మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు [వీడియో & టెక్స్ట్]

ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
https://www.youtube.com/watch?v=O_Eu55VE-KA [30 నిమిషాలు]

ఈ ప్రసంగంలో, వక్త మలమూత్ర విసర్జన చేసేటప్పుడు పాటించవలసిన ఇస్లామీయ పద్ధతులను హదీసుల ఆధారంగా వివరించారు. ప్రధాన అంశాలు: ఏకాంతాన్ని పాటించడం, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో తప్పులేదని చెప్పడం, భూమికి దగ్గరైన తర్వాతే బట్టలు పైకి తీయడం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత దువాలు చదవడం, ఆ సమయంలో మాట్లాడకూడదని చెప్పడం, అల్లాహ్ పేరు ఉన్న వస్తువులను లోపలికి తీసుకువెళ్లకపోవడం, ఖిబ్లా వైపు ముఖం లేదా వీపు పెట్టకపోవడం (కట్టడాలలో మినహాయింపు ఉంది), శపించబడిన ప్రదేశాలలో (దారి, నీడ, నీటి వనరులు) విసర్జన చేయకపోవడం, శరీరం లేదా దుస్తులపై తుంపరలు పడకుండా జాగ్రత్తపడటం, శుభ్రత కోసం నీటిని (మరియు రాళ్లను) ఉపయోగించడం, ఎడమ చేతిని మాత్రమే వాడటం, కనీసం మూడుసార్లు శుభ్రపరచడం, ఎముక మరియు పేడతో శుభ్రపరచకపోవడం, ఆ సమయంలో సలాంకు జవాబు ఇవ్వకపోవడం, మరియు అవసరమైతే నిలబడి మూత్రవిసర్జన చేయడం అనుమతించబడినప్పటికీ, తుంపరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు మనం మలమూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాము.

మొదటి విషయం, మలమూత్ర విసర్జన కొరకు నాలుగు గోడల మధ్యలో లేదా ఎడారి ప్రాంతంలో పోయే అవసరం ఉన్నప్పుడు కానీ ప్రజల చూపులకు, వారి దృష్టికి దూరంగా వెళ్ళాల్సిన ఆదేశం ఇస్లాం ఇస్తుంది. ఎందుకనగా ప్రతి మనిషి తన మర్మ అవయవాలను ఇతర చూపులకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం.

దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఒక హదీస్, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 148. ఇంకా అలాగే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 363 లో కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ముగైరా బిన్ షోబా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉండేవారు. ఆయన తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు,

فَانْطَلَقَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم حَتَّى تَوَارَى عَنِّي فَقَضَى حَاجَتَهُ
(ఫన్తలఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవారా అన్నీ ఫఖదా హాజతహు)
నాకు కనబడనంత దూరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, తమ అవసరాన్ని తీర్చుకొని తిరిగి వచ్చేశారు.”

సామాన్యంగా కొన్ని పల్లెటూర్లలో ఇప్పుడు అంతగా లేదు కావచ్చు, కానీ అయినా గాని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం మంచిగా భావించరు. కానీ ఇందులో ఎలాంటి అభ్యంతరం ఇస్లామీయ ధర్మ ప్రకారంగా గానీ, ఇందులో ఎలాంటి పాపం అనేది లేదు. స్వయంగా ఆ కాలంలో కూడా మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ ఇంటి మీద ఇలాంటి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం కూడా సహీ బుఖారీలో ఉంది. అందుగురించి ఇమామ్ బుఖారీ రహమతుల్లా అలై ఒక చాప్టర్ పేరేమి పెట్టారు? ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం.

రెండో విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు, లోపలికి వెళ్లి తలుపేసుకున్న తర్వాతే బట్టలు విప్పుతాము. కానీ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఒక పరదా లాంటి స్థలం, ప్రజల చూపులకు మనం కనబడకుండా ఉన్నాము అన్నటువంటి నమ్మకం అయిన తర్వాత, ఏ స్థలంలో మనం కూర్చోవాలి అని అనుకుంటున్నామో అక్కడ కూర్చోవడానికి సిద్ధమవుతూ, కిందికి వంగుతూ బట్టలను ఎత్తుకోవాలి.

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ حَاجَةً لاَ يَرْفَعُ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْضِ
(అన్నన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా అరాద హాజతన్ లా యర్ఫవు సౌబహు హత్తా యద్నువ మినల్ అర్ద్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించినప్పుడు భూమికి దగ్గరగా అయ్యేంతవరకు తమ వస్త్రాలు, తమ బట్టలు తీసేవారు కాదు.” (సునన్ అబీ దావూద్: 14)

అయితే ఎంతగా మనం మన మర్మావయవాలను ఇతర చూపుల నుండి దాచి ఉంచవలసిన అవసరం ఉందో, దీని గురించి ఎంత మంచి శిక్షణ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆచరణ ద్వారా మనకు చూపుతున్నారో గమనించండి. ఈ హదీస్ సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 14.

మరుగుదొడ్డిలో ప్రవేశిస్తూ లేదా ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యంగా ప్రజలకు తెలిసి ఉంటుంది, అర కిలోమీటర్, పావు కిలోమీటర్, కిలోమీటర్ నడిచి వెళ్తారు, కానీ ఇక్కడి నుండి కాలకృత్యాలు తీర్చుకునే ఈ ప్రాంతం అన్నటువంటి ఒక ఏర్పాటు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాతనే దుఆ చదువుకోవాలి. ఇక మరుగుదొడ్డి ఏదైతే ఉంటే, నాలుగు గోడల మధ్యలో ఏదైతే ఉంటే, బాత్రూంలో, టాయిలెట్లో ప్రవేశించేకి ముందే దాన్ని చదువుకోవాలి.

బిస్మిల్లాహ్ అనాలి, ఆ తర్వాత,

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్
ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి

ఇది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 142. కానీ బిస్మిల్లాహ్ గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప విషయం చెప్పారో గమనించండి. కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మనిషి తన మర్మ అవయవాలను దాచి ఉంచలేకపోతాడు గనుక, ఆ సందర్భంలో జిన్నాతులు కూడా చూసే అవకాశం ఉంటుందా లేదా? అందుగురించి మీరు బిస్మిల్లాహ్ అని ఆ సందర్భంలో ముందే అనేది ఉంటే మీకు మరియు జిన్నాతులకు మధ్యలో ఒక పరదా ఏర్పడుతుంది, వారు మీ మర్మ అవయవాలను చూడలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రత, పరిశుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో, బయటికి వచ్చిన తర్వాత “గుఫ్రానక” అని అనాలి. బిస్మిల్లా – అల్లాహ్ యొక్క పేరుతో నేను ఈ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న భావం. అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక – ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ – స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి. తిరిగి వచ్చిన తర్వాత ఏమనాలి? గుఫ్రానక – అంటే ఓ దేవా, నీవు నన్ను క్షమించు.

నాలుగవ విషయం, కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. ఏ మాత్రం మాట్లాడవద్దు. మరీ ఏదైనా అత్యవసర విషయం ఉండి సంక్షిప్తంగా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం అని కొందరు పండితులు చెప్పారు. కానీ ఒక సామాన్య పద్ధతి ఏమిటి? మన కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. సహీహాలో ఈ హదీస్ ఉంది, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అని చెప్పారు.

إِذَا تَغَوَّطَ الرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ وَلَا يَتَحَدَّثَانِ عَلَى طَوْفِهِمَا فَإِنَّ اللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ
ఇద్దరు మనుషులు కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ తన స్నేహితుని చూపులకు దూరంగా ఉండే అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. మరి తమ అవసరం తీర్చుకున్న సందర్భంలో ఏ మాత్రం మాట్లాడవద్దు. ఇందువల్ల అల్లాహ్ త’ఆలా వారిపై చాలా ఆగ్రహపడతాడు.”

ఐదవ విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అల్లాహ్ యొక్క పేరు గల ఏ వస్తువు కూడా వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో వచ్చిన ఒక హదీస్ బలహీనంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉంగరం మీద “ముహమ్మద్ రసూల్ అల్లాహ్” అంటే ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న భావం, ఈ మూడు పదాలు ఉండేవి. అయితే అల్లాహ్ యొక్క పేరు కూడా వచ్చింది గనుక దాన్ని తీసి బయట పెట్టి వెళ్ళేవారు అని. కానీ హదీస్ దయీఫ్ ఉంది. అయినా గానీ సర్వసామాన్యంగా పండితులందరూ కూడా ఏకీభవించారు, అల్లాహ్ పేరు గల ఏ వస్తువు కూడా ఎంబడి తీసుకొని వెళ్ళకూడదు.

కానీ కొన్ని వస్తువులు దాన్ని బయట పెట్టి వెళ్ళడం ద్వారా ఏదైనా మనకు నష్టం ఉంది, దాన్ని కాపాడలేకపోతాము, అలాంటి సందర్భంలో మరికొందరు పండితులు ఏం ఫత్వా ఇచ్చారంటే దానిని బహిరంగంగా ఉండకుండా జేబు లోపల గానీ, దస్తీ లోపల గానీ, ఇలాంటివన్నీ దాచిపెట్టి పోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి ఖురాన్ కంఠస్థం చేసి ఉంటాడు, దాన్ని బయటికి తీసి వెళ్ళలేడు కదా. అయితే దాని యొక్క పోలిక అని కొందరు పండితులు చెప్పారు. అలాగే జవ్వాలల్లో ఉదాహరణకు ఖురాన్ ఉంటుంది, లేదా ఏదైనా కాయితం ఉంది, ఏదైనా దువాల పుస్తకం ఉంది, అలాంటివి బయట పెట్టి వెళ్ళడం వల్ల, బయట పెట్టి వెళ్ళడం వల్ల ఏదైనా నష్టం అన్నటువంటి భయం ఉండేది ఉంటే లోపల పెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు.

ఆరో విషయం, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో ఖిబ్లా దిశలో ముఖము గానీ వీపు గానీ ఉండకూడదు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 394 లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖకులు:

إِذَا أَتَيْتُمُ الْغَائِطَ فَلاَ تَسْتَقْبِلُوا الْقِبْلَةَ وَلاَ تَسْتَدْبِرُوهَا
“మీరు మీ అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఖిబ్లా వైపునకు ముఖము చేయకండి, వీపు చేయకండి.”

కానీ నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కూడా ఉండకుండా ముందు నుండే జాగ్రత్తపడటం మరీ మంచిది. ఎందుకనగా అబూ దావూద్ లో హదీస్ నెంబర్ 11 లో, ఇంకా సహీ బుఖారీ వేరే చోట కూడా ఈ హదీస్ ఉంది ఈ భావంలో, సహీ బుఖారీలో ఉంది 148, ఇబ్నె ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ఏదో అవసరం పడి తమ సోదరి అయిన హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా గారి ఇంటి కప్పు మీదికి వెళ్ళడానికి పైన ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త గారు ఖిబ్లా దిశలో, ఖిబ్లా దిశలో వీపు పెట్టి తమ కాలకృత్యాలు తీర్చుకున్నట్టు కనబడింది, తర్వాత బహుశా ఆ విషయంలో అడిగారు. అయితే ఈ హదీస్ ద్వారా ధర్మవేత్తలు ఏమన్నారంటే నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కాకుండా ఒక సందర్భంలో ఇబ్ను ఉమర్ స్వయంగా ప్రయాణంలో ఉన్నారు, అప్పుడు తమ ఒంటెను నిలిపారు, ఖిబ్లా దిశలో మూత్రం పోశారు. ఆ సందర్భంలో మర్వానల్ అస్ఫర్ అనే ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే ప్రశ్నించారు: “యా అబా అబ్దిర్రహ్మాన్, అలైస ఖద్ నుహియ అన్ హాదా? ఖిబ్లా దిశలో ఉండి, ఖిబ్లా దిశలో ముఖం గానీ వీపు గానీ చేసి కాలకృత్యాలు తీర్చుకోవద్దు, మూత్ర మలమూత్రానికి వెళ్ళవద్దు అని మనకు నిషేధించబడలేదా?“అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు?

نُهِيَ عَنْ ذَلِكَ فِي الْفَضَاءِ
“ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని నిషేధించబడింది.”

فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلاَ بَأْسَ
“ఒకవేళ నీ మధ్యలో మరియు ఖిబ్లా మధ్యలో ఏదైనా అడ్డు ఉండి దాని వెనుక నీవు నీ అవసరాన్ని తీర్చుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు చెప్పారు.

నాలుగు గోడల మధ్యలో ఖిబ్లా దిశలో ఉన్నా గానీ మన టాయిలెట్, ఎలాంటి అభ్యంతరం లేదు అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా గానీ ఎవరైనా ముందు నుండే దాన్ని కట్టేటప్పుడు ఖిబ్లాకు వ్యతిరేక దిశలో కట్టేది ఉంటే మరీ మంచిది.

ఏడవ విషయం, శాపనకు గురి కావలసిన స్థలాల్లో మలమూత్రం చేయకూడదు. శాపనకు గురి కావలసిన స్థలాల్లో అంటే ఏంటి? హదీస్ లో ఇలాగే ఉంది. ముస్లిం షరీఫ్ 269 లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا اللَّعَّانَيْنِ
(ఇత్తఖుల్ లఅనైన్)
“అధికంగా శాపం ఇచ్చే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి.”

ప్రవక్తను అడిగారు, వమల్ లఅనాని యా రసూలల్లాహ్? ప్రవక్తా, ఆ రెండు అధికంగా శాపనానికి గురి అయ్యే ఆ విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاسِ أَوْ فِي ظِلِّهِمْ
(అల్లది యతఖల్లా ఫీ తరీఖిన్నాసి అవ్ ఫీ దిల్లిహిమ్)
“ప్రజల దారి మధ్యలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేసేవాడు.”

అంటే ఆ మలమూత్ర విసర్జన అనేది ఆ ప్రాంతంలో చేయడం ద్వారా ప్రజలు అసహ్యించుకుంటారు, ప్రజలు శపిస్తారు, ఆ శాపనకు అలాంటి వారు గురి అవుతారు.

సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 26 లో ఉంది, ముఆద్ ఇబ్ను జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا الْمَلَاعِنِ الثَّلَاثَةَ
(ఇత్తఖుల్ మలాయినిస్ సలాస)
“మూడు శాపనానికి గురి అయ్యే విషయాల నుండి మీరు దూరం ఉండండి:
అల్ బరాజ్ ఫిల్ మవారిద్, వఖారిఅతిత్ తరీఖ్, వ దిల్ల్.
నీళ్ళు త్రాగేచోట మల విసర్జన చేయడం, లేదా దారి మధ్యలో దారి పక్కన, ఇంకా నీడ ఉన్నచోట.”

ఎనిమిదవ విషయం, శరీరం లేక మన దుస్తులపై ఎలాంటి మలమూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనగా ఇది చాలా భయంకరమైన విషయం, ఇది చాలా పెద్ద పాపంలో లెక్కించబడుతుంది. ఘోర పాపంలో. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 348 లో,

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ مِنَ الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి మినల్ బౌల్)
“సమాధిలో ఎక్కువగా శిక్ష దేని గురించి అయితే జరుగుతుందో, అది మూత్ర విసర్జనలో అశ్రద్ధ చేయడం, లేక మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడకపోవడం, లేదా మూత్రం పోసిన తర్వాత పరిశుభ్రత విషయంలో అశ్రద్ధకు గురి కావడం.”
ఇవన్నీ భావాలు కూడా అందులో వస్తాయి.

ఇంకా సహీ బుఖారీ హదీస్ నెంబర్ 216 లో ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే రెండు సమాధులు కనబడ్డాయి. అందులో ఉన్న ఆ ఇద్దరు మనుషులకు, శవాలకు చాలా శిక్ష అవుతుంది అని చెప్పారు. అయితే ప్రవక్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో ఒకరి గురించి చెప్పారు,

كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ
(కాన అహదుహుమా లా యస్తతిరు మిన్ బౌలిహి)
“ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన మూత్రం నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మూత్ర తుంపరలు మీద పడకుండా తనను తాను కాపాడుకునేవాడు కాడు, ఇంకా మూత్రం పోసిన తర్వాత శుభ్రం చేసుకునేవాడు కాడు, శుభ్రం చేసుకున్నా అందులో కూడా అశ్రద్ధతనం పాటించేవాడు.”
ఇవన్నీ భావాలు కూడా ఈ హదీస్ లో వస్తాయి. రెండో వ్యక్తి ఎవరు? చాడీలు చెప్పేవాడు.

తొమ్మిదవ విషయం, మలమూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్లు ఉపయోగించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 150 లో ఉంది, “ఇదా ఖరజ లిహాజతిహి అజీవు అన వగులామున్ మఅనా ఇదావతున్ మిమ్మాఇన్ యఅనీ యస్తంజీ బిహి.” హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారు ఈ విషయం తెలుపుతున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు నేను మరియు ఇంకో నాలాంటి యువకుడు, మేము ఇద్దరము ప్రవక్త గారి వెంట వెళ్ళేవాళ్ళము, మా వెంట మేము నీళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అయితే ఎక్కడి వరకైతే వెళ్ళేవారో అక్కడికి వెళ్లి, ఆ తర్వాత ఎక్కడనైతే ప్రజల చూపులకు కనబడకుండా వెళ్ళేది ఉందో, అక్కడి నుండి ప్రవక్త ఆ నీళ్లు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. అయితే నీళ్ళతో పరిశుభ్రత అనేది పాటించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు అన్న విషయం మనకి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

అంతే కాదు, సునన్ తిర్మిదీలో, సునన్ తిర్మిదీలో హదీస్ నెంబర్ 19, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా స్త్రీలతో చెప్పారు. “ముర్న అజ్వాజకున్న అన్ యస్తతీబూ బిల్ మాఇ ఫఇన్నీ అస్తహ్యీహిమ్, ఫఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యఫ్అలు.” “మీరు మీ భర్తలకు, మీ పురుషులకు నీళ్ళతో శుభ్రపరుచుకోవాలని, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లు ఉపయోగించాలని, నీళ్లతో శుభ్రపరుచుకోవాలని మీరు ఆదేశించండి. వారికి నేను చెప్పడంలో సిగ్గుపడుతున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.”

ఒకవేళ నీళ్ళు లేని సందర్భంలో లేదా నీళ్లతో పాటు కూడా ఇటిక పెడ్డలను, నీళ్ళు పీల్చే రాయిని లేక టిష్యూ పేపర్, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించడం మరీ మంచిది. మరీ మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వచ్చిన తర్వాత సూరె తౌబాలో ఆయత్ నెంబర్ 108 లో,

فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ
(ఫీహి రిజాలున్ యుహిబ్బూన అన్ యతతహర్రూ, వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్)
“దానిలో పవిత్రంగా ఉండటాన్ని ప్రేమించేవారున్నారు. అల్లాహ్ పవిత్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు.” (9:108)

ఈ మదీనా వాసుల్లో అన్సార్ లో కొందరు, ప్రత్యేకంగా ఖుబా వాసులు, ఖుబా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవారు, వారిని ప్రశంసిస్తూ ఈ ఆయత్ అవతరించింది. ఏంటి? అక్కడి వాసుల్లో కొందరు పరిశుభ్రంగా ఉండడాన్ని చాలా ప్రేమిస్తారు, మరియు అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఆ మనుషులు ఎవరు? పరిశుభ్రతను చాలా ఇష్టపడతారు. అయితే వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ ఏమన్నాడు? వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్ – అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని ప్రేమిస్తాడు.

అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు గారు అంటున్నారు, ఇబ్నె ఖుజైమాలో ఈ హదీస్ ఉంది, సహీ హదీస్, వారు నీళ్ళను ఉపయోగించేవారు. అందుగురించి వారి యొక్క ప్రశంసలో అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం ఉంది, వారు నీళ్లతో పాటు మట్టి పెడ్డలను, ఇటికలను ఇలాంటి వాటిని, నీళ్లు పీల్చే అలాంటి వస్తువులను ఉపయోగించేవారు, రెండిటి ద్వారా వారు పరిశుభ్రతను పాటించేవారు గనుక వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ని అవతరింపజేశాడు. అంటే విషయం ఏంటి ఇక్కడ? నీళ్ళు అయితే కంపల్సరీ వాడాలి, నీళ్ళు లేని సందర్భంలో లేక నీళ్లతో పాటు కూడా ఈ వస్తువులు వాడడం కూడా మరీ మంచిది అన్న విషయం ఈ ఆయత్ మరియు దీనికి సంబంధించిన తఫ్సీర్ల ద్వారా మనకు తెలుస్తుంది.

అయితే పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగించకూడదు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

إِذَا بَالَ أَحَدُكُمْ فَلَا يَأْخُذَنَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلَا يَسْتَنْجِ بِيَمِينِهِ
“మీలో ఎవరైనా మూత్రం పోయినప్పుడు తన మూత్రాంగాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. కుడి చేతితో పరిశుభ్రత కూడా చేయకూడదు.”

అలాగే పరిశుభ్రత సందర్భంలో నీళ్లతో మనం పరిశుభ్రం చేసినా గానీ, పెడ్డలతో చేసినా, టిష్యూ పేపర్ తో చేసినా గానీ, మూడేసి సార్లు చేయాలి. కానీ కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్లారు, నీళ్ళు లేవు, పెడ్డలు ఉపయోగిస్తాము, మూడు పెడ్డలు తీసుకోవాలి. లేదా ఒక పెద్ద రాయి తీసుకొని మూడు దిక్కుల్లో, మూడు సార్లు… ఈ విషయాన్ని వివరంగా చెప్పడంలో చాలా సిగ్గుపడుతూ ఉంటాము, కానీ అర్థం కావడానికి, ఒక పెడ్డ తీసుకున్నాము, మూత్రం పోసిన తర్వాత తొందరపాటు పడవద్దు. మధ్యలో ఆగి ఉన్న చుక్కలన్నీ పడిపోయేంతవరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పెడ్డ తీసుకొని ఒక వైపున తుడువాలి, దాన్ని తిప్పేసి రెండోసారి తుడువాలి, మళ్ళీ తింపేసి మూడోసారి తుడువాలి. లేదా మూడు వేరేవేరే రాళ్లు పెడ్డలు తీసుకోవాలి. అంటే కనీసం మూడుసార్లు ఈ కడగడం అనేది, తుడువడం అనేది జరగాలి.

ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆదేశించారో, ఇబ్నె మాజాలో ఈ హదీస్ ఉన్నది, హదీస్ నెంబర్ 350. కానీ దీని యొక్క లాభాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎలా చెబుతున్నారో శ్రద్ధ వహించండి. ఈ ప్రవక్త గారి ఆదేశం వచ్చిన తర్వాత మేము మూడేసి సార్లు కడిగేవాళ్ళం,

فَوَجَدْنَاهُ دَوَاءً وَطَهُورًا
(ఫవజద్నాహు దవాఅన్ వతహూరా)
“దాని మూలంగా దానివల్ల పరిశుభ్రత కూడా పొందినాము, ఎన్నో రోగాలకు చికిత్స కూడా మేము పొందాము.”

అలాగే పరిశుభ్రత కొరకు ఎముక, బొక్క, లేదా పేడ లేదా ఎండిన పిడిక, పెండను పిడికగా చేస్తారు కదా, ఆ పిడికలను గానీ ఏ మాత్రం ఉపయోగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీ బుఖారీలో 3571 లో ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి ఆదేశించారు రాళ్లు తీసుకురమ్మని, కానీ ఏం చెప్పారు?

وَلاَ تَأْتِنِي بِعَظْمٍ وَلاَ بِرَوْثَةٍ
(వలా తఅతినీ బిఅద్మిన్ వలా బిరౌసతిన్)
“ఎముక గానీ లేదా పేడ గానీ తీసుకురాకు.”

కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ పరిశుభ్రతలు అయిపోయినాయి, తర్వాత ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, “మీరు ఎందుకు ఈ రెండిటినీ తీసుకురావద్దని చెప్పారు?” అని. అవి మీ సోదరులైన జిన్నాతులకు ఆహారంగా పనిచేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

మలమూత్ర విసర్జన సందర్భంలో సలాం కూడా చేయరాదు, ఎవరైనా సలాం చేస్తే సమాధానం కూడా, జవాబు కూడా ఇవ్వకూడదు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూత్రం పోస్తున్నారు. కొంచెం దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పలేదు. తర్వాత అతనితో కలిసి చెప్పారు, ఇలాంటి సందర్భంలో మీరు సలాం చేయకండి. ఒకవేళ మీరు సలాం చేసినా నేను మీకు సమాధానం పలుకను. ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది 346.

ఇంతవరకు అల్లాహ్ యొక్క దయవల్ల మనం మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఇంచుమించు 14, 13 పద్ధతులను, విషయాలను ఆధారాలతో సహా విన్నాము.

చివరి విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నిలబడి మూత్రం పోసే అవసరం పడవచ్చు. అది ఇస్లాంలో ధర్మమేనా లేదా? అందులో ఎలాంటి అనుమానం లేదు, అది యోగ్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో ఇలాంటి అవసరం పడింది, నిలబడి మూత్రం పోశారు అన్న విషయం సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 224 లో ఉంది.

కానీ అవసరం ఉండి నిలబడి పోసినా లేదా సామాన్యంగా కూర్చుండి మూత్రం పోసినా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తుంపరలు, మూత్రపు చుక్కలు మీద పడకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమాధిలో ఎక్కువగా శిక్ష దీని గురించే జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

ఈరోజు అల్లాహ్ యొక్క దయవల్ల ఈ విషయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సరైన పద్ధతిలో ఈ అవసరాలు ఇంకా మన సర్వ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.

కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః

اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్‌ ఖుబుసి వల్ ఖబాయిస్ .
(అల్లాహ్‌ పేరుతో, ఓ అల్లాహ్‌ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

غُفْرَانَك (గుఫ్రానక)
(నీ మన్నింపుకై అర్ధిస్తున్నాను) (తిర్మిజి 7).


2- అల్లాహ్‌ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.

4- సతర్‌ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్‌ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్‌ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5168

ఇతరములు :