[18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
తౌహీద్ దాని రకాలు:
తౌహీద్ అంటే విధిగా, అల్లాహ్ కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి ఇబాదత్ (ఆరాధన)లో అల్లాహ్ ను అద్వితీయునిగా నమ్మడం. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాల్లో ఇది చాలా గొప్పది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఇలా చెప్పండి! ఆయన అల్లాహ్, అద్వితీయుడు). (సూరె ఇఖ్లాస్ 112:1).
మరోచోట ఇలా సెలవిచ్చాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను). (సూరె జారియాత్ 51: 56)
మరో ఆదేశం:
وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا
(కేవలం అల్లాహ్నే ఆరాధించండి, ఆయనతో ఎవరినీ సాటి కల్పించ కండి). (సూరె నిసా 4: 36)
తౌహీద్ మూడు రకాలు: (1) తౌహీదె రుబూబియత్, (2) తౌహీదె ఉలూహియత్, (3) తౌహీదె అస్మా వ సిఫాత్.
(1) తౌహీదె రుబూబియత్:
అంటే: సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఆయనే పోషకుడు, జీవన్మరణ ప్రధాత. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన నిదర్శనాలు దివ్యగ్రంథం ఖుర్ఆనులో చదవండి:
هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
(ఆకాశము నుండి భూమి నుండి అల్లాహ్ తప్ప వేరే సృష్టికర్త మీకు ఆహారము నొసంగువాడు గలడా? ఆయన తప్ప వేరే ఆరాధింపదగిన వాడెవడు లేడు). (ఫాతిర్ 35: 3).
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఎవని చేతిలో సమస్త లోకపాలన గలదో ఆ అల్లాహ్ చాలా శుభాలు గలవాడు, ఆయన సర్వముపై సంపూర్ణ శక్తి గలవాడు). (ముల్క్ 67: 1).
అల్లాహ్ అధికారం విశ్వమంతటిలో ఉంది. తనిష్టానుసారం అందులో మార్పు చేస్తూ ఉంటాడు. నిర్వహణలో అద్వితీయుడు కూడా కేవలం అల్లాహ్ మాత్రమే. సృష్టి కార్యాలు నెరవేర్చువాడు ఆయనే. ఈ ఆయతు చదవండి:
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
(వినండి! సృష్టించుట, ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వ లోకములకు పోషకుడగు అల్లాహ్ ఎంతో శుభదాయకుడు). (ఆరాఫ్ 7: 54).
అతని ఈ నిర్వహణ కార్యక్రమం సర్వసృష్టిలో నడుస్తూ ఉన్నది. తౌహీద్ యొక్క ఈ రకాన్ని తిరస్కరించినవారు చాలా అరుదు. వారు బాహ్యంగా తిరస్కరించినా, వారి అంతరాత్మ మటుకు దాన్ని ఒప్పుకుంటుంది. (ఫిర్ఔన్ వాళ్ళ గురించి) ఈ ఆయతు చదవండి:
وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا
(నిజానికి వారి మనస్సులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దానిని తిరస్కరించారు). (నమ్ల్ 27:14).
ఈ ఒక్క రకాన్ని నమ్మినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రవక్త కాలంలోని ముష్రికులు తౌహీదు యొక్క ఈ రకాన్ని నమ్మారు కాని అది వారికి ఏ లాభాన్నివ్వలేదు. ఖుర్ఆన్ సాక్ష్యం చదవండి:
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
(భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్య చంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, అల్లాహ్ యే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారు ఎలా మోనపోతున్నారు?). (అన్ కబూత్ 29:61)
(2) తౌహీదె ఉలూహియత్:
అంటే: ఆరాధనలకు అర్హుడయిన అద్వితీయుడు ఆ పరమ పవిత్రుడు మాత్రమే. పూజ చేయుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు ఏ మానవుడూ అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించ కూడదు. తౌహీద్ యొక్క మూడు రకాల్లో ఇదే అతిముఖ్య మైనది, గొప్పది. దీని కొరకే అల్లాహ్ మానవులను సృష్టించాడు. అల్హాహ్ ఆదేశం చదవండి:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే వుట్టించాను). (జారియాత్ 51: 56).
ఈ విషయమే ప్రజలకు క్లుప్తంగా బోధించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. దీని సాక్ష్యాధారం దివ్య ఖుర్ఆనులో ఇలా ఉంది:
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప వేరు పూజ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము). (అంబియా 21: 25).
తౌహీద్ యొక్క ఈ రకాన్నే బహుదైవరాధకులు తిరస్కరించారు, వారి ప్రవక్తలు ఈ తౌహీద్ యొక్క బోధ చేసినప్పుడు. దీనికి ఖుర్ఆన్ ఇలా సాక్ష్యమిస్తుంది:
قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا
((బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు): నీవు మా వద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్ నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా?). (ఆరాఫ్ 7: 70).
అందుకే ఇబాదత్ (ఆరాధన) యొక్క ఏ రకమూ కూడా అల్లాహ్ యేతరులకు చేయుట ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ అల్లాహ్ యేతరులు ఎవరైనా సరే: అతిసన్నిహితులైన దైవదూతలు, ప్రవక్తలు, మహా భక్తులు, సృష్టి రాసుల్లో ఎవ్వరినీ కూడా అల్లాహ్ తో సాటి కల్పించకూడదు.
(3) తౌహీదె అస్మా వ సిఫాత్:
అంటే: అల్లాహ్ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’,త’తీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్'(1) లేకుండా. ఆయన గుణ నామములను యథార్థంగా నమ్మాలి. యథార్దానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. “వేటి గురించి అల్లాహ్ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.
1 ‘తహ్ రీఫ్’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘త’తీల్’ అంటే: అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్ యీఫ్’ అంటే: అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్సీల్’ అంటే: అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.
పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్ ‘అల్ హయ్య్‘ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్ హయ్య్’ అల్లాహ్ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీ‘ ఆయన పేరు, ‘సమ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.
గుణముల ఉదాహరణ:
అల్లాహ్ ఆదేశం:
وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ
(యూదులు ‘అల్లాహ్ చేతులు కట్టుబడినవి’ అని పలుకు చున్నారు. వారి చేతులే కట్టుబడుగాక! వారు పలికిన దానికి వారికి శాపమున్నది. అల్లాహ్ చేతులు విచ్చలవిడిగా ఉన్నవి. తాను కోరునట్లు వినియోగ పరుచుచున్నాడు). (మాఇద 5: 64).
పై ఆయతులో అల్లాహ్ తనకు రెండు చేతులున్నవని, అవి విచ్చలవిడిగా ఉన్నవని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టాను సారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్ సూరె షూరా (42: 11) లో ఇలా ఆదేశించాడు:
لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
(ఆయనకు పోలినది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు).
ఈ తౌహీద్ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు ఏ ఏ నామ గుణాలను తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. అయితే. వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్ కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటీ దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.
పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)
ఇతరములు: [విశ్వాసము]

You must be logged in to post a comment.