త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2) : షిర్క్ , ధర్మభ్రష్టత (రిద్దత్) – మరణానంతర జీవితం : పార్ట్ 43 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2)
[మరణానంతర జీవితం – పార్ట్ 43]
https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్‌తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్‌కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.

త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్‌కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.

అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.

మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా]
అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)

ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్‌తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్‌ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్‌ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్‌ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.

ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా]
అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)

మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్‌ను స్వీకరించాలి.

సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.

వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.

సూరె జుమర్ ఆయత్ నెంబర్ 65.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
[వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్]

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.

ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.

రండి సోదరులారా! షిర్క్‌ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.

ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.

అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.

ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)

మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్‌కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.

వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.

అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.

షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.

సూరె ముహమ్మద్ ఆయత్ నెంబర్ తొమ్మిది.

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుమ్ కరిహూ మా అన్జలల్లాహు ఫ అహ్బత అఅమాలహుమ్]

“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)

ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.

అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.

ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్‌కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్‌కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుముత్తబఊ మా అస్ఖతల్లాహ వకరిహూ రిద్వానహూ ఫఅహ్బత అఅమాలహుమ్]

“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)

ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్‌కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.

అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్‌కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43992

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]