నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే

1480. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉహుద్ అమరగతుల కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత (జనాజా) నమాజ్ చేశారు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఈ నమాజు చేశారు. ఆ తరువాత మస్జిద్ లో వేదిక ఎక్కి ఇలా ఉద్బోధించారు –

“నేను సారధిగా, జట్టు నాయకుడిగా మీకు ముందుగా వెళ్తున్నాను. నేను మీకు సాక్షిని, పర్యవేక్షకుడిని. ఇక మీరు నన్ను కౌసర్ సరస్సు దగ్గర కలుసుకుంటారు. నేనిక్కడ నిలబడి కూడా దాన్ని (కౌసర్ సరస్సుని) చూడగలుగుతున్నాను. నేను వెళ్ళిన తరువాత మీరు మళ్ళీ బహుదైవారాధకులై పోతారేమోనన్న భయమిప్పుడు నాకు ఏమాత్రం లేదు. కాని నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే.”

[సహీహ్ బుఖారీ : 64 వ ప్రకరణం – మగాజి, 17 వ అధ్యాయం – గజ్వతి ఉహుద్]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 9 వ అధ్యాయం – కౌసర్ సరస్సు – దాని వైశిష్ట్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా?

389. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు :-

“ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉండి, అతనా నదిలో ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” దానికి ప్రవక్త అనుచరులు “అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు” అని అన్నారు ముక్తకంఠం తో.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “రోజుకు అయిదుసార్లు నమాజు చేసే మనిషి పరిస్థితి కూడా  అలాగే ఉంటుంది. అయిదు వేళలా నమాజు చేయడం వల్ల దాసుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు” అని బోధించారు.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 6 వ అధ్యాయం – అస్సలవాతుల్ ఖమ్సి కఫ్ఫారా]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండి

254. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్, ఇషా వేళల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్లడాన్ని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రధి అల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్న వేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాశీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడానికి నిరోధించకండని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 13 వ అధ్యాయం – హద్దసనా యూసుఫు బిన్ మూసా]

నమాజు ప్రకరణం – 30 వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా మస్జిద్ కు వెళ్ళవచ్చు.  మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Do not stop Allaah’s Imaa’ (women slaves) from going to Allaah’s mosques

మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి

460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.

[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 37 వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రళయదినం నాడు దేవుని నీడ పట్టున ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తులు

610. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా  తెలిపారు:-

దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో

  1.  న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;

  2.  తన యౌవన జీవితం (వ్యర్ధ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు;

  3.  మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయి పోయినా ధ్యాసంతా మస్జిదు వైపు  ఉండేటటువంటి మనిషన్న మాట);

  4.  కేవలం ధైవప్రసన్నత కోసం పరస్పరం అభిమానించుకునే, ధైవప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు;

  5.  అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచి నప్పుడు, తాను దైవానికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ;

  6.  కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి;

  7.  ఏకాంతంలో దైవాన్ని తలచుకొని కంటతడి పెట్టే వ్యక్తి.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 36 వ అధ్యాయం – మన్ జలస ఫిల్ మస్జిది యన్తజిరుస్సలాతి వ ఫజ్లిల్ మసాజిద్]

జకాత్ ప్రకరణం : 30 వ అధ్యాయం – గుప్తదానం – దాని ప్రాముఖ్యత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth