యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.

సఫర్ నెల [పుస్తకం]

సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.

ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463) 

సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:

మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.

రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో| టెక్స్ట్]

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) – చేప కడుపులో సజీవంగా మిగిలిన మనిషి
(800-750 క్రీ.పూ)

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://youtu.be/fDVp3h9FRXI [31నిముషాలు]

ఈ ఉపన్యాసంలో, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వివరించబడింది. ఇందులో యూనుస్ (అలైహిస్సలాం) వారి తండ్రి పేరు, ఖురాన్లో ఆయనకు ఇవ్వబడిన బిరుదులు, మరియు ఆయన నీనెవా పట్టణ ప్రజల వైపుకు ప్రవక్తగా పంపించబడిన వివరాలు ఉన్నాయి. నీనెవా ప్రజలు ఆయన సందేశాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన అల్లాహ్ అనుమతి లేకుండానే కోపంతో ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, నీనెవా ప్రజలు తమపైకి రాబోతున్న దైవ శిక్షను చూసి పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకోగా, అల్లాహ్ వారిని క్షమించారు. మరోవైపు, ఓడలో ప్రయాణిస్తున్న యూనుస్ (అలైహిస్సలాం) వారిని తుఫాను కారణంగా సముద్రంలోకి విసిరివేయగా, ఒక పెద్ద చేప ఆయనను మింగేసింది. చేప కడుపులోని చీకట్లలో ఆయన అల్లాహ్‌ను ప్రార్థించగా, అల్లాహ్ ఆయన ప్రార్థనను అంగీకరించి, ఆయనను రక్షించారు. ఈ సంఘటనల ద్వారా పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత, దుఆ యొక్క శక్తి, మరియు దైవ సందేశాన్ని బోధించడంలో సహనం ఎంత అవసరమో వివరించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం.

యూనుస్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు మత్తా. కాబట్టి, ఆయనను యూనుస్ బిన్ మత్తా అని పిలుస్తూ ఉంటారు. అలాగే, ఆయనకు జున్నూన్ అనీ, అలాగే సాహిబుల్ హూత్ అనీ బిరుదులతో ఖురాన్‌లో ప్రస్తావించబడి ఉంది.

ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ నీనెవా పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇరాక్ దేశంలోని ఉత్తర దిశన దజలా అనే ఒక నది ఉంది. ఆ నదికి ఒక వైపు మూసిల్ అనే పట్టణం ఉంటే, ఆ మూసిల్ పట్టణానికి ఎదురుగా నదికి మరో వైపు ఈ నీనెవా పట్టణం ఉంది. మధ్యలో నది, ఒక వైపు నీనెవా పట్టణము, మరోవైపు మోసెల్ పట్టణము ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఈ నీనెవా పట్టణం ఉంది.

ఆ రోజుల్లోనే నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉండేది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆ పట్టణ ప్రజల సంఖ్య గురించి కూడా ప్రస్తావించి ఉన్నాడు. మనం చూచినట్లయితే, ఖురాన్‌లోని 37వ అధ్యాయం, 147వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము..” (37:147)

అనగా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడే సమయానికి నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉంది ఆ రోజుల్లోనే అని ఖురాన్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు.

అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆ నీనెవా పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వారికి బోధిస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని పట్టించుకోలేదు, విశ్వసించలేదు. యూనుస్ అలైహిస్సలాం వారు చాలా రోజుల వరకు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి దైవ వాక్యాలు వారికి బోధిస్తూ ఉన్నా, వారు మాత్రము ససేమిరా అంటూ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని అసలు విశ్వసించనే లేదు.

చివరికి, ఒక రకంగా యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది, మీ మీద అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, ఎన్ని విధాలుగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు, విశ్వసించట్లేదు కాబట్టి మీ మీద శిక్ష వచ్చి పడుతుంది అల్లాహ్ తరఫున అని హెచ్చరించి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ పట్టణ ప్రజలని శిక్షించాలని నిర్ణయించాడు. ఆ విషయం యూనుస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేయగా, యూనుస్ అలైహిస్సలాం వారు చివరిసారిగా వెళ్లి పట్టణ ప్రజలకు, మీ మీద ఫలానా సమయంలో ఫలానా దినములో దైవ శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి, అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లిపోయాడు.

ఒక రకంగా చెప్పాలంటే, యూనుస్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చి ఉంది, పట్టణ ప్రజలు ఆయన మాటను విశ్వసించలేదు అని. కాబట్టి, మీ మీద దైవ శిక్ష వచ్చి పడే రోజు సమీపంలో ఉంది అని చెప్పి హెచ్చరించేసి కోపంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఆ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో తెలియజేసి ఉన్నాడు.

وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ
చేపవాడు (యూనుస్‌ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు.” (21:87)

చేపవాడు అనగా యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను కష్ట దశలోకి నెట్టమని అతను భావించాడు. కోపగించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోయి ఏకంగా సముద్రపు ఒడ్డుకి చేరాడు. సముద్రపు ఒడ్డున అప్పటికే సామాను మొత్తం మోసుకొని బయలుదేరటానికి ఒక పడవ సిద్ధంగా ఉంటే, ఆ పడవ ఆయన ఎక్కేశాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని చెప్తున్నాడు అంటే, మా ఆజ్ఞ రాకముందే ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళాలని మా తరఫు నుంచి అనుమతి రాకముందే ఆయన, అల్లాహ్ నాకు కష్టంలోకి నెట్టడులే అని భావించి బయలుదేరిపోయాడు.

బయలుదేరిన తర్వాత, ఇక్కడ పట్టణ ప్రజల విషయం ఏమి జరిగిందో తెలుసుకొని తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ, పట్టణ ప్రజలు కొద్ది రోజుల తర్వాత చూస్తే, ఒక నల్లటి మేఘము ఆ నీనెవా పట్టణం వైపుకి వస్తూ ఉంది. ఆ నల్లటి మేఘంలో నిప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి వారు అర్థం చేసుకున్నారు, యూనుస్ ఏ శిక్ష గురించి అయితే మమ్మల్ని హెచ్చరించాడో ఆ శిక్ష అదిగో అక్కడ వస్తూ ఉంది అని వారు అర్థం చేసుకొని, వెంటనే ఆ పట్టణ పెద్దల వద్దకు వెళ్లి, ఇదిగో దైవ శిక్ష వస్తూ ఉంది, ఇప్పుడు ఏమి చేయాలి అని వారు వెళ్లి అడిగితే, అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమన్నారంటే, మనకు పూర్వము ప్రవక్తల అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలను వారు తిరస్కరించిన కారణంగా శిక్షించాడు. వాళ్లు దైవ శిక్షకు గురయ్యి మట్టి కలిసిపోయారు. అదే విధంగా అల్లాహ్ శిక్ష మన మీద కూడా రాబోతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, అందరూ ఇళ్ల నుండి బయలుదేరండి, ఒక మైదానంలో ప్రోగవ్వండి అని ఆదేశించారు.

ఇళ్ల నుండి పిల్లా, పెద్ద, ఆడ, మగ అందరూ కూడా చిరిగిపోయిన, అతుకులు వేయబడిన బట్టలు ధరించి మైదానంలో వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమి చేశారంటే, మనుషులందరినీ విడివిడిగా నిలబెట్టేశారు. చివరికి తల్లి, బిడ్డలను కూడా విడివిడిగా నిలబెట్టేసి, ప్రతి ఒక్కడూ అతను నిలబడిన స్థానంలోనే అల్లాహ్‌కు చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ, క్షమాపణ వేడుకుంటూ ఈ శిక్ష మా మీద నుంచి తొలగించమని కోరుకుందాము, ప్రార్థిద్దాము అని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజలందరూ కూడా మైదానంలో నిలబడ్డారు, నిలబడి అల్లాహ్‌తో ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. మూడు రోజుల వరకు ఆ మేఘాలు ఆ పట్టణం మీద సంచరించాయి అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ప్రజలు కూడా మూడు రోజుల వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఏడుస్తూ క్షమాభిక్ష వేడుకున్నారు అని కూడా తెలపబడింది.

వారందరూ చిత్తశుద్ధితో, పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని విశ్వాసము ఎప్పుడైతే పొందటానికి సిద్ధపడ్డారో, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి మీద సంచరిస్తూ ఉన్న ఆ శిక్షను తొలగించేశాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దయవల్ల ఆ శిక్ష తొలిగిపోయింది. శిక్ష తొలిగిపోయిన తర్వాత, అక్కడ యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యూనుస్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే పడవ ఎక్కేశారో, కోపగించుకొని వెళ్లి, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కేసి బయలుదేరిపోయారో, పడవ సముద్రం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు, తూఫాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ పంపించేశాడు. తూఫాన్ కారణంగా పెద్ద అలలు వస్తూ ఉంటే, పడవ నీట మునిగే ప్రమాదము పొంచి వచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్న వారు పడవ మునిగిపోరాదని పడవలో ఉన్న భారము తగ్గించేయండి అంటూ అందులో ఉన్న సామాగ్రి తీసి నీటిలో పడవేశారు. అయినా గానీ బరువు తగ్గలేదు. ఇంకా బరువు తగ్గించాలి. కాబట్టి మనుషుల్లో నుంచే కొంతమందిని ఇప్పుడు పడవలో నుంచి బయటికి తోసి వేయాల్సి వచ్చింది. అయితే ఎవరిని తోసి వేయాలి? దాని కోసము వారు ప్రణాళిక ఏమని రచించారంటే, చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తుందో వారిని నీటిలో పడవేద్దామని చీటీలు వేసి చీటీ ఎత్తితే, యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వచ్చింది.

యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారు బోధకులు కాబట్టి గౌరవిస్తూ, ఈయనను వద్దు అని రెండవ సారి మళ్లీ చీటీ ఎత్తారు. మళ్లీ ఆయన పేరే వచ్చింది. మూడవసారి చీటీ ఎత్తారు. మూడవసారి కూడా ఆయన పేరే వచ్చింది. ఆ విధంగా మూడు సార్లు చీటీ ఎత్తినప్పుడు ఆయన పేరే వస్తే, అప్పుడు విషయం అర్థమైపోయింది. యూనుస్ అలైహిస్సలాం వారినే ఇక్కడి నుంచి ఇంకా నీటిలో పడవేయాలని. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారిని నీటిలో పడవేయగా, అల్లాహ్ ఆజ్ఞతో ఒక పెద్ద చేప వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారిని మ్రింగేసింది. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పడవ ఎక్కిన విషయము తెలియజేశాడు, ఆ తర్వాత పడవలో చీటీలు వేయబడిన విషయము కూడా తెలియజేశాడు.

మనం చూచినట్లయితే ఖురాన్‌లోని 37వ అధ్యాయం 140వ వాక్యంలో ఈ విధంగా తెలపబడి ఉంది,

إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను (తన జనుల నుండి) పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు, (37:140)

యూనుస్ అలైహిస్సలాం తన జనుల నుండి పలాయనం చిత్తగించి, నిండు నౌక వద్దకు చేరుకున్నాడు. నౌక వద్దకు చేరుకొని, నౌకలో బయలుదేరితే తూఫాను వచ్చింది, అప్పుడు చీటీలు వేయబడ్డాయి. చూడండి 37వ అధ్యాయం 141వ వాక్యంలో తెలపబడింది,

فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు..” (37:141)

చీటీలు వేయటం జరిగింది, చివరకు అతనే ఓడిపోయాడు. అనగా యూనుస్ అలైహిస్సలాం వారే ఓడిపోయారు. ఆయనకే నీటిలో పడవేయటం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. 37వ అధ్యాయం 142వ వాక్యంలో చూడండి,

فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు. (37:142)

తర్వాత చేప అతన్ని మ్రింగేసింది, అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని ఏ చేప అయితే వచ్చి మింగిందో, ఆ చేపకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. నీవు యూనుస్ అలైహిస్సలాం వారి శరీరానికి ఎలాంటి గాయము కాకుండా చూసుకోవాలి. అలాగే ఆయన శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగరాదు అని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి, చేప యూనుస్ అలైహిస్సలాం వారిని నమలలేదు, ఎలాంటి గాయము కలగకుండా మింగింది, ఆయన చేప కడుపులోకి వెళ్లిపోయాడు.

వెళ్లిన తర్వాత, చేప యూనుస్ అలైహిస్సలాం వారితో సముద్ర లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే నేను తొందరపడి వచ్చేసానే, తప్పు చేశాను కదా అని అప్పుడు గ్రహించి, చేప గర్భం నుండి, అంటే చేప కడుపు నుండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ఏమని ప్రార్థించాడో, ఆ పలుకులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ప్రస్తావించి ఉన్నాడు. 21వ అధ్యాయం 87వ వాక్యంలో అక్కడ మనం చూచినట్లయితే,

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు. (21:87)

అనగా, అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాడ్ని” అని మొరపెట్టుకున్నాడు. చీకట్లలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు అంటే, ఏ చీకటి? ధార్మిక పండితులు మూడు విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆయన ప్రార్థన చేసే సమయానికి రాత్రి అయ్యి ఉండింది, రాత్రి చీకటి. రెండవది, చేప ఆయనను తీసుకొని సముద్ర లోతుల్లోకి వెళ్ళింది కాబట్టి, సముద్ర లోతుల్లో అక్కడ చీకటి ఉంది. రెండు. మూడో విషయం ఏమిటంటే, చేప గర్భంలో, చేప కడుపులో ఆయన ఉన్నాడు కదా, అక్కడ కూడా చీకటి ఉంది. ఈ విధంగా, మూడు చీకట్లలో నుంచి ఆయన అల్లాహ్‌కు ప్రార్థన చేశారు.

అలాంటి చోటు నుంచి కూడా ఆయన అల్లాహ్‌ను తలుచుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినే శక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనను విన్నాడు. విని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించి, ఆయన ప్రార్థనను ఆమోదించి, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని, కష్టాన్ని తొలగించాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 37వ అధ్యాయం, 143, 144 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు.

فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
ఒకవేళ అతను గనక (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే….పునరుత్థానదినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు. (37:143-144)

فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.” (21:88)

అల్లాహు అక్బర్! ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత నిరాశ చెంది ఉంటే, నాకు చేప మింగేసింది, ఇక నాకు బయట పడే మార్గమే లేదులే అని నిరాశ చెంది ఉంటే, అల్లాహ్‌కు తలుచుకోకుండా ఉండి ఉంటే, ఆయన ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవాడు. కానీ, అక్కడి వెళ్లి కూడా ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచి, అల్లాహ్ వింటాడు అని భావించి, వాస్తవానికి అల్లాహ్ వింటున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విని, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడు అంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, అల్లాహ్ ఆజ్ఞతో చేప సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆయనను కక్కేయగా, ఆయన మళ్లీ కడుపులో నుంచి సముద్ర ఒడ్డుకి వచ్చి పడ్డారు.

అయితే చేప కడుపులో ఆయన ఎన్ని రోజులు గడిపారు అంటే, ధార్మిక పండితులు మూడు రకాల విషయాలు తెలియజేసి ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, ఆయన మూడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, ఏడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, 40 రోజులు గడిపారు అని మరికొందరు తెలియజేసి ఉన్నారు. అయితే మూడు రోజులు గడిపారన్న విషయము ఎక్కువగా ప్రచారంలో ఉంది. అసలు విషయము అల్లాహ్‌కు తెలుసు. ఏది ఏమైనప్పటికిని, యూనుస్ అలైహిస్సలాం వారు వచ్చి మళ్ళీ సముద్ర ఒడ్డున పడ్డారు. ఆయన సముద్ర ఒడ్డుకి చేరుకునే సమయానికి, ఆయన అనారోగ్యానికి, అస్వస్థతకు గురై ఉన్నారు. మూడు రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, కాబట్టి ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు. ఖురాన్‌లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. 37వ అధ్యాయం 145వ వాక్యాన్ని మనం చూచినట్లయితే,

فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
తరువాత మేమతన్ని (సముద్ర తీర) మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు.” (37:145)

ఆయన ఆరోగ్యము సరిగా లేదు, అస్వస్థతకు గురై ఉన్నారు. ఆయన లేచి నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, అంతగా ఆయన అస్వస్థతకు, అనారోగ్యానికి, బలహీనతకు గురై ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయ తలచి అడవుల్లో నివసిస్తున్న జింకను లేదా ఒక గొర్రెను ఆదేశించగా, ఆ గొర్రె వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారు ఉన్న చోట నిలబడితే, ఆ గొర్రె పాలు లేదా జింక పాలు ఆయన తాగేవారు. అలాగే, ఎక్కడైతే యూనుస్ అలైహిస్సలాం వారు పడి ఉన్నారో, ఆ ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీగ లాంటి ఒక మొక్కను అక్కడ మొలకెత్తించాడు. ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు స్వస్థత లభించింది, అలాగే ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు నీడ కూడా లభించింది అని తెలపబడి ఉంది. మనం చూచినట్లయితే 37వ అధ్యాయం 146వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు,

وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
అతనికి నీడనిచ్చే ఒక తీగచెట్టును అతనిపై మొలకెత్తించాము.” (37:146)

ఆ తీగ చెట్టు ఏమి చెట్టు అంటే, కొంతమంది ధార్మిక పండితులు సొరకాయ తీగ అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్‌కే తెలుసు. మొత్తానికి ఒక తీగ చెట్టును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొలకెత్తించాడు. ఆ ఆకులతో మరియు ఆ చెట్టు నీడతో ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత ప్రసాదించాడు.

ఆ తర్వాత, ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో, స్వస్థత పొందిన తర్వాత, ఆయన మళ్ళీ అక్కడి నుంచి నీనెవా పట్టణానికి వెళ్ళాడు. అప్పటికే ఆ సంఘటన మొత్తం జరిగి ఉంది. దైవ శిక్ష మేఘాల రూపంలో రావటం, ప్రజలందరూ మైదానంలో ప్రోగయ్యి అల్లాహ్‌ను తలుచుకొని ఏడ్చి, పశ్చాత్తాపము చెంది, క్షమాపణ కోరుకోవటం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి శిక్షను తొలగించటం, ఇదంతా అప్పటికే సంభవించి ఉంది. వారి మీద ఉన్న శిక్ష తొలగించబడింది అన్న విషయము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లోని 10వ అధ్యాయం, 98వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు.

لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
“… వారు (యూనుస్‌ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.” (10:98)

ఆ విధంగా, యూనుస్ అలైహిస్సలాం వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజలందరూ కూడా విశ్వాసం పొందారు. యూనుస్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలకు దైవ నిబంధనలు నేర్పుకుంటూ అక్కడ జీవితం గడిపారు. ఈ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర క్లుప్తంగా మీ ముందర వివరించబడింది.

ఇక రండి, యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక వ్యక్తికి సన్మార్గం దక్కింది. అది ఎలాగా? అది కూడా విందాం ఇన్షాఅల్లాహ్.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో దైవ వాక్యాలు ప్రజలకు బోధిస్తున్న సమయంలో, మక్కా వెలుపల వెళ్లి దైవ వాక్యాలు బోధిద్దామని తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. ఇది చాలా ప్రచారంలో ఉన్న సంఘటన. అందరికీ తెలిసి ఉంటుంది ధార్మిక పండితుల నోట విని ఉంటారు. అయితే ఈ ప్రస్తావనలో మన అంశానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ప్రజలు వినకుండా, తిరస్కరించి, చివరికి కుర్రాళ్ళు మరియు పెద్దలు అందరూ కలిసి ఆయనకు రాళ్లతో కొట్టటము, ఆయన స్పృహ కోల్పోయి పడిపోవటము, ఆ తర్వాత బానిస ఆయనను తీసుకెళ్లి ఒక తోటలో రక్తము, గాయాలు శుభ్రపరిచిన తర్వాత, ఆయనకు స్పృహ రావటము, ఆ తర్వాత దైవదూత జిబ్రీల్ వచ్చి, మీరు అనుమతి ఇస్తే ఈ పట్టణ ప్రజలని రెండు పర్వతాల మధ్య నుజ్జు నుజ్జు చేసేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దు అని నిరాకరించడము, ఇదంతా జరిగిన చోటనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగి ఉంది.

అదేమిటంటే, ఏ తోటలోకి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్లి ఆ బానిస గాయాలు శుభ్రం చేస్తున్నాడో, రక్తం శుభ్రం చేస్తున్నాడో, ఆ తోట వచ్చి రబియా అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు, ఉత్బా మరియు షైబా అని, ఆ ఇద్దరు కుమారులది అది. ఆ సమయానికి వారిద్దరూ కూడా అక్కడ ఉన్నారు తోటలో. ప్రవక్త వారి పరిస్థితి చూసి, వారు జాలిపడి, వారి వద్ద ఒక బానిస ఉండేవాడు, అతని పేరు అద్దాస్. అతని పిలిపించి కొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెబితే, అప్పుడు అద్దాస్ అనే బానిస ద్రాక్ష పండ్లు తీసుకెళ్లి ప్రవక్త వారికి ఇచ్చాడు.

అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ‘బిస్మిల్లాహ్‘ అని ఆ ద్రాక్ష పండ్లు తినటం ప్రారంభించారు. అది విని అద్దాస్‌కు ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశంలో ‘బిస్మిల్లాహ్’ అనే పలుకులు పలికే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ పలుకులు పలుకుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉందే అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తితో ఏమని అడిగారంటే, “అయ్యుల్ బిలాది అంత యా అద్దాస్, వ మా దీనుకా?” (ఓ అద్దాస్, నీవు ఏ పట్టణ వాసివి మరియు నీవు ఏ మతస్థుడివి?) అని అడిగితే, అతను అన్నాడు, “నేను ఒక క్రైస్తవుడిని, నేను నీనెవా పట్టణానికి చెందిన వ్యక్తిని” అని చెప్పాడు. చూశారా, నీనెవా పట్టణ ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ.

ఇప్పుడు, నీనెవా పట్టణ ప్రస్తావన ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారో, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓహో, నీవు నా సోదరుడైన యూనుస్ బిన్ మత్తా అనే ప్రవక్త పట్టణానికి చెందిన వ్యక్తివా?” అని అడిగారు.

ఆ మాట వినగానే అద్దాస్‌కు ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే మక్కాలో ఉంటున్న ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఈ దూరదర్శనాలు, ఈ టెలివిజన్లు, వేరే వేరే చోట్ల నుంచి ఏ ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలుసుకునే విషయాలు లేవు. ప్రవక్త వారు కూడా దూరపు ప్రయాణాలు ఆ రోజుల్లో చేసి లేరు. కాబట్టి, ఆయన ఆశ్చర్యపడుతూ, “యూనుస్ బిన్ మత్తా గురించి, నీనెవా పట్టణం గురించి మీకు ఎలా తెలుసండి?” అని అడిగితే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు,

“జాక అఖీ, కాన నబియ్యన్ వ అన నబి.” (అతను నా సోదరుడు. అతను ఒక ప్రవక్త మరియు నేను కూడా ఒక ప్రవక్తనే.)

యూనుస్ బిన్ మత్తా ఒక ప్రవక్త అయ్యా, నేను కూడా ఒక ప్రవక్తనే. కాబట్టి, ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు అని చెప్పారు. ఆ మాట వినగానే క్రైస్తవుడైన ఆ అద్దాస్ ప్రవక్త వారి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు, నుదుటను ముద్దు పెట్టుకుంటున్నాడు. దూరం నుంచి ఇద్దరు యజమానులు చూసి, “అదో, ఈ ముహమ్మద్ వారి మాటల్లో ఇతను కూడా పడిపోయాడు. ఆ ముహమ్మద్ వారి మాటల ప్రభావం ఇతని మీద కూడా పడిపోయింది” అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారు. తర్వాత, అద్దాస్ యజమానుల వద్దకు వెళితే, అప్పుడు వారిద్దరూ, “ఏమయ్యా, ద్రాక్ష పండ్లు ఇచ్చేసి వచ్చేయ్ అని మేము చెబితే, నీవేమో వెళ్లి అతని చేతులు ముద్దు పెట్టుకుంటున్నావు, నుదుట ముద్దు పెట్టుకుంటున్నావు. ఏంటిది?” అని అడిగితే, అప్పుడు ఆ అద్దాస్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతను అన్నాడు, “లఖద్ అఖ్బరనీ బి అమ్రిన్ మా యఅలముహూ ఇల్లా నబీ.” (ఈయన నాకు ఒక విషయం గురించి తెలియజేశారు. ఆ విషయము ఒక ప్రవక్తకు తప్ప ఇతరులకు అది తెలియదు) అని చెప్పారు.

చూశారా, ఆయన ప్రవక్త అన్న విషయము బానిస అయిన క్రైస్తవుడు అద్దాస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, కొద్ది రోజుల తర్వాత ఆ అద్దాస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా తెలుపబడింది.

అయితే మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూనుస్ బిన్ మత్తా ప్రవక్త వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కూడా ఆ నీనెవా పట్టణానికి ప్రయాణం చేసి వెళ్లి చూసి రాలేదు. ఒక ప్రవక్తగా ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన చరిత్ర ప్రస్తావించారు కాబట్టి, ఆయన తెలుసుకొని, గుర్తుపట్టి ఆ క్రైస్తవ బానిసకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు, వెంటనే ఆ బానిస ఆ విషయాన్ని గ్రహించి ప్రవక్త వారి శిష్యుడిగా మారాడు. కాబట్టి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దైవ ప్రవక్త అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం.

ఇక రండి, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవలసిన ఒకటి, రెండు, మూడు విషయాలు చెప్పి నేను ఇన్షాఅల్లాహ్ నా మాటను ముగిస్తాను.

ఒక విషయం ఏమిటంటే, పశ్చాత్తాపము చెందటం వలన మనిషి పాపాలు తొలిగిపోవటంతో పాటు, అతని మీద ఉన్న శిక్షలు, దుఃఖాలు కూడా తొలిగిపోతాయి అని మనకు తెలపబడింది. నీనెవా పట్టణ ప్రజల మీద దైవ శిక్ష వచ్చి పడుతూ ఉంటే, వారు పశ్చాత్తాపం పొందారు. వారు పశ్చాత్తాపం పొందిన కారణంగా, వారి పాపము మన్నించబడింది, వారిపై వస్తున్న, వారిపై పడబోతున్న శిక్ష కూడా తొలగించబడింది. కాబట్టి, పశ్చాత్తాపము చెందాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుచర సమాజానికి “పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు” అని తెలియజేసి ఉన్నారు.

అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, విశ్వాసి అల్లాహ్‌తో దుఆ చేసుకుంటూ ఉండాలి. అతను మేఘాలలో ప్రయాణిస్తూ ఉన్నా, నీటి మీద ప్రయాణిస్తూ ఉన్నా, లేదా భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నా, నీటి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, గాలిలో ప్రయాణిస్తూ ఉన్నా, భూమి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఈ సర్వం అల్లాహ్ ది. ఈ సర్వానికి మొత్తానికి రాజు, రారాజు, అధిపతి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆయన ఆజ్ఞ ప్రతిచోట చెల్లుతుంది. కాబట్టి, విశ్వాసి ఎక్కడ ఉన్నా, అల్లాహ్‌ను తలుచుకుంటూ, అల్లాహ్‌ను వేడుకుంటూ, అల్లాహ్‌కు దుఆ చేసుకుంటూ ఉండాలి. చూడండి యూనుస్ అలైహిస్సలాం వారు నీటి లోపల, చేప కడుపులో ఉండి ఆయన దుఆ చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన దుఆను విన్నాడు, ఆమోదించాడు, సమస్యను పరిష్కరించి ఆయనకు గట్టెక్కించాడు. కదా? కాబట్టి, ఎక్కడ ఉన్నా నిరాశ చెందకూడదు. ప్రతిచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన జ్ఞానము ప్రతిచోట ఉంది అని మనము గమనించాలి.

అలాగే, యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక బోధకుడు దైవ వాక్యాలు బోధిస్తున్నప్పుడు విసుగు చెందరాదు. యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజలు యూనుస్ అలైహిస్సలాం వారి మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు కాబట్టి, ఆయన మాటను వారు పట్టించుకోవట్లేదు కాబట్టి, యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దైవ ఆజ్ఞ రాకముందే, అనుమతి రాకముందే ఆయన వెళ్లిపోయారు. ఒక రకంగా విసుగు చెందారు, కోపగించుకున్నారు. కాబట్టి, ఈ లక్షణము ఒక బోధకునికి సరికాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ అదే మాట తెలియజేసి ఉన్నాడు. చూడండి,

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ
“కనుక నీ ప్రభువు తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు.” (68:48)

చేపవాడు అంటే యూనుస్ అలైహిస్సలాం వారే. యూనుస్ అలైహిస్సలాం వారు ఎలాగైతే విసుగు చెంది, కోపగించుకొని వెళ్ళిపోయారో, అలా చేయకు అని చెప్పారు. కాబట్టి, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధించే వ్యక్తిలో విసుగు చెందడం అనే లక్షణము ఉండకూడదు.

ఇవి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్నందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠాలు అన్నీ నేర్చుకొని, తెలుసుకొని, మమ్మల్ని మనము సంస్కరించుకొని అల్లాహ్ మార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

యూనుస్ ను చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్న తానే నిందించుకోసాగాడు. ఒకవేళ అతను (అల్లాహ్) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే… పునరుత్థానదినం వరకు చేప కడుపు లోనే ఉండిపోయేవాడు (37: 142-144)

నైనవాహ్ పట్టణ ప్రజలు విగ్రహారాధకులు. వారి జీవన విధానం సిగ్గు లజ్జ లేకుండా ఉండేవి. వారి వద్దకు ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ పంపించాడు. వారిని సంస్కరించ డానికి, అల్లాహ్ ను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) వచ్చారు. తమ ఆరాధనా విధానంలో యూనుస్ జోక్యం వారికి నచ్చలేదు. “మా తాతముత్తాతలు ఈ దేవుళ్ళనే ఆరాధించారు. మేము వీటిని చాలా కాలంగా ఆరాధిస్తున్నాము. మాకు ఎలాంటి హాని కలుగలేదు” అని వారు ఆయన మాటలను తిరస్కరించారు.

విగ్రహారాధన ఎంత అవివేకమైనదో, అల్లాహ్ ఆరాధనలోని ఔచిత్య మెంత గొప్పదో ఆయన వారికి నచ్చజెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. కాని వారు ఆయన మాటలు వినలేదు. తమ విధానాలు మార్చుకోనట్లయితే అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించారు. అయినా వారు లక్ష్యపెట్టలేదు. తాము ఏ శిక్షకూ భయపడమని అన్నారు. ఆ శిక్ష ఏంటో రానీ చూద్దాం అన్నారు. నిరాశకు గురయిన యూనుస్ (అలైహిస్సలాం) వారితో, “అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదలి వేస్తున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన అల్లాహ్ శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు.

ఆయన పట్టణం వదలి వెళ్ళిన వెంటనే అక్కడి ఆకాశం ఎర్రగా మంటలా మారిపోయింది. ఈ దృశ్యం చూసి ప్రజలు భయపడ్డారు. ఆద్, సమూద్, నూహ్ జాతి ప్రజల వినాశం గుర్తుకు తెచ్చుకున్నారు. తమకు కూడా అలాంటి గతి పట్టనుందా! అన్న ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది. వారంతా ఒక కొండపై గుమిగూడారు. అల్లాహ్ కారుణ్యం కోసం, ఆయన క్షమా భిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు. వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణమంతా అలముకుంది. అల్లాహ్ వారిపై తన ఆగ్రహాన్ని తొలగించి వారిని మరలా అనుగ్రహించాడు. భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యూనుస్ ప్రవక్తను మళ్ళీ రావలసిందిగా కోరారు. ఆయన వచ్చి తమకు సరియైన మార్గం చూపించాలని కోరారు.

ఈలోగా యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) ఒక పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణీకులు ఉన్నారు. సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురుటాకులా వణకి పోసాగింది. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతోంది. పడవలో చాలా సామాను ఉంది. ప్రయాణీకులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసరివేసారు. అయినా పడవలో బరువు చాలా ఎక్కువ ఉంది. ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం. కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రం లోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు. అందరూ చీటీలు వేశారు. ఈ లాటరీలో యూనుస్ ప్రవక్త పేరు వచ్చింది.

యూనుస్ ప్రవక్త గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవ నీయుడు. అటువంటి మనిషిని సముద్రంలో వదిలేయడానికి వాళ్ళు ఇష్టపడ లేదు. అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు. రెండవసారి కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి వేశారు. అప్పుడు కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ ప్రవక్త గుర్తించారు. ఆయన అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదలివేశారు. ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.

ప్రయాణీకులు తనను సముద్రంలో వదిలేయక ముందే ఆయన లేచి అల్లాహ్ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు. భారీ అలల్లో ఆయన కలసిపోయారు.

యూనుస్ (అలైహిస్సలాం) కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. అంతా చాలా చీకటిగా ఉంది. కాని చాలా మృదువుగా, మెత్తగా ఉంది. ఆయనకు కుదుపులు తగులుతున్నాయి. అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు. తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడడానికి గాను అల్లాహ్ ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశాడు. ఆయన వెంటనే అల్లాహ్ ను తలచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు. ఔన్నత్యం ఆయనదే. నిస్సందేహంగా నేను తప్పు చేశాను” అన్నారు. అనంత కరుణామయుడు, అపారంగా క్షమించేవాడయిన అల్లాహ్ ఈ ప్రార్ధనను ఆలకిం చాడు. ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనుస్ (అలైహిస్సలాం)కు కలిగింది. ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు. ఆయన్ను బయటకు కక్కేసేలా అల్లాహ్ ఆ చేపకు ఆజ్ఞాపించాడు. యూనుస్ (అలైహిస్సలాం) వెంటనే అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించారు.

ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు. బలహీనంగా, ఒంటరిగా మిగిలి పోయారు. ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు. ఎండ వేడిమి నుంచి ఆ ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి. అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి. వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన శక్తిని పుంజు కున్నారు. తన స్వస్థలం నైనవాహ్ కు  ప్రయాణమయ్యారు. అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు. ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు. తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు. వారంతా కలసి అల్లాహ్ కు కృతజ్ఞతా సూచకంగా ప్రార్ధనలు చేశారు. (చదవండి దివ్య ఖుర్ ఆన్  6:86-57, 21:87-88 37:139-158)

యూనుస్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు అప్పగించబడిన పనిని మధ్యలో విడిచి పెట్టి పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కొరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్లక్ష్యానికి శిక్షను అనుభవించారు. తమపై శిక్ష విరుచుకుపడే సూచనలు కనబడగానే దుర్మార్గులు తమ తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష అర్ధిస్తూ కారుణ్యం కోసం ప్రార్ధంచారు. అల్లాహ్ తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టాడు. 

యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) విషయంలోనూ ఇదే జరిగింది. అల్లాహ్ ఆయన్ను ఒక విచిత్రమైన, భయంకరమైన సంఘటనకు గురిచేశాడు. ఆయన తన తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. అల్లాహ్ కరుణ చూపి ఆయన్ను కాపాడాడు.

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) చేసిన సరళమైన, చిన్న ప్రార్ధన చాలా ప్రాముఖ్యం కలిగినది

హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఉటంకం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్ధనతో అల్లాహ్ కు  మొరపెట్టుకుంటే అల్లాహ్ ప్రతిస్పందిస్తాడు. ఇది అల్లాహ్ చేసిన వాగ్దానంగా భావించబడుతుంది” – లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక , ఇన్ని కుంతు మినజ్ఞాలిమీన్.

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.


اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.

ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.

మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.

ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.

ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.

ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.

అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.

ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.

అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.

కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.

ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!

ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.

సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.

సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.

అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.

సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.

ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741

సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM