమల్’ అని అక్కడ పిలవడం, చెప్పడం జరుగుతుంది.

ఈ భావాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక మనం అల్లాహ్ యొక్క పేరు చెప్పుకుంటున్నాము గనక, అల్లాహ్ యొక్క పేరు ఒకటి రబ్ ఉంది అని, తౌహీద్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన భాగాలు – తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్, తౌహీదె ఉలూహియత్ – వీటిలో ఒకటి రుబూబియత్. అంటే ఈ మొత్తం విశ్వంలో సృష్టించడం, పోషించడం, నిర్వహించడంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అల్లాహ్ అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి.

అయితే, ఈ మొత్తం సృష్టిని సృష్టించడంలో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఖుర్ఆన్ లో మనం శ్రద్ధగా చదివామంటే, ఈ విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ లో కొన్ని సందర్భాలలో అల్లాహ్ మాత్రమే మన యొక్క రబ్ అని తెలియజేస్తూ, ఆయనే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు అని స్పష్టంగా తెలిపాడు. సూరతుల్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102 చూడండి:

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ
(జాలికుముల్లాహు రబ్బుకుమ్, లా ఇలాహ ఇల్లా హువ, ఖాలిఖు కుల్లి షైఇన్ ఫఅబుదూహ్)
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. (6:102)

ఈ ఆయతును మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఒక్క మాటకే కాదు ఇది దలీల్, ఈ ఆయత్ యొక్క భాగం ఏదైతే నేను చదివానో ఇప్పుడు, తెలుగు అనువాదం చెప్పానో, ఇందులో మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా ముందుకు కూడా నేను దీనిని ప్రస్తావిస్తాను. సూరె అన్ఆమ్ సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102.

అల్లాహ్ త’ఆలాయే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క మేలు, సంక్షేమాలు, వారందరి యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతి వారికి అవసరం తీర్చువాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి భావం ఈ అర్-రబ్ అనే పదంలో ఉంది.

రబ్ లో రబ్బా యురబ్బీ తర్బియతన్. తర్బియత్పోషించడం అన్న పదం, అన్న భావం ఏదైతే ఉందో, ఇందులో రెండు రకాలు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి.

అల్లాహ్ త’ఆలా రబ్, ప్రతి ఒక్కరి రుబూబియత్, ప్రతి ఒక్కరి తర్బియత్ వారి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని పరంగా వారిని పోషించే బాధ్యత అల్లాహ్ ఏదైతే తీసుకున్నాడో, అల్లాహ్ మాత్రమే చేయగలుగుతున్నాడో, దీని యొక్క ఈ రబ్ యొక్క భావంలో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఒకటి, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసుడైనా, అవిశ్వాసుడైనా, సన్మార్గంపై ఉన్నవాడైనా, మార్గభ్రష్టంలో ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి సృష్టి, ఉపాధి, వారి యొక్క నిర్వహణ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని అధోగతికి పాలు చేయాలి, ఇదంతా కూడా అల్లాహ్ త’ఆలా చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఇది ఒక సామాన్యమైన భావం.

కానీ అల్లాహ్ త’ఆలా తన యొక్క ప్రవక్తలకు, తన ప్రత్యేకమైన పుణ్యాత్ములైన దాసులకు, సద్వర్తనులకు, విశ్వాస భాగ్యం, ప్రవక్త పదవి లాంటి గొప్ప మహా భాగ్యం, అల్లాహ్ యొక్క ఆరాధన సరైన రీతిలో చేసే అటువంటి భాగ్యం, మరియు వారు పాపాలను వదిలి పుణ్యాల వైపునకు రావడం, పాపం పొరపాటు జరిగిన వెంటనే తౌబా చేసే భాగ్యం కలుగజేయడం, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక రుబూబియత్. ఇది ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ త’ఆలాయే. కానీ ఇలాంటివి ప్రత్యేక రుబూబియత్ లోని విషయాలు ఎవరికైనా లభించాలంటే, వారు అల్లాహ్ వైపునకు మరలడం కూడా తప్పనిసరి.

గమనించండి ఇక్కడ ఒక విషయం, అల్లాహ్ త’ఆలాయే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో నేను రాకముందు తల్లి గర్భంలో నన్ను ఎలా పోషిస్తూ వచ్చాడు, పుట్టిన వెంటనే, మనం గమనించాలి ఇక్కడ. మనం మనుషులం గాని, పక్షులు గాని, జంతువులు, పశువులు గాని అల్లాహ్ యొక్క రుబూబియత్ విషయాన్ని గమనించేది ఇక్కడ చాలా గొప్ప ఒక నిదర్శనం మనకు ఉన్నది. గుడ్డులో ఉన్నా గాని పక్షులు, లేక పశువులు, జంతువులు, మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని, అక్కడ వారి యొక్క మొత్తం జన్మ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ఇలాంటి శక్తి ఉందా?

పుట్టిన వెంటనే, గుడ్డులో పూర్తి పక్షి తయారవుతుంది. బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అది వస్తుంది. మరియు వచ్చిన వెంటనే దానికి కావలసిన ఆహారం కళ్ళు తెరవకముందు ఎలా తల్లి దానికి ఇవ్వాలి అన్నటువంటి భాగ్యం, జ్ఞానం, అల్లాహ్ త’ఆలా ఆ పక్షికి ఎలా కలుగజేస్తాడో గమనించండి. ఇక మనిషి, జంతువుల విషయానికి వస్తే, పుట్టిన వెంటనే తన యొక్క ఆహారం ఎక్కడ ఉన్నదో అటు జంతువు గాని, అటు మనిషి గాని తన తల్లి స్థనాల్లో అన్న విషయాన్ని ఎలా గమనిస్తాడో చూడండి. ఈ భాగ్యం ఎవరు కలుగజేస్తున్నారు? ‘రబ్’ అన్నటువంటి పదం మనం చదివినప్పుడు, ఈ విషయాలు చూస్తున్నప్పుడు, అల్లాహ్ పై మన యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. అయితే మనం పుట్టిన తర్వాత క్రమంగా మనలో ఎలాంటి శక్తి పెరుగుతుందో, మనలో బుద్ధిజ్ఞానాలు ఎలా పెరుగుతాయో, ఈ విషయంలో కూడా అల్లాహ్ రబ్ అయి మనల్ని ఎలా పెంచుతున్నాడో, ఇందులో మన కొరకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.

ఇంతటి గొప్ప రబ్ అయిన అల్లాహ్, మనల్ని ఏ ఆదేశం ఇవ్వకుండా, మనల్ని పుట్టించి, మనకు ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడా? చేయడు. అందుకొరకే అల్లాహ్ ఏమంటున్నాడు:

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
(అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖ్నాకుమ్ అబసవ్ వఅన్నకుమ్ ఇలైనా లా తుర్ జఊన్)
“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”(23:115)

అలా కాదు. ఒక ఉద్దేశపరంగా మిమ్మల్ని పుట్టించాము. అదేంటి? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన మనం చేయడం. అందుకొరకే, ఖుర్ఆన్ లో అనేక సందర్భాలలో అల్లాహ్ తన రుబూబియత్ కు సంబంధించిన నిదర్శనాలు చూపించి, వెంటనే ఉలూహియత్ వైపునకు అల్లాహ్ త’ఆలా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతే చూడండి. సూరత్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102, ‘జాలికుముల్లాహు రబ్బుకుమ్’ – ఆయనే మీ ప్రభువు. అల్లాహ్ మీ ప్రభువు. ‘లా ఇలాహ ఇల్లా హువ’ – ఆయన తప్ప ఎవరు కూడా మీకు ఆరాధ్యనీయుడు కాడు. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు గనక, ప్రతి వస్తువుని పుట్టించాడు గనక, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి.

ఇదే విధేయత, ఆరాధనా భావంతో మనం అల్లాహ్ ను వేడుకోవాలని మనకు నేర్పడం జరిగింది. మరియు మనం గనక ప్రత్యేకంగా సూరతుల్ అంబియాలో మరియు వేరే ఇతర సూరాలలో చూస్తే ప్రవక్తలు అందరూ అల్లాహ్ తో ప్రత్యేక వేడుకోలు, దుఆ, అర్ధింపు లాంటి విషయాలు ఎలా అల్లాహ్ తో అడిగేవారు? ‘రబ్బనా’.

రబ్బీ అంటే ఇది ఏకవచనం – ఓ నా ప్రభువా. రబ్బనా – ఓ మా ప్రభువా.

అయితే, ఆదం అలైహిస్సలాం కూడా ఎలా దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا
(రబ్బనా జలమ్నా అన్ఫుసనా)
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము”

అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, ఇంకా ఎందరో ప్రవక్తల దుఆలు ఖుర్ఆన్ లో ఉన్నాయి కదా. ఇతరులతో దుఆ చేయడం ఎంత ఘోరం అన్నటువంటి ఒక వీడియో మాది ఉంది, మీరు చూడండి. ప్రవక్తలందరి దుఆలు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? అల్లాహ్ యే మనల్ని అన్ని రకాలుగా పోషించి, పెంచి, మన యొక్క అవసరాలు తీర్చి మనల్ని చూసుకుంటూ, మన యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. అందుకొరకు ‘రబ్బనా’. అల్లాహ్ యొక్క నామం ఎంత గొప్పదో అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. కానీ దుఆలో వచ్చేసరికి, ‘రబ్బీ అవ్జిఅనీ అన్ అష్కుర నిఅమతకల్ లతీ’..సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ కూడా. ఈ విధంగా అనేక సందర్భాలలో ‘రబ్బీ’ మరియు ‘రబ్బనా’ అన్నటువంటి పదాలతో దుఆ చేయడం మనకు నేర్పడం జరిగింది.

సోదర మహాశయులారా! అల్లాహ్ త’ఆలా రబ్ అయి ఉన్నాడు గనక, మనము అల్లాహ్ యొక్క రబ్ అన్న ఈ పదాన్ని ఎక్కడెక్కడ చదివినా గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఎంతోమంది తమకు తాము రబ్ అన్నటువంటి ఆరోపణ, దావా చేశారు.

ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో నమ్రూద్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటి? మేము రాజులము గనక, అందరూ ప్రజలు గనక, మా ఇష్టప్రకారమే మీరు జీవితం గడపాలి, మా ఆదేశాలను అనుసరించాలి. అల్లాహ్ ను నమ్మేవారు, వారు కూడా. “అల్లాహ్ కాకుండా మేము పుట్టించాము ఈ భూమ్యాకాశాలను, మేము మిమ్మల్ని పుట్టించాము” ఇలాంటి దావా లేకుండింది వారిది. సయ్యద్-ముతా అన్నటువంటి భావనతో, అంటే మాది పెత్తనం, మా మాటే చెల్లాలి, నడవాలి.

అయితే ఈరోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అధికారం దొరికినదంటే, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు, అసలైన రబ్ అతను, అసలైన విధేయత అతనిది, మనం ఆరాధించవలసినది అల్లాహ్ ను అన్న విషయాన్ని మరచిపోయి, అల్లాహ్ యొక్క మాటకు వ్యతిరేకమైన, నేను నాయకుడిని నా మాట మీరు వినాలి అన్నటువంటి గర్వానికి ఏదైతే గురి అవుతారో, వారు కూడా భయపడాలి ఫిరౌన్ లాంటి గతి వారిది అవుతుంది అని. అందుకొరకే ఎల్లవేళల్లో అల్లాహు త’ఆలా తో భయపడి, అల్లాహ్ ను రబ్ అని ఏదైతే మనం నమ్ముతున్నామో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ
(యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువైన, మీ యొక్క రబ్ అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. (2:21)

إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
(ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుమ్ ఫఅబుదూహ్, హాదా సిరాతుమ్ ముస్తఖీమ్)
నా ప్రభువు, నా యొక్క రబ్, మీ యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి. ఇదియే సన్మార్గం.  (3:51)

ఇక ఈ సన్మార్గం నుండి ఎవరైనా దూరమైపోతే వారు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎల్లప్పుడూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండండి.

رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي
(రబ్బిగ్ఫిర్లీ వలి అఖీ)
ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని, సోదరులను క్షమించు.(7:151)

رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ
(రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య)
“ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను క్షమించు.” (71:28)

ఈ విధంగా, ఈ రెండు పదాలు ఇప్పుడు నేను చదివానో ఖుర్ఆన్ లో వచ్చినవే. మూసా అలైహిస్సలాం వారి యొక్క దుఆ, నూహ్ అలైహిస్సలాం యొక్క దుఆ ఈ విధంగా.

అలాగే అల్లాహ్ ను రబ్ అని మనం నమ్మే ఈ పదంలో, ఇందులో మనం చాలా బలమైన ఒక గట్టి విశ్వాసం ఏం ఉండాలంటే, ఈ లోకంలో మనం రబ్ అయిన అల్లాహ్ యొక్క విశ్వాసంపై బలంగా ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దౌర్జన్యపరుల నుండి మనపై ఎలాంటి హింసా దౌర్జన్యాలు చేయబడినా, ఈ పరీక్షా కాలమైనటువంటి ఒక చిన్న జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ విషయం మనకు మూసా అలైహిస్సలాం, ఫిరౌన్, ఆ తర్వాత మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ యొక్క సంఘటనలో, అలాగే సూరతుల్ ముఅమిన్ లో, సూరతుల్ ముఅమిన్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ వంశానికి సంబంధించిన ఒక విశ్వాసుని సంఘటన ఏదైతే తెలిపాడో, అందులో కూడా ఈ గొప్ప గుణపాఠం ఉంది.

ఎప్పుడైతే ఫిరౌన్ చెప్పాడో, “నన్ను వదలండి నేను మూసాను హత్య చేస్తాను,” అప్పుడు ఆ విశ్వాసుడు వెంటనే నిలబడి ఏమన్నాడు?

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ
(వ ఖాల రజులున్ ముఅమినున్ మిన్ ఆలి ఫిరౌన యక్తుము ఈమానహు అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బియల్లాహ్)
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్‌ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్‌ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? (40:28)

నా ప్రభువు, నా యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే అని చెప్పే ఇలాంటి వ్యక్తిని మీరు చంపుతారా? ఇంకా అతని పూర్తి సంఘటన మీరు చదవండి, సూరత్ అల్-ముఅమిన్, దీని యొక్క రెండవ పేరు గాఫిర్, సూరహ్ నంబర్ 40, ఆయత్ నంబర్ 28 నుండి ఈ సంఘటన మొదలవుతుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క గొప్ప నామముల, మంచి పేర్ల ఏ వివరాలు తెలుసుకుంటున్నామో, దాని పరంగా మన విశ్వాసం ఉండి, అన్ని రకాల షిర్కులకు, మూఢనమ్మకాలకు అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు? [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
https://youtu.be/aLKl1fLh9eQ [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.” (సూర బఖర 2:186)

అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5

అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’

1: ‘మఇయ్య ఆమ్మ’ అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)

2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.

దీనికి ఆధారంగా అనేక ఆయతులు హదీసులున్నాయి.

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ

“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు అల్లాహ్. (సూర తాహా 20:46)

… إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا…

“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్‌ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)

 إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
“నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.” (సూర నహ్ల్ 16:128)

పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:

“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”

(మజ్మూఉల్ ఫతావా 11/ 249-250)

ఈ ప్రసంగంలో అల్లాహ్ మనతో ఎలా ఉన్నాడు (మయ్యతుల్లాహ్) అనే భావనను ఇస్లామీయ విశ్వాసం ప్రకారం వివరించబడింది. అల్లాహ్ ప్రతిచోటా భౌతికంగా ఉన్నాడు అనే సాధారణ తప్పుడు అభిప్రాయాన్ని ఖండిస్తూ, సరైన విశ్వాసం ప్రకారం అల్లాహ్ ఏడు ఆకాశాలపైన, తన అద్వితీయతకు తగిన విధంగా అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడని ఖురాన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క సామీప్యం రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. మొదటిది ‘మఇయ్య ఆమ్మ’ (సాధారణ సామీప్యం), ఇది సర్వ సృష్టికి వర్తిస్తుంది. అంటే అల్లాహ్ తన జ్ఞానం, దృష్టి మరియు వినికిడి ద్వారా ప్రతిదాన్ని గమనిస్తూ, పరివేష్టించి ఉన్నాడు. రెండవది ‘మఇయ్య ఖాస్సా’ (ప్రత్యేక సామీప్యం), ఇది కేవలం ప్రవక్తలు మరియు విశ్వాసులకు మాత్రమే లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క ప్రత్యేక సహాయం, మద్దతు మరియు మార్గదర్శకత్వం రూపంలో ఉంటుంది. ఈ రెండు రకాల సామీప్యాలను వివరించడానికి ప్రవక్తలు మూసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితాల నుండి ఖురాన్‌లో పేర్కొనబడిన సంఘటనలను ఉదాహరణలుగా చూపించారు.

అల్లాహ్ మనతో పాటు ఏ విధంగా అతి దగ్గరిలోనే ఉన్నాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు? అల్లాహ్ హర్ జగహ్ హై (అల్లాహ్ ప్రతిచోటా ఉన్నాడు). అల్లాహ్ హమారే దిల్ మే హై (అల్లాహ్ మా హృదయాల్లో ఉన్నాడు). ఇంకా దీనికి సంబంధించిన కొన్ని శ్లోకాలు గేయాల మాదిరిగా చదువుతూ ఉంటాడు. అందు లేడు ఇందు గలడు ఈ విధంగా. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పవద్దు. అల్లాహ్ అంతటా ఉన్నాడు, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, మస్జిద్ లో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, ఫలానా ఫలానా ఏమేమో అంటూ ఉంటారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.

సరైన ఇస్లామీయ విశ్వాసం

సరియైన విశ్వాసం అల్లాహ్ గురించి, అల్లాహు తఆలా తన అస్తిత్వంతో ఏడు ఆకాశాలపైన అర్ష్ పై ఉన్నాడు. అయితే, అల్లాహు తఆలా మనతో ఉన్నాడు అని మనం ఏదైతే అంటామో, దీనిని

معية الله
మఇయ్యతుల్లాహ్ అని అరబీలో అనడం జరుగుతుంది.

అల్లాహు తఆలా అర్ష్ పై ఉన్నాడు, ఖురాన్‌లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు:

الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
అర్రహ్మాను అలల్ అర్షిస్తవా
(ఆ కరుణామయుడు) సింహాసనంపై ఆసీనుడయ్యాడు.
(సూరతు తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 5).

అయితే ఈ మఇయ్యతుల్లాహ్, అల్లాహ్ మన వెంట ఉన్నాడు అనే భావం ఏదైతే మనం, మాట ఏదైతే మనం పలుకుతామో, ఇందులో రెండు భావాలు వస్తాయి, రెండు రకాలు వస్తాయి. ఒకటి మఇయ్య ఆమ్మ, రెండవది మఇయ్య ఖాస్స.

మఇయ్య ఆమ్మ (సాధారణ సామీప్యం)

మఇయ్య ఆమ్మ అంటే ఏంటి? అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా, సర్వ సృష్టి వెంట ఉన్నాడు. అంటే, సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు, వారిని వింటూ ఉన్నాడు, వారి గురించి అల్లాహ్ కు సర్వమూ తెలుసు. అమావాస్య చీకటి రాత్రి అయినా, లేకుంటే ఎలాంటి మబ్బు లేని, దుమ్ము లేని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వెలుతురులోనైనా, అల్లాహ్ కు అంతా కూడా సమానమే. ఒక్కసారి సూరతుల్ హదీద్, సూర నంబర్ 57, ఆయత్ నంబర్ 4 చదవండి. శ్రద్ధగా దీని అర్థ భావాలను గమనించండి.

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنْتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్) అధిష్టించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరి అందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడా ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహు తఆలా చూస్తూనే ఉన్నాడు.

గమనించండి, అల్లాహ్ ఎక్కడున్నాడు? ఇస్తవా అలల్ అర్ష్ (అర్ష్ పై ఆసీనుడయ్యాడు) ఆ విషయం ఇందులోనే వచ్చేసింది. యఅలము (ఆయనకు తెలుసు), అల్లాహ్ కు అంతా తెలుసు. భూమిలోకి వెళ్లేది, భూమి నుండి బయటికి వచ్చేది, ఆకాశం నుండి దిగేది, ఆకాశం వైపునకు ఎక్కేది, అంతా కూడా అల్లాహ్ కు తెలుసు, అల్లాహ్ జ్ఞానంలో ఉంది. వహువ మఅకుమ్ (ఆయన మీకు తోడుగా ఉన్నాడు). అర్ష్ పై ఉండి అల్లాహ్ మీకు తోడుగా ఎలా ఉన్నాడు? అంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకు తెలుసు అంతా కూడా, ఆయన వింటూ ఉన్నాడు. అందుకొరకే ఆయత్ యొక్క చివరి భాగం ఏముంది?

وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
వల్లాహు బిమా తఅమలూన బసీర్
మీరు చేసే పనులన్నింటినీ కూడా అల్లాహ్ చూస్తూ ఉన్నాడు.

ఇది మఇయ్య ఆమ్మ, అంటే సర్వము ఈ సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కటి ఆయన వినుట, ఆయన యొక్క చూచుట, ఆయన యొక్క జ్ఞానం నుండి బయట ఏదీ లేదు.

మఇయ్య ఖాస్సా (ప్రత్యేక సామీప్యం)

ఇక మరొకటి రెండవ రకం మయ్య ఖాస్సా. ప్రత్యేకమైన తోడు. అదేమిటి? అంటే, ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడు అన్నటువంటి భావం కూడా వస్తుంది. దీనికి ఆధారాలు కూడా ఖురాన్ మరియు హదీసులలో ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు సూరె తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 46 గమనించండి. మూసా అలైహిస్సలాం వారిని మరియు ఆయన యొక్క సోదరుడు హారూన్ అలైహిస్సలాంను అల్లాహు తఆలా ఫిరౌన్, ఎలాంటి దౌర్జన్యపరుడైన రాజు, తనకు తానే ప్రభువుగా అన్నాడు, అలాంటి రాజు వద్దకు పంపుతూ, అల్లాహు తఆలా మంచి బోధనలు చేసి మీరు ఎంతో మృదువుగా అతన్ని ఏకత్వం వైపునకు పిలవండి అని చెప్పారు. ఆ సందర్భంలో చిన్నపాటి ఒక కొంత భయం ఏదైతే కలిగిందో, స్టార్టింగ్ లో, ఎందుకంటే మూసా అలైహిస్సలాం ఫిరౌన్ యొక్క ప్యాలెస్ లోనే పెరిగారు కదా. అయితే, అక్కడ ఈ విషయాలను గుర్తుంచుకొని కొంచెం ఒక చిన్నపాటి భయం లాంటిది ఏదైతే కలిగిందో, అల్లాహు తఆలా ఈ ఆయత్, ఆయత్ నంబర్ 46, మీరు దానికంటే ముందు తర్వాత ఆయతులు ఖురాన్ తీసి చదవండి. ఈ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడు?

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
ఖాల లా తఖఫా, ఇన్ననీ మఅకుమా అస్మఊ వ అరా
(అల్లాహ్ అన్నాడు) మీరిద్దరూ భయపడకండి. నిశ్చయంగా నేను మీతోనే ఉన్నాను, నేను అంతా వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను
.

మీరు చేస్తున్నది గాని, ఫిరౌన్ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తాడు ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. అల్లాహు అక్బర్.

విశ్వాసి అల్లాహ్ యొక్క ఏదైనా ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, కొందరు ఎవరైనా వ్యతిరేకులు బెదిరిస్తున్నప్పుడు, అల్లాహ్ నాకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ యొక్క సహాయం నాకు లభిస్తుంది అన్నటువంటి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇలాంటి ఈ భావాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, సూరతుత్ తౌబా, సూర నంబర్ 9, ఆయత్ నంబర్ 40 చదవండి.

إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا
ఇజ్ యఖూలు లిసాహిబిహీ లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా
అతను తన సహచరునితో, “విచారించకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు” అని అన్న సందర్భం.

ఇందులో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ప్రస్తావన ఉంది. దీని యొక్క వ్యాఖ్యానం మీరు తెలుగు అహ్సనుల్ బయాన్, ఇంకా హదీసుల్లో కూడా చూడవచ్చు. సంక్షిప్త విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గార్-ఎ-సౌర్ లో మూడు రోజుల వరకు ఉన్నారో, మదీనా వలస పోయే సందర్భంలో, అక్కడ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చాలా బాధ కలుగుతూ ఉండింది, శత్రువులు చూశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎంత తలబిరుసుతనంతో, దుష్ప్రవర్తనతో మెలగుతారో ఏమో అని. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మంచి రీతిలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ధైర్యం చెప్పారో గమనించండి.

ఇజ్ యఖూలు లిసాహిబిహీ, అప్పుడు ఆ సందర్భంలో తన మిత్రుడైన, ఆ సందర్భంలో తన వెంట ఉన్నటువంటి మిత్రునికి, ‘లా తహజన్‘, నీవు బాధపడకు. ‘ఇన్నల్లాహ మఅనా‘, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, అని ఓదార్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అల్లాహ్ తఆలా ఆ ఘడియలో ప్రవక్తపై ప్రశాంతతను అవతరింపజేశాడు.

وَأَيَّدَهُ بِجُنُودٍ لَمْ تَرَوْهَا
వఅయ్యదహు బిజునూదిల్ లమ్ తరౌహా
మరియు మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు.

మూసా అలైహిస్సలాం, వెనక ఫిరౌన్ యొక్క లష్కర్, సైన్యం. ముంగట సముద్రం ఉంది. ‘ఇన్నాలముద్రకూన్‘ (నిశ్చయంగా మేము చిక్కిపోయాము) అని భయాందోళనకు గురియై అరుస్తున్నారు బనూ ఇస్రాయీల్. అప్పుడు మూసా అలైహిస్సలాం ఎంత నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో, పూర్తి ధీమాతో,

إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
ఇన్న మఇయ రబ్బీ సయహ్దీన్
నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నాకు మార్గదర్శకం చేస్తాడు, దారి చూపుతాడు.

ఎంత గొప్ప నమ్మకమో చూడండి. ఆ నమ్మకం ప్రకారంగా అల్లాహ్ యొక్క సహాయం అందిందా లేదా? అందింది. సముద్రంలో మార్గాలు, నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయి దారి అయిపోయింది. ఇటునుండి అటు దాటిపోయారు. అదే దారి మీద ఫిరౌన్ వచ్చాడు. అల్లాహు తఆలా సముద్రానికి ఆదేశించాడు, సముద్రం కలిసిపోయింది, నీళ్ళల్లో అదే సముద్రంలో, ఏ సముద్రంలో నుండైతే వీరికి మార్గం దొరికింది మరియు దాటిపోయారో, అదే సముద్రంలో ఫిరౌన్ మరియు అతని యొక్క సైన్యాన్ని అల్లాహు తఆలా ముంచి వేశాడు. అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల మనం ఏ రవ్వంత కూడా శంకించకూడదు మరియు వ్యతిరేకించి, అల్లాహ్ ను ధిక్కరించి అతని ఆదేశాలకు వ్యతిరేకంగా నడవకూడదు.

ఇలాంటి భావాలు చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. సూరతున్ నహల్ లో కూడా మీరు చదవండి. సూర నంబర్ 16, ఆయత్ నంబర్ 128. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ ఈ సూరె నహల్ మరియు సూరె తౌబా, సూరె తాహా యొక్క ఆయతులు ఏవైతే సంక్షిప్తంగా చెప్పడం జరిగిందో వాటి యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ కు తోడుగా ఉండి సహాయపడ్డాడు, అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయం చేశాడు. ఇక మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాంకు తోడుగా ఉండి సహాయం అందించాడు ఫిరౌన్ కు వ్యతిరేకంగా. అలాగే, ‘ఇన్నల్లాహ మఅల్లజీనత్తఖౌ వల్లజీన హుమ్ ముహ్సినూన్’ సూరతున్ నహల్. విశ్వాసులకు తోడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నవారి మరియు సద్వర్తన కలిగి ఉన్నవారికి తోడుగా ఉన్నాడు, ఎవరికి వ్యతిరేకంగా? దౌర్జన్యపరులకు, పాపాత్ములకు వ్యతిరేకంగా. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ యొక్క మాట ఇది. మజ్మూఉల్ ఫతావాలో ఉంది. వాల్యూమ్ నంబర్ 11, పేజ్ నంబర్ 249, 250.

అల్లాహ్ పై మనం దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ యొక్క విశ్వాసం దృఢంగా మనలో నిండి ఉండే విధంగా సత్కార్యాలు చేస్తూ ఉండే విధంగా అల్లాహ్ మనందరికీ భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్ (తఆలా) – (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1t8VyQxAKsZ5-yfRrX-ugp

అల్లాహ్ నామాలు, గుణ గుణాలలో ఏకత్వం (తౌహీద్ అస్మా వ సిఫాత్) [వీడియో]

బిస్మిల్లాహ్

[6:55 నిముషాలు]

ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది.
తౌహీద్, దాని రకాలు 
https://teluguislam.net/2019/11/20/viswasa-moola-sutralu-1

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

(3) తౌహీదె అస్మా వ సిఫాత్‌:

అంటే: అల్లాహ్‌ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్‌ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్‌ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్‌ రీఫ్‌’,త’తీల్‌’, ‘తక్‌ యీఫ్‌’, ‘తమ్‌ సీల్‌'(*) లేకుండా. ఆయన గుణ నామములను యథార్థంగా నమ్మాలి. యథార్దానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. “వేటి గురించి అల్లాహ్‌ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్‌ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.

(*) ‘తహ్‌ రీఫ్‌’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘త’తీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. అల్లాహ్‌ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్‌ యీఫ్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్‌ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్‌సీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్‌ ‘అల్‌ హయ్య్‌‘ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్‌ హయ్య్‌’ అల్లాహ్‌ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీ‘ ఆయన పేరు, ‘సమ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.

గుణముల ఉదాహరణ:

అల్లాహ్‌ ఆదేశం:

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ

(యూదులు ‘అల్లాహ్‌ చేతులు కట్టుబడినవి’ అని పలుకు చున్నారు. వారి చేతులే కట్టుబడుగాక! వారు పలికిన దానికి వారికి శాపమున్నది. అల్లాహ్‌ చేతులు విచ్చలవిడిగా ఉన్నవి. తాను కోరునట్లు వినియోగ పరుచుచున్నాడు). (మాఇద 5: 64).

పై ఆయతులో అల్లాహ్‌ తనకు రెండు చేతులున్నవని, అవి విచ్చలవిడిగా ఉన్నవని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టాను సారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్‌ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్‌ సూరె షూరా (42: 11) లో ఇలా ఆదేశించాడు:

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

(ఆయనకు పోలినది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు).

ఈ తౌహీద్‌ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్‌ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ కొరకు ఏ ఏ నామ గుణాలను తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. అయితే. వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్‌ కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్‌ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటీ దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి:
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

తాహీదె అస్మా వ సిఫాత్‌ (అల్లాహ్ నామాలు, గుణ గుణాలలో ఏకత్వం) – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

తౌహీద్ (ఏక దైవారాధన) అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? [వీడియో]

ఇతరములు: [విశ్వాసము]