మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 18] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=5Hpmj-eG9oE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబీయ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ .అమ్మాబాద్.
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి అంశం: ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారసు చెల్లుతుంది?
మహాశయులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహ్ ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా గాని మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియజేశారు. ఉదాహరణకు ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఖురాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది? ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో, దాని పారాయణం చేస్తూ ఉంటారో, దాని పారాయణంతో పాటు అర్థ భావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి, అవస్థకు గురి అయినప్పుడు ఖురాన్ ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో, ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు. అలాగే మిగతా విషయాలు కూడా. అందుగురించి ఈ శీర్షికను కూడా వినడం, దీనిని గ్రహించడం చాలా అవసరం. ,
మహాశయులారా! మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన, ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి షఫాఅతె ఉజ్మా ఆ మహా మైదానంలో మకామె మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫారసు యొక్క హక్కు లభిస్తుంది. అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్, నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారికి బయటికి తీయడం, స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం. స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరీ ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు. అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడం. ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము. అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత రెండవ స్థానంలో ఇతర ప్రవక్తలందరూ కూడా. ఇతర ప్రవక్తలందరూ వారికి కూడా అల్లాహు తాలా కొన్ని సందర్భాలలో సిఫారసు చేసే హక్కు ఇస్తాడు. వారు సిఫారసు చేసినందుకు అల్లాహు తాలా ఎంతో మందిని క్షమించడం, ఎంతో మందిని నరకం నుండి వెలికి తీయడం ఇది జరుగుతూ ఉంటుంది.
దీనికి సంబంధించిన ఆధారాల్లో ఇంతకుముందు కూడా ఒక రెండు ఆధారాలు మనం విని ఉన్నాము. కానీ ఇప్పుడు మరో కొత్త హదీస్ మీరు ఇంతకుముందు వినని ఒక హదీస్ ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. సహీ ఇబ్నె హిబ్బాన్ హదీస్ నెంబర్ 70 389 ఒక వ్యక్తి హజరత్ అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తాలా అన్హు తో ప్రశ్నించాడు: ఓ అబూ సయీద్! నీవు ఖురాన్ లోని ఒక వాక్యం ఒక ఆయత్ రుబమా యవద్దుల్లజీన కఫరూ లౌ కానూ ముస్లిమీన్ ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో విన్న హదీస్ ఏదైనా ఉంటే నాకు తెలియజేయు. అప్పుడు అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తాలా అన్హు ఇలా తెలిపారు. యుఖ్రిజుల్లాహు నాసమ్ మినల్ ముమినీన మినన్నార్ బాదమా యఅఖుదు నిక్మ హు మిన్హుమ్ అల్లాహు తాలా విశ్వాసులలో కొందరిని నరకం నుండి బయటికి తీస్తాడు. వారు వారి పాపాలకు అనుగుణంగా కొంత శిక్ష వారికి ఇచ్చిన తర్వాత. ఈ నరకం నుండి తీయడం ఎలా జరుగుతుందంటే, ఈ విశ్వాసులు వారి వేరే కొన్ని పాపాల కారణంగా నరకంలో వేయబడతారు. అదే నరకంలో వారితో పాటు బహుదైవారాధకులు, ముష్రికులు, అవిశ్వాసులు కూడా ఉంటారు. అయితే కొందరు అవిశ్వాసులు, కొందరు ముష్రికులు ఇహలోకంలో కొన్ని సందర్భాలలో ఎలా విశ్వాసులను ఎత్తి పొడుస్తూ ఉంటారో అలాగే నరకంలో కూడా వారు ముస్లింలను హేళన చేద్దామన్న ఉద్దేశంతో వారిని ఎత్తి పొడుస్తూ అలయ్ సకుంతుం తజ్ఉమూన ఫిద్దునియా అన్నకుం ఔలియా ఫమాలకుం మాఅనా ఫిన్నార్ ప్రపంచంలో మీరు మేము అల్లాహ్ యొక్క ఔలియా, మేము అల్లాహ్ యొక్క సన్నిహితులము, మేము అల్లాహ్ కు ప్రియమైన దాసులము అని మీరు అంటూ ఉండేవారు కదా! మరి ఎందుకు ఈరోజు మాతో మీరు నరకంలో ఉన్నారు? అవిశ్వాసులు అన్న ఈ మాట అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కు కూడా తెలుస్తుంది. అల్లాహ్ కు వారు అన్న ఈ మాట తెలుసు. అయితే అల్లాహు తాలా ప్రవక్తలకు, దైవదూతలకు ఆ నరకవాసుల పట్ల సిఫారసు చేయడానికి అనుమతిస్తాడు. అప్పుడు దైవదూతలు మరియు ప్రవక్తలు వారి గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ వారి సిఫారసును స్వీకరించి వారిని నరకంలో నుండి తీసి స్వర్గంలో వేస్తాడు. ఎప్పుడైతే వారు నరకంలో నుండి వెళ్లి స్వర్గంలో ప్రవేశిస్తారో అప్పుడు ఆ ముష్రికులు అంటారు యా లైతనా కున్నా మిస్లహుం ఫతుదురికునా అష్ షఫాఆ ఫనుఖ్రజు మినన్నార్ అయ్యో మేము కూడా ఆ ముస్లింల మాదిరిగా ఉంటే మేము కూడా కనీసం ఆ ముస్లింల మాదిరిగా ఉంటే ఎంత బాగుండును, మాకు కూడా ఎవరిదైనా సిఫారసు లభించును కదా తద్వారా మేము కూడా నరకంలో నుండి తీయబడుతుము కదా!. ఆ సందర్భంలో అవిశ్వాసులు ఇలా కోరుతున్న విషయాన్ని అల్లాహు తాలా ఖురాన్ లో కూడా తెలియజేశాడు అదే విషయం. రుబమాయవద్దుల్లజీన కఫరూ లౌ కానూ ముస్లిమీన్. ఒకానొక సందర్భంలో అవిశ్వాసులు కాంక్షిస్తారు, వారు ఇలాంటి కోరికను వ్యక్తపరుస్తారు. అయ్యో మేము కూడా ముస్లింలమయ్యేది ఉంటే ఎంత బాగుండును కదా అని. అయితే ఈ విధంగా సోదరులారా సిఫారసు చేసే వారిలో ప్రవక్తలు కూడా సిఫారసు చేస్తారు.
అలాగే మూడో రకమైన వారు దైవదూతలు. దైవదూతలు సిఫారసు చేస్తారు అన్న విషయం ఈ హదీసులో కూడా వచ్చింది. అంతేకాకుండా సూరయే నజ్మ్ మరియు సూరయే అంబియాలలో కూడా వారి సిఫారసు యొక్క ప్రస్తావన ఉంది. వలా యష్ ఫఊన ఇల్లా లిమనిర్ తదా. అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడతారో వారి గురించే దైవదూతలు సిఫారసు చేస్తారు. మరికొందరు సిఫారసు చేసే వారు ఎవరు? సిఫారసు చేసే వారిలో దైవదూతల ప్రస్తావన వింటూ ఉన్నాము.
సూర నజ్మ్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇలా తెలియపరిచాడు. వకమ్ మిమ్ మలకిన్ ఫిస్సమావాతి లా తుగ్ని షఫాఅతుహుమ్ షైఅన్ ఇల్లా మిమ్ బఅది అయ్ యఅజనల్లాహు లిమయ్ యషాఉ వయర్దా ఆకాశాలలో కూడా ఎందరో దైవదూతలు ఉన్నారు. వారి సిఫారిసు ఎవరికీ ఏ లాభం చేకూర్చదు. అల్లాహ్ యొక్క అనుమతి అయిన తర్వాతనే ఏదైనా లాభం చేకూర్చవచ్చు. కానీ అది కూడా అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడి వారికి సిఫారసు గురించి అనుమతి ఇవ్వాలని కోరుతాడో వారి యొక్క సిఫారసు మాత్రమే చెల్లుతుంది.
ప్రవక్తలు, మరియు దైవదూతలు సిఫారసు చేస్తారు అన్న విషయానికి ఎన్నో ఆధారాలు మనం వింటూ ఉన్నాము. అయితే నాలుగో రకం వారు ఎవరైతే సిఫారసు చేస్తారో వారు షహీద్. ఎవరైతే అల్లాహ్ మార్గంలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో ప్రవక్త విధానాన్ని పాటిస్తూ అల్లాహ్ యొక్క ధర్మ వ్యాప్తిలో అమరవీరుడయ్యాడో అలాంటి షహీద్.
అయితే దైవదూతలు, ప్రవక్తలు, మరియు షహీద్ ఈ ముగ్గురి సిఫారసు విషయం ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది. ఆ హదీస్ కూడా మనం వినడం చాలా బాగుంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సుమ్మ యూజను లిల్ మలాఇకతి వన్నబియీన వష్షుహదా దైవదూతలకు ప్రవక్తలకు మరియు షహీద్ అమరవీరులైన వారికి అయష్ఫాఉ సిఫారసు చేయాలి అని వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఫయష్ఫఊన్ ఆ అనుమతిని పొంది వారు సిఫారసు చేస్తారు. వయుఖ్రిజూన వయష్ఫఊన్ ఒకసారి సిఫారసు చేసిన తర్వాత కొందరిని వెలికి తీయడం జరుగుతుంది. మళ్ళీ సిఫారసు చేస్తారు మళ్ళీ వెలికి తీయడం జరుగుతుంది నరకం నుండి. మళ్ళీ సిఫారసు చేస్తారు. ఈ మూడోసారి ప్రస్తావనలో ఉంది, ఎవరి హృదయంలో అణువంత విశ్వాసం ఉన్నా వారిని కూడా నరకంలో నుండి బయటికి తీయడం జరుగుతుంది. ఎప్పుడు? ప్రవక్తలు, దైవదూతలు, మరియు అమరవీరులైన వారు సిఫారసు చేసిన తర్వాత.
ఈ విధంగా మహాశయులారా వీరందరూ సిఫారసు చేస్తారని ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఇందులో మనకు ఇహలోకంలో గొప్ప గుణపాఠం ఏమిటంటే మనం అల్లాహ్ తో పాటు మరెవ్వరినీ సాటి కల్పించకూడదు. ఐదు పూటలు నమాజులు చేస్తూ ఉండాలి, ఉపవాసాలు పాటించాలి, విధి దానము చెల్లించాలి, హజ్ శక్తి ఉన్నప్పుడు హజ్ చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సరియైన విధంగా అనుసరిస్తూ ఉండాలి.
షహీద్ అన్న విషయం ఏదైతే విన్నామో దాని ద్వారా మనకు గుణపాఠం ఏంటంటే ఎప్పుడైనా అలాంటి అవసరం పడినప్పుడు కేవలం తొందరపాటుతో ఏదో అన్యాయంగా దౌర్జన్యంగా ఏదో పోరాడడం కాదు. అల్లాహ్ ధర్మం యొక్క వ్యాప్తి కొరకు వాస్తవ రూపంలో ప్రవక్త విధానంలో ఉండి అల్లాహ్ ధర్మ వ్యాప్తి కొరకు కృషి చేస్తూ ఉండడం, చేస్తూ ఉండడం చివరికి ఇదే మార్గంలో అమరవీరులు (షహీద్) అయిపోవడం.
ఇలాంటి షహీద్ కు మరెన్నో ఘనతలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎన్నో హదీసులు ఉన్నాయి. అబూ దావూద్ లోని సహీ హదీసులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. యుషఫ్ఫఉష్షహీదు ఫీ సబ్ఈన మిన్ అహ్లి బైతిహి. తన ఇంటి వారిలో 70 మంది గురించి అతను సిఫారసు చేయవచ్చు. 70 మంది గురించి అతను చేసిన సిఫారసును స్వీకరించబడును.
అలాగే మహాశయులారా ముస్నద్ అహ్మద్ మరియు సునన్ తిర్మీజీలో హదీస్ ఉంది. మిక్దాం ఇబ్ను మాదీకరబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. లిష్షహీది ఇందల్లాహి సిత్తు ఖిసాల్ అల్లా మార్గంలో అమరవీరులైన వారికి ఆరు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి అతను అమరవీరులైన తొలి క్షణంలోనే అతన్ని క్షమించడం అతని పాపాల ప్రక్షాళనం జరుగుతుంది. రెండవది తాను స్వర్గంలో తన స్థానాన్ని చూసుకుంటాడు. మూడవది సమాధి శిక్ష నుండి అతన్ని రక్షించడం జరుగుతుంది. నాలుగవది ఆ ప్రళయ దినాన సమాధుల నుండి లేపబడినప్పుడు మహా వ్యాకులత ఏదైతే ఏర్పడుతుందో దాని నుండి కూడా రక్షింపబడతాడు. ఐదవది అతని తలపై ఒక కిరీటం పెట్టడం జరుగుతుంది. దానిలో ఏ ముత్యాలు అయితే ఉంటాయో అందులో ఒక రకమైనది యాకూత్. దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. ఈ మొత్తం ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సర్వాని కంటే ఎక్కువ ఉత్తమమైనది మేలైనది ఆ ఒక్క యాకూత్. ఐదవ విషయం 72 స్వర్గ కన్యలతో అతని వివాహం జరుగుతుంది. ఆరవది అతను తన ఇంటి వారిలో 70 మందికి సిఫారసు చేయగలుగుతాడు. అతని యొక్క సిఫారసు అంగీకరింపబడుతుంది. స్వీకరించబడుతుంది.
ఇంకా మహాశయులారా ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు అయితే మనకు పనికొస్తుందో, లాభాన్ని చేకూర్చుతుందో అందులో ఒకటి మన సంతానం చిన్నతనంలో ప్రాజ్ఞ వయసుకు చేరకముందు వారు చనిపోతే మనం షిర్క్ పై కాకుండా తౌహీద్ పై ఉండేది ఉంటే దైవ ఏకత్వాన్ని నమ్ముతూ కేవలం ఆయన ఆరాధన మాత్రమే చేస్తూ ఉంటే మిగతా పాపాల కారణంగా స్వర్గంలో వెళ్లడం ఏదైనా ఆలస్యం జరిగినా మన ఆ సంతానం ఆ చంటి పాపలు మనల్ని తమ వెంట స్వర్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించిన హదీసులు ఎన్నో ఉన్నాయి కానీ ఒక రెండు మూడు హదీసులను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మనం దీని ద్వారా నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటంటే ఒకవేళ చిన్న వయసులో మన సంతానం ఎవరైనా చనిపోతే వారి పట్ల మనం వ్యాకులతకు రందికి బాధకు గురియై అల్లాహ్ మన పట్ల రాసి ఉంచిన ఆ విధిరాత దానికి వ్యతిరేకంగా మనం ఏమీ మాట్లాడకూడదు. అల్లాహ్ కు ఇష్టం కాని రీతిలో మన నోట ఏ మాట వెళ్ళకూడదు. ఇంకా వారు ఏ వయసుకు చేరుకున్నా గానీ వారి యొక్క శిక్షణ ఇస్లాం ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో వారికి మనం శిక్షణ ఇస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం ప్రళయ దినాన మన పిల్లల సిఫారసును కూడా పొందగలుగుతాము.
సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1248 లో అనస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. మా మినన్నాసి మిన్ ముస్లిమిన్ యుతవఫ్ఫా లహు సలాసున్ లమ్ యబ్లుగుల్ హిన్స్ ముస్లింలలో ఎవరి సంతానంలోనైనా ముగ్గురు ప్రాజ్ఞ వయసుకు చేరకముందు వారు చనిపోయారు అంటే ఇల్లా అద్ఖలహుల్లాహుల్ జన్న బిఫద్లి రహ్మతిహి ఇయ్యాహుమ్ అల్లాహ్ తన యొక్క కారుణ్యం తన యొక్క దయతో వారిని స్వర్గంలో చేర్పిస్తాడు.
సహీ ముస్లిం షరీఫ్ 2635 హదీస్ నెంబర్లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. చిన్న పిల్లలు స్వర్గంలో కూడా చిన్న పిల్లల్లాగే ఉంటారు. వారు తమ తల్లిదండ్రిని లేదా ఇద్దరిలో ఒకరిని పట్టుకొని స్వర్గంలో వెళుతూ ఉంటారు. ఈ హదీస్ ను వివరిస్తున్న సందర్భంలో హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు అక్కడ ఒక వ్యక్తి ఎవరైతే పక్కన కూర్చుండి ఉన్నాడో అతని దుస్తులని ఇలా పట్టుకొని నేను నీ దుస్తులని ఎలా పట్టుకున్నానో అలాగే ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల దుస్తులని పట్టుకొని స్వర్గం వైపునకు తీసుకెళుతూ ఉంటారు. అల్లాహు తాలా ఆ పిల్లల ఈ ప్రేమను తల్లిదండ్రులను కూడా స్వర్గంలో తీసుకెళ్ళాలి అన్నటువంటి కాంక్ష వారికి ఎలా ఉందో ఈ విషయాన్ని చూసి అల్లాహు తాలా వారిని ఆ పిల్లలని వారి తల్లిదండ్రులతో సహా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.
ఇక్కడ హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా తెలియజేసిన ఒక సంఘటన మనకు చాలా గుణపాఠం నేర్పుతుంది. ఒక స్త్రీ తన వెంట ఇద్దరు బిడ్డల్ని తీసుకొని వచ్చింది. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వద్ద ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి అని అడిగింది. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వద్ద ఆ సమయంలో కేవలం మూడే మూడు ఖర్జూర్ ముక్కలు ఉన్నాయి. ఆమెకు ఇచ్చేసింది. ఆ తల్లి రెండు ఖర్జూర్ ముక్కలు ఇద్దరు బిడ్డలకి ఇచ్చేసింది. మరో ముక్క తినాలి అనుకొని చేతిలో పట్టుకొని నోరు వరకు తీసుకెళ్లేసరికి ఇద్దరు బిడ్డలు తమకు ఇవ్వబడిన ముక్కలు తినేసి మళ్ళీ తల్లి వైపునకు చెయ్యి చాపారు. ఆ తల్లి ఆ ఒక్క ఖర్జూర్ ముక్కను రెండుగా చీల్చి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చేసింది. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఈ సంఘటన చూడలేకపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఈ సంఘటనను వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంఘటనను విన్న తర్వాత ఏం చెప్పారో తెలుసా? చూడడానికి చిన్న పదాలు కానీ ఎంత గొప్ప భావం ఉంది. ఇన్నల్లాహ కద్ ఔజబ లహా బిహిమా అల్ జన్నహ్. అల్లాహు తాలా ఆ ఇద్దరి బిడ్డల కారణంగా ఆ తల్లి గురించి స్వర్గాన్ని విధి గావించాడు. మరో ఉల్లేఖనంలో ఉంది. అల్లాహు తాలా ఆ ఇద్దరి బిడ్డల కారణంగా ఆ తల్లిని నరకం నుండి విముక్తి కలిగించాడు.
ఈ విధంగా మహాశయులారా ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది. అలాగే ఉపవాసం కూడా సిఫారసు చేస్తుంది. అయితే ఇహలోకంలో ఖురాన్ అధికంగా చదివే ప్రయత్నం చేయాలి. మనం ఉపవాసాలు రంజాన్ లోనే కాకుండా నఫిల్ ఉపవాసాలు కూడా ఉండే ప్రయత్నం చేయాలి. అస్సియాము వల్ ఖురాను యుషఫ్ఫిఆన్ ఫయుషఫ్ఫిఅహుముల్లాహ్. ఖురాన్ మరియు ఉపవాసాలు సిఫారసు చేస్తాయి అల్లాహు తాలా వారి సిఫారసును స్వీకరిస్తాడు. అలాగే మనం సంతానం పట్ల శ్రద్ధ వహించి వారికి ఉత్తమమైన శిక్షణ అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో వారిని పెంచే ప్రయత్నం చేయాలి, వారిని మంచిగా పోషించాలి.
అల్లాహు తాలా మనందరికీ ఇలాంటి సిఫారసులు పొందే ఇలాంటి సిఫారసులు చేసే అటువంటి హక్కు కూడా మనకు ప్రసాదించుగాక. అంతటి గొప్ప పుణ్యాలు సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సద్భాగ్యం ప్రసాదించుగాక.
వఆఖిరు దావానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]