అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [3] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా  శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్  మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం లెక్కల పత్రము, శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకుందాం.   

ఓ అల్లాహ్ దాసులారా! లెక్కల పత్రము మరియు శిక్ష లేక ప్రతిఫలం అనేవి సత్యం. ఖుర్ఆన్ మరియు హదీసు ద్వారా ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి. మరియు సమస్త విశ్వాసులు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. దీని గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ  ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم

(ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది. మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది.) (88:25-26)

మరోచోట కూడా దీని గురించి ఇలా తెలియజేశాడు. 

مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ

(సత్కార్యం చేసినవాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.) (6:160)

మరో వాక్యంలో కూడా దీని గురించి ఈ విధంగా తెలియజేయబడుతుంది. 

وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ

(మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు.) (21:47)

లెక్కల పత్రము శిక్ష మరియు ప్రతిఫలము ఇది అంతా అల్లాహ్ యొక్క వివేకం. ఎందుకంటే ఆయన గ్రంథాలను అవతరింప చేశాడు, దైవ సందేశహారులను పంపాడు, మరియు ఆ సందేశహారుల పై విశ్వాసం తీసుకురావడాన్ని వారు చూపినటువంటి మార్గాన్ని అవలంబించడాన్ని తప్పనిసరి చేశాడు, మరియు ఎవరైతే ఆ మార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారో వారి సంహారాన్ని,  వారి సంతానము మరియు భార్యల సంహారాన్ని, వారి సంపదను ధర్మసమ్మతం చేశాడు. ఒకవేళ ఈ లెక్కల పత్రము శిక్ష మరియు ప్రతిఫలం  గనక లేకపోయి ఉంటే అసలు ఈ సృష్టి నిర్మాణానికి ఈ ధర్మస్థాపనకు అర్థమే లేకుండా పోయేది. అందుకే సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ తన వివేకంతో దీన్ని ఏర్పాటు చేశాడు. 

ఓ అల్లాహ్ దాసులారా! కర్మల లెక్క రెండు విధాలుగా వుంటుంది. మొదట కర్మల ప్రదర్శన మాత్రమె జరుగుతుంది. రెండవది  కర్మల విచారణ మరియు శిక్ష ఉంటుంది.

దీని ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు: “ప్రళయ దినం రోజున ఎవరి లెక్క అయితే జాగ్రత్తగా తీసుకోబడుతుందో వారికి శిక్ష తప్పనిసరి.” అప్పుడు ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ విధంగా అన్నారు – ఓ మహా ప్రవక్తా! అల్లాహ్ తఆలా సైతం ఈ విధంగా అన్నాడు కదా “ఎవరి కర్మల పత్రం అయితే కుడి చేతిలో ఇవ్వబడుతుందో వారి లెక్క సులభతరం చేయబడుతుంది” అని.  అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు ఇలా అన్నారు – “ఓ ఆయిషా! దీని అర్థం కేవలం కర్మల ప్రదర్శన మాత్రమే కానీ ఎవరి లెక్క అయితే జాగ్రత్తగా తీసుకో బడుతుందో వారికి శిక్ష తప్పనిసరి”. (బుఖారీ ముస్లిం) 

ఈ రెండు విధాల కర్మల లెక్క గురించి ఇబ్నే ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు:

ఆ రోజున అల్లాహ్ విశ్వాసిని తన దగ్గరకు పిలుస్తాడు మరియు అతనిపై ఒక పరదా వేస్తాడు అప్పుడు అతనితో ఇలా అంటాడు: “ఓ నాదాసుడా నువ్వు చేసినటువంటి ఫలానా ఫలానా పాపం నీకు గుర్తుందా?” అప్పుడు అతను అంటాడు “ఓ నా ప్రభువా అవును నాకు గుర్తు ఉంది” ఇక అతను తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇక తన వినాశనం తప్పనిసరి అని భావిస్తాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు “నేను ప్రపంచంలో నీ దుష్కర్మలపై పరదా వేశాను, మరియు ఈరోజు కూడా నేను నీ పాపాలను మన్నిస్తున్నాను”. అప్పుడు అతని సత్కర్మల పత్రం అతనికి ఇవ్వబడుతుంది“. (బుఖారి ముస్లిం) 

ఆ రోజున ప్రజల కర్మలను త్రాసులో తూకం వేయడం జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ తన దాసుల మధ్య చేసే న్యాయం ఎంత ఉన్నతమైనదో తెలియపరచడానికి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ

(మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు.) (21:47)

ఒకవేళ ఎవరికైనా ఈ విధమైన సందేహం రావచ్చు, మంచీ చెడూ ఈ రెండూ నైతిక విషయాలు కదా! వీటిని ఎలా తూకం వేస్తారు? 

దీని సమాధానం ఏమిటంటే అల్లాహ్ తన శక్తితో కర్మలకు సాక్షాత్కార రూపాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఇతర విషయాలకు కూడా రూపాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ రోజున మరణాన్ని తీసుకురావడం జరుగుతుంది. (మరణానికి రూపం లేదు) కానీ ఆ రోజున ఆ మరణానికి పొట్టేలు రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు స్వర్గం మరియు నరకం మధ్యలో దానిని హతమార్చడం జరుగుతుంది. ఆ తర్వాత ఇలా ప్రకటించడం జరుగుతుంది – “ఓ స్వర్గవాసుల్లారా మీరు ఎల్లకాలం ఇందులోనే ఉంటారు. ఎప్పటికీ మీకు మరణం రాదు. మరియు ఓ నరకవాసులారా ఎల్లకాలం మీరు ఇందులోనే ఉంటారు. మీకు కూడా మరణం రాదు.” (బుఖారి ముస్లిం) 

మరియు అదే విధంగా మరో సందేహం రావచ్చు, ఏమిటీ ఆ రోజున విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరి కర్మల లెక్క గురించి ప్రశ్నించడం జరుగుతుందా లేక కేవలం విశ్వాసుల లెక్క మాత్రమే తీసుకోవడం జరుగుతుందా? 

దీని సమాధానం ఏమిటంటే ఆ అంతిమదినం రోజున కేవలం విశ్వాసుల కర్మలు మాత్రమే తూకం వేయడం జరుగుతుంది. ఒకవేళ విశ్వాసి యొక్క కర్మల పత్రంలో ఎటువంటి పాపం లేకుండా ఉంటే అతనికి ముందే స్వర్గ శుభవార్త తెలియ చేయబడుతుంది. ఒకవేళ  అతని కర్మల పత్రంలో పాపాలు కూడా ఉండి ఉంటే ఆ పాపాల మేర శిక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహ్ అతనికి స్వర్గ ప్రవేశం కలుగజేస్తాడు.  లేకపోతే మొదటి గానే అతడి పాపాలను క్షమించడం జరుగుతుంది. మరియు ఎటువంటి శిక్ష లేకుండా అతడికి స్వర్గం ప్రసాదించడం జరుగుతుంది. దీని గల కారణం సిఫారసు చేసేవారి సిఫారసు అయి ఉండవచ్చు లేకపోతే అల్లాహ్ యొక్క కారణ్యం అయి ఉండవచ్చు. 

ఇక అవిశ్వాసి విషయానికి వస్తే అతని యొక్క సత్కర్మల ప్రతిఫలం అతనికి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యపరంగానూ లేక ఉపాధి పరంగానూ లేక అతను కోరుకున్నది అతనికి ఇవ్వడం ద్వారానో ప్రసాదించడం జరుగుతుంది. కానీ రేపు ప్రళయ దినం రోజున అతను ఈ ప్రపంచంలో ఎన్ని సత్కార్యాలు చేసినప్పటికీ అల్లాహ్ వద్ద అతనికి నరక శిక్ష తప్ప మరేమీ లభించదు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ

(అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.) (11:16)

మరోచోట ఇలా అంటున్నాడు. 

وَقَدِمْنَا إِلَىٰ مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَّنثُورًا

(వారు (ప్రాపంచిక జీవితంలో) చేసి వున్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళివలే చేసేశాము.) (25:23)

మరో వాక్యం లో ఎలా తెలియజేస్తున్నాడు. 

مَّثَلُ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ أَعْمَالُهُمْ كَرَمَادٍ اشْتَدَّتْ بِهِ الرِّيحُ فِي يَوْمٍ عَاصِفٍ ۖ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا عَلَىٰ شَيْءٍ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ

(మ పరిపోషకుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఉపమానం వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటివి. తాము చేసుకున్న కర్మలలో దేనిపైనా వారికి అధికారం ఉండదు.) (14:18)

మరోచోట ఇలా తెలియజేయబడింది. 

وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا 

(అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు.) (24:39)

దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే అవిశ్వాసులకు మరియు కపట విశ్వాసులకు వారి పాప పుణ్యాల గురించి లెక్క జరగదు. కేవలం వారు చేసినటువంటి దుర్మార్గం గురించి అడగడం జరుగుతుంది మరియు వారి కొరకు శిక్ష సిద్ధం చేయడం జరుగుతుంది. 

ఇబ్నే ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ద్వారా మనకు హదీసులో ఈ విధంగా తెలియ జేయబడింది: “అవిశ్వాసులను వారు చేసినటువంటి దుష్కర్మలను గురించి వారికి గుర్తు చేయడం జరుగుతుంది. ఒకవేళ వారు వారిని తిరస్కరిస్తే వారి శరీర అవయవాల ద్వారా సాక్ష్యం ఇప్పించడం జరుగుతుంది. అప్పుడు సమస్త మానవాళి ముందు కేక వేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.”

وَيَقُولُ الْأَشْهَادُ هَٰؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ

(“తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే” అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాంటి) దుర్మార్గుల పై అల్లాహ్ శాపం పడుతుంది.) (11:18)

ఆ తర్వాత వారిని నరకంలోకి విసిరి వేయడం జరుగుతుంది.అల్లాహ్ శరణు. దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే కరుణామయుడు అయినటువంటి సృష్టికర్త విశ్వాసుల యొక్క పాపాలపై పరదా వేసి, అవిశ్వాసులను వారి దుష్కర్మల ద్వారా అవమానపాలు చేస్తాడు. 

విశ్వాసులారా! లెక్కల పత్రం యొక్క సందర్భం ఎలాంటిది అంటే ఎప్పుడైతే వారి లెక్క తీసుకోవడానికి వారిని పిలవడం జరుగుతుందో ఆ సమయంలో వారు భయాందోళనతో దీన స్థితిలో మోకాళ్లపై పడిపోతారు, అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰ إِلَىٰ كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ

(ప్రతి మానవ సముదాయం మోకాళ్ళపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. “ఈ రోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది.) (45:28)

ఓ విశ్వాసులారా! అన్నిటికంటే ముందు నమాజ్ గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అతను నమాజ్ విషయంలో సక్రమంగా ఉంటే అన్ని విషయాలలో సక్రమంగా ఉన్నట్లే. ఒకవేళ నమాజ్ విషయంలో సవ్యంగా లేకుంటే మిగతా విషయాలన్నీటిలో సవ్యంగా లేనట్లే పరిగణించబడుతుంది.(తిర్మిజీ) 

దాసుల హక్కులలో మొదటగా దాసుడిని  రక్తం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దీని ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: “ప్రళయ దినం రోజున అన్నిటికంటే ముందు ప్రజలలో రక్తం గురించి తీర్పు చేయబడుతుంది“. (బుఖారి ముస్లిం) 

ఆ రోజున మనిషి తాను చేసినటువంటి చెడు పనులను తిరస్కరిస్తే అతని శరీర అవయవాలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. అతని చెవులు, అతనికి కళ్ళు, అతని చర్మం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 

وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ حَتَّىٰ إِذَا مَا جَاءُوهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَأَبْصَارُهُمْ وَجُلُودُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ

(ఏ రోజున అల్లాహ్‌ విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో, అప్పుడు వారంతా (పలు సమూహాలుగా) విడగొట్టబడతారు. ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్లు, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి.) (41:19-20)

హసన్ బస్రి (రహిమహుల్లాహ్) వారు వాక్యం యొక్క వివరణలో ఈ విధంగా తెలియజేస్తున్నారు: “ఓ ఆదం సంతానమా! నీ సృష్టికర్త నీ పట్ల న్యాయంగా వ్యవహరించాడు. నీకు నిన్నే సాక్షిగా చేశాడు.”

ఇబ్నే జరీర్ (రహిమహుల్లాహ్) వారు ఇదే వాక్యం వివరణలో ఇలా తెలియజేస్తున్నారు. “ఆ రోజున చదువు రానటువంటి వారు కూడా చదవగలుగుతారు.”

ఓ ముస్లింలారా! ఆరోజున 70 వేలమంది పరిస్థితి మరోలా ఉంటుంది. వారి లెక్క తీసుకోబడదు మరియు వారిని శిక్షించడం జరగదు. అల్లాహ్ మన అందరిని కూడా వారిలో చేర్చుగాక!. వారు సంపూర్ణ విశ్వాసవంతులై ఉంటారు. మరియు వారు పరిపూర్ణంగా అల్లాహ్ కు విధేయత చూపి ఉంటారు. మరియు మంచి పనుల కొరకు మున్ముందు ఉండేవారు. అల్లాహ్ నిషేధితాలకు దూరంగా ఉండేవారు. 

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం ప్రకారం హదీసులో ఇలా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నా ప్రభువు ప్రతి వెయ్యి మంది ప్రజలతో 70 వేల మందిని, అలాగే నా ప్రభువు పిడికిలితో మూడు పిడికిల్ల ప్రజలను ఎలాంటి విచారణకు మరియు శిక్షకు గురి చేయకుండా స్వర్గాన్ని ప్రసాదిస్తానని నాకు వాగ్దానం చేశాడు” (తిర్మిజి) 

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక!. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక!. అల్లాహ్ మనందరిని క్షమించుగాక!, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు. 

స్తోత్రం మరియు దరూద్ తరువాత: 

అల్లాహ్ మీ పై కరుణించుగాక! మీరు తెలుసుకోండి.  జిన్నాతులు మరియు మానవులు ఇద్దరి లెక్క ఆ రోజున తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధర్మం జిన్నాతుల కొరకు కూడా చెందుతుంది. ఈ చట్టం వారికి కూడా వర్తిస్తుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِكُم مِّنَ الْجِنِّ وَالْإِنسِ فِي النَّارِ

(మీకు పూర్వం గతించిన జిన్నాతు, మానవ సమూహాలతో చేరి, (వారితో పాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్‌ వారితో అంటాడు) (7:38)

ఈ వాక్యం ద్వారా తెలిసే విషయం ఏమిటంటే జిన్నాతులు కూడా మానవులలాగే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. దీని కొరకు వారు తప్పక ధర్మాన్ని పాటించవలసి ఉంది. 

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ పశుపక్షాదుల మధ్య కూడా తీర్పు చేయనున్నాడు. అబూ హరైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఇలా తెలియజేశారు – “ప్రళయ దినం నాడు హక్కుదారుల  హక్కును వారికి చెల్లించాలి. చివరికి కొమ్ములు లేని మేక కొమ్ములు ఉన్న మేకనుండి పరిహారం తీసుకుంటుంది.”  (ముస్లిం) 

మరియు తెలుసుకోండి! మరో ఉన్నతమైన ఆచరణకై మీకు తెలియచేస్తున్నాము. జుమా రోజు అతి ఉన్నతమయిన ఆచరణ దరూద్ పఠించడం. ఓ అల్లాహ్! మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నీ శాంతి శుభాలు కురిపించు. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు. 

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వనాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. 

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు , నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్ 

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి . 

ఓ అల్లాహ్! మమ్ములను క్షమించు మరియు మా కంటే ముందు గతించిన మా విశ్వాస సోదరుల పాపాలను కూడా క్షమించు. మరియు విశ్వాసుల గురించి మా హృదయాలలో కుళ్లు, కుతంత్రాలు మరియు ద్వేషాన్ని నింపకు. నిశ్చయంగా నీవు కరుణించే వాడవు మరియు క్షమించే వాడవు.  

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి