మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన)
[మరణానంతర జీవితం – పార్ట్ 51] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kjbs6O5YVHI
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వసలామున్ అలా ఇబాదిల్లజీనస్తఫా అమ్మా బాద్.
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.
మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.
వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా.
(وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا)
అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.
మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.
మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్‌లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:
బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్.
(بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ)
అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.
ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.
ఏ విషయం అల్లాహ్ తెలిపాడో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో, వాటిని మనం తప్పకుండా నమ్మాలి. నమ్మిన తర్వాత వాటిలో ఏ విషయాలైతే శుభకరమైనవియో వాటిని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయాలైతే భయంకరంగా, శిక్షాపరంగా ఉన్నాయో, మనం వాటిని తప్పించుకొనుటకు ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు, నరకంపై వేయబడే ఈ వంతెన విషయం మనం మాట్లాడుకుంటున్నాము. అది ఇంత పదునుగా, ఇంత సన్నగా ఉన్నదని మనకు తెలిసినప్పటికీ, కొంచెం జారిపడితే నరకంలో పడిపోతాము అని తెలిసినప్పటికీ, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్త ఏమి ఇచ్చారంటే, అది చాలా పొడుగైనప్పటికీ కొందరు విశ్వాసులు, సత్కార్యం చేసే పుణ్య పురుషులు ఎలా ఉంటారంటే కనురెప్ప ఎంత తొందరగా, మనం ఇలా అనేసరికి సెకండ్ కూడా పట్టదు కదా, అంతకంటే మరీ తక్కువ సమయంలో వారు ఆ వంతెనను దాటేస్తారు. ఆ వివరాలు, ఆ హదీసులు నేను ఇక తెలుపనున్నాను, కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఎలాంటి సందేహానికి గురి కాకుండా వాటిని తప్పకుండా నమ్మాలి. అలాంటి విశ్వాసం, అలాంటి సత్కార్యాల్లో ముందుకు వెళ్లి మనం ఆ వంతెనను కూడా చాలా వేగంగా దాటేసే ప్రయత్నం చేసే వాళ్ళల్లో కలవడానికి అల్లాతో దుఆ కూడా చేస్తూ ఉండాలి.
మన పూర్వీకులు, సహాబాలు, సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్, నరకంపై వంతెన విషయం వస్తే ఎలా భయకంపితులై కంటతడి పెట్టేవారో ఆ విషయాలు కూడా మనం విందాము. కానీ వాటికంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు వినండి. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ముస్నద్ అహ్మద్, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకిం లోని హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామిఅ లో ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 8081. ఏమిటి హదీస్ అది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
ప్రజలు వంతెనపై వస్తారు మరియు తమ కర్మల ప్రకారం దాన్ని దాటి వెళ్తారు. దాన్ని దాటి వెళ్ళే వారిలో వేగం ప్రకారంగా ఎన్ని రకాల వారు ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, గమనించండి.
- క లమ్‌హిల్ బసర్ (كَلمحِ البَصَرِ): కనురెప్పపాటులో. అంత సేపట్లో, అంతకంటే తక్కువ సమయంలో కొందరు దాటేస్తారు.
- సుమ్మ క మర్రిర్ రీహ్ (ثُمَّ كَمَرِّ الرِّيحِ): మరికొందరు వేగవంతమైన గాలి మాదిరిగా దూసుకెళ్తారు.
- సుమ్మ క హదరిల్ ఫురుస్ (ثُمَّ كَحُضْرِ الْفَرَسِ): మరికొందరు గుర్రపు రౌతు ఎలా పరుగెడతాడో ఆ విధంగా దాటేస్తారు.
- సుమ్మ కర్రాకిబి ఫీ రిహ్లతిన్ (ثُمَّ كَالرَّاكِبِ فِي رَحْلِهِ): మరికొందరు ప్రయాణంలో ఒక ప్రయాణి ఎలా వేగంతో వెళ్తాడో ఆ విధంగా.
- సుమ్మ క షద్దిర్ రజుల్ (ثُمَّ كَشَدِّ الرَّجُلِ): ఆ తర్వాత మనిషి సామాన్యంగా పరిగెత్తితే ఎలా పరిగెడతాడో ఆ విధంగా దాటేస్తారు.
- సుమ్మ క మషిహీ (ثُمَّ كَمَشْيِهِ): మరికొందరు నడుస్తూ నడుస్తూ వెళ్తారు.
