తఖ్దీర్ (విధి వ్రాత) పై విశ్వాసం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము:విధివ్రాత పై విశ్వాసం 

الحمد لله العلي الأعلى، الذي خلق فسوى، والذي قدّر فهدى، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وحده لا شريك له، له الحمد في الآخرة والأولى، وأشهد أن محمدًا عبدُ الله ورسوله، بلّغ الرسالة، وأدى الأمانة، ونصح الأمة، وكشف الغمة، صلى الله عليه وعلى آله وأصحابه ومن سار على نهجهم واقتفى، وسلَّم تسليمًا كثيرًا. 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా అల్లాహ్ తో భయపడుతూ ఉండండి. ఆయనకు విధేయత చూపండి. ఆయన అవిధేయత నుంచి దూరంగా ఉండండి.  విధేయతతో కూడినటువంటి సదాచరణ చేయండి మరియు అవిధేయతతో కూడిన దురాచారాల నుంచి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! విధిరాతపై విశ్వాసం తీసుకురావడం విశ్వాస మూల స్తంభాలలో ఒకటి. విశ్వాసం పరిపూర్ణమవ్వాలంటే విధిరాతపై విశ్వాసము ఉంచడం తప్పనిసరి. విధిరాత అనగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన జ్ఞానంతో మరియు వివేకంతో ఆయన కోరుకున్న విధంగా జీవుల యొక్క విధి వ్రాతను లిఖించి ఉంచాడు.

తన దాసుల పరిస్థితులు ఆయనకు తెలుసు. వారి జీజీవనోపాధి, వారి చావు, వర్షం కురిపించడం లేదా తన దాసుల చర్యలు లేక మాటలు లేక వారి కర్మలు గురించి  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴿وكان الله بكل شيء عليما﴾
వాస్తవంగా అల్లాహ్ యే  ప్రతి విషయపు జ్ఞానం కలవాడు

మరొక చోట ఇలా అంటున్నాడు.

﴿وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين

మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి ఉంది

అనగా ప్రళయం వరకు జరగబోయేటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం అల్లాహ్ వద్ద ఉందని, ఆయన దానిని ముందుగానే లిఖితపూర్వకమైన గ్రంథంలో రాసి ఉంచాడని విశ్వాసం ఉంచడం. మరియు ఈ విషయాన్ని ఆయన భూమాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల మునుపే లిఖించి ఉంచాడు దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

﴿قل لن يصيبنا إلا ما كتب الله لنا﴾
వారితో ఇలా అను: “అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు

ఒకచోట ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

﴿ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب من قبل أن نبرأها﴾
భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు “భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల మునుపే సృష్టి రాశుల యొక్క విధి వ్రాతను లిఖించి ఉంచాడు“. (ముస్లిం-2653)

మరియు అదేవిధంగా ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఇలా తెలియజేశారు: “అన్నిటికంటే ముందు అల్లాహ్ కలమును సృష్టించాడు మరియు దానికి రాయమని ఆజ్ఞాపించాడు. అది ఇలా అన్నది ‘ఓ నా ప్రభువా ఏమి వ్రాయను?’ అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అన్నాడు: “ప్రళయం సంభవించేంతవరకు జరిగేటువంటి ప్రతి దాని గురించి (విధివ్రాత) రాయి”. ఆ తర్వాత ఉబాదా (రదియల్లాహు అన్హు) తన కుమారుడితో ఇలా అన్నాడు: ఓ నా కుమారుడా! నిశ్చయంగా నేను ప్రవక్త గారి నోటి ద్వారా విన్నాను – “ఏ వ్యక్తి అయితే ఈ నమ్మకంతో కాకుండా మరో నమ్మకం పై మరణిస్తే వారు వాడు నాలోని వాడు కాదు”. (అబూ దావూద్ 4700, తిర్మీజీ 3319)

అనగా ఈ విశ్వములో ఏదైతే జరుగుతుందో అంత అల్లాహ్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని నమ్మడం. అది కర్మలకు సంబంధించిన లేక చావు బ్రతుకులకు సంబంధించింది అయినా లేక సృష్టి ప్రక్రియకు సంబంధించిన లేక సృష్టి రాశుల ఆచరణకు సంబంధించింది అయినా. ఉదాహరణకు రావడం, పోవడం, ఏదైనా పని చేయడం, విధేయత, అవిధేయత ఇవే కాదు ఇంకా దాసులకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు వాటిని లెక్కించడం అసంభవం. అవన్నీ కూడా విధి వ్రాతకు సంబంధించినవే.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

﴿‏وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَـاء وَيَخْتَارُ﴾‏
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు.

మరొకచోట ఇలా అంటున్నాడు.

﴿‏وَيَفْعَلُ اللَّهُ مَا يَشَاء
మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు.

మరియు అల్లాహ్ జీవరాసులు పనుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు

﴿‏وَلَوْ شَاء اللَّه لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَاتَلُوكُمْ‏﴾
మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు.

మరోకచోట ఇలా అంటున్నాడు.

﴿‏وَلَوْ شَاء رَبُّكَ مَا فَعَلُوهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ‏﴾
మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు.

మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

﴿ولو شاء الله ما أشركوا﴾
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు.

దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క ఇష్టం లేకుండా ఏ పని జరగదు. అది ఏదైనా సరే, దేనికి సంబంధించింది అయినా సరే, పనులకు సంబంధించింది అయినా లేక జనులకు సంబంధించింది అయినా. ఎందుకంటే ఈ సృష్టి యొక్క సర్వ అధికారము ఆయన చేతుల్లోనే ఉంది, కనుక ఆయన తలిచిందే అవుతుంది.

అనగా సమస్త జీవులన్నిటిని వాటి గుణాలతో వాటి లక్షణాలతో అల్లాహ్ ఏ సృష్టించాడని విశ్వసించడం. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

﴿‏اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ‏﴾‏
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త.

మరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

﴿‏وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا‏﴾
మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.

ఓ అల్లాహ్ దాసులారా! విధి వ్రాత కు సంభందించిన నాలుగు అంశాలు తెలియచేయడం జరిగింది. ఎవరైతే వీటిని అర్థం చేసుకొని ఆచరిస్తారో వారే విధివ్రాత పై విశ్వాసం తెచ్చిన వారవుతారు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ పట్ల దైవ భీతి కలిగి ఉండండి. మరియు తెలుసుకోండి విధి వ్రాత మూడు రకాలు.

మొదటిది: అల్లాహ్ ఈ భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాల ముందే జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని లిఖించి ఉంచాడు. అల్లాహ్ మొట్టమొదటిగా కలమును సృష్టించాడు. దానితో ప్రళయం వరకు సంభవించే ప్రతి విషయం గురించి వ్రాయమని ఆజ్ఞాపించాడు.

రెండవది: జీవిత కాలనికి  సంబంధించిన విధివ్రాత. ఎప్పుడైతే తల్లి గర్భాశయములో అండము ఏర్పడుతోందో అప్పటినుంచి దానికి సంబంధించి విధివ్రాతను వ్రాయడం జరుగుతుంది. అనగా పుట్టేది అబ్బాయి లేక అమ్మాయా, వారి జీవిత కాలం ఎంత, వారి ఆచరణ, వారి ఉపాధి గురించి. ఈ విధంగా ప్రతి దాని గురించి వ్రాయబడుతుంది. అదే విధంగా వారికి ఈ ప్రపంచిక జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విషయం గురించి లిఖించబడుతుంది.

అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారు ఇలా తెలియజేశారు – మీలో ప్రతి ఒక్కరి పుట్టుక తల్లి గర్భం  నుండి అవుతుంది. అయితే అది నలబై రోజుల వరకు ఇంద్రియ బిందువు గా ఉంటుంది.  ఆతరువాత అది  అంతే సమయం వరకు రక్తపు ముద్దగా మారుతుంది. ఆ తర్వాత అది అదే సమయం లో మాంసపు ముద్దగా  ఉంటుంది. ఆ తరువాత అల్లాహ్ ఒక దైవ దూత ను పంపుతాడు మరియు నాలుగు విషయాల ఆజ్ఞ ఇస్తాడు. ఇలా అంటాడు – అతని  ఆచరణ , ఉపాది , జీవితకాలం గురించి వ్రాయి. మరియు అతను సద్వర్తునుడా లేక దుర్వర్తునుడా అనేది కూడా వ్రాయి. ఆ తారువాత అందులో ఆత్మ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. (బుఖారి 3208,ముస్లిం 2643)

3. ప్రతి సంవత్సరం యొక్క విధివ్రాత: ప్రతి సంవత్సరం రంజాన్ యొక్క చివరి దశలో లైలతుల్ ఖద్ర్ రాత్రిలో  లిఖించబడుతుంది. ఆ రాత్రిలో  సంవత్సరానికి సంబంధించిన విధి నిర్ణయించబడుతుంది. దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.

﴿إنا أنزلناه في ليلة مباركة إنا كنا منذرين * فيها يفرق كل أمر حكيم * أمراً من عندنا إنا كنا مرسِلين﴾

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది; మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా మేము (సందేశహారులను) పంపుతూవచ్చాము.

షేక్ అబ్దుర్రహ్మాన్ బిన్ నాసిర్ సాది (రహిమహుల్లాహ్) గారు ఈ వాక్యం యొక్క వివరణలో ఈ విధంగా తెలియజేశారు: విధికి సంబంధించినటువంటి ప్రతి ఆజ్ఞ చట్టబద్ధంగా ఆ రోజున అల్లాహ్ తరపున నిర్ణయించడం జరుగుతుంది. మరియు ఈ విధిని వ్రాసి ఉంచడం జరుగుతుంది కనుక ఇది కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి విషయం లాంటిదే. ఈ రాత్రిలో కూడా అల్లాహ్ తఆల సమస్త సృష్టి జీవుల యొక్క విధిని వారి యొక్క జీవితాల గురించి వారి ఉపాధి గురించి వారి ఆచరణ గురించి ఇలా ప్రతి విషయం గురించి లిఖించి ఉంచుతాడు.

ఓ అల్లాహ్ దాసులారా! మీరు తెలుసుకోండి అల్లాహ్ మీపై కరుణించు గాక!. విధివ్రాతపై విశ్వాసం తీసుకురావడం అంటే మనిషి అతని యొక్క చర్యలలో (అతను చేసే మంచి పనులలో లేక చెడు పనులలో) అతనిని బలవంతానికి గురిచేయడం కాదు. అల్లాహ్ మనిషికి ఆలోచించే మేధస్సును ఇచ్చాడు. అతని చిత్తానికి అతన్ని వదిలిపెట్టాడు. మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించాడు. అనగా వీటి ద్వారా మానవుడు సన్మార్గం ఏదో అప మార్గం ఏదో తెలుసుకొని నడుచుకోవాలి. అల్లాహ్ మనిషికి మంచిని చేయమని, బంధుత్వాలను కలుపుకోమని, మంచి నడవడిక అలవర్చుకోమని ఆజ్ఞాపించాడు. అశ్లీల కార్యాల నుంచి దూరంగా ఉండమని, చెడు పనులకు దూరంగా ఉండమని దౌర్జన్యం చేయకూడదని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రతి విషయాన్ని కూడా దాసుని చిత్తానికి వదిలేసాడు. అతను కోరుకుంటే కృతజ్ఞతా భావంతో మసులుకొని విధేయత చూపుతూ దైవ ధర్మంపై స్థిరంగా ఉంటాడు. లేక తన ఇష్ట ప్రకారం అపమార్గాన్ని ఎంచుకొని అవిధేయతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆతర్వాత అల్లాహ్ ప్రళయ దినం రోజున అతని జీవితానికి సంబంధించినటువంటి లెక్కను తీసుకుంటాడు. అతని యొక్క ఆచరణ బాగుంటే అతని ప్రతిఫలం బాగుంటుంది. ఒకవేళ అతని ఆచరణ చెడుగా ఉంటే అతనికి దుష్ఫలితమే‌ లభిస్తుంది.

అల్లాహ్ తఆలా దాసుల యొక్క ఇష్టాన్ని గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.  

﴿فَمَن شَاء اتَّخَذَ إِلَى رَبِّهِ مَآبًا﴾
కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!

ఒకచోట ఇలా అంటున్నాడు

﴿فمن شاء فليؤمن ومن شاء فليكفر﴾
కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!”

మరియు ఇలా తెలియజేస్తున్నాడు

﴿‏فَأتُواْ حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ
కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక ! అల్లాహ్ మీకు ఒక పెద్ద సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్ నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లిం లకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము. మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .

ఓ అల్లాహ్! మమ్ములను క్షమించు మరియు మా కంటే ముందు గతించిన మా విశ్వాస సోదరుల పాపాలను కూడా క్షమించు. మరియు విశ్వాసుల గురించి మా హృదయాలలో కుళ్లు, కుతంత్రాలు మరియు ద్వేషాన్ని నింపకు. నిశ్చయంగా నీవు కరుణించే వాడవు మరియు క్షమించే వాడవు.    

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

తఖ్దీర్ (విధి వ్రాత): (మెయిన్ పేజీ )
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/L5UicLobEHE [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో విశ్వాసం యొక్క మూడవ ముఖ్యమైన అంశం గురించి వివరిస్తారు: దైవ గ్రంథాలను విశ్వసించడం. ప్రారంభంలో, అతను అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. దైవ గ్రంథాలు అంటే ఏమిటి, అవి ఎందుకు అవతరింపబడ్డాయి, మరియు ఖురాన్ ప్రకారం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనే విషయాలను చర్చిస్తారు. ఈ గ్రంథాలలో ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క సహీఫాలు, తౌరాత్, జబూర్, ఇంజీల్ మరియు ఖురాన్ ఉన్నాయి. ఒక ముస్లింగా ఖురాన్‌ను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రత్యేకతలను కూడా వివరిస్తారు. చివరిగా, పూర్వ గ్రంథాల పట్ల ఒక ముస్లిం యొక్క వైఖరి ఎలా ఉండాలి, అంటే వాటి అసలు రూపాన్ని విశ్వసించడం, కానీ కాలక్రమేణా వాటిలో జరిగిన మార్పులను గుర్తించడం గురించి వివరిస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, ఈమాన్ ముఖ్యాంశాలలోని మూడవ ముఖ్యాంశం దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

దైవ గ్రంథాలు అంటే ఏమిటి?
మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి?
ఖురాన్ లో ఎన్ని గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉంది?
మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి?
అలాగే పూర్వపు అవతరింపబడిన గ్రంథాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?

ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ మనము ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.

ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవ ప్రవక్త జిబ్రయీల్ (అలైహిస్సలాం) వారు మానవ ఆకారంలో వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతూ విశ్వాసం అంటే ఏమిటి ఓ దైవ ప్రవక్త అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటం ఈమాన్ అంటారు అని ఆరు విషయాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాతలను విశ్వసించటం. మొత్తం ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని విశ్వాసం ఈమాన్ అంటారు అని ప్రవక్త వారు తెలియజేశారు కదండీ. అందులో మూడవ విషయం, మూడవ విషయం దైవ గ్రంథాల పట్ల విశ్వాసం అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ దైవ గ్రంథాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

అసలు ఈ దైవ గ్రంథాలు అని వేటిని అంటారు అంటే, చూడండి మానవులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలం మీద పంపించిన తర్వాత మానవులు వారి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చిత్తం ప్రకారము జీవించాలి అనేది మానవుల మీద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక బాధ్యత నిర్ణయించాడు. మరి మానవులకు ఏ పని అల్లాహ్ చిత్తం ప్రకారము జరుగుతుంది మరియు ఏ పని అల్లాహ్ చిత్తానికి విరుద్ధంగా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తేనే కదా వారు తెలుసుకుంటారు. లేదంటే మానవులు చేసే ఏ పని అల్లాహ్ కు నచ్చుతున్నది ఏ పని అల్లాహ్ కు నచ్చటం లేదు అనేది వారికి ఎలా తెలుస్తుందండి? అలా తెలియజేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలంలో నివసిస్తున్న మానవుల్లోనే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో వారి వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు.

ఆ వాక్యాలలో మానవులు ఏ పనులు చేస్తే పుణ్యం అనిపించుకుంటుంది, ఏ పనులు చేస్తే పాపం అనిపించుకుంటుంది, వారు ఏ విధంగా జీవించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు, ఏ విధంగా చేస్తే వారు పాపాలకు, అక్రమాలకు పాల్పడి అశాంతికి గురయ్యి అల్లకల్లోలానికి గురైపోతారు, తర్వాత ఏ పనిలో వారికి పుణ్యము దక్కుతుంది, ఏ పనిలో వారికి పాపము దక్కుతుంది అనే విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యాలలో ప్రవక్తల వద్దకు పంపించగా, ప్రవక్తలు ఆ దైవ వాక్యాలన్నింటినీ వారి వారి యుగాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో ఆ సౌకర్యాల ప్రకారము వాటన్నింటినీ ఒకచోట భద్రపరిచారు. అది ఆకులు కావచ్చు, చర్మము కావచ్చు, వేరే విషయాలైనా కావచ్చు. అలా భద్రపరచబడిన ఆ దైవ వాక్యాలన్నింటినీ కలిపి దైవ గ్రంథము అంటారు. దైవ గ్రంథంలో మొత్తం దైవ నియమాలు ఉంటాయి, అల్లాహ్ వాక్యాలు ఉంటాయి, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది సత్కార్యము అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులో వివరంగా విడమరిచి తెలియజేసి ఉంటాడు.

అయితే మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీదికి అవతరించబడ్డాయి అంటే వాటి సరైన సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. మనకు అటు ఖురాన్ లో గాని, అటు ప్రామాణికమైన హదీసు గ్రంథాలలో కానీ ఎక్కడా కూడా ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి అనేది పూర్తి దైవ గ్రంథాల సంఖ్యా వివరాలు తెలుపబడలేదు.

సరే మరి ఖురాన్ గ్రంథంలో ఎన్ని దైవ గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉన్నది అని మనం చూచినట్లయితే, ఖురాన్ లో ఇంచుమించు ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉంది.

ఒకటి, సుహుఫు ఇబ్రాహీం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన కొన్ని సహీఫాలు, గ్రంథాలు. వాటిని సుహుఫు ఇబ్రాహీం అంటారు. రెండవది తౌరాత్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. మూడవది, జబూర్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. నాలుగవది ఇంజీల్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. ఇక ఐదవ గ్రంథము, ఖురాన్ గ్రంథము. ఈ ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి ఉన్నాడు. ఖురాన్ లో ఈ ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉన్నది.

ఇక హదీసులలో మనం చూచినట్లయితే, ప్రవక్త షీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు మనకు తెలియజేసి ఉన్నారు.

మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కదండీ. మరి మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాలి. ఖురాన్ గ్రంథాన్ని అనుసరించటం మనందరి బాధ్యత.

మరి ఈ ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని ప్రత్యేకతలు దృష్టిలో ఉంచుకోండి. ఖురాన్ గ్రంథము చివరి ఆకాశ గ్రంథము, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడింది. ఖురాన్ గ్రంథము అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అది అవతరింపజేయబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కల్పితాలకు గురి కాకుండగా సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా అది సురక్షితంగానే ఉంటుంది. ఖురాన్ గ్రంథము చదివి, అర్థం చేసుకుని ఆచరించటము ప్రతీ విశ్వాసి యొక్క కర్తవ్యము.

ఖురాన్ అల్లాహ్ వాక్యము కాబట్టి దానిని ప్రేమాభిమానాలతో మనము చదవటంతో పాటు ఎంతో గౌరవించాలి మరియు ఆచరించాలి. నేడు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి భాషలన్నింటిలో కూడా ఖురాన్ యొక్క అనువాదము చేయబడి ఉన్నది కాబట్టి విశ్వాసి, మానవుడు ప్రపంచపు ఏ మూలన నివసించిన వాడైనా సరే అతను అతనికి ఏ భాష వస్తుందో ఆ భాషలోనే ఖురాన్ గ్రంథాన్ని చదివి అల్లాహ్ ఏమి తెలియజేస్తున్నాడు మానవులకి అనేది తెలుసుకొని అల్లాహ్ ను విశ్వసించి అల్లాహ్ తెలియజేసిన నియమాల అనుసారంగా జీవించుకోవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది.

ఇక చివర్లో ఖురాన్ కంటే పూర్వము దైవ గ్రంథాలు అవతరించబడ్డాయి కదా, ఆ దైవ గ్రంథాల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ఖురాన్ కంటే ముందు ప్రవక్తలకు దైవ గ్రంథాలు ఇవ్వబడ్డాయి, ఇది వాస్తవం. ఈసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, దావూద్ (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, మూసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది కదా. మరి ఆ గ్రంథాల పట్ల మన వైఖరి ఏమిటంటే అవన్నీ దైవ గ్రంథాలు అని మనం విశ్వసించాలి. అలాగే అవి ప్రవక్తల వద్ద పంపబడిన రోజుల్లో సురక్షితంగానే ఉండేవి. వాటిలో మొత్తము దైవ వాక్యాలే ఉండేవి. కానీ ఆ ప్రవక్తలు మరణించిన తర్వాత ఆ ప్రవక్తల అనుచరులు ఆ ఆ గ్రంథాలలో కల్పితాలు చేసేశారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి, అవి సురక్షితమైన గ్రంథాలు కావు, సురక్షితమైన రూపంలో నేడు ప్రపంచంలో ఎక్కడా నిలబడి లేవు అని మనం తెలుసుకోవాలి. అలాగే విశ్వసించాలి కూడా.

మనం చూచినట్లయితే నేడు తౌరాత్ గ్రంథము అని ఒక గ్రంథం కనిపిస్తుంది. నేడు మనం చూస్తున్న ఆ తౌరాత్ గ్రంథము ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వారికి ఇవ్వబడిన అలనాటి కాలంలో ఉన్న వాక్యాలతో నిండిన గ్రంథము కాదు. అది నేడు మన దగ్గరికి చేరే సరికి చాలా కల్పితాలకు గురైపోయి ఉంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి. అలాగే ఇంజీల్ గ్రంథము అని ఒక గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఆ రోజుల్లో ఇవ్వబడిన ఆ ఇంజీల్ గ్రంథము అది అలాగే నేడు భద్రంగా లేదు. మన సమయానికి వచ్చేసరికి అవి చాలా కల్పితాలకు గురై మన దగ్గరికి చేరింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఒక్క ఖురాన్ గ్రంథము మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలము నుండి నేటి వరకు ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా సురక్షితంగా ఉంది, సురక్షితంగా ఉంటుంది.

ఇక పూర్వపు గ్రంథాలలో కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అవి మూడు రకాల విషయాలు. ఒక రకమైన విషయాలు ఏమిటంటే అవి సత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ధ్రువీకరించి ఉన్నారు. ఆ విషయాలను మనం అవి సత్యాలు అని ధ్రువీకరించాలి. కొన్ని విషయాలు ఎలాంటివి అంటే అవి అసత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారు. అవన్నీ అసత్యాలు అని మనము వాటిని ఖండించాలి. మరి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే వాటి గురించి అటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని మనకు వాటి గురించి ఏమీ తెలియజేయలేదు. అలాంటి విషయాల గురించి మనం కూడా నిశ్శబ్దం పాటించాలి. అవి సత్యము అని ధ్రువీకరించకూడదు, అసత్యాలు అని ఖండించనూ కూడదు. ఎందుకంటే వాటి గురించి సరైన సమాచారము మనకు ఇవ్వబడలేదు కాబట్టి మనము వాటిని ధ్రువీకరించము అలాగే ఖండించము. నిశ్శబ్దం పాటిస్తాము. ఇది ఒక విశ్వాసి పూర్వపు గ్రంథాల పట్ల ఉండవలసిన వైఖరి.

ఇక నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ దైవ గ్రంథాల పట్ల సరైన అవగాహన కలిగి మరియు దైవ గ్రంథాలను ఏ విధంగా అయితే విశ్వసించాలని తెలుపబడిందో ఆ విధంగా విశ్వసించి నడుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ):
https://teluguislam.net/belief-in-books/

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు [వీడియో & టెక్స్ట్]

https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .

వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:

  • అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
  • అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
  • అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
  • హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
  • శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం 
  • ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా 
  • ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
  • దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
  • తవక్కుల్  (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి 
  • కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం  
  • మొక్కుబడులు

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.

అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.

ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.

అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?

మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?

అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.

ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?

إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.

అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,

الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,

سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.

అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.

అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.

ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.

ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.

ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?

అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.

మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.

అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.

అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.

ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

    “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
    https://www.youtube.com/watch?v=yZS2dByYpu8
    Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

    أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
    (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)

    సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.

    రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్‌లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.

    ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్‌లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్‌లో వెళ్లి వాటిని పొందవచ్చు.

    ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).

    ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్‌లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్‌లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్‌లోని తషహ్హుద్‌లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్‌లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

    హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.

    అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.

    మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్‌ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.

    రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.

    ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.

    మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.

    నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.

    ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్‌లో, హదీస్‌లో ఎన్నో దలీల్‌లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్‌ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.

    అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్‌లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.

    మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్‌కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్‌గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్‌కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.

    అబ్ద్. దీని గురించి ఖురాన్‌లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్‌లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.

    ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

    ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్‌లో కూడా, సూరతుల్ ఆరాఫ్‌లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.

    ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్‌లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.

    ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్‌తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్‌తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్‌తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్‌నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.

    మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్‌లను, వేరే కొందరు పీర్‌లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.

    విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్‌ను ఆరాధించారో అలా అల్లాహ్‌ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్‌లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్‌కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.

    అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

    పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
    విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

    ఇతరములు: