ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు

1708. హజ్రత్ ఉమ్మె సలమ (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు :-

ఖుర్బానీ కొరకు పశువు ఉండి ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు.

[సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం]

313 వ అధ్యాయం : ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.

[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

ముఖ్యాంశాలు:-

జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.

227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

నోట్: సఊది అరేబియా కాలమానం ప్రకారం అరఫా రోజు 25/10/2012. ఇండియా లో 26/10/2012 ఉండవచ్చు. కాబట్టి 25 మరియు 26 తారీఖు లలో ఉపవాసం ఉండి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. బారకల్లః ఫీకుం.

జిల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత

ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు

హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.

1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు.    [బుఖారీ]

[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]

ముఖ్యాంశాలు :

జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక  పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా  కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.

హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం
సంకలనం: ఇమాం నవవి (రహిమహుల్లః )

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-

నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.

“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]

ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) [పుస్తకం]

బిస్మిల్లాహ్

ప్రవక్త గారు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు

Pray as you see me praying

దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)
Daiva Pravakta (Sallallahu Alaihi wa Sallam) Namazu Swaroopam(Sifat-us-salatunnabi)
Author : Muhaddis-e-Asr AllamaMohammad Naasiruddin Albani(Rahimahullah)
Telugu Translator :Mohammad Khaleel-ur-Rahman,Kothagudem

Excellent Book ! Must Read !!

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/sifat-salat-an-nabi
[244 పేజీలు] [PDF][మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక

విషయ సూచిక (అసలు పుస్తకం)

  • కాబా వైపు తిరిగి నిలబడటం
  • నమాజ్‌లో నిలబడటం (ఖియామ్‌)
  • వ్యాధిగ్రస్థుడు కూర్చొని నమాజ్‌ చేయటం
  • పడవలో నమాజ్‌ చేయటం
  • తహజ్జుద్‌ నమాజులో నిలబడటం, కూర్చోవటం
  • బూట్లు ధరించి నమాజ్‌ చేయటం
  • వేదిక (మింబర్‌)పైన ఆయన నమాజు చేయటం
  • సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి
  • నమాజును భంగపరిచే విషయాలు
  • సమాధికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేయటం
  • సంకల్పం (నియ్యత్‌)
  • తక్బీరే తహ్రీమా
  • చేతులు రెండు పైకెత్తటం (రఫయదైన్‌)
  • కుడి చేయి ఎడమ చేయి మీద పెట్టటం, అలా పెట్టమని ఆజ్ఞాపించటం
  • చేతులు రెండూ ఛాతీ మీద పెట్టుకోవటం
  • సజ్దా చేసే చోటుని చూస్తూ ఉండటం, నమాజులో భక్తిశ్రద్ధలు
  • తక్బీరె తహ్రీమా తర్వాత నమాజును ప్రారంభించే ప్రార్ధనలు
  • ఖుర్‌ఆన్‌ పఠనం
  • ఒక్కో ఆయతు వేర్వేరుగా పఠించటం
  • ఫాతిహా సూరా నమాజులో ప్రధానాంశం అవడం
  • జహ్‌రీ (బిగ్గరగా చదివే) నమాజుల్లో ఇమాము వెనుక ఖుర్‌ఆన్‌ పారాయణం రద్దయిన విషయం గురించి
  • సిర్రీ (నిశ్శబ్దంగా చదివే) నమాజుల్లో ఖుర్‌ఆన్‌ పఠనం విధి
  • ఇమామ్‌, ముక్తదీలు ఇరువురూ బిగ్గరగా ఆమీన్‌ పలకటం
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫాతిహా సూరా అనంతరం ఖుర్‌ఆన్‌ పఠించటం
  • పోలికలు గల, ఒకే విధమైన సూరాలను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకే రకాతులో కలిపి పఠించటం
  • ఫాతిహా సూరా పఠనంతో సరిపెట్టుకోవటం కూడా సమ్మతమే
  • ఐదు పూటల నమాజుల్లో, ఇంకా ఇతర నమాజుల్లో బిగ్గరగా లేక మెల్లిగా ఖుర్‌ఆన్‌ పఠనం
  • తహజ్జుద్‌ నమాజులో మెల్లిగా లేక బిగ్గరగా ఖుర్‌ఆన్‌ పఠనం
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజుల్లో ఏ సూరాలు పఠించేవారు
  • 1. ఫజ్ర్‌ నమాజు
    • ఫజ్ర్‌ పూట సున్నత్‌ నమాజులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పఠనం
  • 2. జుహ్ర్‌ నమాజు
    • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్‌ నమాజు చివరి రెండు రకాతుల్లో ఫాతిహా సూరా తర్వాత కొన్ని ఆయతులు పఠించటం
    • ప్రతి రకాతులోనూ తప్పనిసరిగా ఫాతిహా సూరా పఠనం
  • 3. అస్ర్ నమాజు
  • 4. మగ్రిబ్‌ నమాజు
    • మగ్రిబ్‌ సున్నతు నమాజులో ఖుర్‌ఆన్‌ పఠనం
  • 5. ఇషా నమాజు
  • 6. తహజ్జుద్‌ నమాజు
  • 7. విత్ర్‌ నమాజు
  • 8. జుమా నమాజు
  • 9. రెండు పండుగల నమాజులు
  • 10. జనాజా నమాజు
  • ఆయతుల చివర్లో ఆగుతూ, ప్రశాంతంగా, మధురమైన స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడం
  • ఇమాము పొరబడిన సంగతి అతనికి తెలియపర్పటం
  • దుష్ప్రేరణలను దూరం చేసుకునేందుకు నమాజు స్థితిలోనే ‘అవూజు బిల్లాహ్‌’ పలకటం, మరియు ఉమ్మటం
  • రుకూ
  • రుకూ చేసే పద్ధతి
  • ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)
  • రుకూలో పఠించబడే దుఆలు
  • రుకూ సుదీర్గంగా చేయటం
  • రుకూలో ఖుర్‌ఆన్‌ పఠించరాదు
  • రుకూ నుంచి లేచి నిలబడటం, ఆ స్థితిలో పఠించబడే దుఆలు
  • రుకూ తర్వాత చాలా సేపు నిలబడి వుండడం మరియు దానిలో ప్రశాంతత అనివార్యం అయ్యే అంశం
  • సజ్దాల అంశము
  • రెండు చేతుల ద్వారా సజ్దాలోకి వెళ్ళే అంశం
  • సజ్దాలో ప్రశాంతతను అనివార్యం చేసే అంశం
  • సజ్దాలో పఠించవలసిన దుఆలు
  • సజ్దాలో ఖుర్‌ఆన్‌ పఠనం నిషేధం
  • సజ్దాను పొడిగించడం
  • సజ్దా విశిష్టత
  • నేలపై, చాపపై సజ్దా చేసే అంశం
  • సజ్దా నుండి పైకి లేవడం
  • రెండు సజ్దాల మధ్య కూర్చొనే మరో స్వరూపము
  • రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చోవడం అనివార్యం
  • రెండు సజ్దాల మధ్య పఠించబడే దుఆలు
  • రెండవ సజ్దా తర్వాత కూర్చొనే అంశం (జల్సా ఇస్తెరాహత్‌)
  • రెండవ రకాతు కోసం నిలబడేటప్పుడు
  • రెండు చేతుల సహాయం తీసుకోవటం
  • ప్రతి రకాతులో ఫాతిహా సూరా పఠించడం విధి
  • మొదటి తషహ్హుద్‌
  • తషహ్హుద్‌లో చూపుడు వ్రేలును ఊపుతూ వుండడం
  • మొదటి తషహ్హుద్‌ అనివార్యత మరియు దానిలో
  • దుఆ పఠించడాన్ని ధర్మయుక్తం చేసే అంశం
  • తషహ్హుద్‌ పదజాలం
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్‌ పఠించే చోట్లు మరియు దాని పదాల వివరణ
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్‌ పంపడం వల్ల కలిగే ప్రయోజనాలు
  • మూడవ మరియు నాలుగవ రకాతు కోసం నిలబడే అంశం
  • ఐదు పూటల నమాజులలో నాజిలా దుఆ పఠించే అంశం
  • వితర్‌ నమాజులో ఖునూత్‌ దుఆ పఠించే అంశం
  • ఆఖరి తషహ్హుద్‌ మరియు దానిని విధిగా చేసే అంశం
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్‌ పంపడాన్ని విధిగా చేసే అంశం
  • దుఆ చేయడానికి ముందు నాలుగు విషయాల నుండి శరణుకోరడం తప్పనిసరి
  • సలాంకు ముందు దుఆ పఠించడం మరియు దాని విభిన్న పద్ధతులు
  • సలాం అంశం
  • నమాజు పూర్తి చేసేటప్పుడు ‘అస్సలాము అలైకుం’ పలకడం తప్పనిసరి

ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే

1827. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

నాకు తెలియని విషయం గురించి నేనెప్పుడైనా వింటే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగి పూర్తిగా తెలుసుకుంటాను. (ఓ రోజు) ఆయన “ఎవరి నుండి లెక్క తీసుకోవడం జరుగుతుందో అతను (నరక) యాతనకు గురయినట్లే” అని అన్నారు. అప్పుడు నేను “(ఖుర్ఆన్ లో) ‘అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోవడం జరుగుతుంది’ అని అల్లాహ్ సెలవిచ్చాడు కదా!” అని అన్నాను.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “దానర్ధం లెక్క తీసుకోవడం కాదు. కర్మల పత్రం చూపడం మాత్రమే. దీనికి భిన్నంగా ఎవరిని నిలదీసి లెక్క తీసుకోబడుతుందో అతను సర్వనాశానమవుతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 35 వ అధ్యాయం -మన్ సమిఅ షైఅన్ ఫరాజఅ హత్తా యారిఫహు]

స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం : 18 వ అధ్యాయం – కర్మల విచారణ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?

111. హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) – 

“అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు :

(1) “ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.”  [దివ్యఖుర్ఆన్ – 6 : 103]
“అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పనికాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెరవెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.”  [దివ్యఖుర్ఆన్ – 42 :51]

(2) అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” [దివ్యఖుర్ఆన్ – 31 : 34 ]

(3) అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీన్ని గురించి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.”  [దివ్యఖుర్ఆన్ – 5 : 67]

కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను అతని నిజ స్వరూపంలో రెండుసార్లు చూశారు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 53 వ సూరా – అన్నజ్మ్ – 1 వ అధ్యాయం – హద్ధసనా యహ్యా]

విశ్వాస ప్రకరణం – 75 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

హజ్ లో – కాబా వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి (Menstruating woman) మినహాయింపు ఉంది

836. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా! సఫియా బిన్తే హుయ్యి (రధి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నా నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం – హైజ్, 27 వ అధ్యాయం – అల్ మర అతి తహైజు బాదల్ ఇఫాజా]

హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు

753. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి అర్ఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతిక కాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 20 వ అధ్యాయం – అల్ కఫని ఫి సౌబైన్]

హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్