నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 2 – [మరణానంతర జీవితం – పార్ట్ 52] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 2
[మరణానంతర జీవితం – పార్ట్ 52] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=ADuGX4TjS2o
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
(అల్-హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్) [సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…]

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన.

మహాశయులారా, ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు. ముస్తదరక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీ అని అన్నారు. ఆ హదీథ్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ప్రళయ దినాన అల్లాహు తఆలా పూర్వీకులను, వెనుకటి వారిని, ప్రజలందరినీ సమీకరిస్తాడు. ఆ పొడవైన హదీథ్ లో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియపరుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది. నూర్ ఇవ్వడం జరుగుతుంది.

فَمِنْهُمْ مَنْ يُؤْتَى نُورُهُ مِثْلَ الْجَبَلِ
(ఫమిన్‌హుమ్ మన్ యూ’తా నూరుహు మిథ్లల్ జబల్)
[వారిలో కొందరికి పర్వతమంత కాంతి ఇవ్వబడుతుంది.]

కొందరికి కొండంత పరిమాణంలో, కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు. మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది. మరికొందరికి వారు ఒక ఖర్జూరపు కర్ర తమ కుడిచేతిలో తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది. మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో. చివరి వ్యక్తి లేక చివరి రకం వారు, చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని, వారి పాదములోని బొటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది.

ఈ విధంగా ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: ఎవరికి ఎంత ఎక్కువ పరిమాణంలో కాంతి లభిస్తుందో వారు అంతే ఎక్కువ వేగంతో ఆ వంతెనను దాటేస్తారు. కొందరు ఆకాశంలో నక్షత్రం ఎలా పడుతుందో క్షణం కన్నా తక్కువ సమయంలో ఆ విధంగా దాటేస్తారు. మరికొందరు కనురెప్ప కొట్టే అంత సమయంలో. మరికొందరు వేగంగా వీచే గాలి మాదిరిగా. మరికొందరు గుర్రపు రౌతు వేగంతో. మరికొందరు పరుగెత్తడంలో ఒక మనిషి ఎలా ఎంత వేగం తీసుకుంటాడో ఆ విధంగా. మరికొందరు ఒక వ్యక్తి పరుగెత్తకుండా వేగంగా ఏదైతే నడుస్తాడో ఆ విధంగా. అంటే మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

فَيَمُرُّونَ عَلَى قَدْرِ أَعْمَالِهِمْ
(ఫయముర్రూన అలా ఖద్రి అ’మాలీహిమ్)
[వారు తమ కర్మల (స్థాయి) ప్రకారంగా దాటుతారు.]

వారు తమ కర్మల ప్రకారంగా దాటుతారు. ఎవరు విశ్వసించి ఎవరి సత్కార్యాలు ఎక్కువగా ఉంటాయో వారు అంతే వేగంగా ఎక్కువగా పరిగెడతారు.

ఇక ఎవరి పాదము బొటనవేలి పరిమాణంలో కాంతి ఇవ్వడం జరిగిందో, ఆ వ్యక్తి ఒకసారి పడుకుంటూ, ఒకసారి లేస్తూ, ఒకసారి పడుకుంటూ, ఒకసారి నిలబడుతూ, ఒకసారి పడిపోతాడు మరొకసారి నిలబడతాడు. ఒకవైపున అతని చెయ్యి ఇరుక్కుంటుంది, మరో సందర్భంలో కాలు ఇరుక్కుపోతుంది. పక్కన ఉన్న ఆ కొండ్లు ఏవైతే ఉన్నాయో అవి పట్టి లాగుతూ ఉంటాయి. చివరికి ఆ వ్యక్తి రెండు పక్కల, రెండు కుడి వైపు పక్కల్లో నరక అగ్ని యొక్క జ్వాలలు కూడా అతనికి తాకుతాయి. చివరికి ఇలాంటి వారు ఈ కష్టాలు భరించి దాన్ని దాటేస్తారు. దాటిన వెంటనే

الْحَمْدُ لِلَّهِ الَّذِي نَجَّانَا مِنْكِ بَعْدَ أَنْ أَرَانَاكِ
(అల్-హమ్దు లిల్లాహిల్లజీ నజ్జానా మిన్‌కి బ’ద అన్ అరానాక్ )
[నిన్ను మాకు చూపించిన తర్వాత, నీ నుండి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు.]

అల్లాహ్ కి సర్వ స్తోత్రములు. అతడు మమ్మల్ని నీ నుండి రక్షణ కల్పించాడు. మమ్మల్ని నీ రుచి చూపించిన తర్వాత మాకు రక్షణ కల్పించాడు అని వారు అల్లాహ్ యొక్క స్తోత్రములు, పొగడ్తలు చెల్లిస్తూ ఉంటారు. అంతేకాదు,

لَقَدْ أَعْطَانَا مَا لَمْ يُعْطِ أَحَدًا
(లఖద్ అ’తానా మా లమ్ యూ’తి అహదన్)
[నిశ్చయంగా (అల్లాహ్) మరెవ్వరికీ ఇవ్వనటువంటిది మాకు ఇచ్చాడు.]

అని కూడా అంటారు. అంటే అల్లాహ్ మాకు ఈ రక్షణ కల్పించి ఇంత గొప్ప కరుణ మాపై చేశాడో అంతటిది ఇంకా ఎవరిపై చేయలేదు అన్నట్లుగా వారు భావిస్తారు.

అంటే గమనించండి, ఆ వంతెనపై దాటడం కూడా ఎన్ని కష్టాలతో కూడి ఉంది. కానీ ఈ హదీథ్ ద్వారా మనకు బోధపడే గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా సత్కార్యాల్లో వెనుక ఉండకూడదు. పాపానికి చేరువు కూడా కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఏ చిన్నపాటి సత్కార్యాన్ని కూడా ఇది సున్నతే కదా, ఇది చిన్నదే కదా, చేయకుంటే ఏమవుతుంది అన్నటువంటి సాకులు చెప్పి వాటికి దూరంగా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసం తర్వాత ఎవరి సత్కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో వారే నరకంపై ఉన్న వంతెనను వేగంగా దాటగలుగుతారు.

ఇంకా మహాశయులారా, ఆ వంతెనను వేగంగా దాటడానికి ఏ సత్కార్యాలు దోహదపడతాయి, వాటి గురించి ఇన్షాఅల్లాహ్ తర్వాత మనం తెలుసుకుందాము. కానీ రండి, ఆ వంతెన గురించి హదీథుల్లో ఏ వివరణలు తెలుపబడ్డాయో వాటిని కొంచెం మనం తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం, ఆ వంతెన కత్తి పదును కంటే చాలా కొచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే సన్నంగా ఉంటుంది. ఈ విషయం సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు దీనిని ఉల్లేఖించారు.

మరియు ముస్తదరక్ హాకింలో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీథ్ ను వినండి. మనలో ఎంత భయం పుట్టిస్తుందో ఈ హదీథ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎప్పుడైతే నరకంపై కత్తి కంటే పదునుగా ఉండే ఆ వంతెనను వేయడం జరుగుతుందో, దైవదూతలు ఓ అల్లాహ్! ఇంతటి సన్నటి దానిపై, పదునుగా ఉన్నదానిపై ఎవరు నడుస్తారు, దీనిని ఎవరు దాటుతారు? అప్పుడు అల్లాహ్ అంటాడు, مَنْ شِئْتُ مِنْ خَلْقِي “నా సృష్టిలో నేను కోరిన వారు దాని నుండి దాటుతారు.” అప్పుడు దైవదూతలు, ఎవరు దైవదూతలు? క్షణం పాటు కూడా ఎప్పుడూ అల్లాహ్ కు అవిధేయత అనేది చూపలేదు. అల్లాహ్ ఏ ఒక ఆజ్ఞను కూడా వారు ఎన్నటికీ కాదనలేదు. ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపేవారు ఏమంటారు?

سُبْحَانَكَ مَا عَبَدْنَاكَ حَقَّ عِبَادَتِكَ
(సుబ్ హానక మా అబద్నాక హక్క ఇబాదతిక్)
[(ఓ అల్లాహ్!) నీవు పవిత్రుడవు. నిన్ను ఆరాధించవలసిన విధంగా మేము ఆరాధించలేకపోయాము.]

ఓ ప్రభువా, ఓ అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతునివి. నువ్వు పవిత్రునివి. మేము నీ యొక్క ఆరాధన ఎలా చేయాలో మేము చేయలేకపోయాము. అల్లాహు అక్బర్. దైవదూతలు అలా అంటున్నప్పుడు మనలాంటి పాపాత్ములు ఏమనాలి? ఇకనైనా మనం అల్లాహ్ తో భయపడి ఆ నరకంపై వేయబడే వంతెనను దాటే విషయాన్ని ఆలోచించి, సలఫె సాలెహీన్, సహాబాలు, తాబయీన్లు ఎలా ఆలోచించి దాన్ని ఏడ్చేవారో, అలాంటి భయం మనం కూడా కొంతపాటైనా పాటిస్తే బహుశా ఇదే పరలోకంలో ఆ వంతెన దాటడానికి మనకు దోహదపడుతుంది. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఉన్నాయి.

మహాశయులారా, ఆ వంతెన యొక్క వివరాల్లో మరో విషయం ఏమిటంటే అది జారుడుగా ఉంటుంది. అంటే కాళ్ళు దానిపై స్థిరపడలేవు. إلا ما شاء الله (ఇల్లా మా షా అల్లాహ్) [అల్లాహ్ కోరితే తప్ప], ఎవరి గురించైతే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సహాయపడతాడో, అల్లాహు తఆలా ఎవరి గురించి అయితే కోరుతాడో అలాంటి వారు తప్ప ఎవరి పాదాలు దానిపై స్థిరపడవు, జారుతూ ఉంటాయి. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లోని హదీథ్,

ثُمَّ يُضْرَبُ الْجِسْرُ عَلَى جَهَنَّمَ
(థుమ్మ యుద్-రబుల్ జిస్రు అలా జహన్నమ్)
[ఆ తర్వాత నరకంపై వంతెన వేయబడుతుంది.]

నరకంపై వంతెన వేయబడుతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడ ఆ వంతెనను చూసి ప్రవక్తలు, అల్లాహు అక్బర్, ఎలాంటి పాపానికి ఒడిగట్టని వారు, ఏ పాపం చేయని వారు, ఆ ప్రవక్తలు సైతం, “అల్లాహుమ్మ సల్లిమ్ సల్లిమ్,” ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడు, ఓ అల్లాహ్ క్షేమంగా మమ్మల్ని దీనిపై నుండి దాటించు అని దుఆ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారు ప్రవక్తా, యా రసూలల్లాహ్ వమల్ జిస్ర్? ఆ వంతెన అంటే ఏమిటి, అది ఎలాంటిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, دَحْضٌ مَزِلَّةٌ (దహ్దున్ మజిల్లాతున్) [(అది) జారే మరియు అస్థిరమైన ప్రదేశం]. పాదాలు నిలవవు, స్థిరపడవు, జారుతూ ఉంటాయి, అలాంటిది ఆ వంతెన అని.

ఆ వంతెన యొక్క వివరాలలో మూడో విషయం, అల్లాహు అక్బర్, అది కూడా చాలా భయంకరమైన విషయం, అదేమిటంటే దాని రెండు పక్కల్లో ఎలాంటి విషయాలు ఉంటాయి అంటే, అవి దానిపై నడిచే వారిని లాగి కింద పడేస్తూ ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ముస్నద్ అహ్మద్ మరియు తబ్రానీలోని రివాయత్ ఉల్లేఖనం, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీ అని చెప్పారు, “ప్రళయ దినాన ప్రజల్ని తీసుకొచ్చి వంతెనపై వేయడం జరుగుతుంది, అంటే వారు అక్కడ నడుస్తూ ఉంటారు.” ఆ సందర్భంలో ఆ వంతెన యొక్క రెండు పక్కల నుండి ప్రజల్ని పట్టి ఒకరిపై ఒకరిని, ఒకరిపై ఒకరిని పడేస్తూ ఉంటాయి.

فَيُنَجِّي اللَّهُ تَبَارَكَ وَتَعَالَى بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ
(ఫయునజ్జి అల్లాహు తబారక వ త’ఆలా బిరహ్మతిహి మన్ యషా’)
[అప్పుడు శుభాలు కలవాడూ మరియు మహోన్నతుడూ అయిన అల్లాహ్ తాను కోరిన వారిని తన కరుణతో రక్షిస్తాడు.]

ఆ రోజు అల్లాహు తఆలా తాను కోరిన వారిని తన కరుణా కటాక్షాలతో మోక్షం కలుగజేస్తాడు, కింద పడకుండా వారు క్షేమంగా ఉంటారు. అల్లాహు తఆలా మిమ్మల్ని, మమ్మల్ని, అందరినీ అలాంటి కరుణా కటాక్షాలను పొంది, పడకుండా, సురక్షితంగా దాన్ని దాటివేసే పుణ్యాత్ములలో చేర్చుగాక. ఆమీన్.మహాశయులారా, ఆ వంతెనకు సంబంధించిన ఒక్కొక్క వివరం కూడా మనల్ని భయకంపితలను చేసి, ఇకనైనా సత్కార్యాల వైపునకు తీసుకెళ్లాలి.

ఆ వంతెనకు సంబంధించిన మరో వివరణ ఏమిటంటే, అల్లాహు అక్బర్, ఆ వంతెన రెండు వైపుల్లో ఇనుప కొండ్లు ఉంటాయి. అవి ఒకే రకమైనవి కావు, ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్నిటిని خَطَاطِيفُ (ఖతాతీఫ్) [(పట్టి లాగే) కొక్కేలు/గాలాలు] అని, మరికొన్నిటిని كَلَالِيبُ (కలాలీబ్) [(పట్టి లాగే) ఇనుప కొక్కేలు] అని, మరికొన్నిటిని حسك (హసిక్) [ముళ్ల మొక్క (ఒక రకమైనది)] అని హదీథ్ లో చెప్పడం జరిగింది. కొన్ని ఈ విధంగా వంగినట్లుగా ఉంటాయి. మరికొన్ని రేగు చెట్టు ముళ్ళు మనం చూసాము కదా, ఆ విధంగా, కానీ అంత చిన్నవి అని భావించకండి, అర్థం కావడానికి వంగి ఎలా ఉంటాయో, అందులో ఏదైనా బట్ట తగిలినా లేదా మన శరీర భాగం అంటినా ఏ విధంగా కష్టంతో మనం బయటికి వస్తామో, ఈ విధంగా ఇలాంటి కొండ్లు ఉంటాయి ఇనుపవి. అల్లాహ్ కోరిన వారిని అవి లాగి కింద పడేస్తూ ఉంటాయి. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లలో వీటి ప్రస్తావన వచ్చి ఉంది.

మహాశయులారా, ఆ వంతెనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం ఒకటి ఏమిటంటే, ఆ వంతెనకు దగ్గరగా రెండు విషయాలు కూడా వచ్చి నిలబడి ఉంటాయి. ఒకటి బంధుత్వం, రెండవది అమానత్, అప్పగింత, విశ్వసనీయత. అంటే ఏమిటి? ఇవి రెండూ వచ్చి అక్కడ నిలబడి ఉంటాయి అంటే భావం ఏమిటి? భావం ఏమిటంటే, ఎవరెవరు దానిని దాటుతూ ఉంటారో వారిలో ఎవరు బంధుత్వాలను తెంచుకొని ఉన్నారో వారి గురించి బంధుత్వం సాక్ష్యం పలికినప్పుడు వారిని కింద పడవేయడం జరుగుతుంది. లేదు ఇతను బంధుత్వాలను పెంచుకునేవాడు అని బంధుత్వం సాక్ష్యం పలుకుతే వారిని సులభంగా దాటించడం జరుగుతుంది. మరి ఎవరి గురించైతే అమానత్, విశ్వసనీయత, ఇతను నన్ను కాపాడలేదు, ఇతడు ఇహలోకంలో అమీన్, విశ్వసనీయునిగా జీవించలేదు అని అది చెప్తుందో, వారిని ఆ వంతెనపై దాటుతూ కింద పడవేయడం జరుగుతుంది. మరి ఎవరి గురించి అయితే అది సత్యంగా సాక్ష్యం పలుకుతుందో, వారిని దాటించడం జరుగుతుంది.

మహాశయులారా, ఈ విధంగా మనలోని ప్రతి ఒక్కడూ, గమనించండి, ఏ 70,000 మంది పుణ్యాత్ములు లెక్క లేకుండా, తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారో వారు కూడా ఈ వంతెనను దాటుతారు. అల్లాహ్ యొక్క దయ ఏమిటంటే, వారు ఈ వంతెనను అతి వేగంలో దాటేసిపోతారు. వారు అంత పుణ్యాత్ములు గనుక. వారి యొక్క గుణాలు ఏమిటి? అవి తెలుసుకొని మనం అవలంబించాలి. ఇన్షాఅల్లాహ్ తరువాయి భాగంలో తెలిపే ప్రయత్నం చేస్తాను. మరియు అలాంటి వారు కూడా దాటుతున్నారు అంటే మనలో ఎవరైనా దానిని తప్పించుకోగలుగుతారా?

మహాశయులారా, ఈ రోజుల్లో టోల్ ఫ్రీ గేట్ల నుండి దాటుతూ ఉంటాము హైవే రోడ్ల మీద. కొన్ని వంతెనల మీద దాటుతూ ఉంటాము. ఆ వంతెనలు వాటి కింద ఒకవేళ వర్షాకాలంలోని వర్షపు నీరు సైలాబ్ మాదిరిగా ప్రవహిస్తూ ఉంటే కళ్ళతో చూస్తేనే ఎంత భయం కలుగుతూ ఉంటుంది, అవునా లేదా? వాస్తవానికి ఆ నరకంపై వేయబడిన వంతెనకు, ఈ మనం ప్రపంచంలో దాటుతున్న వంతెనలకు ఎలాంటి పోలిక లేదు. కానీ ఈ రోజుల్లో ప్రపంచ వ్యామోహంలో పడి, అవిశ్వాస మార్గంలో పడి, పాపాల్లో కూరుకుపోయి, ఆ వంతెనను ఏదైతే మనం మరిచిపోయామో, అది గుర్తుకు రావడానికి, అది ఎంత భయంకరమైన విషయమో దాన్ని తలచుకొని ఏడుస్తూ, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ, పాపాల నుండి దూరమవుతూ, దానిని క్షేమంగా దాటడానికి అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ మనం జీవితం గడపాలని ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది.

మహాశయులారా, వాస్తవానికి ఆ వంతెన యొక్క వివరాలు మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్న సందర్భంలో ఎన్నో సందర్భాల్లో إلا من شاء الله برحمته (ఇల్లా మన్ షా అల్లాహు బిరహ్మతిహి) [అల్లాహ్ తన కరుణతో కోరినవాడు తప్ప], إلا من ثبته الله (ఇల్లా మన్ సబ్బతహుల్లాహ్) [అల్లాహ్ ఎవరినైతే స్థిరపరుస్తాడో వాడు తప్ప] ఇలాంటి విషయాలు ప్రస్తావించారు. అంటే ఆ వంతెన జారుడు, స్థిరంగా దాని మీద కాలు నిలవవు, వాటికి కొండ్లు ఉంటాయి, ఇంకా ఎన్నో రకాల వాటి యొక్క విషయాలు తెలుపుతూ, కానీ ఎవరిపై అల్లాహ్ యొక్క కరుణ కురుస్తుందో మరియు ఎవరి పాదాలలో అల్లాహు తఆలా స్థిరత్వం ప్రసాదిస్తాడో అలాంటి వారు దానిని వేగంగా దాటి వెళ్తారు అని తెలపడం జరిగింది. అలాంటి అల్లాహ్ ను మనం మరిచిపోయి, అతని యొక్క ఆరాధనను మనం వదులుకొని ఇహలోకంలో ఏమి మనం సంపాదించేది? ఆలోచించండి. ఎన్ని రోజులు మనం బ్రతికేది? ఏమి సంపాదించుకునేది? చనిపోయేది ఉంది. చావు కంటే మరీ సత్యమైన విషయం ఇంకేమైనా మనం కళ్ళ ముందు ఉందా? దాన్ని ఎవరైనా ఈ రోజుల్లో తిరస్కరించగలుగుతాడా? కానీ చనిపోయిన తర్వాత అతని వద్దకే వెళ్ళేది ఉంది. ఆ ప్రళయ దినాన ఈ వంతెనను తప్పకుండా దాటవలసి ఉన్నది. అందుగురించి అల్లాహ్ కొరకు, ఇకనైనా మనం అల్లాహ్ మార్గాన్ని అవలంబిద్దాం. ఆయన చూపిన ఈ సత్యమైన బాట, ఇస్లాం బాటలో నడిచే ప్రయత్నం చేద్దాము. తొలిసారిగా ఏ వర్గం దానిని దాటుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో చేరుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహు తఆలా సద్భాగ్యం నాకు, మీకు, మనందరికీ ప్రసాదించుగాక. మరియు ప్రత్యేకంగా ఆ వంతెనను కనురెప్ప కంటే మరీ వేగంగా దాటడానికి ఎలాంటి విశ్వాసం, సత్కార్యాలు అవసరమో అలాంటి విశ్వాసం మరియు సత్కార్యాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించే, అవలంబించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అయితే ఆ విశ్వాసాలు, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తర్వాత కార్యక్రమాల్లో మీరు తెలుసుకుంటారు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]