ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హక్కు: ఆయన  సహాబాలను గౌరవించడం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. మరియు ప్రతిక్షణం అల్లాహ్ యొక్క దైవభీతి మనసులో ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. మరియు అవిధేయత నుండి జాగ్రత్త వహించండి.

మరియు మీరు ఈ విషయాన్ని గ్రహించండి. అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక హక్కులలో ఒకటి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సహచరులను గౌరవించడం. మరియు వారిని అనుసరించటం, వారికి విధేయత చూపటం,  వారి హక్కులను తెలుసుకొని వాటిపై అమలు చేయడం,  వారిని విశ్వసించడం, వారి కొరకు అల్లాహ్ ను క్షమాభిక్ష కోరడం, వారి యొక్క అంతర్గత విభేదాల గురించి మౌనం వహించటం, వారి శత్రువులతో శత్రుత్వం వహించటం, మరియు సహబాలలో ఎవరి గురించి అయినా తప్పటి ఆరోపణలు చరిత్రలో లిఖించబడినా, లేదా ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, లేదా కవులు వారి గురించి తప్పుగా కవిత్వాలలో రాసిన వాటిపై అఇష్టత చూపాలి. ఎందుకంటే వారి స్థానాన్ని బట్టి వారిని గౌరవించాలి.  వారి గురించి చెడు ప్రస్తావన చేయరాదు,  వారి ఏ పనిలో తప్పులు వెతకరాదు, వారి గురించి మంచి ప్రస్తావన చేయాలి. వారి పుణ్య కార్యాల గురించి ప్రస్తావించాలి తప్ప వారి తప్పు ఒప్పుల విషయం గురించి మౌనం వహించాలి.

ఇస్లాం ధర్మ అత్యుత్తమ పండితులు ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేస్తున్నారు: అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక సూత్రాలలో  ఇది కూడా ఉంది. అది ఏమిటంటే వారి హృదయం మరియు నాలుక సహబాల పట్ల ఎంతో ఉత్తమంగా, పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయం గురించి అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:

وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ

వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” (59:10)

1. ఓ విశ్వాసులారా! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి అనుచరుల గొప్పతనం ఏమిటంటే! అల్లాహ్ ప్రపంచ మానవులందరిలో కెల్లా వారిని దైవ ప్రవక్త గారి సహచరులుగా ఎంచుకున్నాడు. ఈ ప్రాపంచిక జీవితంలో దైవ ప్రవక్తను చూసే సౌభాగ్యం, ఆయన నోటితో స్వయంగా హదీస్ వాక్యాలను వినే అవకాశం, ఆయన  ద్వారా ధర్మ ఆదేశాలను నేర్చుకునే అవకాశం, ఆయన వద్ద శిక్షణ నేర్చుకునే సౌభాగ్యం మరియు అల్లాహ్ దైవ ప్రవక్త గారిచే పంపిన సన్మార్గ ధర్మాన్ని ప్రజలకు పూర్తిగా చేర్చే అవకాశం ఇవన్నీ అల్లాహ్ వారికి ప్రసాదించాడు. అంతేకాదు  దైవ ప్రవక్తతో పాటు ధర్మ యుద్ధాలలో తోడుగా ఉండి, మరియు ఇస్లాం ధర్మ ప్రచారంలో పాల్గొన్నారు. దీని వలన వారికి అల్లాహ్ వద్ద గొప్ప స్థానం లభించింది. ఈ భూమి మీద ఎప్పటి వరకైతే ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుందో అప్పటివరకు సహబాలకు కూడా ధర్మ ప్రచారం చేసే వారితోపాటు సమాన పుణ్యం లభిస్తుంటుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మ విషయంలో ఏ వ్యక్తి అయినా ధర్మ ప్రచారం చేసినప్పుడు అతనికి ఆచరణ చేసే వ్యక్తి తో పాటు సమాన పుణ్యం లభిస్తుంది. కానీ ఆచరణ చేసే వారి పుణ్యంలో ఏ మాత్రం పుణ్యం తగ్గించబడదు.

2. ఓ ముస్లిం లారా! అల్లాహ్ దైవ ప్రవక్త గారి అనుచరులను చాలా ఉన్నతంగా ప్రశంసించాడు. మరియు తౌరాత్, ఇంజీల్ మరియు ఖురాన్ గ్రంధాలలో వారి గురించి గొప్పగా ప్రస్తావించాడు, వారి క్షమాపణ ఇంకా వారి కొరకు గొప్ప ప్రతిఫలం గురించి వాగ్దానం ఇచ్చాడు. అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్‌ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవ కృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగ పడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇన్‌జీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆపైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానం చేసి ఉన్నాడు. (అల్‌ ఫత్‌హ్‌ : 29)

ఖుర్ తుబి (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ యొక్క వివరణలో ఈ విధంగా రాశారు; అల్లాహ్ ఈ ఆయతును సహబాల గురించి ఒక ఉదాహరణగా తెలియజేశాడు. దీని అర్థం ముందు వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వారి సంఖ్య చాలా పెరుగుతుంది, దైవ ప్రవక్త దీనమైన పరిస్థితులలో ఇస్లాం ధర్మ ప్రచారం ప్రారంభించారు. అయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు క్రమంగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం ప్రారంభించారు. చివరికి ఆయన గారి ధర్మ ప్రచారం బలపడింది. ఎలాగైతే విత్తనం నాటినప్పుడు చెట్టు చిన్నదిగా బలహీనంగా ఉంటుంది, కానీ క్రమంగా చెట్టు పెరిగే కొద్దీ దాని బెరడు మరియు కొమ్మలు తయారవుతాయో అదే విధంగా దైవ ప్రవక్తగారి ధర్మ ప్రచారం కూడా బాగా బలపడింది. ఈ ఉదాహరణ చాలా సరైనది. (ఖుర్ తుబి గారి మాట ఇంతటితో ముగుస్తుంది.)

3. ఓ అల్లాహ్ దాసులారా! దైవ ప్రవక్త గారి అనుచరుల గొప్పతనం మరియు ఉన్నత స్థానాలకు ఇది కూడా ఒక సాక్ష్యం .“అల్లాహ్ వారిని ఆయన దైవభీతి పై స్థిరంగా ఉంచాడు”. దీని గురించి అల్లాహ్ ఇలా తెలియ చేస్తున్నాడు:

 وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا

ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా) వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు. (48:26)

ఈ వాక్యం లో తఖ్వా మాట (దైవభీతి ) పై స్థిరంగా ఉండేవారిగా చేశాడు. తఖ్వా అనగా లా ఇలాహ ఇల్లల్లాహ్ వాక్యం, మరియు సహబాలను తౌహీద్ వాక్యం యొక్క హక్కులను పూర్తిచేసే వారిగా చేశాడు. సహబాలు కూడా తౌహీద్ వాక్యం యొక్క హక్కులను పూర్తి చేశారు. మరియు అల్లాహ్ ఇలా కూడా తెలియజేశాడు – సహాబాలు తఖ్వా(దైవభీతి) విషయంలో ఇతరుల కంటే ఎక్కువ అర్హత కలవారు. అంటే దీని అర్థం: వారు అల్లాహ్ యొక్క భయభీతికి అర్హులు. ఎందుకంటే వారి మనసులు మంచితో నిండినవి కాబట్టి.

4. సహబాల గొప్పతనానికి ఇది కూడా ఒక రుజువు. అది ఏమిటంటే అల్లాహ్ వారి గురించి ఇలా తెలియజేశాడు: ఒకవేళ ప్రజలు సహబాల వంటి విశ్వాసం కలిగి ఉంటే వారు కూడా సన్మార్గం మీద ఉంటారు. ఈ విషయం గురించి పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు:

فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا
(ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు.) (2:137)

5. సహబాల గొప్పతనానికి ఇది కూడా ఒక రుజువుగా  చెప్పవచ్చు. అది ఏమిటంటే అల్లాహ్ వారి గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు: వారే నిజమైన విశ్వాసులు, వారి గురించి అల్లాహ్ సాక్ష్యం చాలు! ఇదే విషయాన్ని దివ్య గ్రంథంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوْا وَنَصَرُوا أُولَئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا لَهُمْ مَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ

(ఎవరు విశ్వసించి, స్వస్థలాన్ని విడిచి వలస పోయారో, అల్లాహ్ మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు (వారికి) ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో, వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపూ ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది.)

6. సహబాల గొప్పతనం యొక్క ఆధారాలలో మరొకటి: అల్లాహ్ దివ్య గ్రంథంలో రెండు చోట్ల వారి పట్ల ప్రసన్నతుడైనాడు అని తెలియచేశాడు. ఆ రెండు వాక్యాలు ఇవి, అల్లాహ్ ఇలా అంటున్నాడు:

لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا

(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు. (48:18)

రెండవ వాక్యం, అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنْصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُمْ بِإِحْسَانٍ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ذَلِكَ الْفَوْزُ الْعَظِيمُ

ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. (9:100)

7. సహబాల గొప్పతనాలలో మరొకటిది: వారు ఇస్లాం ధర్మం యొక్క గొప్ప పండితులు. ఎందుకంటే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వద్ద శిక్షణ పొందిన వారు. మరియు ఖురాన్ అవతరణ సమయంలో  ప్రవక్త గారితో ఉన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు. సహబాలలో కెల్లా అత్యంత ప్రధానమైన సహాబాలు నలుగురు ఉన్నారు. వారిని “ఖులఫాయెరాషిదీన్” అంటారు. వారి మార్గం సన్మార్గం. వారి తర్వాత వారు కూడా వారి మార్గాన్ని అనుసరించాలి. మరియు దైవ ప్రవక్త( సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు.

నేను మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ అల్లాహ్ కు భయపడండి. మరియు మీ ధర్మ నాయకుల( అమీర్) ఆజ్ఞను మీరకండి .ఒకవేళ మీ నాయకుడు వికలాంగుడైన హబ్షి సేవకుడైన సరే, మీరు అతని ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నా తరువాత బ్రతికి ఉన్నవాడు చాలా కల్లోలాన్ని చూస్తాడు .అటువంటి అప్పుడు నా మార్గం మరియు నా తర్వాత “ఖులఫాయెరాషిదీన్” మార్గాన్ని అనుసరించండి. ఎలాగంటే వారి మార్గాన్ని దవడల మధ్య గట్టిగా పట్టుకోండి.( అనగా వారి మార్గాన్ని తప్పక అనుసరించండి అని అర్థం). కొత్త పోకడల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ప్రతి కొత్త విషయం ఒక బిద్అత్ వుతుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వానికి లోనూచేస్తుంది.

8. సహబాల గొప్పతనాలలో మరొకటి; అల్లాహ్ దైవ ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని వారి సహబాలతో  సలహాలు, సూచనలు తీసుకోమని తెలియజేస్తూ, దివ్య ఖురాన్ లో ఈ విధంగా సెలవిచ్చాడు:

وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ

కార్యనిర్వాహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్ పై భారం మోపు. (3:159)`

9. సహబాల గొప్పతనాలలో మరొకటి; అది ఏమిటంటే వారి తరువాత వచ్చే విశ్వాసులకు అల్లాహ్ ఇలా తెలియజేశాడు: మీరు సహబాల కొరకు క్షమాపణ వేడుకోండి, మరియు వారి  పట్ల తమ మనసులలో ఎటువంటి కుళ్లు కుతంత్రాలను ఉంచకండి. అల్లాహ్ దైవ గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నాడు:

وَالَّذِينَ جَاءُوا مِنْ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది)వారిలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు,కనికరించేవాడవు.” 

10. సహబాల గొప్పతనాలలో ఇది కూడా ఉంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు సహబాల గురించి ఈ విధంగా తెలియజేశారు: సహబాల కాలం అందరికంటే ఉత్తమమైన కాలం.

మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా కూడా అన్నారు:

అందరిలో కెల్లా మంచి వారు నా కాలంలో ఉన్నారు, ఆ తరువాత వారికి దగ్గరగా ఉన్నవారు ,ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్నవారు.

ఇంకా (సహీ ముస్లిం) గ్రంథంలో ఇలా ఉంది: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు:

నా అనుచర సమాజంలో అందరికంటే ఉత్తమమైన వారు ఎవరంటే ఎవరి మధ్యనైతే నేను పంపబడ్డానో వారే. (బుఖారి ముస్లిం)

11. సహబాల గొప్పతనాలలో ఇంకొకటి: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: సహబాలకు లభించే పుణ్యం వారి తరువాత వారి కంటే ఎన్నో రెట్లు ఎక్కువైంది.

ఈ విషయాన్నే దైవ ప్రవక్త గారు హదీసులో ఈ విధంగా తెలియజేశారు:

నా సహబాలను తప్పు పట్టకండి,ఎందుకంటే మీలో ఎవరైనా ఉహద్ కొండకు సమానమైనంత బంగారాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టినా సరే, నా సహబాల పుణ్యంలో ముద్ (నాల్గవ వంతు) కాదు కదా సగం ముద్ కూడా కాలేదు.

ఈ హదీసులో “నిస్ఫ్“అనే పదం ఉంది. దాని అర్థం సగభాగం మరియు “ముద్” అంటే నాలుగవ వంతు అని అర్థం. ఇంకా ఈ హదీసు అర్థం: సహబాల సదఖా ఒకముద్ అయినప్పటికీ తర్వాత యుగం వారి సదఖా కంటే ఎంతో గొప్పది. తర్వాత యుగం వారు కొండంత ఖర్చుపెట్టినా సహబాలకు సరి సమానం కాలేరు అని అర్థం.

ఓ విశ్వాసులారా! సహబాల సదఖాలకు మరియు మన సదఖాలకు మధ్య ఈ విధమైన తేడా ఎందుకంటే సహబాల సదఖాలు కేవలం అల్లాహ్ కొరకై ఉంటాయి. మరియు మనసులో నిజాయితీ ఉంటుంది.

1. అల్లాహ్ సహబాలను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సాంగత్యం కొరకు ఎంచుకున్నాడు.

2. సహబాలు దైవ ప్రవక్త గారిని కనులారా చూసే మరియు ఆయనతో ఉండే అవకాశాన్ని పొందారు.

3. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహబాల పట్ల ప్రేమానురాగాలతో ఉండేవారు.

4. ప్రవక్త గారి సహబాలు మానవులందరిలోకెల్లా మంచివారు మరియు గొప్పవారు.

5. వారి గొప్పతనం గురించి తౌరాత్,ఇంజీల్ మరియు ఖురాన్  గ్రంధాలలో తెలుపబడింది. మరియు ఆ గ్రంథాలలో వారిని పొగడటం జరిగింది.

6. సహాబాలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడంలో ముందడుగు వేశారు.

7. సహబాలు అల్లాహ్, ఇస్లాం ధర్మం, మరియు దైవ ప్రవక్త గారి కొరకు ధన, ప్రాణ మరియు ఆలు బిడ్డల త్యాగానిచ్చారు. దైవ ప్రవక్త గారికి ధైర్యాన్ని మరియు వారికి రవ్వంత కష్టాన్ని కూడా రానివ్వలేదు. ఇస్లాం ధర్మ స్థాపనలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వాటిని  కేవలం అల్లాహ్ కొరకే భరించారు.

8. సహబాలలో ప్రశంస నియమైన గొప్పతనాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ గొప్పతనాలన్నీ వారికి దైవ ప్రవక్త గారి శిక్షణకు ప్రతిఫలంగా లభించాయి.

9. వారు ఖురాన్ మరియు హదీసులను తమ హృదయాలలో భద్రపరిచి ప్రపంచ మానవులందరికీ చేరవేశారు. మరియు దీనివలన ప్రళయం వరకు ఇస్లాం ధర్మం వ్యాపిస్తూ ఉంటుంది.

10. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తర్వాత ఎక్కువ ధర్మ జ్ఞానం వారి సహచరులకే ఉంది. వారంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని  వ్యతిరేకించే వారే ఉండరు. ఈ గొప్పతనాల వలన సహబాలకు వారి ముందు వారి కంటే మరియు వారి తరువాత వారి కంటే అత్యున్నత స్థానం లభించింది. ఈ గొప్పతనాల గురించి తెలుసుకున్న వ్యక్తి ఇస్లాం ధర్మంలో సహబాల గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటాడు. మరియు తన మనసులో సహబాలపట్ల ప్రేమానురాగాల కొరకు ద్వారాలు తెరుస్తాడు

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి, మరియు మీ మనసులలో అల్లాహ్ భయాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచండి, సహబాలు  ఔన్నత్యంలో ఒకరి పై ఒకరు భిన్నంగా  ఉన్నారు.

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారి విశ్వాసం ఏమిటంటే దైవ ప్రవక్త గారి తర్వాత ఆయన అనుచర సమాజంలో అందరి కంటే గొప్పవారు హజ్రత్ అబూబకర్ సిద్దీక్ గారు.ఆయన తరువాత ఉమర్ ఆయన తర్వాత ఉస్మాన్ ఆయన తర్వాత అలీ గారు (రజియల్లాహు  అన్ హుమ్) వారి తర్వాత ముహాజీర్లు (ఎందుకంటే ముహాజీర్లు అన్సార్ల కంటే ఇస్లాం స్వీకరణలో ముందున్నారు). వారి తర్వాత అన్సార్లు. (వీరు ఇస్లాం స్వీకరించి, దైవ ప్రవక్త గారికి సహకారం అందించారు,మరియు ఆయన గారికి అన్ని విధాల తోడ్పాటునిచ్చారు.)

మక్కా విజయానికి ముందు దైవ మార్గంలో ఖర్చు చేసి యుద్ధం చేసేవారికి మక్కా విజయం  తరువాత ఖర్చు చేసి యుద్ధం చేసే వారిపై ఆధిక్యతను ఇచ్చారు.

బదర్ యుద్ధం లో సుమారు 313 సహబాలు పాల్గొన్నారు. వారి గురించి అల్లాహ్ ఇలా అన్నాడు: “ఇక మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. నేను మిమ్మల్ని క్షమించాను”. (బుఖారి ముస్లిం)

అదేవిధంగా హుదేబియా సమయంలో  బైతె రిజ్వాన్ అనే చెట్టు కింద ప్రమాణం చేసిన వారిలో ఎవరూ నరకంలో ప్రవేశించరు. మరియు వారి సంఖ్య  1400 కంటే ఎక్కువగా ఉంది. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి గురించి అయితే స్వర్గం యొక్క సాక్ష్యం ఇచ్చారో వారందరి గురించి సాక్ష్యం ఇవ్వడం. ఉదాహరణకు: ఏ విధంగానైతే అష్ రయే ముబష్షిర మరియు ఇతర సహాబాలు.

ఓ విశ్వాసులారా! సారాంశం ఏమిటంటే మనపై సహబాల నాలుగు హక్కులున్నాయి అవి:

  1. మొదటి హక్కు – వారిని ప్రేమించాలి, వారి పట్ల ఇష్టులవ్వాలి.
  2. రెండవ హక్కు- వారిపై విశ్వాసం కలిగి ఉండాలి. వారు దైవ ప్రవక్త గారి తరువాత ఉన్నతమైన వారు అని విశ్వసించాలి.
  3. మూడవ హక్కు – వారి మధ్య ఉన్న బేధాబిప్రాయాల గురించి మౌనం వహించాలి.
  4. నాల్గవ హక్కు – సహబాల గురించి మార్గ బ్రష్టులు తప్పుగా మాట్లాడినప్పుడు వారికి ధీటుగా సమాధానం ఇవ్వాలి. మరియు ఇతర వర్గాల వారి నుండి వచ్చేటటువంటి తప్పుడు అభిప్రాయాలకు కూడా సమాధానం ఇవ్వాలి‌. ఉదాహరణకు రాఫిజీలు 

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. మరియు అశ్లీలం, దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు. కనుక మనం ఎల్ల వేళలా ఆయనను స్మరిస్తూ ఉండాలి. ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం  చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