విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు] వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)
ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.
ప్రవక్త ప్రవచనాలు
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا (అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా) ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)
అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.
పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)
ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.
ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వివేకం
విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.
ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”
అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “‘“నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”
అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.
అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:
ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.
శాంతి భద్రతల ఆవశ్యకత
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.
[ఇది అరబ్బీ ఖుత్బా యొక్క అనువాదం కదా, సౌదియాలో జుమా రోజు (19 సెప్టెంబర్ 2025) కు జరిగినటువంటి జుమా ప్రసంగం ఇది. ఇక్కడి వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ జామియ బిన్ ఉసైమీన్ లో ప్రసంగించారు]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?
مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ [మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్] “వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)
విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!
ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)
ఇబ్రాహీం (అలైహిస్సలాం) దుఆ
వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا [రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా] “నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.“ (2:126)
ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا [రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా] ““నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)
ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.
అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!
అల్లాహ్ అనుగ్రహం
ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.
“ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు.“ (8:26)
ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.
అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.
మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.
మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.
ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.
శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.
మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.
ఐక్యంగా ఉండాలన్న ఆజ్ఞ
సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:
“అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)
ముగింపు దుఆ
اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ، ఓ అల్లాహ్! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,
اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ. ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.
• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ. ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.
اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ. ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.
اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ. ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!
اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ. ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.
اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ. ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.
اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ. ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.
اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ. ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”
”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”
“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”
”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”
“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”
”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”
“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)
(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.
దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.
(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.
(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”
ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “
(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –
”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)
(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:
(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.
(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “
ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “
(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –
“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)
తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం) రచన:సఫీ అహ్మద్ మదనీ అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు.బహుశా షైతాని అతని చేయిని ఝుళిపించవచ్చు. ఇంకా, అది నరక కూపంలోపడిపోవచ్చు.”(ముస్లిం)
తాత్పర్యం
ఈ హదీనులో ముస్లిం హక్కుల గురించి నొక్కి పలకడం జరిగింది. ఏ ముస్లిమునైనా భయపెట్టడం, కలవరానికి గురిచెయ్యడం, లేదా అతను నొచ్చుకునేలా వ్యవహరించడం పట్ల వారించ బడింది.
“మీ సోదరుని వైపు ఆయుధాన్ని ఎక్కు పెట్టరాదు.” ఇక్కడ సోదరుడంటే ముస్లిం అన్నమాట. ముస్లిములు పరస్పరం అన్నదమ్ములు. అల్లాహ్ సెలవిచ్చాడు :”ఇన్నమల్ మోమినీన ఇఖ్వ” (విశ్వాసులు పరస్పరం సోదరులు). ఆటపాటల్లో, పరాచి కానికయినా భయపెట్టే సంకల్పంతో కరవాలాన్ని, ఖడ్గాన్ని, లేక మరే ప్రమాదకరమైన ఆయుధాన్నయినా లేపటం హరాం (నిషిద్ధం).
“షైతాన్ అతని చేయిని ఝుళిపించవచ్చు” అంటే చేయి జారినా చేయి విసిరినా చేతిలోని ఆయుధానికి ఎదుటి వ్యక్తి గురికావచ్చు. ఇది ఘోర అన్యాయం అవుతుంది.ఒక ముస్లింను అకారణంగా చంపిన కారణంగా ఇతను నరకాగ్నికి ఆహుతి అవుతాడు.ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా ఏ ముస్లిమునైనా వధించటం మహాపాతకం.
అల్లాహ్ సెలవిచ్చాడు :
“ఉద్దేశ్యపూర్వకంగా ఎవడైతే ఒక విశ్వసించిన వాణ్ణి చంపుతాడో అతనికి బహుమానం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమయిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.(అన్ నిసా: 93)
ఏ ముస్లిం హత్యకయినా, గాయాని కయినా కారణభూతమయ్యే ప్రతి విధానాన్ని, ధోరణిని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధంగా (హరామ్)గా ఖరారు చేసినట్లు అసంఖ్యాకమయిన హదీసుల ద్వారా విదితమవుతోంది.
హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది :
“ఎప్పుడయినా ఏ ముస్లిం అయినా మరో ముస్లిం వైపునకు ఇనుప ముక్కతో సంజ్ఞ చేస్తే దైవదూతలు అతన్ని శపిస్తారు – ఒకవేళ అతను సంజ్ఞ చేసిన వ్యక్తి అతని తోబుట్టువు అయినాసరే.”
ఇబ్నుల్ అరబీ ఏమంటున్నారో చూడండి – ‘కేవలం ఇనుప ముక్కతో సంజ్ఞ చేసినమాత్రానికే అతను శాపగ్రస్తుడయితే, ఇక ఆ ఇనుపముక్కతో ఎదుటి ముస్లింపైదాడి జరిపితే, అప్పుడతని పర్యవసానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో?’
వేళాకోళంగానే అయినా ఆయుధంతో సైగ చేసిన వ్యక్తి ధూత్కారిగా పరిగణించబడటానికి కారణమేమంటే, అతని, ఈ చేష్ట మూలంగా ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. అదే ఒకవేళ అతను నిజంగానే ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టే ఉద్దేశ్యంతో చేస్తే అది మహాపరాధమే అవుతుంది. అందుకే ఒరలేని (నగ్న) ఖడ్గాలు ఇచ్చిపుచ్చుకోరాదని అనబడింది. అలా ఇచ్చిపుచ్చు కొంటున్నప్పుడు ఏమరుపాటు వల్ల ఖడ్గం చేజారి పోయి హాని కలిగే ప్రమాదముంది.
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బృందం వైపుగా వెళుతుండగా, వారు ఒరలేని ఖడ్గాలను మార్పిడి చేసుకుంటూ కనిపించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఇలా మందలించారు- “ఇలాంటి చేష్ట చేయరాదని నేను మీకు చెప్పలేదా? మీలో ఎవరయినా ఖడ్గాలుమార్చుకుంటున్నప్పుడు ఒరలో పెట్టి మరీ ఇవ్వాలి.” (అహ్మద్, బజార్)
నేటి ఆధునిక కాలంలో ఎవరయినా వేళాకోళానికయినా సరే – రివాల్వర్ను ఎదుటివారికి గురిపెట్టడం, గుళ్లు నింపిన రివాల్వర్తో అనుభవం లేకుండా ప్రాక్టీసు చేయటం కూడా హదీసులో ప్రస్తావించబడిన ఖడ్గాల మార్పిడిలాంటిదే.ముక్తసరిగా హదీసు సారాంశం ఏమంటే ప్రతి ముస్లిం ప్రాణం అత్యంత విలువైనది, గౌరవప్రదమైనది. కాబట్టి అకారణంగా, అన్యాయంగా ఒక ప్రాణానికి హాని తలపెట్టడం దైవ సమక్షంలో పెద్ద నేరం అవుతుంది. అటువంటి వారి నుండి ప్రళయ దినాన కఠినంగా లెక్క తీసుకోవటం జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి | బులూగుల్ మరాం | హదీసు 1256 https://youtu.be/aWHz-iM7Tq4 [12 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)
సారాంశం:
ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు | బులూగుల్ మరాం | హదీసు 1263 https://youtu.be/32IJzghLRHc [15 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1263.హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
“ఎవరయినా సరే ప్రపంచంలోని ఆపదల్లో నుంచి, ఏదేని ఒక ఆపదనుంచి ఏ ముస్లింనయినా గట్టెక్కిస్తే అల్లాహ్ ప్రళయ దినాన ప్రళయదినపు గండాలలోని ఏదేని ఒక గండం నుంచి అతన్ని గట్టెక్కిస్తాడు. ఎవరయినా ప్రాపంచికంగా లేమికి గురైన ఒక వ్యక్తికి వెసులుబాటు కల్పిస్తే అల్లాహ్ ఇహపరాలలో అతని కోసం వెసులుబాటును కల్పిస్తాడు. ఎవరయినా ఒక ముస్లిం బలహీనతను కప్పిపుచ్చితే అల్లాహ్ ఇహపరాలలో అతని లోగుట్టు పై ఆచ్చాదన వేసి ఉంచుతాడు. ఒక దాసుడు తోటి సోదరుని సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284 https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1284. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:
“దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)
సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక| బులూగుల్ మరాం| హదీసు 1283 https://youtu.be/iNtNrlahhLM [9 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1283. హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“ముస్లింను దూషించటం మహాపాపం. ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి, దైవధిక్కరణకు ప్రతీక” (బుఖారీ, ముస్లిం)
సారాంశం:
హదీసులో “ఫిస్ఖ్” అనే పదం ప్రయోగించబడింది. సాటి ముస్లింను దూషించినవాడు “ఫాసిఖ్” అవుతాడు. అంటే దైవవిధేయతా పరిమితిని దాటిపోయినవాడు, హద్దులను అతిక్రమిం చినవాడన్న మాట! హద్దులను అతిక్రమించినవాడు పాపాత్ముడు, అపరాధి అవుతాడు. ఇక ముస్లింను చంపటం అంటే విశ్వాసాన్ని (ఈమాన్‌ను) త్రోసిరాజనటమే. అకారణంగా ఎవరయినా సాటి ముస్లింను చంపడాన్ని తన కొరకు ధర్మసమ్మతం గావించుకుంటే అతడు ఇస్లాంతో తాను ఏకీభవించటం లేదని క్రియాత్మకంగా రుజువు చేస్తున్నాడు. కనుక అతని ఈ చేష్ట ‘కుఫ్ర్’ క్రిందికి వస్తుంది.
