విశ్వాస ప్రదాయిని (Taqwiyatul Iman – తఖ్వియతుల్ ఈమాన్)
(ప్రతి ధార్మిక పౌఠశాలలో బోధన, శిక్షణ, అధ్యయనం కొరకు ఉండవలసిన పుస్తకం)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ ( రహిమహుల్లాహ్)
(Shah Ismaeeil Shaheed (rahimahullah))
ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర
[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [112 పేజీలు]
చాఫ్టర్లు
విషయసూచిక
1వ అధ్యాయం – తౌహీద్ (దేవుని ఏకత్వం) వివరణ [PDF] [8p]
- ప్రజల అజ్ఞానం
- షిర్క్ చేష్టలు
- విశ్వాస వాదనలు షిర్క్ చేష్టలు
- ఖుర్ఆన్ తీర్పు
- అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూలేడు
- అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవరూ లేడు
- అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు
- షిర్క్ వాస్తవికత
2వ. అధ్యాయం – షిర్క్ (బహుదైవారాధన) రకాలు [PDF] [7p]
- జ్ఞానంలో షిర్క్
- అధికారంలో షిర్క్
- ఆరాధనల్లో షిర్క్
- రోజువారి పనుల్లో షిర్క్
3వ. అధ్యాయం – షిర్క్ లోని కీడు, తొహీద్ లోని మేళ్ళు [PDF] [13p]
- బహుదైవారాధన క్షమార్హం కాదు
- షిర్క్ కు దృష్టాంతం
- షిర్క్ మహాపరాధం
- సాఫల్యానికి మార్గం తౌహీద్
- అల్లాహ్ షిర్క్ ను లెక్కచెయ్యడు
- ఆత్మావస్థలో తౌహీద్ అంగీకారం
- షిర్క్ ధృవపత్రం కాజాలదు
- ‘మరుపు సాకు’ స్వీకరించబడదు
- ప్రవక్తల, గ్రంథాల మౌలిక బోధన
- ఏకదైవారాధన మరియు మన్నింపు
4వ. అధ్యాయం – అగోచర జ్ఞానంలో షిర్క్ ఖండన [PDF] [10p] – [పోస్ట్ లింక్]
- షిర్క్ ఖండన
- అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది
- అగోచర జ్ఞానముందని చెప్పేవాడు అబద్ధాల కోరు
- అగోచరాల జ్ఞానం
- అల్లాహ్ ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
- లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
- ప్రవక్తల అసలు మిషన్
- ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
- అగోచర జ్ఞానం గురించి ప్రవక్త ప్రవచనం
- మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
- అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసిన వారు ఎవరూ లేరు
5వ. అధ్యాయం – అధికారం వినియోగంలో షిర్క్ ఖండన [PDF] [15p]
- అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవడం
- లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
- అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు
- అల్లాహ్ నే మొరపెట్టుకోండి
- అనుమతితి లేనిదే సిఫారసు లేదు
- సిఫారసు రకాలు
- గౌరవభావ సిఫారసు అసాధ్యం
- ప్రేమ కలిగిన సిఫారసు అసాధ్యం
- అనుమతితో సిఫారసు
- రుజుమార్గం
- అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు
- అల్లాహ్ పైనే భారం మోపాలి
- బంధుత్వముూ పనికిరాదు
6వ. అధ్యాయం – ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం [PDF] [16p]
- ఆరాధన నిర్వచనం
- ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం
- సజ్దహ్ (సాప్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే
- దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్
- అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి
- దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం
- అధికారం కేవలం అల్లాహ్ ది మాత్రమే
- ఇష్టమొచ్చిన దేవుళ్ళ పేర్లు పెట్టడం షిర్క్
- స్వయం కల్పిత ఆచారాలు షిర్క్
- ప్రజలను తమ గౌరవార్థం నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం
- విగ్రహాల ఆస్థానాల ఆరాధనా భావం కూడా షిర్క్
- దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం
- ప్రళయ సూచనలు
- ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని
- విగ్రహాల ప్రదక్షిణ
7వ అధ్యాయం – ఆచార వ్యవహారాలలో షిర్క్ నిషిద్ధం [PDF] [29p]
- షైతాను కలతలు
- సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు
- వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు
- పశువుల విషయంలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు
- హలాల్ హరామ్ (ధర్మం-అధర్మం)
- నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్
- జ్యోతిష్కుడు మాంత్రికుడు,…..
- జ్యోతిష్య సంఖ్యా శాస్త్రాలపై విశ్వసించే పాపం
- శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు
- అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి
- అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు
- అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి
- కేవలం ‘అల్లాహ్ తలిస్తే’ అనండి
- దైవేతరుల పై ప్రమాణం చేయడం షిర్క్
- మ్రొక్కుబడుల గురించి ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) తీర్పు
- సజ్దహ్ కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను గౌరవించండి
- ఎవరినైనా దాసుడనిగానీ, దాసి అని గానీ అనడం.
- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించే విధానం
- ‘సయ్యద్’ పదానికి రెండు అర్థాలు
- చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
- ఘోరమైన ఐదు పాపాలు
- తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
ముందుమాట
షాహ్ ముహమ్మద్ ఇస్మాయీల్ (జననం 26-4-1779, మరణం 6-5- 1831) ఆయన తండ్రి షాహ్ అబ్దుల్ ఘనీ, ఆయన తండ్రి షాహ్ వలీవుల్లాహ్ హదీసువేత్త ఢిల్లీ నివాసి, షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ్యహ్, ఇంకా ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్ గారి సందేశ, సంస్కరణా సేవలు ఆధునిక ధోరణితో కూడి ఉండేవి. ఆయన క్రీ.శ. 1826 (హిజ్రీ 1241)లో ప్రపంచంలోని రెండవ పెద్ద ముస్లిం జనాభా గల భారత ఉపఖండంలో ముస్లింల విశ్వాసాల సంస్కరణ కోసం సమగ్రమూ సర్వజనామోదమూ గల పరిభాషలో “తఖ్వియతుల్ ఈమాన్” (విశ్వాస ప్రదాయిని) అనే రచనను చేశారు.
“విశ్వాసం” అనే అంశంపై ఆ కాలంలో ఇది ఎన్నదగిన రచన. సామాన్య ప్రజానీకానికి మనోపరిశుద్ధత రీతిలో దాదాపు 200 ఏళ్ళుగా క్రమం తప్పక కొనసాగుతూ షాహ్ వలివుల్లాహ్ గారి ఈ విజ్ఞాన వారసత్వం సామాన్యులకు, విద్యావంతులకు ఉనికిపట్టు. మరియు అన్ని వర్గాల వద్ద ఆమోదయోగ్యం పొంది పాఠ్యప్రణాళికలో ఉన్న రచన.
“మాకాన లిల్లాహి యబ్ ఖా వమాకాన లి గైరిల్లాహి యన్ ఫద్ ” (ఇమామ్ మాలిక్)
అర్థం: ఏ పని అయితే స్వచ్ఛతగా అల్లాహ్ కొరకు చేయబడుతుందో అది ఎప్పటికీ మిగిలి ఉంటుంది. మరి ఏదైతే మనోవాంఛలకు లోనై అల్లాహ్ యేతరుల కొరకు చేయబడుతుందో అది నశించిపోతుంది.
షాహ్ ఇస్మాయీల్ (రహ్మతుల్లాహ్ అలైహ్) గారి సుమారు 12 రచనలలో ఇది బాగా ప్రాచుర్యం పొందిన రచన. దీనిని ఆయన 200 ఏళ్ళ నాటి “ప్రాచీన మొఘలాయి ఉర్దూ” భాషలో రచించారు. తరువాత 1989లో గులాం రసూల్ మహర్ గారు ఆధునిక ఉర్దూలో సరిక్రొత్తగా సంస్కరించి సంకలన పర్చారు.
మేము ఆ ప్రతినే వాడుకభాషలో అనువదింపజేస్తూ స్థానిక ప్రజల సిలబస్ శైలిలో మలిచాము. ధార్మిక పాఠశాలల వారు దీనిని సిలబస్ గా చేర్చుకునే విధంగా రూపొందించాము.
1989 నుండి 2011 వరకూ కూడా షాహ్ ఇస్మాయీల్ (రహిమ హుల్లాహ్) గారి ఈ చారిత్రక రచనను స్థానిక ఆధునిక సిలబస్ గా బోధించే ధార్మిక పాఠశాలల్లో చేర్చకపోవడం శోచనీయం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వివిధ ఆలోచనా విధానాలు గల మదర్సాలు దీనిని సిలబస్ లో చేర్చడం జరిగింది. అయితే దీనిలోని కొన్ని సూక్ష్మమైన లోపాలను సరిదిద్దటం కూడా జరగలేదు.
ప్రియసోదరుడు అతీఖుర్రహ్మాన్ ఖురైషీ ఉమరి ప్రాంతీయ ఆధునిక ధోరణి మరియు పాఠ్యప్రణాళిక రీతిలో ఉదాహరణకు సారాంశం, సంక్షిప్తమైన ప్రశ్నలు, తప్పొప్పులను గుర్తించటం, ఖాళీలను పూరించటం వంటి అంశాలను కూడా చేర్చడానికి సహకరించడం జరిగింది. దానికి తోడు ప్రముఖ దాయి (ధర్మ ప్రచారకులు) జనాబ్ ఫజ్లుర్రహ్మాన్, హైదరాబాద్ గారు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సూక్ష్మ దృష్టితో దీని భాషను సరళీకరించి సులభగ్రాహ్యం చేశారు. “జజాహుల్లాహు ఖైరన్” (అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక!) ఆమీన్.
ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలలో ధార్మిక పరిజ్ఞానం లేనందువల్ల ధర్మభ్రష్ఠత్వానికి గురైన అమాయక ముస్లింలకు వీరి భాషలో మౌలిక, ధార్మిక బోధనలకు సరళమైన రీతిలో సుబోధకంగా అందించడానికి గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, కేవలం ధర్మ పరిచయం కోసం (వ్యాపార ప్రయోజనాల కోసం కాదు) ధార్మిక పరిజ్ఞాన సాహిత్యం, అనువాదం మరియు ప్రచురణల కార్యక్రమాన్ని వివిధ ఆశయాలతో ప్రారంభించింది.
- స్థానిక ధార్మిక పండితులు, ధర్మప్రచారకులు మరియు సామాన్య ప్రజానీకానికి ఒక జ్ఞాన ఉనికిపట్టు కావాలని.
- బహుదైవారాధన, ధర్మంలో కొత్త పోకడల ధోరణులకు అడ్డుకట్ట కట్టాలని.
- ప్రతి ఒక్కరు ఖుర్ఆన్, హదీసు బోధనల నుండి ప్రవక్త సహచరులు మరియు వీరి అనుచరుల విధానాలను సునాయాసంగా గ్రహించి ప్రయోజనం పొందాలని ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది.
- ఈ కార్యక్రమంలో ఒక భాగమే చేతిలో ఉన్న ఈ పుస్తకం సీరిస్ నెం.11. ఈ కార్యక్రమం ధర్మరాహిత్యాన్ని తొలగించే ప్రయత్నాల్లో ఒక మైలురాయిగా కావాలని ఆశిస్తూ… మీ ధార్మిక అభిలాషను కోరుతున్నాము.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో
ఉపోద్ఘాతం
1. స్తుతి, స్తోత్రాలు
ఓ ప్రభూ! నీకు వేనవేల కృతజ్ఞతలు. నీవు మాపై అపార అనుగ్రహాలను అవతరింపజేశావు. నీ సత్యధర్మమార్గ నిర్దేశనం చేశావు. మమ్మల్ని ఏకదైవారాధకులను చేశావు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజం (ఉమ్మత్) లో పుట్టించావు. ధార్మిక ఆసక్తిని కలిగించావు. ధార్మికులపై ప్రేమను ప్రసాదించావు. ఓ అల్లాహ్ ! నీ ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులపై వారి వారసులపై నీ కారుణ్యాన్ని, శాంతిని కురిపించు. మమ్మల్ని కూడా వారిలో చేర్చు. ఇంకా ఇస్లామీయ జీవన పద్ధతిలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించు. విశ్వాస స్థితిలోనే మాకు మరణాన్ని ప్రసాదించు. ఆయన విధేయుల వరుసలో మా పేరును చేర్చు – ఆమీన్.
2. దాసుడు మరియు దాస్యం
మానవులందరూ అల్లాహ్ దాసులు. దాస్యం (విధేయత) చూపడమే దాసుని పని. తప్పించుకు తిరగేవాడు దాసుడు కాజాలడు. దాస్యం మానవ విశ్వాస సంస్కరణపై ఆధారపడి ఉంది. విశ్వాసంలో దోషం వున్నవారి ఆచరణ స్వీకరించ బడదు. ఎవరి విశ్వాసంలో కల్తీ ఉందో వారి ఆచరణ స్వీకరించ బడదు. సరైన విశ్వాసం గల వ్యక్తి స్వల్ప ఆచరణ కూడా అమూల్యమైనదే. కనుక ముస్లింనని చెప్పుకునే ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలి. విశ్వాస సంస్కరణకు అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాలి.
3. ప్రస్తుత పరిస్థితి
నేడు ప్రజలు అనేక మార్గాలను ఏర్పరుచుకున్నారు. కొందరు తాత ముత్తాతల ఆచారాలను అవలంబిస్తున్నారు. మరి కొందరు మహాత్ముల విధానాల్ని అనుసరిస్తున్నారు. ఇంకొందరైతే ధార్మిక పండితులు స్వయంగా కల్పించుకుని చెప్పిన మాటలను ధృవపత్రాలుగా చూపిస్తున్నారు. బుద్ధికి సానబెట్టి ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు.
4. అన్నింటికంటే మేలైన మార్గం
దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల పద్ధతిని ప్రామాణికంగా తీసుకున్నదే మేలైన మార్గం. ఈ మూడు చెలమల (దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరుల పద్ధతి)తోనే హృదయాన్ని సేద తీర్చాలి. ధార్మిక విషయాల్లో మనస్సు చెప్పినట్లు జోక్యం చేసుకోకూడదు. మహాత్ముల మాటలుగాని, పండితుల పరిష్కారాలుగానీ, ఖుర్ఆన్ ప్రామాణిక హదీసులకు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల పద్ధతికి అనుగుణంగా ‘ఉంటేనే అంగీకరించాలి. వాటికి విరుద్ధంగా ఉంటే వదలిపెట్టాలి.
5. ధర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు
ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ప్రజల్లో ఒక అపోహ ఉంది. వాటిని అర్థం చేసుకోవాలంటే పెద్ద చదువులు చదవాలని, తాము అజ్ఞానులమని అలాంటప్పుడు వాటికనుగుణంగా ఎలా నడుచుకోవాలని, పుణ్యాత్ములు మహాత్ములే వాటిని ఆచరించగలరని భావిస్తారు. వారి భావన నిరాధారమైంది.
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో చాలా స్పష్టంగా సెలవిచ్చాడు.
2:99 وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు. (దివ్య ఖుర్ఆన్-2: 99)
దైవ వాక్యాలు చాలా స్పష్టమైనవే గాక వాటిని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాని వాటిని ఆచరించడమే కష్టం. ఎందుకంటే మనస్సుకు విధేయత చూపడం కష్టమనిపిస్తుంది. ఈ కారణంగానే అవిధేయులు ఆచరించరు.
6. ప్రవక్తలు ఎందుకు వచ్చారు?
దివ్య ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకోవడానికి ఉన్నతమైన చదువులే అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్తలు తెలియని వారికి రుజుమార్గం చూపేందుకు, అజ్ఞానులకు జ్ఞానం నేర్పడం కోసం, మూర్ఖులకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే వచ్చారు.
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:
62:2 هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ
ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. (దివ్యఖుర్ఆన్ – 62 : 2)
అల్లాహ్ ఇలాంటి ప్రవక్తను పంపడం గొప్ప అనుగ్రహం. ఆయన అజ్ఞానులను జ్ఞానులుగా, అపవిత్రులను పవిత్రులుగా, అభాగ్యులను భాగ్యవంతులుగా, మార్గభ్రష్టులను మార్గదర్శకులుగా చేశారు. ఈ ఆయత్ ను అర్థం చేసుకుని కూడా ఎవరయినా, ఖుర్ఆన్ హదీసులను పండితులే అర్థం చేసుకోగలరు అని అంటే వారు ఈ సూక్తిని తిరస్కరిస్తున్నారు. విశ్వప్రభువు ప్రసాదించిన అనుగ్రహాన్ని గౌరవించడంలేదు. ఈ ఆయత్ ప్రకారం పామరులు పండితులవుతారు, మార్గ భ్రష్టులు మార్గం పొంది మహాత్ములవుతారు.
7. వైద్యుడు, రోగి
ఉదాహరణకు ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని దైన్య స్థితికి జాలిపడి ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు మరొకడు. “ఆరోగ్యవంతుడైన డాక్టరు వద్దకు ఆరోగ్యవంతులు వెళతారు. కాబట్టి నేను అతని వారి వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకోను” అని అంటే అతని గురించి మీరు ఏమనుకుంటారు? పిచ్చివాడేమో, ఆ వైద్యుడి మీద అతనికి నమ్మకం లేదేమో అనుకుంటారు. ఎందుకంటే వైద్యుడు రోగులకే వైద్యం చేస్తాడు. ఆరోగ్యంగా ఉన్న వారికి కాదు.
భావం ఏమిటంటే, పుణ్యాత్ములు, పండితులతోపాటు పాపాత్ములు, పామరులు కూడా ఖుర్ఆన్ హదీసులను తెలుసుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ధార్మిక ఆదేశాలను తప్పనిసరిగా ఆచరించాలి. కనుక ప్రతి సామాన్యుడు, ప్రముఖుడు కూడా విధిగా ఖుర్ఆన్ హదీసుల అన్వేషణలో ఉండాలి. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచరుల పద్ధతిలో ప్రయత్నం చేయాలి. వాటిని ఆచరించాలి.
8. అల్లాహ్ ఏకత్వం, దైవదౌత్యం
విశ్వాసం (ఈమాన్)లో ప్రధానంగా రెండు భాగాలున్నాయి.
- అల్లాహ్ ను తిరుగులేని దేవుడుగా, సర్వాధికారిగా భావించడం.
- ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను దైవప్రవక్తగా అంగీకరించడం.
అల్లాహ్ ను నిజమైన దేవుడని భావించడమంటే; ఆయనకు భాగస్వాములను కల్పించకూడదు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రవక్తగా అంగీకరించడమంటే ఆయన మార్గాన్నే అనుసరించాలి. మొదటి భాగం ఏకదైవారాధన. రెండవ భాగం ప్రవక్త విధేయత, ప్రవక్త విధానం అనుసరణ. షిర్క్ తౌహీద్కు వ్యతిరేకం. బిద్అత్ (దురాచారాలు) సున్నత్ (ఆచారాలు)కు వ్యతిరేకం. ప్రతి ముస్లిం విధిగా తౌహీద్, సున్నత్ (ప్రవక్త సంప్రదాయాలలో)లపై నిలకడగా ఉండాలి. వాటిని హృదయాంతరాళాల్లో నింపుకోవాలి. షిర్క్ మరియు బిద్అత్ లకు దూరంగా ఉండాలి. షిర్క్ మరియు బిద్అత్ ల వల్లనే విశ్వాసానికి చెద పడుతుంది. దీని ద్వారా ఈమాన్ సన్నగిల్లుతుంది. ఇతర పాపాల వల్ల కేవలం ఆచరణల్లో అవరోధం కలుగుతుంది. షిర్క్ మరియు బిద్అత్ లకు దూరంగా ఉంటూ సున్నత్ కు కట్టుబడి ఉండే ఏక దైవారాధకుడైన వ్యక్తి వద్ద కూర్చోవడం వల్ల తౌహీద్ మరియు సున్నత్ లపై మక్కువ పెరుగుతుంది. అటువంటి వారినే గురువులుగా, పండితులుగా భావించాలి.
సారాంశం
- ఆచరణల స్వీకృతి సిసలైన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
- కొందరు హేతువాదులుగా ఉంటారు. కాని వాస్తవానికి ఖుర్ఆన్ మరియు సున్నత్ (సంప్రదాయం) అనుసరణ పూర్వీకుల(సలఫ్) విధానాల ప్రకారం ఉండాలి.
- ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆచరించవచ్చు.
- ప్రవక్త రాక ఉద్దేశం ధర్మాన్ని సులభతరం చేయడమే. కనుక ధర్మం ఎవరి కోసమైనా సులువే.
- ఏకేశ్వరోపాసన, సున్నత్ అనుసరణ విశ్వాసంలో ప్రధానంగా గల రెండు భాగాలు. బహుదైవారాధన మరియు బిద్ అత్ (ధర్మంలో కొత్త పోకడలు) వీటికి విరుద్ధం. కనుక ఏకేశ్వరోపాసి మరియు సున్నత్ లను అనుసరించే వారినే గురువులుగా భావించాలి
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- దాసుని విధి ఏమిటి?
- అత్యుత్తమమైన మార్గమేది?
- వైద్యుడు, రోగి ఉదాహరణతో ఏవిషయం అర్ధమవుతుంది?
- ఈమాన్లో ఎన్ని భాగాలున్నాయి?
తప్పొప్పులను గుర్తించండి
- ధర్మాన్ని అర్ధం చేసుకోవడం కష్టం
- ప్రవక్తలు ధర్మాన్ని నేర్పేందుకు వస్తారు
- ఖుర్ఆన్, హదీసు మరియు ప్రవక్త అనుచరులు అనుసరణ విధానం అన్నిటికంటే అత్యుత్తమమైన మార్గం.
ఖాళీలను పూరించండి
- అన్నిటికంటే ఉత్తమమైన మార్గము ……… మరియు ……..
- అల్లాహ్ ప్రవక్తలను………. ….. కొరకు పంపాడు.
- ఈమాన్ (విశ్వాసం) యొక్క భాగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి….. రెండోది ………
మొదటి అధ్యాయం : తౌహీద్ వివరణ
1. ప్రజల అజ్ఞానం
సాధారణంగా షిర్క్ (బహుదైవారాధన) ప్రజల్లో వ్యాపించి ఉంటుంది. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) అరుదై ఉంటుంది. విశ్వాసులమని ప్రకటించుకునే చాలామందికి కూడా అసలు తౌహీద్ మరియు షిర్క్ అంటే అర్థమేమిటో తెలియదు. పేరుకు మాత్రమే ముస్లిములు. కాని వారు తమ అజ్ఞానం వల్ల షిర్క్ లో పడిఉన్నారు. ముందుగా తౌహీద్ మరియు షిర్క్ అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా తౌహీద్, షిర్క్ ల వల్ల జరిగే మంచి చెడులేమిటో తెలుసుకోగలరు.
2. షిర్క్ చేష్టలు
తౌహీద్ గురించి సరిగ్గా తెలియని వారు ఆపద సమయాల్లో పీర్లను, ప్రవక్తలను, ఇమాములను, షహీదులను (అమరవీరులను) దైవదూతలను, మరియు దైవకన్యలను మొరపెట్టుకుంటారు. వారికే విన్నవించుకుంటారు, వారినే మ్రొక్కుకుంటారు. వారికే మొక్కుబడులు చెల్లిస్తుంటారు. రోగాల నుండి రక్షణ పొందడానికి తమ పిల్లలకు వారి పేర్లే పెడుతుంటారు. అబ్దున్నబీ (నబీదాసుడు), అలీ బఖ్ష్ (అలీ ప్రసాదించినది), మదార్ బఖ్ష్ (మదార్ ప్రసాదించినది) మస్తాన్ అలీ (అలీని సహాయం కోరేవాడు), జాన్ షహీదా; బాజీ, మదీనా, వలిబాబా, మీరా, పీరా, బషీరమ్మ లాంటి పేర్లు పెడుతుంటారు. మరికొందరు దేవుళ్ళ పేర జుత్తు పెంచుతారు. మాలలు ధరిస్తారు, ఇంకొందరు ఎవరివైన పేరు మీద బేడీలు, త్రాడులు, దారాలు, కడియాలు, చెవిపోగులు తొడుగుతారు. ఇంకొందరు జంతువులను బలి ఇస్తారు. ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు వారినే వేడుకుంటారు. వారి మీదే ప్రమాణాలు చేస్తారు. ముస్లిమేతరులు దేవీదేవతల పేర్ల మీద చేసే కార్యాలన్నీ ముస్లిములు ప్రవక్తల, ఔలియాల (పుణ్య పురుషుల), ఇమాముల (ప్రముఖ నాలుగు ఇస్లామీయ వర్గీక శాస్త్రాల స్థాపకులు), షహీదుల దైవదూతల మరియు దైవకన్యల పేర్ల మీద చేస్తుంటారు. ఇలాంటి షిర్క్ కార్యాలు చేస్తూనే తాము ముస్లిములమని వాదిస్తుంటారు.
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:
وَمَا يُؤْمِنُ أَكْثَرُهُم بِاللَّهِ إِلَّا وَهُم مُّشْرِكُونَ
వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు (దివ్యఖుర్ఆన్ 12:106)
3. విశ్వాస వాదనలు, షిర్క్ చేష్టలు
తమను తాము విశ్వాసులమని ప్రకటించుకునే అనేక మంది ముస్లిములు షిర్క్ ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ఎవరయినా వారిని ‘మీరు విశ్వాసులమని ప్రకటించుకుంటున్నారు. కాని చేసేది మాత్రం షిర్క్ కార్యాలు. షిర్క్ మరియు విశ్వాస విరుద్ధ మార్గాలను ఎందుకు కలుపుతున్నారు?’ అని అడిగితే వారు ఈ విధంగా సమాధానమిస్తారు: “మేము షిర్క్ చేయడంలేదు. మేము ప్రవక్తలను, ఔలియాలను (పుణ్యాత్ములను) ప్రేమిస్తున్నాము, వారిని విశ్వసిస్తున్నాము. వారు అల్లాహ్ కు సమానులని భావిస్తేనే కదా షిర్క్ అవుతుంది. మేము వారిని అల్లాహ్ సృష్టితాలుగానే భావిస్తున్నాం. అల్లాహ్ వారికి శక్తిని, అధికారాలను ప్రసాదించాడు. వారు అల్లాహ్ ఇష్టప్రకారమే ఈ ప్రపంచంలో, అధికారం చేస్తున్నారు. వారిని మొరపెట్టుకోవడమంటే అల్లాహ్ ను మొరపెట్టుకోవడమే. వారిని సహాయం కోరితే అల్లాహ్ ను సహాయం కోరినట్టే. వారు అల్లాహ్ ప్రియదాసులు. ఏమైనా చేయగలరు. వారు మా సిఫారసుదారులు, పర్యవేక్షకులు. వారిని పొందితే అల్లాహ్ ను పొందినట్టే. వారిని అర్థించడం వల్ల అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుంది. మేము వారిని ఎంతగా ప్రేమిస్తే మేము అల్లాహ్ కు అంతే దగ్గరవుతాము” అని వృధా మాటలు మాట్లాడుతుంటారు.
4. ఖుర్ఆన్ తీర్పు
దీనంతటికీ కారణం వీరు ఖుర్ఆన్, హదీసులను వదలి పెట్టడమే. వీరు షరీఅత్ (ఇస్లామీయ శాసనాంగం) విషయంలో హేతువాదన చేస్తారు. కొందరైతే కట్టుకథల వెనుకే పరుగెడుతున్నారు. దురాచారాలను ఆధారాలతో పేర్కొంటారు. ఒకవేళ వీరికి ఖుర్ఆన్ మరియు హదీసుల పరిజ్ఞానం ఉంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ముష్రిక్కులు (బహు దైవారాధకులు) ఇలాంటి ఆధారాలే పేర్కొనే వారని, అందుకనే వారిపై అల్లాహ్ శిక్ష అవతరించిందని, వారు అబద్ధాల కోరులనబడ్డారని తెలిసేది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్ కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (దివ్యఖుర్ఆన్ 10 : 18)
5. అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూ లేడు
ముష్రికులు ఎవరినయితే పూజిస్తున్నారో వారు నిస్సహాయులు. వారిలో ఎవరికైనా లాభంగానీ నష్టంగానీ కలిగించే శక్తిలేదు. పైగా వీరే అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని ముష్రిక్కులు అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే అల్లాహ్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు! ఏమిటీ? మీకు భూమ్యాకాశాల విషయాలు అల్లాహ్ కంటే ఎక్కువగా తెలుసా? వారు మీ కోసం సిఫారసు చేస్తారని ఎలా అనగలరు? అసలు విషయమేమిటంటే; ఈ విశ్వంలో మొర పెట్టుకుంటే లాభం చేకూర్చే, మొరపెట్టు కోకపోతే నష్టం కలిగించే సిఫారసుదారులు ఎవరూ లేరు. ప్రవక్తలు సిఫారసు చేయడం కూడా అల్లాహ్ అధికారానికి లోబడే ఉంది. వారు మొరపెట్టుకోవడం వల్ల, మొరపెట్టు కోకపోవడం వల్ల జరిగేదేమీ లేదు. దీనివల్ల తెలుస్తున్న మరో విషయం ఏమిటంటే; ఎవ రయినా ఎవరినైనా సిఫారసుదారునిగా భావించి ఆరాధిస్తే వారు కూడా ముష్రిక్కులే (బహుదైవారాధకులే). అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (దివ్యఖుర్ఆన్ 39 : 3)
6. అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవడూ లేడు
వాస్తవమేమిటంటే, అల్లాహ్ జ్ఞానపరంగా మానవుడికి అత్యంత సమీపంలో ఉన్నాడు. కాని మానవులు ఈ విషయాన్ని వదలిపెట్టి విగ్రహాలే వారిని అల్లాహ్ కు దగ్గరగా చేస్తాయని అనుకుంటున్నారు. విగ్రహాలనే తమ సంరక్షకులుగా భావించ సాగారు. ‘అల్లాహ్ ప్రత్యక్షంగా అందరి విషయాలను వింటాడు, అందరి మొరలను ఆలకిస్తాడు‘ అన్న విషయాన్ని ధిక్కరించి అల్లాహ్ ఆహ్రానికి గురయిపోయారు. ఇతరులను అర్థించసాగారు. వారి ముందు మొర పెట్టుకోసాగారు. మరీ దారుణం ఏమి టంటే, తప్పుడు విధానాల ద్వారా, అపమార్గాల ద్వారా అల్లాహ్ సాన్నిధ్యాన్ని అన్వేషి స్తున్నారు. ఇలాంటి కృతఘ్నులు, అబద్ధాల కోరులు రుజుమార్గం ఎలా పొందగలరు? వీరు అపమార్గంలో పయనించేకొద్దీ రుజుమార్గానికి దూరమవుతూ ఉంటారు.
7. అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు
దీనిద్వార తెలిసిందేమిటంటే, ఇతరులను పూజించడంవల్ల అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుందని భావించేవారే ముష్రిక్కులు (బహుదైవారాధకులు). ఇలాంటి వారు అబద్ధాలకోరులు, అల్లాహ్ అనుగ్రహాన్ని ధిక్కరించినవారు కూడాను. అల్లాహ్ దివ్య ఖుర్ఆన్అ ఇలా సెలవిస్తున్నాడు:
قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ
సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.. (దివ్యఖుర్ఆన్ 23 : 88-89)
అంటే, స్వయంగా సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఆయనకు పోటీగా ఎవరూ నిలబడలేరో, ఆయనెవరో చెప్పండి? అని ఒకవేళ ముష్రిక్కులనే (బహుదైవారాధకులను అడిగితే, వారు కూడా ‘అల్లాహ్ మాత్రమే’ అని సమాధాన మిస్తారు. మరలాంటప్పుడు ఇతరులను అర్థించటం పిచ్చికాకపోతే ఇంకేమిటి?
దీని ద్వారా తెలుస్తున్నదేమిటంటే, ఈ విశ్వవ్యవస్థలో అధికారం చేసే శక్తి అల్లాహ్ కు తప్ప ఎవరికీలేదు. ఎవరూ ఎవరికీ సంరక్షకులూ కారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలోని ముష్రిక్కులు కూడా విగ్రహాలను అల్లాహ్ కు సమానమని భావించే వారు కారు. కానీ తాము వారి దాసులమని, సృష్టితాలమని అనుకునేవారు. అంతేకాదు వారిలో దైవత్వశక్తులు ఉండవని వారికి తెలుసు. అయినప్పటికీ వారినే మొరపెట్టుకునే వారు-వారినే మొక్కుకునేవారు. వారికే మొక్కులు చెల్లించేవారు. వారిని సంరక్షకులుగా, సిఫారసుదారులుగా భావించడమే వారు చేస్తున్న షిర్క్. కనుక ఇలా ప్రవర్తించేవారు – విగ్రహాల దాసులమని, వారి సృష్టితాలమని భావించేవారు మరియు అబూజహల్, (ఒక ధర్మ వ్యతిరేకి) వీరు షిర్క్ కార్యం చేయడంలో సరిసమానులు.
8. షిర్క్ వాస్తవికత
షిర్క్ అంటే కేవలం ఎవరినైనా అల్లాహ్ కు సమానులుగా, పోటీదారులుగా భావించటమే కాదు, ఏ విషయాలనైతే అల్లాహ్ తన అస్థిత్వం కోసం, లక్షణాల కోసం ప్రత్యేకించుకున్నాడో మరియు తన దాసుల కోసం ఆరాధనా కార్యాలుగా నిర్ణయించాడో వాటిని ఇతరులకు ఆపాదించడం కూడా షిర్క్ అవుతుంది.
ఉదాహరణకు: సజ్దహ్ చేయడం (సాష్టాంగపడటం). అల్లాహ్ పేర ఇచ్చే ఖుర్బానీ(బలిదానం) ఇతరుల పేర ఇవ్వడం, మొక్కుబడి చెల్లించడం, ఆపదల్లో మొరపెట్టుకోవడం, అల్లాహ్ స్వయంగా ప్రతీ చోట ఉన్నాడని భావించడం. అధికారంలో, సార్వభౌమత్వంలో ఇతరులకు భాగస్వామ్యం ఉందని భావించడం – ఇవన్నీ షిర్క్ లోని రకాలు. సజ్దహ్ కేవలం అల్లాహ్ కోసమే చేయాలి. ఖుర్బానీ (బలిదానం) అల్లాహ్ కోసమే ఇవ్వాలి. అల్లాహ్ నే మొక్కుకోవాలి. ఆపదల్లో ఆయన్నే మొరపెట్టుకోవాలి. ఆయన సమస్తాన్ని పరివేష్టించి, కనిపెట్టి ఉండేవాడు. సార్వభౌమాధికారం ఆయన చేతుల్లోనే ఉంది. వీటిలో ఏ గుణమైనా అల్లాహ్ యేతరుల్లో కూడా ఉందని భావించడం షిర్క్ అవుతుంది. దైవేతరులు అల్లాహ్ కంటే తక్కువ వారని; ఒకవేళ వారు అల్లాహ్ సృష్టితాలు, దాసులు అని భావించినా సరే. ఈ విషయంలో ప్రవక్తలు, పుణ్యాత్ములు జిన్నులు, షైతాన్, భూతం, పిశాచం, దైవకన్యలు మొదలగు వారందరూ సమానులే. వీరందరిలో ఎవరి విషయంలో ఇలా వ్యవహరించినా అది షిర్క్ అవుతుంది. అలా చేసేవారు ముష్రిక్కులు అనబడతారు. యూదులు, క్రైస్తవులు విగ్రహారాధకులు కానప్పటికీ విగ్రహారాధకులకు మాదిరి గానే అల్లాహ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే వారు ప్రవక్తల, పుణ్యాత్ముల విషయంలో ఇలాగే వ్యహరించేవారు.
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు:
اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్ను వదలి తమ పండితుల (అహ్బార్)ను, సన్యాసుల (రుహ్బాన్)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్ కుమారుడైన మసీహ్ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు.. (దివ్యఖుర్ఆన్ 9 : 31)
అంటే పవిత్రుడైన అల్లాహ్ అందరికంటే పెద్ద ప్రభువని, మత గురువులు చిన్న ప్రభువులని వారు నమ్ముతున్నారు. దీని గురించి వారికి ఆదేశించడం జరగలేదు. వారు చేస్తున్నది ఘోరమైన షిర్క్ మాత్రమే. అల్లాహ్ ఒంటరివాడు. అతనికి చిన్నా, పెద్దా భాగస్వాములెవరూ లేరు. అందరూ ఆయనకి నిస్సహాయదాసులే.
అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ ఇలా ఆదేశిస్తున్నాడు:
إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు. (దివ్యఖుర్ఆన్ 19 : 93-95)
మానవులైనా, దైవదూతలయినా అందరూ అల్లాహ్ బానిసలే. అల్లాహ్ వద్ద వారికి అంతకంటే ఎక్కువ స్థానంలేదు. వారు అల్లాహ్ అధీనంలో ఉన్నారు. వారు నిస్సహాయులు, వారికి ఏ అధికారమూ లేదు. అంతా విశ్వ ప్రభువైన అల్లాహ్ అధికారంలోనే ఉంది. ఆయన అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన ఎవరినీ ఎవరి ఆధీనంలోకీ ఇవ్వడు. లెక్కకోసం అందరూ ఆయన ముందు హాజరు కావలసి ఉంది. అక్కడ ఎవరూ ఎవరికీ సంరక్షకుడు, పరిరక్షకుడు కాలేడు. దివ్య ఖుర్ఆన్లో ఈ అంశానికి సంబంధించి ఎన్నో ఆయత్లు ఉన్నాయి. కాని మేము ఉదాహరణకు కొన్ని ఆయత్లనే పొందుపరిచాము. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) షిర్క్ మరియు తౌహీద్ లను బాగా అర్థం చేసుకుంటాడు.
సారాంశము
1. సామాన్య ప్రజలు సుఖదుఃఖాలలో ముస్లిమేతరుల మాదిరిగానే వివిధ ఆస్థానాల వద్ద కృతజ్ఞతాపూర్వకంగా, సహాయార్థం కోసం వివిధ రకాల దురా చారాలు చేస్తుంటారు. అయినప్పటికీ వారు తమను తాము ముస్లింలుగానే భావించుకుంటారు. కాని వారు బహుదైవారాధకులు.
2. అనేక మంది ముస్లిములు ముస్లిమేతరుల మాదిరిగానే బహుదైవారాధనకు పాల్పడుతుంటారు. పైగా అల్లాహ్ పుణ్యాత్ములకు అధికారం చెలాయించే శక్తినిచ్చాడని, వారధిగా, సిఫారసుదారునిగా చేశాడని వితండవాదనలు చేస్తారు. యదార్ధమేమిటంటే దివ్యఖుర్ఆన్ ఈ వాదనలను చాలా స్పష్టంగా ఖండిస్తుంది. (దివ్య ఖుర్ఆన్-10:18)
3. మిథ్యాదైవాలు నిస్సహాయులు. వారిని సహాయం కోరేవారు బహుదైవారాధకులు. ప్రస్తుత ముస్లిములకు మరియు ఆ కాలపు మక్కా ముష్రిక్కులకు ఇసుమంత తేడా లేదు. వాస్తవానికి ప్రవక్తల, పుణ్యాత్ముల సిఫారసు కూడా అల్లాహ్ చేతిలోనే ఉంది. (దివ్య ఖుర్ఆన్-39 :3)
4. జ్ఞానం పరంగా అల్లాహ్ తన దాసునికి అత్యంత సమీపంలో ఉన్నాడు. సంరక్షకునిగా ఉన్నాడు. దాసుడు తనకు, అల్లాహ్ కు మధ్య ఎన్ని సిఫారసులను, ఎంత మంది సిఫారసుదారులను తీసుకువస్తాడో అతడు అల్లాహ్ కు అంతే దూరం అవుతుంటాడు. (దివ్య ఖుర్ఆన్-23:88-89)
5. అల్లాహ్ తన కోసం ప్రత్యేకించుకున్న గుణాలను మరియు దాస్య చిహ్నాలను ప్రవక్తలకు, పుణ్యాత్ములకు ఆపాదించడం కూడా బహుదైవారాధనే. ఉదాహరణకు: వారిని సహాయం కోరడం, కృతజ్ఞతలు తెలుపుకోవడం. మొక్కుకోవడం, సాష్టాంగపడటం. కనుక యూదులను, క్రైస్తవులను బహు దైవారాధకుల మాదిరిగానే ధూర్తులుగా నిర్ణయించడం జరిగింది. (దివ్యఖుర్ఆన్ 9 : 31)
6. ప్రవక్తలు, పుణ్యాత్ములు అల్లాహ్ ఎదుట బానిసలు, అశక్తులు. అల్లాహ్ తన గుణగణాల్లో, అధికారాల్లో ఒంటరివాడు, ఒకే ఒక్కడు. (19:92)
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- షిర్క్ వాస్తవికతను వివరించండి?
- ప్రజలు ఏ విషయాల్లో షిర్క్ చేస్తున్నారు?
- షిర్క్ కు లోనవటానికి గల కొన్ని కారణాలను పేర్కొనండి?
- ‘వమా యుమిను అక్సరుహుమ్ బిల్లాహి ఇల్లా వహుమ్ ముష్రికూన్’ (చాలా మంది ప్రజలు అల్లాహ్ ను విశ్వసిస్తూనే షిర్క్ కు పాల్పడుతుంటారు. ఈ ఆయత్ అర్థాన్ని వివరించండి?
తప్పొప్పులను గుర్తించండి
- అల్లాహ్ కు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టడం షిర్క్ అవుతుంది.
- ముష్రిక్కులు ఆరాధించే దేవతలు ఎలాంటి నష్టాన్ని, లాభాన్ని కల్గించలేరు.
- అల్లాహ్ తప్ప వేరొకరు సహాయకులున్నారా?
ఖాళీలను పూరించండి
- అల్లాహ్ యే ………………… ఉన్నాడు.
- అల్లాహ్ కు సమానులుగా ఎవరినైనా భావిస్తే ……….. అవుతుంది.
- అల్లాహ్ ను తప్ప వేరొకరిని వేడుకోవడం, సహాయం కోరడం, సిఫారసు చేసే వారిగా భావించడాన్ని ……………. అంటారు.
రెండవ అధ్యాయం : షిర్క్ రకాలు
షిర్క్ లో నాలుగు రకాలు ఉన్నవి
పవిత్రుడైన అల్లాహ్ తన అస్తిత్వం కోసం ఏ ఏ విషయాలను ప్రత్యేకించుకున్నాడో వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తద్వారా ఆ విషయాలలో అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించకుండా ఉండాలి. ఇలాంటి విషయాలు కోకొల్లలు.
మేము కొన్ని విషయాలను ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా పరిశీలి స్తున్నాము. దీని ద్వారా ప్రజలు వేరే విషయాలను కూడా అర్థం చేసుకోవచ్చు.
1. జ్ఞానంలో షిర్క్
మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్ జ్ఞానపరంగా సర్వత్రా ఉన్నాడు. ప్రతీ సమయం చూస్తున్నాడు. ప్రతి విషయం అతని జ్ఞాన పరిధిలోనే ఉంది. అందుకనే జరగబోయే విషయాలన్నీ, ప్రతి క్షణం అతనికి తెలిసి ఉంటాయి. ఆ విషయాలు దూరంగా దగ్గరగా, బాహ్యంగా, అంతర్గతంగా, ఆకాశాల్లో, పృధ్విలో, పర్వతాల్లో, లోయల్లో, సముద్ర లోతుల్లో ఎక్కడ ఉన్నా సరే. ఇది అల్లాహ్ గొప్పతనం. మరెవరికీ ఇది సాధ్యం కాదు.
ఎవరయినా కూర్చుంటూ నిలబడుతూ దైవేతరుల పేర్లు తీసుకున్నా లేదా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తమ ఆపదలు తొలగించమని దైవేతరులను మొర పెట్టుకున్నా లేదా శత్రు మూకలపై వారి పేరుతో దాడి చేసినా లేదా వారి పేర్లను ధ్యానించినా లేదా వారి ఊహలను మదిలో ఏర్పరచుకుని ‘నేను నోటితో వారి పేరు తీసుకుంటే మనస్సులో వారిని ఊహించుకుంటే వారి ఆకారాన్ని ఆలోచించుకుంటే వారి సమాధిని తలుచుకుంటే వారికి తెలుస్తుంది. నాకు సంబంధించిన ఏ విషయమూ వారి నుండి దాయబడిలేదు. ఇంకా నాపై అవహించే పరిస్థితులు ఉదాహరణకు అస్వస్థత – ఆరోగ్యం, కలిమి-లేమి, జననం-మరణం, దుఃఖం- సంతోషం ఇలాంటి విషయాలన్నీ వారికి తెలిసే ఉంటాయి. నా నోటి నుండి వెలువడే మాటలు వారు వింటారు. నా మదిలోని ఆలోచనలు, భావనలు కూడా వారికి తెలుసు’ ఇలాంటి విషయాలన్నీ షిర్క్ గానే పరిగణించబడతాయి. జ్ఞానంలో షిర్క్ అంటే ఇదే.
అల్లాహ్ కు మాదిరిగానే అల్లాహ్ ఏతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందని భావించడం వల్ల మనిషి ముష్రిక్ (బహుదైవారాధకుడు) అవుతాడు. అంతేకాదు, మహాత్ములకు సంబంధించి గానీ, అల్లాహ్ కు అత్యంత సమీపంలో ఉండే దైవదూతల గురించి గానీ, వీరికి అన్ని విషయాల జ్ఞానం ఉందని నమ్మడం షిర్క్ అవుతుంది. ఆ జ్ఞానం వారికి అల్లాహ్ ప్రసాదించాడని భావించినా సరే. లేదా స్వతహాగా వచ్చిందని భావించినా సరే.
2. అధికారంలో షిర్క్
విశ్వంలో అనుకున్నట్టు అధికారం చేయడం, ఆదేశించడం, చంపడం, బ్రతికించడం, కలిమిని-లేమిని ప్రసాదించడం, ఆరోగ్యం-అనారోగ్యం కలిగించడం, అదృష్టం-దురదృష్టానికి పాలుచేయడం, మొరలు ఆలకించడం, ఆపదలు తొలగించడం, కష్టాల్లో ఆదుకోవడం, సమయానికి సహాయపడటం – ఇదంతా అల్లాహ్ గొప్పతనం. దైవేతరులకు ఇలా చేయడం సాధ్యపడదు. వారు ఎంత గొప్ప వారైనా, లేదా దైవదూతలయినా సరే. అల్లాహ్ ను వదలి ఇతరులకు ఇలాంటి అధికారాన్ని అంటగట్టి వారిని మొరపెట్టు కోవడం, వారి పేరున మొక్కుకోవడం, వారి పేర బలి ఇవ్వడం, ఆపదలు వచ్చినప్పుడు తొలగించమని వారిని మొరపెట్టుకోవడం లాంటి పనులు చేసేవారు ముష్రిక్లులు. దీనినే అధికారంలో షిర్క్ అంటారు. అంటే అల్లాహ్ కు మాదిరిగా దైవేతరులు కూడా అధికారం చెలాయించగలరని భావించడం షిర్క్. వారికి అధికారం స్వతహాగా లేదా అల్లాహ్ ప్రసాదించిందని భావించినా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ భావన షిర్క్ అవుతుంది.
3. ఆరాధనల్లో షిర్క్
అల్లాహ్ కొన్ని పనులను తన కోసం ప్రత్యేకించుకున్నాడు. వాటిని ఆరాధన అంటారు. ఉదాహరణకు సజ్దహ్ చేయడం, రుకూహ్ చేయడం, చేతులు కట్టుకుని వినయంతో నిలుచోవడం, అల్లాహ్ పేర దానధర్మాలు చేయడం, ఆయన పేరు మీద ఉపవాసాలు ఉండటం, అతని పవిత్ర గృహం (కాబహ్) ను సందర్శించడం కోసం సుదూర ప్రయాణాలు చేయడం, వారి రూపురేఖలను చూసి హరమ్ (పవిత్ర స్థలం) సందర్శకులుగా ప్రజలు గుర్తించడం, మార్గంలో అల్లాహ్ పేరునే పలకడం, చెడు మాటలకు, వేటకు దూరంగా ఉండటం, పూర్తి ఏకాగ్రతతో ఆయన గృహానికి ప్రదక్షిణలు చేయడం, ఆయన కోసం సజ్దహ్ చేయడం, ఆయన కోసం ఖుర్బానీ (బలిదానం) జంతువు తీసుకెళ్లడం, అక్కడ మొక్కుకోవడం, కాబాపై తొడుగు (ఘిలాఫ్) ఎక్కించడం, కాబహ్ ద్వారం ముందు నిలుచొని వేడుకోవడం, ఇహ పరాల మేలుకోరడం, హజ్రె అస్వద్ (నల్ల శిలను) చుంబించడం, కాబహ్ ముల్తజిమ్ (హజ్రె అస్వద్ నుండి కాబహ్ గడుపు వరకు)నకు నోరు, ఛాతి తగిలించి వేడుకోవటం. దాని నలువైపులను కాంతివంతం చేయడం, అందులో సేవకుల మాదిరిగా ఉండటం, ఊడ్వటం, హాజీలకు నీళ్లు త్రాపించడం, వుజూ, స్నానం కోసం నీటి సదుపాయం కల్పించడం, జమ్ జమ్ జలాన్ని శుభముగా భావించి త్రాగడం, తలపై పోసుకోవడం, కడుపునిండా త్రాగడం, ఆ జలాన్ని పరస్పరం పంపిణీ చేయడం, బంధుమిత్రుల కోసం తీసుకెళ్ళడం, దాని పరిసర ప్రాంతాల పొలాలను సురక్షితంగా ఉంచడం, వేటాడకుండా ఉండటం, వృక్షాలు, గడ్డి కోయకుండా ఉండటం, జంతువులను మేపకుండా ఉండటం, ఇవన్నీ అల్లాహ్ తన ఆరాధన కోసమని ముస్లిములకు వివరించాడు.
కనుక ఎవరయినా ప్రవక్తలకు లేదా మహాత్ములకు లేదా భూతపిశాచాలకు లేదా జిన్నాతులు దైవకన్యలకు లేదా మందిరాలకు, మఠములకు, చర్చీలకు, దర్గాలకు, క్షేత్రాలకు, సమాధులకు లేదా ఇళ్ళకు, గుర్తులకు లేదా శవపేటికలకు, సజ్దహ్ చేసినా లేదా రుకూ చేసినా లేదా వారి కోసం ఉపవాసాలు ఉన్నా లేదా వాటి ముందు చేతులు కట్టుకుని నిలబడినా లేదా మొక్కుబడులు చెల్లించినా లేదా వారి పేర జెండాలు పెట్టినా లేదా వారి దగ్గరికి వెనక్కు నడుస్తూ వెళ్లినా లేదా సమాధిని చుంబించినా లేదా సమాధులను సందర్శించడానికి దూరప్రయాణాలు చేసినా లేదా ఆలయాల సందర్శన యాత్ర మరియు నూకాలమ్మ, నంగాలమ్మ, మహంకాళి ఉప్పలమ్మ వార్షికోత్సవాలలో పాలుపంచుకోవటం అక్కడకు వెళ్ళి దీపాలు వెలిగించడం, కాంతి ప్రసరించేలా చేయడం వంటివి చేసినా లేదా వాటి గోడలకు తొడుగులు తొడిగించినా లేదా సమాధిపై దుప్పటి కప్పినా లేదా వాటిపై పందిరి వేసినా, నెమలి ఈకల కట్టెలు పెట్టినా లేదా వాటి ద్వారాలను చుంబించినా లేదా చేతులు కట్టుకుని వేడుకున్నా లేదా వారి ముందు మొరపెట్టుకున్నా లేదా ముజావర్ల (మఠాధిపతుల) రూపమెత్తి సేవలు చేసినా లేదా దాని చుట్టుప్రక్కల మొక్కలను గౌరవించినా ఇలాంటి ఏ రకమయిన పని చేసినా అలాంటి వారు స్పష్టంగా షిర్క్ కు ఒడిగట్టినట్లే. దీనినే ఆరాధనలో షిర్క్(సాటి కల్పించటం) అంటారు. అంటే దైవేతరులు స్వతహాగా గౌరవార్హులయినప్పటికీ లేదా వారిని గౌరవిస్తే అల్లాహ్ సంతోషపడతాడని వారిని గౌరవించడం వల్ల ఆపదలు తొలగిపోతాయని భావించి లేదా అల్లాహ్ ను గౌరవించిన విధంగా వారినీ గౌరవించడం షిర్క్ (సాటి కల్పించటం) అవుతుంది.
4. రోజువారి పనుల్లో (వ్యవహారాలలో) షిర్క్
ప్రాపంచిక పనుల్లో దాసులు అల్లాహ్ ను స్మరిస్తుండాలనీ, వినమ్రులై ఉండాలనీ, తద్వారా వారి విశ్వాసం సక్రమంగా ఉంటుందనీ పనుల్లో శుభం కలుగుతుందని వారికి క్రమశిక్షణ నేర్పాడు. ఉదాహరణకు ఆపదల్లో ఉన్నప్పుడు ఆపద తొలగించమని అల్లాహ్ ను మొక్కుకోవడం, కష్టాల్లో అతన్నే మొరపెట్టుకోవడం, పని ప్రారంభించేటప్పుడు శుభం కలగడం కోసం అల్లాహ్ పేరు స్మరించటం, సంతానం కలిగినప్పుడు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతని పేర జంతువులను జిబహ్ చేయడం, సంతానం పేర్లు అబ్దుల్లాహ్ (అల్లాహ్ దాసుడు), అబ్దుర్రహ్మాన్ (రహ్మాన్ దాసుడు), ఇలాహీ బఖ్ష్ (అల్లాహ్ వరప్రసాదం) మొదలగునవి పెట్టడం, పంటలోనుండి కొంత ధాన్యాన్ని అల్లాహ్ పేర తీయడం, ఫలాల్లో కూడా కొన్ని అల్లాహ్ పేర తీయడం, జంతువుల్లోనూ కొన్నింటిని అల్లాహ్ పేర చేయడం, అల్లాహ్ పేర కాబా గృహానికి తీసుకు వెళ్లే జంతువులను అపూర్వంగా చూసుకోవటం అంటే వాటిపై స్వారీ కాకుండా వాటిపై బరువు మోపకుండా ఉండటం – తినడం, త్రాగడం, ధరించడం వంటి వాటిల్లో అల్లాహ్ ఆదేశాలను శిరసావహించడం, ఆయన ఆదేశించిన ప్రకారం నడుచుకోవడం, నిషేధించిన విషయాలకు దూరంగా ఉండటం, ప్రాపంచిక జీవితంలో కష్టసుఖాలు, ఆరోగ్యం, అనారోగ్యం, జయాపజయాలు, అదృష్ట దురదృష్టాలు ఏది సంభవించినా అంతా అల్లాహ్ చూస్తున్నాడని అది ఆయన అధికారంలోనే ఉందని భావించడం, ఏదైనా పని చేయ సంకల్పించుకున్నప్పుడు ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలచుకుంటే) అనడం ఉదాహరణకు “ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలచుకుంటే) మనం ఫలానా పని చేద్దాం” అనడం – పవిత్రమైన అల్లాహ్ పేర్లు పలికేటప్పుడు ఎంతో మర్యాదతో ఆయన ఔన్నత్యం ఉట్టిపడేలా పలకటం, మన దాస్యము ప్రస్ఫుటమయ్యేలా మెలగటం. ఉదాహరణకు “మా ప్రభువు, మా యజమాని, మా సృష్టికర్త, మా ఆరాధ్యదైవం” వంటి వాటితో పలకాలి. ఒకవేళ ప్రమాణం చేయాల్సిన సందర్భం ఎదురయితే కేవలం అల్లాహ్ పేరు తోనే ప్రమాణం చేయాలి. ఇలాంటి విషయాలను పవిత్రుడైన అల్లాహ్ తన ఔన్నత్యం కోసమే నిర్ణయించుకున్నాడు.
ఎవరైనా ఈ రకమైన గౌరవం దైవేతరుల విషయంలో పాటిస్తే, అది ఆరాధనలో షిర్క్ అవుతుంది. ఆరాధనలో భాగస్వామ్యం అవుతుంది. ఉదాహరణకు పని ఆగిపోయి ఉన్నా లేదా చెడిపోతున్నా దానిని పునఃప్రారంభించడం కోసం లేదా ఆ పని సక్రమంగా జరగాలని దైవేతరులను మొక్కు కోవడం ఉదాహరణకు కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టడం, హారతి తీయడం, వాస్తుచూడటం, దిష్టి దూరము చేసే విధానాలు. పిల్లలకు నబీ దాసుడు, ఇమామ్ బఖ్ష్ (ఇమామ్ గారు ప్రసాదించిన బిడ్డ) మొదలైనవి, పీర్ ప్రసాద్ (పీర్ గారు ప్రసాదించిన బిడ్డ), దుర్గారావు, యాదగిరి, జాన్ షహిదా లాంటి పేర్లు పెట్టడం, పొలంలో లేదా తోటలో వారి కోసం ఒక భాగం తీయడం, పంటకోతకు వచ్చిన తర్వాత ముందు వారి పేర భాగం తీయడం, తరువాత వాటిని ఉపయోగించడం, జంతువులను వారి పేరుపై వదలి పెట్టడం, అలాంటి జంతువులను అపూర్వంగా చూడటం, అవి దూరి నీళ్లు తాగుతున్నప్పుడు గడ్డిమేస్తున్నప్పుడు గౌరవభావంతో వాటిని అక్కడి నుండి వెళ్లగొట్టకుండా ఉండటం, కర్రలతో రాళ్లతో వాటిని కొట్టటాన్ని పాపంగా భావించడం, తినడం త్రాగడం ధరించడం వంటి పనుల్లో ఆచారాలను పాటించడం, ఫలానా, ఫలానా వారు ఫలానా పదార్థాలు తినకూడదని, ధరించకూడదని భావించడం. ప్రాపంచిక మేళ్ళు, కీడు వారే కలిగిస్తారని భావించడం, ఫలానా, ఫలానా వారు దైవేతరుల శాపానికి గురయ్యారు, అందువల్ల వారు పిచ్చివాళ్ళయ్యారు, వారు తిరస్కరించడం వల్లనే ఫలానా అతను అగత్యపరుడయ్యాడు, దైవేతరులు ఫలానా వారికి ప్రసాదించడం వల్లనే అదృష్టం, సౌభాగ్యం వారి పాదాల చెంత చేరింది, ఫలానా నక్షత్రం వలన కరవు ఏర్పడింది, ఫలానా పని ఫలానా ఘడియలో ఫలానా రోజు ప్రారంభించడం వల్ల అది పూర్తికాలేదు, లేదా “అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోరితేనే నేను వస్తాను అనడం” లేదా “పీర్గారికి ఇష్టమయితేనే ఈ పని జరుగుతుంది” లేదా “సంభాషణలో గరీబ్ నవాజ్ (దాత), గౌస్ (అగత్యపరుడు), ఖుదాయోఁకా ఖుదా (ప్రభువులకు ప్రభువు), షహెన్ షాహ్ (సర్వ ప్రపంచానికి చక్రవర్తి)” యజమానులకు యజమాని, లాంటి పదాలు ఉపయోగించటం. ప్రమాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రవక్తపై, అలీపై, ఇమామ్ పై లేదా పీర్ పై వారి సమాధులపై లేదా నాతోడు అని ప్రమాణం చేయటం ఇలాంటి పనుల ద్వారా షిర్క్ జనిస్తుంది. వీటినే రోజువారి కార్యకలాపాల్లో అల్లాహ్ తో షిర్క్ అంటారు. అంటే, సాధారణ పనుల్లో అల్లాహ్ ను గౌరవించిన విధంగానే దైవేతరులనూ గౌరవించడం. షిర్క్ లోని ఈ నాలుగు రకాల గురించి దివ్యఖుర్ఆన్, హదీసుల్లో సవివరంగా పేర్కొనడం జరిగింది. కనుక మేము ఈ అంశాలన్నింటిన్నీ రానున్న అధ్యాయాల్లో ప్రస్తావించాము.
సారాంశం
1. అల్లాహ్ జ్ఞానం రీత్యా అంతటా ఉన్నాడు, చూస్తున్నాడు. అతని పరిజ్ఞానం మొత్తం విశ్వాన్ని ఆవహించి ఉంది. అతను ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరి పట్లయినా పరోక్షంగా తెలిసినవాడు. ఈ గుణంలో ఎవరినైనా, ఏ విధంగానైనా భాగస్వాములను చేస్తే అది జ్ఞానంలో షిర్క్ (జ్ఞానంలో భాగస్వామ్యం) అవుతుంది.
2. విశ్వమంతటిలో అల్లాహ్ తన ఇష్టప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఏ విధంగానైనా అధికారం చేయడం అతని సొంత గుణం. ఈ గుణంలో ఎవరినైనా, ఏ విధంగానైనా భాగస్వామిని చేయడం షిర్క్ ఫిత్తసర్రుఫ్ (అధికారంలో భాగస్వామ్యం) అవుతుంది.
3. అల్లాహ్ కోసం ప్రత్యేకించబడిన ఆరాధనల్లో వేరే వారిని ఏ రకంగానైనా, ఏ ఉద్దేశంతోనైనా భాగస్వాములను చేయడాన్ని ఆరాధనల్లో షిర్క్ అంటారు.
4. రోజువారి పనుల్లో గౌరవార్థం, కృతజ్ఞతాపూర్వకంగా శుభము కొరకు అల్లాహ్ పేరు తీసుకోవడం, మంచి చెడు అతని ఇచ్ఛతో, అధికారంతోనే జరుగుతాయని భావించడం మరియు అన్ని సందర్భాల్లోనూ నోటితో, ఆచరణలతో అతని దాస్యమే ప్రస్ఫుటమయ్యేలా చేయడం తౌహీద్ ఫిల్ ఆదాత్ (వ్యవహారాలలో ఏకేశ్వరోపాసన) అవుతుంది. కనుక ఈ పనుల్లో ఎవరినైనా, ఏ విధంగానైనా ఏ ఉద్దేశంతోనైనా భాగస్వాములను చేయడం మరియు ఈ పనులు వారి కోసం ఆపాదించడం వ్యవహారాలలో బహుదైవారాధన అవుతుంది.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- “అల్లాహ్ జ్ఞానం” గురించి ఏ విధంగా విశ్వసించాలి?
- షిర్క్ లోని కొన్ని ప్రముఖమైన రకాలను తెలుపండి?
- జ్ఞానంలో షిర్క్ అంటే ఏమిటి?
- అధికారంలో షిర్క్ అంటే ఏమిటి?
- ఆరాధనల్లో షిర్క్ చేయడం అంటే ఏమిటి?
- రోజువారి పనుల్లో షిర్క్ అంటే ఏమిటి? లేదా వ్యవహారాలలో షిర్క్ అంటే ఏమిటి?
తప్పొప్పులను గుర్తించండి
- అల్లాహ్ మాదిరిగానే దైవేతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అన్న భావన సమ్మతమే
- అల్లాహ్ కు మాదిరిగా ప్రపంచంలో అధికారం చెలాయించే శక్తి మిథ్యా దైవాలకు ఉందని నమ్మడం షిర్క్ అవుతుంది
- అవసరమున్నప్పుడు నబీ, వలీ, ఇమామ్ మరియు పీర్లపై ప్రమాణాలు చేయడం షిర్క్ అవుతుంది
- మిథ్యా దైవాల కొరకు సజ్దహ్, రుకూల (వంగుట), చేతులు కట్టుకుని వినయంతో నిలుచోవడం ఆరాధనలో షిర్క్ అవుతుంది.
- ఆరోగ్యం, అనారోగ్యం, విజయం, వైఫల్యం, సుఖ, దుఖాల్లో దైవేతరులకు అధికారముంది
ఖాళీలను పూరించండి
- అల్లాహ్ కు మాదిరిగా దైవేతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉందనుకోవడం ……… అవుతుంది.
- అల్లాహ్ తప్ప ఇతరులను కలిమిలేములను ప్రసాదిస్తారని, పేదరికం, ఆరోగ్యం అనారోగ్యం, వైఫల్యం చెందటం, కష్టాలు, బాధల నుండి విముక్తి కలిగించే వారని భావించడం అవుతుంది.
మూడవ అధ్యాయం: షిర్క్ లోని కీడు, తౌహీద్ లోని మేళ్ళు
1. బహుదైవారాధన క్షమార్హం కాదు
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు :
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (దివ్యఖుర్ఆన్ 4:116)
మార్గభ్రష్టతలో పడిపోవడమంటే; మానవుడు హలాల్ (ధర్మసమ్మతం) హరామ్ (ధర్మసమ్మతంకాని)ల విషయంలో తేడా చూపకపోవడం, దొంగతనం చేయడం, వ్యర్ధ విషయాల్లో లీనమవడం, నమాజ్ రోజాలను విడిచిపెట్టడం, భార్యా పిల్లల హక్కులు నెరవేర్చకపోవడం మరియు తల్లి దండ్రుల అవిధేయతకు పాల్పడటం – కాని షిర్క్ ఊబిలో పడిపోయినవాడు మరింత ఎక్కువ మార్గభ్రష్టతలో పడిపోతాడు. ఎందుకంటే అతను ఎంతటి మహాపాపానికి ఒడిగట్టాడంటే పశ్చాత్తాపం చెందనంతవరకూ అల్లాహ్ అతన్ని ఎన్నటికీ క్షమించడు. ఇతర పాపాలను పశ్చాత్తాపం చెందకపోయినా అల్లాహ్ తలచుకుంటే క్షమిస్తాడు.
దీన్నిబట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే, షిర్క్ క్షంతవ్యం కాని నేరం. ఈ నేరానికి తప్పకుండా శిక్షపడుతుంది. పెద్ద తరహా షిర్క్ కు పాల్పడితే మనిషి తిరస్కారి (కాఫిర్) అవుతాడు. దానికి శిక్ష శాశ్వత నరకమే. చిన్న తరహా షిర్క్ కు పాల్పడితే దానికి అల్లాహ్ దగ్గర నిర్ణయించబడి ఉన్న శిక్ష తప్పనిసరిగా విధించబడుతుంది [*]. ఇతర పాపాలకు కూడా అల్లాహ్ వద్ద శిక్షలు నిర్ణయించబడి ఉన్నాయి. శిక్ష విధించే విషయం అల్లాహ్ ఇష్టంపై ఆధారపడి ఉంది. ఆయన తలచుకుంటే వదలిపెడతాడు. లేదా శిక్షిస్తాడు.
(*) షిర్క్ చిన్నదయినా పెద్దదయినా ఎప్పటికీ నిషిద్దమే. తౌహీద్ కు విరుద్ధం కూడాను.
2. షిర్క్ దృష్టాంతం
షిర్క్ కంటే పెద్ద పాపం మరొకటి లేదని తెలుసుకున్నాం. దీన్ని ఒక ఉదా హరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాజు తన రాజ్య ప్రజలు నేరాలకు పాల్పడితే దండించడానికి అన్ని రకాల శిక్షలు నిర్ణయించి ఉంచుతాడు. దొంగతనం, దోపిడీ, పహారా కాస్తూ నిద్రపోవడం, దర్బారుకు ఆలస్యంగా రావడం, యుద్ధ మైదానం నుండి పారిపోవడం, ప్రభుత్వ నిధుల పంపిణీలో అవినీతికి పాల్పడటం లాంటి నేరాలు చేస్తే ఏఏ శిక్షలు విధించాలో ముందుగానే నిర్ణయమై ఉంటుంది. శిక్ష విధించడం రాజుగారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఆయన తలచుకుంటే నేరానికి పాల్పడిన వారిని శిక్షించవచ్చు లేదా క్షమించి విడిచి పెట్టనూవచ్చు. కాని కొన్ని నేరాల ద్వారా నేరస్థుల తిరుగుబాటు ప్రస్ఫుటమవుతుంది. ఉదాహరణకు రాజుగారి సమక్షంలోనే వేరే అధికారిని గానీ మంత్రిని గానీ, చౌదరీని గానీ, ధనవంతుడిని గానీ, త్రాగుబోతును గానీ, అల్పుడిని గానీ రాజును చేయడం లాంటి దుశ్చర్యకు పాల్పడటం తిరుగుబాటు అవుతుంది. అంతే కాదు వారిలో ఎవరికైనా కిరీటంగానీ, సింహాసనంగానీ చేయించడం లేదా రాజు ముందు వారిని కీర్తించడం రాచమర్యాదలు చేయటం, లేదా వారి కోసం ఒక రోజు పండుగ చేసి వారి పేర మొక్కుబడులు తీర్చడం, ఇవన్నీ పెద్ద పెద్ద నేరాలు. ఈ నేరాలకు పాల్పడిన వారికి తప్పకుండా శిక్షపడాల్సిందే. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని రాజు శిక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తే అతని సామ్రాజ్యం బలహీనమైపోతుంది. మేధావులు అలాంటి రాజులను అనర్హులుగా, అసమర్థులుగా పేర్కొంటారు.
ప్రజలారా! యజమానులకు యజమాని అయిన ఆ మహా చక్రవర్తికి భయపడండి. అతని శక్తి అపారం. అది అంచనాలకు అందదు. అతను రోషం గలవాడు. అతను బహు దైవారాధకులను శిక్షించకుండా ఎలా ఉంటాడు? శిక్షించకుండా వారిని ఎలా విడిచి పెడతాడు?
అల్లాహ్ ముస్లిములందరినీ క్షమించుగాక! వారిని షిర్క్ లాంటి భయంకరమైన ముప్పు నుండి కాపాడుగాక! అమీన్.
3. షిర్క్ మహాపరాధం
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు:
وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
“లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం..” (దివ్యఖుర్ఆన్ 31 : 13)
అల్లాహ్ లుఖ్మాన్ (అలైహిస్సలాం)కి వివేకాన్ని ప్రసాదించాడు. ఆయన తన బుద్ధి బలంతో ఒకరి హక్కును మరొకరికి ఇవ్వడం అన్యాయమని గ్రహించారు. ఎవరయితే అల్లాహ్ హక్కును అతని సృష్టితాలకు కేటాయిస్తాడో వాడు అత్యున్నతుడికి దక్కాల్సిన హక్కును అల్పునికి ఇచ్చినట్లే. ఎందుకంటే అల్లాహ్ అత్యున్నతుడు. అతని దగ్గర సృష్టితాల స్థానం బానిసల లాంటిది. రాజమకుటాన్ని ఒక అల్పుడి తలపై పెట్టడమంటే దీనికంటే అన్యాయం మరొకటి ఉంటుందా?
వాస్తవమేమిటంటే; మనిషి ఎంత గొప్పవాడయినా లేదా అల్లాహ్ కు అత్యంత సమీప దూత అయినా అల్లాహ్ కు పోటీ దారుడయితే వారి స్థానం హీనుల కంటే అల్పమైనది. షరీఅత్ (ఇస్లామీయ శాసనాంగం) షిర్క్ ను మహాపాపంగా పేర్కొంది. మన బుద్ధి కూడా దాన్ని మహాపాపంగానే పరిగణిస్తుంది. షిర్క్ పాపాలన్నింటిలో మహాపాపం. ఎందుకంటే మానవునిలో ఉన్న లోపం, అతను తన పెద్దలను గౌరవించడు. అల్లాహ్ కంటే పెద్దవాడు మరెవడూ లేడు. షిర్క్ చేయడం అంటే అతని ఔన్నత్యాన్ని అగౌరవ పరచడమే.
4. సాఫల్యానికి మార్గం తౌహీద్ (ఏకేశ్వరోపాసన) మాత్రమే
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు :
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.” (దివ్యఖుర్ఆన్ 21 : 25)
అంటే ప్రవక్తలందరూ అల్లాహ్ నుండి తెచ్చిన ఆదేశం ఏమిటంటే; కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి. దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, తౌహీద్ ను ఆదేశించడం షిర్క్ నుండి దూరంగా ఉండటం అన్ని షరీఅత్ (శాసనాంగాల)లకు సంబంధించిన ఏకాభిప్రాయం గల విషయం. కనుక సాఫల్యానికి తౌహీద్ ఒక్కటే మార్గం. మిగితావన్నీ వక్రమార్గాలే.
5. అల్లాహ్ షిర్క్ (భాగస్వామ్యం)ను లెక్కచెయ్యడు
అబూ హురైరహ్ (రజిరదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
భాగస్వామ్యం చేయబడే వారందరిలోకెల్లా నేను భాగస్వామ్యంకు అతీతుణ్ణి. ఎవరయినా ఏదయినా పని చేస్తూ, ఆ పనిలో నాకు భాగస్వాములను కల్పిస్తే నేను అతడిని, అతను కల్పించిన భాగస్వామిని విడిచిపెడతాను. వారిని లెక్క చేయను. (హదీసు గ్రంథం : ముస్లిం : 2985)
అంటే ప్రజలు ఉమ్మడి వస్తువులను పరస్పరం పంచుకుంటారు. నేను మాత్రం అలా చేయను. ఎందుకంటే నేను నిరపేక్షాపరుడ్ని. ఎవరయినా నా కోసం ఆచరించి అందులో ఇతరులనూ భాగస్వాములుగా చేర్చినపుడు నేను నా భాగాన్ని తీసుకోను. మొత్తం ఇతరుల కోసమే విడిచిపెడతాను. అతని నుండి ముఖం త్రిప్పుకుంటాను
తెలిసిందేమిటంటే ఎవరయితే అల్లాహ్ కోసం ఆచరించి, దైవేతరుల కోసమూ ఆచరిస్తారో వారు షిర్క్ కు పాల్పడ్డారు. మరో విషయం ఏమిటంటే, ముష్రిక్కులు అల్లాహ్ కోసం చేసే ఆరాధనలు స్వీకరించబడవు.
6. ఆత్మావస్థలో తౌహీద్ (ఏకోశ్వరోపాసన) అంగీకారం
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు :
وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, ‘నేను మీ ప్రభువును కానా?’ అని అడిగి నప్పుడు ‘ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం’ అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ లేదా ‘మొదట్లో మా పూర్వీకులు షిర్క్ కు పాల్పడ్డారు. మేము వారి తరువాతి వారి సంతతిలో పుట్టిన వారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురి చేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికి గాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.). (దివ్యఖుర్ఆన్ 7 : 172–173)
ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) “నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, వారితో వాగ్దానం తీసుకున్నాడు” అనే సూక్తి భావాన్ని ఇలా వివరించారు: అల్లాహ్ ఆదం సంతానాన్ని ఒక చోట చేర్చాడు. వారి జంటలు చేసాడు. తరువాత వారి ఆకారాలను రూపొందించాడు. వారికి మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. వారు మాట్లాడసాగారు. అప్పుడు వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు. వారినే సాక్షులుగా చేసి నేను మీ ప్రభువును కానా?” అని ప్రశ్నించాడు. అప్పుడు వారు ‘నువ్వే మా ప్రభువువి’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్ మళ్ళీ వారితో : నేను సప్తాకాశాలను, సప్తభూములను, మీ తండ్రి ఆదంను కూడా మీపై సాక్షిగా ఉంచుతున్నాను. తరువాత మీరు ప్రళయ దినాన ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని అనకుండా ఉండటానికి. నేను తప్ప ఇతర ఆరాధ్యుడుగానీ ప్రభువుగానీ ఎవరూ లేరు. నాతోపాటు ఎవరినీ భాగస్వాములుగా చేర్చకండి. నేను మీ వద్దకు నా సందేశహరులను పంపుతూ ఉంటాను. వారు మీకు మీరు చేసిన ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తుంటారు. మీపై నా గ్రంథాలను అవతరింప జేస్తాను అని అంటాడు. అందుకు వారు ‘నువ్వే మా ప్రభువువి. ఆరాధకుడివి. నీవు తప్ప మరో ప్రభువుగానీ, ఆరాధ్య దేవుడు గానీ లేడు” అని సమాధానం ఇస్తారు.(*) (హదీసు గ్రంథం – మున్నదె అహ్మద్)
(*) ఆత్మావస్థలో తౌహీద్ (ఏకేశ్వరోపాసన)ను మానవులందరూ అంగీకరించారు. ఆ సమయంలో ఆదమ్ (అలైహిస్సలాం)ని పైకి ఎత్తడం జరిగింది. ఆయన అక్కడ ఉన్న వారందరినీ చూశారు. వారిలో ధనవంతులూ ఉన్నారు. నిరుపేదలూ ఉన్నారు. అందమైన వారూ ఉన్నారు. అందవిహీనులూ ఉన్నారు. ఆయన అల్లాహ్ తో ‘అందరినీ ఒకే విధంగా ఎందుకు పుట్టించలేదు’ అని ప్రశ్నించారు. అందుకు అల్లాహ్ నాకు కృతజ్ఞతలు తెలుపడాన్ని నేను ఇష్టపడతాను’ అని సమాధానమిచ్చాడు. ఆదమ్ (అలైహిస్సలాం) చూసిన వారిలో ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు దీపంలా కాంతితో వెలిగిపోతున్నారు. వారి ముఖాల నుండి జ్యోతి ప్రసరిస్తుంది. అల్లాహ్ ప్రవక్తల నుండి దైవదౌత్య విషయంలో కూడా వాగ్దానం తీసుకున్నాడు. ఈ వాగ్దానం గురించి దివ్య ఖుర్ఆన్ ఇలా పేర్కొనడం జరిగింది: ఆ సమయంలో మేము ప్రవక్తల నుండి కూడా వాగ్దానం తీసుకున్నాము. మీ నుండి, నూహ్, ఇబ్రాహీమ్, మూసా, మర్యమ్ కుమారుడు ఈసా (అలైహిస్సలామ్) మొదలైన ప్రవక్తల నుండి కూడా వాగ్దానం తీసుకున్నాము. – అనువాదకుడు
7. షిర్క్ ధ్రువపత్రం కాజాలదు
ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) పైన పేర్కొన్న ఆయత్ (దివ్యఖుర్ఆన్ 7: 172-173) భావాన్ని ఈ విధంగా వివరించారు:
అల్లాహ్ ఆదిమానవుడు ఆదమ్ సంతతి నందరినీ ఒక చోట చేర్చాడు. వారి శరీరాల్లో ఆత్మలను ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు: ప్రవక్తలను, మహాత్ములను, షహీదులను (అమర వీరులను), సజ్జనులను, విధేయులను, అవిధేయులను అందరినీ వేరు వేరు చేశాడు. అదే విధంగా యూదులను, క్రైస్తవులను, ముష్రిక్కులను, ఏకదైవారాధకులను అందరినీ వేరు చేశాడు. వారందరికీ ఈ ప్రపంచంలో ఇచ్చిన రూపాన్ని ఇచ్చాడు. కొందరిని అందంగానూ మరి కొందరిని అంద విహీనులుగాను చేశాడు. కొందరికి చూపు ఇచ్చి ఇంకొందరిని అంధులుగా చేశాడు. కొందరిని మాట్లాడేవారుగా, మరికొందరిని మూగవారుగా చేశాడు. ఇంకొందరిని వికలాంగులను చేశాడు. అప్పుడు వారందరికీ మాట్లాడే శక్తిని ఇచ్చి వారితో నేను మీ ప్రభువును కానా?’ అని ప్రశ్నించాడు. వారందరూ అల్లాహ్ ను తమ ప్రభువుగా అంగీకరించారు. అప్పుడు అల్లాహ్ వారితో తనను తప్ప వేరొకరిని పాలకునిగా, యజమానిగా భావించ కూడదని, తనను కాక వేరే వారిని ఆరాధకులుగా చేయ కూడదని వాగ్దానం తీసుకున్నాడు. వారందరూ అల్లాహ్ వాగ్దానం చేశారు. అల్లాహ్ ఆదమ్ (అలైహిస్సలామ్) ని, ఏడు ఆకాశాలను, భూములను సాక్షులుగా చేస్తూ; మీకు ఈ వాగ్దానాన్ని గుర్తు చేయ డానికి ప్రవక్తలు వస్తారు. తమతోపాటు ఆకాశ గ్రంథాలు తీసుకు వస్తారు అని అన్నాడు. అజల్ (ఆత్మావస్థ) రోజునాడు ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తౌహీద్ (ఏకోశ్వరోపాసన)ను అంగీకరించి, షిర్క్ (బహుదైవారాధన)ను తిరస్కరించాడు. కనుక షిర్క్ లో ఎవరినీ దృష్టాంతంగా పేర్కొనకూడదు. ప్రబోధకులనుగానీ, సన్యాసులను గానీ, మతాధికారులను గానీ, తాతముత్తాతలనుగానీ, చక్రవర్తినిగానీ, పండితులనుగానీ మరియు పుణ్యాత్ములనుగానీ ఎవరినైనా సరే.
8. “మరుపుకు సాకు” స్వీకరించబడదు
ప్రపంచంలో వచ్చాక మాకు ఆ వాగ్దానం గుర్తులేదు. కనుక మేము షిర్క్ చేసినా మమ్మల్ని ఎవరూ పట్టుకోరు, మరిచిపోయిన విషయాల గురించి ఎవరూ ప్రశ్నించరు అని భావించే వారికి సమాధానం ఏమిటంటే; మానవుడికి చాలా విషయాలు గుర్తుండవు. కానీ ఎవరయినా విశ్వసనీయుడు వాటిని గుర్తు చేస్తే నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకు ఎవరయినా తాను పుట్టిన రోజు గుర్తులేకపోతే, జనులు చెప్పిన దాన్ని బట్టి తాను ఫలానా రోజు ఫలానా తేదీన ఫలానా ఘడియలో పుట్టానని చెబుతాడు. పెద్దల నుండి విని తన తల్లిదండ్రులను గుర్తుపడతాడు. వేరే వారిని తన తల్లిగా చెప్పుకోడు. ఎవరయినా తన తల్లి హక్కులను నెరవేర్చకపోతే లేదా వేరే వారిని తల్లిగా చెప్పుకుంటే ప్రపంచం అతనిపై ఉమ్మేస్తుంది. ఒకవేళ ఎవరయినా ‘నన్నెందుకు తప్పుపడుతున్నారు. మా అమ్మ ఎవరో నాకు గుర్తులేదు’ అని అంటే అలాంటి వారిని మరీ మతిస్థిమితంలేని వానిగా, అవిధేయునిగా భావిస్తారు.
తెలిసిందేమిటంటే, ప్రజలు చెప్పడం వల్ల మనిషి అనేక విషయాలను నమ్ముతాడు. ప్రవక్తలు ఎంతో గొప్పవారు. అలాంటి వారు చెప్పినా నమ్మకం కలగదా?
9. ప్రవక్తల మరియు గ్రంథాల మౌలిక బోధన
తౌహీద్(ఏకేశ్వరోపాసన)నే అనుసరించాలని షిర్క్(బహుదైవారాధన) కు దూరంగా ఉండాలనీ ఆత్మల లోకంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా తాకీదు చేయడం జరిగింది. ప్రవక్తలందరూ ఈ విషయాన్నే గుర్తు చేయడానికి పంపబడ్డారు. ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తల ప్రబోధనలు, ఆకాశ గ్రంథాలు ఈ ఒక్క విషయాన్నే నొక్కి వక్కాణించాయి.
గుర్తుంచుకోండి! “తౌహీద్ ను అనుసరించండి. షిర్క్ దరిదాపులకు కూడా వెళ్లకండి. అల్లాహ్ ను తప్ప ఇతరులను పాలకునిగా, సార్వభౌమునిగా భావించకండి. దైవేతరులను యజమానులుగా భావించకండి. వారిని మొరపెట్టుకోకండి. వారికి మొక్కకండి.”
క్రింది హదీసు తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ షిర్క్ కు ఒడిగట్ట కూడదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఇలా ప్రబోధించారని ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “అల్లాహ్ కు సహవర్తులుగా ఎవరినీ చేర్చకు. నిన్ను చంపినా, తగులబెట్టినా సరే.” (హదీసు గ్రంథం, ముస్నద్ అహ్మద్ 5: 238)
అంటే, అల్లాహ్ ను తప్ప వేరితరులను ఆరాధ్య దైవాలుగా భావించకండి. షైతానులు, జిన్నులు మిమ్మల్ని బాధపెడతారని చింత చెందకండి. ముస్లిములు బాహ్యమైన ఆపదలు కలిగినప్పుడు సహనం వహించాలి. వాటికి భయపడి విశ్వాసాన్ని విడనాడ కూడదు. అలాగే అంతర్గత పీడనల (జిన్నులు, షైతానులు పెట్టే బాధల) విషయం లోనూ సహనం వహించాలి. వాటికి భయపడి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. సుఖమయినా, దుఃఖమయినా అంతా అల్లాహ్ అధీనంలోనే ఉందని విశ్వసించాలి. అల్లాహ్ విశ్వాసులను పరీక్షిస్తాడు. విశ్వాసులకు వారి విశ్వాసాల ప్రకారం పరీక్షిస్తాడు. దుష్టుల ద్వారా సజ్జనులకు ఆపదలు కలిగించి చిత్తశుద్ధి కలవారెవరో కపటులెవరో పరికిస్తాడు. పుణ్యాత్ములకు పాపాత్ముల ద్వారా, విశ్వాసులకు తిరస్కారులద్వారా కష్టాలు కలిగిస్తాడు. వారు సహనం వహిస్తారు. విశ్వాసం నుండి సడలరు. అదే విధంగా అప్పుడప్పుడు పుణ్యాత్ములకు జిన్నుల ద్వారా, షైతాన్ ద్వారా అల్లాహ్ ఇచ్ఛానుసారం బాధలు కలుగుతాయి. కనుక ఆ సమయంలో కూడా సహనం వహించాలి. బాధలకు భయపడి ఎన్నటికీ వారిని విశ్వసించకూడదు.
దీని ద్వారా తెలిసినదేమిటంటే; ఎవరయినా షిర్క్ ను వీడి దైవేతరులను విడిచి పెట్టి వారి మ్రొక్కులను ఖండిస్తున్నప్పుడు, దురాచారాలను అంతమొందిస్తున్నప్పుడు ఆ మార్గంలో అతనికి ధన నష్టంగానీ ప్రాణ నష్టంగానీ జరిగినా లేదా ఏదైనా షైతాను, దుష్టజిన్నులు, పీర్, ముర్షద్ రూపంలో హింసపెడుతున్నా, అల్లాహ్ తనను పరీక్షిస్తున్నాడని భావించాలి. వాటిని సంతోషంగా భరించాలి. విశ్వాసంపై స్థిరంగా ఉండాలి.
గుర్తుంచుకోండి! అల్లాహ్ దౌర్జన్యపరులకు సడలింపు ఇచ్చి మరీ పట్టుకున్నట్లే, బాధితులను వారి నిరంకుశపు పంజా నుండి మోక్షం ప్రసాదిస్తాడు. అదే విధంగా దుష్ట జిన్నులను కూడా సమయం వచ్చినప్పుడు పట్టుకుంటాడు. వారి దౌర్జన్యం నుండి ఏకదైవారాధకులకు విముక్తిని ప్రసాదిస్తాడు
ఇబ్నె మసూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ఓ ప్రవక్తా! అతి పెద్ద పాపం ఏది? అని అడిగాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “దైవేతరులను అల్లాహ్ గా భావించి మొరపెట్టుకోవడం పెద్ద పాపం. ఎందుకంటే అల్లాహ్ యే నిన్ను సృష్టించాడు.” (హదీసు గ్రంథం : బుఖారి 6861)
అల్లాహ్ జ్ఞానం అంతటా వ్యాపించి ఉంది. సార్వభౌమాధికారం ఆయన చేతుల్లోనే ఉంది. అందుకనే ప్రతి ఆపదలోనూ ఆయన్నే మొరపెట్టుకోవాలి. అదే విధంగా దైవేతరులకు ఈ గుణాలను ఆపాదించి వారిని మొరపెట్టుకోవడం మహాపాపం. ఎందుకంటే అల్లాహ్ తప్ప ఎవరూ అవసరాలను తీర్చరు. అంతేకాదు మన సృష్టికర్త అల్లాహ్ యే కనుక కష్టాలు వచ్చినప్పుడు ఆయన్నే ఆరాధించాలి. దైవేతరులతో మనకు సంబంధం ఏమిటి? ఉదాహరణకు ఎవరన్నా బానిసలు తమ అవసరాల గురించి తమ రాజు వద్దనే ఏకరువు పెట్టుకుంటారు తప్ప ఇతరుల వద్దకు ఎందుకు వెళతారు? అల్పుని దగ్గరికి అసలు వెళ్ళరు. విశ్వప్రభువు అయిన అల్లాహ్ కు వేరే పోటీదారులు ఎవరూలేరు.అలాంటప్పుడు వేరే వారి వద్దకు వెళ్ళి తమ అవసరాలను ఏకరువు పెట్టడం అజ్ఞానం కాక మరేమిటి?
10. ఏకదైవారాధన మరియు మన్నింపు
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: ‘ఓ ఆదమ్ పుత్రుడా! ఒకవేళ నువ్వు ప్రపంచమంత పాపాలన్నీ చేసినా సరే, నాకు సహవర్తుల్ని కల్పించకుండా వచ్చి నన్ను కలిస్తే, ప్రపంచమంత మన్నింపుతో నేను నిన్ను కలుస్తాను.’ (హదీసు గ్రంథాలు, తిర్మిజీ, అహ్మద్ : 3540)
అంటే ఈ ప్రపంచంలోకి ఫిరౌను (ఈజిప్ట్ పాలకుల బిరుదు), హామాన్ (ఫిరౌను ప్రధానమంత్రి) లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద పాపాత్ములు వచ్చారు. షైతాన్ కూడా ఉన్నాడు. వీరి ద్వారా జరిగిన పాప కార్యాలన్నీ, ఇంకా ప్రళయం వరకు జరగ బోయే పాపాలన్నీ ఒకే వ్యక్తి చేశాడు అనుకుందాం. కాని ఆ వ్యక్తి అన్ని పాపకార్యాలు చేసినా షిర్క్ కు పాల్పడకుండా ఉంటే అల్లాహ్ అతను చేసిన పాపాలకు సమానంగా క్షమాభిక్ష అనుగ్రహాలు అతనిపై అవతరింపజేస్తాడు. ఏక దైవారాధన శుభాలతో అతని పాపాలన్నీ క్షమించబడతాయి.(*) అదేవిధంగా షిర్క్ చేయడం వల్ల ఇతర మంచి కార్యాలన్నీ వ్యర్ధమవుతాయి.
(*) షిర్క్ వల్ల జరిగే తీవ్ర పరిణామాల గురించి హెచ్చరించడమే ఈ హదీసు ఉద్దేశం. అంతే తప్ప షిర్క్ కు దూరంగా ఉంటే చాలు వేరే పాపాలు చేస్తే ఏమవదు అని భావించకూడదు. ఎందుకంటే; పాపాల క్షమాభిక్ష కొరకు షరీఅత్ విధించిన నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే పశ్చాత్తాపం చెందకపోతే షిర్క్ క్షంతవ్యం కాజాలదు.
యదార్థమేమిటంటే మానవుడు అన్ని రకాల షిర్క్ ల నుండి అన్ని విధాలుగా దూరంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. అంతేకాదు అల్లాహ్ తప్ప ఎవరూ యజమాని కాదని, ఆయన సామ్రాజ్యం నుండి ఎక్కడికీ పారిపోలేమని, అల్లాహ్ అవిధేయులకు ఎవరూ ఆశ్రయం కల్పించలేరని, ఆయన ముందు అందరూ నిస్సహాయులనీ, ఆయన ఆదేశాన్ని ఎవరూ ధిక్కరించలేరని, ఆయన ముందు ఎవరి సహాయమూ పనికిరాదని, అల్లాహ్ అనుమతిస్తే తప్ప ఎవరూ సిఫారసూ చేయలేరని విశ్వసించాలి. ఒకవేళ ఇలాంటి విశ్వాసుల ద్వారా మానవ తప్పిదంవల్ల లేదా పొరపాటువల్ల పాపాలు జరిగినా తను ఆ పాపాల భారంతో నలిగిపోతుంటాడు. చిరాకు చెందుతాడు. అవమాన భారంతో తలెత్తుకోలేకపోతుంటాడు. అలాంటి వ్యక్తిపై దైవానుగ్రహం అవతరిస్తుంది. పాపకార్యాలు పెరిగే కొద్దీ అతనిలో పశ్చాత్తాప భావం పెరుగుతూ ఉంటుంది. పశ్చాత్తాప భావం పెరిగే కొలదీ అల్లాహ్ అనుగ్రహమూ పెరుగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే; ఇతరులు ఆరాధనలు చేయనటు వంటి పనులు కూడా ఏకదైవారాధనలో స్థిరంగా ఉన్న వ్యక్తి పాపాలు ఆ పనులు చేసి పెడతాయి. ఒక పాపాత్ముడైన ఏకదైవారాధకుడు దైవభీతిగల ఒక బహుదైవారాధకుని కంటే ఎన్నో రెట్లు మేలు. అంతేకాదు నేరస్థుడు, తిరుగుబాటుదారుడు, ముఖస్తుతి చేసేవాడి కంటే కూడా వేల రెట్లు నయం. ఎందుకంటే; మొదటివాడు తాను చేసే పాపాలపై ప్రాయఃశ్చిత్తం చెందుతాడు. కాని రెండోవాడు తాను చేస్తున్న కార్యాలపై గర్వపడతాడు.
సారాంశం
[1] ఆరాధనల్లో, వ్యవహారాల్లో జరిగిన పాపాలకు పశ్చాత్తాపం చెందకుండా చనిపోతే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమిస్తాడు. కాని ‘విశ్వాసాల్లో జరిగిన పాపాలకు పశ్చాత్తాపం చెందకుండా చనిపోతే అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. షిర్కె అక్బర్ (బహుదైవారాధన)కి శాశ్వత నరకం, షిర్కె అస్గర్ (ప్రదర్శనాబుద్ధి)కి. తాత్కాలిక నరకం ప్రాప్తమవుతుంది.
[2] బహుదైవారాధన ఘోరాతిఘోరమైన పాపం. అది చక్రవర్తిపై తిరుగుబాటు చేయడం లాంటిది. దానికి శిక్ష నరకమే. తిరుగుబాటు చేయడం చక్రవర్తి దగ్గర మహానేరం. మరణ దండయే దానికి శిక్ష.(దివ్యఖుర్ఆన్ 4: 116)
[3] బహుదైవారాధన మహాపరాధం. ఎందుకంటే అది సర్వోన్నతుడైన సృష్టికర్త హక్కును అధములైన సృష్టితాలకు ఇచ్చివేయడమే. (దివ్యఖుర్ఆన్ 39: 13)
[4] గత శాసనాంగాల మౌలిక బోధన ఏకదైవారాధనయే. కనుక అదే సాఫల్యానికి మార్గం.
[5] అల్లాహ్ నిరపేక్షాపరుడు. తనకోసం ఎట్టి పరిస్థితిలోనూ భాగస్వామ్యాన్ని సహించడు. పూర్తి పుణ్యకార్యాలను రద్దు చేసేస్తాడు.
[6] ప్రళయదినం నాడు ఎలాంటి ఎదురు వాదన జరగకుండా ఉండేందుకు అల్లాహ్ అజల్ (ఆత్మావస్థ) లోనే ఆది మానవుడు ఆదం సంతానం నుండి ఏకదైవారాధన ప్రమాణం తీసుకున్నాడు.
[7] ఆత్మావస్థలో మానవులందరూ అల్లాహ్ వద్ద వ్యక్తిగతంగా ఏకదైవారాధనను అంగీకరించి, బహుదైవారాధనను తిరస్కరించారు. దాన్ని గుర్తు చేయడం కోసమే అల్లాహ్ ప్రవక్తలను, ఆకాశ గ్రంథాలను పంపే ఏర్పాటు చేశాడు. కనుక నేడు చెలామణి అవుతున్న ఏ విషయము కూడా బహుదైవారాధనకు ధ్రువపత్రం కాజాలదు.
[8] ఎవరయినా ఆత్మల లోకంలో జరిగిన ఒప్పందం మరిచిపోయానని సాకులు చూపి బహుదైవారాధనకు పాల్పడితే అతని సాకు స్వీకరించబడదు. ఎందు కంటే ప్రవక్తలు, ఆకాశ గ్రంథాలు సందర్భానుసారం దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి.
[9] ఆత్మల లోకంలో జరిగిన తమ ఒప్పందాన్ని గుర్తు చేయడానికీ సందర్భానుసారం ఒక లక్షా ఇరవై నాలుగువేల మంది ప్రవక్తలు పంపబడ్డారు. మరియు దైవగ్రంథాలు సందర్భాన్ని బట్టి అవతరించాయి. హత్యచేయబడినా, దహనం చేయబడినా బహుదైవారాధన చేయకూడదని చాటిచెప్పాయి. అందువల్లనే ఏకేశ్వరోపాసన విశ్వాస పరిరక్షణల కోసం భౌతిక, మానసిక బాధలకు ఓర్పు, సహనం వహించాలి. భయపడి షైతానులు, జిన్నాతుల బారిన పడకూడదు. ఎందుకంటే; ఇది అల్లాహ్ తరపు నుండి మీ విశ్వాసానికి పరీక్ష. సృష్టికర్తతోపాటు బహుదైవారాధనకు పాల్పడటం ఘోర పాపం. నిజమైన ప్రభువు, ఆపదలను తొలగించేవాడు, కష్టాల్లో ఆదుకునేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఉత్తమ ప్రతిఫలం మరియు శిక్ష ఇచ్చేవాడు అల్లాహ్ యే.
[10] ఏకేశ్వరోపాసన శుభముతో ప్రపంచమంతటి పాపాలలో మునిగినా క్షమాభిక్ష లభిస్తుంది. కాని బహుదైవారాధన దారిద్ర్యంతో పుణ్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. అంటే ఒక పాపాత్ముడైన ఏకేశ్వరోపాసకుడు, ఒక దైవభీతిపరుడైన బహుదైవారాధకుడి కంటే వెయ్యి రెట్లు మేలు. ముఖస్తుతి చేసే తిరుగు బాటుదారు కన్నా, ప్రభుత్వ విధేయుడైన నేరస్తుడు వెయ్యి రెట్లు నయం అన్న చందాన.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- షిర్క్ లోని కొన్ని కీడులను వివరించండి?
- తౌహీద్ లోని కొన్ని మేళ్లను వివరించండి?
- షిర్క్ ని కొన్ని ఉపమానాలతో వివరించండి?
- ప్రవక్తల మౌలిక సందేశం ఏమిటి? వివరంగా వ్రాయండి?
తప్పొప్పులను గుర్తించండి
- షిర్క్ ధృవపత్రం కాగలదు. ( )
- షిర్క్ విషయంలో “మరుపుకు సాకు” స్వీకరించబడుతుంది. ( )
- ప్రళయం రోజున మనిషి తౌహీదు ఒప్పుకుంటాడు. ( )
- అల్లాహ్ షిర్క్ చేసే వాడి నుండి అతీతుడు. ( )
- షిర్క్ వల్ల విముక్తి కలుగవచ్చు. ( )
ఖాళీలను పూరించండి
- అల్లాహ్ షిర్క్ ను ………………………….
- షిర్క్ అన్నింటికంటే ………………………..
- తౌహీద్ మార్గం ……………….ల మార్గం
- అల్లాహ్ ………………………… క్షమించడు.
- ప్రతి వ్యక్తి ఆత్మావస్థలో ………………………..ను అంగీకరించాడు.
- ప్రళయం రోజున షిర్క్ …………………………. అవ్వదు.
- ఒకవేళ ఎవరైనా “మరుపువల్ల” షిర్క్ చేస్తే అతని సంజాయిషీ …….
- తౌహీద్ ……….. ……….. కి మార్గం
4 వ అధ్యాయం: అగోచర జ్ఞానంలో షిర్క్ (భాగస్వామ్య) ఖండన
1.షిర్క్(భాగ స్వామ్యం) ఖండన
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:
وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ
అగోచరాల తాళం చెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్ కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుందా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. (దివ్యఖర్ఆన్ 6 : 59)
అల్లాహ్ మానవునికి బాహ్య వస్తువుల గురించి తెలుసుకోడానికి కొన్ని అవయవాలు ప్రసాదించాడు. ఉదాహరణకు: చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, వాసన కోసం ముక్కు, రుచి కోనం నాలుక, వెతకటానికి చేతులు, అర్థం చేనుకోవడానికి బుద్ధిని ప్రసాదించాడు. ఈ అవయవాలన్నిటిపై మానవుడికి అధికారాన్ని ప్రసాదించాడు. తాను తలచుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు: ఏదైనా వస్తువులను చూడకూడదనుకున్నప్పుడు కళ్లు మూనుకుంటాడు. చూడాలనుకున్నవ్పుడు కళ్లు తెరిచిఉంచుతాడు. ప్రతి అవయవాన్ని ఇలాగే ఊహించుకోండి. అదే విధంగా గోచర విషయాలు తెలుసుకోడానికి తాళం చెవులు ఇచ్చాడు. ఉదాహరణకు తాళం తెరవాలో లేదో? తాళం చెవి ఉన్న వాడి అధికారంలోనే ఉంటుంది. ఇలా బాహ్య వస్తువుల గురించి తెలుసుకోవాలో, తెలుసుకోకూడదో? అంతా మానవుడి అదుపులోనే ఉంది.
2.అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది
దీనికి భిన్నంగా అగోచర విషయాలు తెలుసుకోవడం మానవుడి చేతుల్లో లేదు. దాని తాళం చెవులు అల్లాహ్ తన వద్ద ఉంచుకున్నాడు. మహా వ్యక్తులకుగానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దైవదూతలకుగానీ తమకు ఇష్టం వచ్చినప్పుడు అగోచర విషయాలు తెలుసుకోవాలనుకునే, ఇష్టంలేనప్పుడు వదలి పెట్టే అధికారం లేదు. అల్లాహ్ తన ఇష్టానుసారం ఎప్పుడైనా ఎవరికైనా అగోచర విషయాలు కావాలనుకున్నంతగా తెలుపుతాడు. అగోచర విషయాలు తెలుపడం అల్లాహ్ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంది. వేరే వారి ఇష్టంపై ఆధారపడి లేదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకునేవారు. కాని ఆ విషయం ఆయన తెలుసుకోలేకపోయేవారు. అల్లాహ్ తలచుకున్నప్పుడు వాటిని వెంటనే తెలిపేవాడు. దైవదౌత్య కాలంలో కపటులు మాతృమూర్తి ఆయిషా( రదియల్లాహు అన్హా) పై అపనింద మోపారు. ఆ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు తీవ్రంగా బాధ కలిగించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ నల్లం) చాలా రోజుల వరకు ఆ విషయాన్ని శోధించారు. కాని ఏ విషయమూ తెలుసుకోలేక పోయారు. తర్వాత అల్లాహ్ కోరినప్పుడు వహీ అవతరింప జేసి కపటులు అబద్ధాల కోరులని, ఆయిషా (రదియల్లాహు అన్హా) పరమ పవిత్రురాలని తెలియజేశాడు.
కనుక ప్రతి ముస్లిం అగోచరాల ఖజానాల తాళం చెవులు అల్లాహ్ తన వద్దనే ఉంచుకున్నాడని, వాటికి ఎవరినీ కోశాధికారిగా చేయలేదని విశ్వసించాలి. ఆయన స్వయంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అతని చేయిని అడ్డుకునే సాహసం ఎవరికుంది?
3.అగోచర జ్ఞానం ఉందని చెప్పేవాడు, అబద్ధాలకోరు
దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అగోచరం తెలుస్తుందని, గడిచిన వాటి గురించి, భవిష్యత్తు గురించి తనకు తెలుసునని వాదించేవాడు అబద్ధాలకోరు. అలాంటి వాడు దైవత్వ ప్రకటన చేస్తున్నాడు. ఎవరయినా ప్రవక్తలను, మహాత్ములను, జిన్నులను, దైవదూతలను, ఇమాములను, సజ్జనులను లేదా పీరులను, అమరవీరులను, సిద్ధాంతిని, జ్యోతిష్కుడిని, పండితులను, భూతాలను అలా భావిస్తే ముష్రిక్కులు (బహు దైవారాధకులు) అనబడతారు. వారు పైన పేర్కొన్న ఆయతు (దివ్య ఖుర్ఆన్ 6 : 59) లను తిరస్కరిస్తున్నారు. అనుకోకుండా ఎవరయినా జ్యోతిష్యుడి మాట నిజమయితే దాని వల్ల అతను అగోచర జ్ఞాని కాలేడు. ఎందుకంటే అతను చెప్పే చాలా విషయాలు అబద్ధాలు కనుక! అగోచర జ్ఞానం తెలుసుకోవడం వారికి సాధ్యమయ్యే విషయం కాదు. వారి అంచనా ఒక్కోసారి నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. జ్యోతిష్యం, కనికట్టు, ఖుర్ఆన్తో శకునాలు చూడటం కూడా అలాంటిదే. వహీ (దైవవాణి) మాత్రం ఎప్పుడూ అబద్ధం కాదు. అది మాత్రం వారి అధీనంలో లేదు. అల్లాహ్ తన ఇష్టప్రకారం తాను తలచుకుంది తెలుపుతాడు. వేరే వారి ఇష్టంపై వహీ ఆధారపడి లేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
قُل لَّا يَعْلَمُ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلْغَيْبَ إِلَّا ٱللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
“అల్లాహ్ కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర విషయాల జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి చెప్పు”. (దివ్యఖర్ఆన్ 27: 65)
అగోచర విషయాలు తెలునుకోవడం ఎవరి తరమూ కాదు. వారు ఎంతటి వారయినా లేదా దైవదూత అయినా సరే. దీనికి స్పష్టమయిన ఆధారం ఏమిటంటే, ప్రళయం వన్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు తెలుసుకోవడం వారికి సుసాధ్యమే అయితే ప్రళయం ఏ రోజు వస్తుందో కూడా తెలుసుకునేవారే.
4.అగోచరాల జ్ఞానం
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلْغَيْثَ وَيَعْلَمُ مَا فِى ٱلْأَرْحَامِ ۖ وَمَا تَدْرِى نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۢ
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగడు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాహ్యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి). (దివ్యఖర్ఆన్ 31 : 34)
అగోచరాల జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన తప్ప అగోచరాల జ్ఞాని ఎవరూ లేరు. ప్రళయం సంభవించడం తథ్యం, మానవులందరికీ ఈ విషయం తెలుసు. కాని అది ఎప్పుడు రాబోతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వేరే విషయాల గురించి ఏం చెప్పగలరు. ఉదాహరణకు: విజయం, పరాజయం, స్వస్థత, అస్వస్థత ఇలాంటి విషయాల జ్ఞానమూ ఎవరికీ లేదు.ఇవి ప్రళయమంత ముఖ్య మైనవి కాకపోయినా అవి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. అదే విధంగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఉంది. అయినా వర్షం పడుతుందో లేదో తెలియదు. వేరే కాలాల్లోనూ వర్షం పడుతుంటుంది. చాలా మంది దీనిని కోరుతుంటారు కూడా. ఒకవేళ దాని సమయం ఎలాగైనా తెలుస్తుందనుకుంటే దాని గురించి ఎవరికైనా తప్పనిసరిగా తెలుస్తుంది. ఉదాహరణకు : ఒక వ్యక్తి జననం, మరణం లేదా సంతానం కలగడం కలగకపోవడం లేదా ధనవంతుడవ్వడం పేదవాడవ్వడం లేదా విజయం సాధించడం, పరాజయం పాలవ్వడం ఈ విషయాలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి? మాతృ గర్భంలో ఉన్నది కూడా ఎవరికీ తెలియదు.” [ ఆధునిక వైద్యశాస్త్రం పుట్టబోయే నంతానం ఏదో ప్రసవ సమీప కాలంలో మాత్రమే చెప్పగలుగుతుంది.]
గర్భంలో ఉన్నది ఒకరా లేదా ఇద్దరా? అందులో ఉన్నది ఆడా, మగా? సంపూర్ణంగా ఉన్నారా లేదా లోపంతో ఉన్నారా? అందంగా ఉన్నారా అంద విహీనంగా ఉన్నారా? నిపుణులు ఈ విషయాలన్ని అసంపూర్తిగానే తెలుపుతారు. కాని ఎవరికీ పూర్తిగా పరిస్థితులు తెలియవు. అలాంటప్పుడు మానవ అంతర్గత విషయాల గురించి ఎలా తెలుసుకోగలరు? ఉదాహరణకు: వారి భావాలు, సంకల్పాలు, కోరికలు, వారి విశ్వాస కాపట్య స్థితి. తాను రేపు ఏం చేస్తాడో తనకే తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా తెలుసుకోగలడు? మనిషికి అతను ఎవ్పుడు మరణిస్తాడో తెలియనప్పుడు మరణించబోయే రోజు సమయం ఎలా తెలుస్తుంది? ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ తప్ప మరెవరూ భవిష్యత్తు విషయాలను తమ అధికారంతో తెలుసుకోలేరు. కనుక అగోచర విషయాల జ్ఞానులమని వాదించేవారు అబద్ధాలకోరులు. కనికట్టు, జ్యోతిష్యం, శకునాలు చూడటం, రాశిఫలాలు అన్నీ అబద్దాలే. ఇవన్నీ షైతాన్ పన్నాగాలు. ముస్లిములు ఎన్నటికీ వీటిలో చిక్కుకోకూడదు.
ఎవరైనా “నాకు అగోచర విషయాల జ్ఞానం లేదు, వాటిని తెలుసుకోవడమూ నా వల్ల కాదు, అల్లాహ్ నాకు తెలుపుతున్న విషయాలు తప్ప వేరే విషయాలు చెప్పడం నా అధికారంలో లేదు” అని ఎవరయినా అంటే ఇందులో రెండు విషయాలకు అవకాశం ఉంది. అతను నిజం చెప్పవచ్చు లేదా అబద్ధమూ చెప్పవచ్చు. ఉదాహరణకు: sixth sense షర్హే సద్ర్ (మనో వికాసం), దైవికంగా తోచినమాట.
5.అల్లాహ్ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ وَهُمْ عَن دُعَآئِهِمْ غَـٰفِلُونَ
“అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?” (దివ్యఖుర్ఆన్ 46:5).
ముష్రిక్కులు పరమ మూర్ఖులు. అల్లాహ్ లాంటి శక్తిమంతుణ్ణి, వివేకవంతుణ్ణి విడిచిపెట్టి ఇతరులను మొరపెట్టుకుంటున్నారు. వారు వీరి మొరలను ఆలకించలేరు. వారికి ఎటువంటి శక్తిసామర్థ్యాలూ లేవు. వీరు ఇలాగే ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు ఏమీ చేయలేరు. ఎవరయితే మహాత్ములను మొరపెట్టుకుంటూ, మా అవసరాలను తీర్చమని మీరు అల్లాహ్తో దుఆ చేయండి?’ అనడం కూడా షిర్క్గానే పరిగణించబడుతుంది. మేము అవసరాలను తీర్చమని అల్లాహ్నే కదా వేడుకున్నాం? ఈ మహాత్ములు కేవలం వారధులు మాత్రమే. అది షిర్క్ ఎలా అవుతుంది? అని వారు భావించవచ్చు.అసలు విషయం ఏమిటంటే; వారు దూరంగా ఉన్న వ్యక్తిని (పుణ్యాత్ముణ్ణి) మొరపెట్టు కున్నారు. కనుక ఇది షిర్క్ అవుతుంది. ఎందుకంటే పుణ్యాత్ములు దూరం నుండి దగ్గర నుండి కూడా వింటారని వారిని విశ్వసించారు. కాని అది అల్లాహ్ ఔన్నత్యం. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ 46 : 5 లో “వీరి మొరలను ఆలకించలేరు. వీరు ఎంత మొర పెట్టుకున్నా, చివరకు ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు వినలేరు’ అని స్పష్టంగా వివరించాడు.
6.లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:
قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేధు. నాకే గనక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి, ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (దివ్యఖుర్ఆన్ 7: 186)
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్తలకు నాయకులు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా గొప్ప గొప్ప మహిమలు ప్రస్ఫుటమయ్యాయి. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ధార్మిక విషయాలు నేర్చుకున్నారు. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గంలో నడవడం వల్ల ఔన్నత్యం పొందారు. అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు ప్రజల ముందు తన స్థితి ఎలాంటిదో వివరించమని ఆదేశించాడు; “నాకు ఎలాంటి శక్తిలేదు. నేను అగోచర విషయాల జ్ఞానిని కూడా కాను. నేను నా స్వయానికి లాభంగానీ, నష్టంగానీ చేకూర్చు కోలేను. దీంతోనే నా శక్తి ఏపాటిదో మీరు అంచనావేయవచ్చు. అలాంటప్పుడు నేను ఇతరులకు లాభనష్టాలు ఎలా చేకూర్చగలను? ఒకవేళ నేను అగోచరాల జ్ఞానిని అయి ఉంటే పని చేయక ముందే దాని పర్యవసానాన్ని తెలుసుకునేవాడిని. నేను చేయబోయే పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఆ పనిని ప్రారంభించేవాడినికాను. అగోచర విషయాల జ్ఞానం కలిగి ఉండటం అల్లాహ్ గొప్పతనం. నేను కేవలం ప్రవక్తను మాత్రమే. చెడుల పర్యవసానాన్ని హెచ్చరిస్తూ మంచి పనుల శుభవార్తలను అందదేయడమే ప్రవక్తల పని. విశ్వాసం ఉన్న హృదయాలకే ఈ విషయం లబ్ది చేకూర్చగలుగుతుంది. నమ్మకం కలిగించడం అల్లాహ్ పని“
7.ప్రవక్తల అసలు మిషన్
ప్రవక్తల, పుణ్యాత్ముల గొప్పతనం ఏమిటంటే; వారు అల్లాహ్ మార్గాన్ని తెలుపు తారు. తమకు తెలిసిన మంచి, చెడుల గురించి ప్రజలకు తెలియజేస్తారు. వారి సందేశ ప్రచారంలో అల్లాహ్ ఆకర్షణను ఉంచాడు. వారి సందేశం వల్ల అనేక మంది రుజుమార్గంలో వచ్చి చేరారు. ఒకవేళ అల్లాహ్ వారికి విశ్వంలో అధికారం చేసే శక్తి ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. అవి మహత్యాలు మాత్రమే. అల్లాహ్ ఎవరినైనా హతమార్చడం లేదా సంతానం కలిగించడం, ఆపదల నుండి రక్షించటం, మొరలను ఆలకించడం, జయాపజయాలు కలిగించడం. ధనవంతునిగా చేయడం, నిరుపేదగా మార్చడం లేదా రాజుగా చేయడం, ఎవరినైనా బిచ్చగాణ్జీ చేయడం లేదా అధికారినో, మంత్రినో చేయడం. ఎవరి హృదయంలో నైనా విశ్వాసం కలిగించడం, ఎవరి హృదయం నుండైనా విశ్వాసాన్ని లాక్కోవడం. ఎవరికైనా ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మరెవరైనా అస్వస్థతకు గురిచేయడం – ఇదంతా అల్లాహ్ గొప్పతనమే. అల్లాహ్ తప్ప ఈ పనులు ఎవరూ చేయలేరు. ఇంతకు మించి అందరూ నిస్సహాయులే. నిస్సహాయతలో అందరూ సమానులే. ప్రవక్తలు గాని పుణ్యాత్ములుగాని ఏ విషయాలలోనైనా ఏమైనా చేసినా అవి కేవలం అల్లాహ్ సహాయంతో మాత్రమే చేయగలరు.
8.ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
అదే విధంగా అల్లాహ్ తలచుకుంటే అగోచరాల జ్ఞానం వారికి ఇవ్వవచ్చు. తద్వారా ఎవరి హృదయంలో ఏముందో తెలునుకోవచ్చు. ఏ అగోచర విషయా న్నైనా తెలునుకోవచ్చు. అయితే ఫలానా వారికి సంతానం కలుగుతుందా? లేదా? వ్యాపారంలో లాభం కలుగుతుందా లేదా? పోరాటంలో విజయం పాందుతారా? పరాజయం పాలవుతారా? ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియవు. అప్పుడప్పుడు ఏదైనా విషయం అంచనా వేసుకుని లేదా రుజువులను బట్టి చెబితే అది చెప్పినట్టుగానే జరగనూ వచ్చు. అదే విధంగా అప్పుడప్పుడు పెద్దలు చెప్పేమాటలు కూడా నిజమవుతాయి. ఒక్కోసారి అబద్ధాలూ కావచ్చు. కాని వహీ లేదా దైవిక జ్ఞానోదయం అబద్ధంకాదు. ఇంకా వహీ ప్రవక్తల అధీనంలో ఉండదు.
9.’అగోచర జ్ఞానం’ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం
రబీఅ బిన్తె ముఅవ్విజ్ బిన్ అఫ్రా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం: (పెళ్ళికూతురిగా) నాకు వీడ్కోలు పలికే సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా వద్దకు వచ్చారు. నా మంచంపై నాకు చాలా దగ్గరగా మీరు కూర్చున్నంత దగ్గరగా కూర్చున్నారు. మా (కుటుంబీకుల) పిల్లలు కొందరు దఫ్ (డప్పు) వాయిస్తూ బద్ర్ మృతుల సంఘటనను ఆలపించ సాగారు. అందులో ఒకరు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు” అన్నారు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి న నల్లం) వారిని వారిస్తూ ‘ఆ విషయాన్ని విడిచి మిగతాది ఆలపించండి’ అని హిత బోధచేశారు. ( హదీసు గ్రంథం బుఖారీ: 5147)
రబీఅ అన్సారియ్య వివాహ సందర్భంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. బాలికలు గీతం ఆలపిస్తూ “మా ప్రవక్తకు రేపటి విషయాలు కూడా తెలుసు” అని పాడారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని అ మాట అనకండని వారించారు.
మనిషి ఎంత పెద్ద వాడయినా అతని విషయంలో అతను అగోచరజ్ఞాని అని విశ్వసించకూడదు. కవులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ నల్లం)ను పొగుడుతూ భూమ్యాకాశాల ఎత్తుకు ఎత్తడం, అతిశయం కోసం అన్నామని అనడం సమంజసం కాదు. ఇలా చేయడం తప్పు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను పొగుడుతూ ఇలాంటి కవితలు పాడుతున్న బాలికలనే వారించారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన కవులకు, పెద్దలకు ఇలాంటి కవితలు పాడమని ఎలా అనుమతించగలరు.
10.మాతృమూర్తి అయేషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
అయేషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం” అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. (దివ్యఖుర్ఆన్ 31: 34) అనే ఆయత్లో తెలిపిన ఐదు విషయాల సమాచారం ప్రవక్త (నల్లల్లాహు అలైహి వ సల్లం)కు తెలుసని ఎవరైతే చెప్పాడో అతను ప్రవక్తపై ఘోరమైన అపనిందమోపాడు. (హదీసు గ్రంథం : బుఖారి : 3287)
అంటే ఆ అయిదు విషయాలు దివ్యఖుర్ఆన్ (31: 34)లో ఉన్నాయి. దాని గురించి వివరించడం జరిగింది. అగోచర విషయాలు ఆ అయిదు విషయాల్లోనే ఉన్నాయి. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అగోచర విషయాల జ్ఞానం ఉందని తెలిపేవాడు ఆయనపై తీవ్రమైన నిందమోపాడు.
11.అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసినవారు ఎవరూ లేరు
ఉమ్మె అలా అన్సారీ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అల్లాహ్ సాక్షి! నేను దైవ ప్రవక్త అయినప్పటికీ నా విషయంలో ఏం జరుగుతుందో, మీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు”. ( హదీసు గ్రంథం: బుఖారీ : 7018)
అంటే అల్లాహ్ తన దాసుల విషయంలో ఈ ప్రపంచంలో గానీ, పరలోకం లోగానీ, సమాధిలోగానీ ఎలా వ్యవహరిస్తాడన్నది ఎవరికీ తెలియదు. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు కూడా తెలియదు. తమ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇతరుల పరిస్థితి కూడా వారికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా ఫలానా వ్యక్తి విషయంలో మేలు జరుగుతుందని దైవికంగా తోచిన మాట ద్వారా తెలిస్తే అది ఒక సంక్షిప్త సమాచారం. అంతకు మించి అతను ఎక్కువగా తెలునుకోలేడు.
సారాంశం:
1-2. గోచరాలను తెలుసుకోవడానికి అల్లాహ్ మానవుడికి కొన్ని వనరులు ఇచ్చి వాటిని వినియోగించే శక్తిని ప్రసాదించాడు. కాని అగోచరాల తాళం చెవులు మాత్రం అల్లాహ్ వద్ద వున్నాయి. అతను తన ఇచ్చ ప్రకారం అందులో నుండి ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం తెలుపుతాడు. అత్యవసర సమయాల్లో ప్రవక్తలకు కూడా తెలుపుతాడు.
3. అగోచరజ్ఞానవాది మరియు అతన్ని ధ్రువీకరించేవాడు ఇద్దరూ బహుదైవాదరాధకులే. ఎందుకంటే అగోచరాలు కేవలం అల్లాహ్ చేతిలోనే వున్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం నిర్దారితమైతే అది కేవలం యాదృచ్చికమే.
4-5 అగోచరాల చిన్నా-పెద్ద విషయాలు అల్లాహ్ పరిధిలోనే వున్నాయి. మానవుడు ఎప్పుడైన్నా ఎటువంటి వరుసలతోనైనా వాటి వరకు చేరలేడు. జ్యోతిష్యం, తాంత్రిక విద్య, శకునాలు మొదలగునవి షైతాన్ కుట్రలు.
6. అంతర్గత -బహిర్గత, దూర-సమీప ప్రార్థనలను ఆయనే వింటాడు. సహాయం చేస్తాడు. వేరేతరులను ఈ విధంగా అర్థించడం బహుదైవారాధన. వారు ప్రళయం వరకు కూడా వినలేరు.
7. అగోచరాల జ్ఞాన గుణం అల్లాహ్ సొంత గుణం. ప్రవక్తలు మరియు అంతిమ ప్రవక్త అగోచరాల జ్ఞానులు కారు. లేకపోతే వారు తమను, తమ అనుచరులను కష్టాల నుంచి రక్షించేవారు: దైవప్రవ క్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం శుభ వార్తాహరులు మరియు హెచ్చరించేవారు మాత్రమే.
8. ప్రవక్తల అసలు పని శుభవార్తలందించడం, హెచ్చరించడం మాత్రమే. వారు కూడా దాసులు మాదిరిగా అల్లాహ్ ముందు నిస్సహాయులు, అశక్తులు, విశ్వంలో అధికారం చేయడం కేవలం అల్లాహ్ సొంత గుణం,
9. ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు. వారు బుద్ధి మరియు అంచనాల ఆధారంగా ఏ విషయాన్నీ చెప్పరు. అల్లాహ్ వారికి వహీ (దైవవాణి) ద్వారా పంపిన సరైన విషయాలనే తెలుపుతారు.
10. కవితల్లో అతిశయానికి పాల్పడుతూ దైవప్రవక్తను అగోచరాల జ్ఞాని అనడాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీవ్రంగా వారించారు.
11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అగోచరాల జ్ఞాని అని భావించినవాడు ప్రవక్త(స)పై అపనింద మోపాడు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ అగోచరాలను గురించి తెలిసినవారు లేరు.
12. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు తమకు, తమ అనుచరులకు సంబంధించిన ఇహపరాల, అగోచరాల విషయాలు తెలియవు.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- జ్ఞానంలోని షిర్క్ (షిర్క్ ఫిల్ ఇల్మ్) వాస్తవికతను వివరించండి?
- “అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది” ఈ వాక్య భావాన్ని వివరించండి?
- అగోచరజ్ఞానం గురించి కొన్ని ఆయతులు, హదీసులను వివరించండి?
- లాభనష్టాలను కలిగించే అధికారి ఎవరు? ఆధారాలతో వివరించండి?
- ప్రవక్తలకు అగోచరజ్ఞానం ఉందా? వివరించండి?
తప్పొప్పులను గుర్తించండి
- వలీలకు దగ్గర నుండి దూరం నుండి మొరపెట్టుకోవడం, ఈ వలీలు తమ మొరలను వింటారని భావించడం, షిర్క్ అవుతుంది.
- ప్రవక్తలు స్వయంగా అగోచర జ్ఞానాన్ని కలిగి ఉంటారు
- అల్లాహ్ తోపాటు ఇతర దైవాలకు కూడా లాభనష్టాలను కలిగించే శక్తి గలదు
ఖాళీలను పూరించండి
- అల్లాహ్ తప్ప మరెవరూ ………. కాదు.
- లాభనష్టాలకు యజమాని ………. కారు.
- ప్రవక్తలకు అగోచర జ్ఞానం ………………………..
5వ అధ్యాయం: అధికార వినియోగంలో షిర్క్ ఖండన
1. అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవటం
قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ
సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చే వాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. ‘అల్లాహ్ మాత్రమే’ అని వారు చెబుతారు. ‘మరయితే మీరు ఎలా మోసపోతున్నారు?’ అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (దివ్యఖుర్ఆన్ 23 : 88-89)
అంటే స్వయంగా ముష్రిక్కులతో సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఆయన ఏమైనా చేయగలడో, ఆయన్ను ఆపేవారు ఎవరూ లేరో, ఆయన మాటను ఎవరూ జవదాటలేరో – ఆయనెవరో మీకు తెలిస్తే చెప్పండి? అని అడిగితే ‘అల్లాహ్ మాత్రమే’ అని వారు సమాధానం ఇస్తారు. అలాంటప్పుడు వేరే వారిని మొరపెట్టుకోవడం మోసపోవడమే కదా!
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలోనూ ప్రజలు అల్లాహ్ కు సరిసమానులు ఎవరూ లేరని భావించేవారు. కాని వారు విగ్రహాలను తమ సంరక్షకులుగా భావించి పూజించేవారు. అందుకనే వారు ముష్రిక్కులయ్యారు. నేడు కూడా ఎవరయినా ఈ విశ్వంలో సృష్టిరాశులకు సార్వభౌమాధికారం ఉందని భావించి, వారిని సంరక్షకులుగా చేసుకుని వారిని పూజిస్తే అది షిర్క్ అవుతుంది. వారు అల్లాహ్ కు సమానులు కారని, వారికి అంత శక్తిలేదని భావించినా సరే.
2. లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا
‘మీకు కీడు (నష్టం) గానీ, మేలు (లాభం) గానీ చేకూర్చే అధికారం నాకు లేదు’ అని (ఓ ప్రవక్తా!) చెప్పు. ‘అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను’ అని (ఓ ప్రవక్తా వారికి) చెప్పు. (దివ్యఖుర్ఆన్ 72 : 21-22)
అంటే మీకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చే అధికారం నాకు లేదు. మీరు నా సంతతి వారు అయినందు వల్ల గర్వంతో హద్దులు మీరి మేము శక్తిమంతులమని మా సంరక్షకుడు బలవంతుడని, సహాయం చేసేవాడని, ప్రేమగలవాడని, కనుక మేము ఏమి చేసినా చెల్లుతుందని, ఆయన మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడతాడని భావించకండి. ఎందుకంటే నేను స్వయంగా. భయపడుతున్నాను. అల్లాహ్ తప్ప ఆశ్రయం కల్పించేవాడు ఎవడూలేడు. అలాంటప్పుడు నేను ఇతరులను ఎలా రక్షించగలను? తమ శక్తిని నమ్ముకుని అల్లాహ్ ను విస్మరించేవారు, అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించేవారు స్పష్టమైన మార్గభ్రష్టులు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుక్షణం అల్లాహ్ కు భయపడుతుండే వారు. అల్లాహ్ తప్ప మరెవరూ అనుగ్రహించరని విశ్వసించేవారు.
3. అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు
وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ
వారు అల్లాహ్ ను వదలి, తమకు ఆకాశాల నుంచి గానీ, భూమి నుంచిగానీ ఎలాంటి ఉపాధినీ సమకూర్చలేని వారిని, ఏ శక్తి సామర్థ్యమూ లేని వారిని పూజిస్తున్నారా? (దివ్యఖుర్ఆన్ 16: 73)
అంటే వారు నిస్సహాయులను అల్లాహ్ కు మాదిరిగా పూజిస్తున్నారు. ఉపాధి సమకూర్చడంలో వారికి ఎలాంటి సామర్థ్యమూ లేదు. వారు ఆకాశం నుండి వర్షం కురిపించలేరు. భూమి నుండి పంటను పండించలేరు. వారికి ఏ విధమయిన శక్తీ లేదు. ప్రజలు తమ అజ్ఞానంతో కొత్త కొత్త విషయాలు కల్పించుకుంటుంటారు. పుణ్యాత్ములకు విశ్వంలో అధికారం చెలాయించే శక్తి ఉందని, కాని వారు విధి వ్రాతపై అల్లాహ్ కు కృతజ్ఞులై ఉన్నారని, వారు భక్తి కొద్దీ అణకువతో ఉన్నారని, లేదంటే వారు విశ్వంలో అల్లకల్లోలం సృష్టించగలరని ఇత్యాది విషయాలు ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. వాటిని ఎక్కడ నుంచి గ్రహించారో కూడా తెలియదు. ఇది అబద్ధం. విశ్వంలో ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ ఏ విధమైన అధికారం చేసే శక్తి వారికి లేదు.
4. అల్లాహ్ నే మొరపెట్టుకోండి
وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ
‘అల్లాహ్ ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్నిగానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు’ (అని హెచ్చరించబడింది.) (దివ్య ఖుర్ఆన్ 10 : 106)
గౌరవోన్నతుడు, శక్తిమంతుడు అయిన అల్లాహ్ ను విడిచిపెట్టి లాభంగానీ నష్టం గానీ చేకూర్చలేని నిస్సహాయులను మొరపెట్టుకోవడం అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే వారు అత్యున్నత స్థాయిని అల్పులకు అంటగడుతున్నారు.
దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవియ్యబడింది:
قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అల్లాహ్ ను వదలి మీరు ఎవరినయితే ఊహించు కుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్ కు సహాయకుడు కూడా కాడు. ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప – (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి)ఏ మాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన[*] తొలగించబడిన తరువాత, (ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?) అని అడుగుతారు. సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు’ అని వారు చెబుతారు. (దివ్యఖుర్ఆన్ 34 : 22-23)
[*] భావం ఏమిటంటే, సిఫారసు చేసేవారు చేయబడేవారు ఇరువురూ సిఫారసు కోసం నిరీక్షిస్తూ మధన పడుతుంటారు. అనుమతి ఇవ్వబడిన తర్వాత ఇరువురూ “మీ ప్రభువు ఏమని ఆదేశించాడు?” అని ప్రశ్నించుకుంటారు. అనుమతి లభించిన తర్వాత ప్రతి ఒకరి మానసిక స్థితి ఈ విధంగానే ఉంటుంది “అనుమతి లభించిందా? అని.”
5. అనుమతిలేని సిఫారసు లేదు
అంటే కష్ట సమయాల్లో ఎవరినైనా మొక్కుకోవడం. మొక్కుకున్న వారి వద్ద అనేక రకాలుగా మొక్కుబడులు తీర్చుకోవచ్చు. మొక్కుకోబడినవాడు యజమానియై ఉండాలి. లేదా అతనికి భాగస్వామి అయి ఉండాలి. లేదా యజమానిపై అతని ఒత్తిడి అయినా ఉండాలి. ఉదాహరణకు రాజు తన అధికారుల మాటలు వింటాడు. ఎందు కంటే వారు సామ్రాజ్యంలో సభ్యులు. వారు అసంతృప్తి చెందితే పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. లేదా వారు యజమానితో సిఫారసు చేస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా యజమాని ఆ సిఫారసు అంగీకరించక తప్పదు. ఉదాహరణకు రాజుకు మహారాణి పై వల్లమాలిన ప్రేమ ఉంటుంది. ప్రేమ వల్ల రాజు ఆమె చేసిన సిఫారసును తిరస్కరిం చడు.
ఒకసారి ఆలోచించండి. ముష్రిక్కులు అల్లాహ్ ను వదలి ఏ పుణ్యాత్ములనైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరినైతే మొక్కుకుంటున్నారో వారు ఈ విశ్వంలో దోమ రెక్కకు కూడా యజమానులు కారు. అల్లాహ్ సామ్రాజ్యంలో భాగస్వాములూ కారు. అల్లాహ్ వారి మాట వినడానికి రాజు గారి సామ్రాజ్యంలోని సభ్యుల్లాగా వారు అల్లాహ్ కు సహాయమూ చేయడం లేదు. అల్లాహ్ అనుమతి లేనిదే వారు సిఫారసు కోసం పెదవి కూడా కదపలేరు. అల్లాహ్ దర్బారు (సన్నిధి)లో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన ఆదేశానికి దిగ్భ్రాంతి చెందుతారు. కలవరపడతారు. భయభ్రాంతులకు గురవుతారు. భయంతో రెండోసారి అడిగే ధైర్యం కూడా ఉండదు. పరస్పరం వారు “అల్లాహ్ మనతో ఏమన్నాడు?” అని ప్రశ్నించుకుంటారు. తెలిసిన తర్వాత ‘విశ్వసించాము, ‘విధేయత చూపాము’ అని మాత్రమే అంటారు. వారికి వాదించే ధైర్యం కూడా ఉండదు.
6. సిఫారసు రకాలు
ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. ప్రవక్తలు, పుణ్యాత్ములు తమ గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారన్న భావంతో ప్రజలు ఉన్నారు. ఆ సంతోషంలో సిఫారసును తప్పుగా అర్థం చేసుకుని అల్లాహ్ ను విస్మరిస్తున్నారు. ప్రపంచంలో సిఫారసు ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు పాలకుని వద్ద ఎవరయినా దొంగతనం చేసినట్టు రుజువయితే చట్టపరంగా అతన్ని శిక్షించే అధికారం పాలకునికి ఉంటుంది. కాని ఈ మధ్యలో ఎవరయినా అధికారి అతని విషయంలో సిఫారసు చేస్తే అధికారి ఒత్తిడి వల్ల అతన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అధికారి కూడా రాజ్యంలో ఒక సభ్యుడు. అతని సహకారం వల్ల కూడా రాజ్యంలో అభివృద్ధి జరుగుతుంది. కనుక అతన్ని నిరాశపరచకూడదని పాలకుడు భావిస్తాడు. లేదంటే అతని వల్ల సామ్రాజ్యంలో సంక్షోభం తలెత్తవచ్చు. కనుక పాలకుడు తన కోపాన్నే దిగమ్రింగి దొంగను విడిచిపెడతాడు. ఇలాంటి సిఫారసును “గౌరవభావ సిఫారసు” అంటారు. అంటే అధికారి మీద గౌరవభావంతో అతని మాట వినడం జరిగిందని అర్థం.
7. “గౌరవభావ సిఫారసు” అసాధ్యం
అల్లాహ్ సమ్ముఖంలో గౌరవభావ సిఫారసు ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. దైవేతరులను ఇలాంటి సిఫారసు చేస్తారని భావించేవారు ముష్రిక్కులు అజ్ఞానులు. వారు అల్లాహ్ ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. చక్రవర్తి గొప్పతనం, ఔన్నత్యం గుర్తించలేదు. అల్లాహ్ తలచుకుంటే ‘కున్’ (అయిపో) అనే ఒకే ఒక్క పలుకుతో కోటానుకోట్ల ప్రవక్తలను, వలీలను, జిన్నులను, దైవదూతలను, జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఒక్కసారే సృష్టించగలడు. విశ్వాన్నంతటిని సర్వనాశనం చేసి మరో అద్భుత ప్రపంచాన్ని సృష్టించగలడు. ఆయన సంకల్పం చేసుకుంటే ప్రతి వస్తువు తయారవుతుంది. వాటిని తయారు చేయడానికి ఆయనకు వస్తువుల, పదార్థాల అవసరమే ఉండదు.
ఒకవేళ ఆదమ్ (అలైహిస్సలాం) నుండి ప్రళయం వరకు రాబోయే సమస్త మానవులు మరియు జిన్నులు కలసి, పుణ్యాత్ములు అయిపోయినా అల్లాహ్ సామ్రాజ్యంలో ఎటువంటి వైభవం పెరగదు. ఒకవేళ వారందరు షైతాన్లుగా, దజ్జాల్లుగా అయి పోయినా ఆయన సామ్రాజ్యంలో ఎటువంటి వైభవం తరగదు. ఆయన అన్ని పరిస్థితుల్లోనూ అందరికంటే గొప్పవాడు. చక్రవర్తులకే చక్రవర్తి. ఎవరూ ఆయనకు కొద్దిగైనా కీడు చేయలేరు, మేలు చేయలేరు’ [*]
[*] నా దాసులారా గుర్తుంచుకోండి!! గతించిన వారు, పుట్టబోయే మానవులూ, జిన్నులు అందరూ కలిసి మీలోని అత్యంత ధర్మపరాయణుడిగా మారినా అల్లాహ్ సామ్రాజ్య వైభవం పెరగదు. నా దాసులారా! మీ మానవులు జిన్నులు గతించిన వారూ, ఇక ముందు పుట్టబోయేవారు అందరూ కలిసి మీలోని అత్యంత నీచునిగా మారినా అల్లాహ్ సామ్రాజ్య వైభవం తరగదు. (హదీసు గ్రంథం ముస్లిం, హదీసు నెం.2588)
8. “ప్రేమ కలిగిన సిఫారసు” అసాధ్యం
ఇది సిఫారసులోని రెండో రకం. రాకుమారుని లేదా రాజకుమారి లేదా చక్రవర్తికి అతి సన్నిహితుడొకడు దొంగకు శిక్షపడకుండా సిఫారసు చేస్తే, చక్రవర్తి తన మిత్రుని మీద ప్రేమతో అతన్ని అయిష్టపరచకూడదని ఆ దొంగను క్షమించేస్తాడు. ఇలాంటి సిఫారసును “ప్రేమ కలిగిన సిఫారసు” అంటారు.
చక్రవర్తి తన సన్నిహితుని ప్రేమకు లొంగి అతనికి అయిష్టత కలిగితే తనకే కీడు కలుగుతుందని భావించి తన సన్నిహితుని మాట వింటాడు. అల్లాహ్ దర్బారులో ఇలాంటి వాటికి చోటుండదు. ఎవరినైనా ప్రవక్తనుగానీ, లేదా వలీను గానీ, ఇలాంటి సిఫారసుదారులుగా భావించేవారు ఖచ్చితమైన ముష్రిక్కులు, నికార్సయిన అజ్ఞానులు. అల్లాహ్ తన దాసులను ఎన్ని అనుగ్రహాలతో ముంచెత్తినా, హబీబ్ (ప్రియుడు), ఖలీల్ (స్నేహితుడు), కలీమ్ (సంభాషించువాడు), రూహుల్లాహ్ (అల్లాహ్ ఆత్మ), వజీహ్ (అందమైనవాడు) లాంటి బిరుదులు ప్రసాదించినా మరి కొందరికి రసూలె కరీమ్, రూహల్ ఖుదుస్ (పవిత్రాత్మ), రూహుల్ అమీన్ (విశ్వసనీయుడైన దైవదూత) లాంటి గౌరవప్రద బిరుదులతో సత్కరించినా, యజమాని యజమానే, దాసుడు దాసుడే. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక స్థానముంది. దాని నుండి ఎవరూ ముందుకు వెళ్ళలేరు. దాసుడు అల్లాహ్ అనుగ్రహానికి పొంగిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే విధంగా అతని ఆగ్రహానికి భీతితో హడలిపోతాడు. భయంతో నిలువునా నీరుగారి పోతాడు.
9. “అనుమతితో సిఫారసు”
ఇది సిఫారసులోని మూడో రకం. దొంగచేసిన దొంగతనం రుజువయింది. కాని అతనిది దొంగతనం చేసే వృత్తి కాదు. దురదృష్టవశాత్తు అతను దొంగతనం చేశాడు. కాని తాను చేసిన కార్యానికి సిగ్గుతో నీరుగారి పోతున్నాడు. పశ్చాత్తాప భావంతో కుంచిచుకుపోతున్నాడు. అహర్నిశలు భయంతో కంపించిపోతున్నాడు. అంతే కాదు తాను చట్టాలను గౌరవిస్తాడు. తాను పాపాత్మునిగా నేరస్తుడిగా, శిక్షకు అర్హునిగా భావిస్తున్నాడు. రాజు గారికి భయపడి మంత్రి దగ్గరికి, అధికారి దగ్గరికి కూడా వెళ్లడం లేదు. తన కోసం వాదించడానికి సంరక్షకుడ్ని తెచ్చుకోడానికీ సిద్ధంగా లేడు. తాను చేసిన తప్పుకు రాజు ఏ శిక్ష విధిస్తాడోనని దిగులు చెందుతుంటాడు. అతని పరిస్థితిని చూసి రాజుకు జాలి కలుగుతుంది. అతన్ని క్షమించాలనుకుంటాడు. ప్రజల దృష్టిలో నుంచి చట్ట గౌరవం పోకుండా అంతా చట్ట పరిధిలోనే జరపాలనుకుంటాడు. మంత్రి లేదా అధికారి, రాజుగారి సూచన మేరకు ఆ వ్యక్తి సిఫారసు కోసం నించుంటాడు. రాజు ఆ అధికారిని ప్రోత్సహించి దొంగ చేసిన తప్పును క్షమిస్తాడు. ఆ అధికారి రాజు గారి అభీష్టం మేరకు దొంగ కొరకు సిఫారసు చేశాడే తప్ప దొంగ ఆ అధికారికి బంధువు కాదు, మిత్రుడు, స్నేహితుడు అంతకన్నా కాదు. అతను సంరక్షించే బాధ్యతా తీసుకోలేదు. కేవలం రాజుగారి అభీష్టం ప్రకారం అతను దొంగ గురించి సిఫారసు చేశాడు. ఎందు కంటే అతను రాజుగారి ప్రతినిధి. దొంగల సంరక్షకుడు కాదు. దొంగను సంరక్షించేవాడూ దొంగే అవుతాడు. ఇలాంటి సిఫారసునే “అనుమతితో కూడిన సిఫారసు” (ఇష్ట ప్రకారం సిఫారసు) అంటారు. అల్లాహ్ దర్బారులో ఇలాంటి సిఫారసులు స్వీకరించబడతాయి. దివ్య ఖుర్ఆన్లో పేర్కొనబడిన ప్రవక్తలు, పుణ్యాత్ములు చేసే సిఫారసు ఇదే.
10. రుజుమార్గం
ప్రతి మానవుడు విధిగా అల్లాహ్ నే మొరపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ ఆయనకే భయపడాలి. పాపాలను క్షమించమని ఆయన్నే వేడుకోవాలి. ఆయన ముందే పాపాలను అంగీకరించాలి. ఆయన్ని తన యజమానిగా, సంరక్షకునిగా భావించాలి. అల్లాహ్ నే విశ్వసించాలి. ఇతరుల రక్షణను నమ్మకూడదు. ఎందుకంటే ఆయన లాంటి మరొకడు లేడు గనక. అల్లాహ్ క్షమించేవాడును, అమిత కరుణామయుడూను. ఆగిన పనులన్నీ ఆయన తన అనుగ్రహంతో పూర్తిచేస్తాడు. తన కరుణతో పాపాలన్నీ క్షమిస్తాడు. తన ఆదేశంతో ఎవరినైనా సరే మీ కోసం సిఫారసుదారునిగా చేస్తాడు. మీ ప్రతి అవసరాన్ని ఆయన ముందే విన్నవించుకోండి. అదే విధంగా ఎవరినైనా మీకు సిఫారసు దారునిగా చేయమని వేడుకోండి. నిజ ప్రభువుని విస్మరించకండి. ఇతరులను నమ్మకండి. ఆయన ఆదేశాలను గౌరవించండి. ఆయన ముందు దురాచారాలను తిరస్కరించండి. షరీఅత్ ఆదేశాలను విడిచిపెట్టి దురాచారాలను పాటించడం మహా అపరాధం. ఇలా చేయడాన్ని ప్రవక్తలు, వలీలు అసహ్యించుకుంటారు. షరీఅత్ ఆదేశాలను తిరస్కరిస్తూ అంధ ఆచార వ్యవహారాలను పాటించే వారి కోసం వారు ఎప్పుడూ సిఫారసు చేయరు. దానికి ప్రతిగా వారు వారికి శత్రువులవుతారు. వారిని అసహ్యించుకుంటారు. ఎందుకంటే వారి గొప్పతనం ఈ విషయంపైనే ఆధారపడి ఉంది. వారు అల్లాహ్ కోసం అన్నీ త్యజిస్తారు. భార్యా పిల్లలను, అనుయాయులను, గురువులను, మిత్రులను, పని వారిని అందరిని అల్లాహ్ కోసం విడిచిపెట్టేవారు. వీరు అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా పని చేసే వారికి శత్రువులయ్యేవారు. దైవేతరులను మొరపెట్టుకునే వారిలో ఏం గొప్పతనం ఉందని? పెద్ద పెద్ద వారు సయితం వారి సంరక్షకులై అల్లాహ్ ఆదేశాలకు విరుద్ధంగా వారి వైపు నుండి అల్లాహ్ పోట్లాడతారు? ఇలా ఎన్నటికీ జరుగదు. వారు వారికి శత్రువులు. వారి గొప్పతనం ఏమిటంటే వారు అల్లాహ్ కోసం ప్రేమిస్తారు. అల్లాహ్ కోసం ద్వేషిస్తారు. వారు అల్లాహ్ ఇష్టానికి కట్టుబడి ఉన్నారు. అల్లాహ్ ఇష్టప్రకారమే వారు నడుచుకుంటారు.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు. ఒక రోజు నేను ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనుక ఉన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ఓ బాలుడా! అల్లాహ్ ను గుర్తుంచుకో. అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. అతన్ని నీ ముందు పొందుతావు. నీకు ఏమయినా అవసరం వస్తే అల్లాహ్ ను మాత్రమే వేడుకో. అల్లాహ్ ను మాత్రమే సహాయం అడుగు. ఒకవేళ ప్రజలందరూ కలిసి నీకు లాభం చేకూర్చాలని నిర్ణయించుకున్నా అల్లాహ్ నీ అదృష్టంలో రాసిపెట్టివున్న వరకే నీకు లాభం చేకూర్చగలరు. ఒకవేళ అందరూ కలసి నీకు కీడు తలపెట్టాలని నిర్ణయించుకున్నా అల్లాహ్ నీ అదృష్టంలో రాసిపెట్టి ఉన్న వరకే కీడును చేకూర్చగలరు. కలములు ఎత్తుకోబడ్డాయి. గ్రంథాలు నిక్షిప్తం చేయబడ్డాయి. (హదీసు గ్రంథం తిర్మిజీ)
అంటే అల్లాహ్ నిజమైన చక్రవర్తి. ఆయన ప్రపంచంలోని చక్రవర్తుల్లాగా అహంకారి కాదు. అందుకనే ప్రజలు నేరుగా చక్రవర్తుల వద్ద తమ సమస్యలు చెప్పరు. మంత్రుల ద్వారా వారి సమస్యల్ని చెప్పుకుంటారు. వారి ద్వారా తమ అభ్యర్థనల్ని మంజూరు చేయించుకుంటారు. కాని అల్లాహ్ గొప్పవాడు. అమిత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ఆయన వరకు చేరడానికి ఒకరి ద్వారా రాయబారం పంపాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. ఎవరు సిఫారసు చేసినా చేయక పోయినా ప్రతి ఒక్కరూ ఆయన దృష్టియందుంటారు. ఆయన పరమ పవిత్రుడు, గొప్పవాడూను. ప్రజలు ఆయన వద్దకు చేరకపోవడానికి, అధికారులే ప్రజలపై పెత్తనం చేయడానికి ప్రజలు అధికారుల ఆదేశాలే పాటించడానికి ఆయన దర్బారు ప్రపంచ చక్రవర్తుల దర్బారు లాంటిది కాదు. అది అల్లాహ్ దర్బారు. ఆయన తన దాసులకు అతి దగ్గర ఉన్నాడు. సామాన్య మానవుడు కూడా ఆయన వద్దకు వెళ్ళవచ్చు. ఆయన్ని నేరుగా సంప్రదించవచ్చు. మన మూఢనమ్మకాలు, నిర్లక్ష్యాలే తప్ప అల్లాహ్ వద్దకు చేర్చడంలో మరేవీ మనకు అడ్డంకి కాదు.
11. అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు
ఎవరయినా అల్లాహ్ కు దూరంగా ఉంటే కేవలం తన నిర్లక్ష్యం వల్లనే అల్లాహ్ కు దూరంగా ఉన్నాడు. అల్లాహ్ మాత్రం ప్రతి ఒక్కరికి సమీపంలో ఉన్నాడు.. తమను అల్లాహ్ వద్దకు చేర్చమని ప్రవక్తలను, వలీలను మొరపెట్టుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ వారికే చాలా దగ్గరగా ఉన్నాడు. ఒక విధంగా ప్రవక్తలకు, వలీలకే చాలా దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
రాజుగారి వద్ద ఒక బానిస ఒంటరిగా ఉన్నాడు. అతను ఏదైనా అభ్యర్థించ దలచుకుంటే వినడానికి రాజు సిద్ధంగా ఉన్నాడు. కాని అతను మంత్రిని పిలిచి ‘ఈ బానిస గురించి రాజుగారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి?’ అని అడిగితే అతన్ని పిచ్చోడో లేదా అంధుడో అని భావిస్తాం. కనుక ప్రతి ఒక్కడు అల్లాహ్ నే అభ్యర్థించు కోవాలి. కష్టాల్లో ఆయన సహాయమే కోరాలి. అదృష్టంలో రాసింది చెరుపబడదని గట్టిగా నమ్మాలి. ఒకవేళ ప్రపంచమంతా కలిసి ఎవరికైనా లాభంకానీ నష్టం కానీ చేకూర్చాలను కుంటే వారు అదృష్టంలో ఉన్న దానికంటే ముందు వెళ్ళలేరు. అంటే అదృష్టాన్ని మార్చే ధైర్యం ఎవరికీ లేదు. అదృష్టంలో సంతానం రాసిలేనివారికి సంతానం ఎవరు కలిగించ గలరు? అదృష్టంలో ఆయుష్షు తక్కువగా ఉన్నా వారి జీవిత కాలం ఎవరు పెంచగలరు? కనుక ఈ నేపథ్యంలో అల్లాహ్ వలీలకు అదృష్టం మార్చే శక్తినిచ్చాడని పలకడం పెద్ద తప్పు.
విషయమేమిటంటే, అల్లాహ్ తన దాసులు అభ్యర్థనలను అప్పుడప్పుడు వింటాడు. ప్రవక్తల, వలీల వేడుకోళ్ళను అధికంగా వింటాడు. వేడుకునే సద్బుద్ధిని కూడా ఆయనే ప్రసాదిస్తాడు. వేడుకోళ్ళనూ ఆయనే వింటాడు. వేడుకోవడం ఆ తర్వాత మొక్కు కోవడం రెండూ విధివ్రాత[*]లో రాసి ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం విధివ్రాతలోనే ఉంది. చిన్నా పెద్దా, సందేశహరులు, ప్రవక్తలు ఎవరికీ ఏ పనీ చేసే శక్తి లేదు. కాని వారు అల్లాహ్ ను వేడుకోవాలి. వారికి అంత శక్తే ఉంది. దాన్ని తన దయతో స్వీకరించాలా? వద్దా? అనేది అల్లాహ్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
[*] దైవజ్ఞానానికి మరో పేరు అదృష్టం. తన అదృష్టంలో, ఇతరుల అదృష్టంలో ఏముందో ఎవరికీ తెలియదు. కనుక ప్రతి మనిషి తప్పనిసరిగా అల్లాహ్ ఆదేశాలను పాటించాలి. నిషేధాలకు దూరంగా ఉండాలి. అల్లాహ్ తన అనుగ్రహంతో మేలు చేస్తాడని విశ్వసించాలి.
12. కేవలం అల్లాహ్ పైనే భారం మోపాలి
అమ్ర బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: ‘మానవ హృదయానికి ప్రతి రంగంలోనూ ఒక మార్గం ఉంది. ఎవరయితే తన హృదయాన్ని అన్ని మార్గాల వైపునకు పంపుతాడో అతను ఏ మార్గంలో నాశనమైనా అల్లాహ్ పట్టించుకోడు. కాని అల్లాహ్ ను నమ్మిన వాడు ప్రతి రంగంలోనూ అల్లాహ్ ను కార్యసాధకునిగా పొందుతాడు. (హదీసుగ్రంథం, ఇబ్నె మాజహ్ హదీస్ నెం. : 4166)
మానవుడు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు లేదా అతనికి ఏదైనా వస్తువు అవసరం వచ్చినప్పుడు అతని ఆలోచనలు నలువైపులా పరుగెత్తుతుంటాయి. ఫలానా ప్రవక్తను లేదా ఫలానా ఇమామ్ను లేదా ఫలానా పీర్ను లేదా ఫలానా అమర వీరుడిని లేదా ఫలానా దూతను మొర పెట్టుకోవాలనుకుంటాడు. లేదా ఫలానా జోతిష్యుణ్ణి లేదా పండితుడిని లేదా మాంత్రికుడిని లేదా రాశిఫలాలు చూసేవాడిని సంప్రదించి శకునాలు చూడాలనుకుంటాడు. ఎవరయితే తన ఆలోచనల వెంట పరుగెత్తుతాడో అల్లాహ్ అతని నుండి తన స్వీకార దృష్టిని మళ్లించుకుంటాడు. అలాంటి వారిని తన చిత్తశుద్ధిగల దాసుల జాబితా నుండి తొలగిస్తాడు. అతను క్రమక్రమంగా అల్లాహ్ మార్గ దర్శకత్వాల నుండి దూరమవుతూ ఉంటాడు. అలా అతను తన ఆలోచనల వెంట పరుగెత్తుతూ చివరికి నాశనమవుతాడు. కొందరు నాస్తికులుగా, మరికొందరు భక్తిహీనులుగా, ఇంకొందరు బహుదైవారాధకులుగా, తిరస్కారులుగా మారతారు. మరెవరయితే అల్లాహ్ ను విశ్వసించి మనో కాంక్షల వెంటపడకుండా ఉంటారో వారు అల్లాహ్ ఆదరణీయ దాసులవుతారు. మార్గదర్శకత్వ మార్గాలు అతని కోసం తెరుచు కుంటాయి. తమ ఆలోచనల వెంట పరిగెత్తేవారు పొందని మానసిక ప్రశాంతతను వారు పొందుతారు. విధివ్రాతలో రాసిందంతా జరుగుతుంటుంది. కాని ఆలోచనల వెంటవెళ్ళే వాడు అనవసరంగా ఆపదల పాలవుతాడు. అల్లాహ్ ను విశ్వసించేవాడు ప్రశాంతతను పొందుతాడు.[*]
[*] అనస్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రతి ముస్లిం తన అవసరాలన్నిటినీ అల్లాహ్ వద్దనే విన్నవించుకోవాలి. చివరకు ఉప్పు అవసరమున్నా లేదా బూటుకు కట్టే తాడు తెగినా అల్లాహ్ నే అడగాలి. (హదీసు గ్రంథం తిర్మిజీ)
అల్లాహ్ ను ప్రాపంచిక చక్రవర్తుల్లాగా భావించకండి. వారు పెద్ద పెద్ద పనులు వారు చేస్తారు. చిన్న చిన్న పనులు నౌకర్లతో చేయిస్తారు. కనుకనే ప్రజలు చిన్న చిన్న పనుల కోసం నౌకర్లతో అభ్యర్థించుకుంటుంటారు. కాని అల్లాహ్ సామ్రాజ్యం అలాంటిది కాదు. ఆయన ఆదేశిస్తే చాలు రెప్పపాటులో అసంఖ్యాక చిన్న పెద్ద పనులన్నీ జరిగి పోతాయి. సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములుగానీ, సహవర్తులుగానీ లేరు. అందుకనే చిన్న చిన్న వస్తువులు అవసరమొచ్చినా నేరుగా ఆయన్నే అభ్యర్థించాలి. ఆయన తప్ప వేరే వారు చిన్న వస్తువైనా ఇవ్వలేరు.
13. బంధుత్వమూ పనికిరాదు
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: “మీ అతి సమీప బంధువులను హెచ్చరించండి.” (దివ్యఖుర్ఆన్ 26: 214) అనే ఆయత్ అవతరించినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన బంధువులను పిలిచి ఇలా చెప్పారు:
”ఓ కఅబ్ బిన్ లూయి సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి రక్షించుకోండి. అల్లాహ్ శిక్షనుండి రక్షించడానికి నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను.”“ఓ ముర్రహ్ బిన్ కఅబ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి రక్షించుకోండి. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని కాపాడటానికి నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. “ఓ అబ్దుష్టమ్స్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి నేను మీకు ఏ విధంగాను సహాయపడలేను.”ఓ అద్దె మునాఫ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి ఏ విధంగానూ సహాయపడలేను. ఓ హాషిమ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి సహాయపడలేను. ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను.ఓ ఫాతిమా! నీ ప్రాణాన్నీ అగ్ని నుండి కాపాడుకో. నీకు ఎంత ధనం కావాలో నా దగ్గర తీసుకో. ఎందుకంటే అల్లాహ్ శిక్ష నుండి నేను నిన్ను రక్షించలేను. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 348)
పుణ్యాత్ముల బంధువులు తమను పుణ్యాత్ములే రక్షిస్తారని విశ్వసిస్తారు. అందుకనే వారు అహంకారంతో నిర్భయంగా ఉంటారు. కనుకనే అల్లాహ్ తన ప్రియతమ ప్రవక్తని ‘మీ బంధువులను హెచ్చరించు’ అని ఆదేశించాడు. ప్రవక్త( సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒక్కో బంధువుని ఉద్దేశించి చివరకు తన ప్రియ కుమార్తెను ఉద్దేశించి, ‘మానవాధీన విషయాల్లోనే బంధుత్వ హక్కులు సాధ్యమవుతాయ’ని చాలా స్పష్టంగా వివరించారు. నా ధనం నా అధీనంలోఉంది. అది ఇవ్వడంలో లోభత్వంతో వ్యవహరించను. కాని అల్లాహ్ వద్ద జరగబోయే వ్యవహారం నా అధీనంలో లేదు. అక్కడ ఎవరికీ సహాయ పడలేను. ఎవరి సంరక్షకుణ్ణి కాలేను. ప్రతి ఒక్కరూ ప్రళయం కోసం సిద్ధం కావాలి. నరకాగ్ని నుండి రక్షించబడటానికి నేటి నుంచే ఆలోచించాలి.
దీని ద్వారా ”అల్లాహ్ వద్ద పుణ్యాత్ముని బంధుత్వ సంబంధం కూడా సిఫారసు కోసం పనికిరాదని స్పష్టమవుతుంది. మానవుడు స్వయంగా మంచి పనులు చేయనంత వరకు ఆపదలను అధిగమించలేడు.”
సారాంశం
1. ఎవరయినా ఎవరినైనా ప్రపంచంలో అధికారం చేసేవానిగా, అతన్ని అల్లాహ్ వద్ద తన న్యాయవాదిగా భావిస్తూ అతన్ని అల్లాహ్ కు సరిసమానమని భావించనప్పటికీ అతను ముష్రిక్ అయిపోతాడు.
2. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తన సమాజం వారికి లాభ నష్టాలు చేకూర్చే అధికారం లేనప్పుడు ప్రజలను పీర్లు, ముర్షిద్లు అల్లాహ్ శిక్ష నుండి ఎలా కాపాడగలరు?
3. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు నిస్సహాయులు. తమ శక్తి సామర్థ్యాలతో; తమ కార్యాలతో ఉపాధి ప్రసాదించే, అధికారం చెలాయించే శక్తి వారికి లేదు. అల్లాహ్ మాత్రమే సర్వాధికుడు.
4. నిరపేక్ష సర్వాధికారిని వదలిపెట్టి నిస్సహాయ దాసులను అర్థించడం ఘోర అన్యాయం. ఎందుకంటే ఈ విశ్వంలో వారికి ఇసుమంత అధికారం కూడా లేదు. అంతేకాదు, అనుమతి లేనిదే వారు సిఫారసూ చేయలేరు. అల్లాహ్ గొప్పవాడు, సర్వోన్నతుడు.
5. బహుదైవారాధకులు ఎవరినైతే తమ సిఫారసుదారులుగా భావిస్తున్నారో వారు విశ్వాన్ని సృష్టించడంలో అల్లాహ్ కు భాగస్వాములుకారు, యజమానులూ కారు, సభ్యులు కూడా కారు, వారు అల్లాహ్ సన్నిధిలో నిస్సహాయులు, నిరాసక్తులు, భయస్థులై అనుమతి కోసం ఎదురు చూస్తుంటారు.
6. అల్లాహ్ సమక్షంలో “గౌరవప్రదమైన సిఫారసు, ప్రేమతో కూడిన సిఫారసులు” అన్ని విధాలుగా అసంభవం. ఎవరయినా ఇతరులను ఇలాంటి సిఫారసుదారునిగా భావిస్తే అది తీవ్రమైన షిర్క్. అల్లాహ్ దర్బారులో అనుమతితో కోరుకున్న సిఫారసు మాత్రమే చెల్లుతుంది.
7.ప్రతి ముస్లిం నేరుగా నిజప్రభువునే సహాయకునిగా, సంరక్షకునిగా భావించడం తప్పనిసరి. ఎందుకంటే అల్లాహ్ ఇష్టంలేనిదే ప్రపంచమంతా కలిసి లాభంగాని నష్టంగాని చేకూర్చదు. ఆయన అర్థించేవానికి అత్యంత సమీపంలో ఉన్నాడు.
ఎ) సామాజిక ఆచార వ్యవహారాలకు బదులు ధర్మాదేశాలను పాటించే వారి విషయంలోనే ప్రవక్తలు, సజ్జనులు సిఫారసు చేయగలరు.
బి) “రారాజైన అల్లాహ్” గొప్పతనం ఏమిటంటే; ఎవరయినా సరే హృదయ పూర్వకంగా పూర్తి ఏకాగ్రతతో ఎలాంటి సిఫారసుదారుడు లేకుండానే నేరుగా ఆయన వద్దకు చేరవచ్చు.
8. అల్లాహ్ తన ”పరిజ్ఞానం”, “సామర్థ్యం” పరంగా ప్రతి ఒక్కరికీ అతి సమీపంలో ఉన్నాడు. ప్రపంచంలోని ఏ పనైనా విధివ్రాత పరిధిలోనే ఉంటుంది. అల్లాహ్ మాత్రమే విధివ్రాతను మార్చగలడు. తన దాసులు నేరుగా ఆయన్నే అర్థించాలని అల్లాహ్ ఆశిస్తున్నాడు. ఎందుకంటే అన్నిటిపై ఆయనకే అధికారం ఉంది.
9. కష్ట సమయాల్లో అటూ ఇటూ తచ్చాడేవారు తప్పుద్రోవ పడతారు. ఆందోళన చెందుతారు. మరి ఎవరైతే అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారో అల్లాహ్ వారికి చాలు. దానివల్ల వారికి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ యే సర్వాధికారి. ప్రతి చిన్న పెద్ద వస్తువును అతనే సమకూరుస్తాడు.
10. మానవుడు తన సామర్థ్యం మేరకే బంధుత్వ హక్కులను నెరవేర్చగలడు. కాని అల్లాహ్ దగ్గర జరిగే వ్యవహారాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎలాంటి అధికారం ఉండదు. అల్లాహ్ అనుమతి లేనిదే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎవరికీ సిఫారసుదారునిగా వ్యవహరించ లేరు. కనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరలోకం కోసం సంసిద్ధులవ్వాలి.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- అధికారంలో షిర్క్ గురించి వివరించండి?
- ‘సిఫారసు’ అంటే ఏమిటి? వాటి రకాలు తెలపండి?
- ప్రేమపూర్వక సిఫారసు’ ధర్మసమ్మతమైనదా? లేదంటే ఎందుచేత?
- ‘అనుమతితో కూడిన సిఫారసు’ను నిర్వచించండి?
- సిఫారసు విషయంలో రుజుమార్గమేది?
తప్పొప్పులను గుర్తించండి
- కష్టకాలంలో కేవలం అల్లాహ్ మొరపెట్టుకోవాలి (. )
- అల్లాహ్ ను తప్ప ఇతరులను వేడుకోరాదు ( )
- అల్లాహ్ మాత్రమే ఉపాధిని ప్రసాదించేవాడు ( )
ఖాళీలను పూరించండి
- అల్లాహ్ తన……… మరియు………….దాసులకు అత్యంత సమీపంలో వున్నాడు.
- ఎవరైనా దైవేతరులను గౌరవ భావ సిఫారసుకై వేడుకుంటే అది ఖచ్చిత మైన …………….అవుతుంది.
- సిఫారసు……….తప్ప నెరవేరదు.
- పుణ్య పురుషుల. లేదా ప్రవక్తల బంధుత్వం…….రాదు.
6వ. అధ్యాయం – ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం
1. ఆరాధన నిర్వచనం
అల్లాహ్ తన భక్తి ప్రపత్తుల కోసం కొన్ని పనులను నిర్ణయించి దాసులకు నేర్పాడు. వాటినే ఆరాధనలు అంటారు. అల్లాహ్ తన భక్తి కోసం దాసులకు ఏ ఏ పనులు చేయమని చెప్పాడో వాటిని పేర్కొంటున్నాము. దైవేతరుల కోసం ఆ పనులు చేయరాదు. దీనినే షిర్క్ అంటారు. షిర్క్ కు దూరంగా ఉండాలి.
2. “ఆరాధన” (దాస్యం) కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం
అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
మేము నూహ్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. ‘నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. మీరు అల్లాహ్ ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించ బడతారేమోనన్న భయం నాకుంది.’ (అని అతను చెప్పాడు). (దివ్యఖుర్ఆన్ 11 : 25-26)
నూహ్ (అలైహిస్సలాం) కాలం నుండి విశ్వాసులకు- అవిశ్వాసులకు మధ్య పోరాటం జరుగుతూనే వస్తుంది. అల్లాహ్ యొక్క ఆదరణీయులైన దాసులు “అల్లాహ్ ను గౌరవించే విధంగా దైవేతరులని గౌరవించకండి” “ఆయన గౌరవార్థం నిర్ణయించిన పనులను వేరే వారి కోసం చేయకండి” అని చెబుతూ వచ్చారు.
3. ‘సజ్దహ్ ‘ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే
“మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ ప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి.’ (దివ్యఖుర్ఆన్ 41 : 37)
ఈ ఆయత్ ద్వారా ఇస్లాం ధర్మంలో సాష్టాంగ పడటం సృష్టికర్త హక్కు అని తెలుస్తోంది. కనుక సృష్టితాలకు సాష్టాంగపడకూడదు. సూర్యుడు, చంద్రుడు, ప్రవక్త, వలీయుల్లాహ్ (అల్లాహ్ స్నేహితుడు), జిన్నులు మరియు దైవదూతలు ఎవరైనా సరే వారికి సాష్టాంగ పడకూడదు. పూర్వ శాసనాంగాలలో సృష్టిరాశులకు కూడా సజ్దహ్ చేయడం జరిగింది కదా? అని ఎవరైనా అంటే ఉదాహరణకు దైవదూతలు ఆదమ్ (అలైహిస్సలాం)కి, యాఖూబ్ (అలైహిస్సలాం)కి యూసుఫ్ (అలైహిస్సలాం) సజ్దహ్ చేశారు కదా? కనుక మేము పుణ్యాత్ములకు గౌరవ భావంతో సజ్దహ్ చేస్తే ఏమవుతుంది? అనే వారు ముష్రిక్కులుగా పరిగణించబడతారు. వారు విశ్వాసులు కాజాలరు. ఆదమ్ (అలైహిస్సలాం) షరీఅత్లో సొంత చెల్లెళ్లను వివాహం చేసుకోవడం ధర్మ సమ్మతం. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని చెల్లెళ్ళను వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే చెల్లెళ్ళు శాశ్వతంగా నిషేధించబడిన వారు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మసమ్మతం కారు .
విషయమేమిటంటే, మానవుడు అల్లాహ్ ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. అల్లాహ్ ఆదేశాలను సహృదయంతో స్వీకరించాలి. మా విషయంలోనే ఎందుకు నిషేధించడం జరిగింది? అని అనవసర పిడి వాదానికి దిగకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మానవుడు తిరస్కారి (కాఫిర్) అవుతాడు. ఈ అంశాన్ని ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోండి.
రాజు గారి దగ్గర ఒక చట్టం కొన్ని రోజుల వరకు అమలు చేయబడుతుంది. తర్వాత అవసరమున్నప్పుడు ఆ చట్టాన్ని రాజ్యాంగ కర్తలు రద్దు చేస్తారు. ఆ స్థానంలో మరో కొత్త చట్టం రూపొందిస్తారు. ఇక తప్పనిసరిగా కొత్త చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఒకవేళ ఎవరయినా మేము పాత చట్టంపైనే నడుచుకుంటాం, కొత్త చట్టాన్ని అంగీకరించము అంటే వారు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసినందుకు రాజు వారికి జైలు శిక్ష విధిస్తాడు. అదే విధంగా అల్లాహ్ ఆదేశాలను తిరస్కరించే వారికి శిక్ష నరకం.
4. దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్
ఇంకా, మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. (ఓ ప్రవక్తా!) ‘నేనయితే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటున్నాను. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను’ అని చెప్పు. (దివ్యఖుర్ఆన్ 72:18-20)
ఎవరయినా “అల్లాహ్ దాసుడు” స్వచ్ఛమైన హృదయంతో అల్లాహ్ ను మొర పెట్టుకుంటే, ఈ అజ్ఞానులు అతన్ని ఎంతో గొప్ప వాడని భావిస్తారు. అతన్ని మహాత్ముడు, ఆదుకునే వాడని విశ్వసిస్తారు. అతను ఎవరికి ఏది కావాలన్నా ఇస్తాడని, ఏది కావాలన్నా లాక్కుంటాడని నమ్ముతారు. అందుకనే అలాంటి వారి వద్దకు గంపెడు ఆశలతో తండోపతండాలుగా ప్రజలు ఆ పుణ్మాత్ముని వద్దకు తరలి వెళ్తారు. అతను తమ జీవితాలను చక్కబెడతాడని. అప్పుడు ఆ దైవదాసుడు వారికి ఇలా తెలియబరచాలి – ఆపదల్లో అల్లాహ్ నే మొరపెట్టుకోవాలని, ఇది ఇతరుల హక్కు కాదని వివరించాలి. అల్లాహ్ మాత్రమే లాభనష్టాలు కలిగించేవాడని నమ్మబలకాలి. ఎందుకంటే ఇతరులను ఉద్దేశించి ఇలా ఆశించడం షిర్క్ అవుతుంది. నేను షిర్క్ ను, షిర్క్ చేసే వారిని అసహ్యించుకుంటాన’ని స్పష్టం చేయాలి. ఎవరయినా నా వద్దకు వచ్చి ఇలాంటి పనులు చేయమని కోరితే నేను వారిని ఇష్టపడను. ఇవ్వడం, తీసుకోవడం అల్లాహ్ చేతుల్లో ఉంది. ఆయనే ఇస్తాడు. ఆయనే తీసుకుంటాడు. నా చేతుల్లో ఏమీ లేదు. నా ప్రభువు ఆయనే. మీ ప్రభువు కూడా ఆయనే.”
కనుక, రండి! మిథ్యా దైవాలను విడిచి పెట్టండి. ఒక్కడైన ఆ విశ్వప్రభువునే మొరపెట్టుకోండి. ఆయన తన ఆరాధనలో, ఏకత్వంలో, ప్రభుతలో, అధికారంలో కేవలం ఒకే ఒక్కడని స్పష్టంగా వివరించాలి.
దీనిద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే; (చేతులు కట్టుకుని మర్యాదగా నిలుచోవడం, మొరపెట్టుకోవడం, దైవనామాన్ని స్మరించడం ఇవన్నీ అల్లాహ్ గౌరవార్థం చేసే పనులు. దైవేతరుల కోసం ఈ పనులు చేయడం షిర్క్ అవుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:
హజ్ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలి నడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటిపై కూడా స్వారీ అయి వస్తారు. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తరువాత వాటిని మీరూ తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి. ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి. తమ మొక్కుబడులను చెల్లించాలి. (అనంతరం అల్లాహ్ యొక్క) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. (దివ్యఖుర్ఆన్ 22:27-29)
5. అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి
అల్లాహ్ తన వైశిష్ట్యం చాటడం కోసం కొన్ని స్థలాలను నిర్ణయించాడు. ఉదాహరణకు కాబా గృహం, అరఫాత్, ముజ్దలిఫహ్, మినా మైదానాలు. సఫా మర్వా పర్వతాలు, మఖామె ఇబ్రాహీం, మస్జిద్ హరాం, మక్కా మొత్తం ప్రాంతం, మొత్తం హరం ప్రాంతం. ప్రజలలో ఈ స్థలాలను సందర్శించాలనే ఆసక్తిని కలిగించాడు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు స్వారీ అయి, నడచుకుంటూ సుదూర ప్రాంతాల నుండి కాబా గృహం సందర్శించాలని. ప్రయాణ కష్టాలు అనుభవించి నిర్దేశిత దుస్తులు ధరించి ప్రత్యేక రూపంలో అక్కడికి చేరుకోవాలని. అల్లాహ్ పేరుతో ఖుర్బానీ ఇవ్వాలని. తమ మొక్కుబడులు పూర్తి చేసుకోవాలని. కాబా గృహ ప్రదక్షిణలు చేయాలని. హృదయాల్లో తమ యజమాని కోసం ప్రోది చేసుకున్న వైశిష్ట్యాన్ని కాబా గృహానికొచ్చి చాటాలని. మరికొందరు ఎతికాఫ్ లో కూర్చుని అహర్నిశలు అల్లాహ్ నామస్మరణ చేస్తున్నారు. ఇంకొందరు మర్యాదతో మౌనంగా నిలుచొని కాబతుల్లాహ్ వైపు చూస్తూ కళ్లను చల్లబరుచు కుంటున్నారు. ఏది ఏమయినప్పటికీ ఈ పనులన్నీ అల్లాహ్ గౌరవార్థం చేయబడతాయి. అల్లాహ్ వారిని, వారి పనుల వల్ల ఇష్టపడతాడు. వారికి ఇరులోకాలలో లబ్ది చేకూరుతుంది. కనుక ఇలాంటి పనులు దైవేతరుల గౌరవార్ధం చేయడం నిషిద్ధం, షిర్క్.
ఏదైనా సమాధిని సందర్శించడం కోసం లేదా ఆస్థానం కోసం లేదా ఆశ్రమం కోసం సుదూర ప్రయాణ కష్టాలు అనుభవించి మాసిన దుస్తులతో అక్కడికి వెళ్ళడం, అక్కడకు వెళ్లి జంతువులను ఖుర్బానీ ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించడం, సమాధి లేదా ఇంటి ప్రదక్షిణ చేయడం, దాని సమీప పొలాలను మరియు అడవులను గౌరవించడం, అక్కడ వేటాడకుండా ఉండటం, అక్కడి వృక్షాలు కోయకుండా ఉండటం, గడ్డి పోచలను తెంచకుండా ఉండటం ఇలాంటి ఇతర పనులు చేయకుండా అందులోనే ఇహపరాల సాఫల్యం ఉందని ఆశించడం అంతా షిర్క్ గానే పరిగణించబడుతుంది.
కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే షరీఅత్ ఆదేశించిన ప్రాంతాలను విడిచిపెట్టి వేరే వాటిని గౌరవించడం, అవి ధర్మంలోని విషయాలేనని భావించడం బిద్అత్ (దురాచారం). సృష్టికర్తకే వినమ్రులై ఉండాలి. ఆయనకే విధేయత చూపాలి, సృష్టితాలకు కాదు.
6. దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం
قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! వారికి చెప్పు: (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం – అది పరమ అశుద్ధం గనక! ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో)నే ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు. (దివ్యఖుర్ఆన్ 6 : 145)
రక్తం, మృత జంతువు, పందిమాంసం లాగానే దైవేతరుల పేరు మీద బలి ఇచ్చిన జంతువు కూడా నిషిద్దమే. సృష్టితాల పేరు నిర్ణయించిన జంతువు అశుద్ధమని, నిషిద్ధమని దీని ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు: ఇవి దేవిదేవతల, దర్గాల, పేర్ల మీద మొక్కుబడిగా వదలబడే ఆంబోతులు మరియు గొర్రె పోతులు మొదలగునవి.
పై ఆయత్ ద్వారా తెలుస్తున్న విషయం మేమిటంటే, జిబహ్ చేసేటప్పుడు దైవేతరుల పేరు తీసుకోవడమే కాకుండా వారి పేరు మీద వదిలిపెట్టే జంతువులు కూడా నిషిద్ధమే. కోడిని, మేకను, ఒంటెను, ఆవును, లేదా ఏదైనా జంతువును సృష్టితాలైన వలీ పేరున గానీ, ప్రవక్త పేరున గానీ, తాతముత్తాతల పేరునగానీ లేదా పీర్, పండితుల, దూతల పేరునగానీ, వదలిపెట్టడం నిషిద్దం, అపరిశుద్ధం కూడాను. అలా చేసేవాడు ముష్రిక్ అనబడతాడు!
7. ‘అధికారం’ కేవలం అల్లాహ్ ది మాత్రమే
అల్లాహ్ యూసుఫ్ (అలైహిస్సలాం) సంఘటనను వివరిస్తూ ఇలా సెలవిచ్చాడు; ఆయన తన కారాగార సహచరులతో ఇలా పేర్కొన్నారు:
يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُون
‘ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!). ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాతముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్నిపేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్ కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చెయ్యరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన, స్థిరమైన ధర్మం. కాని చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోరు.’ (దివ్యఖుర్ఆన్ 12 : 39-40)
ఒక బానిసకు అనేక మంది యజమానులుంటే చాలా కష్టం. కాని అతనికి ఒక్కడే యజమాని ఉండి, అతను అత్యంత గొప్పవాడై ఉంటే చాలా బాగుంటుంది.
యజమాని ఒక్కడే. మానవుల మొరలన్నింటిని ఆలకిస్తాడు. మానవుల జీవితాన్ని చక్కదిద్దుతాడు. ఆయన ముందు అసత్య దేవుళ్లకు స్థానంలేదు. ఒక దేవుడు వర్షం కురిపిస్తాడు, ఇంకొకడు ఆధిక్యతను ప్రసాదిస్తాడు, మరొకడు సంతానాన్ని కలిగిస్తాడు, ఒకడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు లాంటి భావాలు నిరాధారమైనవి. మీకు మీరే దేవుళ్ల పేర్లు నిర్ణయించి ఫలానా అతనికి ఫలానా అధికారం ఉందని బలవంతంగా అంటగట్టి అవసరం వచ్చినపుడు వాటి గురించి వారి ముందు మొరపెట్టుకుంటున్నారు. కొంతకాలానికి అలాంటి ఆచారాలే రూపుదిద్దుకుంటాయి.
8. ఇష్టమొచ్చినట్టు దేవుళ్ల పేర్లు పెట్టడం షిర్క్ (బహుదైవారాధన)
“అల్లాహ్” తప్ప దేవుడు ఎవరూ లేడు. ఈ నామము (అల్లాహ్) గలవాడు ఎవడూ లేడు. ఒకవేళ ఎవరిదైనా దైవ నామము ఉంటే అతనికి దైవాధికారాల్లో ఏ విధమైనటు వంటి జోక్యం లేదు. అన్ని పనులు చేసే అధికారంగల నామమే “అల్లాహ్”. బాబాలు, ముర్షదులు, స్వాములు అవతారాలు గల నామముగల వాళ్ళకి విశ్వంలో ఏ పనీ చేసే అధికారం లేదు. ఇలాంటి భావాలు ఏర్పర్చుకోమని “అల్లాహ్” ఆదేశించ లేదు.
కాని చాలా మంది ఈ మార్గం నుండి తప్పి పోయారు. పీర్ల, ఇమాముల, స్వాముల, బాబాల, ఋషుల, పాస్టర్ల మార్గాన్ని అల్లాహ్ మార్గం కంటే గొప్పదైనదిగా భావిస్తున్నారు.
9. స్వయం కల్పిత ఆచారాలు షిర్క్ (బహుదైవారాధన)
వేరే వారి మార్గాన్ని, ఆచారాన్ని అనుసరించకుండా అల్లాహ్ ఆదేశాలను పాటించడం అల్లాహ్ తన వైశిష్ట్యం కోసం నిర్ణయించుకున్న విషయాల్లోనిది[*]. ఎవరయినా ఈ పనులు సృష్టితాల కోసం చేస్తే ముష్రిక్ అవుతాడు. ప్రవక్తల ద్వారానే అల్లాహ్ ఆదేశాలు మానవుల వద్దకు చేర్చడం సాధ్యమవుతుంది ఎవరయినా ఇమాముల, పండితుల, మహాత్ముల, మత గురువుల, ముల్లాల, పీర్ల తాతముత్తాతల, రాజు, మంత్రి లేదా ఫాదర్ (పాస్టర్)ల మాటలను లేదా వారి ఆచారాలను షరీఅత్ ఆదేశాల కంటే ఎక్కువ ప్రాధాన్యమైనవిగా భావించడం, ఖుర్ఆన్ హదీసులు మరియు సహాబాల జ్ఞాన అనుసరణ వివరణ (ఫఫ్మె సలఫ్) ఉండగా పీర్ల, పండితుల, ఇమాముల వ్యాఖ్యానాలను పేర్కొనడం, లేదా ప్రవక్తలకు సంబంధించి వారు ఆదేశించినదే షరీఅత్ అని విశ్వసించడం, వారికి ఇష్ట మైనట్టు ఆదేశించేవారు వాటిని విధిగా ఆచరించాలి అని భావించడం – ఇవన్నీ షిర్క్ గానే భావించడం జరుగుతుంది.
[*] భావం ఏమిటంటే, అల్లాహ్ ఆదేశం తప్ప ఇతరుల ఆదేశాలు పాటించడం వల్ల సాఫల్యం పొందలేరు. సృష్టితాల ఆదేశాల ద్వారా, మార్గం ద్వారా, ఆచారాల ద్వారా సాఫల్యం సాధించవచ్చని భావించడం షిర్క్ అవుతుంది. వారు మరణించకముందే నిజమైన పశ్చాత్తాపం చెందకపోతే శాశ్వత నరకాగ్నిలో మండిపోవాల్సి ఉంటుంది.
కనుక అల్లాహ్ నిజమైన అధికారిగా భావించాలి. ప్రవక్తలు కేవలం అల్లాహ్ ఆదేశాలను ప్రజల వద్దకు చేర్చుతారు. కనుక ఖుర్ఆన్, హదీసుల, సహబాల అనుసరణ ప్రకారం నడుచు కోవాలి. వాటికి విరుద్ధమైన వాటిని విడిచిపెట్టాలి.
10. తమ గౌరవార్థం ప్రజలను నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం
ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘ప్రజలు తన ముందు బొమ్మల్లాగా నిలుచొని ఉండటాన్ని ఇష్టపడే వాడు తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవచ్చు.’ (హదీసు గ్రంథం తిర్మిజీ: 2755)
ప్రజలు తమ ముందు గౌరవంతో కదలకుండా చేతులు కట్టుకుని నిలుచోవాలి, అటు ఇటు చూడకూడదు, మాట్లాడకుండా విగ్రహాల్లా నిలుచోవాలి అని కోరుకునే వారు నరకవాసులు. ఎందుకంటే, వారు దైవత్వాన్ని ప్రకటించుకుంటున్నారు. అల్లాహ్ అస్తిత్వం కోసం ప్రత్యేకమైన విశిష్టత తమ కోసం కావాలని కోరుకుంటున్నారు. నమాజ్ చేసేవారు నమాజ్లో దిక్కులు చూడకుండా మౌనంగా నిలుచుంటారు. అది అల్లాహ్ అస్థిత్వం కోసం ప్రత్యేకం. కనుక ఎవరి ముందైనా అమిత గౌరవం, మర్యాద ఉద్దేశంతో నిలుచోవడం సమ్మతంకాదు. అది కూడా షిర్కే.
11. “విగ్రహాల” “ఆస్థానాల” పట్ల ఆరాధనా భావం కూడా షిర్క్ (బహుదైవారాధన)
సౌబాన్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘నా సమాజంలోని అనేక తెగలు ముష్రిక్కులతో కలిసిపోనంతవరకు, విగ్రహారాధనను అవలంబించ నంతవరకు ప్రళయం సంభవించదు.’ (హదీసు గ్రంథం తిర్మిజీ, హదీస్ : 2219)
విగ్రహాలు రెండు రకాలుగా ఉంటాయి.
ఒకటి: ఎవరిదైనా విగ్రహాన్ని లేదా శిల్పాన్ని తయారు చేసి దాన్ని పూజించడం. ఆ విగ్రహాలను అరబీ భాషలో ‘సనమ్‘ అంటారు.
రెండు: ఏదైనా స్థలంలో, చెట్టుకు, పుట్టకు, కర్రకు లేదా కాగితానికి ఏదైనా పేరు పెట్టి పూజించడాన్ని ‘వసన్‘ అంటారు. సమాధి, ఆస్థానం, చేతికర్ర, జెండాలు, అబ్దుల్ ఖాదిర్ జీలానిల గోరింటాకు, గురువులు పండితులు కూర్చునే ఆ స్థలాలు ఇవన్నీ ‘వసన్’గానే పరిగణించబడతాయి. అదే విధంగా అమరవీరుల పేర బలిచ్చే స్థూపాలు, తోపులు, ఇంకా కొన్ని స్థలాలు వ్యాధుల పేర్లతో పేరుగాంచాయి. ఉదాహరణకు : ఆటలమ్మ, కాళి, అమ్మోరు, బతుకమ్మ, ఉప్పలమ్మ, భవానీ, బరాహీ [*] మొదలగు వాటితో కొన్ని స్థలాలు ఏర్పరచడం జరిగింది. ఇవన్నీ వసన్ గానే పరిగణించబడతాయి.
సనమ్, వసన్ రెండింటినీ పూజించడం షిర్క్ అవుతుంది. ప్రళయ సమీప కాలంలో ముస్లిములు ఇలాంటి షిర్క్ కార్యాలకే ఒడిగడతారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు. హిందువులూ లేదా మక్కా ముష్రిక్కులు అధికంగా విగ్రహారాధన చేసేవారు. వారు కూడా ముష్రిక్కులే. అల్లాహ్ మరియు ప్రవక్తకు శత్రువులే.
[*] ఇవన్నీ హిందూ దేవతల పేర్లు: ఆటలమ్మ: ఇదొక వ్యాధిదేవత పేరు కూడాను. ఆటలమ్మ సోకినప్పుడు అమ్మవారిని పూజిస్తే ఆ వ్యాధి నయమవుతుందని వారు విశ్వసిస్తారు. మసానీ: హిందువుల విశ్వాసం ప్రకారం ఆటలమ్మకు ఏడుగురు చెల్లెళ్ళు. అందులో ఒకామె పేరు మసానీ. ఈమె చిన్న చెల్లెలని వారి నమ్మకం. భవానీ, కాళి, కాళికాలు కూడా హిందువుల దేవతల పేర్లు.
12. దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం
అబిత్తుఫైల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం అలీ (రదియల్లాహు అన్హు) ఒక పుస్తకం తీసారు. అందులో ఈ హదీసు ఉంది: ‘దైవేతరుల పేర జిబహ్ చేసే వారిని అల్లాహ్ శపిస్తాడు.’ (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 1978)
జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించకుండా సృష్టితాల పేరు తీసుకునే వాడు శాపగ్రస్తుడు. అలీ (రదియల్లాహు అన్హు) ఒక పుస్తకంలో ప్రవక్తగారి ప్రవచనాలను రాసి పెట్టుకున్నారు. అందులో పైన పేర్కొన్న హదీసు కూడా ఉంది. కనుక అల్లాహ్ పేరు తీసుకుని జిబహ్ చేయబడిన పశువు మాత్రమే ధర్మసమ్మతం. ఇంకా మిధ్యా దేవుళ్ళ పేరుతో గుర్తింపబడిన జంతువును అల్లాహ్ పేరుతో జిబహ్ చేసినా శాపగ్రస్తుడే. ఆ పశువు కూడా నిషిద్ధమే. అదే విధంగా దైవేతరుల పేర వదలి పెట్టిన పశువు కూడా నిషిద్ధమే. దాన్ని జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు తీసుకున్నా సరే.
13. ప్రళయ సూచనలు
ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు; నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా విన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “లాత్, ఉజ్జహ్ ప్రాచీన విగ్రహాలు (మళ్లీ) పూజించబడనంతవరకు రాత్రింబవళ్ళు అంతమవ్వవు”. నేను ఇలా అన్నాను: ” ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినాసరే. (దివ్యఖుర్ఆన్ 9 :33, 61 : 9) అనే ఆయత్ ను అవతరింపజేశాడు కదా! అందుచేత ప్రళయం వరకు ధర్మం అలాగే ఉంటుందని ఊహించాను. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు: “అల్లాహ్ కు ఇష్టమున్నంత వరకు ధర్మం తన స్థితిలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత అల్లాహ్ పరిశుభ్రమైన గాలిని పంపుతాడు. ఆ గాలి రవ్వంత విశ్వాసం ఉన్నవారిని కూడా చంపుతుంది. కేవలం చెడ్డవారే మిగులుతారు. వారు తమ తాత ముత్తాతల ధర్మం వైపు మళ్లుతారు“. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2907)
ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) సూరె తౌబహ్ (9:33) సూరతుస్సఫ్ (61:9)లోని సూక్తి ద్వారా ఇస్లాం ప్రళయం వరకు తన ఆధిక్యతతో ఉంటుందేమో అని భావించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ తలచినంత వరకే దాని ఆధిక్యత ఉంటుందని వివరించారు. ఆ తర్వాత అల్లాహ్ పరిశుభ్రమైన గాలిని పంపుతాడు. దానివల్ల విశ్వాసులందరూ మరణిస్తారు. చివరికి రవ్వంత విశ్వాసం కలవారు కూడా చనిపోతారు. తిరస్కారులు మాత్రమే మిగిలి ఉంటారు. వారి హృదయాల్లో ప్రవక్త ఔన్నత్యంగానీ, ధర్మం పట్ల ప్రేమాభిమానంగానీ ఉండదు. అజ్ఞానులు, బహుదైవారాధకులైన తమ తాతముత్తాతల ధర్మాలను అవలంబిస్తారు. ముష్రికుల మార్గాన్ని అవలంబించిన వాడూ ముష్రిక్ అవుతాడు.
దీనిద్వారా తెలిస్తున్నదేమిటంటే; చివరి కాలంలో పూర్వకాలపు షిర్క్ ప్రబలుతుంది. నేడు ముస్లిం సమాజంలో గత కాలపు షిర్క్, ఆధునిక షిర్క్ కూడా కలగలసి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది. ఉదాహరణకు: ముస్లిములు ప్రవక్తల, వలీల, అమరవీరుల విషయంలో షిర్క్ కు పాల్పడుతున్నారు. అదే విధంగా పూర్వకాలపు షిర్క్ కూడా వ్యాపిస్తుంది. వారు ముస్లిమేతరుల విగ్రహాలను పూజిస్తున్నారు. వారి ఆచారాలను అవలంబిస్తున్నారు. ఉదాహరణకు: పండితుల ద్వారా తమ జాతకం చెప్పించుకుంటున్నారు. శకునాలు తీస్తున్నారు. శుభఘడియలు, దుర్ఘడియలని విశ్వసిస్తున్నారు. పౌర్ణమి, నవమి, అమావాస్య, ఆటలమ్మ, అమ్మవారు, హనుమాన్ ను మొరపెట్టుకుంటున్నారు. హోలీ, దీపావళీ, క్రిస్మస్, మీలాదున్నబీ (ప్రవక్త జన్మదినం), ముహర్రమ్ (హుసైన్ రదియల్లాహు అన్హు మరణం) పండుగలు చేస్తున్నారు. రాశులను నమ్ముతున్నారు. ఇవన్నీ హిందువుల, ముష్రిక్కుల ఆచారాలు. అవి ముస్లిముల్లో వ్యాపించి ఉన్నాయి. ఖుర్ఆన్ హదీసులను విడిచిపెట్టి తాతముత్తాతల ఆచారాలను అవలంబించడం వల్ల ముస్లిముల్లో షిర్క్ ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
14. ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: (నా సమాజంలో) దజ్జాల్ వస్తాడు. అప్పుడు అల్లాహ్ ఈసా (అలైహిస్సలాం)ని పంపుతాడు. ఆయన దజ్జాల్ ను వెతికి పట్టుకుని చంపుతారు. అప్పుడు అల్లాహ్ సిరియా దేశం వైపు నుండి చల్లటి గాలులను పంపుతాడు. ఆ గాలి పృధ్విపై రవ్వంత విశ్వాసం కల వారిని కూడా చంపుతుంది. దుర్జనులు పక్షుల మాదిరిగా బుద్ధిహీనులై, క్రూర జంతువుల్లా [*] పీక్కుతింటుంటారు. వారు మంచిని మంచిగా చెడును చెడుగా భావించరు. షైతాన్ మానవ రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ‘మీకు సిగ్గులేదా? ‘ అంటాడు. అప్పుడు వారు ఏం చేయాలో చెప్పమని అడుగుతారు. షైతాన్ వారికి విగ్రహారాధన చేయమని ఆదేశిస్తాడు. (ఆస్థానాలను పూజించమంటాడు) వారు ఆ పనిలోనే లీనమవుతారు. వారికి విస్తృతంగా ఉపాధి లభిస్తుంటుంది. వారి జీవితం సుఖంగా సాగుతుంది. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2940)
[*] హదీసు పారంగతులు షేఖ్ అబ్దుల్ హఖ్ దహ్లవీ గారు ఈ వాక్యానికి భావం ఇలా తెలిపారు: ప్రజలు పాపాలు, దుష్కార్యాలు వ్యాపింపజేయడంలో, మానసిక కోరికలు తీర్చుకోవడంలో పక్షుల్లా తొందరపడుతుంటారు. దౌర్జన్యం, రక్తపాతం సృష్టించడంలో క్రూరమృగాల్లా ప్రవర్తిస్తారు.
చివరి కాలంలో విశ్వాసులు అందరూ చనిపోతారు. అవిశ్వాసులు మూర్ఖులు మాత్రమే మిగిలి ఉంటారు. వారు ఇతరుల ధనాన్ని కొల్లగొడతారు. వారు తాము చేసే పనులకు కొంచెం కూడా సిగ్గుపడరు. వారు మంచి చెడుల్లో తారతమ్యం చూడలేక పోతారు. షైతాన్ మహాత్ముడి రూపంలో వారి దగ్గరకు వచ్చి ‘ధర్మాన్ని అనుసరించక పోవడం చాలా చెడ్డ విషయం. ధర్మంపై నడవండి’ అని హితబోధ చేస్తాడు. అతని మాట విని వారికి ధర్మంపై మక్కువ కలుగుతుంది. కాని వారు ఖుర్ఆన్ హదీసు వెలుగులో సహబాల ప్రకారం నడచుకోరు. తమ బుద్ధిజ్ఞానాలతో ధార్మిక విషయాలను సృష్టిస్తారు. వారు షిర్క్ లో చిక్కుకుంటారు. ఈ క్రమంలో వారికి విస్తృతంగా ఉపాధి లభిస్తుంది. వారి జీవితం ఆనందంగా గడుస్తుంటుంది. మేము సక్రమమైన మార్గంలోనే నడుస్తున్నామ’ని భావిస్తుంటారు. వారు చేసే పనులను అల్లాహ్ ఇష్టపడుతున్నాడని అనుకుంటుంటారు. అందుకనే వారి జీవితాలు బాగున్నాయని భావిస్తారు. ఆచారాలను పాటిస్తున్న కొద్ది వారి మొక్కుబడులు తీరుతున్నాయని భావించి షిర్క్ ఊబిలో చిక్కుకుని పోతుంటారు. అల్లాహ్ అప్పుడప్పుడు బాగా సడలింపు ఇచ్చి ఒక్కసారిగా పట్టుకుంటాడు.
కనుక ముస్లిములు చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మానవుడు షిర్క్ లో పడిపోతాడు. దైవేతరులను మొక్కుకుంటాడు. అల్లాహ్ దాసులకు తప్పించుకునే ఏ అవకాశమూ వదలిపెట్టకుండా చేయడం కోసం అతని మొక్కులు పూర్తిచేస్తుంటాడు. కాని అతను తాను నిజమైన మార్గంలోనే ఉన్నానని, దైవేతరులను మొక్కుకోవచ్చని, అందుకే తన మొక్కులు పూర్తవుతున్నాయని భావిస్తాడు. కనుక మొక్కులు తీర్చబడటాన్ని నమ్మకండి. దాని మూలంగా సత్య ధర్మాన్ని అంటే ఏకదైవారాధనను విడిచి పెట్టకండి. మనిషి ఎంత నీచుడైనా, పాపాత్ముడైనా, అశ్లీలవంతుడైనా, పరుల సొమ్ము కాజేస్తున్నా, మంచి చెడుల మధ్య బేధం చూపించక పోయినా సరే అతను షిర్క్ చేసే వారి కంటే, దైవేతరులను విశ్వసించే వారి కంటే మేలైన వాడు. ఎందుకంటే షైతాన్ ఆ విషయాలు పక్కనపెట్టించి ఈ విషయం నేర్పుతాడు.[*]
[*] ఈ వివరణ ద్వారా షిర్క్ ఎంత తీవ్రమైన పాపమో స్పష్టమవుతుంది. షిర్క్ చేయకుండా పాపాలు చేయొచ్చన్న ఉద్దేశమూ సరికాదు.
15. విగ్రహాల ప్రదక్షిణ
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘ దౌస్ తెగ స్త్రీలు, జులఖలసహ్ విగ్రహ ప్రదక్షిణ చేయనంత వరకు ప్రళయం సంభవించదు.’ (హదీసు గ్రంథాలు బుఖారి 7116 ముస్లిం: 2906)
అరబ్బులో “దౌస్” అనే ఒక తెగ ఉండేది. అజ్ఞాన కాలంలో (ఇస్లాంకు ముందు) వారికొక విగ్రహం ఉండేది. దాన్ని ‘జుల్ ఖలసహ్’ అనే వారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో దాన్ని కూల్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భవిష్యవాణి తెలుపుతూ ప్రళయ సమీప కాలంలో ప్రజలు ఆ విగ్రహాన్ని మళ్లీ విశ్వసించడం మొదలెడతారనీ, దౌస్ మహిళలు దాని ప్రదక్షిణలు చేస్తారని అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వారు ప్రదక్షిణలు చేస్తుండడం కానవచ్చింది.
దీని ద్వారా తెలిసేదేమిటంటే కాబా గృహం తప్ప వేరే గృహాల ప్రదక్షిణ చేయడం అవిశ్వాస ఆచారం.
సారాంశం
1-2. అల్లాహ్ తన గౌరవార్థం కొన్ని పనులు నిర్ణయించి వాటిని ప్రవక్తల ద్వారా దాసులకు నేర్పించాడు: ఉదాహరణకు: నమాజ్, రోజా, జకాత్, హజ్, సహాయం కోరడం, మొక్కుకోవడం, నమ్మకం, ప్రేమ, భీతి మొదలగునవి వీటిని ఆరాధనలు అంటారు. ఇవన్నీ అల్లాహ్ కోసమే చేయాలి.
3. సాష్టాంగపడటం (సజ్దా ) సృష్టికర్త హక్కు. సృష్టితాలకు ఏ రకంగా సాష్టాంగపడ్డా అది షిర్క్ అవుతుంది. గత షరీఅత్ లు (ధార్మిక శాసనాలు) రద్దుచేయబడ్డాయి.
4. మురీద్ లు, ముర్షద్ లు (గురువులు, పండితులు, శిష్యులు) కేవలం అల్లాహ్ నే విశ్వసించాలి. మరియు ఆయనపై ఆశ ఉంచడం తప్పనిసరి. ఆయన తన ఏకత్వం, దైవత్వం, ప్రభుతలో అద్వితీయుడు. ఆయన గౌరవార్థం ప్రత్యేకించబడిన ఆదేశాలను ఆయన కోసమే పాటించాలి.
5. అల్లాహ్ తన గౌరవార్థం ఏ స్థలాలనయితే దైవ చిహ్నాలుగా నిర్ణయించాడో అక్కడకే వెళ్ళాలి. తాను సూచించిన విధంగానే గౌరవించాలి. ఆ స్థలాలు కాకుండా వేరే చోట్లకు వెళ్ళడం, అక్కడకు వెళ్ళి భక్తి చాటడం షిర్క్ అవుతుంది.
6. పంది, రక్తం, మృత జంతువు, దైవేతరుల పేర వదిలిపెట్టిన జంతువులు, వస్తువులు కూడా అధర్మం (హరాం) అపవిత్రం. అవి చేసేవారు, చేయించేవారు వాటిలో పాల్గోనేవారు బహుదైవారాధకులు.
7. అధికారం కేవలం అల్లాహ్. ఆయన తిరుగులేని అధికారి. మిగతా వారందరూ నిరాధారులు, కల్పించబడ్డవారు మాత్రమే.
8. సర్వాధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. సృష్టితాలకు ఇలాంటి బిరుదులుంటే అవి కల్పితాలు మాత్రమే. అధికారం కేవలం అల్లాహ్ కే కలదు. కనుక పుణ్యాత్ముల ఆదేశానికంటే అల్లాహ్ ఆదేశానికే ప్రాధాన్యతనివ్వాలి.
9. ఎవడయితే అల్లాహ్ చట్టానికి బదులు దాసులు చట్టాలను అనుసరిస్తాడో, ఖుర్ఆన్, హదీసుల మరియు సహబాల అనుసరణకు బదులు ఇమాముల (నాయకుల) వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తాడో, ప్రవక్తల షరీఅత్ (ధర్మశాసనాలను) కల్పితాలుగా భావిస్తాడో వాడు ముష్రిక్ అయిపోతాడు. ఎందుకంటే నిజమైన అధికారి అల్లాహ్ యే. మరియు ప్రవక్తలు కేవలం సందేశహరులు మాత్రమే. “ఖుర్ఆన్, హదీసులు మరియు సహబాల అనుసరణ మాత్రమే గీటురాయి.”
10. ప్రజలను గౌరవార్థం ఎవరి ముందయినా ముందు నిలుచోబెట్టటం షిర్క్ (బహుదదైవారాధన) అవుతుంది. ఎందుకంటే గౌరవార్థం ఎవరి ముందయినా నిలుచోవడ మంటే అది అల్లాహ్ కోసమే ప్రత్యేకించబడింది. ఉదాహరణకు నమాజు.
11. విగ్రహాలను శిల్పాలను ఆరాధించడం బహుదైవారాధన. ముస్లిములు వాటిని ఆరాధించడం ప్రళయ సూచన.
12. దైవేతరుల పేర నిర్ణయించిన జంతువు, దైవేతరుల పేర బలిచ్చిన జంతువు రెండూ నిషిద్ధం. ఇది బహుదైవారాధనా కార్యం.
13. ప్రళయ సూచనల్లోని ఒక విషయం ఏమిటంటే ముస్లిములు ఖుర్ఆన్, హదీసు సహబాల అనుసరణను విడిచిపెట్టి తాతముత్తాతల బహుదైవారాధన ఆచారాలను పాటిస్తూ, మక్కా ముష్రిక్కుల మాదిరిగా షిర్క్ (బహుదైవారాధన) కు పాల్పడతారు.
14. ప్రళయ సూచనల్లో మరో విషయం ఏమిటంటే; ఆవగింజంత విశ్వాసమున్న వాడూ అంతమవుతాడు. దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉంటారు. వారు షైతాన్ ధర్మాన్ని అవలంబిస్తారు. తద్వారా వారు ప్రాపంచిక లబ్ది పొందుతారు. దాని వల్ల వారు ఘోర షిర్క్ (బహుదైవారాధన)లో లీనమయిపోతారు.
15. ఒకవేళ బహుదైవారాధనా ఆచారాలతో కోరికలు మరియు వరములు పూర్తి అవ్వుతే అవి కేవలం ఎదురు వాదనకు దిగకుండా ఉండడానికి అల్లాహ్ కల్పించిన సౌకర్యం మాత్రమే. అవి ఒక పరీక్ష కూడాను. దాని పర్యవసానం శాశ్వత నరకం మాత్రమే. ఎందుకంటే మొక్కుబడులు తీరడం, తీరకపోవడం సత్యధర్మం కోసం ‘ప్రమాణం’ (ఆధారం) కాదు.
16. దైవగృహం (బైతుల్లాహ్) వద్ద కాకుండా వేరే చోట ప్రదక్షిణ చెయ్యడం అవిశ్వాసంతో కూడిన ఆచారం. ఇది కూడా ప్రళయ సూచనే.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
- “ఆరాధన”ను నిర్వచించండి?
- స్వయంకల్పిత ఆచారాలను, షిర్క్ ను, వాటి రకాలను వివరించండి?
- ప్రళయ సమీప సూచనల్లో కొన్నింటిని వ్రాయండి?
తప్పొప్పులను గుర్తించండి
- అల్లాహ్ ను వదలి దైవేతరులను మొరపెట్టుకోవడం సమ్మతము ( )
- దైవేతరుల పేరు మీద జంతువును జిబహ్ చెయ్యడం, దైవేతరులపై ప్రమాణాలు చేయ్యడం షిర్క్ అవుతుంది ( )
- గౌరవార్ధం ప్రజలను నిలుచోబెట్టి ఉంచడం ధర్మసమ్మతము. ( )
- అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ( )
ఖాళీలను పూరించండి
- ప్రళయ సూచనల్లో ఒక సూచన ప్రజలు తమ తాత ముత్తాతల ………… ………………… వైపు మరలుతారు.
- విగ్రహాల, సమాధుల ప్రదక్షిణ చేయడం ……………………..
- దైవ చిహ్నాలు కేవలం…………………………….. కోసం సమ్మతం.
ఏడవ అధ్యాయం: ఆచార సంప్రదాయాలలో షిర్క్ నిషిద్ధం
ఈ అధ్యాయంలోని ఖుర్ఆన్ సూక్తులు, హదీసుల ద్వారా మానవుడు ప్రాపంచిక విషయాల్లో అనేక పనుల ద్వారా తనకు అల్లాహ్ మీద గల భక్తి ప్రపత్తులను ప్రకటిస్తాడు. ఇలాంటి వ్యవహారం దైవేతరుల విషయంలో చేయకూడదని అవి నిరూపిస్తాయి.
1. షైతాను కలతలు
إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا
వారు అల్లాహ్ను వదలి స్త్రీలను మొరపెట్టు కుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టు కుంటున్నారు.అల్లాహ్ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. (దివ్యఖుర్ఆన్ 4: 117–121)
దైవేతరులను మొరపెట్టుకునేవారు వాస్తవానికి స్త్రీల పూజారులు. కొందరు నూకాలమ్మ, మర్యమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ, కోటసత్తమ్మ, బషీరమ్మ, బతుకమ్మ, నంగాలమ్మ, సమక్క, సారలమ్మ ఇంకా ఎందరో దేవతలను, అమ్మవారిని మరియు కాళీని పూజిస్తుంటారు. ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. వారికి ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ షైతాన్ కల్పించిన దురాలోచనలు మాత్రమే. వాటినే వారు దైవాలుగా భావిస్తున్నారు. ఈ కల్పిత దైవాలు చూపించేవి, చెప్పేవి అంతా షైతాన్ ఆడుతున్న నాటకం.
ముష్రిక్కులు(బహుదైవారాధకులు) చేస్తున్న ఆరాధనలన్నీ షైతాన్ కోసమే. వారు దేవతలను మొక్కుకుంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు షైతాన్ ను మొక్కుకుంటున్నారు. ఈ విషయాల వల్ల ప్రాపంచిక ప్రయోజనం ఉండదు. ధార్మిక ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే షైతాన్ బహిష్కరించబడినవాడు. ఇతని వల్ల ధార్మిక ప్రయోజనం ఏ కోశానా లేదు. ఎందుకంటే షైతాన్ మానవుడి బద్ధ శత్రువు. అలాంటివాడు మానవుడికి మేలు జరగాలని ఎలా కోరుకుంటాడు? అతను అల్లాహ్ ముందు, ‘నేను నీ దాసులను దారి మళ్ళించి నా దాసులుగా చేసుకుంటాను, నన్నే విశ్వసించేలా వారి మనసుల్ని మార్చేస్తాను, వారు నా పేర జంతువులను జిబహ్ చేస్తారు. వారిపై నా కోసం మొక్కుకున్న గుర్తులుంటాయి. ఉదాహరణకు: జంతువుల చెవులను కోస్తారు. వారి మెడలో దండలేస్తారు. వారి నొసటిపై గోరింటాకు రాస్తారు. నోట్లో డబ్బు పెడతారు. వాటి వల్ల చాలా స్పష్టంగా అది మొక్కుకోబడిన జంతువని ఇట్టే అర్థమవుతుంది. నా ప్రభావం వల్ల నీవు ఇచ్చిన రూపాన్ని కూడా మార్చుకుంటారు. దేవతల పేర కేశాలు కత్తిరించకుండా అలాగే వదలిపెడతారు. చెవులు, ముక్కులు కుట్టించు కుంటారు. గడ్డాలు తీయించుకుంటారు. కనుబొమ్మలు తీయించుకుని నిరుపేదల్లా కనబడేలా చేస్తాను’ అన్నాడు.
ఇవన్నీ షైతాన్ కార్యాలే. ఇవన్నీ ఇస్లాం ధర్మానికి విరుద్ధం. కరుణామయుడైన అల్లాహ్ ను వదలి, శత్రువైన షైతాన్ మార్గాన్ని అవలంబించినవాడు స్పష్టమైన మోసంలో పడిపోయాడు. ఎందుకంటే షైతాన్ దురాలోచనలు రేపడం తప్ప మరేమీ చేయలేడు. అబద్ధాలతో, వాగ్దానాలతో మానవుణ్ణి మోసపుచ్చుతాడు. ఫలానా పని చేస్తే ఫలానా మంచి జరుగుతుంది. ఇన్ని డబ్బులుంటే చాలు అందమైన తోటను తయారు చేసుకోవచ్చు. సుందరమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆశలు రేకెత్తిస్తాడు. కాని ఆ కోరికలు తీరవు. కనుక మానవుడు ఆందోళన చెంది అల్లాహ్ ను విస్మరించి ఇతరులను మొరపెట్టుకుంటాడు. కాని అతని అదృష్టంలో ఉన్నదే జరుగుతుంది. వారిని నమ్మడం వల్ల ఒరిగేది ఏమీలేదు. ఇవన్నీ షైతాన్ రేపే కలతలు. ఇది అతని కుట్ర. అతని మాటలు విని మానవుడు షిర్క్ లో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా షైతాన్ ఉచ్చునుండి విముక్తి పొందలేకపోతాడు. చివరికి నరకానికి పాత్రుడవుతాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత స్పృహ కలిగి తప్పించుకోనే ప్రయత్నం చేసి అల్లాహ్ అనుగ్రహంతో రక్షించబడిన వాడు తప్ప.
2. సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు
هُوَ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَت دَّعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَّنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
ఆ అల్లాహ్ యే మిమ్మల్ని ఒకే ప్రాణి (వ్యక్తి) నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు. అతను ఆమె ద్వారా ప్రశాంతతను పొందటానికి! ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది (గర్భవతి అయింది). ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధిక మైనప్పుడు భార్యా భర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్ ను, ‘నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ’ని ప్రార్థించసాగారు. మరి అల్లాహ్ వారికి (ఏ లోపమూ లేని) బిడ్డను ప్రసాదించాడుగానీ, ఆ ప్రసాదితంలో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. (దివ్యఖుర్ఆన్ 7:189-190)
మొదట్లోనూ అల్లాహ్ యే మానవుణ్ణి సృష్టించాడు. అతనికి భార్యనిచ్చాడు. ఇద్దరిలో ప్రేమను పుట్టించాడు. వారికి సంతానం కావాలని కోరిక కలిగినప్పుడు వారు అల్లాహ్ తో వేడుకున్నారు: తమకు ఆరోగ్యవంతులైన మంచి సంతానం కలిగితే తాము అల్లాహ్ కు కృతజ్ఞులమై ఉంటామని ఆశిస్తారు. వారి కోరిక ప్రకారమే వారికి సంతానం కలుగుతుంది. కాని అప్పుడు వారు దైవేతరులను విశ్వసిస్తారు. వారినే మొక్కుకోవడం ప్రారంభిస్తారు. సంతానాన్ని ఆస్థానాల వద్దకు, సమాధుల వద్దకు తీసుకెళ్తారు. వారి పేర వెంట్రుకలు విడిచి పెడతారు. మెడల్లో మాలలు వేసుకుంటారు. చేతులకు కడియాలు [*] ధరిస్తారు. కొందరి పేర బైరాగులు అవుతారు. పేర్లు కూడా షిర్క్ పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు : గంగా దాస్ (గంగానదికి దాస్యం చేసేవాడు), మదీనా, సయాద్ బాజీ, జాన్ షహీదా, యాదగిరి, పీరా, మీరాన్, జమునా దాస్ (యమునా నదికి దాస్యం చేసేవాడు) మొదలగునవి. అల్లాహ్ కు ఇలాంటి మ్రొక్కు బడులతో ఎలాంటి సంబంధం ఉండదు. కాని ఈ అవివేకులు ఇలా చేయటం వల్ల వారి నుండి విశ్వాసం దూర మవుతూ ఉంటుంది.
[*] మొక్కుబడి కడియాలు, కంకణాలు. మొక్కుబడి సమయం పూర్తయితే వాటిని తీసేస్తారు.
3. వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు
وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్ధారించారు. పైపెచ్చు ‘ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం’ అని స్వయంగా తామే తీర్మానించుకుని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాహ్ కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది? (దివ్యఖుర్ఆన్ 6: 136)
ధాన్యాన్ని, జంతువులను అల్లాహ్ యే పుట్టిస్తున్నాడు. ముష్రిక్కులు (బహుదైవా రాధకులు) అందులో నుంచి అల్లాహ్ కు భాగం తీసినట్టు దైవేతరుల కోసం కూడా భాగం తీస్తారు. దైవేతరుల భాగం తీసేటప్పుడు ఎంత మర్యాదగా వ్యవహరిస్తారో అల్లాహ్ విషయంలో అంత గౌరవంగా వ్యవహరించరు.
4. పశువుల వ్యవహారాలలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు
وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ
‘ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినడం సమ్మతం కాదు’ అని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయడం, వాటి ద్వారా బరువు లాగించడం నిషేధించబడింది (అని అంటారు). మరికొన్ని పశువులపై (జిబహ్ చేసే సమయంలో) వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు. అల్లాహ్ కు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. (దివ్యఖుర్ఆన్ 6:138)
కొందరు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ఫలానా వస్తువు అస్పృశ్యమైనది. అది ఫలానా వ్యక్తి మాత్రమే తినాలి అంటారు. మరికొందరు కొన్ని పశువులపై భారాన్ని మోపకుండా, వాటిపై స్వారీ అవ్వకుండా మొక్కుబడి పశువులని, వీటిని గౌరవించాలని అంటుంటారు. మరికొందరు అల్లాహ్ సంతోషిస్తాడని, తమ మొక్కులను తీరుస్తాడని పశువులను దైవేతరుల పేర వదలిపెడతారు. కాని వారు చేస్తున్న పనులు, వారి ఆలోచనలన్నీ అబద్ధం. దానికిగాను వారికి తప్పకుండా శిక్ష లభిస్తుంది.
مَا جَعَلَ اللَّهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
అల్లాహ్ ‘బహీరా’ను గానీ, ‘సాయిబా’ను గాని, ‘వసీలా’నుగానీ, ‘హామ్’ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్ కు అబద్ధాన్ని అంట గడుతున్నారు. వారిలో చాలామంది అవివేకులు. (దివ్యఖుర్ఆన్ 5: 103)
ఏదైనా పశువును ఎవరి పేరనయినా వదలిపెట్టేటప్పుడు ఆ జంతువుల చెవులకు అచ్చువేసేస్తారు. అలాంటి పశువులను ‘బహీరహ్’ అంటారు. ఆంబోతును ‘సాయిబహ్’ అంటారు. ఏదైనా పశువు విషయంలో దీనికి మగపశువు పుట్టితే దానికి కూడా మొక్కులు ఇచ్చేస్తామని మొక్కుకుంటారు. ఒకవేళ ఆ పశువుకు ఆడ, మగ రెండూ జన్మిస్తే మగపశువును కూడా మొక్కు కోసం ఇవ్వరు. ఇలాంటి దాన్ని ‘వసీలహ్’ అంటారు. ఏదైనా పశువుకు పది పిల్లలు కలిగితే దానిపై స్వారీ చేయడం, వాటిపై బరువు మోయడం లాంటివి చేసేవారు కాదు. వాటిని ‘హామ్’ అంటారు.
ఈ విషయాలు ధార్మిక మైనవి కావు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే.
దీనిద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఏదైనా పశువును ఎవరి పేరనయినా వదలిపెట్టడం, దానిపై అచ్చు వేయడం, ఆవు, మేక, కోడి ఫలానా వారి కోసం మొక్కుబడి అని నిర్ణయిం చడం లాంటి పనులన్నీ అజ్ఞాన ఆచారాలు. షరీఅత్ (ధర్మశాస్త్రాని)కి విరుద్ధమైన పనులు.
5. హలాల్ (ధర్మసమ్మతం), హరాం (నిషిధ్ధం) విషయంలో అల్లాహ్ పై నింద
وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
ఏ వస్తువునయినా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు. (దివ్యఖుర్ఆన్ 16:116)
మీకు మీరే హలాల్ హరాంలను నిర్ణయించకండి. అది అల్లాహ్ గొప్పతనం. అలా నిర్ణయించడం వల్ల అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించినవారవుతారు. ‘ఫలానా పని ఇలా చేస్తే బాగుండేది అలా చేయకపోవడం వల్లనే అది పాడయిపోయింది’ అని భావించడం తప్పు. ఎందుకంటే వాస్తు, ముహూర్తాల ద్వారా అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించి మానవుడు సాఫల్యం పొందలేడు. ముహర్రం మాసంలో కిల్లీ (పాన్) తినకూడదు, ఎర్ర దుస్తులు ధరించకూడదు, వివాహ సమయాల్లో ఫలానా ఆచారాలు పాటించడం, దుఃఖ సమయాల్లో ఫలానా ఆచారాలు పాటించడం తప్పనిసరి, భర్త చనిపోయిన తర్వాత భార్య వివాహం చేసుకోకూడదు, వివాహాలకు వెళ్ళకూడదు, పచ్చడి చేయ కూడదు, ఫలానా వ్యక్తి నీలి దుస్తులు ధరించకూడదు, ఫలానా వ్యక్తి ఎర్ర దుస్తులు ధరించకూడదు. ఇలాంటి విశ్వాసాలు, భావనలన్నీ షిర్క్. ముష్రిక్కులు అల్లాహ్ గొప్పతనంలో జోక్యం చేసుకుంటున్నారు. తమ ధర్మాన్ని వేరుగా ఏర్పరచుకుంటున్నారు.
6. నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్ (బహుదైవారాధన)
జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ఒక రోజు హుదైబియ్య రాత్రి వర్షం కురిసింది. ఆ రోజు ఉదయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజ్ చేయించారు. నమాజ్ పూర్తయిన తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలనుద్దేశించి, ‘మీ ప్రభువు ఏమన్నాడో తెలుసా?’ అని ప్రశ్నించారు. సహచరులు ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నా దాసులు ఉదయం కొందరు విశ్వాసులుగానే ఉన్నారు. కాని కొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ అనుగ్రహం వల్ల, అతని కరుణ వల్ల వర్షం కురిసిందన్న వారు నన్ను విశ్వసిం చారు. నక్షత్రాలను తిరస్కరించారు. ఫలానా నక్షత్రం[*] వల్ల వర్షం కురిసిందనేవారు నక్షత్రాలను విశ్వసించారు. నన్ను తిరస్కరించారు.’ (హదీసు గ్రంథాలు బుఖారి, హదీస్ : 846, ముస్లిం, హదీస్ : 71)
[*] నక్షత్రాల వల్ల మూడు ప్రయోజనాలున్నాయని దివ్యఖుర్ఆన్లో పేర్కొనడం జరిగింది. ఆకాశం అందంగా ఉండటానికి, షైతాన్ను తరిమికొట్టడానికి, భూసముద్ర ప్రయా బీకుల మార్గనిర్దేశనం కోసం.
విశ్వంలో సృష్టితాల ప్రభావం ఉందని భావించేవారిని అల్లాహ్ తన తిరస్కారులుగా పరిగణిస్తాడు. అలాంటి వారు నక్షత్ర పూజారులు. విశ్వమంతా అల్లాహ్ ఆదేశం మేరకు నడుస్తుందనే వారు అల్లాహ్ ప్రియదాసులు. శుభ ఘడియలు (ముహూర్తాలు), దుర్ఘడియలు(శకునాలు) ఉన్నాయని విశ్వసించడం, మంచి చెడు రోజులున్నాయని నమ్మడం, జ్యోతిష్కుల మాటలను విశ్వసించడం వల్ల షిర్క్ ద్వారాలు తెరుచు కుంటాయి. ఎందుకంటే నక్షత్రాలను విశ్వసించడం జ్యోతిష్కుల పని.
7. “జ్యోతిష్కుడు”, “ మాంత్రికుడు” “తాంత్రికుడు” కాఫిరులే.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘భౌతిక విజ్ఞాన విద్య వదలి అల్లాహ్ ప్రస్తావించని జ్యోతిష్య విద్య నేర్చుకున్నవాడు జాల విద్యలో ఒక భాగం నేర్చుకున్నాడు. ప్రతీ జ్యోతిష్కుడు తాంత్రికుడే. ప్రతి తాంత్రికుడు మంత్రగాడే. మరియు ప్రతి మంత్రగాడు అవిశ్వాసి అవుతాడు.’ దివ్య ఖుర్ఆన్లో నక్షత్రాల ప్రస్తావన ఉంది. వాటి ద్వారా అల్లాహ్ సామర్థ్యం, కార్యదీక్ష తెలుస్తుంది. వాటివల్లనే ఆకాశం అందంగా కానవస్తుంది. వాటి ద్వారానే షైతానులను తరిమి తరిమి కొట్టడం జరుగుతుంది. కాని వాటి ద్వారా విశ్వంలో జోక్యం జరగడంగాని, లాభనష్టాల ప్రభావం పడటంగాని జరగదు. అలాంటప్పుడు ఎవరయినా నక్షత్రాల ప్రయోజనాలను విడిచిపెట్టి, అజ్ఞానకాలంలో (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు) జ్యోతిష్కులు, మాంత్రికులు, జిన్నులను అడిగి అగోచర విషయాలు తెలిపే మాదిరిగా జ్యోతిష్కులు నక్షత్రాల ద్వారా తెలుసుకుని చెప్పే మాదిరిగా, నక్షత్రాల ద్వారానే ప్రపంచం నడుస్తుందని చెప్పేవారు అగోచర విషయాలు తెలుసని ప్రకటించే వారి మార్గం మాంత్రికుల, జ్యోతిష్కుల, తాంత్రికుల మార్గం ఒక్కటే. మంత్రగాళ్లు, జ్యోతిష్కుల మాదిరిగా జిన్నులతో స్నేహం చేస్తారు. వారిని అనుసరించకుండా జిన్నులతో స్నేహం ఏర్పడదు. వారిని మొరపెట్టుకోవడం, నైవేద్యం సమర్పించడం వల్లనే స్నేహం ఏర్పడుతుంది.
కనుక ఇవన్నీ షిర్క్, తిరస్కార విషయాలు. అల్లాహ్ ముస్లిములను షిర్క్ నుండి రక్షించుగాక! ఆమీన్.
8. “జోతిష్య”, సంఖ్య శాస్త్రంపై విశ్వసించే పాపం
మాతృమూర్తి హఫ్సహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “జ్యోతిష్కుని దగ్గరికి వెళ్లి సమాచారం అడిగే వారి నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. “ (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ 2230)
అంటే ఎవరయినా తనకు అగోచర విషయాలు తెలుసని ప్రకటించుకుంటే, అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఏదైనా అడిగితే అతని నలభై రోజుల ఆరాధన స్వీకరించ బడదు. ఎందుకంటే అతను షిర్క్ చేశాడు. షిర్క్ ఆరాధనా జ్యోతిని ఆర్పుతుంది. జ్యోతి ష్కుడు, తాంత్రికుడు, శకునాలు చూసేవాడు అందరూ జ్యోతిష్కులుగానే పరిగణించ బడతారు.
9. శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు
ఖుత్న్ బిన్ ఖబీసహ్ ఉల్లేఖించారు: ఆయన ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘శకునాలు చూడటం కోసం పక్షులను ఎగుర వేయడం, గవ్వలు వేయడం,[*] దుశ్శకునంగా భావించటం కుఫ్ర్ పని’. (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 3907)
[*] పక్షులను ఎగురవేసేవారు లేదా జింకను వదలిపెట్టేవారు, అది కుడి వైపు వెళ్తే శుభంగా, ఎడమ వైపు వెళ్తే అశుభంగా భావించి పని చేయకుండా వదలిపెట్టేవారు. అదే విధంగా రాళ్ళు కొట్టి లేదా ఇసుక మీద గీతలు గీసి శకునాలు చూసేవారు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “శకునాలు చూడటం షిర్క్, శకునాలు చూడటం షిర్క్, శకునాలు చూడటం షిర్క్”. (హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్ నెం. 3910)
అరబ్ లో శకునాలు చూసే సంప్రదాయం ఉండేది. వారు శకునాలను బాగా నమ్మేవారు. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘షిర్క్’ అని అనేక సార్లు నొక్కి చెప్పారు. ప్రజలు దానికి దూరంగా ఉండాలని ఆదేశించారు.
సఅద్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘గుడ్లగూబ (శకునం) కాదు, అల్లాహ్ నిర్ణయించకుండా ఒకరి వ్యాధి ఇంకొకరికి సోకదు. ఏ వస్తువులోనూ అశుభం లేదు. ఒకవేళ ఎందులోనైనా అశుభం అనేది ఉంటే అది స్త్రీ, ఇల్లు, గుర్రంలో ఉండేది.’ (‘హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 3921)
అరబ్బుల్లో ఓ వింతైన మూఢ నమ్మకం ఉండేది. హతుని ప్రతీకారం తీర్చుకోక పోతే అతని పుర్రెలోనుండి గుడ్లగూబ బయటికొచ్చి ఫిర్యాదు చేస్తూ తిరుగుతుంటుందని వారు విశ్వసించేవారు. దీనినే ‘హామ్‘ అంటారు. ఈ విషయం నిరాధారమైనదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. పునర్జన్మకు ఎలాంటి ఆధారాలు లేవని దీని ద్వారా తెలుస్తుంది.
గజ్జి, కుష్ఠు రోగం లాంటి కొన్ని వ్యాధులు ఒకరి నుండి మరొకరికి సోకుతాయని అరబ్బులు భావించేవారు. అది కూడా అవాస్తవమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు. అదే విధంగా కొందరు, మసూచి సోకిన వారి వద్దకు పిల్లలను పంపకుండా దూరంగా ఉంచుతారు. వ్యాధికి తనకు తనుగా అంటుకొనే శక్తి ఉందని భావించడం తిరస్కారానికి సంబంధించిన ఆచారమే. అంటే అల్లాహ్ ఆదేశం లేనిదే ఒకరి వ్యాధి దానంతట అదే మరొకరికి సోకుతుందని నమ్మకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశంతోనే రోగాలు వస్తాయి. కాని వైద్య పరంగా జాగ్రత్తలు వహించడంలో తప్పులేదు.
ఫలానా పని ఫలానా వ్యక్తి చేస్తే అశుభం అనీ, అది అచ్చిరాదని ప్రజల్లో ఒక భావన ఉంది. ఇందులో కూడా వాస్తవం లేదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా బోధించారు: మూడు విషయాలు ప్రభావితం చేయగలవు. ఇల్లు, గుర్రం మరియు స్త్రీ.[*] ఇవి కొన్ని ప్రత్యేకమైన రకాలలో అశుభంగా నిరూపితమవ్వొచ్చు. కాని ప్రజల్లో చలామణి అయివున్న శకునాలు అశుభాలు మాత్రం కావు.
[*] మరోచోట దీనికి ఈ విధంగా వివరణ ఇవ్వటం జరిగింది: పొరుగు వారు చెడ్డవాళ్లయితే ఆ ఇల్లు అశుభం కలిగినది. దుర్వర్తన కలిగిన స్త్రీ అశుభమైంది. హఠముగల క్రూరమైన గుర్రం ఉంచదగ్గది కాదు.
ఒకవేళ కొత్త ఇల్లుగానీ, గుర్రంగానీ కొంటే లేదా కొత్తగా వివాహం చేసుకుంటే వారి విషయంలో మేలు చేయమని అల్లాహ్ ని అర్థించాలి. వాటి కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ఇతర విషయాల్లో ఫలానా పని కలిసొచ్చింది. ఫలానా పని కలిసి రాలేదు అని భావించకూడదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అంటూ లేదు, గుడ్ల గూబ శకునము లేదు, సఫర్ (మాసంలో అవి ఇవి చేయకూడదని) లేదు. ‘ (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ నెం.5770)
అరబ్బులు జువుల్ కల్బ్ (కుక్క ఆకలి) అనే వ్యాధి సోకిన వారి గురించి అతని కడుపులో ఏదో ఆపద దూరిందని, అది అతని కడుపులోని ఆహారాన్ని తింటుందని, అందువల్ల అతని కడుపు నిండడం లేదని భావించేవారు. అదొక భూతమతి దాని పేరు ‘సఫర్‘ అని ప్రతీతి. అదంతా కల్పన అని, అది భూతం కాదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు.
దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, రోగాలు దేవీ దేవతల వల్ల సంభవించవు. కొందరు పొంగు అమ్మోరు వంటి రోగాలు ఫలానా వలన సంభవించాయని భావిస్తారు. ఉదాహరణకు- సతలా, అమ్మోరు, నూకాలమ్మ, మసానీ, బరాహీ [*] మొదలగునవి. కాని అది వాస్తవం కాదు. అజ్ఞాన కాలంలో (మహాప్రవక్త రాక ముందు) సఫర్ మాసాన్ని అశుభంగా భావించేవారు. ఆ మాసంలో పనులు చేసేవారు కారు. ఆ నెలలో ఆపదలు అవతరిస్తాయని భావించేవారు. అదంతా అవాస్తవం. అదే విధంగా ఏదైనా వస్తువును, తేదీని, రోజును, ఘడియను అశుభంగా భావించడం కూడా షిర్క్ అవుతుంది.
[*] ‘బరాహీ’ హిందువుల రోగాల దేవత. వారు దాన్ని పూజిస్తారు. తద్వారా రోగాలు నయం అవుతాయని భావిస్తారు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుష్ఠు రోగి చేయి పట్టుకుని దాన్ని తనతోపాటు పాత్రలో పెట్టి ‘అల్లాహ్ పై నమ్మకముంచి తిను’ అన్నారు. (హదీసు గ్రంథాలు అబూదావూద్, హదీన్: 3925; తిర్మిజీ, హదీస్ నెం. 1817; ఇబ్నెమాజ హదీస్ నెం. 3546) అంటే అల్లాహ్ పై మనకు నమ్మకం ఉండాలి. ఆయన తాను తలచుకున్న వారిని అస్వస్థతకు గురి చేస్తాడు, తాను తలచుకున్న వారికి ఆరోగ్యాన్నిస్తాడు. ఎవరితోనైనా కలిసి తినడానికి శంకించకూడదు. వారితో కలిసి తినడం వల్లనే వ్యాధి సోకుతుందని భావించకూడదు.
10. అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి
జుబైర్ బిన్ ముత్ యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక గ్రామస్తుడు వచ్చి ‘ప్రజలు ఆపదలో ఉన్నారు, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. తగినంత ధనం లేదు, పశువులు చనిపోతున్నాయి, వర్షం పడాలని మీరు మా కోసం అల్లాహ్ కు దుఆ చేయండి. అల్లాహ్ వద్ద మేము మిమ్మల్ని సిఫారసు దారుడ్ని చేయాలను కుంటున్నాము, మీ వద్ద అల్లాహ్ ను సిఫారసుదారుడ్ని చేయాలనుకుంటున్నాము’ అని విన్నవించుకున్నాడు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అల్లాహ్ పరమ పవిత్రుడు! అల్లాహ్ పరమ పవిత్రుడు! అని చాలా సేపు అల్లాహ్ పవిత్రతను చాటారు. సహాబాల ముఖాలపై దాని ప్రభావం పడటం గమనించారు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: అమాయకుడా! అల్లాహ్ ఎవరి వద్దా సిఫారసు చేయడు. ఆయన గొప్పతనం వారి కంటే గొప్పది, ఉన్నతమైంది. అమాయకుడా! అల్లాహ్ అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంపై ఎలాగుందంటే (వేళ్లను గోపురం మాదిరిగాచేసి) ఆయన వల్ల అది విలవిలలాడుతుంది. ఒంటె వీపుపై ప్రయాణించే వాని భారం వల్ల పల్లకి విలవిలలాడినట్టు.” (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 4726)
ఒకసారి అరేబియా దేశంలో క్షామం ఏర్పడింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. ఒక గ్రామస్తుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ప్రజల దీనావస్థను వివరించాడు. అల్లాహ్ ను వేడుకోమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కోరాడు. అక్కడితో ఆగకుండా ‘మీరు అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని, అల్లాహ్ మీ వద్ద సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం’ అన్నాడు. ఆ మాట విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ భీతితో, భయంతో కంపించిపోయారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటిపై అల్లాహ్ కీర్తి వచనాలు వెలువడ్డాయి. అల్లాహ్ ఔన్నత్యం వల్ల సభికుల ముఖాలపై వస్తున్న మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గ్రామస్తుడికి అర్థమయ్యేలా వివరించారు: “అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అల్లాహ్ ఎవరి సిఫారసు అయినా స్వీకరిస్తే అది ఆయన అనుగ్రహమే. కాని ప్రవక్త వద్ద అల్లాహ్ ను సిఫారసు దారునిగా చేయడం అంటే ప్రవక్తకు అధికారం అంటగట్టడం, అతన్నే యజమానిగా భావించడం అన్నమాట. కాని అది అల్లాహ్ గొప్పతనం. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు.”
అల్లాహ్ ఔన్నత్యం అద్వితీయం. ప్రవక్తలు, ఔలియాలు ఆయన ముందు చాలా చిన్నవారు. ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది. సింహాసనం అంత పెద్దదయినప్పటికీ అల్లాహ్ ఔన్నత్యం వల్ల దాన్ని మోయలేక విలవిలలాడుతుంది.
ఆయన ఔన్నత్యం సృష్టితాల ఊహకు కూడా అందదు. తమ భావాల ద్వారా ఆయన ఔన్నత్యాన్నీ వివరించలేరు. ఆయన పనిలో జోక్యం చేసుకోలేరు. ఆయన సామ్రాజ్యంలో కూడా జోక్యం చేసుకోలేరు. సైన్యం, మంత్రులు, అధికారులు లేకుండానే ఆయన కోటానుకోట్ల పనులు చేస్తాడు. అలాంటప్పుడు ఆయన ఒకరి వద్దకు వచ్చి సిఫారసు ఎందుకు చేస్తాడు? ఆయన ముందు అధికారం చేసే ధైర్యం ఎవరికుంది? అల్లాహ్ పరమ పవిత్రుడు!
ఒక సామాన్య గ్రామస్తుడి నోటి నుండి వెలువడిన మాటవల్ల మానవులందరిలో అత్యున్నతుడు అయిన మానవులు, అల్లాహ్ ప్రియ దాసులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవభీతితో హడలెత్తి భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు అల్లాహ్ తో స్నేహం, బంధుత్వం కలిపే వారి పరిస్థితిని, ఆలోచించకుండా మితిమీరి మాట్లాడేవారి గురించి ఏం చెప్పమంటారు? ఒకడు నేను దేవుణ్ణి ఒక రూపాయికి కొన్నాను అంటాడు, ఇంకొకడు నేను దేవుడికంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి అంటాడు. నా అల్లాహ్ నా కాలి రూపంలో కంటే వేరే రూపంలో వస్తే నేనెప్పుడూ అతణ్ణి చూడను అని మరొకడంటాడు. ఇంకొకడు నా హృదయం ముహమ్మద్ ప్రేమలో గాయమైంది. నేను నా ప్రభువుతో సాన్నిహిత్యాన్ని కలిగి వుంటాను అంటాడు. అల్లాహ్ ను ప్రేమించు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో జాగ్రత్తగా ఉండు అని మరొకడు. ఇంకొందరయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవత్వం కంటే గొప్పగా చెబుతుంటారు.
అల్లాహ్ శరణు వేడు కుంటున్నాను! అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను!! ఈ ముస్లిములకు ఏమయింది? పవిత్ర ఖుర్ఆన్ ఉన్నప్పటికీ వీరి బుద్ధులపై తెరలెందుకు పడ్డాయి? ఏమిటీ ఈ వక్ర మార్గాలు? అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక. అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక!! ఆమీన్.
ఎవరో చాలా చక్కగా పేర్కొన్నారు:
“మర్యాద ప్రసాదించమని మేము అల్లాహ్ ను కోరుతున్నాము. అమర్యాదస్థులు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందలేరు.”
కొందరు ఈ వాక్యం పలుకుతుంటారు. “ఓ అబ్దుల్ ఖాదిర్ జీలానీ! అల్లాహ్ కోసం మా మొక్కుబడులను స్వీకరించు.” ఇలా అనడం స్పష్టమైన షిర్క్.
అల్లాహ్ ముస్లింలను ఇలాంటి వాటి నుండి రక్షించుగాక! ఆమీన్! షిర్క్ ప్రస్ఫుటమయ్యే, అమర్యాద కలిగించే మాటలు నోటి నుండి వెలువడనివ్వకండి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు. నిత్యం ఉండే శక్తివంతుడైన చక్రవర్తి. చిన్న పొరపాటును పట్టుకోవడం లేదా క్షమించి వదలిపెట్టడం ఆయన చేతిలోనే ఉంది. అలాంటిది అమర్యాదగా మాట్లాడటం, ఆ తర్వాత అలా మాట్లాడలేదనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అల్లాహ్ పొడుపు కథలకు అతీతుడు. ఎవరయినా పెద్దవారితో పరాచి కాలాడితే ఎంత చెడుగా భావిస్తాం? చక్రవర్తితో పరిహాసమాడడం సమంజసమా?.
11. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అబ్దుల్లాహ్, అబ్దుర్రహ్మాన్ అనే పేర్లు అల్లాహ్ కు ఎంతో ఇష్టం.’ (హదీసు గ్రంథం ముస్లిం హదీస్ నెం. 2136)
“అల్లాహ్ దాసుడు”, “రహ్మాన్ దాసుడు” చాలా చక్కనైన పేర్లు. అదే విధంగా అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ జలీల్, అబ్దుల్ ఖాలిఖ్, ఇలాహీ బఖ్ష్, మొదలగు పేర్లు కూడా మంచివే. వీటివల్ల అల్లాహ్ తో ఉన్న సంబంధం స్పష్టమవుతుంది.
12. అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి
షురైహ్ తన తండ్రి హానీ (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొన్నారు: నేను నా తెగ బృందంతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చాను. నన్ను నా మిత్రులు ‘అబుల్ హకమ్'(ఆదేశించేవాని తండ్రి) అని పిలుస్తారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను పిలిచి ఇలా ఉపదేశించారు: “ఆదేశించేవాడు అల్లాహ్ యే. ఆయనే ఆదేశించగలడు. నీకు అబుల్ హకమ్ (ఆదేశించేవాని తండ్రి) అని ఉపనామం ఎవరు పెట్టారు?”” (హదీసుగ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 4945)
ప్రతి తీర్పులో న్యాయం చేయడం, వివాదాలను పరిష్కరించడం అల్లాహ్ గొప్ప తనం. పరలోకంలో అది స్పష్టమవుతుంది. అక్కడ ముందు వెనుక జరిగిన అన్ని పోట్లాటలు పరిష్కరించబడతాయి. ఈ శక్తి సృష్టితాలకు లేదు. కనుక అల్లాహ్ గొప్ప తనాన్ని చాటే పదాలు దైవేతరుల కోసం ఉపయోగించకూడదు. ఉదాహరణకు: చక్రవర్తులకు చక్రవర్తి (షెహన్ షా) అని అల్లాహ్ నే అనాలి. ఆయనే విశ్వలోకాలకు ! ప్రభువు. ఆయన తలచుకుంది చేస్తాడు. ఈ పదం అల్లాహ్ ఔన్నత్యం చాటడం కోసం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నిరపేక్షాపరుడు, వివేకవంతుడు, ఆరాధ్యుడు వంటి పదాలన్నీ అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటుతాయి.
13. కేవలం “అల్లాహ్ తలిస్తే ” అనండి
హుజైఫహ్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లహు అలైహి వ సల్లం) తలిస్తే అని అనకండి. “కేవలం ఒక్కడైన అల్లాహ్ తలిస్తే” అని అనండి.” (హదీసు గ్రంథం షర్హ్ సున్నహ్, 3391)
దైవత్వంలో సృష్టితాల జోక్యానికి తావులేదు. అతను ఎంతటి పెద్దవాడైనా, అత్యంత సన్నిహితుడయినాసరే. ఉదాహరణకు: అల్లాహ్ మరియు దైవప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) తలిస్తే ఫలానా పని జరిగిపోతుంది అనకూడదు. ఎందుకంటే ప్రపంచమంతా అల్లాహ్ ఆదేశం మేరకు నడుస్తుంది. ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) తలచుకుంటే ఏమీ అవదు. ఫలానా వ్యక్తి మనసులో ఏముంది? ఫలానా వ్యక్తి వివాహం ఎప్పుడు జరుగుతుంది? ఫలానా చెట్టుకు ఎన్ని ఆకులున్నాయి? ఆకాశంలో ఎన్ని నక్షత్రా లున్నాయి? అని ఎవరయినా అడిగితే, ‘అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు’ అని సమాధానమివ్వకూడదు. ఎందుకంటే అగోచర విషయాలు అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ప్రవక్తగారికి తెలియదు. ధార్మిక విషయాల్లో అలా అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన ప్రవక్తకు ధర్మానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుపుతాడు. ప్రజలు తమ ప్రవక్తకు విధేయులై మెలగాలి.
14. దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్ (బహుదైవారాధన)
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను. ‘దైవేతరుల మీద ప్రమాణం చేసినవాడు షిర్క్ చేశాడు.’ (హదీసుగ్రంథం తిర్మిజీ, హదీస్ నెం: 1535)
అబ్దుర్రహ్మాన్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘విగ్రహాల మీద ప్రమాణం చేయకండి, ఇంకా తండ్రుల మీద కూడా ప్రమాణం చేయకండి.’ (హదీసుగ్రంథం ముస్లిం, హదీస్ నెం: 1648)
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హితబోధ చేశారు: “తండ్రులపై, తాతలపై ప్రమాణం చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని. వారిస్తున్నాడు. ప్రమాణం చేయాలనుకున్నవాడు అల్లాహ్ పై ప్రమాణం చేయాలి. లేదంటే మౌనం వహించాలి.” (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ నెం: 1646)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “ఎవరయితే (తొందరపాటుతో) లాత్, ఉజ్జహ్ (ప్రాచీన అరబ్బుల విగ్రహాల)పై ప్రమాణం చేశాడో అతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలకాలి.” (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ : 6650), (హదీసుగ్రంథం ముస్లిం హదీస్ 1649)
అజ్ఞాన కాలం (ప్రవక్త రాక పూర్వం)లో విగ్రహాల మీద ప్రమాణం చేసేవారు. ఎవరయినా ముస్లిం షరీఅత్ కు విరుద్ధంగా విగ్రహాలపై ప్రమాణం చేస్తే, అతను వెంటనే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పఠించి ఏక దైవారాధనను ధృవీకరించాలి.
దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే; అల్లాహ్ తప్ప మరి దేనిపైనా ప్రమాణం చేయకూడదు. ఒకవేళ పొరపాటుగా దైవేతరులపై ప్రమాణం చేస్తే వెంటనే తౌబా చేసుకోవాలి. ముష్రిక్కుల దేవతలపై ప్రమాణం చేస్తే విశ్వాసంలో అవరోధం ఏర్పడుతుంది.
15 మ్రొక్కుబడుల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీర్పు
సాబిత్ బిన్ జహ్హాక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక వ్యక్తి బవానా [*] వెళ్ళి ఒంటెను జిబహ్ చేస్తానని మొక్కుకున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి తన మ్రొక్కు గురించి తెలిపాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలను ఉద్దేశించి, ‘అజ్ఞాన కాలంలోని ఆస్థానాలేమైనా అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. సహాబాలు ‘లేవు’ అని సమాధాన మిచ్చారు. ‘అక్కడ పండుగలేమైనా జరుపుతారా?’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్లీ అడిగారు. ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు సహాబాలు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘నీ మ్రొక్కును తీర్చుకో. ఎందుకంటే అల్లాహ్ కు అవిధేయత తెలిపే మొక్కులను తీర్చడం నిషిద్ధం.’ (హదీసుగ్రంథం అబూ దావూద్, హదీస్ 3313)
[*] ఒక ప్రాంతం పేరు.
అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుకోవడం పాపం. అలాంటి మ్రొక్కులను పూర్తి చేయకూడదు. ఎందుకంటే అలా మ్రొక్కుకోవటమే పాపం. అలాంటప్పుడు మ్రొక్కుబడి తీర్చుకోవడం మరీ పాపం. మరో విషయం ఏమిటంటే; దైవేతరుల పేర బలిచ్చే ప్రాంతాల్లో, దైవేతరుల పూజలు చేసే చోట లేదా అందరూ కలిసి షిర్క్ చేసే ప్రదేశాల్లో అల్లాహ్ పేరున మ్రొక్కుకున్న పశువులను కూడా తీసుకెళ్ళకూడదు. అలాంటి వాటిల్లో పాలుపంచు కోకూడదు. సదుద్దేశం ఉన్నా, దురుద్దేశం ఉన్నాసరే. ఎందుకంటే వాటిల్లో పాల్గొనడం కూడా పాపమే.
16. సజ్దహ్ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గౌరవించండి
ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్దహ్ చేసింది (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్దహ్ చేస్తున్నాయి. మీకు సజ్దహ్ చేయడంలో వాటి కంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)
మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటివారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారికంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల (దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.
ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్దహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అను కున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాలో ప్రజలను రాజుకు సజ్దహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సజ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్దహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు. (హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్ 2140)
ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను.[*] అలాంటప్పుడు నేను సజ్దహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్దహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్దహ్ చేయ కూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్దహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి అల్లాహ్ కాలేడు. దాసునిగానే ఉంటాడు.
[*]’మట్టి ప్రవక్తల శరీరాలను తినదు’ ఒక హదీసులో ఇలా ఉంది: “అల్లాహ్ భూమిని ప్రవక్తల శరీరాలను తినకుండా నిషేధించాడు.” భావమేమిటంటే; మృత్యువును చవిచూసేవారు సజ్దాకు హక్కుదారులు కారు.
17. ఎవరినైనా “నా దాసుడని” గానీ, “నా దాసి అని” గానీ అనడం సమ్మతం కాదు
అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరూ (ఎవరినీ) ‘నా దాసుడు, నా దాసురాలు’ అని అనకండి. మీరందరూ అల్లాహ్ దాసులు. మీ స్త్రీలందరూ అల్లాహ్ దాసీలే. బానిస తన యజమానిని ‘మౌలా’ (యజమాని) అనకూడదు. ఎందుకంటే మీ అందరి ‘మౌలా’ (యజమాని) అల్లాహ్ మాత్రమే“. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2249)
బానిస కూడా ‘నేను ఫలానా వ్యక్తి బానిసను. ఫలానా వ్యక్తి నా యజమాని’ అని సంభాషణ జరపకూడదు. ఒకరి బానిసలని చెప్పుకోకుండా, అబ్దున్నబీ (నబిదాసుడు), బన్ద అలీ (అలీ దాసుడు), బన్ద హుజూర్ (ప్రవక్త దాసుడు), ప్రత్యేక పూజారి, కనక పూజారి, పీర్ల పూజారి అని చెప్పించుకోవడం, ప్రతి ఒక్కరిని దేవుడనడం, దాత అనడం, స్వామి అనడం, వృధాప్రేలాపన. చాలా పెద్ద తప్పు. చిన్న చిన్న విషయాలకు భయపడి ‘నువ్వు నా ప్రాణానికి, ధనానికి యజమానివి, మాపై అధికారం నీదే, ఏమైనా చేసుకో’ అని అనడం కూడా షిర్క్ గా పరిగణించడం జరుగుతుంది.
18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గౌరవించే విధానం
ఉమర్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “క్రైస్తవులు ఈసా (అలైహిస్సలాం) విషయంలో మితిమీరిపోయినట్టు మీరు నా శ్రీ విషయంలో మితిమీరకండి. నేను కేవలం అల్లాహ్ దాసుడిని మాత్రమే. మీరు ‘నన్ను అల్లాహ్ దాసుడు, దైవప్రవక్త అని అనండి.” (హదీసుగ్రంథం బుఖారి, హదీస్ 3445) .
అంటే; అల్లాహ్ నాకు ప్రసాదించిన గొప్పతనం, ఔన్నత్యాలు అన్నీ నన్ను దాసుని, ప్రవక్త పరిధులకే పరిమితం చేస్తాయి. ఒక మానవుడికి దైవదౌత్యం లభించడం కంటే అధికస్థాయి ఇంకేముంటుంది? అన్ని స్థానాలు దాని తరువాతే. కాని మానవుడు ప్రవక్త అయినప్పటికీ మానవునిగానే ఉంటాడు. దాసునిగా ఉండటమే అతనికి శోభాయ మానం. ప్రవక్త అయినంత మాత్రాన మనిషిలో దైవత్వమంతటి గొప్పతనం రాదు. అల్లాహ్ అస్తిత్వంలో కలవలేడు. మానవుడ్ని మానవాళి స్థానంలోనే ఉంచండి. క్రైస్తవుల మాదిరిగా అయిపోకండి. వారు ఈసా (అలైహిస్సలాం)ని మానవ పరిధిని దాటించి దైవత్వ కిరీటాన్ని అలంకరించారు. దాని వల్ల వారు తిరస్కారులయ్యారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై అవతరించింది. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజం వారి నుద్దేశించి ‘క్రైస్తవుల మాదిరిగా ప్రవర్తించకండి. నన్ను పొగడటంలో మితిమీరకండి. లేదంటే అల్లాహ్ ఆగ్రహానికి పాత్రులవుతారు’ అని హితబోధ చేశారు. అయినప్పటికీ సమాజంలోని కొంతమంది మూర్ఖులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధను పట్టించుకోలేదు. క్రైస్తవుల మాదిరిగానే ప్రవర్తించారు. ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ రూపంలో అవతరించారని క్రైస్తవులు అనేవారు. ఆయన ఒక విధంగా మానవుడు మరో విధంగా అల్లాహ్ అనేవారు.
కొందరు అతివాదులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయం లోనూ ఇలాగే వ్యవహరించారు. ఇలా అన్నారు: ‘ప్రతి కాలంలో అల్లాహ్ ప్రవక్తల రూపంలో వస్తాడు. చివరిగా ఆయన అరబ్బు రూపంలో వచ్చాడు. వచ్చి అక్కడి చక్రవర్తి అయ్యాడు.’ మరి కొందరు ఇలా అన్నారు: “ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆధునికులు కూడాను. పూర్వీకులూను. సాధ్యులు, అసాధ్యులు కూడాను”. లాహౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ ముస్లిములకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక! ఆమీన్.
కొందరు అబద్ధాలకోరులు ఒక హదీసును వక్రీకరించి వారే దాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆపాదించి ‘నేను స్తోత్రాలకు అర్హుడిని’ [*] అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు పేర్కొన్నారు. అలాంటిదే ఒక సుదీర్ఘమైన అరబీ సంపుటానికి ‘ఖుత్బతుల్ ఇఫ్తి ఖార్ ‘ అని పేరు పెట్టి దాన్ని అలీ (రదియల్లాహు అన్హు)కి అన్వయించారు. ఎంత పెద్ద అపనింద!
ఓ ప్రభూ! నువ్వు అన్ని షిర్క్ ల నుండి పవిత్రుడివి. నీపై తీవ్ర నింద మోప బడింది ఓ ప్రభూ! సత్యాన్ని వ్యాపింపజేయి. అబద్ధాలకోరులకు తగిన శాస్తి జరిగేలా చూడు. ఆమీన్!
[*] నిశ్చయంగా ఇది కల్పితమైనది.
ఈసా (అలైహిస్సలాం) ఇహపరాలలో అధికారం కలవారని క్రైస్తవులు విశ్వసిస్తారు. వారిని విశ్వసించి వారిని అర్థించే వారు అల్లాహ్ ను ఆరాధించవలసిన అవసరం లేదు. పాపాలు అతని విశ్వాసంలో అడ్డంకి కాజాలవు. అతను హలాల్, హరాంలలో ఎలాంటి వ్యత్యాసం పాటించవలసిన అవసరం ఉండదు. అతను అల్లాహ్ ఆంబోతులా తిరుగుతాడు. అతనికి ఇష్టమొచ్చినట్టు చేయవచ్చు. ఈసా (అలైహిస్సలాం) పరలోకంలో అతనికి సిఫారసు చేసి దైవశిక్ష నుండి కాపాడుతారు. అజ్ఞానులైన ముస్లిములు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయంలో కూడా ఇలాంటి విశ్వాసాలనే కలిగి వున్నారు. అంతే కాదు ఇమాములు, ఔలియాల విషయంలోనూ ఇలాంటి నమ్మకాన్ని కలిగిఉన్నారు. ప్రతి పండితుల, గురువుల విషయంలోనూ వారి విశ్వాసం అలాంటిదే. అల్లాహ్ వారికి రుజుమార్గం చూపుగాక!
ముతర్రిఫ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: నేను బనూ ఆమిర్ తెగవారి బృందంతో పాటు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సేవలో హాజరయ్యాను. మేము ఆయనతో ‘మీరే మా యజమాని’ అన్నాము. అందుకు ఆయన ‘యజమాని అల్లాహ్ మాత్రమే’ అన్నారు. అప్పుడు మేము ‘మాలో మీరు ఉత్తములు, గొప్పవారు, దాత [*] కూడాను’ అన్నాము. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అవును! ఇందులో కొన్ని లేదా అన్ని మాటలు అనొచ్చు. కాని షైతాన్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి.’ (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ 4806, ముస్నద్ అహ్మద్ 25/4)
[*] ఉపకారం చేసేవారు. మాకంటే ఎక్కువ దానధర్మాలు చేసేవారు.
మహాత్ముల గురించి ఆచితూచి మాట్లాడాలి. వారిని మానవులకు మాదిరిగానే పొగడండి. కొంచెం తక్కువగా పొగడండి. కళ్లెం తెంచుకున్న గుర్రంలా మితిమీరి పొగ డకండి. దైవత్వం గొప్పతనానికే కళంకం కలిగించేలా ప్రవర్తించకండి.
19. ‘సయ్యిద్’ పదానికి రెండు అర్థాలు
సయ్యిద్ పదానికి రెండు అర్థాలున్నాయి: (1) స్వయం ప్రతిపత్తి కలవాడు, సంపూర్ణ యజమాని, పాలితుడు కానివాడు, ఏదైనా చేయగలవాడు. ఇవన్నీ అల్లాహ్ గొప్పతనాలు. ఈ అర్థాన్ని బట్టి చూస్తే అల్లాహ్ తప్ప మరెవ్వరూ సయ్యిద్ కాజాలడు. (2) మొదట పాలకుని ఆదేశం అతని వద్ద రావాలి. ఆ తరువాత అతను వేరే వారికి ఆదేశించాలి. ఉదాహరణకు: చౌదరి, భూస్వామి. ఈ అర్థాన్నిబట్టి చూస్తే ప్రతి ప్రవక్త తన సమాజానికి నాయకుడు లాంటివాడు. యోధుడు తన అభిమానులకు, పండితుడు తన శిష్యులకు, ప్రతి మహాత్ముడు తన అనుచరులకు నాయకుడు. వీరు మొదట తాము ఆదేశాలను శిరసావహిస్తూ తమ అనుచరులకు నేర్పతారు. ఈ విధంగా మన ప్రవక్త విశ్వానికి నాయకులు. అల్లాహ్ దృష్టిలో ప్రవక్త (సలల్లాహు అలైహి వ సల్లం) ఉన్నతులు. అందరి కంటే ముందు ఆయన ధర్మాదేశాలకు కట్టుబడి ఉన్నారు. అల్లాహ్ ధర్మాన్ని నేర్చుకోవడంలో ప్రజలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విధంగా చూసినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను విశ్వ నాయకుడు అనవచ్చు. అనాలి కూడా. మొదటి అర్థం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఒక్క చీమకు నాయకునిగా కూడా భావించకూడదు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన తరపు నుండి ఏ విధంగా కూడా చీమపైన అధికారం చేయలేరు.
20. చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
ఆయిషహ్ (రరదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె ఒక తివాచీ కొన్నారు. దానిపై చిత్రాలు ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాన్ని చూసి తలుపు వద్దనే ఆగి పోయారు. లోపలికి రాలేదు. ఆమె (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: నేను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖంలో అసహ్యతను గమనించాను. నేను ఇలా అన్నాను: ఓ దైవప్రవక్తా! క్షమించండి! నేను ఏం తప్పు చేశాను? ఆయన (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: ఈ తివాచీ ఏమిటి? నేను ఇలా అన్నాను: దీన్ని నేను మీకోసం కొన్నాను. మీరు దీని మీద కూర్చుంటారని దిండుగా ఉపయోగించు కుంటారని. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఈ చిత్రాలు గీసిన వారికి ప్రళయం రోజు శిక్ష పడుతుంది. వారితో ‘మీరు గీసిన చిత్రాల్లో ప్రాణం పోయండి’ అని అనబడుతుంది. ఇంకా ‘చిత్రపటాలున్న ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (హదీసు గ్రంథం బుఖారీ, హదీస్ : 2105) (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 246/6)
అనేక మంది బహుదైవారాధకులు విగ్రహాలను పూజిస్తుంటారు. అందుకనే దైవదూతలకు, ప్రవక్తలకు విగ్రహాలంటే జుగుప్స కలుగుతుంది. అందుచేతనే దైవ దూతలు అలాంటి ఇళ్లల్లో ప్రవేశించరు. బహుదైవారాధనకు సామగ్రి సమకూరుస్తున్నందుకు చిత్రాలు వేసే వారికి శిక్ష పడుతుంది. కనుక ప్రవక్తల, ఇమాముల, వలీల, బాబాల, స్వాముల, మత గురువుల చిత్రాలుగానీ, ఇంకా మరే విధమైన చిత్రాలుగానీ. వేయడం నిషిద్ధం. వాటిని భద్రపరచడం కూడా నిషిద్ధమే. తమ పూర్వీకుల చిత్రాలను గౌరవిస్తూ, వాటిని పవిత్రంగా పదిలపరుచుకున్న వారు స్పష్టమైన మార్గభ్రష్టతలో ఉన్నారు. ప్రవక్తలు దైవదూతలు వారిని అసహ్యించుకుంటారు.
ముస్లిము విధి ఏమంటే చిత్రాలను ఇళ్ళల్లో ఉంచుకోకూడదు. అప్పుడే వారి ఇళ్లల్లో కారుణ్య దూతలు అవతరిస్తారు. శుభాలు కలుగుతాయి.
21. ఘోరమైన ఐదు పాపాలు
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా విన్నాను, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు, ‘ప్రవక్తను చంపిన వారికి, ప్రవక్త ద్వారా చంపబడిన వారికి, తన తల్లిదండ్రులను హత్య చేసిన వారికి, చిత్రాలు గీసే వారికి, తాను పొందిన విద్య ద్వారా లబ్ది పొందని ఆలిమ్ కు ప్రళయంనాడు అత్యధికంగా శిక్షపడుతుంది. (హదీసు గ్రంథం షుఅబిల్ ఈమాన్ 197/6 నెం. 7888)
చిత్రాలు గీసేవాడు కూడా ఘోరమైన పాపాలు చేసేవారిలో ఉన్నాడు. ప్రవక్తను హత్య చేసిన వాడు ఎంత పాపాత్ముడో చిత్రాలు వేసేవాడూ అంతే పాపాత్ముడు.
హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి విన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నా లాగా సృష్టించడానికి ప్రయత్నించిన వాడి కంటే దుర్మార్గుడు మరొకడు ఉండడు. వారు చిన్న వస్తువైనా, ధాన్యపు గింజయినా, రాగి గింజనయినా సృష్టించి చూపించగలరా? (హదీసు గ్రంథం బుఖారీ హదీస్ : 7559), (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ 2111)
చిత్రకారుడు ఒక విధంగా దైవత్వాన్ని ప్రకటించుకుంటున్నాడు. అల్లాహ్ సృష్టిం చిన మాదిరిగా తాను సృష్టించాలనుకుంటున్నాడు. ఇది మహా అపరాధం. చిత్రకారుడు ఒక్క గింజ కూడా సృష్టించలేడు. కానీ కాపీ కొడుతుంటాడు. చిత్రకారులు అల్లాహ్ శాపానికి గురవుతారు.
22. తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అల్లాహ్ నాకు ఇచ్చిన స్థానం కంటే ఎక్కువ చేసి చూపకండి. నేను ముహమ్మద్ ని, అబ్దుల్లాహ్ కుమారుణ్ణి. దైవదాసుడిని. ఆయన ప్రవక్తను.[*] (హదీసుగ్రంథం అత్తక్రీద్)
[*] అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ఒక వ్యక్తి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ‘ఓ మా నాయకుడా, ఓ మా నాయకుని కుమారా!’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: నువ్వు అలా అనవచ్చు. కానీ జాగ్రత్త! షైతాన్ మిమ్మల్ని అతిశయోక్తిలో ముంచే అవకాశం ఉంది. నేను ముహమ్మద్ ను. అబ్దుల్లా కుమారుడిని. దైవదాసుడిని, దైవప్రవక్తను. అల్లాహ్ సాక్షి! మీరు (నన్ను పొగడటంలో అతిశయించి) అల్లాహ్ నాకు కల్పించిన స్థానం కంటే ఎక్కువగా చేసి చూపించడం నాకు అసలు ఇష్టం ఉండదు.’ (హదీసుగ్రంథం ముస్నద్ అహ్మద్ 231/3). తబ్రానీ ఉల్లేఖనంలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. హుసైన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘నన్ను నా స్థానానికంటే అధికం చేస్తూ పొగడకండి. అల్లాహ్ నన్ను తన ప్రవక్తను చేయడానికి ముందు తన దాసుడిని చేశాడు.’ (హదీసుగ్రంథం మజ్మవుజ్జవాయిద్) దీనిద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దృష్టిలో ప్రవక్త స్థానానికంటే దాసుని స్థానమే ఉన్నతమైంది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజం విషయంలో జాలి, కరుణ కలవారు. తన సమాజం ధర్మంపై నిలకడగా ఉండాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అహర్నిశలు చింత చెందేవారు. తన అనుయాయులు తనను అమితంగా ప్రేమిస్తారని, తనకు కృతజ్ఞులై ఉంటారని తెలుసు. ప్రేమికుడు తన ప్రియుణ్ణి సంతోష పరచడం కోసం ఏమైనా చేస్తాడని తెలుసు. పొగడ్తలు హద్దులు మీరి అల్లాహ్ గొప్ప తనానికి భంగం కలిగించేవిగా ఉండకూడదు. తద్వారా వారి ధర్మం నాశనమవు తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అప్రసన్నతకూ పాత్రులవుతారు. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘నాకు అతిశయోక్తి ఇష్టంలేదు’ అన్నారు. నా పేరు ముహమ్మద్. నేను సృష్టికర్తను కాను. ఉపాధి ప్రదాతనూ కాను. నేను మానవులందరి లాగానే ఒక తండ్రి ద్వారా పుట్టాను. దాసునిగా ఉండటంలోనే నా ఔన్నత్యం ఉంది. నేను ప్రజలకు ఒక విషయంలో వేరుగా ఉన్నాను. నాకు అల్లాహ్ ఆదేశాలు తెలుసు. కాని ప్రజలకు తెలియవు. కనుక వారు నా దగ్గర అల్లాహ్ ధర్మం నేర్చుకోవాలి.
ఓ మా ప్రభూ! కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అనుగ్రహాల, శుభాల వర్షం కురిపించు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా లాంటి జనులకు ధర్మం నేర్పించడం కోసం విపరీతంగా శ్రమించారు. నువ్వే ఆయన విలువను ఎరిగిన వాడివి. ఓ ఉన్నతుడా! మేము నీ నిస్సహాయ దాసులం. మా అధికారంలో ఏమీలేదు. నువ్వు నీ అనుగ్రహాలలో షిర్క్, తౌహీద్ల ల భావాన్ని తెలియ జేశావు. “లా ఇలాహ ఇల్లల్లాహ్” గురించి తెలిపావు. బహుదైవారాధకుల నుంచి తీసి ఏకదైవారాధకునిగా, పవిత్రునిగా చేశావు. అదే విధంగా నీ అనుగ్రహాలతో మాకు బిద్అత్, సున్నత్ ల వాస్తవికత తెలుపు. “ముహమ్మదు రసూలుల్లాహ్”వచనం యొక్క అవసరాలను తెలుపు. బిద్అత్ ల (కొత్త పోకడల) నుండి ముల్ హిదీన్ (నాస్తికుల) నుండి మమ్మల్ని వేరుచేసి ఖుర్ఆన్ హదీసు మరియు సహాబాల పద్ధతికి విధేయులను చెయ్యి. ఆమీన్, సుమ్మ ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
సకలస్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.
సారాంశం
1. దైవేతర ఆరాధకులు, స్త్రీల పూజారులు వాస్తవానికి షైతాన్ ఆరాధకులు.
2. షైతాన్ కలతలలో చిక్కుకుని కొందరు జంతువుల మరియు తమ ఆకారాన్ని పాడు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆశల్లోపడి, షైతాన్ పన్నాగాలకు చిక్కి నరకవాసులవుతున్నారు. (దివ్యఖుర్ఆన్ 4 : 117-121)
3. సంతానం విషయంలో దురాచారాలు మరియు షిర్క్ పేరుల నుండి అల్లాహ్ అతీతుడు. (దివ్యఖుర్ఆన్ 7 : 190)
4. ధాన్యాన్ని, జంతువులను కేవలం అల్లాహ్ మాత్రమే సృష్టించాడు. అందులో దైవేతరుల భాగం తీస్తే (అలాంటి విషయంలో) అల్లాహ్ తన భాగంలో నిరపేక్షాపరుడు. (దివ్యఖుర్ఆన్ 6: 136)
5. మొక్కుబడుల పేర ఇష్టమొచ్చినట్లు జంతువులను దైవేతరుల పేర వదలి పెట్టడం, వాటిని గౌరవించడం లాంటి వాటిని చేయడం అల్లాహ్ పై నింద మోపడమే. ఇది బహుదైవారాధనా ఆచారం. (దివ్యఖుర్ఆన్ 6:138)
6. దురాచారాలు మరియు హలాల్, హరామ్ గా నిర్ణయించబడే ఆచారాలన్నీ అల్లాహ్ పై నిందలు మోపేవే. (దివ్యఖుర్ఆన్ 16:116)
7. రాశిఫలాల ప్రభావాలను నమ్మడం, రోజులను శుభము, అశుభమైనవిగా భావించడం, జోతిష్కుల మాటలను విశ్వసించడం వల్ల షిర్క్ (బహుదైవారాధన) ద్వారాలు తెరుచుకుంటాయి.
8. జోతిష్కుడు, మంత్రగాడు, తాంత్రికుడు అందరూ తిరస్కారులే. వారి జోలికి వెళ్లేవాడు కూడా తిరస్కారి అవుతాడు.
9. విశ్వంపై సృష్టితాల ప్రభావం ఉంటుందని భావించేవాడి మరియు జోతిష్కుడిని విశ్వసించేవారి నలభై రోజుల నమాజు స్వీకరించబడదు.
10. శకునాలు చూడటం, ఏదైనా ప్రదేశాన్ని, రోజును, వ్యక్తిని అపశకునంగా భావించడం, రోగాన్ని స్వతహాగానే అంటువ్యాధిగా భావించడం, ఒకరి విషయంలో ఏదైనా పనిని అశుభంగా భావించడం, అంటరానితనం, ఆపదలు అన్నీ బహుదైవారాధనా భావనలే.
11. అల్లాహ్ యే అధికారం కలవాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన సమక్షంలో నిస్సహాయులు. అల్లాహ్ ఔన్నత్వం సృష్టితాల అంచనాలకు అందదు. తమ ఊహాగానాలతో అల్లాహ్ ఔన్నత్యాన్ని ఎవరూ చాటలేరు. ఆయన ఔన్నత్యంతో సింహాసనం (అర్ష్ పీఠం) కూడా కంపిస్తుంది. ఆయన ఏమైనా చేయగలడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ వద్ద అనుమతి తీసుకున్న తరువాతే సిఫారసు చేస్తారు. కనుక అల్లాహ్ దైవత్వంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భాగస్వామ్యం స్ఫురించేలా ఉన్న పదాలు కలిపి ఉపయోగించకూడదు.
12. అల్లాహ్ తో సంబంధం స్పష్టమయ్యే పేర్లు ఉత్తమమైన పేర్లు.
13. అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటే పదాలు వేరే వారి కోసం వినియోగించకూడదు. ఉదాహరణకు: రాజాధిరాజు (షహెన్ షాహ్), అధికారులకు అధికారి మొదలగునవి.
14. అల్లాహ్ సొంత గుణాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భాగస్వామ్యం ప్రస్ఫుటమయ్యే వాక్యాలను కూడా పలుకకూడదు.
15. దైవేతరులపై ప్రమాణం చేయడం బహుదైవారాధన. ఒకవేళ అనాలోచితంగా నోటి నుండి వెలువడితే పశ్చాత్తాపం చెందాలి.
16. దైవేతరుల పేర మొక్కుకోవడం, ఆస్థానాల వద్ద అల్లాహ్ పేరు మీద బలివ్వడం, తీర్థాలు మొదలగు వాటిల్లో పాల్గొనడం షిర్క్.
17. సజ్దహ్ (సాష్టాంగపడటం) అల్లాహ్ కోసం ప్రత్యేకం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కేవలం గౌరవించాలి. మహాత్ములు బ్రతికున్నా, చనిపోయినా వారిని కేవలం గౌరవించాలి.
18. ఎవరినీ ‘నా దాసుడు’ అని అనకండి. దాస్యసంబంధాలను దైవేతరుల కోసం ఆపాదించకండి. మిమ్మల్ని మీరు అన్నీ చేయగల అధికారి, దాత అని అనిపిం చుకోకూడదు.
19. క్రైస్తవులకు మాదిరిగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కీర్తించడంలో అతిశయానికి పాల్పడ కూడదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గొప్పతనం దాస్యత్వాన్ని, దైవత్వంలో కలపకూడదు.
20. సయ్యిద్ అంటే సర్వాధికారి, స్వయంప్రతిపత్తికలవాడు అని అర్థం. ఇవి అల్లాహ్ సొంత గుణాలు. సయ్యిద్ పదానికి సర్దారు అనే అర్థం కూడా ఉంది. అది సృష్టితాల గుణం.
21. చిత్రపటాలను గీయడం, వాటిని శుభప్రదంగా భావించి పెట్టడం వాటిని గౌరవించడం బహుదైవారాధన. అలా చేయడం వల్ల శుభాల దైవదూతలు ఇళ్ళల్లో ప్రవేశించరు.
22. చిత్రకారుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) హంతకుని మాదిరిగా పాపా త్ముడు. ఎందుకంటే అతను దైవత్వవాది. ధూర్తుడు.
23. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవదౌత్య స్థాయి కంటే దాస్యత్వ స్థాయినే ఇష్టపడేవారు.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. ఆచారాలలో షిర్క్ గురించి రాయండి?
2. కొందరు విగ్రహాల పూజారులు. వీళ్ళ వాస్తవికత ఏమిటి?
3. వ్యవసాయం మరియు పశువుల వ్యవహారాలలో షిర్క్ ఆచారాలను గురించి వ్రాయండి?
4. కొన్ని మొక్కుబడులు పురుషులకు సమ్మతం, మరికొన్ని మొక్కుబడులు స్త్రీలకు సమ్మతం ఇది అల్లాహ్ పై అసత్యాన్ని ఆపాదించడం కాదా? దీన్ని గురించి వివరంగా రాయండి.
5. నక్షత్రాలు మనిషిపై లాభనష్టాల ప్రభావం చూపెడతాయా?
6. జ్యోతిష్కుడు, మాంత్రికుడు, అవిశ్వాసి గురించి ఇస్లాం ఏం చెబుతుంది?
7. జ్యోతిష్కం, ప్రశ్నాశాస్త్రంపై విశ్వసించడం ఎలాంటిది?
8. శకునాల గురించి ఇస్లాం ఏం చెబుతుంది?
తప్పొప్పులను గుర్తించండి
1. అల్లాహ్ పై ప్రమాణం చేసేలాగా ఇతరులపై ప్రమాణం చేయడం షిర్క్ అవుతుంది ( )
2. దైవ ఇచ్ఛ, ప్రవక్త ఇచ్ఛ వేరు వేరు ( )
3. ప్రవక్తలకు సాష్టాంగం (సజ్దహ్) చేయడం సమ్మతం ( )
4. ప్రవక్తలందరూ నిస్సహాయులే ( )
5. ఎవరినైనా “దాసుడు” లేదా “దాసి” అనడం సమంజసం ( )
ఖాళీలను పూరించండి.
1. సయ్యిద్ మొదటి అర్ధం …………. రెండవ అర్థం ……………..
2. ఘోరమైన……….. పాపాల్లో ఒకటి……. ……ఉన్నది
3. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు (1)………………… మరియు (2)…………….
4. జ్యోతిష్యుడు, మాంత్రికుడు, తాంత్రికుణ్ణి నమ్మేవాడు………………….
5. శకునాలను నమ్మడం……..
<< End of the Book >>
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.