నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

ఇక రండి, ప్రళయ దినాన ఆ వంతెన, నరకంపై వేయబడిన వంతెన దాటడానికి దోహదపడే సత్కార్యాల గురించి తెలుసుకుంటాము. అయితే మర్చిపోకండి, ఇంతకు ముందు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఉదాహరణకు, హృదయాంతర సత్యంతో, ఇఖ్లాస్ తో, సంకల్ప శుద్ధితో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదవడం ఒకటి. నమాజ్ పాబందీగా చేయడం మరియు అజాన్ కు సమాధానం పలికి అజాన్ తర్వాత దుఆ చదవడం, రెండవది. మూడో విషయం, ఉదయం సాయంకాలం పది పది సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవడం. నాలుగో విషయం, ఏ ముస్లిం పై కూడా ఎలాంటి అపనింద వేయకపోవడం. అయితే రండి, మరికొన్ని విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము.

మహాశయులారా, నమాజులు ఐదు పూటలు, ఐదు వేళల్లో పాబందీగా చేస్తూ ఉండడం, ప్రత్యేకంగా ఫజ్ర్ నమాజ్. అల్లాహు అక్బర్. మహాశయులారా, వంతెన యొక్క గాంభీర్యత, వంతెన యొక్క కష్టతరం మీరు విని ఉన్నారు. దానిని క్షేమంగా దాటాలనుకుంటే ఫజ్ర్ నమాజ్ లో పడుకొని ఉండకండి. ఫజ్ర్ నమాజ్ సమయంలో మనకి ఇష్టమైన ఆటలు, పాటలు, కార్యక్రమాలు, సీరియళ్లు వస్తూ ఉన్నాయి, వాటిని చూడడంలో నిమగ్నులై నమాజ్ ను విడనాడడం వంతెన దాటడంలో మరింత కష్టతరానికి గురి చేస్తాయి.

ముస్నద్ అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, సునన్ దారిమీ యొక్క ఉల్లేఖన, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు దీనిని సహీ అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ప్రస్తావన చేస్తూ:

مَنْ حَافَظَ عَلَيْهَا كَانَتْ لَهُ نُورًا وَبُرْهَانًا وَنَجَاةً يَوْمَ الْقِيَامَةِ
(మన్ హాఫద అలైహా కానత్ లహూ నూరన్ వ బుర్హానన్ వ నజాతన్ యౌమల్ ఖియామ)
“ఎవరైతే పాబందీగా నమాజ్ చేస్తూ ఉంటారో, ఆ నమాజ్ అతని గురించి కాంతి, అతనికి ఒక నిదర్శన, అతని గురించి మోక్షంగా నిలుస్తుంది ఆ ప్రళయ దినాన.”

అల్లాహు అక్బర్. గమనించండి, కాంతి ఎంత అవసరమో ఇది దాటడానికి, వంతెన దాటడానికి విని ఉన్నారు. మోక్షం కూడా. మరియు ఇది మనం పక్కా విశ్వాసులము అన్నదానికి ఒక నిదర్శన కూడా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథ్ లో తెలుపుతున్నారు. ఈ విధంగా వంతెన దాటడానికి ఇది చాలా అవసరం అని తెలిసింది కదా? ఇక ఎవరైతే నమాజును విడనాడుతారో వారి గతి ఎవరితో అవుతుందో, వారి పరిస్థితి, వారి యొక్క తోడు ఎవరికి లభిస్తుందో అది కూడా వినండి.

وَمَنْ لَمْ يُحَافِظْ عَلَيْهَا لَمْ يَكُنْ لَهُ نُورٌ وَلا بُرْهَانٌ وَلا نَجَاةٌ، وَكَانَ يَوْمَ القِيَامَةِ مَعَ قَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ وَأُبَيِّ بْنِ خَلَفٍ
(వ మల్లమ్ యుహాఫిద్ అలైహా లమ్ యకున్ లహూ నూరున్ వలా బుర్హానున్ వలా నజాహ్, వ కాన యౌమల్ ఖియామతి మఅ ఖారూన వ ఫిర్ఔన వ హామాన వ ఉబయ్యి బ్ని ఖలఫ్)
“ఎవరైతే నమాజ్ పాబందీగా చేయరో, అది వారి గురించి కాంతి, నిదర్శన మరియు మోక్షం కాజాలదు. ప్రళయ దినాన ఇలా నమాజును వదిలిన వ్యక్తి ఖారూన్, హామాన్, ఫిర్ఔన్ మరియు ప్రవక్త కాలంలోని అతి శత్రువుడైన, దుష్టుడైన ఉబై బిన్ ఖల్ఫ్.” ఇలాంటి నలుగురి పేర్లు తీసుకుని ప్రవక్త చెప్పారు, “నమాజ్ వదిలే వ్యక్తి ఇలాంటి నలుగురితో ఉంటాడు” అని.

అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇకనైనా నమాజులు చదవండి సోదరులారా, సోదరీమణులారా. నమాజ్ విషయంలో ఏమాత్రం జాప్యం చేయకండి. సహీహ్ ముస్లింలో వచ్చిన హదీథ్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

وَالصَّلَاةُ نُورٌ
(వస్సలాతు నూర్)
“నమాజ్ నూర్” అని.

మరియు తిర్మిజి, అబూ దావూద్, ఇబ్నె మాజాలో వచ్చిన హదీథ్ ప్రకారం,

بَشِّرِ الْمَشَّائِينَ فِي الظُّلَمِ بِالنُّورِ التَّامِّ يَوْمَ الْقِيَامَةِ
(బష్షిరిల్ మష్షాయీన ఫిజ్జులమి బిన్నూరిత్ తామ్మి యౌమల్ ఖియామతి.)

“ఎవరైతే చీకటి రాత్రుల్లో కూడా నమాజ్ కొరకు నడిచి వెళ్తున్నారో, అలాంటి వారికి ప్రళయ దినాన సంపూర్ణమైన కాంతి, ప్రకాశవంతమైన కాంతి లభిస్తుంది అని శుభవార్త ఇవ్వండి” అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు తబ్రానీలో ఉల్లేఖించబడిన ఈ హదీథ్ కూడా ఎంత గొప్ప శుభవార్త మనకు తెలుపుతుందో ఒకసారి గ్రహించండి.

إِنَّ اللَّهَ لَيُضِيءُ لِلَّذِينَ يَتَخَلَّلُونَ إِلَى الْمَسَاجِدِ فِي الظُّلَمِ بِنُورٍ سَاطِعٍ يَوْمَ الْقِيَامَةِ
(ఇన్నల్లాహ లయుదీఉ లిల్లదీన యతఖల్లలూన ఇలల్ మసాజిది ఫిద్-దులమి నూరున్ సాతిఉన్ యౌమల్ ఖియామ)

“నిశ్చయంగా అల్లాహు తఆలా, ప్రళయ దినాన ప్రకాశవంతమైన గొప్ప నూర్ ప్రసాదిస్తాడు ఎవరికీ? ఎవరైతే చీకటి సమయాల్లో మస్జిదులకు వస్తూ పోతూ ఉంటారో.”

అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం గమనించండి మహాశయులారా. నమాజ్ చదవడంలో వెనక కాకండి. చీకటి సమయాల్లో ఫజ్ర్ నమాజ్ ఉంది. మగ్రిబ్ నమాజ్ కావచ్చు, ఇషా నమాజ్ కూడా ఉంది.

ప్రళయ దినాన వంతెన దాటుతున్నప్పుడు వేగంగా దాటడానికి ఇహలోకంలో ఏ సత్కార్యాలు చేసుకుంటే మనం వేగంగా దాటగలుగుతామో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము.

ఆరో విషయం, జుమా నమాజ్. ఇందులో కూడా వెనక ఉండకుండా పాబందీగా చేస్తూ ఉండడం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ఖతీబ్ ఖుత్బా స్టార్ట్ చేసే సందర్భంలో కొంతమంది మాత్రమే ఉంటారు. చివరి సమయం వరకు మస్జిద్ అంతా నిండిపోతుంది. అలా కాకుండా, మునుముందే జుమా రోజు మస్జిదులోకి వచ్చే ప్రయత్నం చేయాలి. సహీహుల్ జామియాలోని హదీథ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ اللَّهَ يَبْعَثُ الْأَيَّامَ يَوْمَ الْقِيَامَةِ عَلَى هَيْئَتِهَا
(ఇన్నల్లాహ యబ్అసుల్ అయ్యామ యౌమల్ ఖియామతి అలా హైఅతిహా)
“నిశ్చయంగా అల్లాహు తఆలా ప్రళయ దినాన ఈ రోజులను వాటి అసలు రూపంలో లేపుకొని తీసుకొస్తాడు.”

وَيَبْعَثُ الْجُمُعَةَ زَهْرَاءَ مُنِيرَةً لِأَهْلِهَا
(వ యబ్అసుల్ జుముఅత జహ్రాఅ మునీరతన్ లి అహ్లిహా)
మరి ఆ రోజుల్లో జుమా రోజు ఎంతో పుష్పం లాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎవరి గురించి? లి అహ్లిహా (దాని ప్రజల కోసం). ఎవరైతే జుమా నమాజులకు ముందుగా వచ్చి జుమా నమాజుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారో.

ఏడో విషయం, జుమా రోజు సూరతుల్ కహఫ్ చదవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ قَرَأَ سُورَةَ الْكَهْفِ يَوْمَ الْجُمُعَةِ أَضَاءَ لَهُ مِنْ النُّورِ مَا بَيْنَ الْجُمُعَتَيْنِ
(మన్ కరఅ సూరతల్ కహఫి యౌమల్ జుముఅ, అదాఅ లహూ మినన్-నూరి మా బైనల్ జుముఅతైన్)
“ఎవరైతే జుమా రోజు సూర కహఫ్ చదువుతారో, రెండు జుమాల మధ్యలో వారికి నూర్ ప్రసాదించడం జరుగుతుంది.” ఇది కూడా సహీ హదీస్, షేఖ్ అల్బానీ సహీహుల్ జామియాలో ప్రస్తావించారు.

ఎనిమిదో సత్కార్యం, సూర బఖరా, సూరతుల్ ఆలి ఇమ్రాన్ చదువుతూ ఉండే అలవాటు చేసుకోవడం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

اقْرَءُوا الزَّهْرَاوَيْنِ : الْبَقَرَةَ وَآلَ عِمْرَانَ
(ఇఖ్రఊ అజ్-జహరావైన, అల్-బఖరత వ ఆలి ఇమ్రాన్)
“జహరావైన్ (ప్రకాశించే రెండు సూరాలను) చదవండి, బఖరా మరియు ఆలి ఇమ్రాన్.” జహరావైన్, దీని వ్యాఖ్యానంలో ఇమాం మునావీ రహమహుల్లాహ్ చెప్పారు,

النَّيِّرَتَيْنِ
(అన్-నయ్యిరతైన్)
అంటే, ప్రకాశవంతమయ్యే రెండు కాంతుల్లాంటి సూరాలు అని. ఈ హదీథ్ ముస్లిం షరీఫ్ లో ఉంది.

వంతెనను వేగవంతంగా దాటడానికి దోహదపడే సత్కార్యాల్లో మరొకటి, న్యాయం పాటించడం, అన్యాయం, దౌర్జన్యాన్ని విడనాడడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ
(ఇత్తకుద్-దుల్మ, ఫఇన్నద్-దుల్మ దులుమాతున్ యౌమల్ ఖియామ)
“మీరు అన్యాయం, దౌర్జన్యం చేయడం మానుకోండి. నిశ్చయంగా దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లు చీకట్లతో వస్తుంది.”

అల్లాహు అక్బర్. అంటే, ఎవరైతే ఇహలోకంలో దౌర్జన్యం చేస్తారో వారికి పరలోకంలో కాంతి అనేది, నూర్ అనేది లభించదు. వారికి చీకటే చీకటి ఉంటుంది.

మరో సత్కార్యం, పదోవ సత్కార్యం, హజ్ లో తల వెంట్రుకలు తీయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

وَإِذَا حَلَقَ رَأْسَهُ فَلَهُ بِكُلِّ شَعْرَةٍ سَقَطَتْ مِنْ رَأْسِهِ نُورٌ يَوْمَ الْقِيَامَةِ
(వ ఇదా హలఖ రఅసహూ, ఫలహూ బికుల్లి షఅరతిన్ సఖతత్ మిన్ రఅసిహీ నూరున్ యౌమల్ ఖియామ)
“హాజీ తన యొక్క క్షౌరం చేయిస్తున్న సందర్భంలో, అతని తల నుండి పడే ప్రతీ వెంట్రుకకు బదులుగా ప్రళయ దినాన ఒక నూర్, ఒక కాంతి లభిస్తుంది.” అల్లాహు అక్బర్.

మహాశయులారా, నరకంపై వేయబడిన వంతెనను వేగంగా దాటాలనుకుంటున్నారా? పదకొండవ సత్కార్యం, ధర్మ విద్యను అభ్యసించడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎంత మంది వెనకపడి ఉన్నారు. ఎంత మంది దీని విషయంలో వెనకపడి ఉన్నారు? వినండి ఈ హదీథ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَا مِنْ رَجُلٍ يَسْلُكُ طَرِيقًا يَطْلُبُ فِيهِ عِلْمًا إِلَّا سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
(మా మిన్ రజులిన్ యస్లుకు తరీఖన్ యత్లుబు ఫీహి ఇల్మన్, ఇల్లా సహ్హలల్లాహు లహూ బిహీ తరీఖన్ ఇలల్ జన్న)
“ఎవరైతే ఒక దారిలో నడుస్తాడో, ఎందుకు నడుస్తున్నాడు ఆ దారిలో? ధర్మ విద్య నేర్చుకోవడానికి అతను వెళ్తున్నాడు ఆ దారిలో నడుస్తూ. అల్లాహ్ అతని గురించి, అతని దారిని స్వర్గం వైపునకు సులభతరంగా చేస్తాడు.” అల్లాహు అక్బర్.

وَمَنْ أَبْطَأَ بِهِ عَمَلُهُ لَمْ يُسْرِعْ بِهِ نَسَبُهُ
(వ మన్ అబ్తఅ బిహీ అమలుహూ లమ్ యుస్రిఅ బిహీ నసబుహూ)
“మరి ఎవరి ఆచరణ అతడిని వెనకపడేస్తుందో, అతని ఖాన్దాన్, పాన్దాన్, అతని యొక్క వంశం అతనిని ముందుకు తీసుకెళ్లలేదు.”

ఇమాం ఇబ్నె రజబ్ రహమతుల్లాహ్ అలైహ్ తెలిపారు, ఇక్కడ అల్లాహు తఆలా అతని యొక్క ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఆ దారి అంటే ఎన్నో భావాలు కావచ్చు, అందులో ఒక భావం, స్వర్గం వైపునకు దారి ఏమిటి? నరకంపై ఉన్నటువంటి వంతెన కూడా. అల్లాహు అక్బర్. అందుకు ముందుకు రండి. ధర్మ విద్య నేర్చుకోండి.

ఇంకా మహాశయులారా, మరో సత్కార్యం, ప్రజల అవసరాలు తీర్చడం. దీనికి సంబంధించిన చాలా పొడవైన హదీస్ ఉంది. ఆ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఎవరైతే తన సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి ఒక దారిలో నడుస్తాడో, దాన్ని తీర్చే అంత వరకు అతను స్థిరపడడో, అల్లాహు తఆలా ప్రళయ దినాన ఎక్కడెక్కడైతే ప్రజల పాదాలు స్థిరపడకుండా జారుతూ ఉంటాయో, కదులుతూ ఉంటాయో అక్కడ అల్లాహ్ వారి యొక్క పాదాలను స్థిరపరుస్తాడు.” మరియు మీరు ఇంతకు ముందే విని ఉన్నారు, గత కార్యక్రమాలు విని ఉంటే, వంతెనలో ఒక అతి భయంకరమైన విషయం ఏమిటి? జారుడు ఉంటుంది. ఇల్లా మన్షా అల్లాహ్. అల్లాహ్ ఎవరి పట్ల తన కరుణతో కాపాడుకుంటాడో వారిని తప్ప అది అందరినీ జారివేస్తుంది. అందరి పాదాలు, కాళ్లు జారుతూ ఉంటాయి దాని మీద.

మరొక ముఖ్య విషయం సోదరులారా, మన జీవితాల్లో ఒకవేళ మనం ఈ హదీథ్ ను ఆచరించామంటే, ఇన్షా అల్లాహ్ ప్రళయ దినాన వంతెనను దాటడంలో ఈ ఆచరణ కూడా, ఈ సత్కార్యం కూడా మనకు దోహదపడుతుంది. అదేమిటి? ఎప్పుడైతే మన గడ్డంలో గానీ, మన తల వెంట్రుకల్లో గానీ తెలుపు వెంట్రుకలు రావడం మొదలవుతాయో, కొందరు చూసేవాళ్లు నన్ను ఇప్పుడే ముసలివాడుగా భావిస్తారు, నేను వృద్ధుడినై పోయాను, వయసు పైబడిన వానినైపోయాను అని ప్రజలు భావిస్తారు అని షేవింగ్ చేసుకుంటారు, గుండు గీకించుకుంటారు, మరికొందరు ఆ తెల్ల వెంట్రుకలు తీసేస్తారు. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ వినండి.

مَنْ شَابَ شَيْبَةً فِي الْإِسْلَامِ كَانَتْ لَهُ نُورًا يَوْمَ الْقِيَامَةِ
(మన్ షాబ షైబతన్ ఫిల్ ఇస్లాం, కానత్ లహూ నూరన్ యౌమల్ ఖియామ)
“ఇస్లాంలో ఉండి, ఇస్లాం పై జీవిస్తూ ఎవరి శరీరంలోనైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో, అవి వారి గురించి ప్రళయ దినాన కాంతిగా నిలుస్తాయి.”

ప్రవక్త యొక్క ఈ హదీథ్ వింటున్న సహచరుల్లో ఒక వ్యక్తి అడిగాడు, “ప్రవక్తా, మనలో కొందరు ఉన్నారు, యంతిఫూనష్-షైబ్ (తెల్ల వెంట్రుకలను పీకేస్తారు). ఇలాంటి తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంటే తీసేస్తారు, పీకేస్తారు.” ప్రవక్త ఏమన్నారో తెలుసా? “ఇష్టమైన వారు తమ ఆ కాంతిని పీకేసుకోండి. ఉంచుకోండి, ఉంచుకుంటే ఆ కాంతి లభిస్తుంది, తీసేసుకుంటే ఆ కాంతిని తీసేసుకున్న వారు అవుతారు.” అల్లాహు అక్బర్.

మరొక హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు,

لَا تَنْتِفُوا الشَّيْبَ فَإِنَّهُ نُورٌ يَوْمَ الْقِيَامَةِ
(లా తంతిఫుష్-షైబ్, ఫఇన్నహూ నూరున్ యౌమల్ ఖియామ)
“తెల్ల వెంట్రుకలు ఏవైతే వస్తున్నాయో వాటిని తీయకండి. ప్రతి వెంట్రుకకు బదులుగా నూర్ అనేది ప్రళయ దినాన లభిస్తుంది.”

అంతేకాదు, మరొక శుభవార్త కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరొక శుభవార్త కాదు మూడు శుభవార్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఏమిటి? ఆ నూర్, కాంతి యొక్క శుభవార్త కాకుండా మరో మూడు శుభవార్తలు. “మన్ షాబ ఫిల్ ఇస్లామి షైబతన్ (ఇస్లాం స్థితిలో ఎవరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయో), ప్రతి వెంట్రుకకు బదులుగా ఒక పుణ్యం రాయబడుతుంది, ఒక పాపం తుడిచి వేయడం జరుగుతుంది, ఒక స్థానం పెంచడం జరుగుతుంది.” అల్లాహు అక్బర్. అల్లాహ్ కొరకు ఇకనైనా మీరు షేవ్ చేసుకోకండి. గడ్డాలు కత్తిరించకండి. ఎలాంటి సిగ్గు పడకుండా దానిని అదే స్థితిలో వదలండి. ఈ రోజుల్లో కొంతమంది తమ యొక్క ఆ ముసలితనాన్ని, తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి మైదాకు పేరు మీద, హిన్నా, ఖిదాబ్ పేరు మీద, ఆ రోజుల్లో హిన్నా, ఖిదాబ్ ఇవన్నీ ఎరుపుతనానికి దగ్గరగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో బ్రౌన్ అని, బ్రౌన్ పేరు మీద బ్లాక్ కూడా ఉపయోగిస్తున్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి బ్లాక్ హిన్నా ఉపయోగించడాన్ని నిషేధపరిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, “ఎవరైతే ఈ బ్లాక్ ఖిదాబ్ యూజ్ చేస్తారో, నల్లటి ఖిదాబ్ ఉపయోగిస్తారో, వారిపై స్వర్గం యొక్క సువాసన కూడా నిషిద్ధం ఉంది” అని హెచ్చరించారు.

మహాశయులారా, ప్రళయ దినాన మనకు నూర్, కాంతి లభించాలని అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి. అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి.

رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا
(రబ్బనా అత్మిమ్ లనా నూరనా)
“ఓ మా ప్రభూ! మా కోసం మా కాంతిని పరిపూర్ణం చేయి.”

అయితే, ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఒక దుఆ కూడా మనకు నేర్పి ఉన్నారు. ప్రత్యేకంగా మస్జిద్ కు వెళ్తున్న సందర్భంలో ప్రవక్త ఈ దుఆ చదువుతూ ఉండేవారు. హిస్నుల్ ముస్లిం చిన్నపాటి పుస్తకం, అందులో ఈ దుఆ ఉంది. చదవండి, నేర్చుకోండి. ధర్మ జ్ఞానం, ధర్మ విద్య అభ్యసిస్తూ ఉండండి, కాంతి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది.

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَفِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا. اللَّهُمَّ أَعْطِنِي نُورًا
(అల్లాహుమ్మ జ్’అల్ ఫీ ఖల్బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వ ఫీ సమ్’ఈ నూరా, వజ్’అల్ ఫీ సమ్’ఈ నూరా, వజ్’అల్ ఫీ బసరీ నూరా, వజ్’అల్ మిన్ ఖల్ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్’అల్ మిన్ ఫౌఖీ నూరా, వ మిన్ తహ్తీ నూరా. అల్లాహుమ్మ అ’తినీ నూరా)

“ఓ అల్లాహ్! నా హృదయంలో కాంతిని ప్రసాదించు, నా నాలుకలో కాంతిని ప్రసాదించు, నా వినికిడిలో కాంతిని ప్రసాదించు, నా చూపులో కాంతిని ప్రసాదించు, నా వెనుక కాంతిని ప్రసాదించు, నా ముందు కాంతిని ప్రసాదించు, నా పైన కాంతిని ప్రసాదించు, నా కింద కాంతిని ప్రసాదించు. ఓ అల్లాహ్! నాకు కాంతిని ప్రసాదించు.”

ఈ దుఆ యొక్క పదాలు నేను ఏదైతే మీకు తెలిపానో, ముస్లిం షరీఫ్ లోని ఒక ఉల్లేఖనంలో ఉన్నాయి. అయితే మరి కొన్ని ఉల్లేఖనాల్లో ఇంతకంటే ఎక్కువ దుఆ కూడా ఉంది. సుమారు పద్నాలుగు మన శరీర అవయవాల్లో మనకు నూర్ అల్లాహ్ ప్రసాదించాలి అని దుఆ చేయడం జరిగింది.

అయితే మహాశయులారా, ఈ విధంగా ఈరోజు మనం నరకంపై వేయబడే వంతెన వేగంగా దాటడానికి ఎలాంటి సత్కార్యాలు ఇహలోకంలో అధికంగా, ఎక్కువగా చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనే విషయాలు తెలుసుకున్నాము. అల్లాహ్ వాటన్నిటిని ఆచరిస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. మన కాంతి ఇంకా ఎక్కువగా పెరగాలి అంటే మనం ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా నేర్పుతూ ఉండాలి, తెలుపుతూ ఉండాలి. అల్లాహ్ తఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

వ ఆఖిరు దావానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]