అల్లాహ్ ని కలుసుకోగోరిన వ్యక్తిని అల్లాహ్ కూడా కలుసుకోగోరుతాడు

1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు. అలాగే ఎవరు అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడడో  అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడడు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 41 వ అధ్యాయం – మన్ అహబ్బలిఖా అల్లాహి అహబ్బల్లాహ లిఖాఅహు]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 5 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా అది సామూహిక నమాజే

353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – అల్ మవాకియతుస్సలాత్, 29 వ అధ్యాయం – మన్ అద్రక మినస్సలాతి రక అతన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 30 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కర్మల బలంతో కాదు అల్లాహ్ దయతోనే స్వర్గాన్ని పొందగలరు

1793. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధిస్తూ

” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా! మీరు కూడానా?” అని అడిగారు. “ఔను, నేను కూడా కర్మల బలంతో మోక్షం పొందలేను. మోక్షం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది, దేవుడు నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలి. కనుక మీరు సరయిన రుజుమార్గంలో నడవండి (ముక్తి విషయాన్ని దైవానుగ్రహం పై వదలి పెట్టండి)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ – 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 18 వ అధ్యాయం – అల్ ఖస్ది వల్ ముదావమతి అలల్ అమల్]

కపట విశ్వాసుల ప్రకరణం – 17 వ అధ్యాయం – కేవలం ఆచరణ వల్ల ఎవరూ స్వర్గానికి పోలేరు, దైవానుగ్రహం ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి

460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.

[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 37 వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

మనిషి వృద్ధుడైపోతూ ఉంటే అతనిలో పెరిగే రెండు కోరికలు

621. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోధించారు:-

మానవుడు ఒకవైపు వృద్ధుడైపోతూ ఉంటే, మరోవైపు అతనిలో రెండు విషయాలు అధికమవుతూ ఉంటాయి.
ఒకటి : ధన వ్యామోహం, రెండు: దీర్ఘాయుష్షు పట్ల కోరిక.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 5 వ అధ్యాయం – మన్ బలగ సిత్తీన సనతా…]

జకాత్ ప్రకరణం : 38 వ అధ్యాయం – ప్రాపంచిక వ్యామోహం గర్హనీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఇస్లాం ప్రకారం అన్నిటికన్నా శ్రేష్ఠమైన పనులు (ఆచరణలు)

24. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ఇస్లాం కు సంబంధించిన ఆచరణలలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది ?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు బీదసాదలకు అన్నంపెట్టు . (అలాగే)  పరిచయమున్నా లేకపోయినా ప్రతివ్యక్తి కీ సలాం చెయ్యి. ఇవే అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణలు” అని బోధించారు.

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 6 వ అధ్యాయం – తాముల్ తఆమ్ మినల్ ఇస్లాం]

విశ్వాస ప్రకరణం : 14 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు

26. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు :

1. అందరికంటే ఎక్కువ దేవుడ్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అభిమానించడం,
2. ఎవరిని అభిమానించినా కేవలం దైవప్రసన్నత కోసం అభిమానించడం,
3. (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో  అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం.

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 9 వ అధ్యాయం – హలావతిల్ ఈమాన్]

విశ్వాస ప్రకరణం : 15 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఏక ధైవారాధకుల నరక విమోచనకై సిఫారసు

116. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :

 (పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయటకు తీయండి” అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో (చాలామంది) మానవులు నరకం నుండి బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షనది లేక ‘జీవనది’ లో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్,15  వ అధ్యాయం – తఫాజులి అహ్ లిల్ ఈమాని ఫిల్ ఆమాల్]

విశ్వాస ప్రకరణం : 80 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth