స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా?
https://www.youtube.com/watch?v=XY5Wq4ZiYU8 [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ చేయాలా?

అవునండి. స్త్రీలు కూడా ఈ నమాజ్ చేయాలి. దీనికి సంబంధించి దలీల్ ఉందా? అవును, బుఖారీ, ముస్లింలో ఉంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 184. అలాగే సహీ ముస్లిం హదీస్ నెంబర్ 905. అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు.

أَتَيْتُ عَائِشَةَ زَوْجَ النَّبِيِّ صلى الله عليه وسلم
(అతైతు ఆయిషత జౌజిన్ నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం)
[నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయిన ఆయిషా వద్దకు వచ్చాను]

حِينَ خَسَفَتِ الشَّمْسُ
(హీన ఖసఫతిష్ షమ్స్)
[సూర్య గ్రహణం పట్టినప్పుడు].

సూర్య గ్రహణం సందర్భంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వద్దకు వచ్చాను.

فَإِذَا النَّاسُ قِيَامٌ يُصَلُّونَ
(ఫ ఇదన్ నాస్ కియామున్ యుసల్లూన్)
[అక్కడ ప్రజలు నిలబడి నమాజ్ చేస్తూ ఉన్నారు].

ప్రజలను చూశాను మస్జిద్ లో, వారు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు.

وَإِذَا هِيَ قَائِمَةٌ تُصَلِّي
(వ ఇదా హియ ఖాయిమతున్ తుసల్లీ)
[ఆమె కూడా నిలబడి నమాజ్ చేస్తూ ఉంది].

అప్పుడు నేను ఆయిషాను చూశాను, ఆమె కూడా ఆ జమాత్ లో పాల్గొని, మగోళ్ళ వెనకా, మగవారి వెనక నమాజులో నిలబడి ఉంది.

فَقُلْتُ مَا لِلنَّاسِ
(ఫకుల్తు మాలిన్ నాస్)
[అప్పుడు నేను అడిగాను, ప్రజలకు ఏమైంది?].

ఏంటి ఇది? ఇది ఏ నమాజ్ సమయం? ఇప్పుడు ఎందుకు నమాజ్ చేస్తున్నారు ప్రజలు? ఏంటి విషయం? అయితే నమాజులో ఉన్నారు గనక ఆయిషా రదియల్లాహు తాలా అన్హా,

فَأَشَارَتْ بِيَدِهَا نَحْوَ السَّمَاءِ
(ఫ అషారత్ బియదిహా నహ్వస్ సమా)
[ఆమె తన చేతితో ఆకాశం వైపునకు సైగ చేసింది].

ఆకాశం వైపునకు వేలు చూపించింది. అప్పుడు, سُبْحَانَ اللَّهِ (సుబ్హానల్లాహ్) [అల్లాహ్ పవిత్రుడు]. అప్పుడు ఆమెకు అర్థమైంది. సూర్య గ్రహణం యొక్క నమాజ్ చేయడం జరుగుతుంది అని.

ఇది, ఈ హదీస్ ద్వారా దలీల్ ఏంటి? అర్థమైంది కదా? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కూడా జమాత్ తో ఈ నమాజ్ చేస్తూ ఉన్నది. అందుకొరకు, స్త్రీలు జమాత్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటే, మస్జిద్ లో వారికొరకు ప్రత్యేకమైన సురక్షితమైన, శాంతివంతమైన, అన్ని ఫితనాల నుండి రక్షణ అటువంటి స్థలం కేటాయించబడి ఉండేది ఉంటే, అక్కడికి వచ్చి జమాత్ తో చేసుకోవాలి. లేదా అంటే, వారు ఒంటరిగా చేసుకోవచ్చు. తమ తమ ఇండ్లల్లో.

ఈ విషయంలో కూడా హనఫియా, మాలికీయా, షాఫియా, హంబలియా ప్రతీ ఒక్కరి ఏకాభిప్రాయం ఉన్నది. ఈ విధంగా సోదర మహాశయులారా, సలాతుల్ కుసూఫ్, సలాతుల్ ఖుసూఫ్, సూర్య గ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని, వీటి యొక్క నమాజ్ విషయం మనకు తెలిసింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0wjHmWPFU4R2_gIgP3F5vP

ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) [పుస్తకం]

ఇక్కడ పూర్తి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి
ఆదర్శ మహిళ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)
 [డైరెక్ట్ PDF] [203 పేజీలు] – [అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్]

మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలు, దినచర్యలు, ఆయన వ్యవహార సరళి గురించి తెలిపే పుస్తకాలు తెలుగు భాషలో కొన్ని వచ్చాయి. అలాగే, ఆయా గ్రంధాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సతీమణులను గురించి వారి గృహస్థ జీవితంలోని ముఖ్య సంఘటనలను గురించి సవివరంగా తెలిపే పుస్తకాలు తెలుగులో దాదాపు లేవనే చెప్పవచ్చు.

ఒక మహాసాధ్వి జీవిత చరిత్రనే గాకుండా భార్యవలన భర్తకు ఏవిధంగా మనశ్శాంతి, ఊరట లభిస్తాయో, లభించాలో ఈ పుస్తకం మనకు వివరిస్తుంది. ఆయా పరిస్థితులలో తనకెదురయిన వివిధ సంఘటనల్ని ఇబ్బందుల్ని, పరీక్షల్ని ఆ మహిళా లోక మార్గదర్శి ఎలా అధిగమించారో కళ్ళకు కట్టినట్లు చూపే ఓ సజీవ దృశ్య కావ్యం ఈ గ్రంధం. ఇంకా ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి’ అన్నట్లుగా కష్టాలయినా, సుఖాలయినా భర్తతో ఆమె ఎలా కలిసి పంచుకున్నారో మనకు విశదమవుతుంది.

నేటి ముస్లింల పతనావస్థకు గల కారణాలలో సగభాగం ముస్లిం మహిళలే అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. కాని రకరకాల భయాలకు భ్రమలకు దాసోహం కావడాలు, సమాధుల పూజలు, అనాగరిక మూఢాచారాలు, వివాహ సందర్భాల లోనయినా, దుఃఖ సందర్భాలలోనయినా జరుగుతున్న మూఢత్వపు తంతులు, దుబారా వ్యయం మన ప్రాంగణాలలో బ్రతికి బట్టకడుతున్నాయంటే అందుకు కారణం ఏమిటీ? నేటి ముస్లిం మహిళల్లో ఇస్లామీయ చైతన్యం మృగ్యమవడం కాదా? అయితే ఒక్క విషయం! ముస్లిం స్త్రీ యొక్క పరిపూర్ణ నమూనా ఏదీ వారికి లభించనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు? ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ హస్తం ఉండాలి, ఉంది, అంటే ఆ విజయం సాధించిన పురుషుల తోడ్పాటూ, సహకారం, సమన్వయం వారికి లభించడం వల్లనే కదా!

ఇక ఈ పుస్తకం ద్వారా…

దైవదౌత్య ప్రాతినిధ్యంలో సహధర్మచారిణిగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రాంగణంలో దాదాపు 40 ఏళ్ళు బోధనామృత మణిదీపికగా భాసిల్లి, విశ్వాసుల మాతగా ఆచంద్రతారార్కం కీర్తించబడే మహిళా శిరోమణి అపురూప వ్యవహరణా శైలిని మహిళాలోకానికి పరిచయం చేసే భాగ్యం లభించడం మా అదృష్టం!!

స్త్రీ… తరతరాలుగా పీడనకు, పురుషాహంకారానికీ బలవుతూ వచ్చింది. స్త్రీ తన తోటి స్త్రీల వల్ల కూడ చిక్కులకు, వేదనకు, క్షోభకు గురి అయింది. అవుతూ వుంది కూడా. అందుకేనేమో “స్త్రీకి స్త్రీయే శత్రువు” అన్నారు.

‘పితారక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, సుతా రక్షతి వార్ధక్కే, న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అంటూ కొందరు స్త్రీకి స్వాతంత్య్రమే లేదు పొమ్మన్నారు. మరికొందరు మహానుభావులు స్త్రీని మోక్ష సాధనకు ఆటంకమని ఘోషించారు.

ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అనాగరిక అరబ్బులు స్త్రీని భోగ వస్తువుగా, కోర్కెలు తీర్చుకునే యంత్రంగా చేసుకున్నారు.

ఇస్లాం ఈ విధమయిన రెండు అతివాద భావాలను ఖండిస్తూ ఆమె శారీరక, మానసిక స్వభావానికి అతికినట్లుగా సరిపోయే సమతౌల్యంతో కూడిన కార్యక్షేత్రాన్ని సూచించింది. “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది” అంటూ స్త్రీకి మహోన్నత స్థానం కల్పించింది. స్వాతంత్ర్యం, ఆస్తిహక్కు, సమాజంలో సమున్నత స్థానం ఇస్లాం ద్వారా మాత్రమే స్త్రీకి లభించాయి. ఇస్లాం స్త్రీకి కల్పించిన స్థానం ఎటువంటిదో పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. ఆధారాల్లేని విమర్శలతో, పసలేని వాదాలతో వ్యాఖ్యలు చేయడంలో ఔచిత్యం ఏముంటుంది?

హజ్రత్ ఆయిషా జీవితం సుఖ, దుఃఖాల సంభరితం. జీవితంలో ఎన్నో. మార్పుల్ని, కష్టాల్ని, ఎదుర్కొన్నారా మహావనిత. భర్తతో కాపురం, విరహం, ఇల్లు చక్కబెట్టుకోవడం, సవతుల ఈర్ష్యా అసూయల్ని ఆమె చవిచూశారు. వైధవ్యం పొందారు. అనాధ అయ్యారు. ఉత్థాన పతనాల తెరల వెనుక జరిగిన రాజకీయాలను అవలోకనం చేసుకున్నారు. వైముఖ్య ధోరణులను ఎదుర్కొన్నారు. ఒకటేమిటి జీవితంలోని అన్ని పరిస్థితుల్నీ అధిగమించడంలో ఆయా సందర్భాలలో ఆమె వ్యవహరణా సరళి నేటి ముస్లిం స్త్రీకి మార్గదర్శకం. నైతిక, విజ్ఞాన ఆచరణాత్మక ఆణిముత్యాలతో సుసంపన్నమైన ఆమె పవిత్ర జీవితం చదవదగ్గదీ, చదివి తీరవలసినదీను.

ఇందులో మహిళాలోకానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాల్యం నుండే విద్యా విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకోవడం, భర్త ఆశయాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం, నిస్సంతు అయినప్పటికీ అనాధ పిల్లల్ని పెంచి, వారికి బోధనా శిక్షణలు గరపడంతోపాటు, వారి వివాహాలు చేయడం, భర్త వియోగానంతరం ఆయన నడిపిన ఉద్యమాన్ని కొనసాగించడం, ధార్మిక తీర్పులు ఇవ్వడం, ఇంకా చాలా చాలా విషయాలు ఈనాటికీ ఆదర్శనీయములే. ఒక మహిళ ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబర్చడం చూస్తుంటే “ముదితల్ నేర్వగరాని విద్య కలదే!” అనిపిస్తుంది.

పాఠకులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పుస్తకం అభిమానపాత్రం కావాలని కాంక్షించడంలో విడ్డూరమేముందీ..!? మజ్లిసె ఇషాఅతె ఇస్లాం తెలుగు ప్రచురణా విభాగం స్థాపకులైన మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్ గారి ప్రోద్బలం, సోదరులు ముహమ్మద్ అజీజు రహ్మాన్ గారి ప్రోత్సాహం… అన్నింటికీ మించి అల్లాహ్ తోడ్పాటు వల్ల ఇది పుస్తక రూపం దాల్చింది. ఇందలి లోపాలను పాఠకులు దృష్టికి తెస్తే మలిసారి ముద్రణలో సరిదిద్దుకోగలము. ఈ చిరు కృషిని కారుణ్య ప్రభువు స్వీకరించాలని వేడుకుంటూ..

కృతజ్ఞతలతో
ఇఖ్బాల్ అహ్మద్

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ వృత్తాంతం

బిస్మిల్లాహ్

10వ అధ్యాయం – హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ

1763. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హాా)తనపై అపవాదు వేసిన వారి మాటలను గురించి ఇలా తెలియజేశారు :-

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటే, తమ భార్యలను గురించి చీటి వేసి, అందులో ఎవరి పేరు వస్తే ఆమెను తమ వెంట తీసికెళ్ళేవారు. ఒక యుద్ధ [1] సందర్భంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాలో ఎవరిని తమ వెంట తీసికెళ్ళాలనే విషయమయి చీటీ వేశారు. ఆ చీటీలో నా పేరు వచ్చింది. అప్పుడు నేను ఆయన వెంట బయలుదేరాను. ఈ సంఘటన పరదా ఆదేశం అవతరించిన తరువాత జరిగింది. అందువల్ల నన్ను ఒంటె మీద అంబారీలో కూర్చోబెట్టారు. ఒంటె మీది నుంచి దిగవలసి వచ్చినప్పుడు నన్ను అంబారీలో ఉంచే క్రిందికి దించేవారు. సరే మేము బయలుదేరాము. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆ యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో మేము మదీనా పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ప్రదేశానికి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ రాత్రికి అక్కడ విడిది చేయాలని ప్రకటించబడింది.

నేనీ ప్రకటన విని (ఒంటె మీది నుంచి నా అంబారీని దించిన తరువాత) సహజ అవసరార్ధం సైన్యాలకు కాస్త దూరంగా బహిర్భూమికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నా అంబారీ దగ్గరకు తిరిగొచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూసుకుంటే నా ముత్యాల హారం కన్పించలేదు. అది తెగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వెనక్కి వెళ్ళి వెతకడం ప్రారంభించాను. ఇలా వెతుక్కోవడంలో ఆలస్యమయిపోయింది. ఈలోగా నా అంబారీ ఎత్తే వాళ్ళు నేను అంబారీలో కూర్చొని ఉన్నాననుకొని దాన్ని ఎత్తి నా ఒంటె మీద పెట్టారు. ఆ రోజుల్లో మేము స్రీలము అన్నం తక్కువగా తినడం వల్ల బక్కగా ఉండేవాళ్ళము. ఎముకల మీద మాంసమే ఉండేది కాదు. అందువల్ల వారు నా అంబారీ ఎత్తి పెట్టేటప్పుడు బరువును అంచనా వేయలేకపోయారు. అదీగాక నేను నవ యౌవనంలో ఉండిన బాలికను. ఆ తరువాత వారు ఒంటెను లేపి వెళ్ళిపోయారు. నేను నా కంఠహారం వెతుక్కొని తిరిగి వచ్చేటప్పటికి సైన్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడ పిలిచేవారు గాని, కేక వేస్తే జవాబిచ్చేవారు గాని ఎవరూ లేరు. నేను అంబారీలో కన్పించకపోతే వాళ్ళే నా దగ్గరకు తిరిగొస్తారని తలచి నేను సైన్యం విడిది చేసిన ప్రదేశంలోనే కూర్చున్నాను.

కాస్సేపటికి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ సలమి  జక్వానీ  (రది అల్లాహు అన్హాు)సైన్యాలకు వెనకాలగా నడచి వస్తున్నారు. ఆయన మరునాడు ఉదయం నేను నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎవరో పడుకున్నారని తలచి ఆయన సమీపానికి వచ్చి చూశారు. ఆయన లోగడ పరదా ఆదేశం రాక పూర్వం నన్ను చూసి ఉండటం వల్ల, దగ్గరికొచ్చి చూడగానే నన్ను గుర్తుపట్టి “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌” అన్నారు. ఈ అలికిడికి నేను కళ్ళు తెరిచాను. ఆయన్ని చూసి వెంటనే ఓణీతో నా ముఖాన్ని కప్పుకున్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మేము ఒకరితోనొకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నేనాయన నోట “ఇన్నాలిల్లాహి” అనే మాట తప్ప మరేదీ వినలేదు. ఆ తరువాత ఆయన ఒంటె (దిగి దాని)ని నేల మీద కూర్చోబెట్టారు. నేను లేచి దాని మీద ఎక్కి కూర్చున్నాను. ఆయన ఒంటె ముక్కుతాడు పట్టుకొని ముందుకు నడిచారు. ఈ విధంగా మేము ఎండ పెటపెటలాడే (మిట్ట మధ్యాహ్నం) వేళకు సైన్యాలు విడిది చేసిన చోటుకు చేరుకున్నాము. (ఈ మాత్రం సంఘటనకే) వారు (నా మీద అపవాదు వేసి) నాశనమయ్యారు. ఈ అపవాదును లేపడంలో అబ్దుల్లా బిన్‌ ఉబై ప్రధాన పాత్ర వహించాడు.

ఈ హదీసును ఉల్లేఖించిన వారిలో ఒకరైన హజ్రత్‌ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- అతని (అంటే అబ్దుల్లా బిన్‌ ఉబై) సమావేశంలో ఈ అపవాదును గురించి బాహాటంగా చర్చ జరిగింది. రకరకాల మాటలు కల్పించబడ్డాయి. అతను వారిని సమర్ధిస్తూ వారు చెప్పే ప్రతి మాటనూ శ్రద్ధగా వింటూ విషయం మరింత తీవ్రరూపం దాల్చేలా (దానికి మిర్చీ మసాలా రాసి) మాట్లాడేవాడు. అపవాదు లేపిన వారిలో హస్సాన్‌ బిన్‌ సాబిత్ (రది అల్లాహు అన్హాు), మిస్తహ్‌ బిన్‌ ఉసాసా (రది అల్లాహు అన్హాు),హమ్నా బిన్త్ జహష్‌ (రది అల్లాహు అన్హా)ల పేర్లు మాత్రమే నాకు తెలుసు. వీరే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. వారి [2] పేర్లు నాకు తెలియదు. కాకపోతే దివ్య ఖుర్‌ఆన్‌లో “ఈ అపవాదును మీలోనే ఒక ముఠా లేపింది” (24:11) అనే సూక్తిని బట్టి వారొక ముఠాకు చెందిన వారని మాత్రం నాకు తెలుసు. ఆ ముఠాలో ప్రధాన సూత్రధారి అబ్దుల్లా బిన్‌ ఉబయ్యె. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తన ముందు ఎవరైనా హజ్రత్ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)ని మాత్రం నిందిస్తే సహించేవారు కాదు. “నా తల్లిదండ్రులు, నా గౌరవ ప్రతిష్టలు ముహమ్మద్‌ మహనీయు (సల్లలాహు అలైహి వ సల్లం)ని గౌరవ ప్రతిష్టల పరిరక్షణకై సమర్పితం. అందులోనే నా గౌరవం ఇమిడి ఉంది – అనే కవిత హస్సానే కదా చెప్పింది” అని అంటారు ఆమె. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)(తమ కథనాన్ని) కొనసాగిస్తూ ఇలా తెలియజేస్తున్నారు :-

ఆ తరువాత మేము మదీనాలో ప్రవేశించాము. మదీనా తిరిగొచ్చిన తరువాత నేను ఓ నెల రోజుల దాకా జబ్బుపడ్డాను. అపవాదు లేపిన వారి మాటలు విని ప్రజలు పరి పరి విధాలా చెప్పుకునేవారు. కాని నాకా సంగతే తెలియదు. అయితే నేను ఇది వరకు జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా పట్ల కనబరిచే ప్రేమ, సానుభూతుల్ని ఇప్పుడు జబ్బు పడి ఉన్నప్పుడు కనబరచకపోవడం గమనించి నాక్కొంచెం అనుమానం వచ్చేది. నేనీ జబ్బుపడి ఉన్న రోజుల్లో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా దగ్గరికి వచ్చి సలాం మాత్రం చేసేవారు. (నా ఆరోగ్యం గురించి నన్నడగకుండా) “ఈవిడకు ఎలా ఉంది?” అని (ఇంట్లో ఉండే ఇతర సభ్యుల్ని) అడిగేవారు. ఈ ధోరణి మాత్రమే నాక్కాస్త అనుమానం కలిగించేది (ఆయన నా మీద అలిగారేమోనని). అంతకు మించి నాకు అపవాదు గురించి బొత్తిగా తెలియదు.

నేను జబ్బు నుండి కొంచెం కోలుకున్న తరువాత ఓ రోజు ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)తో కలసి “మనాసా” ప్రదేశానికి బయలుదేరాను. ఇది మా స్త్రీల బహిర్భూమి. మేమక్కడికి రాత్రి వేళల్లో మాత్రమే వెళ్ళొస్తుంటాము. ఇది మా ఇండ్ల దగ్గర మరుగుదొడ్లు నిర్మించబడని నాటి సంగతి. ప్రాచీన అరబ్బుల అలవాటు ప్రకారం మేము బహిర్భూమి కోసం (ఊరి బయట చెట్టు చేమలుండే) అడవి ప్రదేశానికి వెళ్ళేవారము. ఆనాడు ఇండ్ల సమీపంలో మరుగుదొడ్లు నిర్మించడాన్ని జనం అసహ్యించుకునేవారు. ఉమ్మె మిస్తహ్‌ (అంటే మిస్తహ్‌ తల్లి) అబూరహమ్‌ బిన్‌ ముత్తలిబ్‌ బిన్‌ అబ్దుమునాఫ్‌ గారి కుమార్తె. ఆమె తల్లి బిన్తె సఖర్‌ బిన్తె ఆమిర్‌ (మా నాన్న) హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హాు)కు పినతల్లి అవుతుంది. నేను ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)ఆ తరువాత బహిర్భూమి నుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాము. దారిలో ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)కాలు దుప్పటిలో ఇరుక్కుపోయి ఆమె తూలి పడిపోయింది. అప్పుడామె (అప్రయత్నంగా) “మిస్తహ్‌ పాడుగాను!” అని అన్నది. నేను (విషయం అర్ధం గాక) “నువ్వు చాలా దారుణమైన మాటన్నావు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నిందిస్తున్నావా నువ్వు?” అని అడిగాను. దానికామె “పిచ్చి పిల్లా! అతనేమన్నాడో నీకేమైనా తెలుసా?” అని అన్నది. నేను “ఎమన్నాడేమిటి?” అని అడిగాను. అప్పుడామె నాపై అపనింద వేసిన వారు ఎలాంటి మాటలు కల్పించి ప్రచారం చేస్తున్నారో తెలియజేసింది. ముందే జబ్బు పడి ఉన్న నేను ఈ మాటలు వినడంతో నా జబ్బు మరింత ఎక్కువైపోయింది. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వచ్చి ఉన్నారు. నన్ను చూసి ఆయన సలాం చేశారు. ఆ తరువాత “ఈవిడ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగారు (ఇంట్లోని ఇతర సభ్యులతో). నేనాయనతో “నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా?” అని అన్నాను. ఈ అనుమతి అడగడంలో నా ఉద్దేశ్యం, నా తల్లిదండ్రుల ఇంటికెళ్ళి ఈ వదంతి గురించి నిజానిజాలు తెలుసుకోవాలన్నదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు పుట్టింటికి వెళ్ళేందుకు అనుమతిచ్చారు. నేను (వెళ్ళి మా అమ్మతో “అమ్మా! జనం ఏమిటి ఇలా చెప్పుకుంటున్నారు?” అని అడిగాను. దానికామె సమాధానమిస్తూ “అమ్మా! బాధపడకు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండి అతనామెను బాగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమె సవతులు ఆమెలో ఎదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇది సహజం” అని అన్నది. నేనీ మాట విని “సుబ్‌హానల్లాహ్‌! (ఆశ్చర్యార్ధక పదం) ఇప్పుడు మరికొందరు కూడా ఇలాంటి అభూత కల్పనలకు పాల్పడుతున్నారా?” అని అన్నాను. ఆ రాత్రంతా నా కంటిమీద కునుకే లేదు. తెల్లారే దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. తెల్లవారిన తరువాత కూడా నా కన్నీరు ఆగలేదు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) దివ్యావిష్కృతి (వహీ) అవతరణలో ఆలస్యమయినందున హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రది అల్లాహు అన్హాు), హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రది అల్లాహు అన్హాు)లను పిలిపించి, ఆయన తమ భార్య నుండి (అంటే నా నుండి) విడిపోయే విషయమయి వారిద్దర్నీ సంప్రదించారు. అప్పుడు హజ్రత్‌ ఉసామా (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ  భార్యామణిని మీ నుండి వేరు చేయకండి. ఆమెలో మేము మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. అయితే హజ్రత్‌ అలీ మాట్లాడుతూ “దైవప్రవక్తా! అల్లాహ్ మీకు ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. ఆయిషా (రది అల్లాహు అన్హా)యే గాకుండా (లోకంలో) చాలా మంది స్త్రీలున్నారు. మీరామె సేవకురాలిని అడిగి చూడండి, ఆమె వాస్తవమేమిటో చెబుతుంది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (నా సేవకురాలు) హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)ను పిలిపించి “బరీరా! నీకు ఆయిషా (రది అల్లాహు అన్హా) పట్ల అనుమానం కలిగించే సంఘటన ఎదైనా జరిగినట్లు నువ్వు చూశావా?” అని అడిగారు. హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)సమాధానమిస్తూ “మీకు సత్యధర్మమిచ్చి పంపిన శక్తి స్వరూపుని సాక్షి! హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)లో నాకు అనుమానం కలిగించే ఎలాంటి చెడు విషయం నేనింతవరకు చూడలేదు. కాకపోతే ఆమె ఇంకా చిన్నపిల్లే అయినందున, ఇంట్లో పిండి కొట్టి ఉంచితే దాన్ని (నిర్లక్ష్యంగా) వదిలేసి నిద్రపోతుంది. ఈలోగా మేక వచ్చి దాన్ని కాస్తా తినిపోతుంది” అని అన్నది.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విన్న తరువాత ఆ రోజే (మస్జిద్లో) వేదిక ఎక్కి (కపట విశ్వాసి) అబ్దుల్లా బిన్‌ ఉబైని శిక్షించే విషయం గురించి ప్రజలను అడిగారు. ఆయన ప్రజలను సంబోధిస్తూ ఇలా అన్నారు: “(సోదర) ముస్లింలారా! నా భార్యపై అపనింద మోపి నన్ను, నా కుటుంబాన్ని బాధించిన వ్యక్తిపై నా తరపున ప్రతీకారం తీర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యలలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు. అపవాదు మోపబడిన ఆ వ్యక్తిలో కూడా నేనింతవరకు ఎలాంటి చెడు చూడలేదు. అతను నా ఇంటికి ఎప్పుడొచ్చినా నేనింట ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పలికిన ఈ మాటలు విని బనీ అబ్దుల్ అష్‌హల్‌ ఉప తెగకు చెందిన హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)లేచి “దైవప్రవక్తా! నేను మీ తరపున ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తి ఔస్‌ తెగవాడై ఉంటే నేను స్వయంగా అతడ్ని హతమారుస్తాను. ఒకవేళ అతను మా సోదర తెగ ఖజ్‌రజ్ కు చెందిన వాడయితే అతడి గురించి మీరు ఆజ్ఞాపించండి, మేము మీ  ఆజ్ఞను పాటిస్తాము” అని అన్నారు. ఈ మాట విని ఖజ్రజ్‌ తెగ నాయకుడు హజ్రత్  సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)లేచి నిలబడ్డారు. ఆయన హజ్రత్‌ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)తల్లికి వరుసకు సోదరుడవుతారు. (అంటే ఆమె పిన తండ్రి కొడుకు). ఆయన సాధారణంగా మంచి మనిషే. కాని సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)మాటలు విన్న తరువాత ఆయనలో అజ్ఞాన కాలంనాటి జాతీయ దురభిమానం పెల్లుబికింది. దాంతో ఆయన (ఉద్రేక పూరితుడయి) “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నీవు అబద్ధమాడుతున్నావు. నీవతడ్ని హతమార్చవు, హతమార్చలేవు కూడా. అతను గనక నీ తెగవాడయి ఉంటే, అతను చంపబడటానికి నీవు ఎన్నటికీ కోరవు” అని అన్నారు హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)తో.

హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)పిన తండ్రి కొడుకు హజ్రత్‌ ఉసైద్‌ బిన్‌ హజీర్‌ (రది అల్లాహు అన్హాు)ఈ మాట విని (దిగ్గున) లేచి నిలబడ్డారు. ఆయన సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)ని సంబోధిస్తూ “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నువ్వొట్టి అబద్దాల రాయుడివి. మేమతడ్ని తప్పకుండా సంహరిస్తాం. నువ్వు కపట విశ్వాసిలా ఉన్నావు. అందుకే నువ్వు కపట విశ్వాసుల కొమ్ముకాస్తున్నావు అని అన్నారు.” ఈ సంభాషణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఔస్‌, ఖజ్రజ్ రెండు తెగలు పరస్పరం భగ్గుమన్నాయి. కొట్లాటకు సిద్దమయ్యాయి. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వేదికపై నిలబడి ఉభయ తెగల వారికీ మాటి మాటికి సర్ది చెబుతూ వారిని శాంతపరచడానికి ప్రయత్నించారు. చివరికి ఎలాగో అందరూ శాంతించారు. గొడవ సద్దుమణిగింది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా మౌనంగా ఉండిపోయారు. నేనా రోజంతా ఏడుస్తూనే  ఉండిపోయాను. కంటి మీద కునుకు కూడా రాలేదు.

నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. నేనిలా ఒక పగలు, రెండు రాత్రులు నిరంతరాయంగా దుఃఖిస్తూ ఉన్నాను. కన్నీరు ఆగలేదు. నిద్ర కూడా పట్టలేదు. ఏడ్చి ఏడ్చి నా గుండె పగిలి పోతుందా అన్పించింది. కాస్సేపటికి ఒక స్త్రీ వచ్చి లోపల ప్రవేశించడానికి అనుమతి అడిగింది. నేనామెకు అనుమతిచ్చాను. ఆమె కూడా నాతోపాటు కూర్చొని ఏడ్వసాగింది. మేమా స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (మా ఇంటికి) వచ్చారు. ఆయన సలాం చేసి కూర్చున్నారు. నా మీద అపనింద మోపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన నా దగ్గర కూర్చోలేదు. ఒక నెల గడచిపోయినా అపనింద విషయంలో ఆయనపై ఎలాంటి దివ్యావిష్కృతి (వహీ) అవతరించలేదు.

ఆయన కూర్చొని ముందుగా షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. ఆ తరువాత ఇలా అన్నారు : “ఆయిషా! నీ గురించి నేనీ మాట విన్నాను. నీవు ఏ పాపమెరగని దానివయితే త్వరలోనే అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ నీ వల్ల ఎదైనా తప్పు జరిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకో. దాసుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని (తప్పకుండా) క్షమిస్తాడు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సంభాషణ ముగించగానే నా కన్నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత నా కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు. నేను మా నాన్నగారి వైపుకు తిరిగి “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పిన దానికి నా తరఫున మీరు సమాధానం ఇవ్వండి” అని అన్నాను. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “(అమ్మాయ్‌!) అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ విషయంలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఏమని సమాధానమివ్వాలో నాకేమో అర్ధం కావడం లేదు” అని అన్నారు. ఆ తరువాత నేను మా అమ్మతో “(అమ్మా!) దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు నువ్వయినా సమాధానమివ్వు” అని అన్నాను. కాని మా అమ్మ కూడా “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఎం సమాధానమివ్వాలో నాకేమో తోచడంలేదు” అని అన్నది.

ఆ తరువాత నేను మాట్లాడటం మొదలెట్టాను. అప్పటికి నేను పెద్దగా వయసు లేని బాలికను. ఖుర్‌ఆన్‌ కూడా నేనెక్కువగా పఠించలేదు. అయినానేను మాట్లాడటానికి ఉపక్రమించాను. “మీరీ (అపనింద) మాటను బాగా విని ఉండటం వల్ల అది మీ అందరి హృదయాల్లో తిష్టవేసింది. అందరూ దీన్ని నిజమని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏ పాపమెరుగని దాననంటే మీకు నమ్మకం కలగదు. ఒకవేళ నేను తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటే మీరు వెంటనే నమ్ముతారు. కాని నేను ఎలాంటి పాపానికీ ఎంత మాత్రం పాల్పడలేదు. ఆ సంగతి అల్లాహ్ కి  తెలుసు. అందువల్ల అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి, మీ పరిస్థితి హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) పరిస్థితిలా ఉంది. ఈ స్థితిలో నేను హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) అన్న మాటనే అంటాను. “ఇప్పుడు నేను ఉత్తమ రీతిలో సహనం వహిస్తాను. మీరు కల్పించి చెబుతున్న దాని గురించి నేనిక అల్లాహ్ ను  మాత్రమే సహాయం అర్ధించాలి’ (యూసుఫ్‌-18) అని అన్నారు ఆమె.”

…… ఇలా మాట్లాడిన తరువాత నేను పడక మీదికెళ్ళి పక్కకు తిరిగి పడుకున్నాను. నేను ఏ పాపమెరగని అమాయకురాలినని అల్లాహ్ కి  బాగా తెలుసు. అందువల్ల ఆయన నా పాతివ్రత్యాన్ని తప్పకుండా బహిర్గతం చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉండింది. అయితే అల్లాహ్ నా ఈ వ్యవహారంలో (ప్రళయం దాకా) నిత్యం పఠించబడేలా దివ్య వచనాలను అవతరింపజేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా వ్యవహారంలో అల్లాహ్ ప్రత్యేకంగా (దివ్య)వాణిని అవతరింపజేయడానికి నేనంతటి గొప్పదానిని కూడా కాను. కాని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కలలో అలాంటిదేదైనా కన్పిస్తుందని మాత్రం నాకు నమ్మకముండింది.

అయితే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ స్థానం నుండి లేవకుండా అలాగే కూర్చున్నారు. అటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేచి బయటకు వెళ్ళలేదు. (ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా కూర్చుండిపోయారు). అంతలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై ‘దివ్యావిష్కృతి’ (వహీ) అవతరించింది. దివ్యావిష్కతి సమయంలో ఎర్పడే అనిర్వచనీయమైన బాధ ఆయన్ని క్రమ్ముకుంది. దైవవాణి మోపిన భారం వల్ల తీవ్రమైన చలిలో సయితం ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలసాగాయి. కాస్సేపటికి ఈ పరిస్థితి దూరమయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పెదవులపై దరహాసం తొణికిసలాడింది. ఆయన నోట వెలువడిన మొట్టమొదటి వాక్యం (చూడండి). “ఆయిషా! అల్లాహ్  నీ పాతివ్రత్యాన్ని ధృవపరిచాడు” అని అన్నారు ఆయన.

మా అమ్మ ఈ మాట వినగానే “ఇక లే. లేచి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు కృతజ్ఞతలు చెప్పుకో” అని అన్నది. నేను (తల అడ్డంగా తిప్పుతూ) “నేను లేవను. అల్లాహ్ సాక్షి! పరమోన్నతుడయిన నా ప్రభువుకు తప్ప మరెవరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోను” అని అన్నాను – దివ్యావిష్కృతి ద్వారా నూర్‌ సూరాలోని ఈ సూక్తులు వెలువడ్డాయి :

“ఈ అపవాదును మీలోనే ఒక వర్గం లేవదీసింది. (జరిగిందేదో జరిగింది, కాని) దీన్ని మీరు (మీ విషయంలో) చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు) మంచిదే. ఇందులో ఎవరు ఎంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారం గురించి అత్యధిక బాధ్యతను నెత్తిమీద వేసుకున్న ప్రధాన పాత్రధారికి మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష కాచుకొని ఉంది.” (11)

“ఈ నిందారోపణను వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి లోనుకాకుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ఇది పూర్తిగా నిరాధారమైన అపనింద అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ నిందారోపణను నిరూపించుకోవడానికి) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు. (తీసుకు రాలేరు కూడా, కనుక) అల్లాహ్ దృష్టిలో వారే పచ్చి అబద్దాలరాయుళ్ళు. (12, 13).

“మీ మీద ఇహపరలోకాల్లో అల్లాహ్ అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయి ఉంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఓ ఘోరమైన విపత్తు వచ్చిపడేదే. ఈ అసత్యారోపణ (ఎంత చెడ్డ విషయమో కాస్త మీరే ఆలోచించండి అది) మీ మధ్య ఒకరి నుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూ పోయింది. మీకు వాస్తవం ఎమిటో తెలియని విషయం మీనోట వెలువడసాగింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తూ ఉండేవారు. కాని అల్లాహ్ దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం. (14-15)

“ఈ విషయం వినగానే “ఇలాంటి మాటలు పలకడం మనకు తగదు, అల్లాహ్ పరిశుద్దుడు. ఇది పూర్తిగా నీలాపనింద అని మీరు ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నటికీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. (మీరు విషయాన్ని అర్ధం చేసుకోవడానికి) అల్లాహ్ మీకు తన బోధనలను విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసిన వాడు, ఎంతో వివేకవంతుడు.” (16-18)

‘“విశ్వసించినవారి మధ్య అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (అశ్లీలం సమాజం మీద ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహ్ కి తెలుసు; మీకు తెలియదు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలు గనక లేకపోయి ఉంటే, అల్లాహ్ వాత్సల్యమూర్తి, దయామయుడు అయి ఉండకపోతే (మీ మధ్య వ్యాపింపజేయబడిన ఈ విషయం దారుణమైన పరిణామాలకు దారి తీసి ఉండేది). (19, 20)

“కనుక విశ్వాసులారా! షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి చెడు, అశ్లీలతలను గురించే ఆదేశిస్తాడు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏ ఒక్కడూ పరిశుద్ధుడు కాలేడు. అయితే అల్లాహ్ తాను కోరిన వ్యక్తిని పరిశుద్ధం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు. సమస్తం ఎరిగిన వాడు.” (21)

“మీలోని ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు. (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలి వదలి వలస వచ్చిన వారికి సహాయం చేయము అని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, ఉదారంగా వ్యవహరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి, దయామయుడు.” (22)

“శీలవంతులయిన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు. వారి కోసం కఠినాతి కఠిన శిక్ష ఉంది.” (23)

“ఇలా అపనిందలు మోపేవారు, స్వయంగా తమ నోళ్ళు, తమ కాళ్ళు చేతులే తమ అకృత్యాలను గురించి (తమకు వ్యతిరేకంగా) సాక్ష్యమిచ్చే రోజు ఒకటి వస్తుందన్న సంగతి మరచిపోకూడదు. ఆ రోజు అల్లాహ్ వారి కర్మలను బట్టి వారికి పూర్తి ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి అల్లాహ్ యే సత్యమని, అల్లాహ్ యే నిజాన్ని నిజం చేసి చూపేవాడని.” (24, 25)

అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటల నుండి వారు పరిశుద్ధులు, పవిత్రులు. వారి కోసం మన్నింపు, ఉదారమైన ఉపాధి ఉన్నాయి.” (26)

(దివ్య ఖుర్‌ఆన్‌ – 24:11-26)

ఈ సూక్తుల్ని అల్లాహ్ నా పవిత్రత, పాతివ్రత్యాలను గురించి అవతరింపజేశాడు. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(తమ నిరుపేద బంధువయిన;) మిస్తహ్‌ బిన్‌ అసాసా (రది అల్లాహు అన్హాు)కు ధన సహాయం చేస్తుండేవారు. అయితే (నా మీద వచ్చిపడిన అపనిందలో ఆయన కూడా భాగం పంచుకోవడం వల్ల) ఆయన (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “అల్లాహ్ సాక్షి! (నా కుమార్తె) ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)అన్న మాటలకు (నా హృదయం తూట్లు పడింది) నేనిక నుండి అతని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను ‘ అని అన్నారు. ఆయనలా అన్నందుకు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు : “మీలో దయానుగ్రహం పొందినవారు, (ఆర్థిక) స్తోమత కలిగిన వారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, ఇల్లు వాకిలి వదలి అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేయబోమని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, వారి పట్ల ఉదారంగా మసలుకోవాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి. దయామయుడు.” (24:22) ఈ సూక్తి అవతరించిన తరువాత హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(మనసు మార్చుకొని) “ అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను క్షమించాలనే నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి నేనీ సహాయాన్ని ఎన్నటికీ నిలిపి వేయను” అని అన్నారు. ఆయన మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)కు ఇది వరకు ఎంత ధన సహాయం అంద చేస్తుండేవారో ఆ సహాయాన్ని తిరిగి అందజేయడం (ప్రారంభించారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా వ్యవహారం గురించి (విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్‌ జైనబ్‌ బిన్తె జహష్‌ (రది అల్లాహు అన్హా)ని కూడా విచారించారు. “ఈ విషయంలో నీకేమయినా తెలుసా?” అన్నారు ఆయన. దానికామె “దైవప్రవక్తా! నేను నా కళ్ళు చెవుల విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటాను. (చూడకుండా, వినకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడను ). అల్లాహ్ సాక్షి! నేనామెలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) భార్యలలో ఒక్క జైనబ్‌ (రది అల్లాహు అన్హా) మాత్రమే నాకు పోటీగా నిలిచే స్రీ. (అయినప్పటికీ ఆమె ఈ వ్యవహారంలో సవతి అసూయ ప్రదర్శించకుండా న్యాయంగా మాట్లాడారు) ఆమెలోని భక్తి పరాయణత వల్ల అల్లాహ్ ఆమెను (ఈ రొంపి నుండి) కాపాడాడు. అయితే హజ్రత్‌ జైనబ్‌ (రది అల్లాహు అన్హా)ను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ మాట్లాడే ఆమె సోదరి మాత్రం అపవాదు లేపిన వారితో చేరి నాశనమయిపోయింది.

అపవాదు వ్యవహారంలోకి, నాతో పాటు ఈడ్చబడిన ఆ వ్యక్తి [3] అన్న పలుకులు కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన “అల్లాహ్ మాత్రమే పరిశుద్దుడు, పవిత్రుడు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు వరకు నేను ఏనాడూ ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నారు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారని హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తెలిపారు.

(సహీహ్‌ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజీ, 34వ అధ్యాయం – హదీసిల్‌ ఇఫ్క్‌)

1764. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)కథనం :- నా మీద లేనిపోని అపనింద మోపబడినప్పుడు నాకా సంగతే తెలియదు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రసంగించడానికి (వేదికపై) నిలబడ్డారు. మొదట ఆయన షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. తరువాత అల్లాహ్ ని ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా స్తుతించారు. ఆ తరువాత ఇలా అన్నారు. “నా భార్య మీద అపనింద మోపిన వ్యక్తిని గురించి మీరు నాకేదయినా సలహా ఇవ్వండి. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నా కుటుంబ నభ్యులను గురించి ఎలాంటి చెడు విషయం కూడా ఎన్నడూ నా దృష్టికి రాలేదు. నా భార్యతో పాటు ఈ అపనిందలో ఇరికించబడిన వ్యక్తి గురించి కూడా నేనెప్పుడూ చెడు విషయం వినలేదు. అతను నా ఇంటికి నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు. నేనెప్పుడైనా ప్రయాణమయి ఎక్కడికైనా వెళ్తే అతను కూడా నాతో పాటే ఉండేవాడు.”

హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా )కథనం :- దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా యింటికి వచ్చి నా గురించి నా సేవకురాలిని విచారించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ఎంత మాత్రం లేదు. నేను ఆయిషా (రది అల్లాహు అన్హా)లో ఏనాడూ ఎలాంటి చెడునూ చూడలేదు. కాకపోతే ఆమె (అప్పుడప్పుడు) ఆదమరచి నిద్ర పోతుంది, అప్పుడు మేక వచ్చి పిండి తినిపోతుంది’ అని అన్నది. నా ఈ  సేవకురాలిని ప్రవక్త అనుచరులలో కొందరు గదమాయించారు, కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆమె “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. స్వర్ణకారుణికి మేలిమి బంగారం గురించి ఏం తెలుసో ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి కూడా నాకు అదే తెలుసు. (అంతకు మించి మరేమో తెలియదు)” అని అన్నది. ఈ అపవాదులో నాతోపాటు ఇరికించబడిన వ్యక్తికి అపవాదు సంగతి తెలిసినపుడు “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేనీ రోజు వరకు ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నాడు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు.

(సహీహ్‌ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్‌, 24వ సూరా – నూర్‌, 11వ అధ్యాయం – ఇన్నల్లజీన యుహిబ్బూన అన్తషీ అల్‌ ఫాహిషతు ఫిల్లజీన ఆమనూ)

Footnotes:

[1] | ఒక యుద్ధం అంటే ఇక్కడ “బనీ ముస్తలిఖ్‌ యుద్ధం” అని అర్థం. దీన్నే ‘మురసీ యుద్ధం” అని కూడా అంటారు. (సంకలనకర్త)

[2] | ఇక్కడ మూలభాషలో ప్రయోగించిన ‘ఉస్బా’ అనేపదానికి పది నుండి నలభై మంది వ్యక్తుల ముఠా అని అర్ధం వస్తుంది (సంకలనకర్త)

[3] ఈ వ్యక్తి పేరు హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ (రది అల్లాహు అన్హాు)- (సంకలనకర్త)


ఇది మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) లో పశ్చాత్తాప ప్రకరణం నుండి తీసుకోబడింది.