వ్యభిచారం (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/OIK2VedWGQA (16 నిముషాలు)
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వ్యభిచారం (జినా) యొక్క నిషేధం గురించి, దాని తీవ్రత, అది దారితీసే మార్గాలను ఇస్లాం ఎలా నిరోధిస్తుంది, మరియు ఈ పాపానికి పాల్పడిన వారికి ప్రపంచంలో మరియు మరణానంతరం విధించబడే కఠిన శిక్షల గురించి చర్చించబడింది. హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత, చూపులను అదుపులో ఉంచుకోవడం, మరియు ఒంటరిగా పర స్త్రీ-పురుషులు కలవడాన్ని ఇస్లాం ఎందుకు నిషేధించిందో వివరించబడింది. వివాహితులు మరియు అవివాహితులు చేసే వ్యభిచారానికి గల శిక్షలలో తేడా, వృద్ధాప్యంలో ఈ పాపానికి పాల్పడటం యొక్క తీవ్రత, మరియు పేదరికాన్ని కారణంగా చూపి ఈ పాపంలో మునిగిపోవడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టం చేయబడింది. ఆధునిక సమాజంలో వ్యభిచారానికి దారితీసే కారణాలను వివరిస్తూ, ఈ చెడు నుండి దూరంగా ఉండేందుకు అల్లాహ్‌ను ప్రార్థించడం జరిగింది.
ఇక రండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి, ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ నిషేధాల్లో అనేకమంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము. అది వ్యభిచారం.
ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ త’ఆలా సూరత్ బనీ ఇస్రాయీల్ ఆయత్ నంబర్ 32 లో తెలిపాడు,
وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
“వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం” (17:32)
వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇక్కడ గమనించండి ఆయతులో ‘లా తఖ్రబు’ అని చెప్పబడింది. ‘లా తజ్నూ’ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ గా చెప్పలేదు. ‘లా తఖ్రబు’ అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకండి.
నిశ్చయంగా అది అతి దుష్టకార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం. షేక్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు. ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది? ఎందుకు దీనిని అశ్లీలం, అతి దుష్టకార్యం అని చెప్పడం జరిగింది? అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్స్ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము.
సర్వసామాన్యంగా వ్యభిచారానికి పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల. అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది. దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది.
హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత
ఈ మార్గాలను, వ్యభిచారం వరకు చేర్పించే సాధనాలను ఏదైతే మూసివేశాడో, వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ త’ఆలా హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు, పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా, రెడ్ లైన్ గా, రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోదీ మీడియా అనండి లేదా స్వార్థపరులైన పత్రికా రిప్రజెంటేటివ్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికే లేదు వారికి, ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు, అస్తగ్ఫిరుల్లాహ్.
ఇక్కడ చూడండి, సూరతుల్ అహ్ జాబ్, సూరా నంబర్ 33, ఆయత్ నంబర్ 53. అలాగే సూరతుల్ అహ్ జాబ్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే,
فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَاۤءِ حِجَابٍ
(ఫస్ అలూహున్న మివ్ వరా’ఇ హిజాబ్)
“పరదా వెనుక ఉండి అడగాలి.” (33:53)
హిజాబ్ వెనుక ఉండి అడగాలి. ముంగటగా అటు ఒక స్త్రీ ఉంది, ఇటు నేను ఉన్నాను, డైరెక్ట్ గా అడగకూడదు. ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి, పరదా ఉండాలి, హిజాబ్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ‘ఫస్ అలూహున్న’ అనేది అమ్ర్ (ఆర్డర్, ఆదేశం). అంతేకాకుండా ‘మివ్ వరా’ఇ హిజాబ్’ అని చెప్పాడు అల్లాహ్ త’ఆలా. ఇది డైరెక్ట్ ఆదేశమే ఉన్నది. ఇక ఖుర్ఆన్లో ఎక్కడా కూడా పరదా ఆదేశం లేదు అని అంటారు? ఇది వారి యొక్క అజ్ఞానం. వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం.
అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఆయత్ నంబర్ 59 లో కనబడుతుంది. అక్కడ అల్లాహ్ త’ఆలా అంటున్నాడు,
قُلْ
(ఖుల్)
“ఓ ప్రవక్త, మీరు చెప్పండి.” (33:59)
వారికి ఆదేశం ఇవ్వండి. ఎంత స్పష్టంగా ఉంది! చెప్పండి, ఆదేశం ఇవ్వండి,
يُدْنِيْنَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيْبِهِنَّ
(యుద్నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్)
“తమ దుపట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని.” (33:59)
ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము? మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్లాలంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? సూరతున్ నూర్, ఆయత్ నంబర్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది.
మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు, కానీ మాట వచ్చింది గనుక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను. ఇవి సరిపోతాయి, మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాఅల్లాహ్ తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ‘సాధనాలను’ అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో, దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి ఒక వీడియో మీకు ఇన్షాఅల్లాహ్ ఓపెన్ అవుతుంది.
వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను, అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు. చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి, మితిమీరి వ్యభిచారానికి పాల్పడ్డాడంటే, ఇక వారికి శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది, ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని.
వ్యభిచారానికి శిక్షలు
శ్రద్ధగా వినండి. వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం. అతను చనిపోయేవరకు అతనిపై రాళ్లు రువ్వబడాలి. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి. అతని శరీరము యొక్క ప్రతీ భాగం, అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో, అలాగే ఈ శిక్ష ద్వారా బాధను, నొప్పిని అనుభవించాలి. ఇది ఎవరి కొరకు? వివాహితుడైన, పెళ్లి అయిన తర్వాత భార్యతో అతడు సంసారం చేసేసాడు, ఆ తర్వాత మళ్లీ వ్యభిచారానికి పాల్పడ్డాడు, అలాంటి వానికి ఈ శిక్ష.
కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువ. ఇక్కడ వివాహం కాని యువకుడు, యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద కొరడా దెబ్బల శిక్ష, ఇది చాలా ఎక్కువ సంఖ్య, ఈనాటి ఈ పాపానికే విధించబడినది.
అంతేకాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. ఇది ప్రాపంచిక శిక్ష.
చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహితునికైనా, వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మనం సామాన్య మనుషులం, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు. ఒక ప్రభుత్వం, అధికారం చేతిలో ఉన్నవారు ఈ శిక్షను విధిస్తారు.
సమాధిలో శిక్ష
ఇక రండి, ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు, శిక్ష పడలేదు, అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి.
పైన ఇరుకుగా, కింద వెడల్పుగా ఉండే కుండ లాంటి ఆవంలో వారు నగ్నంగా వేయబడతారు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మ అజిర్నా మిన్హు. ఓ అల్లాహ్ మమ్మల్ని రక్షించు ఇలాంటి పాపాల నుండి, ఇలాంటి శిక్షల నుండి. దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది. అందులో జ్వాలలను ప్రజ్వలింప జేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు. కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు. ఇలా పైకి రావడం, జ్వాలలు ఎగిరినప్పుడు, అవి చల్లారినప్పుడు కిందికి పోవడం, అగ్నిలో కాలుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు.
క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష, ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే మాటేనా? కానీ ప్రపంచ వ్యామోహంలో పడి, స్త్రీల యొక్క ఫితనాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు. ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.
వృద్ధాప్యంలో చేసే పాపం యొక్క తీవ్రత
పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు? మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ, అల్లాహ్ శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తౌబా కొరకు, అల్లాహ్ తో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునిగి తేలుతున్నప్పుడు. ఏంటి ఆ విషయం? వినండి హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.
ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمْ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ شَيْخٌ زَانٍ وَمَلِكٌ كَذَّابٌ وَعَائِلٌ مُسْتَكْبِرٌ
“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).
గమనించారా? వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే, అల్లాహ్ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి.
వ్యభిచారం ద్వారా సంపాదన
సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).
ఇక దీని గురించి మరొక విషయం, సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అయితే అలాంటి సంపద చాలా చెడ్డది. ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో, అర్ధరాత్రి ఆకాశ ద్వారాలు తెరువబడే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క దుఆలను అంగీకరించే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క రోదనలను, వారి యొక్క ఆర్ధింపులను వింటున్న సమయాన ఆ వ్యభిచారి యొక్క దుఆ స్వీకరించబడదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా. అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసికోవాలి.
ఇక పేదరికం, అవసరం కొందరంటారు కదా, పేదరికం ఉన్నది, ఎక్కడా మాకు ఏ మార్గం లేదు, మా బ్రతుకు తెరువు ఎలా గడవాలి, మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము, అందుకొరకే ఈ చెడుకు పాల్పడ్డాము. అయితే, పేదరికం, అవసరం అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంతమాత్రం ధార్మిక సబబు కావు. అరబ్బుల్లో జాహిలియ్యత్ లో, ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది, “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.
ముగింపు
నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పరదా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడటం, స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు, నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యా గృహాలు లైసెన్సులు ఇచ్చి తెరువబడుతున్నాయి, అల్లాహు అక్బర్. ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయని. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి, అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి, అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.
ఓ అల్లాహ్, మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధపరచి, మా మానాలను కాపాడుము, మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము. ఆమీన్. అందుకొరకే దుఆ చేసుకుంటూ ఉండాలి.
اَللّٰهُمَّ طَهِّرْ قُلُوْبَنَا
(అల్లాహుమ్మ తహ్హిర్ ఖులూబనా)
ఓ అల్లాహ్ మా హృదయాలను శుద్ధిపరచు
اَللّٰهُمَّ أَحْصِنْ فُرُوْجَنَا
(అల్లాహుమ్మ అహ్సిన్ ఫురూజనా)
మా మర్మాంగాలను కాపాడు.
ఓ అల్లాహ్ మా చూపులను మేము కిందికి వాలించి, కిందికి వేసి ఉండే విధంగా మాపై ఎల్లప్పుడూ భాగ్యం ప్రసాదించు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41181
వ్యభిచారం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి [వీడియో]
భర్త అక్రమ సంభంధం పెట్టుకొని చెడుపనులకు పాల్పడకుండా ఉండటానికి ఏదయినా దుఆ ఉందా? [వీడియో]
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

You must be logged in to post a comment.