ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ఇస్లామీయ షరీఅత్ యొక్క ప్రత్యేకతలు- మొదటి భాగం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ దైవభీతిని కలిగి ఉండండి. ఆయన పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మంచి పనులు చేయడంలో ఓపికగా ఉండండి, మరియు చెడు పనుల నుండి దూరంగా ఉండండి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఒక గొప్ప లక్ష్యం (ఇహపరాల సాఫల్యం) కొరకు (షరీఅత్) ధర్మ చట్టాలను నియమించాడు. ఎందుకంటే మానవ మేధస్సు ప్రజలను సరళమైన మార్గంలో నడిపించగల చట్టాలు మరియు శాసనాలను రూపొందించ లేదు, కానీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన లక్షణాలలో పరిపూర్ణుడు, కార్యసాధనలో మహా జ్ఞాని, కానీ మనిషి జ్ఞానం బహు తక్కువ.
ధర్మపరంగా చూసినట్లయితే ఆకాశం నుండి వచ్చినటువంటి షరీఅత్ చట్టాలన్నీ అల్లాహ్ తరపున అవతరింప చేయబడినవే. ధర్మాన్ని ప్రజలందరికి చేరవేయడం కోసం అల్లాహ్ తఆలా ప్రతిజాతి వారి వద్దకు వారి భాషలో మాట్లాడేటువంటి ప్రవక్తను ఆవిర్భవింపజేశాడు. అల్లాహ్ వారిని ఏ షరీఅత్ లేకుండా ఖాళీగా ఉంచలేదు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు:
وَلِكُلِّ قَوْمٍ هَادٍ
(ప్రతి జాతికీ మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు.) (13:7)
మరో చోట ఇలా సెలవిచ్చాడు:
لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا
(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.) (5:48)
మానవాళికి తెలియపరిచిన విషయం ఏమిటంటే అల్లాహ్ తరపున వారి వద్దకు వచ్చినటువంటి ప్రవక్తలకు వారు విధేయత కనబరచాలి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّ
(మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.) (4:64)
అల్లాహ్ అవతరింప చేయబడిన చట్టాలు మరియు ఆజ్ఞలలో గొప్పవి తౌరాత్, ఇంజీల్, ఖుర్ఆన్. అల్లాహ్ బనీ ఇస్రాయీల్ నుండి వారి చట్టాలను కాపాడటానికి ప్రతిజ్ఞ తీసుకున్నాడు. కానీ వారు అలా చేయలేకపోయారు, బదులుగా వారు వాటిని వక్రీకరించారు, అందులో మార్పు చేర్పులు చేశారు. కానీ ఖురాన్ యొక్క రక్షణ బాధ్యత అల్లాహ్ తఆలానే స్వయంగా తీసుకున్నాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.) (15:9)
అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతటి దయామయుడు అంటే ఆయన వారి కొరకు చట్టాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నాడు, ప్రజలు దానిని అనుసరించి ప్రళయం వరకు కూడా ఆయన్ను మాత్రమే ఆరాధించాలని.
షరీయతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలని, షిర్క్ నుంచి దూరంగా ఉండాలని బోధిస్తున్నాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.) (21:25)
మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు:
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”అని బోధపరచాము.) (16:36)
షరీయతులు సమస్యల విషయంలో భిన్నంగా ఉన్నప్పటికీ మూల సూత్రాల విషయాలలో ఏకీభావం కలిగి ఉన్నాయి. ఆ మూల సూత్రాలు అల్లాహ్ ను, దైవ దూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను, అంతిమ దినమును, విధి వ్రాత యొక్క మంచి చెడుపై విశ్వాసం తీసుకురావాలి. అల్లాహ్ యొక్క చట్టాలు పరస్పరం ఏకీభవించిన విషయాలలో: మతం, గౌరవం, జీవితం మరియు సంపద మరియు తెలివి, భద్రతలు ఉన్నాయి.
పైన పేర్కొన్న విషయాలు అన్నీ షరియత్ లక్ష్యాలు అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ఉపయోగపడతాయి, మరియు దీని ద్వారా అల్లాహ్ తఆలా ఈ షరీఅత్ అవతరింప చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయం కూడా మనకు బోధపడుతుంది.
ఇస్లామీయ షరీఅత్ యొక్క ప్రత్యేకతలు
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ప్రవక్తల పరంపరను, పవిత్ర ఖురాన్ ద్వారా గ్రంథాల పరంపరను, మరియు ఇస్లాం చట్టం ద్వారా ఇతర చట్టాలను ముగించాడు. అల్లాహ్ తఆలా ఇస్లాం ధర్మ చట్టానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలను ప్రసాదించాడు. అల్లాహ్ సౌభాగ్యంతో ఈ క్రింద వాటిని పేర్కొనడం జరుగుతుంది.
1. మొదటి ప్రత్యేకత: ఇస్లాం సర్వలోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరుపున అవతరించిన షరీఅత్. ఇది కాకుండా ఈనాడు సమాజంలో ఆచరించబడుతున్న వేరే ఇతర షరీయతులు అన్నీ ఏకేశ్వరోపాసన కోసం పిలుపునిచ్చే వక్రీకరించబడిన చట్టాలు.
క్రైస్తవులు వారి ధర్మంలో మార్పు చేర్పులు చేశారు, దాని కారణంగా క్రీస్తుని తమ దేవుడిగా భావించి, సిలువను ఆరాధించడం ప్రారంభించారు. యూదులు ప్రవక్తలను తిరస్కరించారు, మరియు ఉజైర్ ను ఆరాధించడం ప్రారంభించారు, ఈ చట్టాలన్నీ మానవులచే విగ్రహారాధన కనుగొనబడే వాటి ద్వారా రూపొందించబడ్డాయి.
ఇక హైందవ మతం మరియు బౌద్ధ మతం విషయానికి వస్తే వారు రాళ్లను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. రాఫిజీలు సమాధి పూజ ప్రారంభించారు, వారు ముస్లిం అని ప్రకటించుకున్నప్పటికీ వారికి ఎటువంటి సంబంధం లేదు.
2. రెండవ ప్రత్యేకత: అన్ని రకాల చెడు (అసత్యం) నుండి స్వచ్ఛంగా ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
لَّا يَأْتِيهِ الْبَاطِلُ مِن بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنزِيلٌ مِّنْ حَكِيمٍ حَمِيدٍ
(అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా – దాని ముందునుండిగానీ, దాని వెనుక నుండిగానీ రాజాలదు. (ఎందుకంటే) అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్ తరఫున అవతరింపజేయబడినది.) (సూరా హామీమ్ అస్ సజ్ ద హ్ 41:42)
మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు:
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا
(సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది.)
అందువల్ల, ఖురాన్ అందులో ఉన్న విషయాలు సత్యమైనవి మరియు అందులోని ఆదేశాలు న్యాయమైనదవి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హదీసు:
… అత్యుత్తమమైనది అల్లాహ్ యొక్క గ్రంథం మరియు ఉత్తమ మార్గం ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గం. (ముస్లిం)
3. మూడవ ప్రత్యేకత: ఇస్లాం షరీఅత్ అన్ని రకాల వక్రీకరణల నుండి, ప్రక్షిప్తాల బారినుండి, సురక్షితంగా ఉంది. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కొత్త పోకడలను సృష్టించడం నుండి వారించారు మరియు ఇలా అన్నారు:
(ధర్మములో ప్రతి కొత్త విషయం బిద్అత్ అవుతుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వానికి లోను చేస్తుంది) (ముస్లిం)
అయితే ఇస్లాం పండితులు అన్ని కాలాల్లోనూ ఖురాన్ మరియు హదీస్ వక్రీకరించే స్వార్థపరుల ఆటలు కట్టించేందుకు ఎంతో కృషి చేశారు.
4. నాల్గొవ ప్రత్యేకత: ఇస్లాం ధర్మం వ్యర్థం కాలేదు ఇది సురక్షితంగా ఉంది. అల్లాహ్ తఆలా ఖురాన్ యొక్క రక్షణ గురించి తెలియజేస్తూ ఇలా అంటున్నాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.) (15:9)
అదే విధంగా అవిశ్వాసుల కుట్రలు, లెక్కలేనన్ని యుద్ధాలు జరిగినప్పటికీ, ప్రవక్త యొక్క హదీసుల సేకరణలు తరాలు మారినా, శతాబ్దాలు మారినా ఇప్పటి వరకు భద్రంగానే ఉన్నాయి.
షరీఅత్ వ్యర్థం కాకుండా సురక్షితంగా ఉంది అనే విషయానికి భావం ఏమిటంటే; అల్లహ్ ఈ మిషన్ ని చేరవెయ్యడానికి తన దాసులలో నుండి కొందరినీ ఎన్నుకున్నాడు, వారే ధర్మ పండితులు – ప్రవక్తల యొక్క వారసులు. అదే విధంగా మంచి నీతిమంతులైన పాలకులు, రాజులు మరియు అధికారం మరియు సంపద ఉన్నవారు, ఇస్లాం ధర్మస్థాపన తోడ్పాటుకు నిలబడ్డారు, మరియు ధర్మాన్ని వ్యాపింప చేయడానికి ధర్మం మార్గంలో ఎంతో ఖర్చు పెట్టారు.
ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “నా ఉమ్మత్ లో ఒక వర్గం ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటుంది, ఎవరు వారి మద్దతు నుండి ఉపసంహరించుకున్నా లేదా వారిని వ్యతిరేకించినా అల్లాహ్ యొక్క ఆదేశం వచ్చే వరకు వారికి హాని చేయలేరు. మరియు వారు ఎల్లప్పుడూ ప్రజలపై విజయం సాధిస్తాడు”. (బుఖారీ,ముస్లిం)
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత;
5. ఐదవ ప్రత్యేకత: అల్లాహ్ దాసులారా అల్లాహ్ దైవభీతిని కలిగి ఉండండి, మరియు తెలుసుకోండి! షరీయతే ఇస్లామియా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఇందులో ఉన్నటువంటి బోధనలు స్పష్టమైనవి. ఇస్లాం ధర్మం అస్పష్టతకు, రహస్యాలకు, లోపాలకు అతీతమైనది. అందుకే ఇస్లాం బోధనలను చిన్న పెద్ద ప్రతి విద్యార్థి చివరికి పల్లెటూరి వ్యక్తి కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ మనిషి బోధించే విషయాలలో ఈ లోపాలు తప్పకుండా కనబడతాయి.
ఇవి ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఐదు ప్రత్యేకతలు! ఎవరైతే వీటిని తెలుసుకుని అర్థం చేసుకుంటారో, ఇస్లాంలో ఉన్నటువంటి అల్లాహ్ వివేకాన్ని వాళ్లు గ్రహించగలుగుతారు, మరియు మన కాలంలో ఉన్నటువంటి కపట విశ్వాసులు మరియు లౌకికవాదులు యొక్క మార్గభ్రష్టత కూడా స్పష్టమవుతుంది. ఇస్లాం మరియు దాని నియమాలను విమర్శించే వారి తప్పు దోవ కూడా బహిర్గతమవుతుంది.
మరియు ఇది కూడా తెలుసుకోండి! అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించుగాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము. మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! మేము మా పైనే దౌర్జన్యం చేసుకున్నాము. నువ్వు మమ్ములను క్షమించక పోతే, కరుణించక పోతే వాస్తవంగా మేము నష్టపోయే వారిలో చెరతాము.
ఓ అల్లాహ్! మాకు నీ ప్రేమను, నీకు దగ్గర చేసే ప్రతి ఆచరణ పై ప్రేమను ప్రసాదించు. ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు,మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్