షిర్క్ నిర్వచనం, దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్
అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
రెండవ ప్రకరణం: షిర్క్ నిర్వచనం, దాని రకాలు

(అ) షిర్క్ నిర్వచనం:

అల్లాహ్ యొక్క పోషకత్వంలోనూ, ఆయన దైవత్వంలోనూ వేరొకరికి సాటి (సహవర్తులను) కల్పించటాన్ని ‘షిర్క్‘ అంటారు.

ప్రజాబాహుళ్యంలో సాధారణంగా అల్లాహ్  దైవత్వం (ఆరాధన, దాస్యం ) విషయంలో షిర్క్ ప్రబలి ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే అల్లాహ్ తో పాటు వారు ఇతరులను కూడా మొర పెట్టుకుంటారు. లేదా అల్లాహ్ యేతరుల కొరకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదాహరణకు : ఖుర్బానీ, మొక్కుబడులు, అల్లాహ్ యేతరులకు భయపడటం, వారిపై ఆశలు పెట్టుకోవటం ఇత్యాదివి.


కొన్ని కారణాల దృష్ట్యా షిర్క్ మహాపరాధం. అవేమంటే:

(1) షిర్క్ చేయటమంటే సృష్టికర్త ప్రత్యేకతలలో, గుణాలలో సృష్టితాలకు సామ్యం కల్పించటమే. కాబట్టి అల్లాహ్ తో పాటు వేరేతరులకు భాగస్వామ్యం కల్పించినవాడు వాస్తవానికి ఆ భాగస్వాములను అల్లాహ్ ను పోలిన వారుగా ఖరారు చేశాడన్నమాట! ఇది అతి పెద్ద జులుం. మహాపాతకం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.” (లుఖ్మాన్ 31 : 13)

(2) షిర్క్ చేష్టకు ఒడిగట్టిన మీదట పశ్చాత్తాపం చెందనివానిని అల్లాహ్ క్షమించడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్క్ ను) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (అన్ నిసా 4 : 48)

(3) షిర్క్ కి పాల్పడేవాని కొరకు స్వర్గాన్ని నిషేధించానని, అలాంటి వ్యక్తి శాశ్వతంగా నరకాగ్నిలో కాలుతూ ఉంటాడని అల్లాహ్ తెలియపరిచాడు. ఉదాహరణకు :

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

ఎవడు అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. ఇక అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.” (అల్ మాయిద 5 : 72)

(4) మనిషి చేసే షిర్క్, అతను గతంలో చేసిన సత్కార్యాలన్నింటినీ సర్వ నాశనం చేసివేస్తుంది. (18 మంది ప్రవక్తల ప్రస్తావన తీసుకువచ్చిన మీదట) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ

ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సయితం దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసిన కర్మలన్నీ వృధా అయిపోయేవి.” (అల్ అన్ ఆమ్ 6 : 88)

వేరొకచోట అల్లాహ్  తన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుద్దేశించి ఇలా ఉపదేశించాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నీవు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేరతావు.” (అజ్ జుమర్ 39 : 65)

(5) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

shirk-types

జనులు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ను అంగీకరించనంత వరకూ వారితో పోరాడాలని నాకు ఆదేశించబడింది. వారు గనక ఈ కలిమాను అంగీకరిస్తే, వారు తమ ధన ప్రాణాలను కాపాడుకున్న వారవుతారు. అయితే ఈ కలిమా హక్కు మాత్రం మిగిలి ఉంటుంది.” (బుఖారీ, ముస్లిం)

(6) షిర్క్ పెద్ద పాపాలలోకెల్లా పెద్దది. దీని గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

shirk-types-2

ఏమిటి, అన్నిటికన్నా పెద్ద పాపాలేవో నేను మీకు తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశ్నించగా, ‘తప్పకుండా తెలుపండి దైవ ప్రవక్తా!’ అని మేమన్నాము. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “అల్లాహ్ కు భాగస్వామిగా వేరెవరినయినా నిలబెట్టడం, తల్లిదండ్రులను ఎదిరించటం.” (బుఖారీ, ముస్లిం)

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ తన పుస్తకం (అల్ జవాబుల్ కాఫీ : పే జి 109) లో ఇలా అభిప్రాయపడ్డారు:

అల్లాహ్ ఈ విషయం మనకు ఎరుకపరిచాడు. ఆయన సృష్టికర్త, పాలకుడు (ఆజ్ఞాపించేవాడు) అవటంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే; అల్లాహ్ ఆయన పేర్లు, గుణగణాల ఆధారంగా తెలుసుకోవాలి. కేవలం ఆయన్నే ఆరాధించాలి. ఆయనకు సాటి కల్పించరాదు. జనులు న్యాయానికి, సమత్వం, సమతూకాలకు కట్టుబడి ఉండాలి. సమత్వం, సమతూకాల మూలంగానే భూమ్యాకాశాల వ్యవస్థ నిలబడి ఉంది.”

అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమయిన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటా (త్రాసు)ను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయం (సమతూకం)పై నిలిచి ఉండటానికి!” (అల్ హదీద్ : 25)

పై ఆయతులో అల్లాహ్ తన ప్రవక్తలను పంపినట్లు, తన గ్రంథాలను అవతరింపజేసినట్లు తెలియజేశాడు. ప్రజలు నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండాలన్నదే దీని ఉద్దేశం. అన్నిటికన్నా పెద్ద న్యాయం (సమత్వం, సమతూకం) తౌహీద్. తౌహీదే (దేవుని ఏకత్వమే) న్యాయానికి, ధర్మానికి ప్రాతిపదిక. షిర్క్ (బహుదైవోపాసన) అతి పెద్ద దుర్మార్గం, దుర్వర్తనం, దారుణం.

అల్లాహ్ సెలవిచ్చినట్లు –

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా షిర్క్ (బహుదైవోపాసన) చాలా పెద్ద జులుం.” (లుఖ్మాన్ 31 : 13)

మొత్తానికి తెలిసిందేమంటే షిర్క్ (బహుదైవారాధన) అతి పెద్ద దారుణం (అన్యాయం). తౌహీద్ (ఏక దైవారాధన) అన్నిటికన్నా గొప్ప న్యాయం (ధర్మం). కనుక ఏ వస్తువు మహదాశయమైన తౌహీద్ కు వ్యతిరేకంగా నిలుస్తుందో అది మహాపరాధంగా పరిగణించబడుతుంది.

ఈ నేపథ్యంలోనే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు:

షిర్క్ (బహుదైవారాధన) ఈ సిసలయిన ఆశయానికి (తౌహీద్ కు) వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మహాపరాధమే. అల్లాహ్ ప్రతి  ముష్రిక్ పై స్వర్గాన్ని నిషిద్ధం (హరామ్) గావించాడు. అతని ధన ప్రాణాలను కూడా ఏక దైవారాధకుల కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. ఎందుకంటే వారు అల్లాహ్ దాస్యం యొక్క హక్కును నిర్వర్తించలేదు. కాబట్టి వారిని బానిసలుగా చేసుకునేందుకు ఏక దైవారాధకులకు అనుమతి ఇవ్వబడింది. అదలా ఉంచితే అల్లాహ్ ముష్రిక్కు చేసిన ఏ సత్కర్మనూ స్వీకరించడు. వారి కొరకు చేయబడిన సిఫారసు ఆమోదించటంగానీ, పరలోకంలో వారి మొరను ఆలకించటంగానీ, వారి కోర్కెను తీర్చటం గానీ చేయడు. ఎందుకంటే ముష్రిక్  వ్యక్తి అల్లాహ్ వ్యవహారంలో అతి పెద్ద మూర్ఖుడు. ఎందుకంటే అతను సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాడు. ఇది పరమ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో అజ్ఞానానికి పరాకాష్ఠ. ఆయన విషయంలో ఇది చాలా పెద్ద అన్యాయం. వాస్తవానికి అతను షిర్క్ చేసి అల్లాహ్ కు కాదు, తన ఆత్మకే అన్యాయం చేసుకున్నాడు.”

(7) వాస్తవానికి షిర్క్ ఒక లోపం. దోషం. దాని నుండి అల్లాహ్ తన అస్తిత్వాన్ని పవిత్రంగా, పునీతంగా ఖరారు చేసుకున్నాడు. కాబట్టి అల్లాహ్ కు సహవర్తుల్ని కల్పించే వాడు. ఆయనకు లేనిపోని దోషాన్ని, లోపాన్ని ఆపాదిస్తున్నడన్నమాట! ఆ విధంగా అతను అల్లాహ్ పై తిరుగుబాటు చేశాడు. ఆయన ఆజ్ఞను ఎదిరించి ఆయనతో శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు.


(అ) షిర్క్ రకాలు:

షిర్క్ రెండు రకాలు

మొదటి రకం: షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. అతను గనక పశ్చాత్తాపం చెందకుండానే మరణిస్తే కలకాలం నరకాగ్నిలో ఉంటాడు.

ఏ రకమయిన ఆరాధన అయినా సరే అల్లాహ్ యేతరుల కొరకు చేస్తే అది షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) అవుతుంది : ఉదాహరణకు అల్లాహ్ యేతరులను మొర పెట్టుకోవటం, వారి పేర మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, బలిదానాలు చేసి సమాధులలో ఉన్న వారి మెప్పు పొందగోరటం, జిన్నాతుల, షైతానుల ప్రసన్నత బడయటం, అలాగే మృతులు షైతానులు, జిన్నాతులు తమకేదైనా హానికలిగిస్తాయేమోనని భయపడటం. అలాగే – దేవుని ఏకత్వం కేవలం అల్లాహ్ మాత్రమే తీర్చగల అవసరాల కోసం అల్లాహ్ యేతరులను ఆశించటం, ఆపదలను తొలగించమని అల్లాహ్ యేతరులను అర్థించటం మొదలగునవి.

నేటి ఆధునిక యుగంలో ఇలాంటి షిర్క్ మరీ ఎక్కువైపోయింది. పుణ్య పురుషుల సమాధులపై నిర్మించబడిన కట్టడాల వద్ద సకల ఆర్భాటాలతో ఈ షిర్క్ పోకడలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి –

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ

వారు అల్లాహ్ ను వదలి తమకు లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ చేకూర్చ లేని వాటిని పూజిస్తున్నారు. (అదేమంటే) ‘అల్లాహ్ సమక్షంలో అవి మాకు సిఫారసు చేస్తాయి’ అని అంటున్నారు.” (యూనుస్ 10: 18)

రెండవ రకం: షిర్కె అస్గర్: (చిన్నతరహా షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండైతే వేరుపరచదు గాని దానివల్ల ‘ఏకదైవారాధన’ (తౌహీద్)లో దోషం ఏర్పడుతుంది. అంతేకాదు, అది అతన్ని క్రమక్రమంగా ‘షిర్కె అక్బర్’ వైపు తీసుకెళుతుంది. షిర్కె అస్గర్  కూడా రెండు రకాలు : (1) కనిపించే షిర్క్ (2) కనిపించని షిర్క్,

(1) కనిపించే షిర్క్:

అంటే మనిషి మాటల ద్వారా, చేతల ద్వారా వ్యక్తమయ్యే షిర్క్ అన్నమాట. ఉదాహరణకు : దైవేతరులపై ఒట్టేసి చెప్పటం. దీని గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

shirk-types-3

ఎవరయితే అల్లాహ్ యేతరునిపై ప్రమాణం చేశాడో అతను తిరస్కారాని (కుఫ్ర్) కి పాల్పడ్డాడు” లేదా ఆయనిలా అన్నారు : “అతను షిర్క్ కి ఒడిగట్టాడు.” (ఈ హదీసును తిర్మిజీ – 1535 సహీగా పేర్కొన్నారు. హాకిమ్ దీనిని సహీహ్ గా పేర్కొన్నారు).

అల్లాహ్ కోరినట్లుగా మరియు తమరు కోరుకున్నట్లుగా” అని చెప్పటం కూడా ఈ కోవకు చెందినదే. ఒకసారి ఒక సహచరుడు ఇలాగే అంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనిని ఈ విధంగా మందలించారు : –

shirk-types-4

ఏమిటి, నీవు నన్నూ అల్లాహ్ కు పోటీగా పరిగణిస్తున్నావా?” (ఇది తప్పు. దీనికి బదులు) నీవు ఈ విధంగా అను : ఒక్కడైన అల్లాహ్ కోరినట్లుగా.” (అస్సహీహ – 139) అలాగే  “ఒకవేళ అల్లాహ్ లేకుంటే, ఫలానా వ్యక్తి లేకుంటే” అని చెప్పటం కూడా ఇలాంటిదే.

