“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)
అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.
ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?
దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)
ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.
ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.
దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.
ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)
అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులుగల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి.
నెలలను ముందుకు, వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి (వారు ఇలా చేస్తారు). వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పార్ట్ 1: ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదు https://www.youtube.com/watch?v=lDeA6oFXxIc వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [28 నిముషాలు]
ఈ ప్రసంగంలో, వక్త రజబ్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇస్లామీయ క్యాలెండర్‌లోని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. ఈ పవిత్ర మాసాలలో అన్యాయానికి (జుల్మ్) పాల్పడటం తీవ్రంగా నిషేధించబడింది. పాపాలు చేయడం మరియు అల్లాహ్ ఆదేశాలను విస్మరించడం ద్వారా మనిషి తనకు తాను అన్యాయం చేసుకుంటాడని వక్త వివరిస్తారు. షిర్క్, అవిధేయత, మరియు ఇతరులను పీడించడం వంటివి ఆత్మపై చేసుకునే అన్యాయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. జీవితం అశాశ్వతమని, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని గుర్తు చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపం చెంది (తౌబా), అల్లాహ్ వైపునకు మరలాలని వక్త ఉద్భోదిస్తారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
మహాశయులారా! ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల రజబ్ నెల మొదలైపోయింది. ప్రత్యేకంగా రజబ్ నెల విషయంలో ఏదైనా ప్రసంగం అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మన ముస్లిం సోదర సోదరీమణులు రజబ్ నెలలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాత్రం తెలుపని కొన్ని కార్యాలు చేస్తున్నారు. వాటిని ఖండించడానికి రజబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రసంగం అవసరం ఉంటుంది.
అల్లాహ్ ఆరాధన ఎలా చేయాలి?
ఒక విషయం గమనించండి, మనమందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం. మనమందరం అల్లాహ్ యొక్క దాసులమైనప్పుడు, అల్లాహ్ కు ఇష్టమైన విధంగానే మనం ఆయన దాస్యం చేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజమే కదా? ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఆయన దాస్యం, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అది చూపించడానికి అల్లాహ్ ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు ఒక ఆదర్శంగా పంపించారు. అందు గురించి మహాశయులారా, మనం ఏ కార్యం చేసినా కానీ దానికి అల్లాహ్ వైపు నుండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి సాక్ష్యాధారం, రుజువు, దలీల్ తప్పనిసరిగా అవసరం ఉంది.
సామాన్యంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, ఇది మంచి కార్యమే, ఇది చేయవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ వద్ద మనకు ఇష్టమైనటువంటి, మనకు మెచ్చినటువంటి పని స్వీకరించబడదు. అల్లాహ్ వద్ద ఏదైనా పని, ఏదైనా సత్కార్యం స్వీకరించబడడానికి అది అల్లాహ్ లేక ప్రవక్త ఆదేశపరంగా ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా ఉండడం తప్పనిసరి.
రజబ్ మాసం యొక్క ప్రత్యేకత
రజబ్ నెల దీనికి ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా గౌరవప్రదం ఉంటే, ఒకే ఒక విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ త’ఆలా తన ఇష్టానుసారం సంవత్సరంలో 12 నెలలు నిర్ణయించాడు. ఆ 12 నెలల్లో నాలుగు నెలలను గౌరవప్రదమైనవిగా ప్రస్తావించాడు. ఆ నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో రజబ్ కూడా ఒకటి ఉంది.
సూరె తౌబా ఆయత్ నంబర్ 36 లో అల్లాహ్ త’ఆలా చెప్పాడు:
“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.)” (9:36)
నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు ఉన్నాయి. ఫీ కితాబిల్లాహ్, ఈ విషయం అల్లాహ్ వద్ద ఉన్నటువంటి గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. ఎప్పటి నుండి ఉంది?
يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ [యౌమ ఖలకస్సమావాతి వల్ అర్ద్] ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన నాటి నుండి
భూమి ఆకాశాలను ఆయన సృష్టించినప్పటి నుండి ఈ నిర్ణయం, ఈ విషయం ఉంది.
مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ [మిన్హా అర్బఅతున్ హురుమ్] వాటిలో నాలుగు నెలలు పవిత్రమైనవి.
ఆ 12 మాసాల్లో నాలుగు నెలలు, నాలుగు మాసాలు హురుమ్ – నిషిద్ధమైనవి అన్న ఒక భావం వస్తుంది హురుమ్ కు, హురుమ్ అన్న దానికి మరో భావం ఇహ్తిరామ్, హుర్మత్, గౌరవప్రదమైనవి, ఎంతో గొప్పవి అన్నది కూడా భావం వస్తుంది.
ఆయత్ యొక్క ఈ భాగం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహ్ ఎప్పటి నుండి భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పటి నుండి నెలల సంఖ్య ఎంత? సంవత్సరంలో ఎన్ని నెలలు? 12 నెలలు. దీని ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎవరెవరి వద్ద వారు లెక్కలు చేసుకోవడానికి రోజుల సంఖ్య, నెలల సంఖ్య ఏది ఉన్నా గానీ అల్లాహ్ త’ఆలా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య సంవత్సరంలో 12 నెలలు. ఆ నెలల పేర్లు ఏమిటి? మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. మరో విషయం మనకు ఏం తెలిసిందంటే అల్లాహ్ వద్ద గ్రంథం ఏదైతే ఉందో, లౌహె మహ్ఫూజ్ అని దాన్ని అంటారు, అందులో కూడా ఈ విషయం రాసి ఉంది. మరియు నాలుగు నెలలను అల్లాహ్ త’ఆలా గౌరవప్రదమైనవిగా, నిషిద్ధమైనవిగా ప్రస్తావించాడు. ఆ తర్వాత చెప్పాడు:
ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ [జాలికద్దీనుల్ ఖయ్యిమ్] ఇదే సరైన ధర్మం. (9:36)
ఇదే సరైన ధర్మం అనడానికి భావం ఏంటంటే, కొందరు నెలల సంఖ్యలో ఏదైతే తారుమారు చేసుకున్నారో అది తప్పు విషయం. మరి ఎవరైతే కొన్ని నెలలను అల్లాహ్ నిషిద్ధపరిచినటువంటి నెలలను ధర్మసమ్మతంగా చేసుకొని, అల్లాహ్ నిషేధించిన కార్యాలు వాటిలో చేస్తూ ఏ తప్పుకైతే గురయ్యారో, అది వాస్తవం కాదు. అల్లాహ్ ఏ విషయం అయితే తెలుపుతున్నాడో అదే సరైన విషయం, అదే నిజమైన విషయం, అదే అసలైన ధర్మం. దీనికి భిన్నంగా, విరుద్ధంగా ఎవరికీ చేయడానికి అనుమతి లేదు. ఇందులో అల్లాహ్ త’ఆలా ఒక ప్రత్యేక ఆదేశం మనకు ఏమి ఇచ్చాడంటే:
فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ [ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్] కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. (9:36)
ఇందులో మీరు ఏ మాత్రం అన్యాయం చేసుకోకండి. ఏ మాత్రం జుల్మ్ చేసుకోకండి.
ఇక సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి హదీస్ ఏమిటంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది,
“అల్లాహ్ త’ఆలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి స్థితిలో నెలల సంఖ్య ఎలా ఉండిందో, అలాగే ఇప్పుడు అదే స్థితిలో తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో నాలుగు నెలలు నిషిద్ధమైనవి. ఆ నాలుగు, మూడు నెలలు క్రమంగా ఉన్నాయి. జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. ఈ మూడు నెలలు కంటిన్యూగా, క్రమంగా ఉన్నాయి. మరియు ముదర్ వంశం లేక ముదర్ తెగ వారి యొక్క రజబ్, అది జమాదిల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలో ఉంది.”
ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రభవింపక ముందు మక్కావాసులు, ఆ కాలం నాటి ముష్రికులు, బహుదైవారాధకులు ఈ నాలుగు నెలలను గౌరవించేవారు. ఈ నాలుగింటిలో మూడు నెలలు క్రమంగా ఉన్నాయి కదా, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం.
అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దురాచారం, ఒక చెడ్డ అలవాటు, కొన్ని మహా ఘోరమైన పాపాల్లో ఒకటి ఏమిటి? ఇతరులపై అత్యాచారం చేయడం, ఇతర సొమ్మును లాక్కోవడం, దొంగతనాలు చేయడం. ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే వారు చేసేవారో, వారు ఈ నిషిద్ధ మాసాల్లో, గౌరవమనమైన నెలల్లో అలాంటి ఆ చెడు కార్యాల నుండి దూరం ఉండేవారు. విషయం అర్థమవుతుందా? అల్లాహ్ తో షిర్క్ చేసేవారు, ఇంకెన్నెన్నో తప్పు కార్యాలు, పాపాలు చేసేవారు. ప్రజలను పీడించేవారు, బలహీనుల హక్కులను కాజేసేవారు, ఎంతో దౌర్జన్యం, అత్యాచారాలు చేసేవారు. కానీ, ఈ మూడు నెలలు వారు ఎలాంటి దౌర్జన్యానికి, ఇతరులపై ఏ అత్యాచారం చేయకుండా, దొంగలించకుండా వారు శాంతిగా ఉండేది. కానీ మూడు నెలలు కంటిన్యూగా శాంతిపరంగా ఉండడం వారికి భరించలేని విషయమై, మరో చెడ్డ కార్యం ఏం చేశారో తెలుసా? జుల్ హిజ్జాలో హజ్ జరుగుతుంది. అందుగురించి జుల్ ఖాదా, జుల్ హిజ్జా ఈ రెండు మాసాలు గౌరవించేవారు.
కానీ ముహర్రం నెల గురించి ఏమనేవారు? ఈసారి ముహర్రం సఫర్ లో వస్తుంది, ఈ ముహర్రంని ఇప్పుడు మనం సఫర్ గా భావిద్దాము. సఫర్ నెల ఎప్పుడు ఉంది? రెండో నెల. ముహర్రం తర్వాత సఫర్ ఉంది కదా. వాళ్ళు ఏమనేవారు? సఫర్ ను ముహర్రం గా చేసుకుందాము, ఈ ముహర్రంను సఫర్ గా చేసుకుందాము. ఇప్పుడు ఈ ముహర్రం మాసాన్ని ఏదైతే సఫర్ గా వారు అనుకున్నారో, దొంగతనం చేసేవారు, లూటీ చేసేవారు, ఇంకా పాప కార్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో, దాన్ని ముహర్రంగా భావించారు కదా, అప్పుడు కొంచెం శాంతిగా ఉండేవారు. ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా ఉండడం వారికి కష్టతరంగా జరిగింది. అయితే అలాంటి విషయాన్ని కూడా అల్లాహ్ త’ఆలా ఖండించాడు. సూరె తౌబా ఆయత్ నంబర్ 37 లో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, కాలం తిరిగి తన అసలైన స్థితిలోకి, రూపంలోకి వచ్చింది అని ఏదైతే ప్రవక్త చెప్పారో, ఈ విషయం ఎప్పుడు చెప్పారు ప్రవక్త? తాను హజ్ ఏదైతే సంవత్సరంలో చేశారో ఆ సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో నెలల్లో ఎలాంటి తారుమారు లేకుండా, వెనక ముందు లేకుండా, అల్లాహ్ త’ఆలా సృష్టించినప్పటి స్థితిలో ఎట్లానైతే అసల్ స్థితిలో ఉండెనో, అదే స్థితిలో ఉండినది. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
మరో విషయం ఇందులో గౌరవించగలది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నాలుగు మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. వాటిలో మూడు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. నాలుగవది రజబ్. ఆ రజబ్ అని కేవలం చెప్పలేదు, ఏం చెప్పారు? రజబ్ ముదర్ అని చెప్పారు. ముదర్ ఒక తెగ పేరు. కబీలా అని అంటాం కదా. ప్రవక్త కాలంలో అప్పుడు ఇంకా ఎన్నో తెగలు ఉండేవి. జమాదుల్ ఆఖిరా తర్వాత రజబ్ ఉంది, రజబ్ తర్వాత షాబాన్. అయితే కొన్ని తెగలు ఈ రజబ్ ను రజబ్ గా భావించకుండా, రమదాన్ ను రజబ్ గా కొందరు అనేవారు. రమదాన్ మాసాన్ని ఏమనేవారు? ఎవరు? వేరే కొన్ని తెగల వాళ్ళు. కానీ ముదర్ తెగ ఏదైతే ఉండెనో, ఆ తెగ వారు రజబ్ నే రజబ్ గా నమ్మేవారు. రజబ్ ను ఒక గౌరవప్రదమైన, అల్లాహ్ నిషేధించిన ఒక మాసంగా వారు విశ్వసించేవారు. అందు గురించి ప్రజలందరికీ తెలియడానికి, వేరే ప్రజలు ఎవరైతే రమదాన్ ను రజబ్ గా చేసుకున్నారో ఆ రజబ్ కాదు, ముదర్ ఏ రజబ్ నైతే రజబ్ మాసంగా నమ్ముతున్నారో మరి ఏదైతే జమాదుల్ ఆఖిరా తర్వాత, షాబాన్ కంటే ముందు ఉందో ఆ రజబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశదీకరించారు, వివరించారు.
తనకు తాను అన్యాయం చేసుకోవడం (జుల్మ్) అంటే ఏమిటి?
అయితే ఈ గౌరవప్రదమైన మాసంలో అల్లాహ్ త’ఆలా మనల్ని ఒక ముఖ్యమైన విషయం నుండి ఆపుతున్నాడు. అదేమిటి?
ఇక్కడ కొందరు ఇలాగ అడగవచ్చు, ఈ నాలుగు మాసాల్లోనే జుల్మ్ చేయరాదు, మిగతా మాసాల్లో చేయవచ్చా? అలా భావం కాదు. ప్రతిచోట అపోజిట్ భావాన్ని తీసుకోవద్దు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. మన సమాజంలో ఎవరైనా మస్జిద్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు అనుకోండి, మనలో ఒక మంచి వ్యక్తి ఏమంటాడు? అరె, ఏంట్రా, మస్జిద్ లో ఉండి అబద్ధం మాట్లాడుతున్నావా? అంటారా లేదా? అంటే భావం ఏంటి? మస్జిద్ బయట ఉండి అబద్ధం మాట్లాడవచ్చు అనే భావమా? కాదు. ఆ బయటి స్థలాని కంటే ఈ మస్జిద్ యొక్క స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక గౌరవం అనేది, ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. నువ్వు బయట చెప్పినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, ఏదీ ఏమీ నీవు ఆలోచించకుండా, కనీసం ఇప్పుడు నీవు అల్లాహ్ యొక్క గృహంలో ఉన్నావు, మస్జిద్ లో ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించి అబద్ధం ఎందుకు పలుకుతున్నావు? అక్కడ విషయం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అన్న భావం కాదు. మస్జిద్ లో ఉండి ఇంకా మనం చెడులకు, అన్ని రకాల పాపాలకు ఎక్కువగా దూరం ఉండాలి, దూరంగా ఉండాలి అన్నటువంటి భావం. అలాగే ప్రతి నెలలో, ప్రతి రోజు జుల్మ్ కు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారానికి దూరంగా ఉండాలి. కానీ ఈ నిషిద్ధ మాసాల్లో, ఈ నాలుగు మాసాల్లో ప్రత్యేకంగా దూరం ఉండాలి. ఇది అయితే తెలిసింది. కానీ జుల్మ్ అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో, ఆ జుల్మ్ అన్నదానికి భావం ఏంటి? మరి అల్లాహ్ త’ఆలా ఏమన్నాడు ఇక్కడ?
فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ [ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్] మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకోకండి.
మీ ఆత్మలపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా. ఎవరైనా తెలివిమంతుడు, బుద్ధి జ్ఞానం గలవాడు, తనకు తాను ఏదైనా అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడా? అందరూ ఇదే నిర్ణయంపై ఉన్నారు కదా. మరి అల్లాహ్ త’ఆలా అదే విషయం అంటున్నాడు, మీరు అంటున్నారు చేసుకోరు. మరి వారు చేసుకోకుంటే, అల్లాహ్ త’ఆలా ఎందుకు చేసుకోకండి అని అంటున్నాడు? వారు చేసుకుంటున్నారు గనుకనే అల్లాహ్ త’ఆలా చేసుకోకండి అని అంటున్నాడు. అంటే మన ఆత్మలపై మనం అన్యాయం ఎలా చేసుకుంటున్నాము? మన ఆత్మలపై మనం జుల్మ్ ఎలా చేస్తున్నాము? ఈ విషయం మనం గ్రహించాల్సింది.
ఈ విషయాన్ని మనం ఖురాన్, హదీస్ ఆధారంగా సరైన విధంలో అర్థం చేసుకుంటే, మన జీవితాల్లో వాస్తవానికి ఎంతో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఇమాం తబరీ రహమతుల్లా అలైహి చెప్పారు: “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్”, మీరు ఇందులో ప్రత్యేకంగా ఈ మాసాల్లో మీపై అన్యాయం చేసుకోకండి అంటే ఏమిటి? ఇర్తికాబుల్ మాసియా వ తర్కుత్తాఆ. జుల్మ్ దేన్నంటారు? ఇర్తికాబుల్ మాసియా – పాప కార్యానికి పాల్పడడం వ తర్కుత్తాఆ – అల్లాహ్ విధేయతను, పుణ్య కార్యాన్ని వదులుకోవడం. పాపానికి పాల్పడడం, పుణ్యాన్ని వదులుకోవడం, దీన్ని ఏమంటారు? జుల్మ్ అంటారు.
సామాన్యంగా మన సౌదీ దేశంలో ఉండి, జుల్మ్ అంటే ఏంటి అంటే, కఫీల్ మనకు మన జీతాలు ఇవ్వకపోవడం అని అనుకుంటాము. అది కూడా ఒక రకమైన జుల్మ్. కానీ అందులోనే జుల్మ్ బంధించిలేదు. జుల్మ్ యొక్క భావం కొంచెం విశాలంగా ఉంది. ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలైహి చెప్పారు, “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్ బిర్తికాబి జునూబ్”, మీరు పాపాలకు పాల్పడి అన్యాయం చేసుకోకండి.
ఇక మీరు ఖురాన్ ఆయతులను పరిశీలిస్తే, ఎప్పుడైతే ఒక మనిషి అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని వదులుకుంటున్నాడో, పాటించడం లేదో, లేక అల్లాహ్ త’ఆలా ఏ దుష్కార్యం నుండి వారించాడో, చేయవద్దు అని చెప్పాడో, దానికి పాల్పడుతున్నాడో, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతున్నాడు.
ఉదాహరణకు స్కూల్ లో ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని రాలేదు. అతనికి తెలుసు, నేను ఈ రోజు హోంవర్క్ ఇంట్లో చేయకుంటే రేపటి రోజు స్కూల్ లో వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను దండిస్తాడు, కొడతాడు, శిక్షిస్తాడు. తెలుసు విషయం. తెలిసి కూడా అతను హోంవర్క్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఏమైంది? టీచర్ శిక్షించాడు అతన్ని. అతడు స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నవాడు అయ్యాడా లేదా? ఎట్లా? అతనికి ఏ దెబ్బలైతే తగిలిందో టీచర్ వైపు నుండి, లేక ఏ శిక్ష అయితే టీచర్ వైపు నుండి అతనిపై పడిందో, అది ఎందువల్ల? ముందు నుండే అతడు అతనికి టీచర్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో హోంవర్క్ చేయాలని అది చేయనందుకు. ఈ విషయం ఈ సామెత, ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదా. అలాగే అల్లాహ్ త’ఆలా మనకు డైరెక్ట్ గా స్వయంగా ఖురాన్ ద్వారా గానీ, లేకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో, వాటిని పాటించకపోవడం, వేటి నుండి అల్లాహ్ త’ఆలా మనల్ని వారించాడో, ఇవి చేయకండి అని చెప్పాడో, వాటికి పాల్పడడం, ఇది మనపై మనం అన్యాయం చేసుకుంటున్నట్లు.
దీనికి ఖురాన్ సాక్ష్యం చూడండి సూరె బఖరా ఆయత్ నంబర్ 54.
إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ [ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్ బిత్తిఖాజికుముల్ ఇజ్ల్] మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.” (2:54)
ఇది మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ త’ఆలా తూర్ పర్వతం వైపునకు పిలిపించాడో, ఆయన అటు వెళ్లారు, ఇటు కొందరు ఒక ఆవు దూడను తయారు చేశారు, బంగారంతో తయారు చేసి అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో మూసా అల్లాహ్ పిలుస్తున్నాడు అని ఎక్కడికో వెళ్ళాడు. మీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీటిని మీరు పూజించండి అని చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చిన తర్వాత వారిపై చాలా కోపగించుకున్నాడు. చెప్పాడు, “ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్”, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు. “బిత్తిఖాజికుముల్ ఇజ్ల్”, ఈ దూడను ఒక దేవతగా చేసుకొని. మీకు ఆరాధ్య దైవంగా మీరు భావించి, మీపై అన్యాయం చేసుకున్నారు. ఇక ఈ ఆయత్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? షిర్క్ అతి గొప్ప, అతి భయంకరమైన, అతి చెడ్డ దౌర్జన్యం, అతి చెడ్డ జుల్మ్.
ఇంకా అలాగే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ కు కృతజ్ఞత, శుక్రియా చెప్పుకోకపోవడం, తెలుపుకోకపోవడం ఇది కూడా మహా దౌర్జన్యం, జుల్మ్ కింద లెక్కించబడుతుంది. మరి మూడు ఆయతుల తర్వాత, అదే బనీ ఇస్రాయిల్ పై అల్లాహ్ త’ఆలా వారికి ఏ వరాలైతే ప్రసాదించాడో, వారికి అల్లాహ్ త’ఆలా కారుణ్యాలు ఇచ్చాడో ప్రస్తావిస్తూ: “వ జల్లల్నా అలైకుముల్ గమామ్”, మేము మీపై మేఘాల ద్వారా నీడ కలిగించాము. “వ అన్జల్నా అలైకుముల్ మన్న వస్సల్వా”, మన్ మరియు సల్వా తినే మంచి పదార్థాలు మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు ఇచ్చుకుంటూ వచ్చాము. “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్”, మేము ప్రసాదించిన ఈ ఆహారాన్ని మీరు తినండి. కానీ ఏం చేశారు వాళ్ళు? కృతజ్ఞత చూపకుండా దానికి విరుద్ధంగా చేశారు. మూసా ప్రవక్త మాటను వినకుండా అవిధేయతకు పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ వమా జలమూనా”, అయితే వారు మాపై అన్యాయం చేయలేదు, మాపై జుల్మ్ చేయలేదు. “వలాకిన్ కానూ అన్ఫుసహుమ్ యజ్లిమూన్”, వారు తమ ఆత్మలపై మాత్రమే అన్యాయం చేసుకున్నారు.
ఎంత మంది మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే భార్య భర్తల జీవిత విషయంలో కూడా అల్లాహ్ త’ఆలా ఒక విషయాన్ని తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నట్లు అని అంటున్నాడు. కానీ సామాన్యంగా మనం ఈ విషయం గమనించము. నేనే పురుషుడిని, నేనే మగవాడిని, భార్య నాకు బానిస లాంటిది అన్నటువంటి తప్పుడు భావాల్లో పడి ఎంతో పీడిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవితాల్లో ప్రేమానురాగాలు తగ్గుతాయో, మందగిస్తాయో, మంచి విధంగా జీవించి ఉండరు, మంచి విధంగా తెగతెంపులు చేసుకోకుండా పీడిస్తూ ఉంటారు. ఇది మహా పాపకార్యం. సూరె బఖరా 231 ఆయత్ లో అల్లాహ్ చెప్తున్నాడు:
వారికి ఏదైనా నష్టం చేకూర్చడానికి మీరు వారిని ఆపి ఉంచకండి. “లితఅతదూ”, వారిపై ఏదైనా దౌర్జన్యం చేయడానికి, వారిపై ఏదైనా అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. అంటే ఆపుకొని ఉంచకండి అంటే విడాకులు ఇవ్వడం లేదు, ఇటు మంచి విధంగా ప్రేమపూర్వకమైన జీవితం గడపడం లేదు. అల్లాహ్ ఏమంటున్నాడు?
وَمَن يَفْعَلْ ذَٰلِكَ [వమయ్ యఫ్అల్ జాలిక] ఎవరైతే ఇలా చేస్తారో,
అల్లాహ్ ఒక ఆదేశం ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు నష్టం చేకూర్చడానికి, అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. ఇక ఎవరైతే ఇలా చేస్తారో, “వమయ్ యఫ్అల్ జాలిక”, ఎవరైతే తమ భార్యలను వారిని పీడించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, నష్టం చేకూర్చడానికి ఆపుకొని ఉంటారో,
فَقَدْ ظَلَمَ نَفْسَهُ [ఫఖద్ జలమ నఫ్సహ్] అతను తనపై అన్యాయం చేసుకుంటున్నాడు, తనపై జుల్మ్ చేస్తున్నాడు. (2:231)
చూడడానికి అతడు ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి “జలమ నఫ్సహూ”, అతడు తనపై అన్యాయం చేసుకుంటున్నాడు. తనపై జుల్మ్ చేస్తున్నాడు.
ఇక ఈ అతడు తనపై ఎలా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఇలాంటి ఉదాహరణలు మన సమాజంలో ఎంతో, ఎన్నో మనకు కనబడతాయి. కానీ నేను చెప్పబోయే విషయం ఏంటి? ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క ఆజ్ఞను దాటుతాడో, అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడతాడో, అతడు వాస్తవానికి తనపై జుల్మ్ చేసుకున్నవాడు అవుతున్నాడు.
ఈ విధంగా ఖురాన్ లో చూస్తూ పోతే ఎన్నో ఆయతులు మనకు కానవస్తాయి. కానీ సోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాల్లో, ఇంకా మిగతా 12 మాసాల్లో కూడా మనల్ని అన్ని రకాల జుల్మ్, అన్ని రకాల పాప కార్యాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరి వైపు నుండి ఏదైనా అన్యాయం, జుల్మ్ వారి తమ ఆత్మలపై జరిగితే ఏం చేయాలి? సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో చెప్పాడు:
[వమయ్ యఅమల్ సూఅన్ అవ్ యజ్లిమ్ నఫ్సహూ సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా] “ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.” (4:110)
ఎవరైనా ఏదైనా పాప కార్యానికి పాల్పడితే, లేదా తన ఆత్మపై తాను జుల్మ్ చేసుకుంటే, ఆ తర్వాత స్వచ్ఛమైన రూపంలో అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, అల్లాహ్ ను క్షమించేవాడు, కరుణించేవాడు, మన్నించేవాడుగా పొందుతాడు.
అందు గురించి సోదరులారా, ఇకనైనా గమనించండి. జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా మనకు? ఏ మాత్రం తెలియదు. ఇంచుమించు నెల కాబోతుంది కావచ్చు. ఒక టైలర్, పెద్ద మనిషి ఇక్కడ చనిపోయి. సామాన్యంగా వచ్చాడు, భోజనం చేశాడు, హాయిగా స్నేహితులతో కూర్చున్నాడు, కొంత సేపట్లోనే నాకు ఛాతీలో చాలా నొప్పి కలుగుతుంది అని, కొంత సేపటి తర్వాత, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఇక నేను భరించలేను అన్నాడు. మిత్రులు బండిలో వేసుకొని వెళ్తున్నారు, హాస్పిటల్ చేరకముందే ఈ జీవితాన్ని వదిలేశాడు. మనలో కూడా ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇంకా మనం ఏ కలలు చూసుకుంటూ ఉన్నాము? ఇంకా ఎందుకు మనం పాప కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నాము? అల్లాహ్ ఆదేశాలకు దూరంగా, ఖురాన్ నుండి దూరంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు దూరంగా, నమాజులను వదులుకుంటూ, ఇంకా ఇతర పాప కార్యాల్లో మనం మునిగిపోతూ, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి జీవితం గడుపుతాము?
సోదరులారా, వాస్తవానికి ఏ ఒక్క మనిషి ఏ చిన్న పాపం చేసినా గానీ అతను తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. కానీ ఇకనైనా గుణపాఠం తెచ్చుకొని సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో అల్లాహ్ చెప్పినట్లుగా, వెంటనే మనం ఇస్తిగ్ఫార్, తౌబా, పశ్చాత్తాపం చెందుతూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పకుండా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు.
ఇక రజబ్ మాసంలో ఇంకా ఏ దురాచారాలు, ఏ బిదత్లైతే జరుగుతాయో, వాటి గురించి మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
రెండవ భాగం:
రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాలు) రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://www.youtube.com/watch?v=cNwTV9mjw1g [29 నిముషాలు]
ఈ ప్రసంగంలో, రజబ్ నెల యొక్క పవిత్రత మరియు ఆ నెలలో ముస్లింలు దూరంగా ఉండవలసిన పాపాల గురించి వివరించబడింది. అజ్మీర్ ఉర్సు, ప్రత్యేక నమాజులు (సలాతుర్ రగాఇబ్), ప్రత్యేక ఉపవాసాలు మరియు 27వ రాత్రి మేరాజ్ ఉత్సవాలు వంటివి ఇస్లాంలో లేని నూతన కల్పనలని (బిద్అత్) వక్త స్పష్టం చేశారు. అనంతరం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గగన ప్రయాణం (ఇస్రా మరియు మేరాజ్) యొక్క అద్భుత సంఘటనను వివరించారు. ఈ ప్రయాణం ఎందుకు జరిగింది, దాని సందర్భం, ప్రయాణంలో ఎదురైన అద్భుతాలు, వివిధ ప్రవక్తలతో సమావేశం, మరియు ఐదు పూటల నమాజ్ వంటి బహుమానాలు ఎలా లభించాయో వివరించారు. మేరాజ్ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన గుణపాఠం ఉత్సవాలు జరుపుకోవడం కాదని, అల్లాహ్ ప్రసాదించిన ఆదేశాలను, ముఖ్యంగా నమాజ్‌ను మన జీవితంలో ఆచరించడమని నొక్కిచెప్పారు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా మరియు ఆయన సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఆ తర్వాత…
గతవారంలో మనం రజబ్ నెలలో అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? రజబ్ నెలతో పాటు మిగతా మూడు నెలలు, అంటే టోటల్ నాలుగు గౌరవప్రదమైన నెలలలో ప్రత్యేకంగా జుల్మ్ నుండి, అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యం వీటి నుండి దూరం ఉండాలన్న ఆదేశం అల్లాహ్ మనకిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అనండి, ఎంతోమంది ముస్లింలు ఈ రజబ్ నెలలో ఎన్నో దురాచారాలకు పాల్పడుతున్నారు.
రజబ్ నెలలో జరిగే దురాచారాలు (బిద్అత్)
ఉదాహరణకు, రజబ్ నెల మొదలైన వెంటనే, అజ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఒక సమాధికి ఎంతో గౌరవ స్థానం ఇచ్చి, దాని యొక్క దర్శనం, దాని యొక్క ఉర్స్, యాత్రలు చేయడం. వాస్తవానికి, సమాధిని ఇటుక సిమెంట్లతో కట్టి, దాని మీద గోపురాలు కట్టి, దానికి ఒక సమయం అని నిర్ణయించి ప్రజలు అక్కడికి రావడం, ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన కార్యం. అంతేకాకుండా మరో ఘోరమైన విషయం ఏమిటంటే, ఎందరో సామాన్య ప్రజలలో ఒక మాట చాలా ప్రబలి ఉంది. అదేమిటి? ధనవంతుల హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి బీదవాళ్లు ఏడుసార్లు అజ్మీర్‌కు వెళ్తే ఒక్కసారి హజ్ చేసినంత సమానం అని. ఇది కూడా మహా ఘోరమైన, పాపపు మాట. అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో సర్వ భూమిలోకెల్లా హజ్ అన్నది కేవలం మక్కా నగరంలో కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సయీ, ముజ್ದలిఫా, అరఫాత్, మినా ఈ ప్రాంతాల్లో నిలబడటం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి కార్యాలు చేయడం, ఇదే హజ్ కానీ, ఇది కాకుండా వేరే ఏదైనా సమాధి, వేరే ఏదైనా ప్రాంతం, ఏదైనా ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, దానికి హజ్ లాంటి పేరు పెట్టుకోవడం ఇది చాలా ఘోరమైన పాపం.
ఇంకా మరికొందరు ఈ రజబ్ నెలలోని మొదటి వారంలో గురువారం రాత్రి, శుక్రవారానికి ముందు ఒక ప్రత్యేక నమాజ్ చదువుతారు. సలాతుర్ రగాఇబ్ అని దాని పేరు. ఇలాంటి నమాజ్ చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ ఒక్క హదీసు, ఏ ఒక్క ఆదేశం లేదు. పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు సహాబా-ఎ-కిరామ్ మరియు ఆ తర్వాత కాలాలలో శ్రేష్ఠ కాలాలలో వచ్చినటువంటి ధర్మవేత్తలు, ధర్మ పండితులు ఇలాంటి నమాజ్ గురించి ఏ ఒక్క ఆదేశం లేదు అని స్పష్టం చేశారు.
ఇంకా మరికొందరు ప్రత్యేకంగా రజబ్ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. అయితే రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించినట్లు ప్రవక్త ద్వారా ఏ రుజువు లేదు. కాకపోతే, ఎవరైనా ప్రతీ నెలలో సోమవారం, గురువారం అల్లాహ్ వద్ద సర్వ మానవుల కార్యాలు లేపబడతాయి గనుక, ఇతర నెలలో ఉంటున్నట్లు ఈ నెలలో కూడా ఉపవాసాలు ఉండేది ఉంటే అభ్యంతరం లేదు. ప్రతీ నెలలో మూడు ఉపవాసాలు ఉన్నవారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు గనుక, ఎవరైనా రజబ్ నెలలో కూడా మూడు ఉపవాసాలు ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇతర రోజుల్లో కూడా వారు, ఇతర మాసాల్లో కూడా వారు ఉంటున్నారు గనుక. కానీ ప్రత్యేకంగా రజబ్ కు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండటం ప్రవక్తతో, సహాబాలతో రుజువు లేని విషయం.
అలాగే మరో దురాచారం ఈ రజబ్ నెలలో ఏమిటంటే, కొందరు 22వ తారీఖు నాడు రజబ్ కే కూండే అని చేస్తారు. అంటే ఓ ప్రత్యేకమైన కొన్ని వంటకాలు చేసి దానిపై ఫాతిహా, నియాజ్‌లు చేసి జాఫర్ సాదిక్ (రహ్మతుల్లాహి అలైహి) పేరు మీద మొక్కడమనండి, లేక ఆయన పేరు మీద నియాజ్ చేయడం అనండి. అయితే సోదరులారా, నియాజ్ అని ఏదైతే ఉర్దూలో అంటారో, మొక్కుకోవడం అని దానికి భావన వస్తుంది. అయితే ఇది కేవలం అల్లాహ్ గురించే చెల్లుతుంది. అల్లాహ్ కు కాకుండా ఇక వేరే ఎవరి గురించి ఇలాంటి నియాజ్‌లు చేయడం ధర్మ సమ్మతం కాదు. పోతే ఈ పద్ధతి, అంటే ఏదైనా ప్రత్యేక వంటకాలు చేసి, వాటి మీద కొన్ని సూరాలు చదివి ఊది నియాజ్‌లు చేయడం, ఇది ఈ నెలలో గాని, ఏ నెలలో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పద్ధతిని నేర్పలేదు. అందు గురించి ఇలాంటి దురాచారాల నుండి కూడా మనం దూరం ఉండాలి.
ఇంకొందరు మనం చూస్తాము, 27వ రాత్రి జాగారం చేస్తారు, రాత్రి మేల్కొని ఉంటారు, మస్జిద్ లలో పెద్ద లైటింగ్‌లు చేస్తారు. ఆ మస్జిద్ లలో వచ్చి కొన్ని ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ పారాయణం, ఇంకా వేరే కొన్ని కార్యాలు చేసి ఆ రాత్రిని, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మేరాజ్ ఉన్-నబీ ఏదైతే ప్రాప్తమైందో, మేరాజ్. అంటే రాత్రి యొక్క అతి చిన్న సమయంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ త’ఆలా జిబ్రీల్ ద్వారా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లారు. అక్కడ స్వర్గం, నరకాలను దర్శించారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో మాట్లాడారు. మరియు తిరిగి వస్తూ వస్తూ ఐదు పూటల నమాజ్‌ల యొక్క గొప్ప బహుమానం కూడా తీసుకొచ్చారు.
ఇది వాస్తవమైన విషయం. దీనినే సామాన్యంగా తెలుగులో గగన ప్రయాణం అని అంటారు. ఈ గగన ప్రయాణం మన ప్రవక్తకు ప్రాప్తమైంది, ఇది నిజమైన విషయం. కానీ ఏ తారీఖు, ఏ నెల మరియు ఏ సంవత్సరంలో జరిగిందో ఎలాంటి సుబూత్, ఎలాంటి ఆధారం అనేది లేదు. కానీ మన కొందరు సోదరులు 27వ తారీఖు నాడు రాత్రి, అంటే 26 గడిచిన తర్వాత 27, 26 మధ్య రాత్రిలో జాగారం చేసి, ఇది గగన ప్రయాణం, జష్న్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని చేస్తారు. ఇలాంటి మేరాజ్-ఉన్-నబీ ఉత్సవాలు జరపడం కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం.
మేరాజ్ నుండి గుణపాఠాలు
ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, గగన ప్రయాణం ప్రవక్తకు మేరాజ్ ప్రాప్తమైంది కానీ, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం అన్నది రుజువు లేదు. అయినా, ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస పోక ముందు, హిజ్రత్ చేయక ముందే ఇది జరిగింది అన్నటువంటి ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే ఈ గగన ప్రయాణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా మేరాజ్‌ను గుర్తు చేసుకొని ఆ రాత్రి జాగారం చేయడం లాంటి పనులు చేయలేదు.
అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న సామెత, లేదా అనండి ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇహలోకంలో మనం కొందరు పండితులను లేదా విద్వాంసులను, లేదా దేశం కొరకు ఏదైనా చాలా గొప్ప మేలు చేసిన వారికి, ఏదైనా సంస్థ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ వారిని గౌరవించి వారికి ఇతర దేశంలో టూర్ గురించి వెళ్లి అక్కడి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి రావడానికి అన్ని రకాల సౌకర్యాలు, టికెట్ ఖర్చులతో పాటు అక్కడ ఉండడానికి, హోటల్లో, అక్కడ తిరగడానికి, అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల ఖర్చు గిట్ల మొత్తం భరించి వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. విషయం అర్థమవుతుందా? సైన్సులో గాని, ఇంకా వేరే ఏదైనా విషయంలో గాని ఎవరైనా గొప్ప మేలు చేస్తే, వారిని సన్మానించడం, సన్మానిస్తూ వారు చేసిన ఆ మేలుకు ప్రభుత్వం గాని లేదా ఏదైనా సంస్థ గాని ఏం చేస్తుంది? మీరు ఫలానా దేశంలో టూర్ చేసి రండి అన్నటువంటి టికెట్లతో సహా అన్ని ఖర్చులతో సహా వారిని పంపుతుంది.
అలాంటి వ్యక్తి బయటికి పోయి వచ్చిన తర్వాత, అక్కడి నుండి కొన్ని విషయాలు, కొన్ని మంచి అనుభవాలు తీసుకొని వస్తాడు. అయితే, వచ్చిన తర్వాత తన ఇంటి వారికి లేదా తన దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మంచి విషయాల గురించి తెలియజేస్తాడు. ఉదాహరణకు ఎవరైనా జపాన్ వెళ్ళారనుకోండి. అక్కడ టెక్నాలజీ, వారి యొక్క దైనందిన జీవితంలో, డైలీ జీవితంలో ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే వారు ఫాలో అవుతున్నారో, వాటవన్నీ చాలా నచ్చి మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి విషయాలు పాటించాలి అని బోధ చేస్తాడు.
అయితే ఇప్పుడు ఆ మనిషి ఎవరికైతే ఒక సంస్థ లేక ప్రభుత్వం పంపిందో, ఉదాహరణకు అనుకోండి జపాన్‌కే పంపింది, ఏ తారీఖులో ఆయన అటు పోయి వచ్చాడో, ప్రతీ సంవత్సరం ఆ తారీఖున ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటే లాభం కలుగుతుందా? లేకుంటే అక్కడికి వెళ్లి వచ్చి అక్కడి నుండి తెచ్చిన అనుభవాలను అనుసరిస్తే లాభం కలుగుతుందా? అక్కడ తీసుకు… అక్కడి నుండి ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో, అక్కడి నుండి ఏ మంచి విషయాలు అయితే తీసుకొచ్చాడో, వాటిని ఆచరిస్తేనే లాభం కలుగుతుంది. అలాగే, మన ప్రవక్తకు, మన ప్రవక్తను అల్లాహ్ త’ఆలా ఆకాశాల్లోకి పిలిపించి అక్కడ ఏదైతే గొప్ప బహుమానాలు ప్రసాదించాడో అవి మనకు కూడా ఇచ్చారు. అయితే వాటిని మనం ఆచరిస్తేనే మనకు లాభం కలుగుతుంది కానీ, మా ప్రవక్త గారు ఫలానా తారీఖున గగన ప్రయాణం చేశారు అని కేవలం మనం సంతోషపడితే మనకు ఎలాంటి లాభాలు కలగవు.
అయితే సోదరులారా, మనం ఈ మేరాజ్-ఉన్-నబీ సంఘటనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎలాంటి సందర్భంలో మన ప్రవక్తకు మేరాజ్ గౌరవం ప్రాప్తమైంది? ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు ఏ ఏ విషయాలు లభించాయి? రండి సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.
ఇస్రా మరియు మేరాజ్: గగన ప్రయాణం
మక్కాలో మన ప్రవక్త గారు ఇస్లాం ధర్మ ప్రచారం మొదలుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా అవిశ్వాసుల వైపు నుండి కష్టాలు, బాధలు పెరుగుతూనే పోతున్నాయి. చివరికి ఎప్పుడైతే అబూ తాలిబ్ చనిపోయాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు చనిపోయారో ఆ తర్వాత మన ప్రవక్త వారిపై దౌర్జన్యాలు, హింసలు ఇంకా పెరిగిపోయాయి.
ఆ సందర్భంలో ప్రవక్త ఏం చేశారు? తాయిఫ్ నగరానికి వెళ్లారు. బహుశా అక్కడి వారు కొందరు ఇస్లాం స్వీకరిస్తారేమో కావచ్చు. కానీ అక్కడ కూడా వారికి, ప్రవక్త గారికి చాలా శారీరకంగా చాలా బాధించారు. అంతేకాకుండా తప్పుడు సమాధానాలు పలికి ప్రవక్త మనసును కూడా గాయపరిచారు. ప్రవక్త అదే బాధలో తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ గగన ప్రయాణం జరిగింది.
అయితే ఇందులో ఒకవైపు ప్రవక్తకు తృప్తిని ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధపడకండి, ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ గౌరవాన్ని గుర్తు చేసుకోకుంటే, మీకు అల్లాహ్ త’ఆలా ఎలాంటి స్థానం ఇచ్చాడో దాన్ని వారు గ్రహించకుంటే మీరు ఆకాశాల్లో రండి. ఆకాశంలో ఉన్న వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో, మీ యొక్క స్థానాన్ని ఎలా వారు గుర్తిస్తారో చూడండి అని ప్రవక్త గారికి ఒక నెమ్మది, తృప్తి, శాంతి, మనసులో ఏదైతే బాధ ఉందో దానికి మనశ్శాంతి కలిగించడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రయాణంలో ప్రవక్త గారికి ఇంకా ఎన్నో మహిమలు, ఎన్నో రకాల అద్భుతాలు కలిగాయి. ఒక్కొక్కటి వేసి మనం దాన్ని తెలుసుకుందాం.
మేరాజ్ ప్రయాణంలో జరిగిన సంఘటనలు
ప్రవక్త గారి హార్ట్ ఆపరేషన్ ఈ గగన ప్రయాణం కంటే ముందు జరిగింది. అంతకు ముందు ఒకసారి నాలుగు సంవత్సరాల వయసులో కూడా జరిగింది. కానీ గగన ప్రయాణానికి ముందు కూడా ఒకసారి గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అనస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఛాతి మీద నేను ఆ ఆపరేషన్ చేసినటువంటి కుట్ల గుర్తులను కూడా చూశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో విశ్వాసం, వివేకాలు నింపబడ్డాయి. (సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది).
గాడిద కంటే కొంచెం పెద్దగా మరియు కంచర గాడిద కంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక వాహనంపై ప్రవక్తను ఎక్కించడం జరిగింది. దాని పేరు అరబీలో బురాఖ్. రాత్రిలోని అతి తక్కువ సమయంలో మక్కా నుండి ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఖ్దిస్. అక్కడ అల్లాహ్ త’ఆలా తన శక్తితో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మన ప్రవక్త ముహమ్మద్ కంటే ముందు వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరినీ అక్కడ జమా చేశాడు. ప్రవక్త గారు వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు.
అక్కడి నుండి, అంటే బైతుల్ మఖ్దిస్ నుండి, ప్రవక్త ఆకాశాల పైకి వెళ్లారు. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో హజ్రత్ ఈసా మరియు యహ్యా, మూడవ ఆకాశంలో యూసుఫ్, నాల్గవ ఆకాశంలో ఇద్రీస్, ఐదవ ఆకాశంలో హారూన్, ఆరవ ఆకాశంలో మూసా, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం (అలైహిముస్సలాతు వ తస్లీమ్). వీరందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు.
ఏడవ ఆకాశాలకు పైగా “సిద్రతుల్ ముంతహా” అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ఆ రేగు చెట్టు ఎంత పెద్దదంటే, దాని యొక్క పండు (రేగు పండు ఉంటుంది కదా) చాలా పెద్ద కడవల మాదిరిగా మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటుంది, అంత పెద్ద చెట్టు. దాని యొక్క వ్రేళ్ళు, ప్రతీ చెట్టుకు వ్రేళ్ళు ఉంటాయి కదా కింద, అవి ఆరవ ఆకాశంలో ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు ఏడవ ఆకాశంలో చేరుకుంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు జరిగాయి. దానికి దగ్గరే “జన్నతుల్ మఅవా” అన్న స్వర్గం ఉంది.
దైవదూతలు కొందరు ఎవరైతే రాస్తూ ఉంటారో అల్లాహ్ ఆదేశాలను, వారు రాస్తున్న కలముల చప్పుడు కూడా వినిబడుతుంది. ఆ సిద్రతుల్ ముంతహా, ఆ రేగు చెట్టు అక్కడే ప్రవక్త గారికి మూడు విషయాలు ఇవ్వడం జరిగాయి:
50 పూటల నమాజ్.
సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతులు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా విశ్వసించి ఆయనను ఆచరించే వారిలో షిర్క్ చేయని వారు ఎవరైతే ఉంటారో, వారి పెద్ద పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా మన్నిస్తాను అంటున్నాడు.
ఇదే రేగు చెట్టు వద్ద ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు సృష్టిలో చూశారు. అక్కడే ప్రవక్త గారు నాలుగు రకాల నదులను చూశారు.
ఆరవ విషయం, అక్కడే ప్రవక్త గారికి పాలు ఒక పళ్లెంలో, మరో పళ్లెంలో తేనె, మరో పళ్లెంలో మత్తు పదార్థం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త గారు పాలు తీసుకున్నారు.
ఏడవ ఆకాశంపై బైతుల్ మామూర్ అని ఉంది. ఇక్కడ మనకు భూమి మీద మక్కాలో కాబా ఎలా ఉంది, బైతుల్లాహ్, అక్కడ బైతుల్ మామూర్ అని ఉంది. ప్రతీ రోజు అందులో 70,000 దైవదూతలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ చేసిన దేవదూతకు మరోసారి అక్కడ నమాజ్ చేసే అవకాశం కలగదు.
ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన మూసా అలైహిస్సలాంను కూడా చూశారు. మూసా అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఈసా అలైహిస్సలాం ఎలా ఉన్నారో ఆ விவரం కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇంకా నరకంపై ఒక దేవదూత ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అతని పేరు ఖురాన్‌లో మాలిక్ అని వచ్చి ఉంది. ప్రవక్త ఆయన్ని కూడా చూశారు, అతను ప్రవక్తకు సలాం కూడా చేశారు.
ఇదే ప్రయాణంలో ప్రవక్త గారు దజ్జాల్‌ను కూడా చూశారు.
ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని దర్శించారు. ఆ స్వర్గంలో మంచి ముత్యాలు, పగడాలు, (హీరే, మోతీ అంటాం కదా) ముత్యాలు, పగడాలతో మంచి వారి యొక్క గృహాలు ఉన్నాయి. ఇంకా అక్కడి మట్టి కస్తూరి వంటి సువాసన ఉంటుంది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చాలా పెద్ద హౌజ్ (సరస్సు), స్వర్గపు నీళ్లు దొరుకుతుంది, దాన్ని కౌసర్ అంటారు, దాన్ని కూడా ప్రవక్త గారు చూశారు.
ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల ఏ సమూహం నుండి దాటినా వారందరూ “ఓ ప్రవక్తా, మీ అనుచరులకు చెప్పండి వారు కప్పింగ్ (హిజామా) చేయాలి” అని. అరబీలో హిజామా అంటారు, ఉర్దూలో పఛ్నా లగ్వానా, సీంగీ లగ్వానా అంటారు. ఇంగ్లీషులో కప్పింగ్ థెరపీ అంటారు. అంటే ఏంటి? శరీరంలో కొన్ని ప్రాంతాల్లో చెడు రక్తం అనేది ఉంటుంది. దానికి ప్రత్యేక నిపుణులు ఉంటారు, దాన్ని ఒక ప్రత్యేక పద్ధతితో తీస్తారు. ఇది కూడా ఒక రకమైన మంచి చికిత్స. దీనివల్ల ఎన్నో రోగాలకు నివారణ కలుగుతుంది.
ఇదే ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి సువాసన పీల్చారు. ఇదేంటి సువాసన అని అడిగితే, ఫిరౌన్ కూతురుకు వెంట్రుకలను దువ్వెనతో దువ్వి వారి సేవ చేసే ఒక సేవకురాలు ఎవరైతే ఉండెనో, ఆమె, ఆమె సంతానం యొక్క ఇల్లు ఏదైతే ఉందో స్వర్గంలో, అక్కడి నుండి ఈ సువాసన వస్తుంది. ఆమె సంఘటన విన్నారు కదా ఇంతకుముందు? ఫిరౌన్ యొక్క కూతురికి ఒక ప్రత్యేక సేవకురాలు ఉండింది, ఆమె వెంట్రుకలను దువ్వడానికి. ఒకసారి చేతి నుండి దువ్వెన కింద పడిపోతుంది. బిస్మిల్లా అని ఎత్తుతుంది. ఫిరౌన్ కూతురు అడుగుతుంది, “ఎవరు అల్లాహ్? అంటే నా తండ్రియా, ఫిరౌనా?” ఆమె అంటుంది సేవకురాలు, “కాదు. నీ తండ్రికి మరియు నాకు ప్రభువు అయినటువంటి అల్లాహ్.” పోయి తండ్రికి చెప్తే, అతడు ఏం చేస్తాడు? ఒక చాలా పెద్ద డేగలో నూనె మసలబెట్టి, ఆమె పిల్లవాళ్ళను ముందు అందులో వేస్తాడు. తర్వాత ఆమెను కూడా అందులో వేసేస్తాడు. ఇలాంటి శిక్ష వారికి ఇవ్వబడుతుంది, కేవలం అల్లాహ్ ను విశ్వసించినందుకు. అయితే వారికి అల్లాహ్ త’ఆలా ఏదైతే గౌరవ స్థానం, గొప్ప గృహం ఇచ్చాడో స్వర్గంలో, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు.
హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అనుచర సంఘానికి నా సలాం చెప్పండి. మరియు వారికి చెప్పండి, స్వర్గంలో ఉన్నటువంటి భూమి అది చాలా మంచి పంటనిస్తుంది. కానీ అక్కడ ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులో విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది.” ఏంటి అని అడిగితే:
سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ (సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్) అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.
అని చెప్పారు. మరొక హదీస్‌లో ఉంది:
لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ (లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్) పాపాల నుండి రక్షణ మరియు పుణ్యాలు చేసే శక్తి అల్లాహ్ ప్రసాదిస్తేనే లభిస్తాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొందరిని చూశారు నరకంలో, అక్కడ వారికి గోర్లు ఇత్తడి, రాగితో ఉన్నాయి. వారి గోళ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, రాగితో ఉన్నాయి. దాంతోనే వాళ్ళు తమకు తాము తమ ముఖాన్ని, తమ శరీరాన్ని ఇలా గీక్కుంటున్నారు. మొత్తం తోలంతా పడిపోతుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని అడిగినప్పుడు జిబ్రీల్ చెప్పారు, ఎవరైతే ఇతరుల మాంసాన్ని తినేవారో మరియు వారి అవమానం చేసేవారో అలాంటి వారికి. మాంసం తినడం అంటే ఇక్కడ వారి యొక్క చాడీలు చెప్పడం. గీబత్, చుగ్లీ, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, ఇంకా ఇతరుల అవమానం చేయడం.
ఇంకొందరిని చూశారు ప్రవక్త గారు, అగ్ని కత్తెరలతో వారి యొక్క పెదవులను కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే ఇతరులకు మంచి గురించి చెప్తుంటారో కానీ స్వయంగా దానిపై ఆచరించరో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది.
మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు గారు “సిద్దీఖ్” అన్న బిరుదు ఏదైతే పొందారో, ఇదే ప్రయాణం తర్వాత పొందారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త గారికి ఈ గగన ప్రయాణంలో ఏ ఏ విషయాలను దర్శించారో, వాటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సహీ హదీసుల ఆధారంగానే ఉన్నవి. పోతే ఇందులో ప్రత్యేకంగా నమాజ్ యొక్క విషయం, సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతుల విషయం, సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ లాంటివన్నీ విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ మీకు, మాకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ దయ కలిగితే మరెప్పుడైనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.