మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.
మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.
నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:
- అన్నార్ (النَّار) – అగ్ని
- జహన్నమ్ (جَهَنَّم) – నరకం (అత్యంత ప్రసిద్ధమైన పేరు)
- జహీమ్ (جَحِيم) – ప్రజ్వలించే అగ్ని
- సఈర్ (سَعِير) – మండుతున్న జ్వాల
- లజా (لَظَىٰ) – భగభగమండే అగ్ని
- సఖర్ (سَقَر) – కాల్చివేసేది
- హుతమా (حُطَمَة) – ముక్కలు ముక్కలుగా నలిపివేసేది
- హావియా (هَاوِيَة) – అగాధం, పాతాళం
ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
వయ్‌లుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్ (1) అల్లజీ జమఅ మాలవ్ వ అద్దదహ్ (2) యహ్సబు అన్న మాలహూ అఖ్లదహ్ (3) కల్లా, లయున్‌బదన్న ఫిల్ హుతమహ్ (4) వమా అద్రాక మల్ హుతమహ్ (5) నారుల్లాహిల్ మూఖదహ్ (6) అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్’ఇదహ్ (7) ఇన్నహా అలైహిమ్ ము’సదహ్ (8) ఫీ అమదిమ్ ముమద్దదహ్ (9)
తెలుగు అనువాదం: చాడీలు చెప్పే, ఎదురుగా తిట్టే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు (1). వాడు ధనాన్ని పోగుచేసి, దాన్ని లెక్కపెడుతూ ఉంటాడు (2). తన ధనం తనను శాశ్వతంగా ఉంచుతుందని వాడు భావిస్తున్నాడు (3). ఎంతమాత్రం కాదు! వాడు తప్పకుండా ‘హుతమా’లో విసిరివేయబడతాడు (4). ఆ ‘హుతమా’ ఏమిటో నీకేమి తెలుసు? (5) అది అల్లాహ్ రగిలించిన అగ్ని (6). అది హృదయాల వరకు చేరుకుంటుంది (7). నిశ్చయంగా అది వారిపై మూసివేయబడుతుంది (8). ఎత్తైన స్తంభాలలో (వారు బంధించబడతారు) (9).
నాలుకతో గానీ, కళ్ళతో గానీ సైగలు చేసుకుంటూ ఇతరులను బాధ కలిగించేవారు, ఎత్తిపొడిచేవారు, వారికి వైల్ ఉంది, వినాశనం ఉంది. ఎవరైతే డబ్బు, ధనాన్ని కూడబెట్టి లెక్కపెట్టుకుంటూ ఉంటారో, వారి యొక్క ఆ డబ్బు, ధనం వారిని శాశ్వతంగా ఉండే విధంగా చేస్తుందని భావిస్తున్నారో, ముమ్మాటికీ కాదు. అతను హుతమాలో వేయబడతాడు. హుతమా అంటే నీకేమి తెలుసు? అది అల్లాహ్ యొక్క అగ్ని. దహింప చేయడం జరిగింది. అది హృదయాల వరకు చేరుతుంది. మరియు నలువైపులా మూయబడిన అగ్నిలో వారు పడి ఉంటారు. పెద్ద పెద్ద, చాలా పొడవైన పిల్లర్ లాంటివి కూడా ఆ అగ్నిలో ఉంటాయి. వాటితో వారిని బంధించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ‘హుతమా’ అనే పేరు ఏదైతే వచ్చిందో, ఆ పాపాలు చేసే వారి గురించి, దానిని బట్టి అలాంటి భావం అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది నరకానికి ఒక పేరు అని కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా, మహాశయులారా, మిగతా పేర్ల విషయం కూడా.
నరకం ఎంత భయంకర విషయం. ఈ రోజుల్లో మనం చిన్నపాటి అగ్నిని సహించలేము. క్రొవ్వొత్తి, ఇంట్లో దీపం, దాని మీద చిన్నపాటిగా, ఒక ఇంచ్ , ఇంచ్ (inch) కంటే తక్కువగా ఏ మంట లేస్తుందో అందులో మనం వేలు పెట్టలేము. వేడివేడి పాత్రల్ని మనం మన చేతులతో పట్టుకోలేము. అలాంటిది, మనం పరలోకంలో నరకంలో ఎలా ఉండగలుగుతాము? ఎలా దాని శిక్షల్ని భరించ గలుగుతాము? అందు గురించి, దాని వివరాలు తెలుసుకోవాలి, నరకంలో పోయేవారు ఎవరో తెలుసుకోవాలి, ఏ కారణాల వల్ల పోతారో అది కూడా తెలుసుకోవాలి, ఆ నరకం నుండి రక్షించుకునే దానికి అల్లాహ్ పై విశ్వాసం, సత్కార్యాలు చేస్తూ ఉండాలి.
నరకం అది ఎంత పెద్ద విషయం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, దానిని తెలుసుకోవడానికి బహుశా ఈ యొక్క హదీథ్ కూడా మనకు సరిపోవచ్చు. సహీహ్ ముస్లింలోని హదీథ్, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “ప్రళయ దినాన నరకాన్ని తీసుకురావడం జరుగుతుంది. దానికి డెబ్బై వేల సంకెళ్ళు ఉంటాయి.” అల్లాహు అక్బర్! డెబ్బై వేల సంకెళ్ళలో బంధించి నరకమును తీసుకురావడం జరుగుతుంది. డెబ్బై వేల సంకెళ్ళు దానికి ఉంటాయి, మరి ప్రతీ సంకెళ్ళను పట్టుకోవడానికి డెబ్బై వేల దైవదూతలు ఉంటారు. అల్లాహు అక్బర్! దైవదూతల సంఖ్య ఎంత అవుతుంది? డెబ్బై వేల సంకెళ్ళు, ప్రతీ సంకెళ్ళు పట్టుకోవడానికి డెబ్బై వేల దైవదూతలు. ఈ విధంగా డెబ్బై వేలను మరో డెబ్బై వేలతో గుణిస్తే, 490 కోట్ల కంటే ఎక్కువ సంఖ్య చేరుతుంది.
మరియు ఆ దైవదూతలు ఎంతటి బలమైన వారు, ఆ దైవదూతలు ఎంత పొడవైన వారు! అల్లాహు అక్బర్! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీథ్ లో తెలిపారు:
أُذِنَ لِي أَنْ أُحَدِّثَ عَنْ مَلَكٍ مِنْ مَلَائِكَةِ اللَّهِ مِنْ حَمَلَةِ الْعَرْشِ، إِنَّ مَا بَيْنَ شَحْمَةِ أُذُنِهِ إِلَى عَاتِقِهِ مَسِيرَةُ سَبْعِمِائَةِ عَامٍ
ఉదిన లీ అన్ ఉహద్దిత అన్ మలకిన్ మిమ్ మలాయికతిల్లాహి మిన్ హమలతిల్ అర్ష్, ఇన్న మా బైన షహ్మతి ఉదునిహి ఇలా ఆతిఖిహి మసీరతు సబ్’ఇమి’అతి ఆమ్.
“అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసనాన్ని) మోస్తున్న దైవదూతలలో ఒకరి గురించి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వబడింది. నిశ్చయంగా, అతని చెవి కొన నుండి అతని భుజం వరకు ఉన్న దూరం ఏడు వందల సంవత్సరాల ప్రయాణమంత.”
అంతటి పొడవైన, బలమైన వారు దైవదూతలు. డెబ్బై వేల మంది దైవదూతలు ఒక్కో సంకెళ్ళను పట్టుకొని ఆ నరకాన్ని తీసుకువస్తారు అంటే ఆ నరకం ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో అట్లే మనం ఆలోచించవచ్చు. అందుకు మహాశయులారా, ఆ నరకం నుండి రక్షణకై ముందుకు రావాలి మనం, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉండాలి. అల్లాహ్ తో దాని నుండి రక్షణ కోరుతూ ఉండాలి.
ఇక మహాశయులారా, ఆ నరకం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో, అల్లాహు అక్బర్! దానిని గనక మనం తెలుసుకోవాలంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీథ్ ను అర్థం చేసుకోవాలి. ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖన: ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు తెలిపారు, ముజాహిద్ ఉల్లేఖనం ప్రకారం, “నరకం యొక్క వైశాల్యం ఎంత ఉందో నీకు తెలుసా?” అప్పుడు ముజాహిద్ అంటారు, “నాకు తెలియదు” అని. అప్పుడు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు తెలుపుతారు: “నరకంలో ఉన్న వ్యక్తి, ఆ నరకవాసి, ఒక్కొక్క నరకవాసిని ఎంత లావుగా, ఎంత పెద్దగా అందులో చేయడం జరుగుతుందంటే, నరకవాసి యొక్క ఈ చెవి చివరి భాగం నుండి ఈ భుజము వరకు 70 సంవత్సరాల ప్రయాణం చేసే అంతటి దూరం ఈ చెవి చివరి భాగం నుండి ఈ భుజం వరకు ఉంటుంది.” అందులో పడి ఉన్న మనిషి, ఆ నరకవాసి ఇంత లావుగా, పెద్దగా ఉంటాడు అంటే, ఆ నరకం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో ఆలోచించండి. అంతేకాదు, ఈ రోజుల్లో సూర్య చంద్రులను మనం చూస్తున్నాము కదా, ప్రళయ దినాన సూర్యుడిని మరియు చంద్రుడిని నరకంలో వేయడం జరుగుతుంది. ఇక నరకం యొక్క వైశాల్యం ఎంత పెద్దగా ఉందో మీరు పసిగట్టండి.
చెప్పే విషయం ఏంటంటే, నరకవాసులు, నరక శిక్ష భరించడానికి వారిని లావుగా చేసి అందులో వేయడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా తర్వాత రానున్నాయి. కానీ ప్రస్తుతం, నరకం యొక్క వైశాల్యం ఎంత ఉన్నదో దానిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము.
ఇక మహాశయులారా, నరకం ఎంత పెద్దది, ఎంత బ్రహ్మాండమైనది, దాని యొక్క వైశాల్యం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవడంతో పాటు, దాని యొక్క లోతు! అల్లాహు అక్బర్! దాని లోతు గురించి ఏం చెప్పాలి! దానికి సంబంధించిన హదీథులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని తెలుసుకుంటే భయకంపితులై పోతాము. జహన్నమ్ యొక్క లోతు ఎంత ఉందో దానిని తెలుపుతూ సహీహ్ ముస్లింలో ఉల్లేఖించిన ఈ హదీథ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీహ్ ముస్లింలోని ఈ హదీథ్ హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు తెలిపారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము, ఒక శబ్దం విన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శబ్దం ఏమిటి అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. మేమంటాము, అల్లాహ్ కు బాగా తెలుసు, ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే తెలుసు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: ‘ఈ శబ్దం ఏదైతే మీరు విన్నారో, 70 సంవత్సరాల క్రితం ఒక రాయి నరకంలో విసిరి వేయడం జరిగింది. అది ఈ రోజు దాని అడుగున చేరింది. ఆ అడుగున చేరిన దాని యొక్క శబ్దం మనం విన్నాము’ అని.” అల్లాహు అక్బర్! 70 సంవత్సరాల ప్రయాణం చేసే అంతటి లోతు నరకానిది ఉన్నది. ఇక అందులో వేయబడిన వారి పరిస్థితి ఏముంటుందో గమనించండి.
మహాశయులారా, ముస్నద్ అహ్మద్ లోని మరో ఉల్లేఖనంలో ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ ‘సహీహుల్ జామిఅ’ లో ప్రస్తావించారు: “ఒక మహా పెద్ద బండరాయిని నరకంలో వేస్తే అది 70 సంవత్సరాలు గడిచినా దాని అడుగునకు చేరదు.” అంత లోతుగా ఉంటుంది జహన్నమ్.
మరొక ఉల్లేఖనంలో ఉంది సహీహ్ బుఖారీ, ముస్లింలో:
إِنَّ الْعَبْدَ لَيَتَكَلَّمُ بِالْكَلِمَةِ، مَا يَتَبَيَّنُ فِيهَا، يَزِلُّ بِهَا فِي النَّارِ أَبْعَدَ مِمَّا بَيْنَ الْمَشْرِقِ
ఇన్నల్ అబ్ద లయతకల్లము బిల్ కలిమతి మా యతబయ్యను ఫీహా యజిల్లు బిహా ఫిన్నారి అబ్’అద మిమ్మా బైనల్ మష్రిఖి వల్ మగ్రిబ్.
“నిశ్చయంగా ఒక దాసుడు ఎలాంటి ఆలోచన, నిర్ధారణ లేకుండా నోటితో ఓ మాట పలుకుతాడు. దాని మూలంగా అతను తూర్పు మరియు పడమరల మధ్యలో ఎంత దూరం ఉందో, అంత దూరం ఉన్నటువంటి లోతుగల నరకంలో పడిపోతాడు.”
ఈ విధంగా మహాశయులారా, నరకం యొక్క లోతు చాలా భయంకరమైన విషయం. ఇక నరకానికి ఎన్ని గేట్లు ఉంటాయి, ద్వారాలు ఉంటాయి? దీని ప్రస్తావన కూడా ఖురాన్ లో వచ్చి ఉంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు:
لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ (సూరతుల్ హిజ్ర్: 44)
లహా సబ్’అతు అబ్’వాబ్, లికుల్లి బాబిమ్ మిన్’హుమ్ జుజ్’ఉమ్ మఖ్’సూమ్.
“దానికి ఏడు ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారానికి వారి (పాపుల)లో నుండి ఒక నిర్దిష్ట భాగం కేటాయించబడింది.”
నరకానికి ఏడు ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారానికి కొందరు వారి కర్మల ప్రకారంగా నిర్ణయించబడి ఉన్నారు. వారు వారిలో నుండి ఆ ద్వారాల నుండే ప్రవేశిస్తారు. ఈ విధంగా మహాశయులారా, నరకానికి ఏడు ద్వారాలు ఉంటాయని తెలిసింది. అయితే హదీథ్ లో వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయి.
నరకానికి సంబంధించిన మరో భయంకరమైన విషయం ఏమిటంటే, నరకంలో వేయబడిన వారు బయటికి రాకుండా తలుపులతో మూయబడుతుంది. మరి అది బంద్ చేయబడుతుంది. ఏ ఒక్కరూ కూడా బయటికి వెళ్లి రావడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. “అలైహిమ్ నారుమ్ ము’సదా” అని ఇంతకు ముందే మనం సూరతుల్ హుమజా లోని ఆయత్ చదివి ఉన్నాము. ఇంకా ఖురాన్ లోని వేరే ఆయతుల్లో కూడా ఈ విషయాన్ని అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా హదీథ్ లో ఈ విషయాన్ని తెలియజేశారు. చెప్పే మాట ఏమిటంటే, నరకంలో వెళ్ళిన తర్వాత అక్కడి నుండి పారిపోదాము, అక్కడి నుండి ఎటైనా వెళ్లిపోదాము, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు స్వర్గంలో దొంగతనంగా వెళ్లిపోదాము అటువంటి అవకాశాలు ఏ మాత్రం ఉండవు. ఇలాంటి మోసం చేసే అటువంటి అధికారం అక్కడ మనకు ఏ మాత్రం రాదు.
ఇది ఇహలోకం, పరీక్షా స్థలం. ఇక్కడ కొన్ని పాపాలు చేసే అటువంటి అధికారాలు కూడా వస్తున్నాయి, ఒకరిని మోసం చేసే అటువంటి శక్తి కూడా మనకు ప్రసాదించబడుతుంది. కానీ, ఇదంతా మనం ఏ శక్తి ఉన్నా, ఏ సామర్థ్యం ఉన్నా, ఆ శక్తి సామర్థ్యాలతో సత్కార్యాలు కూడా చేయవచ్చు. కానీ మనిషి స్వయంగా తప్పుడు ఆలోచనలో పడి పాపాలకు గురి అవుతున్నాడు, నరకానికి చేరువు అవుతున్నాడు. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు తన యొక్క శక్తిని, సామర్థ్యాలను, అన్ని రకాల అల్లాహ్ ప్రసాదించినటువంటి వనరులను మనం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ఆయన్ని రాజీ చేసుకోవడానికి, ఆయన విధేయతలో గడిపే ప్రయత్నం చేయాలి.