సహీహ్ ముస్లింలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు : “నా అనుచర సమాజ సభ్యులందరూ క్షేమంగా, నిక్షేపంగా ఉండదగ్గవారే. అయితే బహిరంగంగా, నిస్సంకోచంగా పాపాలకు ఒడిగట్టేవారు మాత్రం దీనికి అర్హులు కారు.పాపాత్మునికి పాపకార్యాలను గురించి జాగరూకపరచటం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. తబ్రానీలో హసన్ పరంపర ద్వారా సేకరించబడిన ఒక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు:
“మీరు ఎప్పటి వరకు పాపాత్ముని ఘోరకృత్యాలను చెప్పకుండా ఉంటారు? అతని బండారం బయటపెట్టి తగిన శాస్తి జరిగేలా చూడండి.” ఈ హదీసు వెలుగులో దుర్మార్గుని దౌష్ట్య్రం నుండి ప్రజలు సురక్షితంగా ఉండగలిగేందుకు అతని దుర్మార్గాలను ఎండగడితే అది ముమ్మాటికీ ధర్మసమ్మతమే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి | బులూగుల్ మరాం | హదీస్ 1236 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/0kMzDmvxUmI – 36 minutes
1236. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి. అవేమంటే; (1) అన్ని కలుసుకున్నప్పుడునువ్వు అతనికి సలాం చెయ్యి (2) అతనెప్పడయినా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. (3) అతనెప్పుడయినా సలహా కోరితే -శ్రేయోభిలాషిగా- మంచి సలహా ఇవ్వు. (4) అతనెప్పుడయినా తుమ్మిన మీదట ‘అల్హమ్దులిల్లాహ్’ అని అంటే, సమాధానంగా నువ్వు ‘యర్ హముకల్లాహ్’ అని పలుకు. (5) అతను రోగగ్రస్తుడైతే నువ్వతన్ని పరామర్శించు. (6) అతను మరణిస్తే నువ్వతని అంత్యక్రియలలోపాల్గొను.
(ముస్లిం)
సారాంశం: ఈ హదీసులో ఒక ముస్లిం యొక్క ఆరు హక్కులు సూచించబడ్డాయి. ‘ముస్లిం’లోని వేరొక ఉల్లేఖనంలో ఐదింటి ప్రస్తావనే వచ్చింది. అందులో ‘శ్రేయోభిలాష’ గురించి లేదు. ఏదైనా వ్యవహారంలో ప్రమాణం చేయమని నిన్ను అతను కోరితే – అది నిజమయిన పక్షంలో – ప్రమాణం కూడా చెయ్యమని ఇంకొక హదీసులో ఉంది.మొత్తం మీద ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే సాటి ముస్లిం యెడల తనపై ఉన్న ఈ ఆరు బాధ్యతలను ప్రతి ముస్లిం నెరవేర్చాలి. వీటిని నెరవేర్చటం తప్పనిసరి (వాజిబ్) అని కొంతమంది పండితులు అభిప్రాయపడగా, నెరవేర్చటం వాంఛనీయం (ముస్తహబ్)అని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే హదీసులోని పదజాలాన్నిబట్టి వాటిని నెరవేర్చటం తప్పనిసరి అని అనటమే సమంజసం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అనస్ ఇబ్నె మాలికి = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అనిన్నబియ్యి = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు, ఖాల = తెలిపారు, లా = కాదు, యూమిను = విశ్వాసి , అహదకుమ్ = మీలో ఎవరూ, హత్తా = అప్పటి వరకు, యుహిబ్బ = కోరుకోవటం, లి = కోసం, అఖీహి = తోటి సోదరుడి, మా = ఏదైతే, యుహిబ్బు = కోరుకోవటం, లి = కోసం, నఫ్సిహి = తనకోసం .
అనువాదం:-అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా అన్నారు “మీలో ఒక్కరు కూడా అప్పటి వరకూ నిజమైన విశ్వాసి కాజాలరు. (ఎప్పటివరకూ అంటే) మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా (అలాంటిదే ఉండాలని) ఆవిధంగానే ఉండాలని (మనస్పూర్తిగా) కోరుకోనంతవరకు.” సహీబుఖారి హదీథ్ గ్రంథం
వివరణ:- ఈ హదీథ్, ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను విధిగా ప్రేమించాలనీ, గౌరవించాలనీ తెలియజేయు చున్నది. ఇస్లాంలో అనుమతించబడిన మేరకు – మన ముస్లిం సోదరుల ఆశలు, ఆశయాలు సాకారం అయ్యేలా మనం వారికి అన్ని విధాలా సహాయం చేయాలి, సహకరించాలి. ఈ హదీథ్ సోదర ముస్లింల పట్ల సమానత్వం వైపునకు, వారి పట్ల మసం చూపవలసిన పరస్పర గౌరవం, వినయం, వినమ్రత వైపుకు మన దృష్టిని మరల్చుచున్నది. మనలో నుండి తోటివారి పట్ల ద్వేషం, అసూయ, ఏహ్యభావం, హీనభావం మరియు మన తోటి ముస్లిం సోదరుల పట్ల మోసపూరిత ఆలోచనలను దూరం చేసుకోనంత వరకు, వారిపట్ల (సహజసిద్ధమైన) ప్రేమ, అభిమానం, గౌరవంమనలోపుట్టుకురావుఅని గమనించాలి.
ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-
మనతోటి ముస్లిం సోదరులను ప్రేమించడం లేక అసహ్యించుకోవడం (అంటే మన అంతరంగ మరియు బహిర్గత ప్రవర్తన) అనేవి అల్లాహ్ పట్ల మనలోని సంపూర్ణమైన విశ్వాసాన్ని పరీక్షించే గీటురాళ్ళ వంటి విషయాలలో ఇవి కూడా ఉన్నాయని గమనించాలి.
తోటివారిపట్ల అసూయా, ద్వేషభావాలు – అల్లాహ్ పట్ల మనలోని విశ్వాసాన్ని తగ్గిస్తాయి.
మన తోటివారు మంచిగా ఉండాలని కోరుకోవడం, అందుకని వారికి సహాయసహకారాలు అందజేయడం, వారిని చెడు మరియు తప్పుడు మార్గాల నుండి వారించడం అనేవి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం.
ఇతరుల బాగోగుల గురించి ఆలోచించక, అన్ని మంచి విషయాలు మనకే సొంతం అవ్వాలనుకునే స్వార్ధపరత్వం, నీచమనస్తత్వం గురించి ఈ హదీథ్ మనల్ని హెచ్చరిస్తున్నది.
హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:-ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.
ప్రశ్నలు
మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా _____________________________________ (మనస్పూర్తిగా) కోరుకోవాలి.
ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను_____ప్రేమించాలి మరియు గౌరవించాలి.
సోదర ముస్లింల పట్ల సమానత్వం, పరస్పర గౌరవం, వినయం, వినమ్రతం చూపటమనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పాటించాలా? లేక వారి నుండి తమ అవసరాలు తీర్చుకోవడానికా?
ఈ హదీథ్ అమలు చేయటం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి?
Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – సయ్యద్ యూసుఫ్ పాషా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net