నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

అయితే మహాశయులారా, నరకంలో ఎన్నో స్థానాలు ఉంటాయి. వాటిని ‘దరకాత్‘ అని కూడా అనడం జరుగుతుంది అరబీలో. ఎవరి పాపాలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారం వారు వారికి తగిన స్థానంలో ఉంటారు. కొందరు అల్లాహ్ పంపినటువంటి సత్యధర్మం పట్ల కేవలం విముఖత చూపుతారు, అంతే. స్వీకరించరు. కానీ వారి మనస్సులో ఈ సత్యధర్మం పట్ల ఎలాంటి శత్రుత్వం గానీ, ద్వేషం గానీ, కపటం గానీ ఉండదు. మరియు అల్లాహ్ యొక్క విషయం, ప్రవక్తల యొక్క విషయం వచ్చినప్పుడు ఓ గౌరవభావం వారిలో ఉంటుంది. వీరు వాస్తవానికి తిరస్కరించినవారే, కానీ వీరిది ఒక స్థానం ఏది ఉంటే, మరికొందరు సత్యాన్ని తిరస్కరించి ద్వేషం, కపటం, శత్రుత్వం వహిస్తారు. వారు వీరి కంటే మరీ ఎక్కువ భయంకరమైన స్థానంలో ఉంటారు.

వీరి కంటే మరీ దుర్మార్గులు మరికొందరు ఉంటారు. వారి శత్రుత్వం, వారి యొక్క ద్వేషం, కపటం మనసులోనే ఉండకుండా దాన్ని ప్రస్ఫుటం చేస్తారు. సత్యం నశించాలన్నట్లుగా కుట్రలు పన్నుతారు. సత్యంపై ఉన్నవారి జీవితాల్లో జోక్యం చేసుకొని వారిని ప్రశాంతంగా జీవించే హక్కు కూడా ఇవ్వనట్లుగా, ఇవ్వకుండా చేస్తారు. అలాంటి వారు మరింత భయంకరమైన, ఎక్కువ శిక్షలు గల స్థానంలో ఉంటారు. ఈ విధంగా మహాశయులారా, మనకు అర్థం కావడానికి ఈ మూడు రకాలు నేను తెలిపాను, కానీ ఇంకా వేరే ఏ ఏ పాపాలైతే ఉన్నాయో ఆ ఆ పాపాల పరంగా ప్రతి ఒక్కరూ వారి వారికి తగిన స్థానంలో ఉంటారు. అంటే నరకంలో కూడా వివిధ స్థానాలు ఉంటాయి.

وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا
(వలికుల్లిన్ దరజాతుమ్ మిమ్మా అమిలూ)
“ఎవరు ఎలాంటి ఆచరణ ఆచరించారో దాని ప్రకారం వారికి వారి స్థానాలు ఉంటాయి.”

మరియు మునాఫిఖీన్, కపట విశ్వాసులు:

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ
(ఇన్నల్ మునాఫిఖీన ఫిద్-దర్కిల్ అస్ఫలి మినన్నార్)
“కపట విశ్వాసులు నరకంలోని అధమ స్థానంలో ఉంటారు.” వారు అక్కడ పడి ఉంటారు.

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది, స్వర్గంలో ఏ స్థానాలైతే ఉంటాయో అవి పైకి ఉంటాయి. మరియు నరకంలో ఏ స్థానాలైతే ఉంటాయో అవి కిందికి ఉంటాయి. విశ్వాసుల్లో, పుణ్యాత్ముల్లో అతి గొప్ప స్థానం వారు అతి ఎత్తుగా, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. మరియు అవిశ్వాసుల్లో, పాపాత్ముల్లో అతి చెడ్డ వాళ్ళు నరకంలోని అతి అధమ స్థానంలో, క్రింది స్థానంలో పడి ఉంటారు. అల్లాహ్ తాలా ఇలాంటి నరకాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక, వాటిలో చేర్పించే పాపాల నుండి కూడా దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మహాశయులారా, నరకంలో కూడా స్థానాలు వేరువేరుగా ఉంటాయి అని ఏదైతే తెలుసుకున్నామో, దాని ప్రకారంగా శిక్షలు కూడా వేరువేరుగా ఉంటాయి. అన్నిటిలో ఒకే రకమైన శిక్ష అనేది ఉండదు. వారు చేసిన కర్మలను బట్టి వారిని శిక్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఖురాన్లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. సూరత్ గాఫిర్ ఆయత్ నంబర్ 46లో అల్లాహ్ తెలిపాడు:

وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
(వయౌమ తఖూముస్సాఅతు అద్ఖిలూ ఆల ఫిర్ఔన అషద్దల్ అదాబ్)
“మరి ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో, ఫిరౌన్ వాసులను అతి ఎక్కువగా మరియు కఠినమైన శిక్షలో ప్రవేశించండి అని చెప్పడం జరుగుతుంది.”

ఇక్కడ విషయం ఏం తెలిసింది? ‘అదాబ్’ అంటే శిక్ష, ‘అషద్దల్ అదాబ్’ అంటే కఠిన శిక్షల్లో కూడా మరీ ఎంతో కఠినమైన దానిని ‘అషద్’ అని అంటారు. అంటే సామాన్య శిక్షలో కాదు, అతి కఠినమైన శిక్షలో అతన్ని పడవేయండి అని చెప్పడం జరుగుతుంది.

సూర నహల్, సూర నంబర్ 16, ఆయత్ నంబర్ 88 గమనిస్తే:

الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ
(అల్లదీన కఫరూ వసద్దూ అన్ సబీలిల్లాహ్, జిద్నాహుమ్ అదాబన్ ఫౌఖల్ అదాబి బిమా కానూ యుఫ్సిదూన్)
“ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో మరియు ప్రజలను కూడా అల్లాహ్ మార్గం నుండి ఆపివేశారో, అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా అడ్డుకున్నారో, ఆపుతూ ఉన్నారో, వారి శిక్షలపై మరింత వారి యొక్క శిక్షను ఇంకా పెంచడం జరుగుతుంది.”

అల్లాహు అక్బర్. ఎందుకు? “వారు ఏ ఫసాద్ అయితే చేస్తూ ఉన్నారో, ఏ సంక్షోభం అయితే లేపుతూ ఉన్నారో, సత్యానికి, సత్య ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి పన్నాగలు పన్నుతున్నారో దానికి కారణంగా.”

ఇక్కడ ఏం తెలిసింది మనకు? కొందరు ప్రజల్లో ఉన్నారు, వారు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. కానీ మరికొందరు ఎలా ఉన్నారు? కేవలం తిరస్కరించడమే కాకుండా ప్రజల్ని ఆపుతున్నారు. మరీ సంక్షోభాన్ని లేపుతున్నారు. అయితే వారికి సామాన్యుల్లాగా శిక్ష ఉండకుండా, వారి యొక్క శిక్ష ఇంకా పెరుగుతూ ఉండాలి. అందుకు గురించి అల్లాహ్ ఏమన్నాడు? “జిద్నాహుమ్ అదాబన్ ఫౌఖల్ అదాబ్” (వారి శిక్షపై శిక్షలను మేము మరింత పెంచుతూ ఉంటాము).

అలాగే ఎవరైతే పాప కార్యాల్లో, అవిశ్వాస కార్యాల్లో నాయకులుగా ఉంటారో, రాని వాళ్ళను కూడా బలవంతంగా చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటారో, ప్రజల్ని మోసపెట్టి వారిని ధర్మము నుండి ఆపి అధర్మం వైపునకు తీసుకువెళ్తూ ఉంటారో, అలాంటి వారికి కూడా సామాన్యుల మాదిరిగా శిక్ష ఉండదు. మరీ ఘోరమైన శిక్ష ఉంటుంది. అంతేకాదు, నరకంలో వెళ్ళిన తర్వాత ఆ అనుయాయులు, ఎవరైతే ఈ నాయకుల మాటలను విని ఆచరించి నరకంలో పడ్డారో, వారు సైతం తమ ఆ పెద్దలను శపిస్తూ ఉంటారు మరియు అల్లాహ్ తో దువా చేస్తారు నరకంలో ఉండి, “వీరి వల్ల మేము సత్య మార్గాన్ని వదులుకున్నాము, మార్గభ్రష్టత్వంలో పడ్డాము, అందు గురించి వీరిని మరింత శపిస్తూ వీరి యొక్క శిక్షను ఇంకా పెంచుతూ ఉండండి ఓ అల్లాహ్” అని అల్లాహ్ ను కోరుకుంటారు. ఈ విషయాన్ని అల్లాహ్ తాలా సూరే ఆరాఫ్, ఆయత్ నంబర్ 38లో తెలిపాడు.

ఇంకా మహాశయులారా, ఎవరైతే అల్లాహ్ ధర్మాన్ని కేవలం తమ కోరికల మట్టుకే అనుసరిస్తూ ఉంటారో, ఇష్టమైన దానిని తీసుకుంటారు, ఇష్టం లేని దానిని వదులుతారు, ఇలాంటి వారికి కూడా చాలా కఠినమైన శిక్ష ఏర్పడుతుంది. ఎందుకంటే వారు తమ మనోవాంఛనను, కోరికలను అల్లాహ్ కు సమర్పించకుండా తమ కోరికలకు బానిసలై ఉన్నారు. ఏదైనా విషయం నచ్చింది అంటే, “అరే ఇది ధర్మంలో ఉంది కదా, మేము ధర్మాన్ని పాటించే వాళ్ళము” అని గొప్పలు చెప్పుకుంటారు. మరి ఏదైనా విషయం నచ్చకుంటే, “అరే ఇది ఈ కాలానికి బాగు లేదు, ప్రస్తుతం దీన్ని మనం అనుసరించలేము” అని వేరే వేరే అడ్డసాకులు చెప్పి దాన్ని వదులుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించి సూర బఖరాలో అల్లాహ్ ఏమని చెప్పాడు?

أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ
(అఫతుఅ్మినూన బిబాదిల్ కితాబి వతక్ఫురూన బిబాద్)
“గ్రంథంలోని ఒక భాగాన్ని స్వీకరించి, విశ్వసించి, నమ్మి మరికొంత భాగాన్ని మీరు తిరస్కరిస్తున్నారా?”

فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ
(ఫమా జజాఉ మన్ యఫ్అలు దాలిక మిన్కుమ్ ఇల్లా ఖిజ్యున్ ఫిల్ హయాతిద్ దున్యా, వయౌమల్ ఖియామతి యురద్దూన ఇలా అషద్దిల్ అదాబ్)

“మీలో ఎవరైతే ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడతారో, ఇహలోకంలోనే మిమ్మల్ని అవమానానికి గురిచేస్తాను” అని అల్లాహ్ తాలా అంటున్నాడు. మరి పరలోకంలో ఏం జరుగుతుంది? వారిని శిక్షల వైపునకు నెట్టేయడం జరుగుతుంది” అని కాదు, “అషద్దల్ అదాబ్” (మిక్కిలి కఠినమైన శిక్ష) – శిక్షల్లో మరీ కఠినమైన శిక్ష వారికి విధించడానికి వారిని అటువైపునకు నెట్టేయడం జరుగుతుంది.

అంటే ఈ ఆయతులలో ఉన్న భావాన్ని కూడా గ్రహించి ఏ ఏ పాపాలు తెలపబడుతున్నాయో, అలాంటి పాపాల నుండి మనం దూరం ఉండి నరకంలో పడకుండా దాని నుండి రక్షణ పొందే వారిలో చేరే ప్రయత్నం మనం చేయాలి సోదరులారా సోదరీమణులారా. నరకంలో శిక్ష అందరికీ ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరికి వారు చేసిన పాపాలకు తగిన రీతిలో వారికి శిక్ష ఉండును. ఈ విషయం హదీసుల ద్వారా కూడా మనకు బోధపడుతుంది.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని సహీ ముస్లింలో ఈ హదీస్ ఉంది:

مِنْهُمْ مَنْ تَأْخُذُهُ النَّارُ إِلَى كَعْبَيْهِ، وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ إِلَى رُكْبَتَيْهِ، وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ إِلَى حُجْزَتِهِ، وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ إِلَى تَرْقُوَتِهِ
“నరకాగ్ని కొందరిని వారి యొక్క చీలమండలాల వరకు, మరికొందరి మోకాళ్ళ వరకు, మరికొందరి నడుము వరకు, మరికొందరి మెడ వరకు (నోటి వరకు) ఆ అగ్ని వారిని పట్టుకొని ఉంటుంది.”

సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారం, నరకంలో అతి తక్కువ శిక్ష ఎవరికైతే ఇవ్వబడుతుందో అతని ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఏమిటి? నరకం యొక్క చెప్పులు అతనికి ధరింపచేయడం జరుగుతుంది. దాని మూలంగా అతని యొక్క మెదడు ఉడుకుతూ ఉంటుంది. మరికొన్ని హదీసుల్లో దాని యొక్క పోలిక కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఎలాగైతే పొయ్యి మీద ఏదైనా పాత్ర, అందులో ఏమైనా విషయాలు పెట్టి మంట పెడితే ఎలా అవి ఉడుకుతూ మసులుతూ ఉంటాయో, ఆ విధంగా ఆ వ్యక్తికి అలా ఏర్పడుతుంది. మరికొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, ఈ అతి తక్కువ శిక్ష అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయి అబూ తాలిబ్ కు జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇస్లాంకు వ్యతిరేకంగానైతే లేకుండిరి. ప్రవక్తకు తోడుగా ఉండి తమ జీవితాంతం ఇస్లాంకు సపోర్టులో ఉన్నారు. కానీ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. అల్లాహ్ తాలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు వల్ల అతనిని నరకం నుండి అయితే తీయలేదు బయటికి, తీయడు ప్రళయ దినాన కూడా, కానీ నరకంలో అతి తక్కువ శిక్ష అనేది జరుగుతుంది.

ఇక్కడ ఒక విషయం గమనించండి. రక్త సంబంధాల వల్ల ఇలాంటి సిఫారసులు ఏమైనా నడుస్తాయి, మనకు మన పీర్లు, ముర్షదులు, మన పెద్దలు, మన నాయకులు, మన యొక్క ఫలానా ఫలానా వారు సిఫారసు చేసి మనకు లాభం చేకూరుస్తారు అన్నటువంటి భ్రమలో పడకండి. ఆ నరకంలో, నరకంలోని పాదరక్షలు, బూట్లు తొడిగించడం వల్ల, దాని మూలంగా అతని మెదడు అనేది ఉడికిపోతుంది అని అంటే, అతడు అంతటి భయంకరమైన గొప్ప శిక్ష నాకే విధించబడుతుంది అన్నట్లుగా భావిస్తాడు.

ప్రళయ దినాన నరకంలో శిక్షలు వివిధ రూపాల్లో, కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఉంటాయి. అతి కఠినమైన శిక్ష, దాని గురించి ఒక హదీసులో ఇలా వచ్చి ఉంది:

أَشَدُّ النَّاسِ عَذَابًا لِلنَّاسِ فِي الدُّنْيَا أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللَّهِ يَوْمَ الْقِيَامَةِ
(అషద్దున్నాసి అదాబన్ లిన్నాసి ఫిద్దున్యా, అషద్దున్నాసి అదాబన్ ఇందల్లాహి యౌమల్ ఖియామ)
(ఇహలోకంలో ప్రజలను ఎక్కువగా శిక్షించేవాడే ప్రళయ దినాన అల్లాహ్ వద్ద అత్యంత కఠినమైన శిక్ష పొందుతాడు.)

ఇహలోకంలో ఎవరైతే ప్రజలను ఎంత కఠినంగా శిక్షిస్తారో, అన్యాయంగా, అనవసరంగా, ప్రళయ దినాన అల్లాహ్ వద్ద వారికి అంతే ఎక్కువ కఠిన శిక్ష పడుతుంది.

గమనించారా? అందు గురించి ఎవరైతే ఏ ఏ అధికారాల్లో ఉన్నారో, ఇంట్లో తల్లిదండ్రుల నుండి మొదలుకొని, స్కూల్లో టీచర్లు, హెడ్మాస్టర్ల నుండి మొదలుకొని, ప్రతీ రంగంలో, సామాన్యంగా పై అధికారులు చిన్న వారికి కదా శిక్షలు విధించేది. అయితే ఎంత తప్పు ఉందో అంత కాకుండా అంతకంటే మించిన రీతిలో ఎవరైతే ఎవరికి ఎక్కువగా శిక్షిస్తారో, అల్లాహ్ వద్ద అతడు అంతే ఎక్కువ శిక్ష పొందుతాడు.

సహీహుల్ జామేలో హదీస్ నంబర్ 1006లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أَشَدُّ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ عَذَابًا إِمَامٌ جَائِرٌ
(అషద్దున్నాసి యౌమల్ ఖియామతి అదాబన్ ఇమామున్ జాయిరున్)
(ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్ష పొందేవాడు దుర్మార్గపు పాలకుడు.)

ప్రళయ దినాన అతి కఠినమైన శిక్ష ప్రజలపై దౌర్జన్యం చేసే నాయకునికి. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో నాయకులు తమ కడుపు నింపుకోవడానికి, తమ యొక్క సంతానంలోని వెనుక వచ్చే ఎందరో వంశాల వరకు వారి సుఖ సౌఖ్యాలను ఆలోచించి, ప్రజల్ని ఎంతో కఠినానికి, ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటి వారు ఈ హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. ఏ నాయకుడు ఎంత ఎక్కువగా ప్రజలపై దౌర్జన్యం చేస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్ వద్ద అతనికి అంతే ఎక్కువ శిక్ష పడుతుంది.

ఇంకా మహాశయులారా, ఎవరైతే క్రియేటివిటీ మరియు పనితనం, కళ అన్న పేరుతో చిత్రాలు చిత్రిస్తూ ఉంటారో, అలాంటి వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ أَشَدَّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الْمُصَوِّرُونَ
(ఇన్న అషద్దన్నాసి అదాబన్ యౌమల్ ఖియామతి అల్ ముసవ్విరూన్)
“ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్షను అనుభవించే వారిలో చిత్రకారులు కూడా ఉంటారు.”

أَحْيُوا مَا خَلَقْتُمْ
(అహ్యూ మా ఖలఖ్తుమ్)
“మీరు ఏ ప్రాణ చిత్రాలైతే చిత్రించారో, వాటిలో మీరు ప్రాణం కూడా పోయండి అని వారికి చెప్పి శిక్షించడం జరుగుతూ ఉంటుంది.”

ఈ విధంగా మహాశయులారా, ఈనాటి కార్యక్రమంలో మనం నరకం యొక్క కాపలాదారులు, వారి యొక్క నాయకుడు, మరియు నరకంలో శిక్షల్లో ఎలాంటి స్థానాలు ఉంటాయి, వీటి యొక్క వివరాలు విన్నాము. నరకానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. తరువాయి భాగాల్లో తెలుసుకుంటూ ఉందాము. మరియు నరకం నుండి దూరం ఉండడానికి, పాపాలు వదులుకొని సత్కార్యాల్లో ముందుకు వెళ్తూ విశ్వాస మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉందాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]