ఇంకా మహాశయులారా, నరకం, దాని ప్రతి ద్వారంపై ఎన్నో సందర్భాలలో అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు. కాపలాదారులు కూడా ఉంటారు. ఖురాన్ లోని అనేక సూరాలలో వారి యొక్క ప్రస్తావన వచ్చి ఉంది. అంతేకాదు, ఎవరెవరైతే అల్లాహ్ యొక్క అవిధేయతకు పాల్పడి, అవిశ్వాస మార్గంలో నడుస్తూ నరకంలో పడ్డారో, నరకానికి వారు వెళ్తున్నప్పుడు, ఆ ద్వారంలో ఉన్నటువంటి కాపలాదారులు నరకవాసులను ప్రశ్నిస్తారు కూడా. ఉదాహరణకు, సూరతుజ్ జుమర్ లోని ఆయత్ చదవండి:
وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا… (సూరతుజ్ జుమర్: 71)
వ సీఖల్లజీన కఫరూ ఇలా జహన్నమ జుమరా, హత్తా ఇదా జా’ఊహా ఫుతిహత్ అబ్’వాబుహా వ ఖాల లహుమ్ ఖజనతుహా అలం య’తికుమ్ రుసులుమ్ మిన్కుమ్ యత్’లూన అలైకుమ్ ఆయాతి రబ్బికుమ్ వ యున్దిరూనకుమ్ లిఖా’అ యవ్మికుమ్ హాదా…
అవిశ్వాసులు గుంపులు గుంపులుగా జహన్నమ్ వైపునకు తోలబడతారు. చివరికి వారు అక్కడికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరవబడతాయి. దాని కాపలాదారులు వారితో ఇలా అంటారు: “మీలో నుండి మీ వద్దకు ప్రవక్తలు రాలేదా? వారు మీ ప్రభువు ఆయతులను మీకు చదివి వినిపించి, ఈ దినం యొక్క సమావేశం గురించి మిమ్మల్ని హెచ్చరించలేదా?”
వారు నరకం వద్దకు వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి. అక్కడ కాపలాదారులు వారిని అడుగుతారు, “మీ మధ్యలో, మీ వద్దకు ప్రవక్తలు రాలేదా? మీ వద్దకు అల్లాహ్ యొక్క సందేశాన్ని, అల్లాహ్ యొక్క ఆయతులను పఠించే వారు రాలేదా? మరియు ఈనాటి దినం, ఏ దినానైతే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నదో, ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించేవారు మీ వద్దకు రాలేదా?” ఆ కాపలాదారులు ఇలా ప్రశ్నిస్తారు.
సూరతుల్ ముల్క్, ఈ సూరత్ సమాధి శిక్ష నుండి కాపాడటానికి కూడా ఒక ముఖ్యమైన సబబు అని, మరియు ఈ సూరత్ చదివే వారిని అది సిఫారసు చేసి స్వర్గంలోకి పంపుతుంది, క్షమించబడతాడు ఆ వ్యక్తి అని కూడా మనకు తెలపడం జరిగింది. సామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ సూరత్ చదివేవారు. ఈ సూరాలో కూడా ఆ విషయం వచ్చింది:
كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ (సూరతుల్ ముల్క్: 8)
కుల్లమా ఉల్ఖియ ఫీహా ఫవ్’జున్ స’అలహుమ్ ఖజనతుహా అలం య’తికుమ్ నదీర్.
“ఒక గుంపు అందులో వేయబడినప్పుడల్లా దాని కాపలాదారులు వారిని అడుగుతారు: ‘మిమ్మల్ని హెచ్చరించేవాడు మీ వద్దకు రాలేదా?'”
అందులో ఒకటొకటి వర్గాలు, సైన్యాలు నరకంలో వేయబడినప్పుడు అక్కడ ఆ కాపలాదారులు అడుగుతారు, “మిమ్మల్ని ఈ నరకం నుండి హెచ్చరించే వారు ఎవరూ రాలేదా?” ఈ రోజు మీరు కూడా ఈ హెచ్చరికలు వింటున్నారు. ప్రళయ దినాన ఆ నరక కాపలాదారులు మనల్ని కూడా అలా అడగకుండా మనం ఇహలోకంలోనే ఆ హెచ్చరికలను విని, అల్లాహ్ యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకొని, ఆయన ఆరాధన మాత్రమే చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి సోదర సోదరీమణులారా.
చెప్పే విషయం ఏంటంటే, నరకానికి ద్వారాలు ఉంటాయి. నరకవాసులు అందులో వెళ్ళిన తర్వాత అవి మూయబడతాయి. మరియు ప్రతీ నరకం యొక్క ద్వారంలో దైవదూతలు, కాపలాదారులు ఉంటారు. ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించకుండా, అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన విధంగా చేయకుండా పరలోకంలో చేరుతారో, నరకానికి వెళ్తారో, వారిని ఆ కాపలాదారులు ప్రశ్నిస్తారు, అడుగుతారు కూడా, “మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా?” అని.
అయితే మహాశయులారా, ఆ కాపలాదారులు ఎలాంటి శక్తి గలవారు ఉంటారు? ఎంతటి బలమైన వారు ఉంటారు? ఆ విషయాన్ని కూడా అల్లాహు తఆలా సూరత్ తహ్రీమ్ లో తెలియపరిచాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ (సూరత్ తహ్రీమ్: 6)
యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారవ్ వఖూదుహన్నాసు వల్ హిజారతు అలైహా మలాయికతున్ గిలాజున్ షిదాదుల్ లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్.
“ఓ విశ్వాసులారా! మిమ్మల్ని, మీ సంతానాన్ని ఆ నరకాగ్ని నుండి కాపాడుకోండి, దానికి ఇంధనం ప్రజలు మరియు రాళ్ళు. దానిపై చాలా కఠినులు మరియు బలమైన దైవదూతలు ఉన్నారు. వారు అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించరు మరియు ఏ ఆదేశం ఇవ్వబడుతుందో దాన్ని వారు తప్పకుండా నెరవేరుస్తారు.”
ఆ నరకానికి ఇంధనం ప్రజలు మరియు రాళ్ళు. దానిపై చాలా కఠినులు మరియు బలమైన దైవదూతలు ఉన్నారు. కఠినులు అంటే వారిలో ఎలాంటి మృదుత్వం అనేది, దయా దాక్షిణ్యాలు అనేటివి ఉండవు. ఒకరి పట్ల, అతడు నరకానికి అర్హుడైనప్పుడు దయా దాక్షిణ్యాలతో వారికి శిక్ష ఇవ్వడంలో ఏమైనా తగ్గించడం గానీ, లేదా వారిని కరుణించడం గానీ అలాంటివేమీ జరగకుండా వారు చాలా కఠినులై ఉంటారు. మరియు “షిదాద్” – ఎంతో బలమైన వారు. ప్రపంచంలో ఉన్నటువంటి శూరులందరూ కలిసి, ప్రపంచంలోని సర్వ మానవులు కాదు, జిన్నాతులు కలిసి ఆ ఒక్క దైవదూతను కూడా ఎదుర్కొనే అంతటి శక్తి వారందరిలో ఉండదు. అంతటి శక్తి గలవారు వారు, అంత బలమైన వారు. “అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశాన్ని వారు తూచా తప్పకుండా పాటిస్తారు, రవ్వంత కూడా అవిధేయతకు పాల్పడరు. ఏ ఆదేశం ఇవ్వడం జరుగుతుందో దాన్ని వారు తప్పకుండా నెరవేరుస్తారు.”
ఇలాంటి శక్తి, బలం ఉన్నవారు ఆ దైవదూతలు. వారిని ఎవరూ కూడా ఎదుర్కోలేరు. ఇక ఆ నరకంలో కాపలాదారులు ఎంతమంది ఉంటారు? వారి యొక్క సంఖ్య కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు.
وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ (సూరతుల్ ముద్దథ్థిర్: 31)
వ మా య’లము జునూద రబ్బిక ఇల్లా హువ.
“మరియు నీ ప్రభువు యొక్క సైన్యాల (సంఖ్య) ఆయన తప్ప ఇంకెవరికీ తెలియదు.”
నరకానికి సంబంధించిన మరెన్నో భయంకరమైన వివరాలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగంలో కూడా మనం తెలుసుకుంటూ ఉందాము. జజాకుముల్లాహు ఖైరా. అల్లాహ్ మనందరినీ కూడా నరక శిక్షల నుండి కాపాడుగాక. నరకంలో ప్రవేశించడం నుండి అల్లాహ్ తఆలా మనల్ని రక్షించుగాక. నరకం నుండి దూరం ఉండడానికి ఏ విశ్వాసం, సత్కార్యాలు అవసరమో అవి చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]