సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం
https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.
ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్‌కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,
وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ
(వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్)
వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)
అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.
సమాధుల వైపు నమాజ్ చేయడం
అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.
అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
(ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)
అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.
అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ
(అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్)
ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.
అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.
اشْتَدَّ غَضَبُ اللَّهِ عَلَى قَوْمٍ اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
(ఇష్టద్ద గదబుల్లాహి అలా ఖౌమిన్ ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా)
ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?
“ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,
فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ
(ఫవల్లి వజ్’హక షతరల్ మస్జిదిల్ హరామ్)
నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపునకు త్రిప్పు. (2:144)
అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”
అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.
మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?
కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43459
తౌహీద్ & షిర్క్:
https://teluguislam.net/tawheed-shirk/

You must be logged in to post a comment.