సమాధుల పూజ (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/JEdmx9LRr78 (17 నిముషాలు)
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
ఈ ప్రసంగంలో, సమాధుల వద్ద జరిగే ఆరాధనల గురించి వివరించబడింది. ఇస్లాంలో సమాధుల పూజ తీవ్రంగా నిషిద్ధమని, అది పెద్ద షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుందని వక్త స్పష్టం చేశారు. చాలా మంది తాము కేవలం పుణ్యపురుషులను (ఔలియాలను) గౌరవిస్తున్నామని భావించినప్పటికీ, వారి చర్యలు ఆరాధన పరిధిలోకి వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. సమాధుల వద్ద సజ్దా (సాష్టాంగం) చేయడం, తవాఫ్ (ప్రదక్షిణ) చేయడం, మొక్కుబడులు చెల్లించడం, సహాయం కోసం ప్రార్థించడం వంటివి కేవలం అల్లాహ్కు మాత్రమే చేయాల్సిన ఆరాధనలని ఉద్ఘాటించారు. ఆపదలను తొలగించి, అవసరాలు తీర్చే శక్తి కేవలం అల్లాహ్కు మాత్రమే ఉందని, చనిపోయిన వారు వినలేరని, సమాధానం ఇవ్వలేరని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. అల్లాహ్ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ మరణించిన వారు నరకానికి వెళ్తారని ప్రవక్త హదీసును ఉటంకించారు. ముస్లింలు ఇలాంటి షిర్క్ చర్యలకు దూరంగా ఉండి, ఏకైక దైవమైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమాధుల పూజ. అల్లాహు అక్బర్. బహుశా కొందరు మన మిత్రులు ఈ మాట విని కోపానికి వస్తారు కావచ్చు. కొందరంటారు – “ఏంటి మేము ఔలియాలను గౌరవిస్తాము, ప్రవక్తలను గౌరవిస్తాము, ఎవరైతే షహీద్ అయిపోయారో, పుణ్య పురుషులు ఉన్నారో వారిని గౌరవిస్తాము. మీరు సమాధుల పూజ అని అంటారా?” కానీ వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. చదవండి, వినండి, శ్రద్ధ వహించండి.
సమాధుల పూజ అంటే ఏమిటి?
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు, పుణ్య పురుషులు, ప్రవక్తలు అవసరాలు తీరుస్తారని, కష్టాలు తొలగిస్తారని నమ్మడం, మరియు కేవలం అల్లాహ్ ఆధీనంలో ఉన్నదాని విషయాల్లో సహాయం ఆ సమాధి వారితో కోరడం, ఇంకా వారితో మొరపెట్టుకోవడం, వారితో మొరపెట్టుకోవడం ఇలాంటివన్నీ పెద్ద షిర్క్ లో లెక్కించబడతాయి. గమనిస్తున్నారా?
ఇక సమాధులను పూజించడం అంటే ఏంటి? ఇంకా అర్థం కాలేదా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ప్రజల్ని, ముస్లింలను. ఖియామ్ (నిలబడటం), పూర్తి ఎహ్తెరామ్, గౌరవం, మర్యాదతో రుకూ చేయడం, సజ్దా చేయడం, దుఆ చేయడం, జిబహ్ (బలి), దానాల, జంతువుల బలిదానాలు, నజరో నియాజ్ (మొక్కుబడి), ఇంకా ఇలాంటివన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే చేయవలసినటువంటి ఆరాధనలు సమాధుల వద్ద చేస్తున్నారు, మజార్ల వద్ద చేస్తున్నారు, దర్గాల వద్ద చేస్తున్నారు. చేస్తున్నారు కదా? ఇదే చాలా ఘోరమైన షిర్క్. ఇలా చేయడాన్నే సమాధుల పూజ అని అనడం జరుగుతుంది.
అయితే ఇక్కడ తర్కం, వాదం, వివాదంలో కొందరు వాదిస్తారు ఏమని? “లేదు లేదు మేము ఆ సమాధిలో ఉన్న వలీని పూజించడం లేదు, మేము అల్లాహ్ నే పూజిస్తాము”. ఇది కేవలం నోటి మాట మాత్రమే వాదించడానికి. ప్రజల ప్రాక్టికల్, వారి యొక్క ఆచరణ చూస్తే ఏముంది? కేవలం అల్లాహ్కు మాత్రమే సజ్దా చేయాలి, అక్కడ సమాధి వద్ద సజ్దా చేస్తారు. సమాధి చుట్టూ తవాఫ్ చేస్తారు. తవాఫ్ కేవలం కాబాది మాత్రమే జరుగుతుంది. దాన్ని తప్ప వేరే ఎక్కడైనా గాని, అది భయంకరమైన ఘోరమైన షిర్క్. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇన్షా అల్లాహ్ వస్తూ ఉంటాయి, శ్రద్ధ వహించండి.
ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే
అల్లాహు త’ఆలా మనల్ని పుట్టించింది మరియు మనకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే,
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
(వ ఖదా రబ్బుక అల్లా తఅ’బుదూ ఇల్లా ఇయ్యాహ్)
మరి నీ ప్రభువు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. (సూరహ్ బనీ ఇస్రాయీల్, 17:23)
అదేవిధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో, ఇంకా ఎవరైనా గానీ వారి సిఫారసు పొందుటకు లేదా తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. అవును. ఈ రోజుల్లో మనం ప్రజల్లో చూస్తున్నాం కదా? డైరెక్ట్ అక్కడికి వెళ్లి, మాకు ఇన్ని సంవత్సరాలైంది పెళ్లి అయి, సంతానం కావట్లేదు, సంతానం ప్రసాదించండి అని సమా, మజార్ల వద్ద, దర్గాల వద్ద డైరెక్ట్ వారితో దుఆ చేస్తారు. వారితో కోరుతారు, వారితో మొరపెట్టుకుంటారు. ఏమైనా కష్టాలు, రోగాలు సంవత్సరాల తరబడి ఉన్నాయి, అక్కడికి వెళ్లి వారితో మొరపెట్టుకుంటారు ఆ కష్టాలు, రోగాలు దూరం కావాలని.
మరి ఈ మొరపెట్టుకోవడం, దుఆ చేయడం ఎవరితో ఉండాలి? కేవలం అల్లాహ్తో మాత్రమే. చదవండి సూరతున్ నమ్ల్, సూరహ్ నంబర్ 27, ఆయత్ నంబర్ 62:
أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ
కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? (నమ్ల్ 27:62)
కలత చెందిన వాడు, ఎన్నో బాధలతో, కష్టాలతో తపిస్తున్న వాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని ఆ బాధను, కష్టాన్ని, వ్యాకులతను తొలగించే వాడు, దూరం చేసే వాడు అల్లాహ్ తప్ప ఇంకెవడైనా ఉన్నాడా? మరియు మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడు?
أَإِلَٰهٌ مَّعَ اللَّهِ
(అ ఇలాహుమ్ మ అల్లాహ్)
ఏమిటి, అల్లాహ్తో పాటు మరో ఆరాధ్యుడు కూడా ఉన్నాడా?
ఈ ఆయత్ ద్వారా ఏం తెలుస్తుంది? గమనించండి. దుఆ, ఆరాధన ఇది కేవలం అల్లాహ్తో మాత్రమే చేయాలి. ఆ అల్లాహ్ కాకుండా ఇంకా వేరే ఆరాధ్యుడు మీకు ఉన్నాడా? మీరు అల్లాహ్ను కాకుండా వేరే వారితో దుఆ చేస్తున్నారా? వేరే వారితో మొరపెట్టుకుంటున్నారా? అలా చేస్తే చాలా భయంకరమైన ప్రమాదంలో మీరు ఉన్నారు అన్నటువంటి హెచ్చరిక ఉంది.
ఇంకా సోదర మహాశయులారా, ప్రజల్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైన విషయం చూడండి గమనించండి. కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా, తమ పీర్, ముర్షిదులు, వారి యొక్క నామమును స్మరిస్తూ ఉండే అలవాటు చేసుకుంటారు. మేము చూడడం జరిగింది కొందరిని. ఇంకా కొందరు తమ బండి స్టార్ట్ చేసేటప్పుడు, బిస్మిల్లాహ్ అంటారు కావచ్చు కానీ వారి మనసులో ఏదైనా స్టార్ట్ కాకుంటే, ఏదైనా కొంచెం ఇబ్బంది అయితే వెంటనే ఏ పీర్ ముర్షిదులను, ఏ బాబాలను వారు తపిస్తూ ఉంటారో, సంవత్సరానికి ఒకసారి వెళ్లి వస్తూ ఉంటారో, అలాంటి వారిని స్మరిస్తారు. ఎప్పుడైనా ఏదైనా క్లిష్ట స్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నా మనం వింటూ ఉంటాం. కొందరు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, ఇంకొకడు యా బదవి అని. ఈ యా ముహమ్మద్, యా అలీ, యా హుసైన్ మనం మన వైపున వింటూ ఉంటాం. కానీ కొన్ని పేర్లు వస్తున్నాయి. యా బదవీ, యా జీలాని, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యిదా జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్, ఇవి వేరే కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో ఈ పేర్లు వినబడవు కానీ, వేరే కొన్ని ప్రాంతాల్లో వీరి యొక్క సమాధులు, దర్గాలు ఉన్నాయి. వారిని ప్రజలు స్మరిస్తూ ఉంటారు.
ఇక మన ప్రాంతంలో ‘యా గౌస్ అల్ మదద్’ అన్నటువంటి నినాదం చాలా ప్రబలి ఉన్నది మరియు పోస్టర్ల మీద ఈ పేర్లు, ఇండ్లలో పెట్టుకునే అటువంటి కొన్ని బోర్డులు, కొన్ని రకాల పలకలు వాటిపై ‘యా గౌస్ అల్ మదద్’ అని కూడా రాసి ఉంటుంది. ఇంకా కొందరు యా మొయినుద్దీన్ చిష్తీ, యా గరీబున్ నవాజ్, అని నానా రకాలుగా నినాదాలు చేస్తూ ఉంటారు.
కానీ అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటి? శ్రద్ధ వహించండి. సూరతుల్ అఅ’రాఫ్ లో అల్లాహ్ యొక్క ఈ ఆదేశం, సూరహ్ నంబర్ 7, ఆయత్ నంబర్ 194.
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
మీరు అల్లాహ్ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.(7:194)
మీరు ఆ అల్లాహ్ను వదలి వేరే ఎవరెవరినైతే దుఆ చేస్తున్నారో, మొరపెట్టుకుంటున్నారో, మీరు అల్లాహ్ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో,
عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులే.
అల్లాహు త’ఆలా ఇక్కడ ఒక ఛాలెంజ్ గా చెప్తున్నాడు, గమనించండి.
فَادْعُوهُمْ
(ఫద్ ఊహుమ్)
మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి,
فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
(ఫల్ యస్తజీబూ లకుమ్ ఇన్ కున్ తుమ్ సాదిఖీన్)
ఈ బహుదైవోపాసనలో, మీరు గనుక, అంటే ఈ షిర్క్ ఏదైతే మీరు చేస్తున్నారో అల్లాహ్ ను వదిలి ఇతరులను దుఆ చేయడం, ఇతరులను మొరపెట్టుకోవడం, ఇందులో మీరు గనుక సత్యవంతులే అయితే ఆ సమాధిలో ఉన్న వారిని ఎవరినైతే మీరు మొరపెట్టుకుంటున్నారో, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.
ఇస్తారా? లేదు. అబద్ధం చెబుతూ ఉంటారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.
సమాధుల వద్ద ఘోరమైన షిర్క్ పనులు
ఇంకా మనం చూస్తాం, కొందరు సమాధుల ప్రదక్షిణం చేస్తారు, తవాఫ్. షా ఖలందర్ దర్గా కా హజ్ అని ఉంది కదా? అల్లాహు అక్బర్. కొందరు వారు ఏ మజార్లను, దర్గాలను, బాబాలనైతే మొక్కుకుంటారో, నమ్ముకుంటారో, వారు అక్కడికి వెళ్లి వాటి మూల మూలలను చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అక్కడ ఆ గోడలకు, ఆ సమాధికి తమ చేతులను తాకించి, తమ శరీరంపై పూసుకుంటారు, ఏదైనా బరకత్ వస్తుంది అని. ఇంకా వాటి గడపను చుంబిస్తారు, దాని మట్టిని తీసుకుని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు, సజ్దా చేస్తారు.
ఇంకా తమ అవసరాలను కోరుతూ, రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయ వినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్న వారిని ఉద్దేశించి ఇలా కూడా పిలుస్తారు, ఏమని? యా సయ్యిదీ, ఓ మేరే బాబా, నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక మీరు వెనక్కు త్రిప్పి పంపుతూ నన్ను అవమాన పరచకండి. నఊదుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలా అనేవారు ఉన్నారు మన సమాజంలో కొందరు.
కానీ ఇలాంటి వారు అల్లాహ్ ఆదేశం ఏముందో ఎప్పుడైనా గమనిస్తారా? అల్లాహు అక్బర్. శ్రద్ధగా చూడండి ఈ ఆయత్ ను. సూరత్ అల్-అహ్ ఖాఫ్, సూరహ్ నంబర్ 46, ఆయత్ నంబర్ 5.
وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వాని కన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (అహ్ ఖాఫ్ 46:5)
అల్లాహ్ను వదలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తమ మొరపెట్టుకుంటున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వాని కన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? అల్లాహు త’ఆలా ఒకరిని అడగడం లేదు ఇది. అల్లాహు త’ఆలా ప్రశ్న రూపంలో వారిని దండిస్తున్నాడు. ‘వమన్ అదల్లు మిమ్మై యద్ ఊ’ అంటే అంతకంటే ఎక్కువ దుర్మార్గుడు, మార్గభ్రష్టుడు, హిదాయత్, సన్మార్గం నుండి దూరమైనవాడు మరొకడు లేడు. ఎవరు ఇంత దుష్టుడు? ఎవరైతే అల్లాహ్ను వదిలి వేరే వారితో దుఆ చేస్తున్నాడో, వేరే వారితో మొరపెట్టుకుంటున్నాడో, ఎలాంటి వారు వారు? ప్రళయ దినం వరకు కూడా వీరి యొక్క మొరలను వినలేరు. వీరి యొక్క మొరల విషయంలో వారు మొత్తానికే అశ్రద్ధగా ఉన్నారు, ఏమీ తెలియదు. అందుకొరకే మీరు ఇంకా ఖురాన్ లోని వేరే కొన్ని సూరాలలో చదివితే చాలా స్పష్టంగా ఉంది, ప్రళయ దినాన ఎప్పుడైతే హాజరవుతారో, వారు ఖండిస్తారు, మీరు మమ్మల్ని మాతో దుఆ చేసేవారు కాదు అని.
ఇక అల్లాహ్ను కాకుండా వేరే వారితో దుఆ చేయడం ఎంత నష్టమో ఒక్కసారి ప్రవక్త వారి ఈ హదీసులో కూడా మీరు అర్థం చేసుకోండి. సహీ బుఖారీ లోని హదీస్, హదీస్ నంబర్ 4497.
مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ اللَّهِ نِدًّا دَخَلَ النَّارَ
(మన్ మాత వహువ యద్ ఊ మిన్ దూనిల్లాహి నిద్దన్ దఖలన్ నార్)
ఎవరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆరాధిస్తూ/ ఇతరులతో దుఆ చేస్తూ, ఇతరులతో మొరపెట్టుకుంటూ అదే స్థితిలో చనిపోతాడో, అతను నరకంలో ప్రవేశిస్తాడు. (బుఖారీ 4497)
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత నష్టమో గమనిస్తున్నారా? అలాగే సోదర మహాశయులారా, మనం కొందరిని చూస్తాం, కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. సమాధుల హజ్ చేసే విధానం అన్న పేరు గల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. నఊదుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. హజ్ కాబతుల్లాహ్, మక్కాలో జరుగుతుంది. కానీ కొన్ని దర్గాల, కొన్ని మజార్ల యొక్క హజ్ అన్న పేరుతో కొన్ని పుస్తకాలు ఈ రోజుల్లో కొందరు అమ్ముతున్నారు, కొంటున్నారు, అక్కడికి వెళ్లి. నఊదుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, సుమ్మ నఊదుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొందరు ఏమంటారో తెలుసా? ధనవంతుల, డబ్బు ఉన్న వారి హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి పేదవాళ్ల, బీదవాళ్ల హజ్ ఇక్కడ అవుతుంది అని కొన్ని రకాల మజార్ల గురించి చెప్పుకుంటారు. ఇంత ఘోరమైన షిర్క్ లో పడిపోతున్నామో ఆలోచించండి.
అల్లాహ్ శక్తిని ఇతరులకు ఆపాదించడం
విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. నఊదుబిల్లాహ్. ‘గరీబున్ నవాజ్’ అని, ‘బంద నవాజ్’ అని, ‘గంజ్ దాతా’ అని, ఇంకా వేరే ఇలాంటి పేర్లతో ఏవైతే మజార్లు చాలా ఫేమస్ అయి ఉన్నాయో, ఇవి కేవలం పేర్లు కావు, ప్రజలు అక్కడికి వెళ్లి అలాంటి నమ్మకాలు కలిగి ఉంటారు. గత కొన్ని నెలల క్రితం నా యొక్క దర్సులో ఒక వీడియో చూపించాను. మన ఇండియాలోని ఒక చాలా ఫేమస్ దర్గా వద్ద, అక్కడి ముజావర్ నిలబడి ఏమంటున్నాడు? మీకు ఏ ఏ మీ అవసరాలు అక్కడ (అల్లాహ్ వద్ద) దొరకవో, ఇక్కడ (సమాధుల వద్ద) దొరుకుతాయి అని ఇలా సైగ చేసుకుంటూ అని అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇంత ఘోరమైన షిర్క్ గమనించండి.
అయితే ఈ విధంగా కొందరు విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని నమ్ముతారు. కానీ అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో, ఒక్కసారి మీరు గమనించండి. అల్లాహు త’ఆలా సూరత్ యూనుస్, సూరహ్ నంబర్ 10, ఆయత్ నంబర్ 107లో ఇలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు:
وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చెయ్యగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. (యూనుస్ 10:107)
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే, స్వయంగా ఆ అల్లాహ్ తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనుక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని నీకు దొరకకుండా మళ్ళించేవాడు కూడా ఎవడూ లేడు. అల్లాహు అక్బర్. చూశారా? ఎంతటి గొప్ప శక్తి గలవాడు అల్లాహు త’ఆలా. అతనిపై ఎలాంటి ప్రగాఢ విశ్వాసం మనకు ఉండాలి! కానీ ఈ రోజుల్లో కొందరు వలీల గురించి, కొన్ని మజార్ల గురించి, కొన్ని దర్గాల వారి గురించి ప్రజల యొక్క నమ్మకం ఎలా ఉంది, ఏ విధంగా వారు ఘోరమైన షిర్క్ లో పడిపోతున్నారో అల్లాహు అక్బర్, అర్థం చేసుకోవడం లేదు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40790
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]