7 వ అధ్యాయం
కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్
[Wearing bracelets and cords etc., To remove Afflictions or to seek protection is a form of shirk]
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl
إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ
“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?” (జుమర్ 39: 38).
ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).
[*] భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు
ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.
ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).
ముఖ్యాంశాలు:
1. రోగాలు దూరమగుటకు కడాలు (bracelets), దారాలు (cords) వేసుకొనుట కఠినంగా నివారించబడింది.
2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.
3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.
4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’
5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.
6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.
7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.
8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.
9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.
10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.
11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.
1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.
2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.
3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.
పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.
ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు. శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.
అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.
ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.
ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl


You must be logged in to post a comment.