మరో ఉల్లేఖనంలో కొందరు పాకుతూ, ఎలాగైతే చిన్న పిల్లలు వారు లేవడానికి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ పడిపోతూ లేస్తారో ఆ విధంగా. అయితే మహాశయులారా, నరకంపై వేయబడిన వంతెన మీద దాటే వారు ఈ ఆరు రకాలుగా ఉంటారని, మరి కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఏడు రకాల వారుగా ఉంటారని కూడా తెలుస్తుంది.
దీని విషయం వస్తేనే మన సలఫె సాలిహీన్, మన పూర్వీకులు ఎలా భయకంపితులయ్యేవారో ఈ కొందరి సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది.
అబూ మైసరా రహిమహుల్లాహ్ పడుకోవడానికి తన పడక మీద వచ్చినప్పుడు చాలా ఏడుస్తూ ఉండేవారు. మరియు “యా లైత లమ్ తలిద్నీ ఉమ్మీ!” (అయ్యో నా తల్లి నన్ను కని ఉండకపోతే ఎంత బాగుండును) అని అనేవారు. ఇలా అనుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. దగ్గర ఉన్న వారు, “మిమ్మల్ని ఏ విషయం ఏడిపిస్తుంది? ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగితే, “ఖురాన్ లోని ఈ ఆయతు చదవలేదా? ‘వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా’ (నరకంపై వంతెన వేయబడుతుంది, ఆ వంతెన మీదికి వస్తారు), నరక జ్వాలలు వారి వరకు చేరుతున్నట్లుగా వారికి ఏర్పడుతుంది, అల్లాహు తాలా ‘వారిదుహా’ అని చెప్పాడు, ‘వస్తారు’ అని. కానీ అందులో నుండి బయలుదేరుతారు అన్న విషయం అల్లాహ్ చెప్పలేదు కదా, మరి నేను ఒకవేళ దానిలో నుండి దాటే వాడిని కాకుంటే ఎంత నష్టంగా ఉంటుందో కదా!” అని భయపడుతూ ఉండేవారు.
అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఉల్లేఖించారు, హసన్ బస్రీ రహమతుల్లా అలైహి ఒక వ్యక్తిని అడిగాడు, “నరకం మరియు నరకంపై వేయబడిన వంతెన వద్దకు నువ్వు వస్తావు కదా?” అతడన్నాడు, “అవును, ఖురాన్ లో ఈ ప్రస్తావన ఉంది.” “మరి దాన్ని దాటేస్తావా?” “ఆ విషయం తెలియదు కదా.” “ఆ విషయం తెలియనప్పుడు మరి నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఎలా జీవితం మనం గడప గలుగుతాము?” అని హసన్ బస్రీ రహమహుల్లాహ్ తెలియజేశారు. ఆ తర్వాత ఆ మనిషిని ఎప్పుడూ నవ్వుతూ ఉండగా చూడడం జరగలేదు.
మరి కొన్ని సంఘటనలు ఉన్నాయి. ముసన్నఫ్ అబ్దుర్ రజాక్ లో, ఖైస్ బిన్ అబీ హాజిమ్ ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తాలా అన్హు ఒకసారి తన ఆవిడ ఒడిలో తల పెట్టి ఏడవడం మొదలుపెట్టారు. ఆమె కూడా రోదించడం మొదలుపెట్టింది. కొంతసేపటి తర్వాత అబ్దుల్లా బిన్ రవాహా అడిగాడు, “ఎందుకు ఏడుస్తున్నావు నీవు?” అని. ఆమె చెప్పింది, “నువ్వు ఏడుస్తున్నావు, అందుకని నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చాను.” అప్పుడు అబ్దుల్లా బిన్ రవాహా అన్నారు, “వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా” (మీలో ప్రతీ ఒక్కడూ కూడా ఆ నరకం వైపునకు వస్తాడు, దానిపై ఉన్న వంతెన వద్దకు వస్తాడు) అన్న ఆయతు నేను చదివాను, అందుకు నాకు ఏడుపు వచ్చింది. భయం ఏమి కలిగిందంటే, దాన్ని దాటేసి మనం మోక్షం పొందే వారిలో కూడా కలుస్తామా లేదా అన్న విషయం తెలియదు కదా అని.
ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎందరో పుణ్యాత్ముల, పుణ్య పురుషుల సంఘటనలు మన ముందుకు వస్తాయి. ఇవన్నీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజు కూడా మన పరిస్థితి అలా ఉండాలి. ఆ వంతెన, దానిని దాటడం, దాని వరకు రావడం మనలోని ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి పరిస్థితిగా ఉంటుంది. కానీ మనలో ఎవరు దానిని దాటి వెళ్తారు, అటువైపున స్వర్గంలోకి చేరుతారు, మరి ఎవరు జారిపడి నరకంలోనే పడిపోతారు, అది అల్లాహ్ యే గుర్తెరుగుగాక. కానీ, కొన్ని సత్కార్యాల గురించి ప్రత్యేకంగా తెలపడం కూడా జరిగింది. వాటిని మనం శ్రద్ధగా పాటిస్తూ ఉంటే, అల్లా దయతో మనం దానిని దాటి మోక్షం పొందిన వారిలో కూడా కలవవచ్చు.
మహాశయులారా, వంతెన వరకు రావడం, దానిని దాటే ప్రయత్నం చేయడం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి విషయం. కానీ, ఆ వంతెన వరకు రాకముందు మరో ఆందోళనకరం, భయంకరం, మహా ఘోరమైన పరిస్థితి ఒకటి ఎదురవుతుంది. అదేమిటంటే చిమ్మని చీకటి ఏర్పడుతుంది. అక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు వేరు వేరు చేయబడతారు. ఆ సందర్భంలో విశ్వాసుల్లో కూడా ఎవరికి ఎంత విశ్వాసం ఉందో, ఎవరు ఎన్ని సత్కార్యాలు చేసేవారో ఇహలోకంలో ఉన్నప్పుడు, దాని ప్రకారమే వారికి ఒక కాంతి లభించును. ఆ కాంతి, దాని ప్రాముఖ్యత ఎంత గొప్పది, అది లభించిన వారు ఎంత అదృష్టవంతులు, లభించని వారు ఎంత దురదృష్టవంతులో ఆ రోజు తెలుస్తుంది. దాని యొక్క ఒక చిన్న వివరాన్ని అల్లాహు తాలా ఖురాన్ లో తెలియజేసి దాని ప్రాముఖ్యతను గురించి చాటి చెప్పాడు. అయితే మనం ఆ చిమ్మని చీకటి కమ్ముకొని ఉన్న సందర్భంలో కాంతిని పొందాలి, ఆ కాంతి మన కొరకు ప్రకాశించాలి, మనం ఆ చీకటిలో నడవడానికి మనకు ఆ కాంతి దోహదపడాలి అంటే తప్పకుండా ఆ ఖురాన్ ఆయతులను చదవాలి. అందులో ఏ ఉత్తమ గుణాలు, ఏ ఉత్తమ క్యారెక్టర్, ఏ ఉత్తమ కర్మలు అవలంబించాలన్నట్లుగా మనకు తెలియజేయడం జరిగిందో వాటిని మనం అవలంబించాలి. చదవండి ఆ ఆయతులు.
(يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ)
అనువాదం: ఆ రోజు నీవు విశ్వాసులైన పురుషులను మరియు స్త్రీలను చూస్తావు. వారి యొక్క కాంతి (నూర్) వారి ముందుగా, వారి కుడి ప్రక్కన నడుస్తూ ఉంటుంది. (వారికి ఇలా చెప్పబడుతుంది) “ఈ రోజు మీకు శుభవార్త, కింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు (మీకోసం ఉన్నాయి), వాటిలో మీరు శాశ్వతంగా ఉంటారు. ఇదే గొప్ప విజయం, గొప్ప సాఫల్యం.”
(يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِن قِبَلِهِ الْعَذَابُ)
అనువాదం: ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు స్త్రీలు, విశ్వాసులతో అంటారు, “మా కోసం కొంచెం వేచి ఉండండి, మీ కాంతి నుండి మేము కూడా కొంత భాగం పొందుతాము.” (వారికి) చెప్పబడుతుంది, “మీరు వెనకకే వెళ్ళండి, అక్కడే మీ కాంతిని వెతుక్కోండి.” అప్పుడు వారి మధ్యలో ఒక గోడ ఏర్పాటు చేయడం జరుగుతుంది, దానికి ఒక ద్వారం ఉంటుంది. దాని లోపలి భాగంలో కరుణ ఉంటుంది మరియు దాని వెలుపల, బయటి భాగంలో శిక్ష అనేది ఉంటుంది.
(يُنَادُونَهُمْ أَلَمْ نَكُن مَّعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَٰكِنَّكُمْ فَتَنتُمْ أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّهِ وَغَرَّكُم بِاللَّهِ الْغَرُورُ)
అనువాదం: వారు (కపట విశ్వాసులు) వారిని (విశ్వాసులను) పిలుస్తూ, “మేము (ప్రపంచంలో) మీతో కూడా లేమా?” అని అంటారు. వారు అంటారు, “అవును, కానీ మీరు మిమ్మల్ని మీరే సంక్షోభంలో పడవేసుకున్నారు, (మాపై ఆపదలు రావాలని) వేచి చూశారు, సందేహించారు మరియు అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు మిమ్మల్ని మిథ్యా ఆశలు మోసం చేశాయి. మరియు ఆ మోసగాడు (షైతాన్) అల్లాహ్ విషయంలో మిమ్మల్ని మోసంలో పడవేశాడు.”
మహాశయులారా, సూరె హదీద్ లోని ఈ ఆయతులు చదవండి. వీటి ద్వారా గుణపాఠం నేర్చుకోండి. విశ్వాసులు అక్కడ రబ్బనా అత్మిమ్ లనా నూరనా వగ్ఫిర్ లనా (ఓ మా ప్రభువా, మా కొరకు మా కాంతిని సంపూర్ణం చెయ్యి మరియు మమ్మల్ని క్షమించు) అని దుఆ చేస్తూ ఉంటారు.
ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నరకంపై వంతెన వేయబడిన సందర్భంలో, అల్లాహు తాలా విశ్వాసులకు కాంతిని ప్రసాదిస్తాడు మరియు కపట విశ్వాసులకు కూడా కాంతిని ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడైతే కపట విశ్వాసులు ఆ వంతెనకు దగ్గరగా అవుతారో, వారి యొక్క కాంతి, వారికి ఇవ్వబడిన కాంతి కాంతి విహీనంగా చేయడం జరుగుతుంది, దానిలోని ప్రకాశాన్ని అల్లాహు తాలా తీసుకుంటాడు. అందులో వెలుతురు అనేది ఉండదు. ఎప్పుడైతే వారు విశ్వాసులను చూస్తారు, వారి వద్ద ఉన్న కాంతి ప్రకాశిస్తుంది, అప్పుడు వారు అంటారు, “మీరు కొంచెం వ్యవధిని ఇవ్వండి, మేము కూడా మీ యొక్క కాంతి ద్వారా లాభం పొంది మీతో పాటు వస్తాము, మరియు ఆ నరకంపై ఉన్న వంతెనను దాటేస్తాము.” ఆ సందర్భంలో విశ్వాసులు తమకు ఇవ్వబడిన కాంతి ఏదైతే ఉందో, అది ప్రకాశవంతంగా ఉండాలి అన్నట్లుగా అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎవరు కూడా ఎవరినీ కూడా గుర్తు చేయకుండా ఉంటారు. అల్లాహు అక్బర్, గమనించండి.
మహాశయులారా, ఈ విధంగా విశ్వాసులను, అవిశ్వాసులను వేరు వేరు చేసిన తర్వాత, వారు ఎప్పుడైతే వంతెన వైపునకు వెళ్తుంటారో, అప్పుడు చిమ్మని చీకటి కమ్ముకుంటుంది. ప్రతీ ఒక్కరికీ కాంతి ఇవ్వబడుతుంది. మరియు మొట్టమొదటి వర్గం, ఎవరైతే ఆ వంతెనను దాటుతారో, వారు ఎలాంటి వారు, ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించేవారు, ఆ 70,000 మంది వారు దాటుతారు అని సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతీ మనిషికి, విశ్వాసునికి, అవిశ్వాసునికి, వంచకునికి ఒక నూర్ అనేది లభిస్తుంది. కానీ వారు వంతెన వద్దకు వచ్చేటప్పటికీ, కేవలం అసలైన విశ్వాసులు, సత్కార్యాలు చేసే ఉత్తమ పురుషులు, వారి యొక్క నూర్ (కాంతి) అనేది మిగిలి ఉంటుంది. మిగతా వారందరి కాంతి అనేది ప్రకాశవంతంగా ఉండదు, అది కాంతి విహీనం అయిపోతుంది.
ఆ తర్వాత వారు ఆ వంతెనను దాటుతూ ఉంటారు, దానికి కొన్ని కొండ్లు ఉంటాయి. దానిపై దాటే వారిని పట్టి లాగి కిందికి పడవేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. కానీ తొలిసారిగా దానిని దాటే వారు, వారి యొక్క ముఖాలు పున్నమి చంద్రుని రాత్రిలో పున్నమి చంద్రుని మాదిరిగా మెరుస్తూ ఉంటాయి. వారే ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించే 70,000 మంది. మళ్ళీ ఆ తర్వాత ఎవరైతే ఆ వంతెనను దాటుతారో, ఆ తర్వాత స్థానంలో ఉన్నవారు వారు ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం ఎలా మెరుస్తుందో ఆ విధంగా వారు మెరుస్తూ ఉంటారు.
మహాశయులారా, ఈ వంతెనకు సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి మరియు అలాగే ఏ సత్కార్యాల ద్వారా వంతెనను మనం వేగంగా దాటవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాము.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]