“ఐ లవ్ ముహమ్మద్ ﷺ” మనతో ఏమి కోరుతుంది?
ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది?
https://youtu.be/HVwTB7FS8Dw [46 నిముషాలు]
షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జమఈ హఫిజహుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తారు. కేవలం బ్యానర్లు, సోషల్ మీడియా స్టేటస్‌ల ద్వారా ప్రేమను ప్రదర్శించడం కాకుండా, ఆ ప్రేమ మన నుండి ఏమి ఆశిస్తుందో ఆయన విశ్లేషించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన నిదర్శనం, ఆయన తెచ్చిన ధర్మాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం (ఇతా’అత్), ఆయనపై దరూద్ పఠించడం, ఆయన జీవిత చరిత్ర (సీరత్)ను తెలుసుకోవడం, ఆయన ప్రవర్తనను మన జీవితంలో అలవర్చుకోవడం, ఆయన ఇష్టపడిన వాటిని ఇష్టపడటం మరియు ఆయన కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం అని స్పష్టం చేశారు. హంజా (రదియల్లాహు అన్హు)), అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) వంటి సహాబాల ఉదాహరణలతో నిజమైన విధేయతను వివరిస్తూ, కేకులు కోయడం, ర్యాలీలు చేయడం వంటివి ప్రవక్త ప్రేమకు నిదర్శనం కాదని, అవి ధర్మంలో లేని పనులని ఆయన హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
నేటి కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఇదివరకే మీరు ఈనాటి ప్రసంగ అంశాన్ని విని ఉన్నారు. ఈరోజు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? అనే అంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
మనమంతా సోషల్ మీడియాలో, అంతర్జాల మాధ్యమాలలో గత కొద్ది రోజులుగా ఒక హాట్ టాపిక్ చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రతిచోట ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అని బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే స్టేటస్‌లలో, ప్రొఫైల్ పిక్చర్లలో కూడా ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అనే ఇమేజ్‌లు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల ర్యాలీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలాచోట్ల కొన్ని ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి.
అయితే మిత్రులారా, ఒక్క విషయం మాత్రము ప్రపంచానికి అర్థమయింది. అదేమిటంటే, ముఖ్యంగా మనము ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ దేశ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చాలా ప్రేమ, అభిమానం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు ఉన్న ప్రేమ, అభిమానం ఏమి కోరుతూ ఉంది? ప్రవక్త వారి ప్రేమ మాకు ఏమి కోరుతూ ఉంది, ఏమి చేయమని చెబుతూ ఉంది? మనము ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారు, ప్రవక్త వారి ప్రేమ మాతో ఏమి కోరుతూ ఉంది, మేము ఏమి చేయాలి వాస్తవానికి? కానీ చేయాల్సిన పనులు చేయకుండా పక్కన పెట్టేసి మేము ఏమి చేస్తున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకుంటారన్న ఉద్దేశము, అలాగే సరైన విధంగా ప్రవక్త వారిని అభిమానిస్తారు అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఎన్నుకోబడింది. ఎవరినీ ఉద్దేశించటమో లేదా ఎవరినీ కించపరచటమో లేదంటే ఎవరి మనోభావాలను మనము బాధపరచటము గాని, గాయపరచటము గాని ఉద్దేశము కానేకాదు. ఇది నేను ముందుగానే వ్యక్తపరుస్తూ ఉన్నాను, తెలియజేసేస్తూ ఉన్నాను.
చూడండి, మనమంతా పండితుల నోట అనేక సందర్భాలలో, అనేక ప్రసంగాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం అని విన్నాం. అవునా కాదా? ఆ ప్రకారంగా పండితులు మనకు ఖురాన్‌లోని వాక్యాలు వినిపించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు వినిపించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా 24 వ వాక్యంలో తెలియజేశాడు, మీరు ప్రవక్త వారి కంటే ఎక్కువగా మీ వర్తకాన్ని లేదంటే మీ ఆస్తిపాస్తుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇలాంటి వారిని మీరు అభిమానించేటట్లయితే మీరు అల్లాహ్ శిక్ష కొరకు ఎదురు చూడండి అని అల్లాహ్ హెచ్చరించి ఉన్నాడు. అంటే మనము ప్రవక్త వారినే ఎక్కువగా అభిమానించాలి కానీ ప్రాపంచిక విషయాలు లేదంటే ఇతర వ్యక్తులను ఎక్కువగా అభిమానించరాదు, అందరికంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆజ్ఞ అని ఆ వాక్యం ద్వారా మనకు పండితులు వివరించారు.
అలాగే ప్రవక్త వారి ఒక హదీస్, ప్రవక్త వారి ఉల్లేఖనం, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త వారి చేయి పట్టుకొని ఉండి ప్రవక్త పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ దైవ ప్రవక్త, నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే నా ప్రాణము నాకు మీకంటే ప్రియమైనది అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారు ఆయనకి? ఓ ఉమర్, లేదు లేదు, ఏ వ్యక్తి కూడాను ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా చివరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తేనే సంపూర్ణ విశ్వాసి అవగలుగుతాడు లేదంటే అతని విశ్వాసం అసంపూర్ణం అవుతుంది జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు వారిని వారు సంస్కరించుకున్నారు. ప్రవక్త వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించడం ప్రారంభించేశారు. ఆ విషయాన్ని మళ్ళీ ప్రవక్త వారితో తెలియజేశారు. ఓ ప్రవక్త, ఇప్పుడు నేను నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఓ ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అన్నారు.
ఇలాంటి సంఘటనలు తెలియజేసి ధార్మిక పండితులు మనకు ఏమని చెప్పారంటే, మనము ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, మన భార్యాబిడ్డల కంటే ఎక్కువగా, బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రవక్త వారిని ప్రేమించాలి, అభిమానించాలి అని తెలియజేశారు. అల్హమ్దులిల్లాహ్ ఆ విషయాలను మనం బాగా అర్థం చేసుకున్నాము. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈ అభిమానం మనకు కొన్ని శుభవార్తలు కూడా ఇస్తూ ఉంది, మనతో కొన్ని విషయాలు కూడా కోరుతూ ఉంది.
