నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరికి వెళ్తే ఆయన ప్రవక్త ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :-

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే, మనిషి అలాంటి చర్యకు పాల్పడడానికి బదులు నలభై (సంవత్సరాలు, నెలలు, రోజుల పాటు – ఉల్లేఖకునికి ఎంత కాలమో సరిగా గుర్తులేదు) వరకు నిలబడి ఉండటం ఎంతో మేలని భావిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 101 వ అధ్యాయం – ఇస్ముల్ మర్రిబైన యదయిల్ ముసల్లీ]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా అది సామూహిక నమాజే

353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – అల్ మవాకియతుస్సలాత్, 29 వ అధ్యాయం – మన్ అద్రక మినస్సలాతి రక అతన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 30 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రళయదినం నాడు దేవుని నీడ పట్టున ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తులు

610. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా  తెలిపారు:-

దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో

  1.  న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;

  2.  తన యౌవన జీవితం (వ్యర్ధ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు;

  3.  మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయి పోయినా ధ్యాసంతా మస్జిదు వైపు  ఉండేటటువంటి మనిషన్న మాట);

  4.  కేవలం ధైవప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, ధైవప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు;

  5.  అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచి నప్పుడు, తాను దైవానికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ;

  6.  కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి;

  7.  ఏకాంతంలో దైవాన్ని తలచుకొని కంటతడి పెట్టే వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 36 వ అధ్యాయం – మన్ జలస ఫిల్ మస్జిది యన్తజిరుస్సలాతి వ ఫజ్లిల్ మసాజిద్]

జకాత్ ప్రకరణం : 30 వ అధ్యాయం – గుప్తదానం – దాని ప్రాముఖ్యత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

నమాజు కోసం మస్జిదుకు వెళ్ళే వారికి అడుగడుగునా పుణ్యమే

388. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 31 వ అధ్యాయం – సలాతిల్ ఫజ్రి ఫీజమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 50 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి

232. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుండి పడిపోయారు. దానివల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. మేము కూడా ఆయన వెనుక కూర్చునే నమాజు చేశాము. ఆయన నమాజు ముగించిన తరువాత

“ఇమామ్ నియామకం ఆయన్ని (ముఖ్తదీలు) అనుకరించడానికే జరుగుతుంది. అందువల్ల అతను (అల్లాహు అక్బర్ అని) తక్బీర్ పలికితే మీరు తక్బీర్ పలకండి. ఆయన రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి.ఆయన రుకూ నుండి పైకి లేస్తే మీరు లేవండి. అప్పుడు ఇమామ్ ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అంటే మీరు ‘రబ్బనా! వలకల్ హమ్ద్’ అనండి. (ఆ తరువాత) అతను సజ్దా చేస్తే మీరు సజ్దా చేయండి”

అని ప్రభోధించారు.

[సహీహ్ బుఖారీ :  10 వ ప్రకరణం – అజాన్, 128 వ అధ్యాయం – యహ్ వీ బిత్తక్బీరి హీన యస్జుద్]

నమాజుప్రకరణం  – 19 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్