సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు – నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/HVq6SNiWQRs [11 నిముషాలు]

ప్రతీ ఒక్కరూ తప్పకుండా వినవలసిన అంశం ఇది ⤵️
సత్కార్యాలను బూడిద చేసే దుష్కార్యాలు 🎤
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
⏰ 11:29 నిమిషాలు
జుమా ఖుత్బా ఇచ్చేవారికి కొన్ని పాయింట్స్

ఈ ప్రసంగంలో, సత్కార్యాలను నాశనం చేసే పాపాల గురించి వివరించబడింది. ప్రారంభంలో, మంచి పనులను పాడుచేసే పాపాల గురించి ఖురాన్ ఆయత్ (సూరత్ ముహమ్మద్, 33) ఉటంకిస్తూ, ఈ పాపాలు సత్కార్యాలపై ఏడు రకాలుగా ప్రభావం చూపుతాయని వర్గీకరించారు. అవి: అన్ని మంచి పనులను నాశనం చేసేవి, నిర్దిష్టమైన మంచి పనులను పాడుచేసేవి, మంచి పని తర్వాత చేసిన పాపాలు, పుణ్యాల ఫలాన్ని తగ్గించేవి, ప్రళయదినాన పుణ్యాలను సమం చేసేవి, పుణ్యాల ప్రయోజనాలను తొలగించేవి మరియు ఒకరి పుణ్యాలను ఇతరులకు బదిలీ చేసేవి. ఆ తర్వాత, షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (అవిశ్వాసం), ప్రవక్తను అగౌరవపరచడం, అల్లాహ్ అవతరింపజేసిన దానిని ద్వేషించడం, జ్యోతిష్కులను సంప్రదించడం, రియా (ప్రదర్శన బుద్ధి), బిద్అత్ (మతంలో కొత్త కల్పనలు), నమాజు వదిలివేయడం, తల్లిదండ్రులను హింసించడం, ఉపకారం చేసి మాట అనడం, ఏకాంతంలో పాపాలు చేయడం, మద్యపానానికి బానిసవ్వడం, అక్రమ సంపాదన, మరియు ఇతరులను అణచివేయడం వంటి 16 నిర్దిష్ట పాపాలను వాటి ఆధారాలతో సహా వివరించారు. అన్ని రకాల పాపాలకు దూరంగా ఉంటూ, ధర్మజ్ఞానాన్ని నేర్చుకుని, ఇహపరలోకాలలో సౌభాగ్యం పొందాలని ప్రసంగం ముగిసింది.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

ప్రియులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం సత్కార్యాలను నశింప జేసే పాప కార్యాలు ఏమిటో తెలుసుకుందాము. అయితే ముందు సూరత్ ముహమ్మద్, ఆయత్ 33:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ
[యా అయ్యుహల్లజీన ఆమనూ అతీవుల్లాహ వ అతీవుర్రసూల వలా తుబ్తిలూ ఆమాలకుమ్]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క విధేయత పాటించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత పాటించండి. మీ యొక్క సత్కార్యాలను మీరు నాశనం చేసుకోకండి.

ఈ భావంలో ఖురాన్ లో ఇంకా వేరే ఆయతులు కూడా ఉన్నాయి. అయితే, ఆ పాప కార్యాలు ఏమిటి?, వేటి ద్వారానైతే సత్కార్యాలు నశించిపోతాయో, ఒక్కొక్కటి తెలుసుకునేకి ముందు సంక్షిప్తంగా ఒక నియమం తెలుసుకోవడం చాలా మంచిది. అయితే ఇక్కడ ఒకటే కాదు, పాప కార్యాల వల్ల సత్కార్యాలు ఏవైతే నశించిపోతాయో, దాని యొక్క చిన్న వివరణ ముందు అర్థం చేసుకోండి.

ఒకటి, కొన్ని పాపాలు ఉంటాయి, వాటి ద్వారా సర్వ సత్కార్యాలు నాశనమైపోతాయి.

రెండవది, కొన్ని పాపాలు ఉంటాయి, అవి ఏ సత్కార్యాలలో కలుషితమవుతాయో, ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

మూడవది, సత్కార్యం తర్వాత కొన్ని పాపాలు ఉంటాయి, అవి జరిగితే ఆ సత్కార్యాలు నాశనమవుతాయి.

నాలుగవది, కొన్ని పాపాల వల్ల, కొన్ని రకాల సత్కార్యాలు చూడడానికి నెరవేరుతాయి, కానీ ఆ సత్కార్యాలు పాప పరిహారంగా పనికిరావు లేదా పుణ్యాల రెట్టింపుకు కారణం కావు లేదా అల్లాహ్ వద్ద మనకు ఏ సాన్నిధ్యం లభించాలో అది ప్రాప్తం కాదు.

ఐదవది, కొన్ని రకాల పాపాలు ప్రళయ దినాన త్రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతే, సత్కార్యాలకు సమానంగా అయిపోతే, ఆ సత్కార్యాలు నశించిపోతాయి.

ఆరవది, కొన్ని పాపాలు సత్కార్యాల ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు, వాటిని నశింపజేస్తాయి.

ఏడవ విషయం, చాలా శ్రద్ధగా వినండి. కొన్ని రకాల పాపాలు మనతో జరిగినందుకు, ప్రళయ దినాన మన నుండి, మనలోని పుణ్యాలు ఆ పాపాలకు కారణంగా తీసుకోవడం జరుగుతుంది, వేరేవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సత్కార్యాల లాభం నుండి కోల్పోయి మన సత్కార్యాలు నాశనమవుతాయి.

అయితే, ఈ నియమాలు కొన్ని తెలుసుకున్న తర్వాత, ఇక రండి. నేను ప్రతి ఒక్కదానికి దలీల్ ఇక్కడ వివరంగా చెప్పలేను. మీరు చిన్న ప్రయత్నం చేసి చదివి, వెతికే ప్రయత్నం చేయండి. కానీ, నేను ఒక్కొక్క పాపం గురించి తెలియజేస్తాను.

మొదటిది, షిర్క్. దీని గురించి అల్లాహుతాలా సూరతు జుమర్ లో చాలా స్పష్టంగా తెలియజేశాడు, لَيَحْبَطَنَّ عَمَلُكَ [లయహ్బతన్న అమలుక్] (నీ ఆచరణ వ్యర్థమైపోతుంది). ఆయత్ నెంబర్ 65, 66. అలాగే సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నెంబర్ 80 తర్వాత నుండి 88వ ఆయత్ లు మీరు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది.

రెండవది, కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. షిర్క్ అంటే ముందు తెలుసు కదా, బహుదైవారాధన, ఏ రకమైనది గానీ. రెండవది కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. మనిషి ఒక ముస్లింగా ఉండిన తర్వాత కుఫ్ర్ లో పడిపోవడం, సత్యతిరస్కారానికి పాల్పడడం, ఇస్లాంను త్యజించడం, విడనాడడం లేదా ఇర్తిదాద్, ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యేటువంటి పాపానికి ఒడిగట్టడం. సూరతుల్ బఖరా, ఆయత్ నెంబర్ 217 చూడండి.

ఇక మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించాలో, అలా గౌరవించకపోవడం. దీని గురించి సూరత్ హుజరాత్ లోని ఆయత్ నెంబర్ రెండు చూడవచ్చు.

నాలుగవది, అల్లాహ్ అవతరింపజేసిన విషయాలను అసహ్యించుకోవడం. ఇది కూడా చాలా ఘోరమైన పాపం. సూరత్ ముహమ్మద్, ఆయత్ నెంబర్ 8 మరియు 9 చదవండి.

ఇక, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్కుల వద్దకు వెళ్లి చేయి చూపించడం, తెలుసుకోవడం. వీటి ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించి సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 2230 చూడవచ్చును.

అలాగే, రియాకారి (ప్రదర్శనా బుద్ధి, చూపుగోలుతనం). దీనికి సంబంధించి ఎన్నో ఆయత్ లు కూడా ఉన్నాయి, హదీస్ లు కూడా ఉన్నాయి. అయితే సహీ తర్గీబ్ లో, షేఖ్ అల్బానీ వారిది, హదీద్ నెంబర్ 131లో,

إِنَّ اللَّهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا وَابْتُغِيَ بِهِ وَجْهُهُ
[ఇన్నల్లాహ లా యఖ్బలు మినల్ అమలి ఇల్లా మా కాన లహూ ఖాలిసన్ వబ్తుగియ బిహి వజ్హుహూ]
నిశ్చయంగా అల్లాహ్ కేవలం తన కొరకు చిత్తశుద్ధితో, ఆయన ప్రసన్నతను ఆశించి చేసే కర్మను తప్ప మరేదీ స్వీకరించడు

అల్లాహ్ యొక్క ప్రసన్నత కోరి ఆయన కొరకే ప్రత్యేకంగా చేయబడిన సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు.

ఇక సోదర మహాశయులారా, ఏడవది బిద్అత్.. బిద్అత్ కు పాల్పడడం గానీ, స్వయం బిద్అత్ ను ఏదైనా కనుగొని ప్రజల్లో దాన్ని ప్రచారం చేయడం గానీ, బిద్అత్ విషయాలను పాటించడం గానీ. దీనికి సంబంధించి సహీ బుఖారీ 2697, అలాగే సహీ బుఖారీలో 3243 మరియు సహీ ముస్లింలో కూడా ఈ హదీస్ చాలా ప్రఖ్యాతిగాంచినది.

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ
[మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ ధర్మంలో లేనిదాన్ని కొత్తగా కల్పిస్తాడో అది త్రోసిపుచ్చబడుతుంది

ఎనిమిదవది, నమాజులను విడనాడడం. దీనికి సంబంధించి ప్రళయదినాన విషయంలో ఏదైతే మనకు చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగిందో, ఇబ్నె మాజాలో కూడా ఉంది, షేఖ్ అల్బానీ రహీముహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు, 2573. మరియు ప్రత్యేకంగా అసర్ నమాజ్ విడనాడడం కారణంగా సర్వ సత్కార్యాలు నాశనమవుతాయి అన్నటువంటి చాలా హెచ్చరిక కూడా సహీ హదీస్ లో వచ్చి ఉంది.

అలాగే తొమ్మిదవది, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారి సేవ, వారి పట్ల ఏదైతే మనం ఉత్తమ రీతిలో మెలగాలో అలా మెలగకుండా ఉండడం. దీనికి సంబంధించి సహీహుల్ జామిఅ 3065లో హదీస్ వచ్చి ఉంది.

ఇక, ఎవరి పట్లనైనా ఏదైనా మేలు చేసి అతని మనస్సు గాయపరచడం. నేను చేయడం వల్ల నువ్వు ఇలా ఇంత పెద్దగా అయ్యావు, ఇంత పైకి వచ్చావు అన్నటువంటి మాటలు చెప్పి మనసు నొప్పించడం. సూరతుల్ బఖరా 264 ఆయత్ నెంబర్ చూడండి.

ఇక, అల్లాహ్ యొక్క భయం లేకుండా ఒంటరితనాల్లో ఉండి పాపాలపై పాపాలు చేస్తూ పోవడం. వారి యొక్క సత్కార్యాలు తిహామా పర్వతాలకు సమానంగా అంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అల్లాహుతాలా బూడిద మాదిరిగా చేస్తాడు అన్నటువంటి హెచ్చరిక సహీహుల్ జామిఅ 5028లో వచ్చి ఉంది. ఇబ్నె మాజాలోని హదీస్ కూడాను ఇది.

అలాగే 13వది, ఎవరైతే మత్తుకు బానిసగా అయిపోతారో, అల్లాహు అక్బర్, వారి గురించి కూడా హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6313.

ఇక, 14 వది, ఎవరైతే “అల్లాహ్ నిన్ను క్షమించడు” అన్నటువంటి నిర్ణయాలు ఏదైతే అల్లాహ్ చేయవలసి ఉందో, అవి తన చేతిలోకి తీసుకుంటాడో, సహీ ముస్లింలో హదీస్ వచ్చింది, 2621.

15వది, ఎవరైనా విశ్వాసుణ్ణి హతమార్చాలి అన్నటువంటి తపన కలిగి ఉండడం. అలాంటి వారి యొక్క ఫర్జ్ లు, నఫిల్ లు ఏవీ స్వీకరించబడవు అన్నటువంటి హెచ్చరిక ఉంది. సహీహుల్ జామిఅ 6459.

ఇక, 16వది, ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో, ధర్మ సంపాదన వదులుకొని హరాం పద్ధతులను అవలంబిస్తున్నారో సంపాదించడంలో, వారి గురించి చాలా పొడవైన హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది, 1686.

ఇక, అల్లాహ్ యొక్క దాసులపై అన్యాయాలు చేయడం, అన్యాయంగా వారిని తిట్టడం, వారి యొక్క హక్కును కాజేయడం, వారిపై అపనిందలు వేయడం, వారిని కొట్టడం, ఇలాంటి పాపాల వల్ల ప్రళయ దినాన మన పుణ్యాలు వారికి ఇవ్వబడతాయి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎవరు దివాలా తీస్తారో అన్నటువంటి ప్రశ్న ఏదైతే ప్రవక్త అడిగారో ఆ హదీస్ లో. హదీస్ నెంబర్ 2581.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, సంక్షిప్తాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి, ఎప్పుడైనా ఏ పాపమైనా గానీ మన యొక్క ఏ పుణ్యాలనైనా గానీ భస్మం చేయవచ్చు. అందుకొరకు మనం ప్రతి పాపం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇన్షా అల్లాహ్ వేరే సందర్భంలో ఏ పుణ్యాల వల్ల కొన్ని పాపాలు మన్నించబడతాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుందాము.

ఖురాన్, హదీసులు చదువుతూ ఉండండి. జ్ఞానం, ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ ఉండండి. అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో జీవితం గడుపుతూ ఇహపరలోకాలలో సుఖశాంతులు పొందుతూ ఉండండి. అల్లాహ్ మనందరినీ అన్ని రకాల పాపాల నుండి దూరం ఉండే అటువంటి రక్షణలో ఉంచుకొని, సౌభాగ్యాలు మన జీవితంలో మనకు ప్రసాదిస్తూ ఉండుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=26625