ప్రవక్త వారి అభిమానం మనకు ఇస్తున్న శుభవార్త ఏమిటి? మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనసారా ప్రేమిస్తే, అభిమానిస్తే మనము స్వర్గానికి చేరుకుంటాము అని శుభవార్త ఇస్తూ ఉంది. దానికి ఆధారము, ఒక పల్లెటూరి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది? అంటే ఖియామత్, యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నువ్వు యుగాంతం గురించి ప్రశ్నిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. అయితే దాని కొరకు నువ్వు ఏమి సిద్ధము చేశావు? అని అడిగారు. యుగాంతం గురించి అడుగుతున్నావ్, పరలోకం గురించి, ప్రళయం గురించి అడుగుతున్నావ్ బాగానే ఉంది. అయితే ఆ ప్రళయం కొరకు, ఆ యుగాంతం కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు ఏమి సిద్ధం చేసుకున్నావ్, అది చెప్పు అన్నారు. దానికి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎక్కువగా చెప్పుకోదగ్గ నమాజులు, చెప్పుకోదగ్గ దానధర్మాలు ఏమి చేసుకోలేదు కానీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల హృదయము నిండా అభిమానము, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పాడు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి శుభవార్త ఇచ్చారు. ఏమని?
قَالَ أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ
(ఖాల అంత మ’అ మన్ అహబబ్త)
“నీవు ప్రేమించిన వారితోనే ఉంటావు.” అన్నారు.
అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండే స్థలం స్వర్గం. ప్రవక్త వారి అభిమానులు కూడా ఇన్షాఅల్లాహ్ చేరుకునే స్థలం స్వర్గం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్ హాన వ త’లా మనందరికీ ప్రవక్త వారి అభిమానంతో పాటు ప్రవక్త వారితో పాటు స్వర్గంలో చేరుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.
అయితే మిత్రులారా, ప్రవక్త వారి అభిమానము మనకు స్వర్గానికి చేర్చుతుంది అన్న శుభవార్త ఇస్తూ ఉంది. ఆ అభిమానంతోనే, ఆ ఆశతోనే మనము ప్రవక్త వారిని ప్రేమిస్తున్నాము, అభిమానిస్తూ ఉన్నాం. మన విశ్వాసం కోసం, స్వర్గం కోసం, అల్లాహ్ ను ప్రవక్త వారిని నమ్ముతూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, అభిమానిస్తున్నాం, ఓకే బాగానే ఉంది. అయితే మరి ఆ ప్రేమ ఏమి కోరుతుందో అది తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్రవక్త వారి పేరు మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, బ్యానర్లు పెట్టుకుంటూ ఉన్నారో, స్టేటస్లు పెడుతూ ఉన్నారో, ప్రొఫైల్ పిక్చర్లు పెడుతూ ఉన్నారో, వారిలో ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఎన్ని విషయాలు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విషయాలు మనము జాగ్రత్తగా విని ఇన్షాఅల్లాహ్ ఆత్మ పరిశీలన చేసుకుందాం.
1. ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని విశ్వసించడం
చూడండి, ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ప్రథమ విషయం ఏమిటంటే, ఏ ధర్మాన్ని, ఏ శాసనాన్ని అయితే ప్రవక్త వారు తీసుకుని వచ్చారో ఆ ధర్మాన్ని, ఆ శాసనాన్ని మనమంతా మనసారా స్వీకరించాలి, ఆమోదించాలి, విశ్వసించాలి, నమ్మాలి.
దీనికి ఒక రెండు ఉదాహరణలు మనము ఇన్షాఅల్లాహ్ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాసనము తీసుకుని వచ్చి ప్రజల ముందర వినిపించినప్పుడు, ముఖ్యంగా మక్కా వారిలో కొంతమంది ఇస్లాం స్వీకరించారు. అధిక శాతం ప్రజలు ప్రవక్త వారి మీద తిరగబడ్డారు.
ఇలాంటి సందర్భాలలో ఒకసారి ఏమైందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు. అంతలోనే ముస్లింల బద్ధ శత్రువు, ప్రవక్త వారి బద్ధ శత్రువు అయిన అబూ జహల్ చూసుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఉన్నారు, నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఎంతగా అతనికి మండింది అంటే, అతను ప్రవక్త వారి మీద నోరు పారేసుకున్నారు, లేనిపోని మాటలు ప్రవక్త వారి గురించి మాట్లాడాడు. కానీ ప్రవక్త వారు ఎలాంటి ఏకాగ్రతను కోల్పోకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు.
అతనికి సైతాను ఎంతగా రెచ్చగొట్టాడంటే, నోటికి పని చెప్పినవాడు అక్కడికి సంతృప్తి పడలేదు. తర్వాత పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరి, చేయికి పని చెప్పాడు. ముందు నోటికి పని చెప్పాడు, కానీ మనసు కుదుట పడల, మనశ్శాంతి దొరకలా అతనికి. తర్వాత చేయికి పని చెప్పాడు, రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరాడు. ప్రవక్త వారికి గాయమయింది. ఆయన కారుణ్యమూర్తి కదా, ప్రజల కోసం కరుణగా పంపించబడ్డారు కదా, ఆయన మాటలు భరించారు, బాధను కూడా భరించారు, గాయాన్ని కూడా ఆయన భరించారు.
ఇదంతా ఒక బానిసరాలైన మహిళ చూసుకున్నారు. ఆమె ఏమి చేశారంటే, ప్రవక్త వారి మీద జరుగుతున్న ఆ దౌర్జన్యాన్ని చూసి ఊరుకుండలేక, చక్కగా ప్రవక్త వారి బంధువు అయిన హంజా రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్లారు. హంజా రజియల్లాహు అన్హు వారు ఎవరండీ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన పినతండ్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి దగ్గరకు వెళ్లి, “ఏవండీ, మీ తమ్ముడి కుమారుడు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే, ఈ దుర్మార్గుడు అబూ జహల్ వచ్చి ముందు తిట్టాడు, ఆ తర్వాత మీ తమ్ముడి కుమారుడి మీద చేయి చేసుకుని కొట్టాడండి” అని చెప్పేశారు.
ఆయన ఏమన్నారంటే, “నా తమ్ముడి కుమారుడు ఏం తప్పు చేశాడబ్బా? ఎందుకు అతను ఆ విధంగా ప్రవర్తించాడు?” అని అడిగారు. ఆవిడ ఏమన్నారంటే, “లేదండీ, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఒక్కరే ఒంటరిగా అక్కడ నమాజ్ ఆచరించుకుంటున్నారు అంతే. ఎవరితో ఏమీ మాట్లాడలేదు, ఎవరితో ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేసిన తప్పు, నేరం ఏమీ లేదు. కానీ అనవసరంగా ఆయన మీద నోరు పారేసుకున్నాడు, ఆ తర్వాత కొట్టి గాయపరిచాడు” అని చెప్పగానే, ఆయనలో కుటుంబీకుల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఎంతగా ఉప్పొంగిందంటే, అక్కడి నుంచి విల్లు తీసుకొని చక్కగా అక్కడికి వచ్చేశారు కాబతుల్లాహ్ దగ్గరికి.
ఆ సమయానికి ప్రవక్త వారు అక్కడ నమాజ్ ముగించుకొని వెళ్లిపోయారు ఇంటికి. ప్రవక్త వారు లేరు. కానీ ఈ అబూ జహల్ మాత్రము అక్కడ వేరే వాళ్లతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నాడు. హంజా, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ప్రవక్త వారి పినతండ్రి, చక్కగా అబూ జహల్ దగ్గరికి వెళ్లి విల్లు తీసుకొని తల మీద కొట్టగా గాయమైంది, రక్తం కారింది, కింద పడి విలవిల్లాడాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “నీకు అంతగా పోరాడాలని, కొట్లాడాలని ఉంటే నాతో తలపడురా మూర్ఖుడా! నా తమ్ముని కుమారుడి మీద ఏందిరా నువ్వు చూపించేది నీ మగతనము? నాతో ఉంటే, నీకు అంతగా ఉంటే నాతో తలపడు, నాతో పోరాడు చూద్దాము” అని చెప్పారు. ఆయన బలవంతుడు హంజా రజియల్లాహు అన్హు, అప్పటికీ ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు కానీ మక్కాలోనే బలవంతులలో ఒక బలవంతుడు ఆయన. కాబట్టి అబూ జహల్ కి నూట మాట రాలేదు, గమ్మునుండి పోయాడు.
తర్వాత హంజా రజియల్లాహు అన్హు వారు చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇంటికి వెళ్లి, “బిడ్డా, నువ్వు సంతోషించు, నువ్వు బాధపడవద్దు. నీ మీద చేయి చేసుకున్న వ్యక్తితో నేను ప్రతికారము తీర్చుకున్నాను, నువ్వు సంతోషించు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నగా చిరునవ్వు చిందిస్తూ పినతండ్రితో ఏమన్నారో తెలుసా? “చిన్నాన్నా, మీరు ప్రతికారము తీర్చుకున్నారు అని చెబుతున్నారు, ఆ విషయము నాకు సంతోషం కలిగించదు. నిజంగా మీరు నన్ను సంతోషపరచాలనుకుంటుంటే నేను తీసుకుని వచ్చిన శాసనాన్ని, ధర్మాన్ని మీరు అంగీకరిస్తే, ఆమోదిస్తే, నమ్మితే, విశ్వసిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను చిన్నాన్నా” అన్నారు. అల్లాహు అక్బర్. అప్పటికప్పుడే హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, విశ్వాసిగా మారారు, అల్హమ్దులిల్లాహ్.
అయితే ప్రవక్త వారి పినతండ్రులలోనే మరొక పినతండ్రి ఉన్నారండి. ఆయన పేరు అబూ తాలిబ్. ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండరు. అయితే అబూ తాలిబ్ వారు ఎలా మరణించారో ఒకసారి మనము చూద్దాం. అబూ తాలిబ్ వారు మరణ సమయం వచ్చింది, కొద్దిసేపు తర్వాత ఆయన ప్రాణం పోతుంది అన్నట్టుగా ఉంది. చివరి ఘడియలు అంటాము కదా? ఆ చివరి ఘడియల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి అయిన అబూ తాలిబ్ దగ్గరికి వెళ్లి, “చిన్నాన్నా, ఒక్కసారి మీరు నోటితో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ సాక్ష్య వచనము పలకండి. నేను అల్లాహ్ వద్ద మీ కొరకు సిఫారసు చేస్తాను” అని కోరారు.
అంతలోనే ఈ మక్కా పెద్దలు అనిపించుకునే కొంతమంది అబూ తాలిబ్ వారి సహచరులు వచ్చేశారు. వచ్చేసి ఆ పెద్ద మనుషులు అనిపించుకునే, స్నేహితులు అనిపించుకునే వాళ్ళు ఏమి చేశారంటే, “ఏమండీ, మీరు బ్రతికినంత కాలము తాత ముత్తాతల ధర్మం మీద బ్రతికి, మరణించే సమయాన మీరు తాత ముత్తాతల ధర్మానికి ద్రోహం చేసి వెళ్తారా? ఇది మీకు సమంజసమేనా? ఇది మీకు సరిపోతుందా?” అని రెచ్చగొట్టేశారు. చివరికి ఏమైందంటే, ఆయన “నేను తాత ముత్తాతల ధర్మం మీదనే ఉంటున్నాను” అని చెప్పేసి శ్వాస విడిచారు. అంటే ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని ఆయన అంగీకరించలేదు, విశ్వసించలేదు. సరే. ఆయన మరణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో ఎవరైతే ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారో వారిలో ఒకరు ప్రవక్త వారితో ప్రశ్నించారు. ఏమండీ, మీ చిన్నాన్న అబూ తాలిబ్ వారు మీకు ఇంచుమించు 40 సంవత్సరాలు సేవలు చేశారు, సపోర్ట్‌గా నిలబడ్డారు, మీ కొరకు మక్కా వారి శత్రుత్వాన్ని కొనుక్కున్నారు, మీకు మాత్రము ఆయన సపోర్ట్‌గా నిలబడ్డారు కదా? అంతగా మీకు పోషించిన, మీకు సపోర్ట్ చేసిన మీ చిన్నాన్నకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన స్వర్గవాసా లేదంటే నరకవాససా? అని అడిగారు.
ప్రవక్త వారు ఏమన్నారండి? ఆయన నరకానికే వెళ్తారు. అయితే నరకంలోనే చిన్న శిక్ష ఉంటుంది అన్నారు. అది వేరే విషయం. కానీ ఎక్కడికి వెళ్తారు అన్నారు? ఆయన నరకానికే వెళ్తారు అని చెప్పారు. ఇక్కడ ప్రవక్త వారి ఇద్దరు పినతండ్రులు. ఒకరు హంజా రజియల్లాహు అన్హు వారు, ఒకరు అబూ తాలిబ్ వారు. హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి శాసనాన్ని, ఆయన తీసుకుని వచ్చిన ధర్మాన్ని విశ్వసించారు. అబూ తాలిబ్ వారు ప్రవక్త వారిని ప్రేమించారు, అభిమానించారు, సపోర్ట్‌గా నిలబడ్డారు కానీ ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రము ఆమోదించలేదు, విశ్వసించలేదు. ఏమైందండి ఫలితం? హంజా రజియల్లాహు అన్హు వారేమో స్వర్గవాసి అయ్యారు, అబూ తాలిబ్ వారు మాత్రము నరకానికి చేరుకున్నారు.
దీన్నిబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుకుంటుంది అంటే ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మనసారా మనము స్వీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఒక విషయాన్ని మనము పాటించిన వాళ్ళం అవుతాం, లేదంటే నష్టపోతాం. ఇప్పుడు చెప్తారు మీరు చాలామంది. “ఆ, మేమంతా ముస్లింలమే కదండీ, మేమంతా కలిమా చదివిన వాళ్ళమే కదండీ, ఈరోజు ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పుకుంటున్న వాళ్ళము, మరి మాకు ఇవన్నీ విషయాలు చెప్తున్నారు ఏంటి మీరు?” అంటారు. ఆ, అవ్వలేదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక్క విషయంతోనే సరిపోదు. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. అప్పుడు మాట్లాడదాం ఇన్షాఅల్లాహ్. అప్పుడు ఆత్మ విమర్శ చేసుకుందాం.
2. ప్రవక్తను అనుసరించడం (ఇతా’అత్)
ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో మరొక విషయం ఏమిటంటే, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఇతా’అత్ చేయాలి. ప్రవక్త వారిని అనుసరించాలి.
చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని 59 వ అధ్యాయము ఏడవ వాక్యంలో తెలియజేశాడు,
وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا
(వమా ఆతాకుముర్రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ)
“ప్రవక్త మీకు ఇచ్చింది స్వీకరించండి. ఆయన మిమ్మల్ని వారించింది మానుకోండి.” (59:7)
అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టేయండి. ఎవరు చెబుతున్నారు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త వారిని అనుసరించాలి అంటే అర్థం ఏమిటి? ప్రవక్త వారు ఏ పని అయితే చేయమని చెప్పారో అది మనము చేయాలంట. ప్రవక్త వారు ఏ పని అయితే చేయవద్దు అని వరించారో అది మనము వదిలేయాలంట. ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్లో ఆ వాక్యంలో మాకు తెలియజేస్తున్న విషయం.
అలాగే రెండవచోట ఖురాన్ గ్రంథం మూడవ అధ్యాయం 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’లా తెలియజేశాడు,
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ
(ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబి’ఊనీ యుహ్బిబ్కుముల్లాహ్)
ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పండి, “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.” (3:31)
అంటే అర్థం ఏమిటండీ? మనమంతా అల్లాహ్ దాసులం. మనము అల్లాహ్ ప్రేమ పొందాలి అంటే ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకుంటే, ప్రవక్త వారిని అనుసరిస్తే మనకు అల్లాహ్ యొక్క ప్రేమ దక్కుతుంది అని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్.
అంటే అర్థం ఏమిటండీ? అర్థం ఏమిటంటే మనము అల్లాహ్ ప్రేమ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళమైతే అల్లాహ్ చెప్పినట్టు విని నడుచుకోవాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు విని నడుచుకోవాలి అనేది మనకు స్పష్టమవుతుంది. ఏ విధంగా నడుచుకోవాలి? దానికి కొన్ని ఉదాహరణలు పెడతాను చూడండి. ఏ విధంగా ప్రవక్త వారి మాట విని మనము నడుచుకోవాలో దానికి కొన్ని ఉదాహరణలు మీ ముందర పెడతాను. దాన్నిబట్టి ఇన్షాఅల్లాహ్ మనము విషయం బాగా వివరంగా తెలుసుకుందాం.
మొదటి ఉదాహరణ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారిది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించటానికి మింబర్ పైకి ఎక్కారు. ఎక్కి ప్రజలను ఉద్దేశించి “అందరూ కూర్చోండి” అని ప్రకటించారు. ఆ పలుకు వినగానే అందరూ ప్రశాంతంగా, ఎవరు నిలబడి ఉన్నచోట వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ప్రవక్త వారు ఎప్పుడైతే ఈ మాట “అందరూ కూర్చోండి” అని పలికారో ఆ సమయానికి అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు వుజూ చేసుకొని మస్జిద్ లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక అడుగు మస్జిద్ లోపల ఉంది, ఒక అడుగు మస్జిద్ బయట ఉంది. అంటే గుమ్మం దగ్గర ఉన్నారు ఆయన. ప్రవక్త వారి మాట ఎప్పుడైతే చెవిలో పడిందో “అందరూ కూర్చోండి” అని, అక్కడే గుమ్మం మీద కూర్చుండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ప్రారంభించేసి, ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ అటు ఇటు చూస్తూ ఆయన్ని చూసుకున్నారు. ఆయన్ని చూసుకొని, “ఏంటయ్యా మీరు అక్కడే కూర్చున్నారు, లోపలికి వచ్చేయండి” అని చెప్పగానే అప్పుడు ఆయన వెంటనే లోపలికి వస్తూ, “ఓ దైవ ప్రవక్త, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే, మీరు కూర్చోండి అని చెప్పగానే వెంటనే మీ మాటను అనుసరిస్తూ నేను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఇక్కడే కూర్చుండి పోయాను” అని చెప్పేశారు.
మొత్తానికి ప్రవక్త వారు ఆయనను లోపలికి రమ్మని చెప్పారు. ఆయన ఆ ప్రవక్త వారి ఆదేశంతో ఆయన లోపలికి వచ్చేశారు. కాకపోతే, మనము తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత ఆయన తన ఇష్టానుసారంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చూశారా? అలా మనము ప్రవక్త వారి మాటను అనుసరించాలి.
ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారి పద్ధతి ఇది అని మనము ప్రజలకు చెబితే, వారు వెంటనే ప్రవక్త వారి మాట మీద అనుసరించరు. ఏమి చేస్తారు? వారి కోరికలు వారికి అడ్డుపడతాయి. వారి కుటుంబ సభ్యుల ప్రేమ వారికి అడ్డుపడుతుంది. తత్కారణంగా వారు ప్రవక్త వారి మాటల్ని, ప్రవక్త వారి పద్ధతుల్ని వెనక్కి పెట్టేసి కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్.
ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ వారు చూడండి. ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా ఒక అడుగైనా ముందుకు వేశారా? లేదే. వెంటనే అమలు పరిచేశారు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఏదైనా ప్రవక్త వారి హదీస్, ఏదైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ మన ముందర చెప్పబడింది, వినిపించబడింది అంటే అది విని మనము వెంటనే అమలు పరచాలి గాని, ప్రవక్త వారి మాటను పక్కన పెట్టేసి మా కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, భార్య బిడ్డల కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, కుటుంబ సభ్యుల మాటలు వింటూ ముందుకు వెళ్ళిపోవటం, ప్రవక్త వారి మాటను మాత్రం పక్కన పెట్టేయడం ఇలా చేయడం సరికాదండి.
అలాగే ప్రవక్త వారి మాట ఎంతగా వినాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది సహాబాలు ఆ రోజుల్లో చేసి చూపించారు. ఒక ఉదాహరణ విన్నాము అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారి గారిది. మరొక ఉదాహరణ…
ప్రారంభంలో అక్కడ మక్కా పరిసరాలలో, మక్కా వాసులు మరియు పరిసరాల వాసులు విపరీతంగా సారాయి తాగేవారు. వారిలో ఆ అలవాటు ఉండింది ముందు నుంచి. అజ్ఞానపు కాలం నుండి ఆ అలవాటు నడుస్తూ వస్తూ ఉంది. చాలా విపరీతంగా వారు సారాయి తాగేవారు. పోటాపోటీగా వారు మద్యాలు సేవించేవారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎప్పుడైతే మద్యం సేవించడం నిషేధం అని నిషేధ ఆజ్ఞ అవతరింపజేశాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చేశారంటే, శిష్యుల్ని పిలిపించి ప్రకటన చేయించేశారు. “మీరు వెళ్ళండి, అందరికీ ఈ మాట వినిపించేయండి” అని చెప్పగానే, ప్రవక్త వారి శిష్యులు వీధుల్లో తిరిగి పరిసరాల్లో ఉన్న వారందరికీ కూడా “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ వద్ద నుంచి ఆజ్ఞ వచ్చేసింది, మద్యం నిషేధం, మద్యం సేవించరాదు” అని చెప్పేశారు.
ప్రవక్త వారి మాట, ప్రవక్త వారి శిష్యులు వినిపిస్తూ ఉంటే ఆ సమయానికి కొంతమంది కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు, కొంతమంది ఇండ్లలో మద్యం స్టాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే సభలు ఏర్పాటు చేసుకొని, మన మొరటు భాషలో చెప్పాలంటే పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రవక్త వారి ప్రకటన వినిపించింది. వెంటనే ఏం చేశారండి? ఇది లాస్ట్ పెగ్గులే, ఈ ఒక్క పెగ్గు తాగేసి తర్వాత మానేద్దాం అనుకోలేదు. వెంటనే అప్పటికప్పుడే వారి ముందర ఉన్న సారాయిని పక్కన పడేశారు. తాగుతున్న వ్యక్తి కూడా అప్పటికప్పుడే ఆపేసి ఆ మిగిలిన సారాయి మొత్తం కింద పడేశాడు. ఇళ్లల్లో స్టాక్ చేసి పెట్టుకున్న ఆ సారాయి మొత్తం వీధుల్లోకి కుమ్మరించేశారు. అలాగే దాచిపెట్టుకున్న మద్యం మొత్తము కూడా తీసి వీధుల్లో కుమ్మరించేశారు. చరిత్రకారులు తెలియజేశారు, ఈ ప్రకటన తెలియజేసిన తర్వాత ఆ రోజు వీధుల్లో మద్యము ఏరులై పారింది, ఆ విధంగా అసహ్యించుకుని వెంటనే అది ఇక నిషేధం మనకు పనికిరాదు దాన్ని మనము ముట్టుకోరాదు, సేవించరాదు, మన ఇళ్లల్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, సహాబాలు వీధుల్లో దాన్ని కుమ్మరించేశారు. అల్లాహు అక్బర్.
చూసారా? ఈ రోజు తాగుతాంలే రేపటి నుంచి ఆపుదాంలే, ఇది ఒక్కటి తాగుదాంలే ఆ తర్వాత ఆపుదాంలే, ఈ వారము తాగేసి వచ్చే వారం నుంచి ఆపేద్దాంలే, అలా వారు సాకులు వెతకలేదండి. ప్రవక్త వారి ఆదేశం వచ్చిందా? వెంటనే అమలు పరిచేశారు. సాకులు వెతకలేదు. అలా ఉండాలి. ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము ప్రవక్త వారి ప్రేమికులము, అభిమానులము అని చెప్పేసి ప్రవక్త వారి ప్రేమ ప్రకటన చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము. సరే, ప్రవక్త వారి మాట వినడానికి, ప్రవక్త వారి పద్ధతిని ఆచరించడానికి అంతే ప్రేమతో మనము ముందుకు వస్తూ ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమ మనకు ప్రవక్త వారిని అనుసరించండి అని చెబుతూ ఉంది. మరి మనం అనుసరించట్లేదే? ప్రేమ ప్రకటించడానికి ముందుకు వస్తున్నాం. కానీ ప్రవక్త వారిని అనుసరించడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నాం, సాకులు వెతుకుతూ ఉన్నాం, ఏమేమో చెబుతూ ఉన్నాం. ఇది సరైన విధానము కాదు, గమనించండి మిత్రులారా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఒక శిష్యుడు తెలియక ఒకసారి బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్నారు. బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్న ఆయన ఒకసారి ఒకచోట ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్దిసేపటికి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆయన్ని చూసి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని గమనించారు.
ఆయనతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి వచ్చి ఆ ఉంగరము తీసేసి ఏమన్నారంటే, పురుషులు బంగారం ధరించటం నిషేధం అని చెప్పి ఆయన తొడిగి ఉన్న ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు బోధించాల్సిన విషయాలు బోధించేశారు. పురుషులు బంగారము ధరించరాదు అన్న విషయాన్ని బోధించేసి అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఈయన, ఎవరి చేతిలో నుంచి అయితే ప్రవక్త వారు బంగారపు ఉంగరాన్ని తీసి పక్కన పడేశారో, ఆయన కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూసిన కొంతమంది ఆయన మిత్రులు ఆయనతో ఏమన్నారంటే, “ఏమండీ, మీ బంగారపు ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మీరు మీ వెంట తీసుకెళ్ళండి, ఏదైనా పనుల కోసం, అవసరాల కోసం ఉపయోగించుకోండి” అని చెప్పారు.
దానికి ఆయన ఏమన్నారో తెలుసా? “ఏ వస్తువుని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి స్వ హస్తాలతో తీసి పక్కన పడేశారో దాన్ని నేను ముట్టుకోను అంటే ముట్టుకోను” అని చెప్పేశారు. అల్లాహు అక్బర్.
అదండీ ప్రవక్త వారి మాట పట్ల, ప్రవక్త వారి ఆదేశం పట్ల గౌరవం అంటే. చూశారా? కాబట్టి ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ, ప్రవక్త వారిని అనుసరించండి, ప్రవక్త వారి ఆదేశాలను పాటించండి అని మనతో కోరుతూ ఉంది. అది మనము చేయాలి. అది మనము చేస్తున్నామా? గమనించండి మిత్రులారా.
3. ప్రవక్త వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్న మనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి. ఇది మన బాధ్యత అండి. అవును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు. మరి ధర్మ ప్రచార బాధ్యత ఎవరు నిర్వహించాలి? ఆ బాధ్యత ఎవరు నిర్వహించమని ప్రవక్త వారు మనకు తెలియజేసి వెళ్లారు? నేను వెళ్తూ ఉన్నాను. నా తర్వాత మీరు, మీలో ఎవరికి ఎంత తెలుసో ఆ విషయాలను మీరు తెలియని వారి వద్దకు చేర్చండి, తెలియపరచండి. ఒక్క విషయం అయినా మీకు తెలిస్తే, ఆ ఒక్క విషయాన్నే మీరు ఇతరుల వరకు తెలియని వారికి నేర్పండి, తెలియజేయండి అని బోధించి వెళ్లారు. అల్లాహ్ సుభానహు వ తఆలా కూడా మనకు మీరు ఉత్తమమైన సమాజం, మీరు ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుంచి వారిస్తారు అని చెప్పి బాధ్యత ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ మరియు ప్రవక్త వారు ఇచ్చిన బాధ్యత మనము నెరవేర్చాలి. ప్రవక్త వారి ప్రేమ మనతో ఆ విషయం కోరుతూ ఉంది. మనము నిజమైన ప్రవక్త వారి ప్రేమికులమైతే, ప్రవక్త వారి అభిమానులమైతే, ప్రవక్త వారి ధర్మాన్ని, ప్రవక్త వారు తీసుకొని వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేరవేయాలి. మరి ఆ పని మనము చేస్తున్నామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తీసుకొని వచ్చిన ధర్మాన్ని మన నోటితో మనము చేయగలిగితే నోటితో చేయాలి. వెళ్లి ప్రజలకు విషయాలు బోధించాలి. అంత శక్తి లేదండీ. ఆ విధంగా మీకు మాట్లాడడానికి రాదు అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే, అల్హందులిల్లాహ్ పుస్తకాలు ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. అవి మీరు ఇతరుల వద్దకు చేరవేయండి అయ్యా. ఆ విధంగా ప్రవక్త వారి నిజమైన అభిమానులనిపించుకోండి. కానీ ఆ విధంగా చేస్తున్నామా? స్టేటస్ లు పెడుతున్నాం. స్టేటస్ లు పెట్టడం కాదండి. ప్రవక్త వారి సందేశాలు, ఆ ధర్మాన్ని ఇతరుల వరకు చేరవేయండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం.
4. ప్రవక్తపై దరూద్ పఠించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మీద మనము ఎక్కువగా దరూద్ పఠిస్తూ ఉండాలి. ఎంతమందికి దరూద్ వస్తుందండి? అల్హమ్దులిల్లాహ్, చాలా మందికి వస్తుందండి, నేను ఆ విధంగా విమర్శించట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వీధుల్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, వారిలో మీరు వెళ్లి అడిగి చూడండి. ఒకసారి దరూద్ పఠించి వినిపించండయ్యా అని అడిగి చూడండి. దరూద్ వస్తుందేమో వాళ్ళకి? ప్రేమికులము, మేము ప్రవక్త వారి అభిమానులము అని ఏమేమో చేస్తూ ఉన్నారే, అలా చేసే వారు ఒక్కసారి ప్రవక్త వారి మీద దరూద్ పఠించి వినిపించండి అని చెప్పండి. వస్తుందేమో చూద్దాం? చాలా మందికి రాదండి. అయినా మేము ప్రవక్త వారి ప్రేమికులమని నోటితో చెప్పుకుంటూ ఉంటారు. నోటితో చెప్పుకుంటే సరిపోదండి, ఇవన్నీ చేయాలి. ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే దరూద్ నేర్చుకొని దాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దరూద్ పఠిస్తూ ఉండాలి. దరూద్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రసంగం ఉందండి, ‘దరూద్ లాభాలు’ అని, అది వినండి తెలుస్తుంది ఇన్షాఅల్లాహ్. అయితే మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటండీ ఇక్కడ? మనము నిజమైన ప్రవక్త ప్రేమికులమైతే, అభిమానులమైతే మనము ప్రవక్త వారి మీద ఎక్కువగా దరూద్ పఠించాలి.
5. ప్రవక్త జీవిత చరిత్ర (సీరత్) తెలుసుకోవడం
అలాగే ప్రవక్త వారి అభిమానులమైనప్పుడు, ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మనము తెలుసుకోవాలి. అవును, మనం ప్రవక్త వారి అనుచర సమాజం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానులం, ఓకే. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులమైనందుకు, ప్రవక్త వారి అభిమానులము అయినందుకు మనకు ప్రవక్త వారి చరిత్ర తెలియకపోతే ఎలా? మీరు ప్రవక్త వారి ప్రేమికులు అనుకుంటున్నారు, మరి ప్రవక్త వారి గురించి మీకు ఏమి తెలుసయ్యా? మీ ప్రవక్త వారి చరిత్ర క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పండి అని ఎవరైనా అడిగాడు అనుకోండి, తల ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మనం? కదా? కాబట్టి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతూ ఉంది అంటే ప్రవక్త వారి జీవిత చరిత్రను మనము తెలుసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారి తాతలు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యము ఎలా గడిచింది, ప్రవక్త వారి యవ్వనము ఎలా గడిచింది, ప్రవక్త వారు ఎక్కడ వివాహం చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు కలిగారు, ఎప్పుడు ఆయనకు దైవదౌత్య పదవి దక్కింది, ఆయన దైవదౌత్య పదవి దక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా ధర్మ సేవ చేశారు, తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఎదురయ్యాయి, చివరికి ఆయన ఎక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన మరణం సంభవించింది, ఎక్కడ ఆయన సమాధి ఉంది, ఇవన్నీ విషయాలు ఒక ప్రవక్త వారి అనుచరునిగా, ప్రవక్త వారి అభిమానిగా, ప్రేమికునిగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసి ఉంది మిత్రులారా. అయితే అల్లాహ్ దయ ఏమిటంటే ప్రవక్త వారి జీవిత చరిత్ర చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాలలో ‘అర్రహీఖుల్ మఖ్తూమ్‘ అని ఒక పుస్తకం ఉంది. అది ఉర్దూలో, అలాగే తెలుగులో అనేక భాషల్లో అల్హమ్దులిల్లాహ్ అనువాదం చేయబడి ఉంది. అది చదివి తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు వారి వారి భాషల్లో ప్రవక్త వారి జీవిత చరిత్రను వీడియోల రూపంలో విని తెలుసుకోవచ్చు. అల్హమ్దులిల్లాహ్ ‘మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర’ అని పూర్తి ప్రవక్త వారి జీవిత చరిత్ర అల్హమ్దులిల్లాహ్ YouTube లో తెలుగు భాషలో ఉంది. అది కూడా మీరు వినవచ్చు, ఇతరులకు అల్హమ్దులిల్లాహ్ షేర్ చేయవచ్చు. అలాగే హిందీలో, అలాగే ఇంగ్లీష్ లో ప్రతి భాషలో ప్రవక్త వారి జీవిత చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి.
6. ప్రవక్త ప్రవర్తనను అలవర్చుకోవడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి ప్రవర్తన ఎలా ఉండేదో మన ప్రవర్తనను కూడా మనము ఆ విధంగా మార్చుకోవాలి. మూర్ఖత్వంగా ప్రవర్తించటం, ఆ తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం అది సరికాదు. మూర్ఖత్వం ప్రదర్శించటం, తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం సరికాదండి.
ప్రవక్త వారి అభిమానులు అయితే, ప్రవక్త వారి ప్రేమికులు అయితే, ప్రవక్త వారి మీద ఉన్న మీ ప్రేమ నిజమైనది అయితే, ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎలా ఉండేదో, ఆయన వ్యవహారాలు ఏ విధంగా ఉండేవో, ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన వ్యవహారాలను మనము మార్చుకోవాలి. ప్రవక్త వారు కుటుంబీకులతో ఎలా ప్రవర్తించేవారు? ప్రవక్త వారు ఇరుగుపొరుగు వారితో ఎలా ప్రవర్తించేవారు? పిల్లలతో ఎలా ప్రవర్తించేవారు? పెద్దలతో ఎలా ప్రవర్తించేవారు? మహిళలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లింలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించేవారు? బంధువులతో ఎలా ప్రవర్తించేవారు? శత్రువులతో ఎలా ప్రవర్తించేవారు? అలాంటి ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి.
మరి మనం అలా ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమికులం అని చెప్పుకుంటున్నాం, ఒక పక్క బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క భార్యని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క తల్లిదండ్రులకు సేవ చేయట్లేదు, పెద్దల్ని గౌరవించట్లేదు, అన్నీ పక్కన పెట్టేశాం, ప్రవక్త వారి ప్రేమికులమని చెప్పి మళ్ళా స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నాం. ఇది ఎంతవరకు సబబు అండి? కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎవరితో ఏ విధంగా ఉండేదో తెలుసుకొని మనము కూడా ఆ విధంగా మనల్ని మనము సంస్కరించుకోవాలి, మార్చుకోవాలండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం.
7. ప్రవక్త ఇష్టాఇష్టాలను పాటించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ఏ విషయాలను ప్రేమించారో, ఇష్టపడ్డారో, ఆ విషయాలను మనము కూడా ఇష్టపడాలి. ప్రవక్త వారు ఏ విషయాలను అయితే అసహ్యించుకున్నారో, ప్రవక్త వారికి ఏ పనులు, ఏ విషయాలు నచ్చలేదో, ఆ పనులు, ఆ విషయాలను కూడా మనము వదిలేయాలి, మనము కూడా వాటిని ఇష్టపడకూడదు.
ప్రవక్త వారు ఇష్టపడిన విషయాన్ని మనం కూడా ఇష్టపడతాం. ప్రవక్త వారికి నచ్చని విషయాలను కూడా మనము పక్కన పెట్టేద్దాం, మనము ఆ విషయాలను ఇష్టపడకూడదు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారికి నచ్చిన విషయాలు మనకు నచ్చట్లేదు. ప్రవక్త వారికి నచ్చని విషయాలు మనకు నచ్చుతా ఉన్నాయి. మాకు నచ్చుతూ ఉన్నాయి, మా బిడ్డలకు నచ్చుతూ ఉన్నాయి, మా కుటుంబీకులకు నచ్చుతూ ఉన్నాయి. ఏమన్నా చెప్తే ఇది చేయకూడదు కదా, ఇది ప్రవక్త వారు చేయవద్దు అని వరించారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తే, “హజరత్, అలా కాదు హజరత్. మా బిడ్డ అలా కోరుతూ ఉంటే అలా చేశాను హజరత్. లేదంటే మా తల్లిదండ్రులు చెప్తే చేశాను హజరత్. లేదంటే మా ఇంట్లో చెప్తే నేను చేశాను హజరత్” అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అండి? ప్రవక్త వారి ప్రేమికులు అని చెప్పేవాళ్ళు చెప్తున్న మాట ఇది. ప్రవక్త వారిని మీరు నిజంగానే ప్రేమిస్తూ ఉంటే ప్రవక్త వారు ఇష్టపడిన విషయాలను ఇష్టపడండి, వాటిని అభిమానించండి, వాటిని మీ జీవితంలోకి తీసుకొని రండి. ప్రవక్త వారికి నచ్చని విషయాలు వాటిని చేయటం, ఆ తర్వాత వారు చెప్పిన కారణంగా చేశాను, వీళ్ళు చెప్పిన కారణంగా చేశాను అని చెప్పటం సరికాదు.
8. ప్రవక్త కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులు ఎవరు? అహలె బైత్ అంటారు. ఒక ప్రత్యేకమైన ప్రసంగము ఉంది, అది కూడా మీరు వినవచ్చు. అహలె బైత్ అంటే ఎవరు? అహలె బైత్ వారి యొక్క విశిష్టతలు అని ప్రసంగాలు ఉన్నాయండి, అవి వినండి ఇన్షాఅల్లాహ్, విషయాలు వివరంగా తెలుస్తాయి. కాబట్టి ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఏ ఒక్కరినీ కూడా కించపరచటం సబబు కాదు, సరికాదు. నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి, అభిమానించాలి.
ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు
మిత్రులారా, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయాలు అనే అంశం మీద కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ ముందర ఉంచాను. అయితే నేడు ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. అయితే సమాజాన్ని చూస్తే మాత్రము ఒక విషయం మన ముందర వస్తుంది, అదేమిటంటే, ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలు అయితే మనతో కోరుతూ ఉందో, ఆ విషయాలు చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు.
ప్రవక్త వారి ప్రేమ ర్యాలీలు చేయమని చెప్పలేదండి. ప్రవక్త వారి ప్రేమ డీజేలు వాయిస్తూ పచ్చని జెండాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఎగరండి, అక్కడ పాడండి అని మనకు చెప్పలేదండి. కానీ చేస్తున్నారు, ఏమంటే ప్రవక్త వారి ప్రేమ అంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మసీదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు బ్యానర్ మీద పెట్టి, స్టేజ్ ని అలంకరించి, ఆ తర్వాత అక్కడ అశ్లీలమైన పాటలు వాయిస్తూ అక్కడ నృత్యాలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ ఈ పనులు చేయమని చెప్పిందా అండి మనకు? లేదు లేదు. ఇది ప్రవక్త వారి ప్రేమకు విరుద్ధమైన విషయాలు.
అలాగే ప్రవక్త వారి ప్రేమ అని చెప్పి చాలామంది ఏమి చేస్తున్నారంటే, పెద్ద పెద్ద కేకులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ కేకులు తయారు చేస్తూ, అల్లాహ్ మన్నించు గాక, ఇంగ్లీష్ లో “హ్యాపీ బర్త్‌డే యా రసూలుల్లాహ్” అని చెప్పి కూడా కేకులు కోస్తూ ఉన్నారు, అదేదో పెద్ద ఘన కార్యం అని చెప్పేసి మళ్లీ దాన్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇది చేయమని చెప్పిందండి మన ప్రవక్త వారి ప్రేమ మనకు? కేకులు సింగారించి “హ్యాపీ బర్త్‌డే యా రసూలుల్లాహ్” అని చేయమని మనకు ప్రవక్త వారి ప్రేమ చెప్పిందా అండి? లేదు మిత్రులారా.
ప్రవక్త వారి ప్రేమ సాకుతో అసభ్యమైన కార్యాలు చేయరాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేయరాదు, అలాగే అసంఘాకికమైన విషయాలకు దరిదాపుగా వెళ్ళకూడదు, అలాగే మన ధర్మంలో లేని విషయాలకు కూడా మనము చేయకూడదు ప్రవక్త వారి ప్రేమ సాకుతో.
ఇంతటితో నా మాటలు ముగిస్తూ, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ నిజమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానుల్లాగా తీర్చిదిద్దు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరుతూ ఉందో ఆ విషయాలను తూచా తప్పకుండా మనందరికీ పాటించే భాగ్యం ప్రసాదించు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరట్లేదో అలాంటి విషయాల నుండి దూరంగా ఉండే అనుగ్రహం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు, ముఖ్యంగా మన యువకులకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43313
మహా ప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO
మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్ రహ్మాన్ ముబారక్ ఫూరి
https://teluguislam.net/2020/01/25/seerah-arraheeq-al-makhtoum/