త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.

మనం చేసే కర్మలకు సత్ఫలితం కూడా ఎక్కువగా లభించి, త్రాసులో దాని బరువు పెరగాలంటే మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రుజువైన కొన్ని హదీథులను వింటే మరింత మనకు ప్రతి కార్యం చేయడంలో సంకల్ప శుద్ధి ఎంత అవసరమో దాని యొక్క విలువ, ప్రాముఖ్యత తెలిసి వస్తుంది.

అబూ ఉమామా బాహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ఉంది, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు, “ప్రవక్తా! ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ అతని ఉద్దేశం ఏమిటి? అతను పేరు ప్రఖ్యాతులను పొందాలి మరియు అల్లాహ్ వద్ద సత్ఫలితం కూడా పొందాలి.” ఈ రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఇహలోకపు పేరు ప్రఖ్యాతులు, ఇక్కడ ప్రజల నుండి మెచ్చుకోబడటం మరియు పరలోకంలో అల్లాహ్ నుండి పుణ్యాన్ని పొందడం. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ ఇలా చెప్పారు: అతనికి ఎలాంటి పుణ్యం లేదు. ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు అదే ప్రశ్న. ప్రవక్త మళ్ళీ అలాగే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు మూడోసారి. అప్పుడు కూడా ప్రవక్త, ‘మా లహూ షై’ (అతనికి ఎలాంటి పుణ్యం లేదు) అని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత తెలిపారు:

إن الله لا يقبل من العمل إلا ما كان له خالصا وابتغي به وجهه
సంకల్ప శుద్ధితో మరియు కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందే ఉద్దేశంతో చేయబడిన సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు.

గమనించారా? ఏ సత్కార్యంలోనైతే మనిషి అల్లాహ్ ను కాకుండా ప్రపంచ పేరు ప్రఖ్యాతులు ఇంకా వేరే ఉద్దేశాలతో ఏదైనా కార్యం చేస్తాడో దానిని అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. అల్లాహ్ దానిని స్వీకరించడు. ఈ హదీథ్ నిసాయి మరియు తబరానీ కబీర్ లో ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుల్ జామిలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 1856. ఈ విధంగా మహాశయులారా, సంకల్ప శుద్ధి యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసి వస్తుంది.

అందుకొరకే అబ్దుల్లా బిన్ ముబారక్ రహమహుల్లాహ్ చెప్పేవారు, “ఒక చిన్న కార్యాన్ని సంకల్ప శుద్ధి ఎంతో గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు. అదే ఎంతో పెద్ద కార్యాన్ని సంకల్పం మరీ చిన్నదిగా చేయవచ్చు”. అలాగే మైమూన్ బిన్ మెహరాన్ అనేవారు, “మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువ వాటిని మీరు సంకల్ప శుద్ధితో చేయండి, ఇలా గొప్ప సత్కార్యాలు పొందవచ్చు.”

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన మరొక హదీథ్, మీరు శ్రద్ధగా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: الصلاة في جماعة تعدل خمسا وعشرين صلاة فإن صلاها في فلاة فأتم ركوعها وسجودها بلغت خمسين صلاة
అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి తాను ఇంట్లో చేసుకునే దానికి బదులుగా జమాఅత్ తోని చేసుకున్న నమాజుకు 25 రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. కానీ, ఎవరైనా ఎడారిలో ఉన్నాడు, అక్కడ తాను ఒంటరిగానే ఉన్నాడు, అయినా అతను నమాజ్ సమయం అయిన వెంటనే ఉత్తమ రీతిలో రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ నమాజ్ పూర్తి చేశాడంటే అతనికి 50 రేట్లు ఎక్కువగా నమాజ్ పుణ్యం లభిస్తుంది. సుబ్ హానల్లాహ్. అల్లాహ్ ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప పుణ్యం ప్రసాదించేవాడు! జమాఅత్ తో చేసే నమాజు కన్నా ఎవరైనా ఎడారిలో ఉండి, ఒంటరిగా చేశాడంటే అతనికి 50 రేట్ల నమాజ్ పుణ్యం ఎందుకు ఎక్కువ లభించింది? ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నప్పటికీ, ఎడారిలో ఉన్నప్పటికీ, ఎవరూ అతనికి గుర్తు చేసే వారు లేనప్పటికీ, నమాజ్ చేస్తున్న విషయం, అతని యొక్క నమాజును చూసేవారు అక్కడ ఎవరూ లేరు. కానీ అయినా అతను ఎందుకు నమాజ్ చేశాడు? అక్కడ కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు చేశాడు. అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే చేశాడు. అందుకని అల్లాహు తఆలా అతని యొక్క ఈ సత్కార్యానికి అంటే నమాజ్ యొక్క పుణ్యం 50 రేట్లు ఎక్కువగా ప్రసాదిస్తాడు. ఈ విధంగా మహాశయులారా, సంకల్ప శుద్ధి ఎంత గొప్పగా ఉంటుందో, అంతే ఎక్కువగా మనకు లాభం కలుగుతుంది.

సంకల్ప శుద్ధి మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో అతి ముఖ్యమైనదన్న విషయం మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన రెండు హదీథులు విన్నాము. మూడో హదీథ్ ఇలా ఉంది. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

بينما كلب يطيف بركية، كاد العطش أن يقتله، إذ رأته بغي من بغايا بني إسرائيل، فنزعت موقها فسقته، فغفر لها به

ఈ హదీథ్ సహీహ్ బుఖారీ లోనిది. హదీథ్ నంబర్ 3467. మరియు సహీహ్ ముస్లింలో కూడా ఉంది, హదీథ్ నంబర్ 2245. ఒక సందర్భంలో ఒక కుక్క బావి చుట్టూనా తిరుగుతూ ఉంది. దాహంతో చనిపోతుందా అన్నటువంటి పరిస్థితి దానిది, కానీ నీళ్ళు త్రాగడానికి దానికి ఏ అవకాశం కలగటం లేదు. అప్పుడు బనీ ఇస్రాయీల్ లోని ఒక వ్యభిచారిణి ఆ కుక్క యొక్క పరిస్థితి చూసి, తన యొక్క తోలు సాక్స్ లో నీళ్ళు నింపి వచ్చి ఆ కుక్కకు త్రాపించింది. ఈ పుణ్యం కారణంగా ఆమెను క్షమించడం, ఆమె చేసిన తప్పును క్షమించడం జరిగింది.

అయితే మహాశయులారా, ఈ హదీథ్ వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్ను తైమియా రహమతుల్లాహి అలైహి వ్యాఖ్యానించిన మాట ఎంతో గొప్పగా ఉంది. అదేమిటంటే, ఎవరైనా వ్యభిచారం చేసి ఏదైనా జంతువుకు నీళ్ళు త్రాపిస్తే ఆ పాపం క్షమించబడుతుంది అన్న భావం ఇందులో లేదు. భావం ఏంటంటే, ఆ సందర్భంలో ఆ స్త్రీ ఎంత సంకల్ప శుద్ధితో ఈ కార్యం చేసిందో అది అల్లాహ్ కు చాలా నచ్చినది, అందువల్ల అల్లాహు తఆలా ఆమె యొక్క ఆ వ్యభిచార పాపాన్ని కూడా మన్నించేశాడు. సంకల్ప శుద్ధి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలపడం జరుగుతుంది.

ఈ విధంగా మహాశయులారా, ఎంత సంకల్ప శుద్ధి ఎక్కువగా ఉంటుందో, ఎంత అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మనం సత్కార్యాలు చేస్తామో, నమాజు కానీ, దానధర్మాలు కానీ, ఉపవాసాలు కానీ, తల్లిదండ్రుల పట్ల సద్వర్తన కానీ, ఎవరికైనా ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, మార్కెట్ లోకి వెళ్లి ఏదైనా సామాను కొనడం కానీ, ఏ కార్యం మనం చేసినా ఎవరైనా చూసేవారు మెచ్చుకోవాలని, మనల్ని ప్రశంసించాలని, మన యొక్క పొగడ్తలు చెప్పుకోవాలని కాదు, కేవలం అల్లాహ్ మన ద్వారా ఇష్టపడాలి. ఆయన సంతృష్టి పడి మనకు ఆయన తన స్వర్గాలలో ప్రవేశించాలి అన్నటువంటి సదుద్దేశంతో ఏ కార్యం చేస్తామో ఆ కార్యం యొక్క సత్ఫలితం, దాని యొక్క రేటు ఎంతో గొప్పగా పెరుగుతుంది. ఈ విధంగా అది ప్రళయ దినాన మన త్రాసులో ఎంతో బరువుగా ఉంటుంది.

ఇక మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో రెండవది సత్ప్రవర్తన. Good character. ఈ సత్ప్రవర్తన ఏదైతే ఉందో, దాని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అది త్రాసులో ఎంతో బరువుగా ఉంటుంది అని మరియు సత్ప్రవర్తన యొక్క సత్ఫలితం మనిషికి ఎంతో గొప్పగా లభిస్తుంది అని ఎన్నో హదీథుల్లో స్పష్టపరిచారు. తిర్మిది, సునన్ అబి దావూద్, సునన్ బైహకీ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలలో ఉంది ఈ హదీథ్ మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుల్ జామిలో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నంబర్ 5632. హదీథ్ ఏమిటంటే:

ما شيء أثقل في ميزان العبد يوم القيامة من خلق حسن
ప్రళయ దినాన దాసుని త్రాసులో, విశ్వాసుని త్రాసులో ఉత్తమ నడవడిక కంటే మరేదీ కూడా ఎక్కువగా బరువుగా ఉండదు.

అల్లాహు అక్బర్, గమనించారా? సత్ప్రవర్తన కంటే ఎక్కువ బరువుగా విశ్వాసి త్రాసులో ప్రళయ దినాన మరే వస్తువు కూడా ఉండదు.ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وإن الله ليبغض الفاحش البذيء
మరియు నిశ్చయంగా, ఎవరైతే అశ్లీలం పలుకుతారో, ఎవరైతే దుర్భాషలాడుతారో, ఎవరితోనైనా మాట్లాడుతూ తన నాలుకతో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, అసహ్యించుకునే విధంగా మాట్లాడుతారో, అలాంటి వారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు. అలాంటి వారిని అల్లాహ్ ప్రేమించడు. అల్లాహు అక్బర్. ఈ విషయాన్ని గమనించండి. ఒక వైపున సద్వర్తన త్రాసులో ఎంత బరువుగా ఉంటుందని చెబుతున్నారో, మరో వైపున మనిషి సద్వర్తనకు వ్యతిరేకంగా ఒకరితో మాట్లాడే సందర్భంలో దుర్భాషలాడడం గానీ, ప్రజలతో మాట్లాడే సందర్భంలో వారు అసహ్యించుకునే విధంగా వారితో ప్రవర్తించడం గానీ ఇది అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అలాంటి వారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు.

మరొక హదీథ్, ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అదబుల్ ముఫ్రద్ లో, ఇమామ్ బైహకీ తన సునన్ లో మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహ్ ఇబ్ను హిబ్బాన్ లో కూడా పేర్కొన్నారు. సహీహ్ ఇబ్బాన్ యొక్క హదీథ్ నంబర్ 5695.

من أعطي حظه من الرفق فقد أعطي الخير كله، ومن حرم حظه من الرفق حرم الخير كله
ఎవరికైతే మెతక వైఖరి, మృదుత్వం ప్రసాదించబడినదో, అతనికి అన్ని రకాల మేళ్లు ప్రసాదించబడినట్లే. మరియు మృదుత్వం సద్వర్తనలో లెక్కించబడుతుందన్న విషయం మీకు తెలుసు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు: మరి ఎవరైతే మెతక వైఖరి యొక్క కొంత భాగాన్ని పొందలేదో, ఎవరైతే మాట్లాడే సందర్భంలో, ఒకరితో ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అతను మెతక వైఖరి అవలంబించడో, అతడు అన్ని రకాల మేళ్ళను కోల్పోయాడు.

ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

أثقل شيء في ميزان المؤمن يوم القيامة حسن الخلق
ప్రళయ దినాన విశ్వాసుని త్రాసులో అత్యంత బరువైన వస్తువు సద్వర్తన.

وإن الله ليبغض الفاحش البذيء
మరియు అల్లాహు తఆలా దుర్భాషలాడే వారిని, ఇతరులకు ఇబ్బందికరంగా మెదిలే వారిని అసహ్యించుకుంటాడు.

అయితే మహాశయులారా, ఈ హదీథ్ ద్వారా కూడా మనకు సద్వర్తన యొక్క ఘనత, సద్వర్తన త్రాసులో ఎలా బరువుగా ఉంటుందో తెలియడంతో పాటు, సద్వర్తనలోని ఒక అతి ముఖ్యమైన భాగం ప్రజలతో మనం మాట్లాడే సందర్భంలో గానీ, వారితో ఏదైనా మన వ్యవహారం ఉన్నప్పుడు మెతక వైఖరి అవలంబించడం. మృదుత్వంతో మాట్లాడడం. వారితో మెతక వైఖరి అవలంబించి, వారిపై ఎలాంటి కఠినత్వం అనేది పాటించకపోవడం. ఇది మన కొరకు ఎంతో మేలు.

అయితే మహాశయులారా, ఉత్తమ నడవడిక కొందరికి అలాగే స్వాభావికంగా, ప్రకృతి పరంగా అల్లాహ్ వైపు నుండి ఇవ్వబడుతుంది. కానీ మరికొందరు దానిని అవలంబించుకోవలసి వస్తుంది. దానిని అవలంబించుకోవడానికి కొన్ని విషయాలు నేర్చుకోవలసి వస్తుంది. అయితే మనం కూడా సద్వర్తన అవలంబించాలంటే అధికంగా ఖురాన్ పారాయణం చేయాలి. సద్వర్తన యొక్క ఘనతకు సంబంధించిన ఆయతులు, హదీథులు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. సద్వర్తనకు వ్యతిరేకంగా మెదిలితే అల్లాహ్ ఎలా మనల్ని కోపగించుకుంటాడో, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఇంకా సద్వర్తన మనలోకి రావాలి అంటే అడపాదడపా బీద వాళ్లతో కూడా మనం కూర్చోవాలి. పేదవాళ్లకు తోడుగా ఉండాలి. మరియు అల్లాహ్ తో అధికంగా దుఆ చేస్తూ ఉండాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేస్తూ ఉండాలి. “ఓ అల్లాహ్! నా యొక్క ఈ సృష్టి ఎంత అందంగా నీవు సృష్టించావో, నా యొక్క సద్వర్తనను కూడా నీకు ఇష్టమైన విధంగా అంతే మంచి విధంగా సరిదిద్దు.”

అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం:

اللهم اهدني لأحسن الأخلاق والأعمال والأهواء، لا يهدي لأحسنها إلا أنت، واصرف عني سيئها، لا يصرف عني سيئها إلا أنت
అల్లాహుమ్మ ఇహ్‌దినీ లి అహ్‌సనిల్ అఖ్లాఖి వల్-అ’మాలి వల్-అహ్వా, లా యహ్‌దీ లి అహ్‌సనిహా ఇల్లా అన్త, వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా, లా యస్రిఫు అన్నీ సయ్యిఅహా ఇల్లా అన్త.

అని దుఆ చేసేవారు. అలాగే:

اللهم إني أعوذ بك من منكرات الأخلاق والأعمال والأهواء
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ మున్కరాతిల్ అఖ్లాఖి వల్-అమాలి వల్-అహ్వా

అని కూడా దుఆ చేస్తూ ఉండేవారు. అంతే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

أكمل المؤمنين إيمانا أحسنهم خلقا
విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం కలవారు ఎవరంటే ఎవరైతే అతి ఉత్తమమైన సద్వర్తన అవలంబిస్తారో వారే ఉత్తమమైన విశ్వాసులు.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే హదీథ్ లో తెలిపారు:

وإن حسن الخلق ليبلغ درجة الصوم والصلاة
సద్వర్తన అనేది ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉంటూ, ఎల్లప్పుడూ నఫిల్ నమాజులు చేసుకుంటూ ఉండే వారి స్థానానికి కూడా చేర్పిస్తుంది.

అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయమో గమనించండి. నమాజు చేసే వ్యక్తి తన మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడి అల్లాహ్ సన్నిధానంలో నిలబడతాడు. ఉపవాసం ఉండే వ్యక్తి తినాలి, త్రాగాలి అనే తన మనోవాంఛలకు, కోరికలకు వ్యతిరేకంగా పోరాడుతూ అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి ఉపవాసం ఉంటాడు. కానీ ఎవరైతే సద్వర్తన అవలంబిస్తారో, అతను ఒకే ఒక మనస్సుతో కాదు, ఎన్నో రకాల మనస్సులతో, మనుషులతో, వేరు వేరు స్వభావాలు గల వారితో మాట్లాడుతూ కూడా, వారితో తన వ్యవహారాలు ఎన్ని ఉన్నా గానీ, అతను ప్రతి ఒక్కరితో ఉత్తమ నడవడిక, మెతక వైఖరి, మృదువైన మాట, ఈ విధంగా అతను అందరితో కూడా మంచి విధంగా మెలుగుతాడు. అందు గురించి వ్యక్తిగతంగా నఫిల్ నమాజులు, నఫిల్ ఉపవాసాలు ఉండే వ్యక్తి కంటే ఎక్కువ గొప్ప స్థానం ఈ సద్వర్తన అవలంబించే వ్యక్తిది ఉంటుంది. అల్లాహ్ మా అందరికీ కూడా నీవు సద్వర్తన అవలంబించుకునే సద్భాగ్యం ప్రసాదించు.



اللهم اهدنا لأحسن الأخلاق والأعمال والأهواء، لا يهدي لأحسنها إلا أنت، واصرف عنا سيئها، لا يصرف عنا سيئها إلا أنت. اللهم إنا نعوذ بك من منكرات الأخلاق والأعمال والأهواء
وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]