అల్లాహ్ తలచినట్లుగానే జరిగింది. దానిమీదట ఫలానా వ్యక్తి అభిలషించినట్లుగా జరిగింది” అని అంటే అది సరైనదే. ‘దానిమీదట’ లేదా ‘ఆపైన’ అనే పదం చేరిస్తే అది ఒప్పే. ఎందుకంటే ఈ విధంగా అన్నప్పుడు దాసుని కోరిక దేవుని కోరికకు లోబడినట్లవుతుంది. ఉదాహరణకు : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు.” (అత్ తక్వీర్ 81 : 29)

నా కొరకు అల్లాహ్ మరియు మీరు తప్ప ఎవరూ లేరు” అని చెప్పటం కూడా ఒక విధంగా షిర్కుతో కూడిన పలుకే.  “ఇది అల్లాహ్ శుభాల వల్ల మరియు మీ శుభాల వల్లనే ప్రాప్తించింది” అని అటం కూడా ఇలాంటిదే.

షిర్కు తో కూడిన పనుల ఉదాహరణ:

ఏదైనా ఆపద నుండి బయటపడేందుకు లేదా ఏదైనా గండాన్ని తొలగించేందుకు కడియం ధరించటం, దారం కట్టడం, దిష్టి తగులుతుందనే భయంతో తాయెత్తు కట్టడం, వెంట్రుకల హారాలు తొడగటం మొదలగునవి.

ఇలాంటివన్నీ గండాల నుండి గట్టెక్కటంలో, కష్టాలను దూరం చేయటంలో తోడ్పడతాయని గనక మనిషి నమ్మితే ఇది షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) క్రిందికి వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఈ వస్తువులను ఇలాంటి ఉద్దేశాల ప్రాప్తి కొరకు సాధనంగా చేయలేదు. ఒకవేళ ఈ వస్తువులు తమంతట తాముగా ఆపదలను దూరం చేస్తాయని నమ్మితే మాత్రం అది ‘షిర్కె అక్బర్’ గానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది  అల్లాహ్ యేతరులపై ఆశ పెట్టుకోవటం వంటిదే.

(2) కనిపించని షిర్క్:

అంటే దాగి ఉన్న షిర్క్ అన్నమాట. ఇది మనిషి సంకల్పంలో మనోభావంలో ఉంటుంది. ఉదాహరణకు: ప్రదర్శనాబుద్ధి. అంటే ఒక వ్యక్తి  అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో ఒక సత్కార్యం చేసే బదులు జనుల మెప్పును కాంక్షించి చేస్తాడు. ఉదాహరణకు: ఎంతో ఏకాగ్రతతో నమాజ్ చేస్తాడు లేదా దానధర్మాలు చేస్తాడు. కాని అతని మనసులో లోకులు తనను ప్రశంసించాలన్న కోరిక ఉంటుంది.

ఏదైనా ఒక కార్యంలో ప్రదర్శనా మనస్తత్వం వచ్చిందంటే, అది అతని పనిని పాడు చేసేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగ స్వామ్యం కల్పించకూడదు.” (అల్ కహఫ్ 18 : 110)

షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :

“మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా ‘షిర్కె అస్గర్ ‘ గురించిన భయముంది. ‘దైవప్రవక్తా! షిర్కె అస్గర్ అంటే ఏమిటి?’ అని ప్రియ సహచరులు విన్నవించుకోగా, “ప్రదర్శనా బుద్ది” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు. (అహ్మద్-22528, తిబ్రానీ)

అలాగే ఎవరయినా ప్రాపంచిక స్వలాభాలను ఆశించి ఏదైనా సత్కార్యం చేస్తే, అది కూడా ‘కనిపించని షిర్క్’లోకి వస్తుంది. ఉదాహరణకు : ఎవరయినా కేవలం సిరిసంపదల కోసం హజ్ చేయటం, లేదా అజాన్ ఇవ్వటం, లేదా సామూహిక నమాజ్ కు సారధ్యం వహించటం, లేదా కేవలం సిరిసంపదలను ఆశించి ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం, జిహాద్ చేయటం.

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా ప్రవచించారు :

shirk-types-5

దీనారు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. దిర్హమ్ కు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. చారలు గల దుప్పటిని కలిగి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. పనితనము (చిత్రీకరణ) గల దుప్పటి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. అతనికేదైనా ఇవ్వబడితే సంతోషిస్తాడు. ఇవ్వకపోతే కినుక వహిస్తాడు.” (బుఖారీ)

ఈ విషయమై ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు:

సంకల్పాలలో, ఉద్దేశాలలో షిర్క్ అనేది తీరంలేని సముద్రం వంటిది. అతి కొద్ది మంది మాత్రమే దాని నుండి బయటపడగలుగుతారు. కనుక ఎవరయినా తన ఆచరణ ద్వారా అల్లాహ్ ప్రసన్నతతో పాటు వేరొక సంకల్పం చేసుకుంటే, అల్లాహ్ సామీప్యం పొందటంతో పాటు ఇతరత్రా ఉద్దేశ్యాలకు కూడా చోటిస్తే అతను తన సంకల్పంతో షిర్క్ చేసినట్లే.”

ఈ సందర్భంగా ‘సంకల్ప శుద్ది’ అంటే భావం దాసుడు తన మాటలను, చేతలను, సంకల్పాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించాలి. (అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనటమే అతని ధ్యేయమై ఉండాలి). ఇదే అసలుసిసలు ఏకోన్ముఖత. అంటే సిసలయిన ఇబ్రాహీమ్ విధానం. దీనిని అవలంబించమని అల్లాహ్ తన దాసులందరికీ ఆజ్ఞాపించాడు. ఇది మినహా ఆయన ఎవరి నుండీ, ఎలాంటి దానిని అంగీకరించడు. ఈ ఏకోన్ముఖతే ఇస్లాం వాస్తవికత.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో  చేరుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 85)

ఇదే సిసలయిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) విధానం. దీని నుండి ముఖం త్రిప్పుకున్నవాడు, విసుగును ప్రదర్శించినవాడు అతి పెద్ద మూర్ఖుడు.” (అల్ జవాబుల్ కాఫీ – పేజీ : 115)

షిర్కె అస్గర్ – షిర్కె అక్బర్ కి మధ్యగల వ్యత్యాసాలు

వెనుకటి చర్చ ప్రకారం ఈ రెండు రకాల షిర్క్ మధ్య గల తేడాలు ఇవి :

1. షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కరిస్తుంది. షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) ముస్లిం సముదాయం నుండి మనిషిని బహిష్కరించదు గాని అతని ఏకదైవారాధనా విశ్వాసంలో లోపం ఏర్పరుస్తుంది.

2. షిర్కె అక్బర్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకయాతనను అనుభవిస్తాడు. షిర్కె అస్గర్ కు ఒడిగట్టినవాడు నరకానికి ఆహుతి అయినా శాశ్వతంగా నరకంలోనే ఉండడు.

3.షిర్కె అక్బర్ మనిషి ఆచరణలన్నింటినీ నాశనం చేసేస్తుంది. కాగా, షిర్కె అస్గర్ ఆచరణలన్నింటినీ వృధా చేయదు. ఏ ఆచరణలో అది (ప్రదర్శనాబుద్ధి, ప్రాపంచిక స్వలాభాపేక్ష) జొరబడుతుందో దానిని మాత్రమే నాశనం చేస్తుంది.

4.షిర్కె అక్బర్ ముష్రిక్కుల ధన ప్రాణాలను ధర్మసమ్మతం చేసేస్తుంది. కాని షిర్కె అస్గర్ వల్ల అతని ధన ప్రాణాలు ధర్మసమ్మతం అవవు.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (93-100 పేజీలు). https://teluguislam.net/2019/09/20/aqeedah-tawheed-shaykh-fawzan/

%d bloggers like this: