సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/HVq6SNiWQRs [11 నిముషాలు]

ప్రతీ ఒక్కరూ తప్పకుండా వినవలసిన అంశం ఇది ⤵️
సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు 🎤
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
⏰ 11:29 నిమిషాలు
జుమా ఖుత్బా ఇచ్చేవారికి కొన్ని పాయింట్స్

ఈ ప్రసంగంలో, సత్కార్యాలను నాశనం చేసే పాపాల గురించి వివరించబడింది. ప్రారంభంలో, మంచి పనులను పాడుచేసే పాపాల గురించి ఖురాన్ ఆయత్ (సూరత్ ముహమ్మద్, 33) ఉటంకిస్తూ, ఈ పాపాలు సత్కార్యాలపై ఏడు రకాలుగా ప్రభావం చూపుతాయని వర్గీకరించారు. అవి: అన్ని మంచి పనులను నాశనం చేసేవి, నిర్దిష్టమైన మంచి పనులను పాడుచేసేవి, మంచి పని తర్వాత చేసిన పాపాలు, పుణ్యాల ఫలాన్ని తగ్గించేవి, ప్రళయదినాన పుణ్యాలను సమం చేసేవి, పుణ్యాల ప్రయోజనాలను తొలగించేవి మరియు ఒకరి పుణ్యాలను ఇతరులకు బదిలీ చేసేవి. ఆ తర్వాత, షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (అవిశ్వాసం), ప్రవక్తను అగౌరవపరచడం, అల్లాహ్ అవతరింపజేసిన దానిని ద్వేషించడం, జ్యోతిష్కులను సంప్రదించడం, రియా (ప్రదర్శన బుద్ధి), బిద్అత్ (మతంలో కొత్త కల్పనలు), నమాజు వదిలివేయడం, తల్లిదండ్రులను హింసించడం, ఉపకారం చేసి మాట అనడం, ఏకాంతంలో పాపాలు చేయడం, మద్యపానానికి బానిసవ్వడం, అక్రమ సంపాదన, మరియు ఇతరులను అణచివేయడం వంటి 16 నిర్దిష్ట పాపాలను వాటి ఆధారాలతో సహా వివరించారు. అన్ని రకాల పాపాలకు దూరంగా ఉంటూ, ధర్మజ్ఞానాన్ని నేర్చుకుని, ఇహపరలోకాలలో సౌభాగ్యం పొందాలని ప్రసంగం ముగిసింది.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

ప్రియులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం సత్కార్యాలను నశింప జేసే పాప కార్యాలు ఏమిటో తెలుసుకుందాము. అయితే ముందు సూరత్ ముహమ్మద్, ఆయత్ 33:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ
[యా అయ్యుహల్లజీన ఆమనూ అతీవుల్లాహ వ అతీవుర్రసూల వలా తుబ్తిలూ ఆమాలకుమ్]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క విధేయత పాటించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత పాటించండి. మీ యొక్క సత్కార్యాలను మీరు నాశనం చేసుకోకండి.

ఈ భావంలో ఖురాన్ లో ఇంకా వేరే ఆయతులు కూడా ఉన్నాయి. అయితే, ఆ పాప కార్యాలు ఏమిటి?, వేటి ద్వారానైతే సత్కార్యాలు నశించిపోతాయో, ఒక్కొక్కటి తెలుసుకునేకి ముందు సంక్షిప్తంగా ఒక నియమం తెలుసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఒకటే కాదు, పాప కార్యాల వల్ల సత్కార్యాలు ఏవైతే నశించిపోతాయో, దాని యొక్క చిన్న వివరణ ముందు అర్థం చేసుకోండి.

ఒకటి, కొన్ని పాపాలు ఉంటాయి, వాటి ద్వారా సర్వ సత్కార్యాలు నాశనమైపోతాయి.

రెండవది, కొన్ని పాపాలు ఉంటాయి, అవి ఏ సత్కార్యాలలో కలుషితమవుతాయో, ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

మూడవది, సత్కార్యం తర్వాత కొన్ని పాపాలు ఉంటాయి, అవి జరిగితే ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

నాలుగవది, కొన్ని పాపాల వల్ల, కొన్ని రకాల సత్కార్యాలు చూడడానికి నెరవేరుతాయి, కానీ ఆ సత్కార్యాలు పాప పరిహారంగా పనికిరావు లేదా పుణ్యాల రెట్టింపుకు కారణం కావు లేదా అల్లాహ్ వద్ద మనకు ఏ సాన్నిధ్యం లభించాలో అది ప్రాప్తం కాదు.

ఐదవది, కొన్ని రకాల పాపాలు ప్రళయ దినాన త్రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతే, సత్కార్యాలకు సమానంగా అయిపోతే, ఆ సత్కార్యాలు నశించిపోతాయి.

ఆరవది, కొన్ని పాపాలు సత్కార్యాల ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు, వాటిని నశింపజేస్తాయి.

ఏడవ విషయం, చాలా శ్రద్ధగా వినండి. కొన్ని రకాల పాపాలు మనతో జరిగినందుకు, ప్రళయ దినాన మన నుండి, మనలోని పుణ్యాలు ఆ పాపాలకు కారణంగా తీసుకోవడం జరుగుతుంది, వేరేవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సత్కార్యాల లాభం నుండి కోల్పోయి మన సత్కార్యాలు నాశనమవుతాయి.

అయితే, ఈ నియమాలు కొన్ని తెలుసుకున్న తర్వాత, ఇక రండి. నేను ప్రతి ఒక్కదానికి దలీల్ ఇక్కడ వివరంగా చెప్పలేను. మీరు చిన్న ప్రయత్నం చేసి చదివి, వెతికే ప్రయత్నం చేయండి. కానీ, నేను ఒక్కొక్క పాపం గురించి తెలియజేస్తాను.

మొదటిది, షిర్క్. దీని గురించి అల్లాహుతాలా సూరతు జుమర్ లో చాలా స్పష్టంగా తెలియజేశాడు, لَيَحْبَطَنَّ عَمَلُكَ [లయహ్బతన్న అమలుక్] (నీ ఆచరణ వ్యర్థమైపోతుంది). ఆయత్ నెంబర్ 65, 66. అలాగే సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నెంబర్ 80 తర్వాత నుండి 88వ ఆయత్ లు మీరు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది.

రెండవది, కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. షిర్క్ అంటే ముందు తెలుసు కదా, బహుదైవారాధన, ఏ రకమైనది గానీ. రెండవది కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. మనిషి ఒక ముస్లింగా ఉండిన తర్వాత కుఫ్ర్ లో పడిపోవడం, సత్యతిరస్కారానికి పాల్పడడం, ఇస్లాంను త్యజించడం, విడనాడడం లేదా ఇర్తిదాద్, ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యేటువంటి పాపానికి ఒడిగట్టడం. సూరతుల్ బఖరా, ఆయత్ నెంబర్ 217 చూడండి.

ఇక మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించాలో, అలా గౌరవించకపోవడం. దీని గురించి సూరత్ హుజరాత్ లోని ఆయత్ నెంబర్ రెండు చూడవచ్చు.

నాలుగవది, అల్లాహ్ అవతరింపజేసిన విషయాలను అసహ్యించుకోవడం. ఇది కూడా చాలా ఘోరమైన పాపం. సూరత్ ముహమ్మద్, ఆయత్ నెంబర్ 8 మరియు 9 చదవండి.

ఇక, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్కుల వద్దకు వెళ్లి చేయి చూపించడం, తెలుసుకోవడం. వీటి ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించి సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 2230 చూడవచ్చును.

అలాగే, రియాకారి (ప్రదర్శనా బుద్ధి, చూపుగోలుతనం). దీనికి సంబంధించి ఎన్నో ఆయత్ లు కూడా ఉన్నాయి, హదీస్ లు కూడా ఉన్నాయి. అయితే సహీ తర్గీబ్ లో, షేఖ్ అల్బానీ వారిది, హదీద్ నెంబర్ 131లో,

إِنَّ اللَّهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا وَابْتُغِيَ بِهِ وَجْهُهُ
[ఇన్నల్లాహ లా యఖ్బలు మినల్ అమలి ఇల్లా మా కాన లహూ ఖాలిసన్ వబ్తుగియ బిహి వజ్హుహూ]
నిశ్చయంగా అల్లాహ్ కేవలం తన కొరకు చిత్తశుద్ధితో, ఆయన ప్రసన్నతను ఆశించి చేసే కర్మను తప్ప మరేదీ స్వీకరించడు

అల్లాహ్ యొక్క ప్రసన్నత కోరి ఆయన కొరకే ప్రత్యేకంగా చేయబడిన సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు.

ఇక సోదర మహాశయులారా, ఏడవది బిద్అత్.. బిద్అత్ కు పాల్పడడం గానీ, స్వయం బిద్అత్ ను ఏదైనా కనుగొని ప్రజల్లో దాన్ని ప్రచారం చేయడం గానీ, బిద్అత్ విషయాలను పాటించడం గానీ. దీనికి సంబంధించి సహీ బుఖారీ 2697, అలాగే సహీ బుఖారీలో 3243 మరియు సహీ ముస్లింలో కూడా ఈ హదీస్ చాలా ప్రఖ్యాతిగాంచినది.

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ
[మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ ధర్మంలో లేనిదాన్ని కొత్తగా కల్పిస్తాడో అది త్రోసిపుచ్చబడుతుంది

ఎనిమిదవది, నమాజులను విడనాడడం. దీనికి సంబంధించి ప్రళయదినాన విషయంలో ఏదైతే మనకు చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగిందో, ఇబ్నె మాజాలో కూడా ఉంది, షేఖ్ అల్బానీ రహీముహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు, 2573. మరియు ప్రత్యేకంగా అసర్ నమాజ్ విడనాడడం కారణంగా సర్వ సత్కార్యాలు నాశనమవుతాయి అన్నటువంటి చాలా హెచ్చరిక కూడా సహీ హదీస్ లో వచ్చి ఉంది.

అలాగే తొమ్మిదవది, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారి సేవ, వారి పట్ల ఏదైతే మనం ఉత్తమ రీతిలో మెలగాలో అలా మెలగకుండా ఉండడం. దీనికి సంబంధించి సహీహుల్ జామిఅ 3065లో హదీస్ వచ్చి ఉంది.

ఇక, ఎవరి పట్లనైనా ఏదైనా మేలు చేసి అతని మనస్సు గాయపరచడం. నేను చేయడం వల్ల నువ్వు ఇలా ఇంత పెద్దగా అయ్యావు, ఇంత పైకి వచ్చావు అన్నటువంటి మాటలు చెప్పి మనసు నొప్పించడం. సూరతుల్ బఖరా 264 ఆయత్ నెంబర్ చూడండి.

ఇక, అల్లాహ్ యొక్క భయం లేకుండా ఒంటరితనాల్లో ఉండి పాపాలపై పాపాలు చేస్తూ పోవడం. వారి యొక్క సత్కార్యాలు తిహామా పర్వతాలకు సమానంగా అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అల్లాహుతాలా బూడిద మాదిరిగా చేస్తాడు అన్నటువంటి హెచ్చరిక సహీహుల్ జామిఅ 5028లో వచ్చి ఉంది. ఇబ్నె మాజాలోని హదీస్ కూడాను ఇది.

అలాగే 13వది, ఎవరైతే మత్తుకు బానిసగా అయిపోతారో, అల్లాహు అక్బర్, వారి గురించి కూడా హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6313.

ఇక, 14 వది, ఎవరైతే “అల్లాహ్ నిన్ను క్షమించడు” అన్నటువంటి నిర్ణయాలు ఏదైతే అల్లాహ్ చేయవలసి ఉందో, అవి తన చేతిలోకి తీసుకుంటాడో, సహీ ముస్లింలో హదీస్ వచ్చింది, 2621.

15వది, ఎవరైనా విశ్వాసుణ్ణి హతమార్చాలి అన్నటువంటి తపన కలిగి ఉండడం. అలాంటి వారి యొక్క ఫర్జ్ లు, నఫిల్ లు ఏవీ స్వీకరించబడవు అన్నటువంటి హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6459.

ఇక, 16వది, ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో, ధర్మ సంపాదన వదులుకొని హరాం పద్ధతులను అవలంబిస్తున్నారో సంపాదించడంలో, వారి గురించి చాలా పొడవైన హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది, 1686.

ఇక, అల్లాహ్ యొక్క దాసులపై అన్యాయాలు చేయడం, అన్యాయంగా వారిని తిట్టడం, వారి యొక్క హక్కును కాజేయడం, వారిపై అపనిందలు వేయడం, వారిని కొట్టడం, ఇలాంటి పాపాల వల్ల ప్రళయ దినాన మన పుణ్యాలు వారికి ఇవ్వబడతాయి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎవరు దివాలా తీస్తారో అన్నటువంటి ప్రశ్న ఏదైతే ప్రవక్త అడిగారో ఆ హదీస్ లో. హదీస్ నెంబర్ 2581.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, సంక్షిప్తాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి, ఎప్పుడైనా ఏ పాపమైనా గానీ మన యొక్క ఏ పుణ్యాలనైనా గానీ భస్మం చేయవచ్చు. అందుకొరకు మనం ప్రతి పాపం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇన్షా అల్లాహ్ వేరే సందర్భంలో ఏ పుణ్యాల వల్ల కొన్ని పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుందాము.

ఖురాన్, హదీసులు చదువుతూ ఉండండి. జ్ఞానం, ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ ఉండండి. అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో జీవితం గడుపుతూ ఇహపరలోకాలలో సుఖశాంతులు పొందుతూ ఉండండి. అల్లాహ్ మనందరినీ అన్ని రకాల పాపాల నుండి దూరం ఉండే అటువంటి రక్షణలో ఉంచుకొని, సౌభాగ్యాలు మన జీవితంలో మనకు ప్రసాదిస్తూ ఉండుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=26625

ఇంటి ఓనర్ కి డబ్బు అప్పు ఇచ్చి, దానికి వడ్డీ తీసుకోకుండా, అతని ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చా? [ఆడియో]

ఇంటి ఓనర్ కి డబ్బు అప్పు ఇచ్చి, దానికి వడ్డీ తీసుకోకుండా, అతని ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చా? [ఆడియో]
https://youtu.be/9_0mCbZ5wWc [5 నిముషాలు]

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.  [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]

వడ్డీ:
https://teluguislam.net/category/riba-interest-vaddi/

వడ్డీ (Interest, Riba)

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

దైవ భీతితో కంటతడి పెట్టటం – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]

దైవ భీతితో కంటతడి పెట్టటం – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/J1AoCveWZ2s [11 నిముషాలు]

దైవ భీతితో కంటతడి పెట్టటం – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) [PDF]
https://teluguislam.net/wp-content/uploads/2022/01/rs-54.pdf

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:

“(పితకబడిన) పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకూ దైవభీతితో కంటతడి పెట్టినవాడు నరకానికి పోడు. అదేవిధంగా దైవ మార్గంలో లేపబడిన దుమ్ముధూళి, నరకధూమంతో కలవదు.”

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్ మరియు సహీహ్ పేర్కొన్నారు. (సుననె తిర్మిజీలోని జిహాద్ ప్రకరణం)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు:

“అల్లాహ్ నీడ తప్ప మరెలాంటి నీడకనబడని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురిని తన (కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ ఏడుగురు: (1) న్యాయంగా పరిపాలిం చిన పాలకుడు. (2) తన యవ్వనాన్ని దైవారాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి. (4) కేవలం దైవ ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. (5) అందం, అంతస్థూ కలిగి వున్న స్త్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియ నంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసు కొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి.” (బుఖారీ – ముస్లిం)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రదియల్లాహు అన్హు) కథనం:

“నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన నమాజ్ చేస్తున్నారు. (నమాజ్లో) ఆయన ఏడుస్తుంటే పొయ్యిపై ఉంచిన కుండ శబ్దం చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం రాసాగింది.”

(ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు. దీన్నే ఇమామ్ తిర్మిజీ ‘షమాయిల్లో ప్రామాణికమైన ఆధారంతో ఉల్లేఖించారు.)

17:109 وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్‌ఆన్‌ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది.

19:58 أُولَٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩
అల్లాహ్‌ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాఖూబు (ఇస్రాయీలు)సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు.

53:59 أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ
ఏమిటీ, మీరు ఈ విషయంపై ఆశ్చర్యపోతున్నారా?
53:60 وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ
నవ్విపోతున్నారా? ఏడుపు రావటం లేదా?

ముస్లిం స్త్రీలు డ్వాక్రా గ్రూప్ లో ఉండవచ్చా? [వీడియో]

ముస్లిం స్త్రీలు డ్వాక్రా గ్రూప్ లో ఉండవచ్చా? [వీడియో]
https://youtu.be/xzuIDuGAL9Y [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

వడ్డీ (Interest, Riba)

నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

పెద్ద పాపాలను గుర్తించడం ఎలా? How to identify the Major Sins?

పెద్ద పాపాలను గుర్తించడం ఎలా? How to identify the Major Sins?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/GvxwOoF68I0 [5 నిముషాలు]

పాపాలు (Sins): https://teluguislam.net/sins/

చిన్న పాపాలే కదా! అని నిర్లక్ష్యం చేయకండి (Small Sins)

చిన్న పాపాలే కదా! అని నిర్లక్ష్యం చేయకండి (Small Sins)
https://youtu.be/h1r-P4CloOw [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పాపాలు (Sins):
https://teluguislam.net/sins

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా?

సామాజిక రుగ్మతలు మరియు వాటి నివారణోపాయాలు [వీడియో]

“మేము చేస్తున్న చెడ్డ పనులు ఎవరూ చూడటంలేదు కదా” అనే వారికి హెచ్చరిక [వీడియో]

అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో]

అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో]

అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో]
వక్త: షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్), మదీనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్
https://youtu.be/VKKIMPEnFmM [46 నిముషాలు]

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఘోరమైన పాపాలు (Major Sins)

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

كتاب الكبائر
ఘోరమైన పాపాలు

అరబీలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) గారి
కితాబుల్ కబాయిర్ అనే బుక్ నుండి
తెలుగు అనువాదకులు: జనాబ్ ముహమ్మద్ రబ్బానీ, దాయీ

PDF [డౌన్లోడ్ చేసుకోండి]

ఘోరమైన పాపాలు

  • 1- షిర్క్ – 4:48/116/5:72/7:82-88/39:65/
  • 2- నరహత్య – 25:68,69/17:31,33/81:8,9
  • 3- చేతబడి – 2:102/7:116
  • 4-వడ్డీ – 2:275,276
  • 5-అనాధలసొమ్ము కాజేయడం – 4:10
  • 6-అమాయక స్త్రీలపై నింద వేయడం – 24:23
  • 7- రణభూమి నుండి వెనుదిరిగి పారిపోవడం – 8:16(2766 – సహీహ్ బుఖారీ ఈ ఏడు పాపాలు ఒకే హదీసులో వచ్చాయి)
  • 8- తల్లిదండ్రుల అవిధేయత – 17:23,24/(సహీహ్ బుఖారీ 2654)
  • 9-వ్యభిచారం – 25:68,69/17:32
  • 10- మద్య ము-2:219/4:43/5:90,91
  • 11- జూదము – 2:21975:90,91
  • 12- జ్యోతీష్యం – 5:90,91(సహీహ్ ముస్లిం -2230)లేక 5821)(తిర్మిజీ : 135)
  • 13- కొలతల తూనికల్లో మోసాలు – : 83:1-3
  • 14- నమాజులు మానేయడం -19:59,60/74:43/68:42/30:31(సహీహ్ ముస్లిమ్ -82)(తిర్మిజీ – 2621)
  • 15- జకాత్ చెల్లించకపోవడం – 3:180/9:35
  • 16-ఏ కారణం లేకుండా రమదాన్ ఉపవాసాలు మానేయడం – 2:183(సహీహ్ బుఖారీ : 8)
  • 17- అల్లాహ్ పై, ప్రవక్తపై అబద్దాలు కల్పించుట – 39:60 (సహీహ్ బుఖారీ – 1291)
  • 18- స్త్రీ లేక పురుషుల మలద్వారం ద్వారా రమించుట-7:80 (తిర్మిజీ – 1165)
  • 19- స్తోమత ఉండి హజ్ చేయకపోవడం -3:97/22:27)
  • 20-ప్రభుత్వ అధికారులు అక్రమ సంపాధన (లంచాలు) 42:42(సహీహ్ బుఖారీ – 2447/ అబూదావూద్ – 2948)(సహీహ్ ముస్లిం – 2581)
  • 21- గర్వము,స్వార్థము -17:37/ 16:23/31:18(సహీహ్ ముస్లిం – 91,106)
  • 22- అబద్దపు సాక్ష్యం 25:72/(బుఖారీ- 2654)
  • 23- బైతుల్ మాల్,జకాత్ మాలెగనీమత్ లో నమ్మకద్రోహం చేయడం – 3:116(ముస్నద్ అహ్మద్ 12383)
  • 24- దొంగతనం – 5:38
  • 25- బాటసారులను దోచుకోవడం, దారి దోపిడి-5:33
  • 26- అబద్దపు ఒట్టు,ప్రమాణం – (సహీహ్ బుఖారీ-6675/2673)
  • 27- అన్యాయం చేయడం, దౌర్జన్యం చేయడం – 26-227
  • 28- ప్రజలపై అన్యాయంగా పన్ను వేయడం – 42:42(సహీహ్ ముస్లిం – 2581)
  • 29- అక్రమ సంపాధన – 2:188/ (సహీహ్ ముస్లిం 1015)
  • 30- ఆత్మహత్య – 4:29,30(సహీహ్ బుఖారీ-5778)
  • 31- అబద్దానికి అలవాటు పడిపోవడం 3:61(బుఖారీ:6094)
  • 32- ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా తీర్పు – 5:44,45,47
  • 33- లంచము – 2,188(అబూదావూద్ – 3580,3541)
  • 34- స్త్రీ పురుషుల మారు వేషాలు – 4:119(సహీహ్ బుఖారీ – 5885)
  • 35- మోసం చేయడం – (సహీహ్ ముస్లిం – 101)
  • 36- ముస్లింపై కత్తి దూసి బయపెట్టడం – (సహీహ్ ముస్లిం – 101)
  • 37-దయ్యూస్(ఇంట్లో అశ్లీలాన్ని సహించే రోషము లేని మగాడు – (నసాయి,2565)
  • 38- చేసిన మేలును చాటుకునేవాడు,దెప్పిపొడిచేవాడు 2:264(నసాయి,2565,5672)
  • 39- హలాలా చేసేవాడు,చేయించుకునే వాడు – (అబూదావూద్- 2076)
  • 40- మూత్రం తుంపర్ల పట్ల అశ్రద్ధవహించేవాడు – 74:4(సహీహ్ బుఖారీ-216)
  • 41- పశువుల ముఖంపై వాతలు వేయుట,లేక కొట్టుట – (అబూదావూద్ – 2564)
  • 42- ధార్మిక విద్యను దాచుట – 2:159(అబూదావూద్ – 3664)
  • 43- అజ్ఞానులతో వాదించుటకు,విద్వాంసులపై గర్వించుటకు, ప్రజలను ఆకర్శించుట కొరకు ధార్మిక విద్యను అభ్యసించుట – (ఇబ్బెమాజహ్ – 253)
  • 44- నమ్మక ద్రోహము,వాగ్దాన భంగము – (సహీహ్ బుఖారీ – 34) 2:177 (ముస్నదె అహ్మద్ 12383)
  • 45- తోటి ముస్లింను తిట్టుట,శపించుట – (బుఖారీ 34,48) (ముస్లిం- 2581)
  • 46- విధివ్రాతను తిరస్కరించుట – 54:49
  • 47- చాడీలు చెప్పుట – 68:10-12/104:1-3/ (సహీహ్ ముస్లిం- 105)(బుఖారీ – 212)
  • 48- పొరుగువారిని తన మాటలతో చేష్టలతో బాధపెట్టుట – (సహీహ్ ముస్లిం – 46)
  • 49-పిసినారితనము, ప్రగల్భము, డాంభికము,ఆరాటము – (అబూదావూద్- 4801)
  • 50- కూపీలు లాగుట,లోపాలు వెతుకుట – 49:12
  • 51- విగ్రహాలు, చిత్రపటాలు చేయుట – సహీహ్ బుఖారీ – 5954,7042)
  • 52: శపించుట : (అబూ దావూద్ : 4905)
  • 53 : భర్త యొక్క అవిధేయత : 4:34, (బుఖారి:5193,3241) (ఇబ్నె మాజాహ్:1853)
  • 54: మరణించు వారిపై రోధించుట , బట్టలు చించుకొనుట : (సహీహ్ ముస్లిం : 67 సహీహ్ బుఖారి 1297)
  • 55: పగ పెట్టుకొనుట : 42:42/ (సహీహ్ ముస్లిం : 2865)(అబూదావూద్ : 4902)
  • 56: బలహీనుడు, బానిసలు , భార్యలు, పశువులపై దౌర్జన్యం మరియు అతిక్రమణ చేయుట (సహీహ్ ముస్లిం : 1657,1157)
  • 57: తోటి ముస్లింను ఇబ్బంది పెట్టుట శపించుట దూషించుట : 33: 58 (సహీబుఖారి:6032)
  • 58: కాలి చీలమండలం క్రింద బట్టలు వ్రేలాడదీయుట (బుఖారీ : 5787)
  • 59 బంగారం, వెండి పాత్రలలో తినటం, త్రాగటం (సహీహ్ ముస్లిం:2065)
  • 60: పురుషులు బంగారం, మరియు పట్టు వస్త్రాలు, ధరించుట (సహీహ్ బుఖారి: 5835 (తిర్మిజీ:1720)
  • 61: బానిసలు యజమాని నుండి పారిపోవుట, (సహీహ్ ముస్లిం :68,70)
  • 62 అల్లాహ్ తప్ప ఇతరుల పేరు పై బలి ఇవ్వుట: (సహీహ్ ముస్లిం:1978)
  • 63: కావాలని వేరే వారిని నా తండ్రి అని వాదించుట: (సహీహ్ బుఖారి 6766)
  • 64: అకారణంగా జమాత్ తో కలిసి నమాజ్ మానటం, జుమ్మా నమాజ్ మానటం – (సహీహ్ ముస్లిం : 865) (ఇబ్నెమజహ్ 793)
  • 65: తోటి ముస్లింని కాఫిర్ అని పిలువుట – (సహీహ్ బుఖారి :6103)
  • 66: తన వద్ద నీరు సరిపోయినప్పటికీ వేరే వారికి పోనివ్వకుండా ఆపుట (ముస్నద్ అహ్మద్ : 6782)
  • 67: ధర్మం లో వితండ వాదన, అనవసర వాదన (అబుదావూద్ 3597) (తిర్మిజి 2353)
  • 68: అల్లాహ్ యొక్క వ్యూహం నుండి నిర్లక్ష్యం వహించుట 7: 99/ 3:8 (తిర్మిజి :2401,2140)
  • 69: ముస్లింలకు విరుద్దంగా గూడాచారం చేయటం ( వీరి రహస్యాలు వారికి చెప్పటం)68:11 ( అబుదావూద్ : 3597)
  • 70: సహాబాను దూషించుట: (సహీహ్ బుఖారి: 3673)
  • 71 : కుట్ర,దగ : 35:43
  • 72: మైలు రాయిని, బాట సారుల గుర్తులను చెరుపుట (సహీహ్ ముస్లిం:1978)
  • 73: సవరము , విగ్ జోడించుట : (సహీహ్ బుఖారి 5931)
  • 74: అల్లాహ్ నియమించిన హద్దులను (శిక్షలను) రద్దు చేయమని వాదించుట ~ ఒక ముస్లిం లో లేని లోపము కల్పించుట ~బిదాత్ స్థాపించుటకు పోరాడుట(అబూ దావూద్ : 3597)
  • 75: బిదాత్ ని ప్రారంభించుట, అపమార్గం వైపు సందేశం ఇచ్చుట (సహీ ముస్లిం: 1017,2674)
  • 76: బంధుత్వాన్ని త్రెంచుట- 4:1(సహీహ్ ముస్లిం 2556)
  • 77: తోటి ముస్లింతో కొట్లాడుట – (బుఖారీ :48)

  • 4:31 – పెద్ద పాపాలకు దూరంగా ఉంటే చిన్న పాపాలు క్షమిస్తాను
  • 53:32 – పెద్ద పాపాలకు దూరంగా ఉండాలి
  • 42:37 – భాగ్యవంతులు పెద్ద పాపాలకు దూరంగా ఉంటారు

చెడు అనుమానానికి దూరంగా ఉండండి [వీడియో]

చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284
https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1284. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:

దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1