ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
1) లాభనష్టాల అధికారం కలవాడు ఎవరు?
2) సఫర్ మాసం వగైరా లలో దుశ్శకునం పాటించడం.
3) నక్షత్రాల ద్వారా (గ్రహాల ద్వారా) అదృష్టాన్ని తెలుసుకోవడం.
4) మాంత్రికుల వద్దకు వెళ్ళడం.
5) విచారణ లేకుండానే స్వర్గంలోకి ప్రవేశించే వారి గుణగణాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కు వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7: 188)
ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)
ఈ ఆయత్లో అల్లాహ్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు: దైవేతరులెవరి దగ్గరైనా లాభనష్టాల అధికారం గనక వుంటే అల్లాహ్ నష్టం కలిగించదలచిన వాడిని, తను, ఆ నష్టం కలగకుండా కాపాడమనండి మరియు అల్లాహ్ ప్రయోజనం చేకూర్చదలచిన వాడికి ఆ ప్రయోజనం కలగకుండా ఆపమనండి. అంటే – వారలా చేయలేరు. మరి వారలా చేయలేరంటే దాని అర్థం వారికి లాభనష్టాల అధికారం లేదు అని. అలాగే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
“అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరచినా, దానిని అడ్డుకొనే వాడెవ్వడూలేదు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.” (ఫాతిర్ 35: 2)
అందుకే, అల్లాహ్- తనను తప్ప ఇతరులను వేడుకోవడం నుండి వారించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా, ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ : 106 -107)
ఈ ఆయతులలో అల్లాహ్ దైవేతరులెవరికీ లాభనష్టాల అధికారం లేదు, వారిని వేడుకోవడాన్ని వారిస్తూ, ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! ఒకవేళ నీవు గనక ఇలా చేస్తే (అల్లాహ్ శరణు) నీవు కూడా దుర్మార్గులలో కలసి పోతావు – అని సెలవియ్యడంతోపాటు, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆయన నష్టం కలిగించదలిస్తే దాన్ని ఆపగలిగే వాడెవడూ లేడు మరియు ఒకవేళ తన కృపతో ఆయన దేన్నయినా ప్రసాదిస్తే ఆయన అనుగ్రహాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరు అని సెలవిచ్చాడు.
దీనితో – రుజువయ్యిందేమిటంటే- ఈ అధికారాలు కేవలం అల్లాహ్ కే వున్నాయి.
కాస్త ఆలోచించండి!
మరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ తప్ప మరెవ్వరూ నష్టం కలిగించలేనప్పుడు, సాధారణ ముస్లిములకు అల్లాహ్ తప్ప మరెవరు నష్టం కలిగించగలరు? అందుకే, దైవేతరులెవరైనా సరే, వారితో లాభనష్టాలను ఆశించకూడదు. ఎందుకంటే – దైవేతరుల గురించి తన సంకల్పంతో, అధికారంతో ఎవరికైనా తను కోరుకున్న నష్టం కలిగించగలడు – అని భావించడం పెద్ద షిర్క్ (షిర్కె అక్బర్).
అందుకే ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఇలా సెలవిచ్చి వున్నారు:
وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا
“(అల్లాహ్ కు వ్యతిరేకంగా) మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానినీ ఆవరించి వున్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి? వాటి విషయంలో అల్లాహ్ మీ పై ఏ ప్రమాణాన్నీ అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయన తోపాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు.” (అన్ఆమ్ 6 : 80-81)
ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – పీర్లు, ఫకీర్లు, బుజుర్గ్ లలో ఎవరిని గురించి కూడా (వారేదో చేసేస్తారని) భయాందోళనలకు గురి కాకూడదు. అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏ మాత్రం నష్టం కలిగించలేరు. ఇలాంటి భయాందోళనలు కేవలం అల్లాహ్ పట్ల కలిగి వుండాలి. కారణం తన సంకల్పానికి అనుగుణంగా ఎవరికైనా నష్టం కలిగించే శక్తి సామర్ధ్యాలు కేవలం ఆయనకే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అల్లాహ్ సంకల్పించకుంటే ప్రపంచంలోని ఏ వలీ, బుజుర్గ్, పీర్ లేదా సజ్జాదా నషీన్ అయినా ఏ మాత్రం నష్టం కలిగించలేడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُل لَّن يُصِيبَنَا إِلَّا مَا كَتَبَ اللَّهُ لَنَا هُوَ مَوْلَانَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
“వారితో ఇలా అను: అల్లాహ్ మాకొరకు వ్రాసి వుంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ, మంచిగానీ) ఏ మాత్రం కలుగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.” (తౌబా 9 : 51)
అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“యావత్ మానవజాతి ఏకమై నీకేదైనా ప్రయోజనం చేకూర్చాలన్నా- ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టి వున్నంత వరకే ప్రయోజనం చేకూర్చ గలదు. అలాగే, యావత్తు మానవజాతి ఏకమై నీకేదైనా కీడు కలిగించాలనుకొన్నా అది కూడా, ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టినంతవరకే కీడు తలపెట్టగలదు అని దృఢంగా విశ్వసించు.” (తిర్మిజీ : 2516, సహీహుల్ జామి : 7957)
ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల గురించి వుండాల్సిన మూల విశ్వాసం గురించి మేమెందుకు వివరించామంటే ఈ మాసం సఫర్ మాసం. దీనిని ఎంతో మంది అపశకునపు మాసంగా మరియు ఈ నెలలో ఏదైనా కొత్త కార్యాన్ని ఆరంభించడం మంచిది కాదని భావిస్తారు. ఎందుకంటే వారి విశ్వాసమేమిటంటే ఈ నెలలో ఆరంభించబడ్డ కార్యాల్లో శుభాలు వుండవు. తద్వారా చివరికి అవి సంపూర్ణం కూడా కావు. అంటే వారు- ‘ఈ మాసంలో కేవలం నష్టాలే వాటిల్లుతాయి’ అని భయపడుతుంటారు.
కానీ, ఖుర్ఆన్, హదీసుల వెలుగులో మేం చర్చించిన విశ్వాసంతో పోలిస్తే – ఒక నెలను ప్రత్యేకంగా అపశకునంగా భావించి దానిలో కొత్త కార్య మేదైనా ప్రారంభించడానికి భయపడడం అనేది పూర్తిగా విరుద్ధంగా వుంది. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఏ వ్యాధి అయినా అంటువ్యాధి కాజాలదు. అపశకునం పాటించడం కూడా మంచిది కాదు. మరియు ఏదైనా పక్షిని దుశ్శకునంగా భావించడం అనేది తగదు. అలాగే సఫర్ మాసాన్ని అపశకునంగా తీసుకోవడం కూడా సరికాదు.” (బుఖారీ:5717, ముస్లిం: 2220)
అందుకే, ముస్లిములు ఇలాంటి అజ్ఞానపు విశ్వాసాలను కలిగి వుండ కూడదు. దీనికి విరుద్ధంగా, లాభనష్టాలను చేకూర్చడం అనేది అల్లాహ్ చేతుల్లోనే వుందని, ఆయనపైనే పూర్తిగా నమ్మకం కలిగి వుండాలి. లాభనష్టాలు ఏ మాసంతో కూడా ఏ విధమైన సంబంధం కలిగి లేవు.
అపశకునం అంటే ఏమిటి?
అపశకునం అంటే – ఒక వ్యక్తి ఏదైనా కార్యాన్ని నిర్దిష్టంగా చేయడానికి సంకల్పించుకొని, కేవలం ఏదో ఒక దానిని చూసిన లేక ఏదైనా మాట విన్న కారణంగా ఆ కార్యాన్ని చేయడం మానుకోవడం. అజ్ఞానకాలంలో ఎవరైనా ప్రయాణ నిమిత్తం తన ఇంటి నుండి బయలుదేరడానికి సంకల్పించుకున్నప్పుడు ఒక పక్షిని ఎగురవేసి చూసేవారు. ఒకవేళ అది కుడివైపునకు ఎగిరితే తన ప్రయాణాన్ని కానిచ్చేవారు. ఒకవేళ అది ఎడమవైపునకు ఎగిరితే దానిని అపశకునంగా భావించి తన ప్రయాణాన్ని విరమించుకునేవారు.
షరీయత్తు ఇలాంటి దుశ్శకునాలను వారించింది. అంతేకాదు, దుశ్శకునాలు పాటించడాన్ని, జ్యోతిష్యం తెలుసుకోవడాన్ని ‘షిర్క్’ అని నిర్ధారించింది. ఎందుకంటే ఇలా చేసే వ్యక్తి అల్లాహ్ పై నమ్మకం వుంచకుండా ఏ మాత్రం నిజం లేని విషయాలపై నమ్మకం కలిగి వుంటాడు.
అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“దుశ్శకునం కారణంగా ఎవరైనా ఏదైనా కార్యాన్ని త్యజిస్తే నిశ్చయంగా అతను షిర్స్కు పాల్పడినట్లే.”
(సహీ ఉల్ జామె లిల్ అల్బానీ : 6264)
కొంతమంది, ఏదో ఒక వ్యక్తిని అపశకునంగా భావిస్తారు. ఉదాహరణకు ఉదయం తన వ్యాపార నిమిత్తం బయలుదేరే సమయంలో ఎవరైనా బీదవాడు లేక బిచ్చగాడు ఎదురొస్తే ఇలా అంటారు: వీడు ప్రొద్దున్నే ఎదురయ్యాడు, ఇక ఈ రోజు మూడినట్లే! లేక – ఇంట్లో ఏదైనా నష్టం వాటిల్లితే ఇలా అంటారు: ఇదంతా ఈ అపశకున స్త్రీ మూలంగానే జరిగింది లేదా తన సంతానం లోనే ఎవర్నో అపశకునంగా భావించి వీటంతటికి కారణం ఇతనే అని అంటారు.
కానీ ఇలా ఒక వ్యక్తిని దుశ్శకునంగా భావించడం సరైనది కాదు. దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ గడిచిన అనుచర సమాజాల వృత్తాంతాలను వివరిస్తూ ‘వారు తమ ప్రవక్తలను అపశకునంగా భావించి తమకు జరిగే నష్టాలకు అతనే కారకుడు అనేవారు’ అన్న విషయాన్ని తెలియజేశాడు. ఉదాహరణకు మూసా (అలైహిస్సలాం) జాతి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَإِذَا جَاءَتْهُمُ الْحَسَنَةُ قَالُوا لَنَا هَٰذِهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَىٰ وَمَن مَّعَهُ ۗ أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
(వారి గుణం ఎటువంటిదంటే) మేలు కలిగినపుడు ‘ఇది మాకు తగినదే’ అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని, “మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రం”గా చెప్పుకునేవారు. వినండి! వారి దరిద్రం అల్లాహ్ వద్ద ఉంది. కాని వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు. (ఆరాఫ్ : 131)
అలాగే, ఇతర అనుచర సమాజాల గురించి తెలుపుతూ వారు కూడా తమ ప్రవక్తలను, వారితోపాటు విశ్వసించిన వారని అపశకునంగా భావించి దుశ్శకునం పాటించేవారు అన్న విషయం తెలియజేశాడు. చెప్పొచ్చేదేమిటంటే – తనకు వాటిల్లే నష్టానికి ఎవరినైనా అపశకునంగా భావించి దుశ్శకునం పాటించడం ఏ విశ్వాసికి తగదు. పైగా, నష్టం వాటిల్లడానికి ముందే “అల్లాహ్ ఆజ్ఞకు విరుద్ధంగా ఏ నష్టమూ వాటిల్లదు” అన్న విషయాన్ని దృఢంగా విశ్వసించాలి. అంతేగాక, నష్టం వాటిల్లిన తర్వాత కూడా అతను ఇలా పలకాలి- ఇదంతా అల్లాహ్ తరఫు నుండి వ్రాసిపెట్టి వుంది. కనుక సంభవించి వుండాల్సిందే.
కొంతమంది నక్షత్రాల ద్వారా జ్యోతిష్యాన్ని తెలుసుకుని తద్వారా శకునాలను పాటిస్తారు.
ఉదాహరణకు – ఒక వ్యక్తినుద్దేశించి నీది ఫలానా నక్షత్రం మరియు ప్రస్తుతం దాని కదలిక (గ్రహచారం) అంత బాగాలేదు. అందుకే ప్రస్తుతం నీవు ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టాన్ని చవి చూస్తావు లేక ఒకవేళ ఇప్పుడు నీవు వివాహం చేసుకుంటే దానిలో శుభమేమీ వుండదు అని అనడం.
వాస్తవానికి ఒకరి అదృష్టం, అతని భవిష్యత్తు విషయాలకూ మరియు నక్షత్రాలకూ ఎలాంటి సంబంధమూ లేదు. అందుకే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“అజ్ఞాన కాలం నాటి కార్యాలలో నాలుగింటిని నా అనుచర సమాజం త్యజించడానికి సిద్ధపడదు. జాతి, తెగల ఆధారంగా గర్వపడడం, వంశాన్ని కించపరచడం, నక్షత్రాల ద్వారా అదృష్టానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం (లేదా నక్షత్రాల ద్వారా వర్షాన్ని అర్థించడం) మరియు (మరణ సందర్భాలలో) ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం”. (ముస్లిం : 934)
ఈ హదీసులో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నక్షత్రాల ద్వారా అదృష్టాన్ని పరికించడాన్ని అజ్ఞానపు చేష్టగా అభివర్ణించారు. అంటే -ఇస్లాంతో దానికేమాత్రం సంబంధం లేదన్నమాట. అందుకే ముస్లిములు దీని నుండి దూరంగా వుండాలి.
అలాగే, జైద్ బిన్ ఖాలిద్ అల్ జహమీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు హుదైబియాలో రాత్రి కురిసిన వర్షం అనంతరం ప్రాతఃకాలపు నమాజ్ (ఫజ్ నమాజ్) చేయించారు. తదుపరి ఇలా సెలవిచ్చారు: “నేడు మీ ప్రభువు ఏమని సెలవిచ్చాడో మీకు తెలుసా?” దీనిపై సహచరులు – అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ బాగా తెలుసు అని విన్నవించుకున్నారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరిస్తూ ఇలా అన్నారు:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘నేడు నా దాసులలో కొందరు విశ్వాస స్థితిలో లేవగా మరికొందరు అవిశ్వాస స్థితిలో లేచారు.’ ఎవరైతే – అల్లాహ్ అనుగ్రహం, కారుణ్యం వల్ల వర్షం కురిసింది అని పలికారో, వారు నన్ను విశ్వసించి, నక్షత్రాల (ప్రభావాన్ని)ను తిరస్కరించారు. ఇక ఎవరైతే – ఫలానా నక్షత్ర ప్రభావం మూలంగా వర్షం కురిసింది అని పలికారో, వారు నన్ను తిరస్కరించి నక్షత్రాలను విశ్వసించారు“. (బుఖారి : 846, ముస్లిం : 71)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే ఏ వ్యక్తి అయినా వాతావరణ పరిస్థితులలో నక్షత్రాల ప్రభావం వుంటుందని భావిస్తే అతను అల్లాహ్ ను తిరస్కరించేవాడు. అలాగే, ఒక వ్యక్తి అదృష్టంలో నక్షత్రాల ప్రభావం వుంటుందని భావించేవాడు కూడా అల్లాహ్ ను తిరస్కరించేవాడు.
మాంత్రికులను, జ్యోతిష్యులను గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా క్షుణ్ణంగా వివరిస్తూ చెప్పిందేమిటంటే “ఇస్లామ్, ముస్లిములతో వారికే మాత్రం సంబంధంలేదు. అలాగే – వారి దగ్గరికెళ్ళి, తమ సమస్యలను వారి ముందుంచి, నక్షత్రాలు వగైరాల ద్వారా వాటి పరిష్కారాన్ని పొందగోరే వారు కూడా (అంటే వీరికి కూడా ఇస్లామ్ , ముస్లిములతో ఏ మాత్రం సంబంధం లేదు).”
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కథనం: “అపశకునం పాటించేవాడు, ఎవరికోసమైతే అపశకునం పాటించబడిందో, (తాంత్రిక విద్య ద్వారా) జ్యోతిష్యం చెప్పేవాడు, ఎవరికోసమైతే జ్యోతిష్యం చెప్పబడిందో, చేతబడి చేసేవాడు, ఎవరికోసమైతే చేతబడి చెయ్యబడిందో… అలాంటి వారు మాలోని వారు కారు.” (అస్సహీహ : 2195)
అందుకే, వారి వద్దకు పోవడం, వారి నుండి అదృష్టానికి సంబంధించిన విషయాలను గురించి ప్రశ్నించడం, అనేది పూర్తిగా నిషేధం మరియు పెద్ద షిర్క్. అలాగే, నక్షత్రాల ద్వారా, అరచేతి గీతల ద్వారా అదృష్టాన్ని తెలుసుకోవడం కూడా నిషేధం మరియు షిర్క్. ఇలాంటి వారి వద్దకు వెళ్లి వారిని ప్రశ్నించటం ఎంత పెద్ద నేరమంటే -ఇలా చేసే వారి నలభై రోజుల నమాజ్ అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కథనం:
“ఎవరైనా ఏ జ్యోతిష్యుని, మాంత్రికుని వద్దకెళ్ళి అతణ్ణి దేని గురించైనా ప్రశ్నిస్తే, అతని 40 రోజుల రాత్రి నమాజ్ స్వీకరించబడదు”. (ముస్లిం : 223, సహీ ఉల్ జామె లిల్ అల్బానీ : 5940)
అలాగే, వారి వద్ద కెళ్ళి వారిని ప్రశ్నించేవాడు. వారు సెలవిచ్చిన దాన్ని (సత్యమని) నిర్ధారించేవాడు ఎలాంటి వాడంటే అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అవతరించిన షరీయత్తును తిరస్కరించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కథనం:
“ఎవరైనా ఏ జ్యోతిష్యుని (భవిష్యత్ జ్ఞానం కలవాడని చెప్పుకునేవాడు) వద్దకెళ్ళి, అతని మాటలను నిర్ధారిస్తే, అతను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అవతరించిన అల్లాహ్ ధర్మాన్ని తిరస్కరించాడు”. (సహీ ఉల్ జామె లిల్ అల్బానీ : 5939)
అందుకే – ఇలాంటి వారి వద్దకెళ్ళి మన ధర్మంతో బేరమాడకూడదు. ధర్మాన్ని పరిరక్షించుకునే నిమిత్తం ఇలాంటి వారి వద్దకు వెళ్ళకుండా వుండడం మరియు వారినేమీ ప్రశ్నించకుండా వుండడం ఎంతో ముఖ్యం. పైగా – అన్ని విషయాల్లో అల్లాహ్ పై సంపూర్ణంగా నమ్మకం కలిగి వుండాలి మరియు లాభనష్టాల అధికారి కేవలం అల్లాహ్ యే అని విశ్వసించాలి. ఇస్లామీయ విశ్వాసాలకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఇది. కానీ, (దురదృష్టవశాత్తూ) నేడు చాలామంది ముస్లిములు దీన్నుండి వైదొలిగారు.
అల్లాహ్ అందరికీ సన్మార్గాన్ని ప్రసాదించుగాక మరియు మనల్ని మన విశ్వాస ఆచరణలలో ఒకర్నొకరు సరిదిద్దుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక! (ఆమీన్)
రెండవ ఖుత్బా
ప్రియ సోదరులారా!
అల్లాహ్ పైనే సంపూర్ణంగా నమ్మకం వుంచడం మరియు కేవలం అతణ్ణి లాభనష్టాల స్వామి అని భావించడం- ఇది ఎంత పెద్ద ఆచరణ అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కర్మల విచారణ లేకుండానే స్వర్గంలో ప్రవేశించే వ్యక్తుల్లో – మంత్రించి ఊదించుకోవడానికి ఇతరుల వద్దకు వెళ్ళకుండా, తనే స్వయంగా దివ్య ఖుర్ఆన్ ఆయతులతో, సున్నత్ ప్రస్తావించబడ్డ దుఆలను పఠించి తనపై ఊదుకునేవాడు, అపశకునం పాటించనివాడు మరియు కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి వుండేవాడు లను కూడా చేర్చారు.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
నాకు గత సమాజాలను చూపించడం జరిగింది. తద్వారా, నేను చూసిందేమింటంటే – “ఒక ప్రవక్తను చూడగా ఆయనతో కేవలం కొంతమంది (10 కన్నా తక్కువ) వున్నారు. మరో ప్రవక్తతో కేవలం ఒక్కరే వున్నారు. ఇంకో ప్రవక్తతో ఒక్కరు కూడా లేరు. తదుపరి, అకస్మాత్తుగా నాకో పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని నేను భావించాను. కానీ ఇది మూసా (అలైహిస్సలాం) మరియు ఆయన అనుచర సమాజం అని నాతో చెప్పబడింది. తదుపరి, నాతో- ఇటువైపు చూడండి అని చెప్పబడింది. నేను చూడగా ఒక పెద్ద జన సమూహం కనబడింది. తదుపరి నాకు మళ్ళీ మరోవైపు చూడమని చెప్పబడింది. నేను అటువైపు చూడగా మరో పెద్ద జన సమూహం కనబడింది. తదుపరి నాతో ఇలా చెప్పబడింది: ఇది మీ అనుచర సమాజం. వీరిలో 70 వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు”. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లేచి నిలబడి తన గృహంలోకి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత ప్రజలు (సహచరులు) ఆ 70 వేల మంది ఎవరై వుంటారబ్బా అన్న విషయంపై తర్జన భర్జన చేసుకోసాగారు. దీనిపై కొందరు బహుశా వారు ఇస్లామ్ స్థితిలోనే జన్మించిన వారు, తద్వారా ఎప్పుడూ షిర్క్ కు పాల్పడని వారు కావచ్చు అని అనగా, మరి కొందరు మరో అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈలోగా అకస్మాత్తుగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటకు విచ్చేశారు. రాగానే వారితో ‘మీరు ఏ విషయం గురించి చర్చిస్తున్నారు’ అని అడిగారు. సహచరులు జవాబిస్తూ మేము, కర్మల విచారణ లేకుండానే స్వర్గంలో ప్రవేశించే 70 వేల మంది ఎవరై వుంటారా? అన్న విషయం గురించి చర్చిస్తున్నాం అని విన్నవించుకున్నారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరిస్తూ – “వీరు ఎవరంటే వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు మరియు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు మరియు కేవలం తమ ప్రభువు (అల్లాహ్) పైనే నమ్మకం కలిగి వుంటారు” అని అన్నారు.
ఇది విని అక్కాషా బిన్ మహసన్ (రదియల్లాహు అన్హు) నిలబడి ఓ దైవప్రవక్తా! నన్ను కూడా ఆ (70 వేల) సమూహంలో చేర్చమని అల్లాహ్ ను ప్రార్థించండి అని విన్నవించుకున్నారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ- నీవు వారిలోనే వుంటావు అని అన్నారు. ఇంతలో మరో వ్యక్తి లేచి నిలబడి ఇలా పలికాడు: “అల్లాహ్ నన్ను కూడా చేర్చమని నా కోసం ప్రార్థించండి”. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- అక్కాషా నీ కన్నా ముందుకెళ్ళిపోయాడు అని పలికారు. (బుఖారి : 3410, 5705, 5752, ముస్లిం : 220)
ముస్లిం లో వివరించబడ్డ ఇమ్రాన్ బిన్ హుస్సేన్ (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ 70 వేల మంది గుణగణాలను ఇలా వివరించారు: “వారు మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు మరియు కేవలం తమ ప్రభువు (అల్లాహ్) పైనే నమ్మకం కలిగి వుంటారు”. (ముస్లిం : 218)
మరి మనక్కూడా అల్లాహ్ ఈ 70 వేల మందిలో చేర్చాలంటే హదీసులో సెలవిచ్చినట్లు మనం కూడా ఈ మహోూత్తర గుణాలను అలవర్చుకోవలసి వుంటుంది. అల్లాహ్ మనక్కూడా ఈ సద్బుద్ధిని ప్రసాదించుగాక! నేటి ఖుత్బాను మేము ఈ దుఆతో ముగిస్తున్నాం.”అల్లాహ్ మనందరినీ రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక! (ఆమీన్)
—
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం [పుస్తకం]
ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్, కొత్తగూడెం.
ముద్రణ: అల్ ఇదారతుల్ ఇస్తామియ, కొత్తగూడెం.